కవి చలం…వజీర్ రెహ్మాన్ అద్దంలో…!

రాసి పంపిన వారు: కల్పన రెంటాల
*************************
మీకు బాగా నచ్చిన కవి ఎవరూ? అంటే కవిత్వ అభిమానులు, ప్రేమికులు ఎవరైనా ఠక్కున కనీసం ఓ పదిపేర్లు చెప్పగలరు . ఆ పదిపేర్లు ఫలానా వారివే అయివుండనక్కరలేదు. ఎందుకంటే అది వారి వారి అభిరుచిని బట్టి వుంటుంది కాబట్టి. నేను చెప్పే పది పేర్లలో తప్పనిసరిగా వుండే రెండు పేర్లు –ఒకటి చలం, రెండోది వజీర్ రహ్మాన్. చలం కవా? అని ఇప్పటికీ కొందరు అశ్చర్యపోతుంటారని నాకు తెలుసు. ఆ మాటకొస్తే మీరు కవి అని వజీర్ రహ్మాన్ చెప్పేటప్పటికి చలమే బోలెడంత ఆశ్చర్యపోయారు.

kavichalamచలం వచనం కవితాత్మకం అని వేరే చెప్పక్కరలేదు. మొదటి సారి చదివిన కొత్త పాఠకుడు కూడా వెంటనే చలం కవితాత్మకతని గుర్తు పడతాడు. అసాధారణమయిన మ్యూజింగ్స్ మొదలుకొని సాధారణమయిన గల్పికలూ, వ్యాసాల్లో కూడా చలం కవి అనుకోడానికి తగినన్ని దాఖలాలు దొరుకుతాయి. అవి కాక, శ్రీ శ్రీ, పఠాభి లాంటి కవుల గురించి చలం రాసిన వాక్యాల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. కవుల మీద గొప్ప ప్రేమా, తీవ్రమయిన కోపం – రెండూ కనిపిస్తాయి.ఎంతో మంది కవులే అనువాదం చేసినప్పటికీ, టాగూర్ గీతాంజలి చలం అనువాదంలోనే చదవాలని అనిపిస్తుంది. అదీ చలం వచనం ప్రత్యేకత.

చలం ది కవిత్వం లో కూడా భిన్నమైన దారే. సామన్యంగా ఆధునిక తెలుగు కవులు అనేకమంది కవిత్వాన్ని వచనంలో రాస్తారు. కానీ వచనంలో కవిత్వం రాయడం చలం ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను గుర్తు పట్టి ప్రత్యేకంగా కవిగా చలాన్ని పరిచయం చేసిన హృదయమున్న వ్యక్తి వజీర్ రహ్మాన్.

చలం శతజయంతి సందర్భం గా 1994 లో శతజయంతి సంఘం వారు వేసిన ఈ పుస్తకం అపురూపమైంది. ఎందుకంటే చలం కవిత్వంతో పాటు చలం వి వివిధ దశల్లో తీసిన అపురూప ఛాయాచిత్రాలున్న పుస్తకం ఇది. అంటే కవితలతో ఫోటో ఆల్బం అన్న మాట.

చలం కవిత్వ నిషాకి మచ్చుకి కొన్ని పంక్తులు…

‘వానరాత్రి ‘ లో ఏమంటారో చూడండి…

ప్రపంచాన్ని తుడిచేద్దామన్నట్లు వీస్తోంది గాలి/నల్లని రాత్రి ఇంకా నల్లని
మబ్బు వస్త్రాలు కప్పుకుని ఏడుస్తోంది/
హోరుమని అరుస్తో వాన/తలుపులు మూసి దీపం వెలిగించుకున్న/వాన లోపలికి వస్తానని పంతం పట్టి
తలుపు మీద ఈడ్చి కొడుతోంది–/తెరవమని/కొంచం మర్చిపోతుంది,
మళ్ళీ నేను గ్యాపకం వొస్తాను గావును/దబదబా బాదుతుంది;
నా విరహ బాధని ఈ రాత్రిలో కలిపెయ్యలేను?

