అడవి తల్లి ఒడిలో బంకట్ లాల్ వనాంజలి

వ్యాసకర్త: రాథోడ్ శ్రావణ్

*****

అడవి గిరిజనుల సంబంధం తల్లి బిడ్డల సంబంధంలాంటిది. తరతరాలుగా అడవి తల్లి గిరిజనులకు జీవనాధారం అవటం వల్ల సాంస్కృతిక సంబంధాలు కూడా పెంపొందించబడ్డాయి. అడవి తల్లి మీద ఆత్మీయ భావంతో  “కైతికాలు వనాంజలి” పేరుతో శతాధిక పద్యాలు లిఖించిన బహు ముఖ ప్రజ్ఞాశాలి, యువకవి, మధురమైన పాటల రచయిత, గాయకుడు, ఉట్నూరు సాహితీ వేదిక అధ్యక్షుడు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్  అడవుల తల్లి  ఆదిలాబాద్ జిల్లాలోని  ఉట్నూరు మండలం హస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో  శంకర్ తాండాలోని శ్రీమతి/ శ్రీ హరి జాదవ్ దేవికి బాయిలకు  23 ఏప్రిల్ 1978లో జన్మించారు.ప్రస్తుతం రాంనగర్ పాత ఉట్నూర్ లో స్థిరపడ్డారు.

 పాటలంటే ప్రాణం:- తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆదిలాబాద్ జిల్లా  ఏజెన్సీ ఉట్నూరు ప్రాంతంలో అనేక సభల్లో పలు వేదికలపై తనదైనశైలిలో  కోకిలమ్మ రాగంతో పాటలు పాడి అందరి మన్ననలను పొందినారు. అందరి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ తెలుగు, హిందీ, లంబాడీ, గోండి, కొలామి, మరాఠీ, మొదలగు భాషల్లో పాటలు పాడుతూ… ప్రభుత్వ పథకాలైన తెలంగాణకు హరితహారం కార్యక్రమాల్లో మొక్కల ఆవశ్యకత పై సిడిలు ఆవిష్కరించి, అధికారులు, ప్రజాప్రతినిధులు ద్వారా ప్రశంసలు అందుకున్నారు. సామాజిక మాధ్యమం ద్వారా ఏది అందించినా లక్షల మందికి చేరువవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.కవి బంకట్ లాల్ పాటలు జన బాహుళ్యంలోకి వెళ్ళి వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకొని కూర్చున్నాయి.ఇతని పాటలు ప్రేక్షకుల నాలుకల్లో నర్తిస్తునే ఉంటాయనడంలో ఎలాంటి సందేహాం లేదు. జాదవ్  బంకట్ లాల్ అన్న  పేరు విన్నంటనే చాలు ఆణిముత్యాల్లాంటి పాటలు మనముందు వచ్చి మనల్ని రంజింప చేస్తాయి.వృత్తి రీత్యా ఆంగ్ల భాష స్కూల్ అసిస్టెంట్  అయిన బంకట్ లాల్  ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల లక్షటిపెట్ లో విధులు నిర్వహిస్తు తెలుగు సాహిత్యానికి విశేషంగా సేవలందిస్తున్నారు.

సాహిత్యరంగ ప్రవేశం:- 2013 లో ఉట్నూర్ సాహితీ వేదిక ను స్థాపించిన గోపగాని రవీందర్, డా.మెస్రం మనోహర్ వీరు నిర్వహించే సాహితీ కార్యక్రమాలకు ఆకర్షితులై ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో జరిగే కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని తన యొక్క మధురమైన గళంతో కవితలు, గేయాలు, పద్యాలు, పాటలు వినిపించేవారు.వీరి సాహిత్య కృషిని గుర్తించిన సాహితీ వేదిక. ఉట్నూర్ సాహితీ వేదిక ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.ఆ తర్వాత  ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తు, అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో కైతికాలు నూతన తెలుగు ప్రక్రియలో కైతికాలు వనాంజలి -2019 పేరుతో పుస్తకం రచించి ఆవిష్కరించారు.జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్ని తన గళంతో కవితలు, పాటలు వినిపించారు.

