శ్రీ శ్రీ మహా ప్రస్థానం: కథనం,కదనం

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్
(ఢెట్రాయిట్ లో జరిగిన సభలో ఈ ఉపన్యాసం వీడియో ప్రదర్శించారు. శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా ఈ వ్యాసం. – పుస్తకం.నెట్ )
********************************************

శబ్దార్థాలు

ప్రతి పదానికి అర్థం ఉంది.కానీ,ప్రాథమిక స్థాయిలో ప్రతి పదమూ ఒక శబ్దమే. కొత్తగా కవిత్వం రాస్తున్న వారు శబ్దం మీద మోజుతో దడెం హెచ్చుతగ్గుగా పదప్రయోగం చేస్తారు.అర్థగౌరవం వారికి ఆమడ దూరం.

కవిత్వం ప్రధానంగా అర్థ ప్రధానం.
సంగీతం ప్రధానంగా నాద ప్రధానం.

శబ్దం మీది మోజుతో కవి అర్థాన్ని వదిలితే కవిత్వంలో మిగిలేది నాదమే, అర్థం కాదు.కేవలం అర్థాన్ని ఆశ్రయిస్తే కవిత్వం నాదహీనమై పోతుంది.

పరభాషా పదాలు మనకు అర్థం కావు, కనుక, మన చెవులకు కేవలం శబ్దాలుగా వినిపిస్తాయి. పదార్థాలు తెలుసుకునే కొద్దీ పదం కేవలం శబ్దంగా వినిపించడం మాని అర్థమవడం మొదలవుతుంది.ప్రతి పదార్థం తెలియనిది పద్య తాత్పర్యం బోధపడదు.కావునే పదార్థం కోసం ప్రతి భాషలో ఎన్నో నిఘంటువులు వెలసి ఉన్నాయి.కవిత్వం ప్రధానంగా అర్థకళ[1].అందునా, అల్పాక్షరముల అనంతార్థ రచన[2]. లోతుకు పోయే కొద్దీ ఎన్నో అర్థాలు స్ఫురించాలి.అప్పుడే దానికి సార్థకత. దానికి భిన్నంగా ,ప్రాస కోసమో ,ప్రాథమిక స్థాయిలో పదానికున్న శబ్దం మీద మోజుతోనో కవి రచిస్తే అందులో సార్థకత కన్న శాబ్దికత పెరుగుతుంది.శ్రీ శ్రీ తొలినాళ్ళలో రాసిన ప్రభవ గీతాలను, ఈ కారణంగానే కొంపెల్ల జనార్ధన రావు ” వీటిలో సార్థకత కన్నా సమాస తత్పరత గోచరిస్తున్నది[3]” అని విమర్శించి ఉన్నాడు.

ప్రాథమిక స్థాయిలో కవులు,పాఠకులు శబ్దానికి పట్టం కట్టడం, తర్వాత కొంచెం అనుభవమ్మీద అర్థంవైపు మొగ్గడం పరిపాటి.

భావ కవిత్వం / ప్రభావ కవిత్వం

శ్రీ శ్రీ కి శబ్దం మీద ఉన్న మోజు అంతా ఇంతా కాదు.శ్రీ శ్రీ కవిత్వంలో శబ్ద ప్రస్తారాలు ,సంయోగాలు ఎక్కడ బడితే అక్కడ విరివిగా దర్శనమిస్తాయి.

శ్రీ శ్రీ కవిత్వంలో ప్రధానంగా రెండు దశలున్నాయి: ఒకటి భావ కవిత్వం ,రెండు ప్రభావ కవిత్వం.

తొలినాళ్లలో ( 1927-33) విశ్వనాథ,కృష్ణ శాస్త్రి ,కవికొండల తదితర భావకవుల ప్రభావంలో రాసినది. రెండవ దశలో శ్రీ శ్రీ పరిధి పెరిగింది. గ్రాంథిక భాష ,పద్య ఛందస్సులు వదిలి సొంతగొంతు వెదుక్కుంటున్న రోజులవి.గురజాడ అడుగుజాడలో నడిచి వాడుక భాష, మాత్రాబద్ద ఛందస్సులను స్వీకరించాడు.అది చాలలేదు.ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కవిత్వాలను ,ముఖ్యంగా ఆంగ్లో అమెరికన్ కవిత్వాలను చదివి ఆకళించు కున్నాడు.శ్రీ శ్రీ మీద ప్రభావం వేసిన వారు నలుగురు. స్విన్‌బర్న్,W.W.గిబ్సన్, మేస్‌ఫీల్డ్[4], ఎడ్గార్ ఎలాన్ పో ; వెరసి ఫ్రెంచి కవి బోదిలేరు;(అధివాస్తవికుల ప్రవేశం తర్వాతి దశ.). వీరి ప్రభావంతో రాసినదే ప్రభావ కవిత్వం .

