అమృత సంతానం (అనువాద నవల)

డిట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి

జూన్  62020 (ఇంటర్నెట్‌ సమావేశం)

పాల్లొన్నవారు: ఆరి సీతారామయ్య, వేములపల్లి రాఘవేంద్రచౌదరి, పిన్నమనేని శ్రీనివాస్‌, అడుసుమిల్లి శివ, చేకూరి విజయ్‌, బూదరాజు కృష్ణమోన్‌, నర్రా వెంకటేశ్వరరావు, పిన్నమనేని శ్వేత, మద్దిపాటి కృష్ణారావు, వడ్లమూడి నరేంద్ర ప్రసాద్ 

సమీక్ష: పిన్నమనేని శ్రీనివాస్  

శ్రీ గోపీనాథ్ మహంతి గారు ( 1914-1991) ఒరియా భాష లో 1947 వ సంవత్సరం కోంధ (khonds) తెగ పై రాసిన అద్భుతమైన నవల ” అమృతర సంతాన్”.  1955 వ సంవత్సరం లో ఒరియా భాషకు మొదటి సారిగా ఈ నవల కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాజమండ్రి లోని సరస్వతి ప్రెస్ వారి సహకారంతో కళాప్రపూర్ణ పురిపండా అప్పలస్వామి గారు (1904-1982) తెలుగు అనువాదం ” అమృత సంతానం”  గా 1966 వ సంవత్సరం చేశారు. మొత్తం 101 దళములతో 543 పేజీలు గల ఈ నవల మొదటి 100 పేజీలు కాస్త మెల్లగానే చదవవలసి వచ్చింది. మనకి(తెలుగు వారికి) పరిచయం లేని పేర్లు, నాగరికత కు వారి పరిస్థితులకి  అలవాటు పడటానికి కొంచెం సమయం పట్టింది. కానీ ఒకసారి అలవాటు పడినాక అడవి, దానిలో ఋతువులు మనలని అందులో మనలని కలిపేసుకునే వర్ణనలల్తో జీవితాంతం ఆ మనోదృశ్యాలు మనలో ఉండిపోయె లాగా చదివింప చేసే పుస్తకం. నవల మొత్తం కొండ జాతుల వారి సుఖ దుఃఖాలు, వారి జీవన విధానము తో ఏ పాత్ర స్వభావం దానిదే అన్నట్లు  ఉండి ఎక్కడా తెచ్చిపెట్టుకున్న శైలి లేదు. పురిపండా వారి అనువాద నైపుణ్యం చాలా చోట్ల ఎంతో  చిన్న వాక్యాల తో గుండెల్ని పట్టి ఊపి వేసే నేర్పు కనపడుతుంది. కానీ అనువాదం చేసిన పద్దతి అంతా ఒకే పంధా లో జరిగినట్లు అనిపించలేదు. కోదు ప్రాంతపు పేర్లు, ప్రాంతాల పేర్లు నవల్లో వి వాడినా కొన్ని చోట్ల అనువాదం చేసిన వాక్యము కొన్ని చోట్ల సరిగా జరిగినట్లు అనిపించలేదు. 

ఉదాహరణకి కొన్ని మాత్రమే –
కొన్ని చోట్ల “మిణి ఆకా” ( పేజీ  216) అని కొన్ని చోట్ల “మణి ఆకా” (పేజీ 7) రాశారు . 
పేజీ 47 – పూయి కి పూబిలి ఆడపడుచు అవుతుంది. తోడి కోడలు అని వ్రాసారు. 
 ఈ నవల చదవక ముందు కోదులు అనే పేరు,  కోదు తూరుపు కొండలలో నివసించే కోయ జాతి వాడు. గిరిజనుడు. అని ఒక అభిప్రాయం మాత్రమే ఉంది మాలో అందరికి. అయితే ఈ పదాలతో మనకు తలపుకు వచ్చే మనిషి వేరు, రచయిత మనకు చూపించిన మనిషి వేరు. ఎవరు ఈ కోదు?