చదువుకుని ఆ అనుభూతిని స్వానుభవిచటం తప్ప వివరణలు, వ్యుత్పత్తి అర్ధాలు అక్కర్లేని, సూటిగా మాట్లాడే కవిత్వం చలానిది.
ప్రేయసి అన్వేషణ గురించి ఏ రాసుకున్నారో చూడండి…

నీవు రావు/నన్ను పోనీవు!
మరల్చి మత్తెక్కించి/స్వప్నాలతో లాలించి/మధురగానాలతో వూగించి/ప్రపంచానికి వ్యర్ధుణ్ణి చేసావు!/
అనాదిగా విన్న నీ పిలుపు/స్వప్నంలో అనుభవించిన /నీ కుంతల కొనల స్పర్స/
ఏ యుగాల ఆవలి తీరానో/ సం యోగమనే వాగ్దానం /
ఇంతే నాకు/మిగిలిన ఆశలు!/ప్రియా!/
యోగులు హృదయంతో / వెలిగించుకునే కాంతి- నీ చిరునవ్వు;/
నాకెట్లా దొరుకుతుంది?

మల్లెపూల గురించి చలం తమకం చదవండి…

అర్ధరాత్రులు విచ్చి/ జుట్టు పరిమళంతో కలిసి/ నిద్ర లేపి/ రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు/
సన్నని వెన్నెట్లో/ ప్రియురాలి నుదుటి కన్నా తెల్లగా/ ఏమి చెయ్యలో తెలీని ఆనందంతో/గుండె పట్టి చీలికలు చేశే మల్లెపూలు/
తెల్లరకట్ట లేచి చూసినా/ఇంకా కొత్త పరిమళాలతో /రాత్రి జ్ఞాపకాలతో/ప్రశ్నించే మల్లెపూలు/
అలిసి నిద్రించే రసికత్వానికి/జీవనమిచ్చే ఉదయపు పూలు/ రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా/అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు! మల్లెపూలు!!

చలం ‘ విరహం’ అనుభూతించండి…

ప్రియుడి రత్యాలింగనం తర్వాత/సంతుష్టి చెందిన ముఖం వలె/గాలిలోని కొత్తని చల్లదనం/
శరీరం మీద తగిలి/హృదయంలోకి దూసుకుపోతోంది/
నిద్ర కమ్మిన కన్ను వలె/వొక్క నక్షత్రం మెరుస్తోంది/
ఈ గోలలొ గాలిలో, పాపం/ఏదో పిట్ట లేచి అరుస్తోంది/చప్పున గాలి ఆగింది/
నది కూడా నిశ్శబ్దమైంది చచ్చిపోయినట్లు/చీకటి నిశ్శబ్దం/నువ్వే లేవు!

చలం కవిత్వాన్ని గురించి మనం ఆస్వాదించి ఆనందించటం సరే. ఆయనే ఏం చెప్పుకున్నారో చూడండి ‘ చలం రాయని “పీఠిక” లో…

వజీర్ రహ్మాన్ గారికి,

మీరు పంపిన గీతలు, ఆ selections అన్నీ కూడా చాలా బావున్నాయి. కొన్ని ఎక్కడివో నేను గుర్తించలేకపోయినాను.
మొదట అవేవో మీరు రాశారనుకున్నాను. ఎవరీ గొప్ప కవి? అని ఆశ్చర్యపడ్డాను. కొంచం దూరం చదివితే గాని, అవి నేను రాసినవని తెలీలేదు. చదువుతున్న కొద్దీ ఇంత గొప్ప కవిత్వం నేనేనా రాశింది అని ఆశ్చర్యపడ్డాను.

ఆ గీతాలు ఎవరివైనా కానీ, అట్లాంటివి ఏ సహృదయుడైనా ఆరాధించవలసిన విలువ గలవి. కాని ఇన్నేళ్ళూ ఎవడు చూశాడు? వాటి రచయతే గుర్తించలేదు వాటి విలువని- ఇన్నేళ్ళకు మీరు జన్మించి, గుర్తించి, సేకరించి, ఎత్తిచూపిందాకా!