శ్రీ శ్రీ -స్విన్‌బర్న్

ఈ ఏడాది ఏప్రిల్ పదిన స్విన్‌బర్న్ శతవర్ధంతి.పెద్దగా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తద్భిన్నంగా శ్రీ శ్రీ శతజయంతిని అందరూ తలచుకొంటున్నారు.ప్రశంసల జల్లులు ,విమర్శల వడగళ్ళ వాన మొదలైనాయి.చివరికి శ్రీ శ్రీ వ్యక్తిగతజీవితాన్ని కూడా చర్చల్లోకి లాగి తిలా పాపం తలా పిడికెడు పంచుకుంటున్నారు.నూరేళ్ళలో ఎన్ని మార్పులు. వీరిద్దరి జీవితాలను కవిత్వాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. ఇద్దరూ దాదాపు సమానకాలం జీవించారు.ఇద్దరికీ మతంలో విశ్వాసంలేదు.ఐతే,ఇక్కడ తేడా అల్లా స్విన్‌బర్న్ క్రైస్తవాన్ని విడనాడి గ్రీకులమతాన్ని (pagan) సమాదరించాడు. బహుదేవతారాధకులైన గ్రీకులకు భారతీయులకు మతపరమైన దగ్గరి చుట్టరికమే ఉంది.

స్విన్‌బర్న్ తన కవిత్వంలో క్రైస్తవాన్ని నిరసించాడు.క్రైస్తవం మూలంగా భావనాప్రపంచం వర్ణవిహీనంగా మారిపోయిందని అతని విశ్వాసం.శ్రీ శ్రీ భారతీయ సంప్రదాయానికి లోబడి రాసినా,తర్వత్తర్వాత మార్క్సు మతాన్ని పుచ్చుకున్నాడు.క్రైస్తవంలాగే అక్కడ మూలవిరాట్ ఒక్కడే. ఆ రకంగా భావనాపరిధి కుంచించుకుపోయింది.ఈ కారణంగానే మహాప్రస్థానం తర్వాత శ్రీ శ్రీకి కవిగా గొంతు పెగల్లేదు.స్విన్‌బర్న్ శ్రీ శ్రీ లాగే ఆధునికుల్లో వైతాళికుడు.శ్రీ శ్రీ స్విన్‌బర్న్ లాగే చిట్టచివరి భావ/ప్రబంధ కవి.

తొలిరోజుల నుండి స్విన్‌బర్న్ కవిత్వమ్మీద అసలుసిసలైన విమర్శ అనేకం వెలువడింది [5]. శ్రీ శ్రీ ఈ విషయంలో అంత అదృష్టానికి నోచుకోలేదు.మహాప్రస్థానాన్ని నిరపేక్షదృష్టితో ఎవరూ విమర్శించలేదు.సాహిత్యంలో శ్రీ శ్రీకి తగుస్థానాన్ని నిర్ధారించలేదు. శ్రీ శ్రీ తన్ను గూర్చి తాను చెప్పుకున్న మాటలనే వల్లిస్తూ దాన్నే విమర్శగా చెలామణీ చేస్తున్నారు.కొందరు ఆకాశానికెత్తితే,మరికొందరు పాతాళానికి దించేవాళ్ళు.ఇదీ వరుస. కాబట్టి,శ్రీ శ్రీ కవిత్వంలోనీ గుణదోషవిచారణ సమగ్రంగా జరగలేదనే చెప్పాలి. శ్రీ శ్రీ మహాప్రస్థానం భావకవిత్వానికి అలవాటు పడిన పాఠకులను ఒక్క కుదుపు కుదిపింది. స్విన్‌బర్న్ Poems and Ballads (1866) విక్టోరియన్ సమాజంలో ఒక విస్ఫోటనం సృష్టించింది[6].ఆకాలంలో ,తన కవిత్వంలో విపరీతమైన ధిక్కారధోరణులను బాహాటంగా ప్రవేశపెట్టి అందరినీ నిర్ఘాంతపరిచినవాడు స్విన్‌బర్న్.శ్రీ శ్రీ కవిత్వం విధినిషేధాలకు లోను కాలేదు.స్విన్‌బర్న్ మొదటిపుస్తకమే నిషేధానికి గురయింది.