అతడు మన్యం కొండలా ఉన్నతుడు. ధరిత్రి పెద్దకొడుకు. పల్లపు ప్రాంతపు దగాకోరు నాగరికుడు అతని తమ్ముడు. అన్నని దబాయించి అన్నీ లాక్కుంటాడు. కోదు అన్నీ సహించడం అలవరుచుకున్నాడు. తనలాగే తమ్ముడికి రాజ్యం ఇచ్చేసి అడవులకి వెళ్లిన రాముడిని తన సర్దార్ గా మలచుకున్నాడు. పైన ధర్మదేవతని, కింద ధరిత్రిని నమ్ముతాడు. అడవిలో వనదేవతని నమ్ముతాడు. అంతేకాదు, ఏ దేవత పేరు చెప్పినా తల వంచుతాడు. తాను నమ్మిన దేవతలను ప్రసన్నం చేసుకోడానికి బలులు ఇస్తాడు. సంఘం కోసం చేసినదానికి తనకి పాపం అంటదని భావిస్తాడు. కట్టుబాట్లకు తలవంచుతాడు. పాపం చేయడానికి వెనుకాడతాడు. ఆత్మని, పునర్జన్మని నమ్ముతాడు.

అవసరంఅనిపిస్తే  విషయం దాస్తాడు, కాని అబద్దం చెప్పడు. మాట ఇస్తే తిరుగు లేదు. ఒక వేళ కొంత ఊగిసలాడినా కోదు పెద్దలు అతడిని నిలదీసి నిజంవైపుకి నెడతారు.పెద్దలను గౌరవిస్తాడు. ఇంకొకడి పొలం కాజేయడు. కండలు తిరిగిన శరీరం ఉంది. ఉరకలు వేసే యవ్వనం ఉంది. అంతకు మించి నిగ్రహం ఉంది. స్వాభిమానం ఉంది. ఎవరిమీదైన మనసైతే ఆమె కూడా తనని వరించాలి లేదా, అంతటి బలిష్ఠుడు వెనుదిరిగి మౌనంగా వెళ్లిపొతాడు. 

కోదు యువతీయువకుల సరసం అతి సున్నితం. మాటకు మాట బదులు, పాటకు పాట బదులు. కోదు దేశం లో అంతా పాటతోనే సాగుతుంది.  ఒకరినొకరు పాటలతో ఉడికించుకుంటూ ఎంత దూరమైనా చకచకా నడిచి వెళ్లిపోతారు. మాటమాట కలుపుతారు. వలపు తెలుపుటకు ప్రత్యేకమైన భాషావైవిధ్యం ఉంది. బండల చాటుగా గుసగుసలాడుతారు. కాని హద్దు దాటరు. కోదు యువతికి నచ్చిన వాడిని చేసుకునే స్వేచ్చ ఉంది. కాపురం సరిగ్గా సాగకపోతే తెగతెంపులు చేసుకునే వీలు ఉంది. కోదు సంఘం తప్పు పట్టదు. అంతే కాదు, అలాంటి పరిస్థితిలో తనకు నిలువ నీడ దొరుకుతుందనే ధైర్యం ఉంది. అయినా కోదు యువతి మనసులో ఎవరున్నారన్నది ఆమెకు మాత్రమే తెలిసిన రహస్యం. ఎవ్వరికీ తెలియదనుకోవడంలోనే ఆమె ఆనందం ముప్పాతిక శాతం ఉంది. పెళ్లి అయిన తరువాత కులస్త్రీ  మర్యాదలు క్షుణ్ణంగా తెలుసు. వాటికి భంగం వాటిల్లితే తల్లడిల్లిపోతుంది. 


కోదు పల్లెలో ఒకడి దగ్గర ఆహారం ఉంటే, ఇంకొకడు పస్తు ఉండడు. ఇక అతిథి మర్యాదలలో కోదు పల్లె మొత్తం ఏకం అవుతుంది. ఏదీ తక్కువ కాకూడదు. తగ్గితే పల్లెకే అవమానం. కోదు పల్లెలో మంచికీ, చెడ్డకీ, వ్యవసాయనికీ, వేటకీ,పూజలకీ పండుగలకీ అన్నిటికీ డిసారి( సిద్ధాంతి) చుక్కలుచూసి ముహుర్తం పెడతాడు. నేలలో ఒక పుడకపాతి సూర్యుడి గతిని కొలుస్తాడు. కోదు, డిసారి-గణాచారుల దివ్యదృష్ఠిని నమ్ముతాడు. కోదు తనకి తెలియని విషయాలను అనుమానంతోనూ, కొంత భయంతోనూ చూస్తాడు. బిజ్జుణి (గణాచారి)ని అడిగి, వారు చెప్పింది నమ్ముతాడు. 