తనలో కవిత్వమున్నదని తెలుగువాడు చలానికే తెలీదు.

మల్లెపూల పైన నేను రాసిన Musings కవిత్వంతోనూ, తత్త్వంతోనూ కూడినవని నాకు తెలుసు. ఎవరైన ఇంకొకరు గుర్తిస్తారెమోనని ఆశించేవాణ్ణి. Musings లో మెచ్చుకునేవాళ్ళలో ఒక్కరూ వాటిని ప్రత్యేకంగా మాట్లాడలేదు.ఒక్క రుక్మిణీనాధ శాస్త్రి గారు ఒకసారి passing గా ” చాలా కవిత్వముందండీ; ” అన్నారు, మరి నా హృదయం మీ ఒక్కరికే తెలీడం ఎట్లా జరిగింది?

-చలం

చలం కవిత్వం గురించి వజీర్ రెహ్మాన్ ఇలా అన్నారు:

‘చలాన్ని త్రావి
నిషాలో వున్నాన్నేను-
ముట్టకు
మెరుపై జ్వలిస్తాను!
తట్టకు
ఉరుమై ధ్వనిస్తాను ‘

-వజీర్ రహ్మాన్

ఔను చలం ! ఔను సుమా,
ఔను నిజం నీవన్నది;
నీవన్నది, నీవన్నది,
నీవన్నది నిజం, చలం !
(శ్రీశ్రీ కృతి, శృతి లో)

అగాధం లోంచి బైలుదేరే
నల్లని అలలు మొహాన కొట్టి,
ఉక్కిరి బిక్కిరై,
తుఫాను హోరు చెవుల్లో గింగురుమని,
నమ్మిన కాళ్ళ కింద భూమి దొలుచుకుపోతో వుంటే
ఆ చెలమే నయమని
పరిగెత్తి వస్తా ‘రన్నాడు
చెలం.


‘ అవును,
చెలం వచనాన్ని గీతాలుగా కత్తిరించి
వొడ్డించుకుంటారు కూడా ‘
అన్నాడు వజీర్ రహ్మాన్, వెనక.

విన్న మిత్రులు కాచుక్కూచున్నారు.
ప్రధ్వానం వినబడకపోగా చివరికి రహ్మానే తెగించి
తెలుగు వాంగ్మయాన్ని చెలం గీతాలతో వూగించే
బాధ్యత స్వీకరించాడు.
ఫలితం గా ఈ సమర్పణ.
కవితా ధ్వజాన్ని చేదాల్చి
పాతగోరీల కేసి మొహాలు తిప్పుకుని కూచున్న
వాంగ్మయ పీఠాధిపతుల
నడ్డి విరగ్గొట్టాల్సిన చెలం,
ఎంచాతనో విరమించుకుని;
కృష్ణశాస్త్రిని క్షమించి,
శ్రీశ్రీ ని ఆశీర్వదించి,

వెనక్కి మరలి వచనంలోకి వెళ్ళిపోయాడు.
అంచాతనే కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ బ్రతికి వున్నారు,
నేటికీ మనలో
చెలం
తెలుగులో ‘ కవిత్వం ‘ పేరుతో
ఏమీ వ్రాయ
నిరాకరించడం,
వీరిద్దరనీ రక్షించే ఆలోచనో,
లేక తన వచనానికే గోలెత్తిన తెలుగు దేశం
కవిత్వానికి తట్టుకోలేదనో–
తెలీదు.
చెలానికి సంబంధించిన చాలవిషయాలకి మల్లే
ఇదీ ఇంకా అజ్ఞాతంగానే వుండిపోయింది.
ఐనా,
కవిత్వమనే పేరుతో గాకపోయినా, రాసిన వచనమే
చాలు,
చెలాన్ని ‘ మహాకవి ‘ గా
పరిగణించేందుకు.
(కాని,
చెలం గారూ,
ఠాకూర్ అన్నట్లు–
you live alone and unrecompensed
because
they are afraid of
your great worth!)
—వజీర్ రహ్మాన్

