నాకు నచ్చిన కవిత – మరువపు పరిమళాలు

మానవుడికి ఉన్న ఒక అధ్భుతమైన సౌలభ్యం   భావవ్యక్తీకరణ.  అది మామూలు పదాలతో చేసే వచనమైనా, సున్నితమైన పదజాలంతో ఎన్నో అర్ధాలు చెప్పే కవిత్వమైనా, చంధస్సుతో కూడిన పద్యాలైనా..  రచయిత తన భావాలను, ఆలోచనలను పాఠకులకు ఎలా అందించగలడు అనేది అతని ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. అందరూ అన్నీ చేయలేరు. ఒక్కోకరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులోనే వారు రాటుదేలి వాసికెక్కుతారు. అలాటి ఒక అందమైన , అద్భుతమైన భావవ్యక్తీకరణ – కవిత్వం.

నాలో ఎన్నో ఆలోచనలు, అనుభూతులు. వాటిని పంచుకుని , చర్చించాలంటే నేను ఎన్నుకున్న సులువైన మార్గం వచనం. వచనమైనా, కవిత్వమైనా ఎలా పడితే అలా చెప్పలేము. ప్రతీదానికి ఓక నియమం, శైలి ఉంటాయి. మనసులోని ఆలోచనలను అలా నదీ ప్రవాహంలా రాసుకుంటూ పోవడమే వచనం ప్రత్యేకత. దానికి అడ్డు, అదుపూ ఉండదు దూరమెంతో కూడా తెలీదు. కాని కవిత్వంలో ఆ భావావేశమనే నదీ ప్రవాహాన్ని అందమైన నురగలలో బంధించి కవితలా ఇవ్వడం అంత ఆషామాషీ కాదు. అలవాటైతే మాత్రం ఆ కవి భావావేశం అలలై అలా పరుగులెత్తుతూనే ఉంటుంది. ఒక చిలిపి తగాదా ఐనా, వానజల్లు చేసే అల్లరి కాని,  నీటిలో ఈదే చేపపిల్లను చూసినా సరే ఆ అనుభూతిని కవితలో బంధించక తప్పదు.

మామూలుగా నాకు కవితలు చదివే అలవాటు అస్సలు లేదు. చదివితే అర్ధం కావని కాదు. నా ఆలొచనలు అంత సున్నితంగా ఉండవు. ఆ పదాలను చదివి ఆ రచయిత చెప్పాలనుకున్న భావాన్ని వెలికితీసి ఆనందించే ఓపిక లేకపొవడం ముఖ్యకారణం. కాని నిజాన్ని ఒప్పుకోక తప్పదు. కొందరి రాతలు చూసి ప్రభావితమైనట్టే ఒక వ్యక్తి రాసే కవితల వల్ల కాస్తో కూస్తో నాలో చలనం కలిగి వాటిని  చదివి అర్ధం చేసుకుని ఆస్వాదించగలిగే మార్పు వచ్చింది. ఆ వ్యక్తి మనకందరికీ తెలిసిన ఉష. మరువం బ్లాగులో ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు, భావనలు, అనుభూతులు అందమైన కవితల రూపంలో పొందుపరిచారు. ఒక సంఘటనను ఇంత అందంగా చెప్పవచ్చా అని ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను. ఇలా ఎందరో రాసి ఉండవచ్చు. నాకు తెలీదు. కాని నేను చదివిన ఉష కవితలలో కొన్నింటిని మరువలేకుండా ఉన్నాను. ఉదాహరణకు..

అవునసలు ఆకాశమే అందమైన అతివ ఎందుక్కాకూడదు?
తననిచూసి పుడమి తరుణి ఉడుక్కోవటం ఎందుకవకూడదు?
పర్వాతాలు పైకి ఎదిగేది ఆ ఆకసాన్ని అందుకోవాలని ఎందుక్కాకూడదు?
తరువులు పైకి సాగేది ఆ మగువ మీదికెగబ్రాకాలని ఎందుకనుకోకూడదు?
వెన్నెలలు తన వయ్యారిమేని ఛాయలు, చుక్కలు తన జడపూలు ఎందుక్కాకూడదు?

