ఆమె .. గెలుపు పాఠం
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
(భండారు విజయ, పి. జ్యోతి లో సంపాదకత్వంలో రూపొంది ఈ నెల 13 న విడుదల కానున్న ‘స్వయంసిద్ధ – ఒంటరి స్త్రీల గాథలు’ పుస్తకం కోసం రాసిన ముందుమాట)
*****
Isolation is a way to know ourselves : కాఫ్కా.
ఏకాంతం వేరు ఏకాకితనం వేరు. ఏకాంతం మనం యేర్పరచుకునేది. ఏకాకితనం సాంఘికంగా సాంస్కృతికంగా యితరులు సృష్టించేది. సంఘ జీవి అయిన వొక మనిషి ‘ఒంటరి’ అంటే ఆ వ్యక్తి సమాజాన్ని తిరస్కరించి అయినా వుండాలి. లేదా సమాజమే ఆ వ్యక్తిని బహిష్కరించైనా వుండాలి.
కుటుంబంలో గాని సమాజంలో గాని యెవరైనా వొక వ్యక్తి అది స్త్రీ అయిన పురుషుడైన వొంటరితనం ఫీల్ అవుతుంటే ఆ కుటుంబంలో ఆ సమాజంలో మానవ సంబంధాలు చాలా బలహీనంగా వున్నాయని అర్థం. ఒంటరితనం కారణంగా యెవరైనా జీవితంలో అవమానాలు గానీ అణచివేత గానీ నిస్సహాయత గానీ యెదుర్కొంటే దాని అర్థం సమాజం ఆ వ్యక్తి పట్ల విఫలమైందని.
ఒంటరితనంలో చుట్టూ వెలితిని అనుభవించేది కొందరు. వెలుతురు నింపుకునే వారు మరికొందరు. ఒంటరితనం కొందరి లోపల శూన్యాన్ని సృజిస్తే మరికొందరికి దాన్ని పూరించుకునే శక్తిని ప్రసాదిస్తుంది.
అందుకే ఒంటరితనం వరమూ శాపమూనూ. బలమూ బలహీనతా. అస్తిత్వాన్ని బట్టీ దాని స్వరూప స్వభావాలు మారతాయి. మనకు మనం దూరమవ్వడమే నిజమైన వొంటరితనం. పరాయీకరణకి మించిన వొంటరితనం మరేదీ లేదు. అది దుర్భరం. తనను తాను కోల్పోయిన ‘పరాయి’ సమూహంలో వుండీ ఒంటరే. ప్రతిఘాత శక్తుల మధ్య ఒంటరి జీవితం కోరుకున్న యెంపిక అయినప్పుడు దాని మీద వొక నిర్మాణం చేయడం నిజంగా సమరమే.
స్త్రీల విషయంలో వొంటరి స్త్రీ అన్నమాట కేవలం పెళ్లితో ముడిపడి వుండటంగానే ప్రచారమైంది. చేసుకున్న పెళ్లి విఫలమవ్వటం విడాకులు తీసుకోవడం భర్త చనిపోవడం కుటుంబంలో సరైన అండ లేకపోవడం వొక పార్శ్వమైతే అసలు పెళ్లే వద్దనుకుని జీవితాంతం స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వుండటం మరో పార్శ్వం. కారణమేదైనా మనల్ని మనం తెలుసుకోవటానికే కాదు మనల్ని మనం నిర్మించుకోవటానికి గానీ పునర్నిర్మించుకుని వున్నతీకరించుకోటానికి గానీ జీవితంలో వొంటరితనానికి మించిన పరికరం లేదు.
అయితే అన్ని కుటుంబ సంబంధాలను మానవ సంబంధాలను తెంచుకోవాలని సామాజిక జీవితాన్ని వదులుకోవాలని అర్థం కాదు. మనుషుల మధ్య నెలకొనాల్సిన ప్రేమానురాగాలు బలంగా వున్నప్పుడు కామ్రేడరీ పెంచుకున్నప్పుడు సౌహార్దం పంచుకున్నప్పుడు ‘ఒంటరి’ పదం అర్ధరహితమే. ఒంటరితనాన్ని గౌరవప్రదమైన యెంపికగా మార్చుకొని అడుగడుగునా యెదురయ్యే వివక్షని అధిగమించి క్షతగాత్రులైనా అలసట యెరుగక సొంతకాళ్లపై నిలబడ్డ విజేతల కథలు గొప్ప స్ఫూర్తి నిస్తాయి.
