సలాం హైదరాబాద్ కథలోని వ్యథ
రాసిన వారు: కాకరాల
(ఈ వ్యాసం మొదట వీక్షణం పత్రిక జనవరి 2010 సంచిక లో ప్రచురితమైంది. పుస్తకం.నెట్ లో దీన్ని తిరిగి ప్రచురించేందుకు అనుమతించిన వీక్షణం సంపాదకులకు ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
సినిమానటులుగా ఇంటిపేరుతో సుప్రసిద్ధులయిన కాకరాల సత్యనారాయణ గరికపాటి రాజారావు తోపాటు ప్రజానాట్యమండలిలో పనిచేసి 1950 ల చివరినుంచీ వందలాది సినిమాలలో నటించారు.
*********************
తెలంగాణ ప్రజల అణచివేతల చరిత్రనెరిగిన వారికి మిగిలిన మూడు ప్రాంతాల ప్రజల చైతన్యం కన్న వారి చైతన్యం భిన్నమైందని తెలుస్తుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రక్తపుటేరుల్లో ముంచి, బలవంతంగా తెలంగాణాన్ని భారత యూనియన్లో భాగం చేసిన నెహ్రూని ‘రంగూ రంగులమారి నెవురయ్యా నీ రంగూ బైరంగ మాయనెవురయ్యా’ అని ఆ మనిషిలో మనిషిని చూసి చూపించిన రైతాంగ యోధుని చైతన్యం ఆ ప్రాంతం ప్రజల్లో అణిగి మణిగి ఉంది.
సాగరాలను ఏకం చేయగలిగిన అజాత శత్రువుల ఆగ్రహమది. సముద్ర గర్భంలో బడబానలంలా ఉంటుంది. అందుకనే నీలం సంజీవరెడ్డి నుంచి వై.ఎస్ రాజశేఖరరెడ్డి దాకా, ముఖ్యమంత్రులు చేస్తూ వస్తున్న ఆయమాయ గారడీలమీద ‘జూమ్‌లెన్స్’ వేస్తూ వచ్చిన తెలంగాణ, అరవై తొమ్మిదిలో ప్రత్యేక రాష్ట్రం కోసం అగ్ని పర్వతంలా బద్ధలయింది.
ఈ ఉద్యమాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించగలిగిన వారికి, తెలంగాణ హృదయం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అదో బ్రహ్మ పదార్థం కాదు. అసలు హృదయం, ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ లాంటి పదాలు రూపంలేని వాటికి రూపాన్నిచ్చిన భావవాద తాత్విక భావనలు. వ్యక్తికో, జాతికో, ప్రాంతానికో వాటిని ఆపాదించుకున్నప్పుడు అవి ఎక్కడున్నాయనిపిస్తుంది. నిజానికి అవి వ్యవస్థలో అణువణువునా ఆవరించి ఉన్న ప్రాణ చైతన్యపు నైరూప్య భావనలు. అవి ఆ వ్యవస్థని నిశితంగా పరిశీలించి కనగలిగిన వారికి మాత్రమే కనిపిస్తాయి.
తెలంగాణ రచయిత పరవస్తు లోకేశ్వర్ ఆ పనిని గొప్పగా చేసి చూపించారు. ఆయన నవల ‘సలాం హైదరాబాద్’ తెలంగాణ హృదయాన్ని స్పష్టంగా కళ్లకి కట్టిస్తుంది. ఆద్యంతం ఆ హృదయ ఘోషని వినిపిస్తుంది. అంతేకాదు, తెలంగాణకి హృదయమైన హైదరాబాద్ ఆత్మకథ కూడా వినగలిగిన వారికి వినిపిస్తుంది.
ఇక్కడ కథని సంగ్రహాంగా చెప్పుకోనక్కరలేదు. నవలా సంవిధాన విశిష్టతని, తెలంగాణ హృదయవైశాల్యాన్ని వ్యక్తం చేసిన, హైదరాబాద్ ఆత్మ సంస్కారాన్ని ఆవిష్కరించిన ప్రత్యేకతల్ని, స్థూలంగా గుర్తుచేసుకుంటే చాలు. ఈ నవల 10 జూన్ 2005న, శుక్రవారం మధ్యాహ్నాం మొదలువుతుంది. ఆ సమయంలో ‘నాలుగు వందల సంవత్సరాల నగర చరిత్రకు ప్రత్యక్షసాక్షిగా, ప్రథమ సాక్షిగా నిలిచిన ‘చార్మినార్’ ఉంది. దానికెదురుగా ఇక్బాల్ హోటలుంది. ఆ హోటల్లో స్వామి కూచున్నాడు. తన ‘జిగ్రీ దోస్త్ చార్మినార్’ తోటి ఎడతెగని నిరంతర సంభాషణని చేస్తున్నాడు – వర్తమానం గతంతో చేసే నిరంతర సంభాషణలా.