అతివలను ఆకాశంలో సగం అంటారు కదా.కాని అసలు ఆకాషమే అతివ ఎందుకు కాకూడదు అని ఎన్ని కారణాలు చెప్పారో ఉష. నిజమే కదా ఎందుకు కాకూడదు అని ఆ కవిత చదివిన వారందరికీ అనిపించకమానదు.

ఇంద్రాది ఆది దేవతలే స్త్రీలోలులైనా, ఎవరది ఎత్తిచూపింది?
“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః”
అని ఆర్యోక్తి అంటూ ఆడవార్ని భ్రమింపచేసారేమో?
ఆత్మవంచన వదిలి సాంప్రదాయం ఆడదాని గోడు వింటుందా?
ఆమె ఆత్మగౌరవం ఈ విఫలపూజల కన్నా మిన్న అని ఒప్పుకుంటుందా?

ఆది పరాశక్తి తన మూలస్థానం వదిలిరావాలా?
తన అంతర్గతశక్తి నేటి మగువ తానే వెలికితీయలేదా?
తరిమి తరిమి తన శత్రువుని మట్టుబెట్టలేదా?
తన వృత్తీ, ప్రవృత్తీ చాటిచెప్పుకోలేదా? తన మేధస్సు నిరూపించలేదా?

అబల అన్న సమాజాన్ని ఆమె మాత్రమే మార్చాలి అంటూ ఈ కవితలో  యుగాలుగా  ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాన్ని చాలా భావగర్భితంగా, ఆవేశంగా చెప్పినా ఆలోచింపజేస్తుంది.

ప్రేమలో పడినవారికి సర్వం అందంగానే కనిపిస్తుందంటారు. అందుకే అలవోకగా కవితలు రాసేస్తారా?? కాదేమో. ప్రకృతిలోని అందచందాలు మనసారా వీక్షించి, అనుభూతి చెంది. అందమైన కవితలా ప్రకటిస్తే ఎలా ఉంటుంది?? వసంతాగమనంతో ప్రకృతి అంతా పులకరించిపోతుంది. పచ్చగా మారుతుంది. ప్రతి మొక్క, పువ్వు , మొగ్గ పరవశంతో ఎన్నో అందాలు సంతరించుకుంటాయి.

పచ్చల పతకం నిలువు దొపిడీగా మొక్కుకుందేమో
పిచ్చి నా చిట్టి మొక్క అనుకున్నానే
ఆ మొక్కే చిలకలా నవ్వింది
పచ్చనాకు పట్టు పావడతొడుక్కుని.

అందుకేనేమో ఆకసాన అదో అందం
గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా,
మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు
ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు.

చిన్నారి మొక్క పచ్చపావడా తొడుక్కుంటే అందమైన ఆకాశంలో గాలి గొల్లవాడిలా ఉంటే మబ్బులేమో మేకపిల్లలైపోయాయి కవయిత్రి ఊహలలో. ప్రతీ చెట్టూ,పుట్టా, ఆకు,  మొక్క,పువ్వు కాయ, వాన వలపు, కాదేది కవితకనర్హం.

అందుకే చిన్ని కవితలలో అనంతమైన భావాన్ని బంధించి అందిస్తున్న ఉషకు ధన్యవాదాలు. మరువం పేరుకు తగ్గట్టే తెలుగు బ్లాగ్లోకంలో సువాసనలు వెదజల్లుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

You Might Also Like

16 Comments

  1. Navya

    Hello andi,
    Chala baga rasaru..
    Nenu maruvam.blogspot.com lo stories/aritcles chadavadaniki chala try chestunnanu…kani I dont know how to get into that blog…Can you please tell me how to enter into Maruvam.blogspot.com

    1. జ్యోతి

      Maruvan blog is closed by the owner ..

  2. మరువం ఉష

    జ్యోతి,

    కాస్త సంశయం ఏమని వ్రాయాలో తెలియక, కాస్త తటపటాయింపు (ఇతర పరిచయాల దృష్ట్యా) నేను ఈ గౌరవానికి తగుదునా అని 🙂 ఇన్నాళ్ళు ఆగాను. ఒక మాటైన వ్రాయనిదే మనసాగదని..