‘స్వయంసిద్ధ’ కథల్లో స్త్రీలందరూ వొంటరితనాన్ని జయించిన వాళ్ళే. ఒంటరితనం కారణంగా కష్టాలు యెదుర్కొన్న వాళ్ళే. అవమానాలు పొందిన వాళ్లే. అదే సమయంలో వొంటరితనంలోనే నిశ్చింతగా జీవితాన్ని దిద్దుకునే వాళ్ళు తక్కువేం కాదు. ఒంటరితనంలో స్వేచ్ఛని అనుభవించడం పురోగతి. ఆ స్వేచ్ఛని గౌరవించే స్థాయికి సమాజం యెదగకపోవడం అతి పెద్ద దౌర్భాగ్యం.
***
స్త్రీలు యెదుర్కొనే అనేక సమస్యల గురించి స్త్రీలే రాసిన సంకలనాలు గానీ, స్త్రీవాదం థీమ్ నే కేంద్రం చేసుకుని వెలువడ్డ సంకలనాలు (తొలి ‘స్త్రీవాద కథలు’ సంకలనం : సాహితీ సర్కిల్ 1994, దరిమిలా భార్గవీరావు ‘నూరేళ్ళ పంట’ వంటివి) గానీ కొత్తేం కాదు. సాహిత్యంలో జెండర్ స్పృహ – చైతన్యం పెరిగిన తర్వాత మూడు దశాబ్దాల పూర్వం ఓల్గా ‘రాజకీయ కథలు’ దగ్గర్నుంచి యిటీవలి కత్తి పద్మ ‘చీకటి పువ్వు’ వరకు జెండర్ ఆధిపత్యానికి కేంద్రమైన వివాహ వ్యవస్థ వొక విఫల ప్రయోగం అనీ అసమ దాంపత్య సంబంధాల సంసారం పెద్ద హింసపాదు అనీ పదే పదే విప్పిచెప్పిన కథలు అనేకం వచ్చాయి. ఇల్లు కుటుంబం పెళ్లి చివరికి మాతృత్వం … యివన్నీ స్త్రీలను నియంత్రించే భావజాల వ్వవస్థలే. వాటిని ధిక్కరిస్తూ స్త్రీలు వైయక్తికంగానో సామూహికంగానో వేసే ప్రతి అడుగూ పురుషస్వామ్యం బలంగా వేళ్ళూనుకుని వున్న యీ వ్యవస్థల్లో మార్పుకి దోహదం చేసేదే. పెళ్లి వొక శాపమైనప్పుడు యిల్లు ఆధిపత్యాలకు నెలవైనప్పుడు కుటుంబం అణచివేత రాజకీయాలకు కేంద్రమైనప్పుడు వాటిని తెంచుకొని వొంటరి జీవితాన్ని గడిపి ఆ జీవితాన్ని గెలిచిన స్త్రీల గాథలు యెన్నో సాహిత్య మాధ్యమంగా వెలికి వచ్చాయి. జీవించాలన్న తెగువ తెగింపు మాత్రమే జీవితంలో యెదురయ్యే సవాలక్ష ప్రశ్నలకి సందేహాలకీ సమాధానం అన్న బతుకు పాఠాన్ని నేర్చిన/నేర్పిన స్త్రీ పాత్రలు యెందరికో భవిష్యత్తుని దిద్దుకోడానికి భరోసా యిచ్చాయి. ఆ క్రమంలోనే మరో బలమైన అర్థవంతమైన ముందడుగు ‘స్వయంసిద్ధ’.
ఈ సంకలనంలోని కథలన్నీ దాదాపు యథార్థ జీవితాలే. రచయితల వూహల నుంచి పుట్టినవి కావు. అంతమాత్రాన ఘటనలు స్వయంగా అనుభవించినవి కాకపోవచ్చు. కానీ వాటిలో కాల్పనికత పాలు తక్కువ. చాలా కథల్లో స్త్రీల వేదన దాదాపు వొక లాంటిదే. ఒంటరి స్త్రీలుగా బాధితులు యెదుర్కొన్న సమస్యలు వాటి నుంచి బయటపడటానికి చేసిన పెనుగులాట దాన్నుంచి పొందిన విజయాలు అన్నీ వొకలాంటివిగానే కన్పించినప్పటికీ భిన్న సామాజిక నేపథ్యాలు నుంచి భిన్న ప్రాంతాల నుంచి భిన్న సమూహాల నుంచి వచ్చిన కథలు కాబట్టి ఆ మేరకు యెంతో వైవిధ్యం వుంది. అది సాంస్కృతిక విలువల పరంగా కొన్ని చోట్ల వ్యక్తమైతే అరుదుగానే అయినా భాష ద్వారా కూడా స్ఫుటమైంది. స్త్రీలందరూ వొకటి కానట్టే వొంటరి స్త్రీలు అందరూ వొకటి కాదన్న స్పష్టమైన యెరుకతో కూర్చిన కూర్పు యిది. ఆ వైవిధ్యాన్ని కాపాడటానికి సంపాదకులు పడిన శ్రమ ప్రతి పుటలోనూ కనిపిస్తుంది
(ప్రత్యేకంగా కొన్ని కథల్ని పేర్కొనడం నాకు అభిమతం కానప్పటికీ సంకలనంలోని విస్తృతినీ విలక్షణతనీ యెత్తి చూపడానికి స్థాలీపులాకంగా కొన్ని వుదాహరణలు యివ్వక తప్పడం లేదు).