స్విన్‌బర్న్ అర్థాన్ని అధ్వాన్నపు ఎడారిలో నెట్టి శబ్దానికి పట్టం కడతాడన్న అపవాదు ఉంది. అది శ్రీ శ్రీ విషయంలో కూడా నిజం.శ్రీ శ్రీకి స్విన్‌బర్న్ లో నచ్చిన అంశమే అది.ఇద్దరికీ ఛందస్సులమీద అపారమైన అధికారం ఉంది.శ్రీ శ్రీ తనకు సంస్కృతం పెద్దగా రాదని తనే ఒప్పుకున్నాడు.స్విన్‌బర్న్ ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివాడు.లాటిన్ వచ్చు.గ్రీకు భాషలో,సంప్రదాయంలో,మతంలో మమేకమయ్యాడు ( రచనాశైలి మాత్రం గ్రీకు కాదు[7]). అతని గ్రీకు అనువాదాలు కొత్త ఒరవడిని సృష్టించాయి.పైగా ఫ్రెంచిలో నిష్ణాతుడు. ( మహాభారతం ఇతను ఫ్రెంచి అనువాదంలోనే చదువుకున్నాడు) ఇంకొక తమాషా ఏమంటే వీరిద్దరి కవిత్వాలకు పేరడీలు అధికం.శ్రీ శ్రీ తర్వాత వచ్చిన కవులు శబ్దాలంకారాలమీద మోజు తగ్గించుకొని పదచిత్రాల మీద పట్టు సంపాదించారు. ఆంగ్లకవిత్వంలో కూడా అదే జరిగింది.స్విన్‌బర్న్ శబ్దధోరణిని తోసిరాజని ఇమేజిస్టులు
రంగప్రవేశం చేశారు.

శ్రీ శ్రీ కి ముత్యాలసరం ,స్విన్‌బర్న్ కు anapest పెట్టనికోటలు.ఇద్దరి కవిత్వాలు ఎలుగెత్తి చదివవలసిందే.లోలోపల చదువుకునే కవిత్వాలు కావివి. కావునే శ్రీ శ్రీ స్విన్‌బర్న్ మీద రాసిన కవితను ఇలా ముగించాడు.

” కవీ ! నీ గళగళన్మంగళ
కలాకాహళ హళాహళిలో
కలిసిపోతిని! కరిగిపోతిని
కానరాకే కదలిపోతిని! “

(సూక్ష్మంగా ఆలోచిస్తే,ఈ పద్యం,శ్రీ శ్రీ కవితా ప్రస్థానాన్ని సూచిస్తున్నదా,అనిపిస్తుంది నాకైతే)

కదన కవులు /కథన కవులు

శ్రీ శ్రీ కవిత్వం మొదలుపెట్టే నాటికి (1933) గిబ్సన్ [8] Collected Poems (1926) వచ్చి ఏడేళ్లు కావస్తుంది. దానికి ముందు Daily Bread (1910), Fires(1912), Battle (1913) అతనికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.రోగం, నిరుద్యోగం దారిద్ర్యాలతో కునారిల్లిపోయే శ్రామికుల, కార్మికుల, సామాన్యుల జీవనాన్ని తన కవితా వస్తువుగా స్వీకరించాడు. సాంప్రదాయిక ఛందస్సులమీద తనకుగల తిరుగులేని పట్టుతో , నాటకీయత,కథన పద్ధతులను కవిత్వంలో ప్రవేశపెట్టి,పలువురిని మెప్పించాడు.అక్కడితో ఆగిపోకుండా యుద్ధ బీభత్సాన్ని సమగ్రంగా చిత్రీకరించాడు.ఇతని గూర్చి ఇంత గ్రంథం ఎందుకంటే- ఇతని ప్రభావం-నామ మాత్రమే కావచ్చు- లేకుంటే మహాప్రస్థానంలోని తొలిగీతం జయభేరి (‘నేను సైతం….’) వచ్చి ఉండేదే కాదు. ” I Even I ” పేరు చూసి – ఆ నామమాత్ర ప్రభావం చేత నేను సైతం అంటూ గీత రచనకు ఉపక్రమించాడు శ్రీ శ్రీ.ఒక రకంగా శ్రీ శ్రీ కృత్యాద్యావస్థను తొలగించినవాడు గిబ్సన్.