    నాలోని నన్ను నాకు పరిచయం చేసినట్లున్న ఈ వ్యాసానికి, ఈవిధంగా మరింత ప్రోత్సాహాన్ని కలుగజేసిన నీకు, వ్యాఖ్యల ద్వారా అభిమానాన్ని పంచి, ఇంకా వ్రాయాలి ఇంకేదో వ్రాయాలి అనిపింపజేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

    మీ,
    మరువం ఉష.

  3. బొల్లోజు బాబా

    వ్యాసం బాగుంది.
    అభినందనలు.

  4. భావన

    చాలా బాగుంది జ్యోతి. చక్క గా పరిచయం చేసేరు (బాగా చెయ్య చేసుకున్నారు).. అర చేతి కంకణానికి అద్దమెందుకు కాని ఈ అద్దం ఆ కంకణం ని నగిషీలను మెరుపులను ఎంతో వివరం గా చూపిస్తుంటే ఈ అద్దమే ఎంతో సుందరం గా వుంటే (మీ రచనా శైలి) మెచ్చుకోక తప్పటం లేదు ఇద్దరినీ కూడా.. 🙂

  5. Srilalita

    మరువపు గంధం అందంగా అద్దారండీ..

  6. లలిత

    ఉషగారి ని తాకిన మీ చేతికి, మరువం పరిమళం అబ్బినట్టుంది . అందుకే మీ వ్యాసం కూడా గుభాళిస్తుంది .

  7. padmarpita

    చాలా బాగా విశ్లేషించారండి…….

  8. sujji

    Well said abt a good blogger. 🙂

  9. తృష్ణ

    చాలా బాగుందండీ పరిచయం…ఎదుటి మనిషిలోని ప్రతిభను నిస్వార్ధంగా మెచ్చుకునే మీ మంచి మనసుకు మరోసారి అభినందనలు.

  10. జ్యోతి

    భాస్కర్ గారు,
    ధన్యావాదాలు. సరిచేసాను.నిజమే మరికొంత పరిచయం చేయాల్సింది.కాని నిడివి పెరుగుతుందని సంశయించాను..

  11. కొత్తపాళీ

    మంచి ప్రతిభావంతురాలైన మన బ్లాగ్ కవయిత్రిని చక్కగా పరిచయం చేశారు

  12. భాస్కర రామిరెడ్డి

    చిన్న సూచన… కొన్ని టైపాట్లు
    కవితావాహిణి
    వీక్శించి
    వసంతాగమణంతో

    ఇక నా మాట

    ఇంకొన్ని పరిచయం చేసుంటే బాగుండేదేమో. అనంత వాహినిలా సాగిన తన రచనలలో అన్నీ ఈ కవితారాణి సిగలో మొలచిన మరువపుకొమ్మలే. అందులో మొదటి వరుసలో నిలిచే కవితలే అన్నీ.

    ఆ వన్నె ఈ వన్నె నడుమ నడిచేది జీవితం
    తెలుపు దాచిన రంగులు, నలుపు దోచిన రంగులు

    అన్నా

    జల్లుజల్లుగ, పరవళ్ళుగా, వురవళ్ళుగా పుడమినంత తడిమి తడిమి
    తన తనువంతా చల్లబరిచి, తపనతీర్చి, తాపమణిచి స్తబ్దమౌనా సైన్యం.

    లేదా

    తల్లి స్తన్యమీయనంటే ఎన్ని గొంతులు గగ్గోలు పెడతాయో!
    తల్లివంటి మగువ చనులు ఎన్ని కనుల వేటకి బలౌతాయి?

    ఆ మరువపు వాణి కే చెల్లు.

  13. చిలమకూరు విజయమోహన్

    నాకు కూడా కవితలపైన అంత ఆసక్తి ఉండేది కాదు.తన కవితలను చదివింపజేసి కవితలపై నాకు ఆసక్తిని మొదట పెంచినవారు ఉషగారు. పరిమళం,భావన,భాస్కర రామిరెడ్డి,ప్రదీప్,ఆత్రేయ,పద్మార్పిత,వరూధిని గార్ల కవితలు వాటిపై ఇష్టాన్ని పెంచాయి. thanks…

  14. kalpana

    Jyothy,

    Maruvam Usha gari kavitala gurimchi mee vislEshana chaalaa chakkagaa vumdi.amta mamchi kavitalu raasina mana maruvam Usha gaari kalam numdi marinni mamchi kavitalu raavaalani aasistoo….

    Kalpana

Leave a Reply