డిసారి, బిజ్జుణి (గణాచారులు) కూడా  సంఘంకోసం కష్ఠమైన బాధ్యతను నెత్తిన వేసుకుంటారు. గణాచారిది ఒంటరి జీవితం. దేవతని ఆవేశింపజేసుకోడనికి అన్ని నియమాలు పాటిస్తుంది. డిసారి రాత్రి చుక్కలు చూసి లెక్కలు వేస్తూ ఉంటాడు, పవిత్రజలం కొసం పులికి  కూడా వెరవకుండా అర్ధరాత్రి ఒంటరికి ఏటిగట్టుకి  వెళ్తూ ఉంటాడు. ఇద్దరూ సంఘం కోసం కర్తవ్య భావనతో  ఇవన్నీ చేస్తూ అందరి మంచి కోరే సిసలైన పురోహితులు. అయితే జ్వరాన్ని, చావుని తప్పించలేరు. ఆయినా వారిని నమ్ముతాడు కోదు. నమ్మిన దానిని అంటిపెట్టుకుంటాడు. మంత్రం ఫలించక పోతే ఏదోరకంగా సద్దిచెప్పుకుంటాడు. 

కోదు పల్లెలో వారి ఆధ్యాత్మిక  నాయకులు ను డిస్సారి, బిజ్జుణి గా వ్యవహరిస్తూ వారి సలహాలతో నూతన వ్యవహారాలు, వ్యవసాయ ప్రారంభ,  నామకరణ, వివాహ కార్యక్రమాలకు ముహుర్తములు నిర్ణయించుకుంటారు.

కోదుకు అధికారుల దౌర్జన్యం అడ్డుకునే శక్తియుక్తులు లేవు. వారు చేసే అవమానాలు దిగమింగి వారు వెళ్లిన తరువాత తనవారిని కసిరి, తన ఇల్లు తగులపెట్టూకుని అదే శత్రువు దుర్దశ అనుకునే అమాయకుడు. ప్రమాణం చేయాలంటే భయపడతాడు. ఆధికారులు కాగితాలమీద రాసే రాతలకు గిజగిజ లాడుతాడు. ఎవరైన ఏదైన రాస్తే ప్రమాదం అనుకుంటాడు.  ప్రభుత్వాధికారుల దాష్టీకం, మైదాన  ప్రాంత వ్యాపారుల దోపిడీ, కోదుల  నిజాయితీ, దైవ భీతి, అమాయకత్వము కళ్ళకు కట్టిన విధానము చక్కగా వుంది.  

కోదు మహిళల స్వేచ్ఛ గురించి, వారి ఆత్మాభిమానం గురించి,  శిశు రక్షణ గురించిన వర్ణన రమణీయము.  మన్య ప్రజల ఆహారపు అలవాట్లు, చలి,  పులుల తో మమేకమైన ఆహార సేకరణ,  ధాన్య అమ్మకం, సంత విధానము చక్కగా కళ్ళకు చూపించారు.  సభ్యత గా భావించే మైదాన ప్రాంతపు ప్రజల ప్రభావము ఎలా వారి ఫై ఉందొ,  ఏవిధముగా మార్పులకు గురి కాబడు చున్నదో ప్రస్తావించడము జరిగినది.  అధికారులు లేనప్పుడో? ఏ బెంగా లేదు, ఏ చింతా లేదు, కేవలం వేట, వ్యవసాయం, కల్లు, ఆట, పాట, మజా.. ఇంతే జీవితం. తక్కినవన్నీ భ్రమలే. “అంతా ఉట్టిదే..” అని తెలుసుకున్న వేదాంతి.