సంప్రదాయపు కట్టుబాట్లలో బందీలైన మధ్య తరగతి స్త్రీల దగ్గర నుంచీ సామాజికంగా ఆర్థికంగా అణచివేతకు గురైన అట్టడుగు సమాజానికి చెందిన బిసి దళిత ఆదివాసీ మైనారిటీ ట్రాన్స్ జెండర్ స్త్రీల వరకు భిన్న వర్గాలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వుండేలా సంకలన కర్తలు జాగరూకత వహించడం వల్ల వొకే వస్తువు చుట్టూ అల్లినప్పుడు కథల్లో సహజంగా చోటుచేసుకునే మొనాటినీని ఛేదించే అవకాశం లభించింది. ఆ విధంగా యీ సంకలనం కథా సాహిత్యానికి విలువైన చేర్పుగా భాసిస్తుంది. లైంగికతకి సంబంధించిన విధి నిషేధాలు విలువలు అన్ని సామాజిక సముదాయాల్లో వొకలా వుండవు. వివక్ష రూపాలు కూడా వొకేలా వుండవు. వాటిని తెంచుకునే రీతులూ వొకలానే వుండవు. ఉదాహరణకి ఎండపల్లి భారతి రాసిన ‘యాపకాయ అంత ఎర్రి’ కథ చూడండి. ఆ కథలో చిట్టెమ్మ అనుభవించిన కష్టాలతోబాటు జీవితాన్ని నిర్వచించుకుని నిర్ధారించుకునే ఆమె స్వేచ్ఛని సైతం రచయిత గొప్పగా ఆవిష్కరించారు. తన జీవితంలో చోటుచేసుకున్న భిన్న సంబంధాల గురించి యెటువంటి కించా లేకుండా చెప్పిన ఆ స్త్రీ కంఠస్వరం నన్నెంతగానో ఆకట్టుకుంది. ఆమెకు జీవితం పట్ల అటువంటి విస్పష్టమైన చింతన యెలా అలవడింది అని అడిగితే కరుడుకట్టిన మధ్య తరగతి పితృస్వామ్య సాంస్కృతిక విలువల దృష్టికోణం నుంచి చూస్తే సమాధానం లభించకపోవచ్చు. జీవితం నుంచి సాహిత్యంలోకి నేరుగా నడిచొచ్చిన పాత్రలే సాహిత్యాన్ని సంపద్వంతం చేస్తాయి.
అలాగే జూపాక సుభద్ర ‘దేవుని పెండ్లం …’ కథలో ఆవిష్కరించిన సమస్య మరింత ప్రత్యేకమైనది. జోగినికి వితంతు పెన్షన్ యివ్వాలంటే ‘బర్త సచ్చిపాయిన కాయిదం తెమ్మనిరి … దేవుడు సచ్చిపోయిండనే కాయిదమెట్లిద్దుము’ అన్న ప్రశ్న మొత్తం వ్యవస్థ పైనే యెక్కుపెట్టినది. వాస్తవ జీవితానికి దూరంగా చట్టసభల్లో సచివాలయాల్లో కూర్చొని పథక రచనలు చేసే పెద్దల బుర్రలకు అందని ఆలోచన అది (ఈ కథ వాస్తవంగా యథార్థ ఘటనే. జోగవ్వ నోట పలికిన ఆ మాటలు పత్రికల్లో రిపోర్ట్ అయ్యాయి). గోగు శ్యామల ‘మూసొడ్డు’ శ్రీ సుధ మోదుగ ‘మార్సెల్ నవ్వింది’ కథల్ని అలాగే నందిగామ నిర్మల కుమారి ‘రత్తమ్మ’ సి. సుజాత ‘ఓ విరామం’ కథల్ని పక్కపక్కన పెట్టి చూసినప్పుడు సంకలనంలోని వైవిధ్యం కళ్ళకు కడుతుంది.
