సహృదయ

రాసి పంపిన వారు: సి.బి.రావు
********************

అనారోగ్యం తో ఉన్న తెనాలి మిత్రులు వెనిగెళ్ల  వెంకటరత్నం ను పరామర్శించటానికి వెళ్లినపుడు, కాకతాళీయంగా వారింట “సహృదయ”  అనే పుస్తకం నా కంటపడింది.  పేజీలు తిరగేస్తుంటే ఆసక్తికరంగా కనిపించింది.

సాహిత్యాభిలాష, చక్కటి సంగీతానికి చెవి, ఉత్తమ సినిమాలకు కన్ను,  గుప్తదానాలకు వెన్నెముకలేని చెయ్యి, స్పందించే మానవత, కళలకు కాణాచి వగైరా  ఇవన్నీ ఒకే చోట ఉండటం సాధ్యమా?  డయాబిటిస్ గైడ్,   గుండెజబ్బులు -నివారణ, డాక్టర్ గారి డైరీ ఇంకా వైద్య విజ్ఞానం  వగైరా పుస్తకాల రచయిత, తెనాలి లోని చైతన్య వేదిక ,క్లాసికల్ ఫిల్మ్ సొసైటీ లకు మార్గదర్శి  ఇంకా “గ్రామీణ ప్రాంతాలలో గుండెపోటుకు చికిత్స”     అనే సిద్ధాంత రచనకు  డా.ధీరేంద్రనాథ్ దత్త హృదయశాస్త్ర పురస్కారగ్రహీత, కళాత్మక దర్శకుడు – బి.యన్.రెడ్డి అనే పుస్తక రచయిత  – వెరసి అన్నీ కలిపి డా.పాటిబండ్ల దక్షిణామూర్తి గారంటే ఆశ్చర్యం కలుగక మానదు.

sahrudayaఎందరో కవులకు, కళాకారులకు పుట్టిల్లు తెనాలి.  ప్రసిద్ధ రచయితలు చలం,కొడవటిగంటి ,త్రిపురనేని రామస్వామి,చక్రపాణి, గోపీచంద్, డా.సంజీవదేవ్, డా.జి.వి.కృష్ణారావు, హితశ్రీ, అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి వంటి ప్రముఖ  రచయితలు ఇక్కడివారే. సినీకళాకారులు కాంచనమాల, జమున, కృష్ణ,మహేష్ కుమార్, శారద,జగ్గయ్య, గుమ్మడి,ఎ.వి.ఎస్ ,యాంకర్ ఝాన్సీ  తెనాలి వారే.  ప్రఖ్యాత శాస్త్రవేత్తలు యలవర్తి నాయుడమ్మ, ఎ.వి.రామారావు  ఇక్కడి వారే. డాక్టర్ నాయుడమ్మ పేరుపైన ఎందరో ప్రముఖులను సత్కరించింది ఈ తెనాలి గడ్డపైనే. మీది తెనాలా -మాదీ తెనాలే అంటూ మనల్నినవ్వించే సంభాషణలు (ఇంద్ర) రాసిన రచయిత చిన్ని కృష్ణ తెనాలి వారే. త్రిపురనేని రామస్వామి, అవుల గోపాలకృష్ణముర్తి (A.G.K.), కోగంటి రాధాకృష్ణమూర్తి, గురజాల సీతారామయ్య, ఆవుల సాంబశివరావు  లాంటి  హేతువాదులకు తెనాలి కొలువు.  లంకపల్లి బుల్లయ్య, ఉప-కులపతి, ఆంధ్రా విశ్వవిద్యాలయము, ఆవుల సాంబశివ రావు,   ఉప-కులపతి, ఆంధ్రా విశ్వవిద్యాలయము,  కొత్త సచ్చిదానంద మూర్తి – బౌద్ధ తత్వవేత్త  ఇంకా ఉప-కులపతి, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయము   తెనాలి వారు.  గద్దెపై స్త్రీ పాత్రలు జనరంజకంగా పోషించే ప్రముఖ నాటక కళాకారుడు స్థానం నరసింహా రావు    తెనాలి వాడే. ఎందరో రాజకీయ నాయకులు  కొత్త రఘురామయ్య, నాదెండ్ల భాస్కర రావు,   శారద, నాదెండ్ల మనోహర్ (ఉప-సభాపతి)   ఇంకా  మన ముఖ్య మంత్రి రోశయ్య  తెనాలి నుంచి వచ్చిన వారు. కళలకు కాణాచి ఐన తెనాలిని 1930 లో ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు ఆంధ్రా పారిస్ గా అభివర్ణించారు.