ప్రసార మాధ్యమాలు పాఠకులలో కోదును గురించి ఎవైన అపోహలు కలిగించి ఉంటే, వాటిని పఠాపంచలు చేసి, ధీరుడైన ఒక కోదుని మన కట్టెదుట నిలబెట్టారు రచయిత.  ఇతడినేనా సభ్య సమాజం అడివి మనిషి, అనాగరికుడు అంటున్నది అనే భావన కలుగక మానదు. అనువాదం లో కొన్ని ఇబ్బందులున్నా ఆ అనుభూతి మనకు కలిగించగలిగారు అనువాదకులు. ఒకింత విపులీకరించినా, ఇద్దరు సఫలీకృతులయినారు.  కోదుల జీవన విధానము తో పాటుగా వారి ఆశ్రీతులైనా డొంబు కుల వృతు ల గురించి వారి జీవన విధానము గురుంచి తెలియచేసారు.

ఎవరు ఈ డొంబులు? 
మన్యం కాకులు వంటి వారు. డొంబుల కల్పనా శక్తి బలీయమైనది. వారి జాతి గుణం దగా. సాదు పరిశ్రమ వారికి నచ్చదు. వారి ప్రాచీనవృత్తి – పశువుల్ని దొంగిలించడం, కన్నం తవ్వడం, మోసం చెయ్యడం, దోచుకోవడం, దార్లు కొట్టడం. రామాయణ కాలం నుండి ఇదే ప్రాచీనవృత్తి వారితో ఉంది. ఆ నాటి డొంబు వీరుడు రత్నాకర కవి – తరువాత అతడే వాల్మీకి అయ్యాడు. కోదులతో జరిగిన యుద్ధం లో తమ రాజ్యాలు కోల్పోయారు. చెమటోడ్చకుండా సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక లెక్కా జమా అక్కరేలేదు కనుక లక్ష్యం లేని భోగం తో ఇంటా, బయటా బ్రతుకుతూ ఉంటారు. వారి కాపురాలు  కజ్జాలతో నడుస్తుంది. ఓర్పు తక్కువ. జీవనం లో ఎల్లప్పుడూ అబద్దమే ప్రధానం కనుక, మాటల్లో చాతుర్యం కనపడుతుంది. తమ మాటల ఉద్దేశమంతా ఎదుటివాళ్లు తమని నమ్మాలనే. అంచేత మాట్లాడడం ఒక అభినయం. అతి వినయం, అతి భక్తి డొంబుల స్వభావం. పోలీసుల చెర తప్పించుకోవడానికి ఎంతో మంది కిరస్తానం లో కలిసిపోయారు. ఐనా తమను తాము ఎంత మరుగు పరుచుకున్నా, లోకుల నిఘా, చెడ్డ దృష్టి తప్పిచుకోలేకపోయారు. వివిధ జాతుల ఊళ్లలో బారూకులై అవతరించి బుద్ది దాతలైనారు. డోళ్లు వాయించడం, బాకాలు ఊదడం,తోళ్ళు అమ్మడం లాంటి వృత్తులల్ని దిగి పోయారు. 


మాసాలు 
పుష్య మాసం ఎండలో సీతాకోకచిలుకలు ఎగురుతున్నాయి. ఎన్నో అడివి పువ్వుల వాసన గుబాలిస్తోంది. అడవి వాసన. మాఘ మాసం పెళ్లిళ్ల మాసంచైత్ర మాసమంతా సందడి, ఆటలు, పాటలు రచయిత కధలో ముఖ్య పాత్రల పేర్లు వారి ప్రవర్తనకి దగ్గరగా ఉండే లాగా చక్కగా పెట్టారు. నవలలో పేర్లు మన తెలుగు వారికి పరిచయము కానివి కాబట్టి వాటిని ముందు తెలుసుకుంటే పుస్తకం చదవడం సులభం అవుతుంది.  అవి మిణి ఆకా సరబు సావొతా  –  మిణి అపాయు సావొతా (గూడెం సర్దారు). ఆదర్శ మైన నాయకుడుగా ఎనభై సంవత్సరాలు బ్రతికి  కోదు పెద్ద పండగ నాడు మరణించాడు. 