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన మొదటి విశేషం ఉంది. రచయిత ఈ సూచన ద్వారా, ఇది కేవలం నవలే కాదు, చారిత్రక పత్రం కూడానని ముందే హోచ్చరించాడు. ఇక్కడే చెప్పక తప్పని మరో విశేషం కూడా ఉంది. మన దేశంలో ప్రియురాలి మీద తన ప్రేమని తెలియ జెప్పుకునేందుకు ‘షాజహాన్’ ప్రేమకి ప్రతీకగా ‘తాజ్‌మహాల్’ కట్టించాడు. అలాగే కులీకుతుబ్‌షా హైదరాబాద్ నగరాన్ని కట్టించాడు. ఇక్కడ తప్పక గుర్తించవలసిన మరో విశేషం ఉంది.
ప్రపంచ చరిత్రలో పాలకులు – వారికున్న పరిమితుల్ని పరిధుల్ని అధిగమించి ప్రజల్ని ప్రేమించిన వారున్నారు. అలాంటి ప్రభువుల్ని ప్రజలు ప్రాణం కన్న మిన్నగా ప్రేమిస్తారు. అందుకనే గురజాడ ‘ప్రేమ యిచ్చిన ప్రేమ వచ్చును’ అన్నాడు. ఆయన సాహిత్య వారసత్వాన్ని అందుకున్న శ్రీశ్రీ ‘ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది’ అన్నాడు.
తెలంగాణ ప్రభువు తన ప్రజల్ని ఎలా ప్రేమించాడో? అలాగే ఆ ప్రజలు ప్రభువుని ఎలా ప్రేమించారో? వెరసి తెలంగాణ ‘హృదయం’ ఎంత ప్రేమపూరితమో – చారిత్రక పత్రం కూడా అయిన ఈ నవలలో గుప్తంగా ఉంది సుమా అని ముందే గుర్తు చేస్తున్నాడు రచయిత. అర్థవంతమైన ఈ ఆరంభం వెనక తెలంగాణ హృదయాన్ని, దాన్ని చరిత్రని సక్రమంగా అర్థం చేసుకోవాలన్న అతని తపన ఉంది.
ఇక నవలకి ప్రాణమైనదాని సంవిధాన విశిష్టతని చూడాలి.
స్వామి చార్మినార్ ఆత్మలు తమ అంతరంగం లోకాలను ఆవిష్కరించుకుంటూ, నార్మన్ బెతూన్ అన్నట్టుగా ‘గతాన్ని కట్టెదుట నిలుపుతూ, వర్తమానాన్ని విమర్శిస్తూ, భవిష్యత్తుకు దారి చూపే థిగా పదండి ముందుకు పదండి తోసుకుపోదాం పైపైకి’ అని మన చేత సైనిక మార్చింగ్ చేయిస్తూ ముందుకు పోతుంది. సామాజిక సంఘర్షణని, చారిత్రక నేపథ్యాన్ని అర్థవంతంగా సమన్వయిస్తూ.
బెంగాల్ దర్శకుడు రుత్విక్ ఘటక్ మూవీ కెమెరాతో ప్రధాన పాత్ర వెనకబడితే కథ వస్తోందంటాడు. అలా సినిమాలు తీసి రుజువు చేశాడు. అలాగే ప్రధాన పాత్రని అనుసరిస్తూ సాగిన ఈ నవలలో తెలంగాణ ప్రజల చైతన్యం, దానికి సంకేతమైన తెలంగాణ హృదయం, దానికైన గాయం, అది సెలేసిన వైనం అన్నీ స్పష్టంగా స్పురిస్తాయి.