ఇంకొక ముఖ్య విషయం: “సంవిధానమే సమస్తమూ ” అని శ్రీ శ్రీ మనస్ఫూర్తిగా నమ్మిన రోజులవి.1933 లో శ్రీ శ్రీ రాసిన మరో కవిత ఒక రాత్రి ( ” గగనమంతా నిండి ” ) పో ,బోదిలేరుల ప్రభావంతో రాసినది.మరీ ముఖ్యంగా పో ప్రభావం శ్రీ శ్రీ మీద అపారం. ఎక్కడో చెప్పుకున్నాడు- ” రకరకాల ఛందస్సులతో సాముగరిడీలు చేస్తూ అదే కవిత్వం అనుకోవడం నాకు ఎడ్గార్ అలాన్ పో నుండి సంక్రమించిన వ్యాధి అనుకుంటాను “ శ్రీ శ్రీ, పోలకిద్దరికీ శబ్దశక్తి అపారం.తేడా అల్లా శ్రీ శ్రీ ప్రేమలో పడలేదు. పో ఆ విషయంలో అదృష్టవంతుడు; ప్రేమించిన భామనే పెళ్ళాడాడు. ఆమె మరణం తర్వాత రాసినవే “అన్నాబెల్లీ” (శ్రీ శ్రీకి చాలా ఇష్టమైన కవిత) ఆమె మరణం తర్వాత పో అట్టే ఎక్కువ కాలం బ్రతకలేదు.ఆంగ్లంలో అపరాధ పరిశోధక కథలకు ఆద్యుడు పో .అంతేకాదు కర్కశమైన విమర్శకుడు.కవిత్వమ్మీద ఛందస్సు మీద అతను రాసిన వ్యాసాలు పాండిత్యంతో విరాజిల్లుతుంటాయి. కవిత్వంలో సౌందర్యానికి పెద్ద పీట వేసినవాడు.జీవితంలో ప్రేమ పొందినవాడు, మహావిషాదాన్ని చవిచూసినవాడు కాబట్టి అతని కవితల్లో ఆ తాలూకు సౌకుమార్యం, వ్యగ్రత కనిపిస్తాయి.అప్పుడున్న మన సమాజంలో ఇటువంటి ప్రేమకు ఆస్కారం లేదు.అందునా శ్రీ శ్రీకి 13వ ఏటే పెళ్ళయిపోయింది.భావకవుల్లో ఎందరికి ప్రేయసులున్నారో నాకు తెలియదు.కావున వారి అమలిన శృంగారాలు ,పదునులేని రాతలు చలంలాంటి రసజ్ఞులకు ,అక్కిరాజు లాంటి విమర్శకులకు చిరాకు పుట్టించాయి. పో నుండి శ్రీ శ్రీ స్వీకరించింది కేవలం శబ్దాలంకారాలను, ఛందోబందోబస్తులను.. ముఖ్యంగా కథనాన్ని కవిత్వంలో ఒప్పించే తీరును.శ్రీ శ్రీ విశాలమైన పో కవితా తత్వాన్ని మాత్రం వంటబట్టించుకోలేదు.(పో ప్రభావం శ్రీ శ్రీ మీదే కాదు ,శ్రీ శ్రీ అమితంగా అభిమానించే బోదిలేరు తదితర ఫ్రెంచి కవులమీద కూడా ఉంది.పో, బోదిలేరుల ప్రభావంతో రాసిన కవితలు : ఒక రాత్రి,ఆకాశదీపం,కేక )

కవితా ఓ కవితాలో శ్రీ శ్రీ దర్శించిన కవితా స్వరూపం ,పో లక్ష్యించినది దాదాపు ఒకటే.శ్రీ శ్రీకే కాదు పోకి కూడా కవిత్వమంటే మంత్రించేదే , సమ్ముగ్ధం గావించేదే.