మిణి ఆకా దివుడు సావొతా (కార్తీకం) – తండ్రి మరణం తరువాత  మిణి అపాయు కి కొత్త  సావొతా. ఆవేశం తప్ప ఆలోచన లేని మనిషి. పూయి  (పువ్వు) – మిటిం లో పుట్టి,  దివుడు ఎంతో ఎంతో ఇష్టపడి చేసుకున్న మహిళ.  హకినా అనే కొడుకు ని కంటుంది. పుబిలి (సీతాకోకచిలుక) –  సరబు సావొతా కూతురు. లెంజు కోదు (వెన్నెల) –  సరబు సావొతా తమ్ముడు. పియోటి (పంగపండు పిట్ట) – బందికారాలో పుట్టినా తల్లి దండ్రులు కడుపు చేత పట్టుకొని దక్షిణ దేశం (తెలుగు ) లో పెరిగి అక్కడ కూడా బ్రతక లేక తిరిగి తల్లి తో కోదు పల్లెకే చేరిన యువతి. హికాకో  హర్గుణ –  కోదు బందికారా  కోదు పల్లె సావొతా. నాగరిక సమాజపు పట్టు విడుపులని నేర్చుకొని తన వూరికి తీసుకువచ్చే మంచి యువ నాయకుడు. 

సోనా దేయి – డొంబు యువతి. కేలర్ వూళ్ళో గర్జన డొంబు ఉరఫ్ రాఫాయెల్ కిరస్తానం కూతురు.  పెళ్లి చేసుకొని ముసలి వాడైనా బాలాముండా డొంబు (బారుకా) తో కాపరం చేయడానికి మిణి అపాయు వచ్చింది. 

ఇక కథ స్థూలం గా  – అతి తక్కువ పాత్రలతో సాగే కథ ఇది.  నాలుగు వేల అడుగుల ఎత్తున కొండల మీది మిణి అపాయు అనే ఐదు వందల జనాబా ఉన్న ఒక కోదు పల్లె ఇతివృతం లో కధ మొదలు అవుతుంది. కుయి బాష మాట్లాడే ఆ పల్లెకి  మిణి ఆకా (గోత్రం) సరబు సావొతా అనే పెద్ద ఉండే వాడు. ఒకప్పుడు నర బలులు ఇచ్చే ఆచారం ఉండేది వారికి. నరబలిని దర్ము కోసం, ధార్తని కోసం చేసున్నాము అని నమ్మే వారు. డబ్బు పెట్టి కొని ఎందరో అమాయకులని (తమతో బ్రతికే వారినే) మెరియా పూజ (పుష్య మాసం చివరా , మాఘ మాసం మొదలు లో) సమయం  లో “మా పాపం లేదు, నీవే పుట్టించావు, నీవే తింటున్నావు” అనే  మంత్రాలు చదువుకొని తమలో వివేకాన్ని నిద్ర పుచ్ఛి కార్యం పూర్తి చేసేవారు. సరబు సావొతా చనిపోయేముందు బాధ పడతాడు ఆ దురాచారం వల్ల కోదు పల్లెల కి ఎటువంటి అభ్యుదయము కలగలేదు లేదు కదా అని. తన జీవితం ఆనందించినవి వేట, వ్యవసాయం, కల్లు, మజా. నిజమైన కోదు లాగా ఎవరి భార్యనైనా కన్నెత్తి చూడ లేదు, ఎవరి పొలమూ చపాయించలేదు. గుగ్గులం చెట్టులాగా తిన్న నైనా మనిషి లాగా బ్రతికాను అని అనుకుంటూ పిల్లన గ్రోవి వాయించు కుంటూ మరణిస్తాడు. అతని తరువాత అతని కొడుకు కుర్ర వాడైన  మిణి ఆకా దివుడు సావొతా గ్రామ పెద్ద అవుతాడు. దివుడు ఎంతో ఇష్టపడి చేసుకున్న భార్య పూయి. సరబు సావొతా తమ్ముడు లెంజు కోదు. సరబు సావొతా కూతురు  పుబిలి. 