ఈ కథల్లో విల్ పవర్ తో అనుకున్నది సాధించే వరకూ పోరాడిన ‘అవిశ్రాంత’ (తిరునగరి దేవకీదేవి)లున్నారు. బిడ్డ యెదుగుదల కోసం జీవితాల్ని పణంగా పెట్టిన ‘మ ఎక్లీ’ (సూర్యా ధనంజయ్)లున్నారు. స్వీయ జీవితానుభవాలనుంచి నేర్చిన పాఠాలని సాహిత్యంగా మలిచే ‘స్వయం ప్రకాశిత’ (మందరపు హైమావతి)లున్నారు. తాము వెలుగుతూ పదుగురికీ వెలుతురు పంచిన ‘దీపవృక్షాలు’ (వనజ తాతినేని) వున్నాయి. వీటి మధ్య నగరాల్లో వర్క్ ప్లేస్ లో ఒంటరి స్త్రీల పట్ల వివక్ష స్వరూపాన్ని సునిశిత దృష్టితో ఆవిష్కరించిన పి. జ్యోతి ‘గమ్యం’ యీ సంకలనంలో ప్రత్యేకంగా పేర్కోదగింది. కథ రచయిత స్వీయానుభవమే కావచ్చు.. కానీ దాన్ని కథగా మలిచిన తీరు ముచ్చటగొలుపుతుంది. వివక్ష పట్ల స్పందన వేదనగా కాక ఆత్మగౌరవంగా ప్రకటితమైంది. గమ్యంలో ప్రత్యేకించి కథేం వుండదు. జీవితంలో సమాజంలో దైనందిన సమస్యల పట్ల వాటిని పరిష్కరించుకోవడంలో రచయిత ఆలోచనా వైఖరే కథగా పరిణమించింది. దృక్పథం కళకి/ కథకి ఆటంకం అవుతుందని బెంబేలు పడేవారికి యీ కథ మంచి సమాధానం. వాస్తవ జీవితంతో ముడిపడ్డ ప్రాపంచిక దృక్పథమే రచనకు ప్రాణం పోయగలదు అనడానికి ‘గమ్యం’ చక్కటి వుదాహరణ.
పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని యెంచుకున్న ఆధునిక యువతి కథ ‘చిన్న చిన్నవి’ (కూరెళ్ల పుష్పవల్లి) గురించి కూడా యీ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఈ సంకలనంలో నాకు బాగా నచ్చిన యీ కథ నేపథ్యం పి. సత్యవతి ‘పెళ్లి ప్రయాణం’ ని గుర్తు చేసింది. అయితే ‘పెళ్లి ప్రయాణం’ సన్నివేశ బలంతో భావజాల బలంతో మంచి కథగా రూపొందితే ‘ చిన్న చిన్నవి’ తర్కబద్ధమైన సంభాషణ బలంతో ఆధునిక జీవన దృక్పథ బలంతో ఆలోచనీయమైన కథగా తయారైంది. ‘పార్టనర్ వున్నా రిలేషన్ లో వున్నా స్త్రీలు అసంతృప్తితో లేరా’ అన్న నవ్య ప్రశ్న పెళ్లి వేడుకలో మునిగి తేలుతున్నవాళ్ళందర్నీ వొక్కసారి వులిక్కిపడి తమ జీవితాల లోపలికి చూసుకునేలా చేసింది. కానీ జీవితంలో యేదో వొక తోడు అవసరమని సర్దుకుపోయే స్త్రీలే యెక్కువ. నవ్యలాంటి ఆధునిక యువతికి సర్దుకుపోవడం చాయిస్ కాదు. సర్దుకుపోవాల్సిన అగత్యమూ లేదు. తెలిసి తెలిసీ అసమ సంబంధాలోకి వెళ్లి జీవితాన్ని ఇన్వెస్ట్ చేసి ప్రశాంతతని పోగొట్టుకోడానికి యివాళ ఆమె సిద్ధంగా లేదు. చిన్న చిన్న కన్సర్న్స్ కూడా పట్టించుకోని చోట ఎమోషనల్ వొంటరితనాన్ని అనుభవిస్తూ పెళ్లి అనే బంధానికి కట్టుబడి బందీ కానక్కర్లేదు, స్వేచ్ఛని కోల్పోనక్కరలేదని రచయిత ఆశయం కథలో స్పష్టంగా కన్వే అయింది.