” నా సృష్టించిన గానంలో
ప్రక్షాళిత మామక పాపపరంపర
లానంద వశంవద హృదయుని జేస్తే-”
” అటు నను మంత్రించిన
సమ్ముగ్ధం గావించిన ఆ గాంధర్వానికి
తారానివహపు ప్రేమ సమాగమంలో
జన్మించిన సంగీతానికి
నా నాడుల తీగలపై సాగిన
నాద బ్రహ్మపు పరిచుంబనలో
ప్రాణావసానవేళాజనితం
నానాగానానున స్వానావళితం
బ్రతుకును ప్రచండభేరుండ గరు
త్పరిరంభంలో పట్టిన గానం ”

శ్రీ శ్రీకి పోకి కవిత్వాన్ని గానస్థాయికి దించాలనో పెంచాలనో ఉబలాటం విపరీతం.(ఫ్రెంచి సింబాలిస్టులు తొక్కినది ఈ తోవే.)

ఉదాత్తమైన సౌందర్యాన్నే పో ఆరాధించింది.అతనిలో శబ్దాలంకారాలు జాస్తి.శబ్దం కోసం అర్థాన్ని వదిలి పెడతాడు అన్న అపవాదు లేకపోలేదు. తన లక్ష్యానికి తగినంత కవిత్వాన్ని పో సృష్టించగలిగాడు,నాలుగుపదుల తన జీవితకాలంలో .శ్రీ శ్రీ ఆవిషయంలో రాయనిభాస్కరుడే. పో కవితా తత్వం క్లుప్తంగా –

” మనసూ బుద్ధీ అంతరాత్మలకు సంబంధించినది కాదు కవిత్వం.
అంతరాత్మకు కర్తవ్యనిష్ఠ ప్రధానం.అలాగే బుద్ధికి సత్యశోధన,
హేతువు;మనసు ఉద్వేగప్రవృత్తికి ఆలవాలం.కావున,వీటిని
అధిగమించినదే కవిత్వం.సౌందర్యవీధుల్లో విహరింపజేసేదే
కవిత్వం.మరోలా మీమాంసిస్తే కవిత్వసీమ సౌందర్యమే. “

-శ్రీ శ్రీ కవితా ఓ కవితాలో అదే భావన వ్యక్తమయింది.

“సుఖదుఃఖ ద్వంద్వాతీతం” ( మనసు)
“అగాధమచింత్యమమేయం” (బుద్ధి)

ఉదాత్తమైన సౌందర్యంతోనే కవిత్వానికి ప్రమేయం.తతిమ్మా వ్యాపారాలు అనగా మనసు,బుద్ధి, అంతరాత్మలకు సంబంధించినవి, కేవలం ఆనుషంగికాలు;కవిత్వసీమ సౌందర్యమే.(కవిత్వానికి సంగీతం తోడైతే దాన్ని మించినది లేదు,బంగారానికి తావి అబ్బినట్టే) అది “ఏకాంతం ఏకైకం,క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం..” Edgar Alan Poe వ్యాసం The Poetic Principle[9] కు శ్రీ శ్రీ కవితా ఓ కవితాకు భావపరమైన అభేదం ఉంది.కావున, “నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ ,నా జాతిజనులు పాడుకునే మంత్రంగా” మ్రోగించాలన్నది శ్రీ శ్రీ అభిలాష.కానీ,శ్రీ శ్రీ “నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా” అనడంలో పో మార్గం నుండి వేరు పడుతున్నాడు.పో కు శ్రీ శ్రీ లాగే కవిత అపరిమిత.కానీ ,ఆదర్శాలు అనగానే అంతరాత్మ ముందుకు పడుతోంది.మనస్సు, బుద్ధి,అంతరాత్మలను మించినదే కవిత్వస్థాయి.ఈ వైరుధ్యమే శ్రీశ్రీ తర్వాతికాలంలో కవిత్వం రాయలేక పోవడానికి కారణమని నా అభిప్రాయం.