చలం కవిత్వమంతా ఆయన అంతరంగ చిత్రాలు –వాటికి బాహ్య రూపాన్ని చిత్రించే ఛాయాచిత్రాలు –రెంటి ఆత్మల్ని అందిపట్టుకొని మనకందించిన సహృదయుడు వజీర్ రహ్మాన్. వజీర్ రహ్మాన్ కవిత్వం గురించి మారో సారి మాట్లాడుకుందాం…

You Might Also Like

14 Comments

  1. Sharabo

    కల్పనా గారు ‘ఎచటికి పోతావీ రాత్రికి, సాహసి ఈ రెండూ పంపగలరా ?ఎవరైనా వజీర్ రెహ్మాన్ గారి ‘కవి చలం’ పంపగలరా ?

  2. VVS Rao

    Excellent contribution

  3. బొల్లోజు బాబా

    kalpanagaariki

    that book is around 110 pages madam.

    if you give me two or three days time i will send some of the pages (as you asked, those liked most) to you madam.

    btw i donot have your mail id. it is also not seen in your blog.
    may i be contacted pl.

    bollojubaba

  4. kalpana

    bhaavaana,

    urgent gaa aa pustaakaalu paTTukoni iTu Austin vachceyamdi. happy gaa poetry reading pettukumdaamu.

    kalpana

  5. kalpana

    Baabaa gaaru,

    saahasi koodaa chinna book kadaa. scan chesi naaku pampaTam avutumdaa? lEdaa mottam kaakumDaa meeku nachchinavi konni ayinaa sarE…vajeerahman kavitallO bhinnatvam choopaTaaniki.

    Kalpana

  6. బొల్లోజు బాబా

    kalpana gaaru

    yes i am having sahasi by vazir rehman, madam.
    i read long back echatiki potaaveeraatri.

    bollojubaba

  7. kalpana

    మైత్రెయి గారు,

    పుస్తకం 1994 లో మొదట ప్రచురితమైంది. కాపీలు ఇంక విశాలాంధ్ర లో దొరుకుతాయనే అనుకుంటున్నాను. లేదంటే మీకు చలసాని ప్రసాదరావు గారు తెలిస్తే ఆయనను సంప్రదించవచ్చు.

    బాబా గారు,

    మీ దగ్గర సాహసి వుందా? నా దగ్గర చదివి చదివి జీర్ణమైపోయిన ఎచటికి పోతావీ రాత్రి ఒక్కటే వుంది.

    సౌమ్య,

    నేనేం చేస్తానో చెప్పనా? ఈ సారి వజీర్ రహ్మాన్ గురించి రాసే వ్యాసంలో ఇంకో కవి పేరుతో ముగిస్తాను. అలా అప్పుడు మీరు డిమాండ్ చేస్తూ వుండటం, నేను రాస్తూ వుండటం బావుంటుంది కదా!

    కొత్తపాళి,
    రావిశాస్త్రి గారి వచనంలోని కవిత్వం అంటే మాలతి గారిని అడగాల్సిందే. సౌమ్య, note this point.

    నిషిగంధ,

    నాకు కూదా చలం ఇంకా ఇంకా రాసి వుండాల్సింది అనిపిస్తు వుంటుంది.