స్వామి అంతరంగంలో ఉత్తర, దక్షిణాలకు కేంద్ర బిందువైన హైదరాబాద్ నగరం. ఆ నగరంలో అనేక మత, భాషా సంస్కృతీ ప్రవాహాలు, ఆంగ్లో ఇస్లాం ప్రేమలు, పెళ్లిల్లు, వాటి వైఫల్యాలు, కరుణ రసాత్మకమైన ఖౌరున్నీసా విషాదగాథ – అన్నీ చలన చిత్రమాలికలా సాగాయి. అందులో సమకాలీన సమాజ సంఘర్షణల్లో పాల్గొన్న వ్యక్తులు, గత చరిత్రలో భాగమైన పాత్రలు తమవైన వ్యక్తిత్వాలతో చిత్రిత మయ్యాయి. సజీవమైన ఆ పాత్రల చిత్రణకి మచ్చుగా ఖైరున్నీసా ప్రేమ విషాధాల గాథని చూస్తే చాలు.
పంతొమ్మిదేళ్ల ఖైరున్నీసా మీద జేమ్స్ అక్లీస్ కిర్క్ పాట్రిక్ మనసు పడింది. ఒక సందర్భంలో పరస్పరం ఆకర్షితులయ్యారు. ఇది ఆమెవైపు మగవాళ్లకి ఇష్టంలేదు. వారు ఆమెని తమకిష్టమైన మరో వరునితో పెళ్లి చెయ్యాలనుకుంటారు. ఆమెవైపు ఆడవాళ్లకి అది నచ్చక మగవాళ్లు ఊళ్లో లేని సమయంలో చొరవ చేసి ఆమెని పాట్రిక్ దగ్గరకి చేరుస్తారు. కొంతకాలం వారిద్దరూ ఆనందపు అంచులు చూస్తారు. అలా ఆ చిలకా గోరింకల కలలు ఫలించి ఖైరున్నీసా తల్లయింది.
ఆమెవైపు మగవాళ్లు ఆమెకి గర్భవిచ్ఛిత్తి జరిపించి మరో పెళ్లి చేయాలనుకుంటారు. ఖైరున్నీసాకి గృహా నిర్బంధం, ప్రేమ వివాహాల పట్ల ఆరోగ్యకరమైన అభిప్రాయాలున్న ఆమె బలంగా సంకల్పించుకుని తన పెద్దలకు ఎదురు తిరిగింది. విరహబాధని భరించింది.
ఈ ఇద్దరి సాహాచర్యాన్ని సహించలేని పెద్దలు, రాజకీయ పెద్దలు పన్నిన కౌటిల్యం ఫలితంగా ఫారూక్ కలకత్తా వెళ్లి అక్కడే చనిపోయాడు. అప్పటికి ఖైరున్నీసా ఇద్దరు పిల్లల తల్లి. ఇక్కణ్నించి ఆమె కష్టాల పరంపర మొదలైంది. ఆ కష్టాలకెదురు నడిచి కొవొత్తిలా కాలి కరిగిపోతున్న ఖైరున్నీసా కలకత్తా వెళ్లి అతని సమాధి దగ్గర అతని కోసం ప్రార్థించింది. సమాధి చూసి వస్తోన్న ఆమెకి పురాతన ఫారసీ కవితా చరణాలు గుర్తుకొచ్చాయి.
ఈ పురుషాధిక్య ప్రపంచం ఖైరున్నీసా సమస్తాన్ని దోచుకుంది. చివరికి ఫారుక్ రాసిన వీలునామా ప్రకారం అతని పిల్లల్ని అతని బంధువులు తీసుకుపోయారు. అలా అన్నీ కోల్పోయిన ఆమె అన్ని విధాలా దగా పడి మనోవ్యధ తో కాలి, కరిగి, కృశించి కన్నుమూసి సమాధిలోకి వెళ్లింది.
ఇంతవరకూ స్వామి అంతరంగంలో సాగిన ఈ సన్నివేశం ముగియగానే పవిత్రప్రేమకి ప్రతీకయిన ‘తాజమహాల్’ ముందుకొచ్చింది. అలాగే హిందూ ముస్లిం మతాల ఐక్యతకి సంకేతమైన హైదరాబాద్, దానిలోని చార్మినార్ ముందుకొచ్చాయి. వాటి తరువాత వరసగా జాతీయోద్యమ కాలపు దృశ్యాలూ, యోధులూ, నాయకులూ, ముఖ్యంగా తుర్రేబాజ్‌ఖాన్ లాంటి పోరాట యోధులు ముందుకొచ్చారు.