 కోదు పల్లెలు పాటించే ఎన్నో ఆచార వ్యవహారాలు మన నాగరిక సమాజానికి ఇంకో రకంగా పరిచితమే. సరబు సావొతా చనిపోయే సమయం లో పూయి తొమ్మిది నెలల నిండు చూలాలు. తోటి ఆడవారితో అడవిలోకి దుంపలు తవ్వడానికి వెళ్లి  అక్కడే వొక్కతే ఉన్నపుడు ఒంటరి గా ఒక మగ బిడ్డని ప్రసవిస్తుంది. నక్షత్రాలు చూసి మంచి చెడ్డలు చెప్పే డిసారి పాండ్రుకోదు చెప్పిన మంచి ముహూర్తానికి, దేవతలు పూనే మిణి అపాయు ముసలి బెజుణి సరబు సావొతా డుమా (ఆత్మ) మళ్ళీ మనుమడి గా పుట్టాడు అని వాడికి “హకినా” (కంగాళీ వాడు, కడుపు మంట వాడు) అని పేరు పెడుతుంది. పూయి కి బిడ్డ పుట్టిన తరువాత తన పుట్టిన ఊరి (మిటిం) కి కబురు పంపుతుంది. పూయి తల్లి తండ్రులు గతించినా, తోడ బుట్టిన వారు లేక పోయినా మిటిం గ్రామ రఘు సావొతా కొడుకు బేశు కోదు, పిన తండ్రి వరుస ఐన వారితో వచ్చి బారసాల పండుగలో పాలు పంచుకుంటారు. కోదు జీవితం అంతా పాటలు, ఆటలతో కొండల్లో చలి తో, అడవిలో పులితో  సహా జీవనం  చేస్తూ ఉంటారు.  కోదు కి యవ్వనంమంటే అంటే ఎంతో ఇష్టం.  జీవనమంటే ప్రేమ. పెళ్లి కాని తమ పడుచులకి స్వేచ్ఛ ఇస్తారు మూడు ముళ్ళు పడే వరకూ. సరబు సావొతా  కూతురు పుబిలి పుట్టిన ప్పటి నుండి “ఈ ఊరి  సావొతా కూతురు ఆ ఊరి సావోతా కి  బాగుంటుంది” అని అనుకోని బందికార పల్లె  సావోతా ఐన హికాకో  హర్గుణ కి ఇచ్చి చేద్దామని అని పెద్దలు అనుకుంటారు. పుబులి మిటిం గ్రామం నుండి వచ్చిన మిటిం గ్రామ రఘు సావొతా కొడుకు బేశు కోదు ని కలిసినాక అతని మీద మనసు పారేసుకుంటుంది. 
 పులి బారిని బార్యని (రుక్మి) ని చాలా చిన్న తనం లో పోగుట్టుకొని లెంజు కోదు అదే ఇంటిలో ఒంటరి తనం తో బాధ పడుతుంటాడు. కోదు పద్దతి ప్రాకారం పులి ఎత్తుకు పోయిన వితంతు భార్యని తప్ప మరొక స్త్రీ ని పెళ్లి చేసుకోలేడు.  అన్న తరువాత చిన్న వాడైనా దివుడు సావొతా  అయ్యి పెత్తనము చేయడం సహించ లేకుండా ఉంటాడు.  అదే ఊరిలో ఉండే డొంబు యువతి  సోనా దేయి మీద కన్ను పడుతుంది.  

ఆరు సంవత్సరాల ముందు సారా, కుర్రది అని ఇష్టమొచ్చిన తిరిగిన దివుడుకి – పూయి కనపడి వెంటపడి చేసుకుంటాడు. కానీ ఇప్పడు సావొతా అయినాక దాని అధికారం, దాని కట్టుబాట్లు ఊపిరి ఆడనివ్వవు.  పిల్లవాడి వాడి పాలనలో, ఇంటి పనుల్తో పూయి పూర్తిగా మారి పోయి  పూయి తనని పట్టించు కోవడం లేదు అనే భావం ఒకటి బయలు దేరుతుంది. ఊరిలో ఉండే సోనా దేయి మీద కన్ను పడుతుంది.  మూల ఉన్న మిణి అపాయు గూడెం మీద నాగరికుల తాకిడి మొదలు అవుతుంది. అడవి అధికారులు వచ్చి ఉన్నవి ఎత్తుకుపోతారు. షావుకార్లు వచ్చి పంట రాయించుకుంటారు.  బెజుణి ని పులి తీసుకుపోతుంది.  ప్రశాంతం జీవిస్తూ ఉన్న సమయం లో  ఆ ఊరి కి పల్లపు నాగరికత (తెలుగు) లో పెరిగి వచ్చిన తెలుగమ్మాయి  పియొటి  వస్తుంది.  దివిడు ద్రుష్టి లో పడి  ఆమెతో పడి వేరు పడి పోతాడు. 