  8. Bhaavana

    కల్పనా.. వావ్.. ఇప్పుడే ఉషా చెపితే ఇటు వెళ్ళమని వచ్చాను. రెండు నిజం గా రెండంటే రెండే రోజుల కితం పుస్తకాలు సర్దుకుంటు ఈ పుస్తకం తీసి చదువుకున్నా… ప్రేమలేఖలు, మ్యూజింగ్స్ ఒక్క సారి చెంపల్ని నిమిరి, తప్పు తప్పు ఈదుగురు గాలులల్లే కొట్టి కవితాగుండాలలో (సుడిగుండాలకు ప్రత్యమ్నాయం) తిప్పి తిప్పి మల్లెల కుప్పలను మీద పోసి విరుల వానలను గంధాల గాలి తో కలిపి హేమంతాల గాలి వూళ లలో కలిపి చిత్ర విచిత్రాలు చేసింది, ఇంతలోనే మీరు మళ్ళీ ఇలా తోసేస్తారా నన్ను ఆ కవితా గుండం లోకి… అన్యాయం.. నా దగ్గర రెండు పుస్తకాలు వున్నాయి ఇక్కడ అమెరికా లో ఎవరికైన చాలా అర్జెంట్ గా చదవాలని అనిపిస్తే నాకు చెప్పండి నేను పంపుతాను ఆ పుస్తకం. వజీర్ రెహ్మాన్ గారికి చలం గారికి రాసిన వుత్తరాల పుస్తకం లో కూడా చాలానే కవితలుంటాయి. ఆయనకు, సత్య ప్రసాద్ గారికి ఎక్కువ డీప్ గా రాసినట్లు వున్నారు ఆయన వుత్తరాలు ( ఇంక దీక్షితులు గారిని రుక్మిణీ నాధ శాస్త్రి గారిని పోల్చటం లేదు అవి వేరే అని) చాలా సంతోషమండీ మంచి పుస్తకం పరిచయం చేసేరు, అందులో ఆయన పిక్చర్స్ కూడా చాలానే వుంటాయి కదా.. నాకు ఆ ఆవు పక్కన కూర్చున్న పిక్చర్ ఇష్టం..

  9. నిషిగంధ

    అరుదైన పుస్తకాన్ని పరిచయం చేశారు, ధన్యవాదాలు.
    చలం అంటే మైదానం లేకపోతే మ్యూజింగ్స్ అనుకునేవాళ్ళే ఎక్కువ.. ఆయన పుస్తకాలు చదివేప్పుడు అనుకునేదాన్ని, ‘ఈయన కవిత్వం ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు ‘ అని… ‘కవి చలం’ చదివిన తర్వాత మాత్రం ఇంకొన్ని కవితలు రాసి ఉంటే బావుండేదే అనిపించింది!

  10. కొత్తపాళీ

    చాలా బాగుంది.
    వచనంలో కవిత్వాన్ని పండించిన కృషీవలులు ఇద్దరు – ఒకరు చెలం, మళ్ళి తరవాత రావిశాస్త్రి.
    వజీర్రహమాన్ గారి గురించి కూడా చెప్పండి.

  11. సౌమ్య

    చలం మ్యూజింగ్స్ చదివినప్పుడు అనుకున్నాను – భలే పొయెటిగ్గా ఉన్నాయే అని..కొన్ని చోట్ల. నిన్న పురూరవ రేడియోలో వింటూ…మళ్ళీ అనుకున్నాను. ఈ వ్యాసం చదివినప్పట్నుంచీ ఒకే విషయం అడగాలనిపిస్తోంది – వజీర్ రెహ్మాన్ గురించి, ఆయన కవిత్వం గురించి మరిన్ని వివరాలు ఎప్పుడు చెప్తారు అని 🙂

  12. బొల్లోజు బాబా

    మంచి పరిచయం.
    చలం వచనం అమృతప్రాయం అయిందంటే కారణం అందులోని కవిత్వమే. దాన్ని స్టైల్ స్టైల్ అని వర్ణించారు వజీర్ రెహమాన్ వచ్చి అది కవిత్వం అని చాటి చెప్పేదాకా.

    మ్యూజింగ్స్ లో ప్రతీ పేజీకో పది నానీలు (ఈనాటి క్లుప్త కవితా ప్రక్రియ) ఏరుకోవచ్చు.

    ఇప్పటి తరం చలం సాహిత్యంలోని తర్కాలజోలికిపోకుండా అందులోని కవిత్వాన్ని దర్శిస్తే చలం ఎంతగొప్పో తెలుస్తుంది.

    అన్నట్టు రెహమాన్ గారు చలంగారి అల్లుడు, ఇస్మాయిల్ గారి తమ్ముడు. ఈయన “ఎచటకి పోతావీరాత్రి”, “సాహసి” అని రెండు కవితా సంకలనాలని వెలువరించారు.