అయితే అందరూ అన్నిచోట్లా అంతే స్పష్టంగా వుండలేరు. కుటుంబంలో ఆధిపత్యమే హింసగా పరిణమిస్తుంది అని గ్రహించినా తెంచుకోలేని బాధ్యతలు కొందరిని కట్టి పడేస్తాయి. బాధ్యతలన్నీ తీరాకా మలివయస్సులో బంధనాలనుంచి బయటపడాలని నిర్ణయించుకుని ‘నేను నేనుగా వెలగాలి నా కోసం కూడా వెలగాలి నా జీవితానికి కర్త కర్మ క్రియ నేనే …’ అన్న యెరుక కలగడమే నిజమైన విముక్తి. ఇదే సందేశంతో ముగిసిన శాంతి ప్రబోధ ‘స్టేటస్ సింగిల్’ కథ వస్తుపరంగా కొత్తది కానప్పటికీ నిర్మాణపరంగా బలంగా రూపొందింది. భండారు విజయ ‘ఇడుపు కయిదాలు’ లో సుధలా మధ్యతరగతి మనస్తత్వంతో సమాజం నుంచి యెదురయ్యే అవమానాలకు భయపడి కష్టాలు భరించవాళ్ళే సాధారణంగా తారసపడతారు. అనేక ఘర్షణల తర్వాత గానీ నిర్ణయాలు తీసుకోలేరు. జీవితాలు దిద్దుకోలేరు (అదే కథలో యశోద నాణేనికి వున్న మరో పార్శ్వం).
ఇటువంటివి స్థూలంగా గమనించినప్పుడు సంకలనంలోని కథల్లో యెక్కువ భాగం ప్రధానంగా దాదాపు మూడు అంశాల చుట్టూనే తిరిగాయి –
ఒకటి: స్త్రీలు ఒంటరి కావడానికి కారణాలు
రెండు: ఒంటరితనం కారణంగా యెదుర్కొన్న కష్టాలు
మూడు: దాన్ని అధిగమించి జీవితాన్ని గెలవడం
- మనస్పర్థల వల్ల పెళ్ళి విఫలం కావడం – భర్త చనిపోవడం – భర్త కుటుంబం నుండీ ఆదరణ ఆసరా లేకపోవడం – భర్త వుండీ పెళ్ళయిన దరిమిలా పరాయీకరణ కారణంగా తమను తాము కోల్పోవడం – గృహహింస కారణంగా వివాహ సంబంధం నుంచి స్వచ్ఛందంగా వెలికి వచ్చేయడం – పెళ్ళికి ముందో తరవాతో మోసపోవడం – అసలు పెళ్లే వద్దని ఒంటరి జీవితాన్ని యెంపిక చేసుకోవడం – పెళ్లికి ముందు ఉపాధి కోసం/చదువు ఉద్యోగాల రీత్యా కుటుంబాలకు దూరంగా వుండటం …
- ఎమోషనల్ గా తోడు లేక కుటుంబపరమైన అండ లేక చివరికి సొంత తల్లిదండ్రులు పిల్లలు సైతం స్వార్థం చూసుకొని అర్థం చేసుకోకపోవడం, సామాజికంగా భద్రత లేకపోవడం, లైంగిక వేధింపులు యెదుర్కోవడం, సాంస్కృతికంగా న్యూనతని యెదుర్కొని అవమానాలు అనుభవించడం …
- తమకు నచ్చిన రీతిలో జీవితాన్ని గడపడం. ఒక్కోసారి ఒంటరి జీవితాన్ని యెంచుకోవడమే అంతిమ నిర్ణయం కావొచ్చు లేదా మరో తోడు వెతుక్కోవడం కూడా కావచ్చు (తోడంటే అవసరాలు తీర్చే సంబంధం కాదు; పంచుకునే ఆనందాల కలబోత). కోల్పోయిన స్వీయ అస్తిత్వాన్నీ స్వేచ్ఛనీ తిరిగి పొందడం.