ఈ మధ్య లో  పూయి గర్భము దాల్చి చిన్న బిడ్డ ద్వారా సొంతం గా కోదు సంతతి కొనసాగిస్తుంది.  “జీవనం లో రుచి ఉంది. చావు లేదు.  దుఖం లేదు” అని అనుకుంటూ పూయి తన బిడ్డతో పుట్టింటికి బయలుదేరుతుంది.

పుబులి అనబడే దివుడి చెల్లెలు గాని,వయస్సు పరం గా తానే తన అన్న తర్వాత ఊరి పెద్ద కావాలని తపించే లెంజు కోదు గాని,ఇంటిలో వెలితి తో బయటికి చూసే సోనా దేయి గాని ఇలా ఏ పాత్ర స్థానం దానిదే. డిసారి,బెజుణి  వంటి వారు ఆ సంస్కృతి లోని భాగాలు. ఇంకా చాలా చిన్న పాత్రలు తారసపడతాయి. గుర్తు ఉండేలా చేస్తాయి.  ఉన్న దానితో పండించుకొని ఆడుతూ, పాడుతూ తమ పూర్వీకుల కట్లుబాట్లతో సరబు సావొతా ను కోదు సమాజానికి గత ప్రతీక చూపించినా ప్రసుత సమాజపు సావొతా లైన  దివుడు, హర్గుణ లను నాగరిగత ఎలా కబళించి వేస్తుంది చూపించారు.  

కోదు మహిళలు, వారి జీవన విధానము ఆరు పాత్రలలో చెప్పినట్లు అనిపించింది. 

  •  కోరి చేసుకున్న భర్త నుండి నిరాదరణ గురి కాబడినా  కన్న బిడ్డ తో ఆత్మ స్తైర్యం గా నిలబడ్డ పాత్ర లో పూయి,
  •  నచ్చిన యువకుడితో జీవన ప్రయాణం సాగించ గలిగిన  యువతి పుబిలి, 
  • ఆస్రిత  కులమైన డొంబు కులము నుండి వచ్చి ఇంటిలో వెలితి తో బయటికి చూసే సోనా దేయి, 
  • నాగరిక సమాజం లో పెరిగి తిరిగి కోదు గూడెం లో అడుగుపెట్టిన పియొటి(ఒక నాగరికుని కళ్ల తో మనకి అడవి పరిచయం), 
  • గూడెం కోసం చివరి వరకూ  తన విధి నిర్వర్తించిన బెజుణి, 
  • సంపూర్ణ కోదు జీవితం ఆనందం గా గడిపిన జామిరి కోదు ముసల్ది. 

యిలా ప్రతి మహిళ  పాత్ర మనలోని ఎన్నో భావోద్యగాల్ని బయటకి తీసుకు వస్తుంది. ముఖ్యంగా సంధి ప్రాంతంలో ఉన్న సరబు సావొతా తమ్ముడు లెంజు కోదు అధికారం లేని వృధాప్యం తో జాలి.  నాగరపు సమాజపు మనుషులైన సావుకార్లు, అధికారులు కోదు ప్రాంత ప్రజలని బలహీనత లని ( కట్టుబాట్ల పేరుతో) ఎలా దోచుకునేది తెలిసి చాలా భాధ కలుగుతుంది. 
రచయిత  మానవ జీవన ముఖ్య సంఘటలని కొండ జాతి జీవనములో సరబు సావొతా చావు,హకినా పుట్టుక, బేశు కోదు తో పుబిలి పెళ్లి, చైత్ర మాసం సంతోషాలు, గూడెం కోసం నిరంతరం పని చేసే మనుషులు ముసలి బెజుణి, డిసారి పాండ్రుకోదు చూపించి ఆ పాత్రలని మనకి బాగా దగ్గర చేయడం చాలా బాగుంది. 