    బొల్లోజు బాబా

    1. Krishna veni

      ‘వానరాత్రి ‘ లో ఏమంటారో చూడండి…

      ప్రపంచాన్ని తుడిచేద్దామన్నట్లు వీస్తోంది గాలి/నల్లని రాత్రి ఇంకా నల్లని
      మబ్బు వస్త్రాలు కప్పుకుని ఏడుస్తోంది/
      హోరుమని అరుస్తో వాన/తలుపులు మూసి దీపం వెలిగించుకున్న/వాన లోపలికి వస్తానని పంతం పట్టి
      తలుపు మీద ఈడ్చి కొడుతోంది–/తెరవమని/కొంచం మర్చిపోతుంది,
      మళ్ళీ నేను గ్యాపకం వొస్తాను గావును/దబదబా బాదుతుంది;
      నా విరహ బాధని ఈ రాత్రిలో కలిపెయ్యలేను?

      చదువుకుని ఆ అనుభూతిని స్వానుభవిచటం తప్ప వివరణలు, వ్యుత్పత్తి అర్ధాలు అక్కర్లేని, సూటిగా మాట్లాడే కవిత్వం చలానిది.
      ప్రేయసి అన్వేషణ గురించి ఏ రాసుకున్నారో చూడండి…

      నీవు రావు/నన్ను పోనీవు!
      మరల్చి మత్తెక్కించి/స్వప్నాలతో లాలించి/మధురగానాలతో వూగించి/ప్రపంచానికి వ్యర్ధుణ్ణి చేసావు!/
      అనాదిగా విన్న నీ పిలుపు/స్వప్నంలో అనుభవించిన /నీ కుంతల కొనల స్పర్స/
      ఏ యుగాల ఆవలి తీరానో/ సం యోగమనే వాగ్దానం /
      ఇంతే నాకు/మిగిలిన ఆశలు!/ప్రియా!/
      యోగులు హృదయంతో / వెలిగించుకునే కాంతి- నీ చిరునవ్వు;/
      నాకెట్లా దొరుకుతుంది?

      మల్లెపూల గురించి చలం తమకం చదవండి…

      అర్ధరాత్రులు విచ్చి/ జుట్టు పరిమళంతో కలిసి/ నిద్ర లేపి/ రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు/
      సన్నని వెన్నెట్లో/ ప్రియురాలి నుదుటి కన్నా తెల్లగా/ ఏమి చెయ్యలో తెలీని ఆనందంతో/గుండె పట్టి చీలికలు చేశే మల్లెపూలు/
      తెల్లరకట్ట లేచి చూసినా/ఇంకా కొత్త పరిమళాలతో /రాత్రి జ్ఞాపకాలతో/ప్రశ్నించే మల్లెపూలు/
      అలిసి నిద్రించే రసికత్వానికి/జీవనమిచ్చే ఉదయపు పూలు/ రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా/అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు! మల్లెపూలు!!

      చలం ‘ విరహం’ అనుభూతించండి…

      ప్రియుడి రత్యాలింగనం తర్వాత/సంతుష్టి చెందిన ముఖం వలె/గాలిలోని కొత్తని చల్లదనం/
      శరీరం మీద తగిలి/హృదయంలోకి దూసుకుపోతోంది/
      నిద్ర కమ్మిన కన్ను వలె/వొక్క నక్షత్రం మెరుస్తోంది/
      ఈ గోలలొ గాలిలో, పాపం/ఏదో పిట్ట లేచి అరుస్తోంది/చప్పున గాలి ఆగింది/
      నది కూడా నిశ్శబ్దమైంది చచ్చిపోయినట్లు/చీకటి నిశ్శబ్దం/నువ్వే లేవు!

      చలం కవిత్వాన్ని గురించి మనం ఆస్వాదించి ఆనందించటం సరే. ఆయనే ఏం చెప్పుకున్నారో చూడండి ‘ చలం రాయని “పీఠిక” లో…
      ఈ పొయిట్రీ ఉండే పుస్తకం పేరు చెప్పగలరా

  13. maitreyi

    ఎవండేవండి ., ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పరూ..
    చాల చాల థాంక్స్ అండి ఇటువంటి పుస్తకం గూర్చి ఇంత బాగా చెప్పినందుకు..

Leave a Reply