ఈ తెనాలి  ఎప్పుడూ రాజకీయంగానో  లేక సాంస్క్రుతికపరంగానో     చైతన్యవంతంగా ఉంటుంది. మీరు దిన పత్రిక తిరగేస్తుంటే అకస్మాత్తుగా తెనాలిలో అంతర్జాతీయ చలన చిత్రొత్సవమనో లేక సంగీత విమర్శకులు వి.ఏ.కె.రంగారావు, కళాతపస్వి  విశ్వనాథ్ కు సన్మానమనో వార్తలు కనిపిస్తుంటాయి.  మరోసారి “కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి” పుస్తక ఆవిషరణో లేక   ప్రభోదాత్మక చిత్రాల నిర్మాత గూడవల్లి రాంబ్రహ్మం స్మారక సంచిక విడుదలనో వార్తలు చదువుతుంటాము.  ఇంకోసారి గంగాధర్, సంజీవదేవ్ చిత్ర ప్రదర్శలనో వార్తలు చదివి ఇంత చిన్న ఊరైన తెనాలిలో ఇంత చైతన్యమా అని అబ్బురపడటం కద్దు.   వీటన్నిటి వెనుక వున్న అదృశ్య శక్తే  డా. దక్షిణామూర్తి. వృత్తిరీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి రీత్యా వారు పెద్ద కళాభి మాని. వీరి పుణ్యమా అని తెనాలి వాసులు ఎందరో మహానుభావులను చూసి తరించగలిగారు.  వీరి ఆధ్యర్వంలో తెనాలిలో సన్మానితుల చిట్టా పెద్దదే. డా. సి.నారాయణరెడ్డి (1977), దాశరధి (1978), మహాకవి శ్రీ శ్రీ , మేధావి కొడవటిగంటి  కుటుంబరావు ( 1979), జానపద కవి కొసరాజు రాఘవయ్య, సంపాదకులు ఏ.ఎస్.రామన్ ( 1980), రచయిత,నటుడు అయిన మిక్కిలినేని, ఆరుద్ర (1982) , దర్శకులు యు.విశ్వేశ్వర రావు, గుమ్మడి వెంకటేశ్వర రావు, దర్శకుడు వేజెండ్ల, రచయిత సముద్రాల జూనియర్ ( 1983), కళా తపస్వి కె.విశ్వనాథ్, నటుడు జగ్గయ్య, రచయిత మోదుకూరి జాన్సన్,  రచయిత డి.వి.నరసరాజు,  సంగీత విమర్శకులు వి.ఏ.కె.రంగారావు, ధ్యన్యనుకరణ సామ్రాట్  డా.నేరెళ్ల వేణు మాధవ్  ఇంకా నటి, గాయని, రచయిత్రి భానుమతి వీరి సన్మాన గ్రహీతలలో కొందరు.  ఈ చిట్టా ఇంకా ఉంది. స్థలాభావం వలన ఇంతే ఇస్తున్నా.

డాక్టర్ దక్షిణామూర్తి రోగుల పాలిట దాక్షిణ్యమూర్తి అని పేర్కొంటూ పలువురు వ్యాసరచయితలు డాక్టర్ గారిని ప్రస్తుతించారు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి  గారి షష్టిపూర్తి సందర్భంగా , డాక్టర్ గారి చికిత్సాలయం పేరునే,  ఈ అభినందన సంచికను వారి అభిమానులు 1999 లో వెలువరించారు.

ప్రతులకు చిరునామా:

డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి అభినందన సమితి,
4-13-8, ఐతానగరం,
తెనాలి – 522 201

వెల: ఇవ్వలేదు (అమూల్యం)




-cbrao

You Might Also Like

2 Comments

  1. perugu

    సహృదయ గురించి మంచి సమీక్ష అందించారు రావు గారు ..
    డి.ఆర్ .సంచిక “అక్షర” నా దగ్గర వుంది.చ్చదివాను..మంచి పుస్తకం..
    మీకోసం దాన్ని ఇక్కడ సమీక్షిస్తాను..వీలైనంత త్వరలో..
    పెరుగు.రామకృష్ణ,నెల్లూరు

  2. peeveeyes

    డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారి అభినందన సంచిక “సహృదయ” ని శ్రీ సి.బి.రావు గారు పరిచయం చేయటం ముదావహం. దక్షిణామూర్తిగారు వ్రాసి ప్రచురించిన పుస్తకం ‘కళాత్మక దర్శకుడు–బి.ఎన్.రెడ్డీ’ నా మిత్రుడు ఆరిపాక పెంటబాబు దగ్గర చూసి చదివినపుడు మొదటిసారిగా శ్రీ మూర్తిగారిగురించి తెలుసుకున్నాను.
    ఈ సందర్భంగా ఒక విన్నపం. కావలి జవహర్ భారతి కళాశాల వ్యవస్తాపకుడు సాహితిపోషకుడు, డీ. ఆర్. గా పిలువబడే శ్రీ డి.రామచంద్రారెడ్డి షష్టిపూర్తి అభినందన సంచిక 1100 పేజీలతో తెలుగుసాహితీ వ్యాసాలతో “అక్షర” అనే బృహత్ గ్రంధంగా దాదాపు మూడు సంవత్సరాల కిందట వెలువడింది. అప్పట్లొ కొనటానికి ప్రయత్నించినా దొరక లేదు. దానిని చదివిన మన పుస్తక మిత్రులు ఎవరైనా ఈ పేజీలలో పరిచయం చేయగలరని ఆశిస్తున్నాను.

Leave a Reply