ఈ వైరుధ్యమే శ్రీ శ్రీని గిబ్సన్, మేస్‌ఫీల్డ్ వైపు లాగింది.మేస్‌ఫీల్డ్ Saltwater Ballads (1902) శ్రీ శ్రీని ఆకట్టుకున్నాయి.అతని బలమైన కవిత్వమల్లా narrative poems లో స్ఫుటంగా చిత్రీకరించిన యథార్థజీవితం-A consecration [10] ప్రభావం ‘ ప్రతిజ్ఞ ‘ కవితమీద స్పష్టంగా కనిపిస్తుంది. యాంత్రికజీవితం ఇతన్ని ఆకట్టుకుంది. శ్రీశ్రీ భావకవిత్వాన్ని వీడి టార్పెడోలు మరఫిరంగీ అనడానికి వెనుక ప్రభావం ఇతనిదే.

వీరందరినీ పరిశీలించిన పిమ్మట మనకు స్పష్టమయేది:
శ్రీ శ్రీ భావకవిత్వాన్నుండి ప్రభావ కవిత్వానికి పయనించే దశలో కూడగట్టుకున్న గొంతుకతో వినిపించేది కథనం వెరసి కదనం !

(నోట్స్ మరియు ‘A Consecration’ కవిత – రెండో పేజీలో.)

You Might Also Like

9 Comments

  1. Chiranjeevi pattipati

    కదిలేది కదిలించేది మరేది మార్పించేది పెను నిద్ర వదిలించేది పరిపుర్నమిన వేల్లుగు ఇచీది శ్రీ శ్రీ kavitvame

  2. makkavasu

    mahakavi ,kavisamrat,ila manam enno birudulu petti atanni slaginchinatam kante manam ayana mana gurinchi vesina pantha lo payaninchadam manam ayanaku iche nivali

  3. S V V V SARADHI

    i read this book at the age of 19 by stoping my engg 2nd year next day exam preparation .i failed in that subject but read a excellent book and read the life.
    i still remember kavitha o kavitha poem completly.

    naa yuvakasala navapesala samageethavaranamlo
    ati sundara sunyandanamanduna
    atu ne chuchita chatulaalankarapu
    matumaayala natanalalo nee rupam kanaraananduna
    na guhalo kutilo cheekatilo
    okkadiny srukkina rojulu leva.

  4. srinivasrao

    naku sri sri la rayalani undi

    1. L.Dhananjaya

      SRI SRI la gaakunta maroala raasi choodu apudu SRI SRI laaga elaa raayaalo telustundi.All the best for your adventure.

  5. srinivasrao

    sri sri is a wonder ful writer in the world

  6. anke manohar

    ayan oka viplavam
    ayana oka bhavam
    ayan oka shankam
    ayana oka geetham
    ayana oka anatham
    ayanaku ayana sati…………

  7. పుస్తకం.నెట్

    @కొత్తపాళీ గారు: మీరు గమనిస్తే వ్యాసం మొత్తం మీద ఉన్న కవుల పేర్లు కొన్నే. వీటికి (వీలైనంతవరకు) అవి మొదటిసారి వచ్చినప్పుడే వికపీడియా లంకెలు ఇచ్చాము…

  8. కొత్తపాళీ

    మంచి వ్యాసం. శ్రీశ్రీని ఒక ప్రాపంచిక చారిత్రక నేపథ్యంలో అర్ధం చేసుకోడానికి పనికొస్తుంది.
    సంపాదకులకి సూచన .. కొంచెం కష్టమైన పనే కావచ్చు, ఈ వ్యాసంలోని భారతీయేతర కవుల పేర్లని ఆంగ్ల స్పెల్లింగులో ఇస్తే వారిని గురించి మరికాస్త తెలుసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. తెలుగు స్పెల్లింగునించి ఆంగ్ల స్పెల్లింగు ఊహించడం చాలా కష్టం.
    మీరు మరికాస్త శ్రమ తీసుకో గలిగితే, ఆయా కవుల పేర్లనించి వికీ లంకెలు ఇస్తే మరీ ఉపయోగంగా ఉంటుంది.
    భూషణ్ కి అభినందనలు.

Leave a Reply