వనాంజలిలోని కొన్ని కైతికాలను పరిశీలిద్దాం:-

“దట్టమైన అరణ్యాన

తునికిఆకు సేకరణ 

ఆకలికి ఆసరై 

వన జీవికి ఆదరణ 

వారెవ్వా వన ఆకులో

ఆకలీ తీర్చు ఆపదే”

గిరిజనుల సాధక బాధలను వివరిస్తూపొట్టకూటి కోసంఎండాకాలంలో గిరిజనులు అడవిలో దొరికే  తునికి ఆకులను సేకరించి ఖల్లాదారులకు అమ్మి వచ్చిన డబ్బుతో జీవనం గడిపుతారని భావం.

“చుట్టు ప్రక్కల వనతల్లి

ఊపిరికి శ్వాస గాలి 

కిలకిల పక్షుల లొల్లి 

పులకించు వనమాలి 

వారెవ్వా అడవి

తల్లిసప్తవర్ణాల కల్పవల్లి”

అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపుతూ స్వేచ్ఛమైన గాలికి నిలయం మన వనాలు అని అన్నారు. 

“వనంలో జలపాతానికి

పర్యాటకుల తాకిడి

ప్రకృతిలో అటలాడి

మనమంతా సందడి

వారెవ్వా వన విహారం

మనస్సుకు భలే సంబరం”

అడవుల జిల్లాలో అందమైన జలపాతాలు పర్యాటకులను మైమరపిస్తు అందమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు.

“తాజా ఆకుకూరలు

కంటికగు ఔషధాలు

తినే ప్రతి ఫలాలు

శరీర శక్తికి పోషకాలు

వారెవ్వా కూరగాయలు

మానవాళికి రక్షకాలు”

ఆకుకూరల ప్రాముఖ్యతను వివరిస్తూ కవి వాటి వలన కలిగే లాభాలను తెలియజేశారు.

తెలుగు సాహిత్యానికి విశేషంగా సేవలందిస్తున్న కవన కోకిల జాదవ్ బంకట్ లాల్   2019 నవంబర్ 17న   జాతీయ విశిష్ట ప్రతిభా పురస్కారం, 2019 డిసెంబర్ 10న డా.బి.ఆర్ అంబేడ్కర్ జాతీయ సేవా పురస్కారం,  2019 లో మహాత్మా గాంధీ జాతీయ స్ఫూర్తి పురస్కారం, 2019 లో విశిష్ట కవి రత్న పురస్కారం, 2019లో  కైతిక కవి మిత్ర పురస్కారం, 2020 నవంబర్ 11న గాంధీజీ సాహిత్య రత్న పురస్కారం, 2021 ఏప్రిల్ 4న సాహితీ కిరణం తో పాటు జాతీయ స్థాయి ఉగాది పురస్కారం, 2022 సెప్టెంబర్ 18న 75 తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ గాయకుడు పురస్కారం, 2022 అక్టోబరు 8న  శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కవి రత్న పురస్కారం అందుకున్నారు.

ఈ వనాంజలి పుస్తకంలో మొత్తం 109 కైతికాలు లిఖించారు.మొత్తం 64 పుటాలతో ఉన్న పుస్తక ముఖచిత్రంలో  తీజ్ బుట్టలను నెత్తి మీద ఎత్తుకొని బంజారా గిరిజన మహిళలు చేస్తున్న నృత్యాలకు, కవి స్వయంగా డప్పులు వాయిస్తూ కన్పించే దృశ్యాలు ఆకర్షణీయంగా ఉంది కదా! మరి పుస్తకం కూడా పుస్తక పఠన అభిమానులకు ఆశక్తిని కలిగించే విధంగా ఉంది.  మరెన్నో రచనలు రాయాలని కాంక్షిస్తున్నాను.

వెల:80/-

ప్రతుల కొరకు: జాదవ్ బంకట్ లాల్, ఇం నెం 30-160/2, రాంనగర్, ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా, సెల్ నెం 85006660407

You Might Also Like

Leave a Reply