సఫలమైన ప్రేమకి ప్రతీకలైన భాగమతి కులీకుతుబ్‌షాలు, వారి స్మారక స్థలాలు, భవనాలు, కదులుతూ ముందుకొచ్చాయి – తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటోద్యమ దృశ్యాలు, వాటి మీంచి ఓవర్‌లాపయి వచ్చాయి. ఇది డిజాల్వు అవుతూ అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ ఉద్యమ దృశ్యాలు ఫోకస్‌లోకొచ్చాయి.
ఈ దృశ్యాల నేపథ్యంలో స్వామి ‘మహాప్రస్థానం’ కొని చదువుతూ వస్తున్నాడు. వెనక ఎవరి గొంతు నుంచో ఆ గీతాలు వినిపిస్తున్నాయి. ‘వెనక దగా ముందు దగా కుడి ఎడమల దగాదగా’ వినిపిస్తుండగా దగాపడిన తెలంగాణకి ప్రతీకైన ఖైరున్నీసా మూర్తిభవించిన శోకదేవతలా ముందుకొచ్చింది.
ఇటు మీదట తెలంగాణ సాయుధ పోరాటం, పోలీసు యాక్షన్ దృశ్యాలూ, వరసగా దిగంబరోద్యమం, నక్సల్బరీ రగిలించిన శ్రీకాకుళ ఉద్యమం, అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ పోరాటోద్యమ దృశ్యాలూ, విశాఖలో శ్రీశ్రీ సన్మాన సంరంభ దృశ్యాలూ, డెబ్భైలో విరసం స్థాపన, డెబ్భై రెండులో ముల్కీ ఉద్యమం, విద్యులత కవులు. అవి వెనక్కి డిజాల్వ్ అవుతూండగా ముందుకి తోసుకువచ్చిన 2009 ప్రత్యేక తెలంగాణ, సమైఖ్యాంధ్ర దృశ్యాలు. స్వామి అంతరంగంలో మవేుకమవుతున్న మనల్ని దగా పడిన తెలంగాణకి ప్రతీకైన ఖైరున్నీసా న్యాయం చెప్పమని నిలదీస్తుంది చివరికి.
ఇప్పుడు దశాబ్దాలుగాదగా పడుతూన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవాలనుకుంటోంది. వచ్చిన ఒత్తిడిని బట్టి తెలంగాణ రాజకీయులందరూ, పార్టీలతో ప్రవేుయం లేకుండా తెలంగాణ వైపుకి వచ్చారు. రాయలసీమ సర్కారుకు ఉత్తరాంధ్రల, రాజకీయులందరూ సమైకాంధ్రని, ప్రత్యేకాంధ్రని, గ్రేటర్ రాయలసీమని, అయోమయాన్ని సృష్టిస్తూ కల్లోలం రేపుతున్నారు. ఈ ప్రభుత్వాలు దగాపడిన తెలంగాణకి న్యాయం చేస్తాయా? తెలంగాణకి హృదయమైన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాదవుతున్న క్రమంలో దాని వ్యధని, గాయాన్ని మాన్పుతారా? పెంచుతారా? ఇవన్నీ రాబోయే కాలంలో తేలవల్సిన ప్రశ్నలు. ఇప్పటికే ఇది ఎంత జటిలమైందంటే బ్రెయిన్‌కి వచ్చిన కేన్సర్‌ని బ్రెయిన్‌కి హాని కలగని విధంగా శస్త్ర చికిత్స చేయడం లాంటిది. ఈ సమయంలో కాళోజీ చెప్పింది గుర్తుకొస్తోంది.
అన్ని ప్రాంతాల ప్రజలు హెచ్చరిక గా ఉండి ‘దోపిడీ చేసే పరాయివాణ్ని పొలివేుర దాకా పారద్రోలడానికి, ప్రాంతం వాడైతే ప్రాంతంలోనే పాతరేయడానికి‘ సంసిద్ధులై ఉండాలి.
*******************************************************
ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో మరో సమీక్ష ఇక్కడ.
డింగు
Read this book online
http://discover-telangana.org/wp/2009/11/02/salam_hyderabad_lokeshwar_foreword/
Rakesh
ikkada vyakhyalu evaroo rayaru!!
enduko vErE aDagaalaa?