చాలా కథల్లో వొంటరి స్త్రీలు ‘కొంగున నిప్పులు మూటగట్టుకున్నట్లు’, జీవితాల్లో అనుభవించిన దృశ్యాదృశ్య హింసని వర్ణించటం దగ్గర రచయితలు ఆగిపోలేదు. సర్వశక్తులూ వొడ్డి దాన్ని అధిగమించడానికి వారు చేసే ప్రయత్నాలకే యెక్కువ ప్రాధాన్యం యిచ్చారు. సింగిల్ మదర్ గా మోరల్ లీగల్ హక్కుల కోసం పోరాడిన సమీర (తిరుగుబాటు : కోళ్ల సావిత్రీ దేవి) ఇంట్లోనే అత్యాచారానికి గురై లైంగిక జీవితం పట్ల జిగుప్స కలిగి పెళ్లిని కాదని ప్రేమించినవాడితో ఐవిఎఫ్ ద్వారా బిడ్డని కని జీవితాంతం పెళ్లికాని తల్లిగా వుండిపోయిన వసుధ (అనగనగా ఒక అమ్మాయి : రేణుక అయోల) పల్లెల నుంచి నగరాలకు చిన్నా చితకా వుద్యోగాల కోసం నగరాలకు వచ్చి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ అర్ధరాత్రి అపరాత్రి వరకూ కాల్ సెంటర్లో ముక్కూ మొహం తెలీని వాళ్ళ నుంచి అవమానకరమైన అశ్లీల వ్యాఖ్యలు భరిస్తూ స్థైర్యంతో పనిచేసే జబీన్ చందనలు (వియర్డ్ : నస్రీన్ ఖాన్) జీవన పరిమళాన్ని అంగట్లో అమ్ముకుంటూ అవకాశం వస్తే నిప్పులు కురిసే ‘కొండమల్లె’ (బాలబోయిన రమాదేవి)లు కథల్ని తమ చైతన్యంతో దీప్తిమంతం చేశారు.
అందుకే యీ స్త్రీల గొంతులో కొండొకచో దుఃఖపు జీర వుండొచ్చు కానీ దాన్ని మించిన ధిక్కార స్వరం వినిపిస్తుంది. మాటలో బేలతనాన్ని అధిగమించిన దృఢత్వం పలుకుతుంది. ఆలోచనలో నిస్సహాయతని జయించిన సాహసం తొణికిసలాడుతుంది. చూపులో దైన్యాన్ని పారదోలిన ధైర్యం కనిపిస్తుంది.
రెండు చందమామలు (రాంభక్త పద్మావతి) కథ చూడండి (తొంభైల తొలినాళ్లలో వి చంద్రశేఖరరావు రాసిన ఆకాశంలో సగం కథని గుర్తుకు తెచ్చింది): స్త్రీ శరీరం చుట్టూ అల్లుకొని వున్న లైంగికతని నిర్వచించడానికీ బలమైన మానసిక సంఘర్షణ చిత్రణకీ అవకాశం వున్న కథ యిది. కథలో శాంతికి రొమ్ము కేన్సర్. భర్త ఆమె మనసుకి దగ్గర కావడానికి యెన్నడూ ప్రయత్నించలేదు. వాస్తవానికి జబ్బు ఆమెను శారీరికంగా అంతగా కుంగదీయలేదు. ఆమె శరీరానికే తప్ప మనసుకి వొక అస్తిత్వమే లేదన్నట్టు వ్యవహరించిన భర్త ప్రవర్తనే యెక్కువ బాధించింది. కానీ ఆమె రెండిటినీ జయించింది. అంతేకాదు; తనలాంటి బాధితులకు అండగా నిలిచింది. శాంతికి కల్గిన శారీరిక వైరూప్యాన్ని రెండు చందమామలతో పోల్చడమే గొప్ప కవితాత్మకమైన అస్తిత్వ ప్రకటన. కథకి నిండుదనం తెచ్చిన చక్కటి శీర్షిక అది.
ఒంటరి స్త్రీల అనేక జీవన పార్శ్వాలు యీ కథల్లో ప్రస్తావనికి వచ్చాయి. బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, మద్యపానం వంటి సామాజికాంశాలు యెన్నింటినో యీ కథల్లో ప్రత్యేకంగా అధ్యయనం చేయొచ్చు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కీసర గ్రామంలో ఒంటరి శ్రామిక మహిళల గూర్చి చేసిన అధ్యయనంలో గ్రామంలో యెక్కువ మందికి బాల్య వివాహాలు జరిగాయనీ భర్తల తాగుడు వ్యసనం వల్ల చిన్న వయస్సులోనే వితంతువులయ్యారనీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందడం లేదనీ తేలింది. (‘గ్రామాలలో ఒంటరి మహిళలు – దుర్భర జీవితాలు’: సి.విజయ, ఎ.నాగమల్లీశ్వరి, స్త్రీ సంఘటన, జనవరి – మార్చి 2023). ఇటువంటి సమకాలీన పరిస్థితులు యీ సంకలనంలోని కథల్లో ప్రతిఫలించడం గమనిస్తాం.
