“నేలను పిండిన ఉద్ధండులు” అనువాద నవలా పరిచయం

వ్యాసకర్త: అనిల్ బత్తుల

******

పొద్దు వాటారుతూంది. మైదానంలో ఎత్తుగా పెరిగిన గడ్డిమీంచి దారికాని దారివెంట కొన్ని పెట్టి బళ్ళు మెల్లగా సాగిపోతున్నయి. విశాల వక్షంగల ఒక బలిష్టుడు బళ్లకు ముందు నడుస్తున్నాడు. ఆయనకి పదడుగులు వెనగ్గా నడచి వస్తున్నాడు – తొమ్మిదేళ్ల కుర్రాడు. వాళ్లు తండ్రీ కొడుకులు.

వాళ్ళిద్దరి వెనుక కొన్ని ఎడ్లు పెద్ద పెట్టి బండి లాక్కొస్తున్నయి. ఆ బండి ఏనాడో విరిగి మూలపడవలసిన బాపతు; పాతడొక్కులా కనిపిస్తూంది. కొయ్యచట్రం కప్పుమీద ఒత్తుగా గొంగళ్ళు కప్పివున్న ఆ బండిలో ఒక సంసారానికి కావలసిన సామగ్రీ – పనిముట్లు, గుడ్దాలు వగైరా వున్నయి. దాని వెనుక వస్తున్న చిన్న బండి నిండా తిండిగింజలు గట్రా వున్నయి. బళ్లు ముందుకు సాగిపోతున్నయి. కొయ్యచక్రాలు ఎడతెగకుండా రోద చేస్తున్నాయి. బళ్ల వెనుక వస్తున్న ఆవు అక్కడక్కడ ఒక క్షణం ఆగి, నోటెడు గడ్డి పీక్కుని నములుతూ నడుస్తూంది. ముందున్న బండికి ముందు అడ్డంగా ఒక చెక్క వుంది. దానిమీద ఒక పక్కగా కూర్చున్న స్త్రీ బండి తోలుతుంది. ఓ చిన్నపిల్ల ఆమె మీదకు వాలి పడుకుని నిద్రపోతోంది. రెండోపక్కన ఓ చిన్న కుర్రాడు -ఏడెళ్ళుండొచ్చు – ఎదటికి సూటిగా చూస్తున్నాడు.

పెర్హంసా కుటుంబం అది. ఆయన పెద్దకొడుకు పేరు ఓల్, భార్య బెరెట్, చిన్నపిల్ల అన్నామేరీ, చిన్నకొడుకు పేరు హాన్స్. పూచికపుల్ల కూడా విడిచిపెట్టకుండా సరంజామా అంతా కట్టుకుని మిన్నెసోటా నుంచి డకోటా ప్రాంతానికి తరలి పోతున్నారు. అక్కడ బంజరుభూమి సంపాదించి దున్నుకుంటూ ఇల్లూవాకిలి కట్టుకుని జీవనం చెయ్యాలని బయలుదేరాడు పెర్హంసా. ఆ కొత్తగడ్ద మీద బంగారం పండించగలనని అతని ధీమా. అక్కడ అలాంటి అవకాశం కావలసినంత వుంది.”

(ఈ అనువాద నవలలోని మొదటి పేజీల వచనం ఇది)

నార్వే నుండి వలసవచ్చి అమెరికాలోని బంజరుభూమిలో వ్యవసాయం చేసి బతుకుదామని వచ్చిన కుటుంబంకథ ఈ నవల. ఇంకో మూడు కుటుంబాలు కూడా వ్యవసాయం చేసి బతుకుదామని అక్కడకు వలస వచ్చాయి. ఎక్కడ నుండో వూడిపడి ఈ భూమి మాదంటూ బెదిరించే మనుషులు, పండించిన గోధుమ పంటను నిర్థాక్షిణ్యంగా పొట్టన పెట్టుకునే దుర్మార్గమైన మిడతలదండు, స్త్రీ మూలుగుల ఏడుపు, మంచుతుఫానులు, పేదరికం, ఆకలి, ఒంటరితనం, హొం సిక్నెస్, కొత్త నేలలో కొత్త కల్చర్ లో పెరుగుతూన్న పిల్లలు, ఈ అనువాద నవల సాంతం పరుచుకుని వుంటాయి. ఈ నవలలో స్త్రీ కన్నీరు నన్ను తరుచుగా వెంటాడుతుంది.

ఓల్ ఈ రోల్ వాగ్ (Ole Edvart Rølvaag) రాసిన ‘Giants in the Earth‘ అనే నవలను బి.వి.సింగరాచార్య తెలుగులో అనువదిస్తే ఎమెస్కో జూన్ 1981లో మొదటిసారిగా ముద్రించింది. దక్షిణ భాషా పుస్తక సంస్థ (Southern Languages Book Trust – SLBT) సహకారంతో ప్రచురితమైంది. చక్కటి అనువాదం. చదువుతూంటే దృశ్యాలు మన కళ్లముందు బొమ్మ కడతాయి. 1981 తరువాత ఇప్పటి వరకు, ఈ గొప్ప అనువాద నవల (200 పేజీలు) రీప్రింట్ అవలేదు. ఈ నవల ప్రస్తుతం పాత పుస్తకాల షాపుల్లో కూడా దొరకడం కష్టం, కాబట్టి పి.డి.యఫ్ లింక్ ఇస్తున్నాను. ఆసక్తి వున్నవాళ్లు చదువుకోగలరు.

You Might Also Like

One Comment

  1. varaprasad.k

    thank u anil sir. chaalaakaalam taruvaata pustakam net ku vacchaanu. neelanu oindina uddandulu vanti manchi navala chadivinvhaaru. marinni manchi novals andinchandi.goodday.

Leave a Reply