చివరిగా – 260 BCE లో అశోకుడు కళింగ యుద్ధం తరువాత కొండ జాతుల మీద ప్రత్యేక శ్రద్ద చూపవల్సిందని తన ప్రభుత్వ ఉద్యోగులని హెచ్చరిస్తూ చేసిన శిలాశాసనాలు ఇప్పటికీ అందుబాటు లో ఉన్నాయి. అప్పటినుండి ఇప్పటివరకూ భారత దేశ స్వాతంత్రం వచ్చి రాజ్యాగం లో కొండ జాతి వారి కొరకు ఐదవ షెడ్యూల్ లో  పొందుపర్చినా నక్సల్ బరీ ని ఆపలేకపోయింది.  డెబ్భై సంవత్సరాలు క్రితం ఈ నవల వచ్చినా ఇప్పటి  ఆ ప్రాంతం గానీ కోదు ప్రజల ప్రస్తుత పరిస్థితి, స్థితి గతులు తెలుసుకోవాలి అని కోరిక కలగ కుండా మానదు.  
 

మా గుంపు అడవి ఇతివృత్తం గా చదివిన ఇంకో నవల 1938 సంవత్సరం లో  శ్రీ బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ్ (1894-1950) బెంగాలీ లో రాసిన “అరణ్యక”. శ్రీ సూరంపూడి సీతారాం గారు “వనవాసి” గా తెలుగు అనువాదం చేశారు.  ఉత్తమ పురుషలో నడిచే వనవాసి నవల ఒక నాగరికుడు ఉద్యోగ రీత్యా ఆరు సంవత్సరాలు అరణ్య వాసం చేసి ఆ వన సౌందర్యానికి ముగ్దుడై అడవి మీద ప్రేమ పెంచుకుంటాడు. అతనితో పాటు మనల్ని కూడా ఆ అడవితో  ఆ ప్రేమ లో ముంచుతాడు. – రెండూ నవలలు భారత స్వాతంత్య్రానికి పూర్వమే వచ్చినా, రెండిటినీ పోలిస్తే వనవాసి నవల ఒక నాగరికుని ద్వారా మనకి అడవి పరిచయం అవుతుంది.  అమృత సంతానం కోదు జాతి దృక్పధంతో అడవి పరిచయం జరుగుతుంది. 

మా గుంపు  అడవి ఇతివృత్తం గా చదివిన ఇంకొక పుస్తకం జయతి లోహితాక్షన్  రాసిన “అడవి నుండి అడవికి”. దీనిలో ఒక ప్రయాణము మొత్తం కోదు ల మధ్య గడిపి ఈ నవల గురుంచి కూడా రాశారు. ఈ నవల ఆరాధకురాలి గా చెప్పారు.

ఈ నవల మీద తమ ఆరాధన తో కొంతమంది పుస్తక ప్రేమికులు  ఈ పుస్తక పరిచయాన్ని ఒక పుస్తకము గా తీసుకు వచ్చారు. అదే ” జీవన సత్యం జీవన సుందరం“. 

ఈ మధ్యనే ఈ పుస్తకపు ఆంగ్ల అనువాదం కూడా వచ్చింది. తెలుగు ముద్రణ పరముగా చాలా ఎక్కువగా  అచ్చు తప్పులు వున్నాయి. తదుపరి ముద్రణ లో సవరించ గలిగి బాగుంటుంది. చరిత్ర కారులు భారత దేశ చరిత్ర లో కొండ జాతి వారి గురించి( కొన్ని తరాలు గా  ఉన్న  ఉన్నవూరి గురించి) ఎక్కువ పరిశోధనలు చేసినట్టు గానీ, చేసిన వాటిని మన భావి భారత పౌరుల పాఠ్య పుస్తకాలలో చేర్చిన దాఖలాలు కనపడలేదు. భారతీయ సమాజము లో వివిధ జాతుల జీవన విధానములలో  ఒకటైన కోదుల జీవనాన్ని గురించి తెలుసు కోవడానికి చదవ తగ్గ మంచి పుస్తకము.  

ఆంగ్ల అనువాదం

గోపీనాథ్ మహంతి వివరాలు

కోదుల గురించిన విడియోలు రెండు – ఇక్కడ, ఇక్కడ.

 

You Might Also Like

Leave a Reply