కడుపునో చంకనో బిడ్డల్ని మోసుకుంటూ వివాహ బంధనాల్ని తెంచుకొని కన్నవారింటికి చేరుకుని అక్కడ కూడా ఆదరణ దొరకక నిజంగానే జీవితంతో ఒంటరి పోరాటం చేసిన స్త్రీలు వున్నారు. తమ వాళ్ళు అనుకున్న మనుషుల మధ్య వొంటరితనం యెంత విషాదం. ఆత్మీయతా అభిమానులకు నిండైన రూపాలుగా వుండాల్సిన మనుషులు ఆర్థిక పరమైన కారణాల వల్లనో cultural taboo వల్లనో అమానుషంగా ప్రవర్తించే సందర్భాలను కూడా రచయితలు ప్రస్తావించారు. పితృస్వామ్య ఆధిపత్య విలువల్లోనే యెదిగి వాటినే వొంటబట్టించున్న స్త్రీలు కూడా తోటి స్త్రీ పట్ల దయారహితంగా ప్రవర్తించే అంశాల్ని నిష్పక్షపాతంగా పేర్కొన్నారు. అందుకు భిన్నంగా వొంటరి మహిళకు అండగా నిలిచి జీవితాన్ని గెలవడానికి ఆసరా యిచ్చిన వ్యక్తులు కూడా యీ కథల్లో తారసపడతారు.
సీనియర్ రచయిత శీలా సుభద్ర దేవి దగ్గర్నుంచి యువ జర్నలిస్టు రైటర్ నస్రీన్ ఖాన్ వరకు… నలభై మంది రచయితలు యీ సంకలనం కోసమే రాసిన కథలివి. వీళ్ళలో కొందరు తొలిసారిగా కథలు రాస్తున్నారు. కథ రాయడంలో పరిపూర్ణమైన పరిణతి కన్పించకపోవచ్చు. కానీ వొంటరి స్త్రీలు జీవితాన్ని గెలవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని తమ కథల ద్వారా అందించాలన్న తపన మాత్రం వారి కలంలో మెండుగా వుంది. అదే యీ కథల సారం. బలం. అయితే సి.సుజాత(ఓ విరామం: ఆడియో మెసేజ్ కథనం), మోదుగ శ్రీసుధ(మార్సెల్ నవ్వింది: టెలీ ప్లే శైలి), కూరెళ్ల పుష్పవల్లి (చిన్న చిన్నవి: దృశ్యం మారని సంభాషణ ప్రధానమైన ఏకాంకిక శిల్పం) వంటి యే వొకరిద్దరో తప్ప యెవరూ ప్రయోగాల జోలికి పెద్దగా పోలేదు. కొత్త జీవితాల్ని కథలోకి కొత్తగా కన్సీవ్ చేయడానికి వాళ్ళు యెంచుకున్న కథన శైలి భాషా వాళ్ళ కథలకి నిండుదనాన్ని తెచ్చాయి. తక్కిన కథల్లో వర్తమానంలో నుంచి గతంలోకి తొంగి చూసే అరిగిపోయిన ఫార్ములానే రచయితలు యెక్కువగా పాటించారు. ఈ మూస టెక్నిక్ వల్ల పాత్రల అంతరాగాల లోపలి పొరల్లో చోటుచేసుకునే ఘర్షణని చిత్రించడానికి పెద్దగా అవకాశం లభించలేదు.
ఒంటరితనం వల్ల కలిగే మానసిక దైహిక సామాజిక క్షోభ స్త్రీలకు మాత్రమేనా మగాళ్లకు వుండదా అంటే సమాధానం ‘నో’ అనే వస్తుంది. కారణం – వాళ్ళకి సంఘబలం వుంటుంది. అయాచితంగానే యెక్కడా లేని సంఘీభావం లభిస్తుంది. ‘పాపం వొక్కడే చేయి కాల్చుకుంటున్నాడు’ వంటి ప్రకటిత అప్రకటిత సానుభూతి వుంటుంది. ఇంకో పెళ్ళికి ఆటంకమయ్యే సంప్రదాయాలకు సడలింపునిచ్చే ధర్మ శాస్త్రాలు వుంటాయి. శారీరక అవసరాలు తీర్చే భోగ వ్యవస్థలు నిర్మితమై వుంటాయి (సూళె బజార్ నుంచి రెడ్ లైట్ ఏరియా వరకూ వాటిని సపోర్ట్ చేసే మార్కెట్ వుంటుంది). చివరికి అర్జున్ రెడ్డి వంటి వారి పర్వర్టెడ్ లైంగిక వ్యక్తీకరణకి సైతం సామాజిక ఆమోదం వుంటుంది.
అందుకు భిన్నంగా వొంటరి స్త్రీల విషయానికి వస్తే అక్కడే బుచ్చమ్మలను ప్రలోభపెట్టే గిరీశాలు వుంటారు. మీనాక్షులకు వలవేసే రామప్ప పంతుళ్లు వుంటారు. పొంచి కాటేసో బహిరంగంగానే చెరబట్టే కీచకాధములుంటారు. ఆంక్షలు విధించి చివరికి పరువు హత్యలు చేసే సొంత కుటుంబ సభ్యులు వుంటారు. అటువంటి సందర్భాల్లో ఆడదానికి ‘అరికాళ్ళ కింద మంటలు’ పుట్టినప్పుడు చల్లార్చుకోడానికి చన్నీళ్ళ చెలమ కావాలి. ఆదరించి అక్కున చేర్చుకునే చెలిమి కావాలి. నీడనిచ్చే ‘తోట’ కావాలి. సాంత్వన అందించే తోడు కావాలి. ధైర్యాన్ని నింపే సమూహం కావాలి. ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరగటానికి అవసరమైన ఆసరా కల్పించే వ్యవస్థలు వుండాలి. విద్య వుపాధి ఆర్థిక ఆలంబన కలగజేసే సదుపాయాలు వుండాలి. సామాజిక భద్రతతో పాటు నైతికంగా భద్రత కలిగించే సంస్కారం మనుషులకు అలవాడాలి. ఇవన్నీ వున్నప్పుడు మరిక వొంటరి అన్న పదానికి అర్థం వుండదు. ఆమె గమనానికి హద్దులు వుండవు.
***
ఆమె.. పిడికిలి బిగించిన ధిక్కారం.
ఆమె.. రూపుకట్టిన ఆత్మవిశ్వాసం.
ఆమె.. గెలుపు పాఠం చెప్పే విజేత.
కానీ యివాళ ఆమె స్వీయ అస్తిత్వ పోరాటం ప్రశ్నార్థకమౌతోంది. ఆమె నడిచే దారుల్ని మూసివేసే కొత్త యెత్తుగడలు రూపొందుతున్నాయి. కెరటాల్లా వువ్వెత్తున యెగసే ఆమె చైతన్యాన్ని అడ్డుకునే చెలియలికట్టలు నిర్మాణమౌతున్నాయి. మధ్యయుగాల నాటి స్మృతులు ఆధునిక చట్టాలుగా కొత్త వేషం కడుతున్నాయి. అత్యాధునిక మనువులు కొత్త అణచివేత సాధనాలకు పదును పెడుతున్నారు. స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనే ప్రాథమిక ప్రజాస్వామిక భావనల్ని తిరస్కరించి పితృస్వామ్య ఆధిపత్య విలువల్ని వున్నతీకరించే సంస్కృతి యిటీవల విస్తృతంగా ప్రచారమౌతోంది. పురాణ పురుష ‘పుంగవుల్నీ’ పతివ్రతా లలామలనూ సాంస్కృతిక ప్రతీకలుగా ఆదర్శీకరించే ప్రణాళికలు తయారయ్యాయి. పురుషుడు రక్షకుడు. పోషకుడు. పాలకుడు. ఆడది అబల. ఇంటిపట్టున యెవరి పంచనో ప్రాపకంలోనో కృతజ్ఞతతో ‘పడి’ వుండాలి తప్పితే ఆత్మగౌరవం ప్రకటించకూడదు. సమానత్వం ఆశించరాదు. హక్కుల గురించి మాట్లాడరాదు. ధర్మ పరిరక్షణ పేరుతో నూతన విధి నిషేధాలు వ్యవస్థీకృతమౌతున్నాయి. ఆధిపత్య సంస్కృతి యిప్పుడు యిళ్ళ నుంచి పార్లమెంటరీ హౌసుల్లోకి ప్రవేశించి రాజకీయం చేస్తుంది. రాజ్యమేలుతోంది.
ఇన్ని సంక్లిష్టతల నడుమ సంఘర్షణల మధ్య యిదిగో ఆధునిక మహిళ ‘స్వయంసిద్ధ’యై చరిత్రని పునర్లిఖిస్తోంది. చదవండి.
హైదరాబాద్, అభినందనలతో..
30 ఏప్రిల్ 2023. ఎ. కె. ప్రభాకర్
Leave a Reply