ఆమె జీవితం వొక పాఠ్యం

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్

(“ఒక దీపం – వేయి వెలుగులు; నంబూరి పరిపూర్ణ జీవితం, సాహిత్యం, వ్యక్తిత్వం” పుస్తకావిష్కరణ ఆగస్టు 27 న జరుగనుంది. ఈ సందర్భంగా ఈ పుస్తకానికి ఎ.కె.ప్రభాకర్ గారి ముందుమాట.)

**********

జీవించడం వొక కళ. ప్రవాహానికి యెదురీది జీవించడం యుద్ధకళ. నటన సంగీతం సాహిత్యం రాజకీయం సామాజిక సేవ … యెనిమిది దశాబ్దాలకు పైగా యింత  వైవిధ్య భరితమైన నిండైన జీవితాన్ని ఆదర్శవంతంగా జీవించడమనే కళలో  ఆరితేరిన మహిళ నంబూరి పరిపూర్ణ. తొంభై రెండేళ్ల జీవితంలో ఆమె అగాధమైన లోయల లోతుల్ని చూసింది. దుర్గమమైన శిఖరాల్ని అధిరోహించింది. ఎత్తు పల్లాల్ని సమంగా స్వీకరించింది.  దారులన్నీ మూసుకుపోయిన చోట స్వయంగా దారులు పరచుకుంది. రోళ్ళు పగిలే యెండల్లో చలివేంద్రాలు నిర్మించుకుంది.  నిప్పుల నదుల్ని ఈదింది. ఒంటి చేత్తో అలవోకగా  అష్టమ సముద్రాన్ని దాటి  ఆవలి తీరానికి చేరుకుంది.  అనేక సంక్షోభాల్ని దాటి జీవితాన్ని వుత్సవ సౌరభంగా మార్చుకొనే టెక్నిక్ ని నేర్చుకుంది. తన చుట్టూ వున్న వాళ్ళకి నేర్పింది. అది బతకనేర్చిన విద్య కాదు. బతుకును దిద్దుకొనే సౌందర్య సాధన. పరిపూర్ణ వంటి యే కొందరికో మాత్రమే  చేతనైన జీవితాచరణ.

వ్యక్తిగతమంతా రాజకీయమే అన్న నానుడి వెలుగులో  సామాజిక సాంస్కృతిక రాజకీయ రంగాల్లో నాలుగు తరాలకు చెందిన    ప్రముఖ వ్యక్తులతో భిన్న స్థాయిల్లో దగ్గర సంబంధ బాంధవ్యాలు వున్న పరిపూర్ణ వంటి వ్యక్తి జీవితాన్ని అధ్యయనం చేయడం అంటే అన్ని తరాల సాంఘిక చరిత్రని స్థూలంగా అధ్యయనం చేయడమే. కులం కారణంగా జెండర్ కారణంగా అనేక వివక్షల్ని  యెదుర్కొంటూ, యెదురైన కష్టాలకు తల వంచక గుండె నిబ్బరం కోల్పోక సామాజిక ఆచరణలో వున్న ఆమె జీవితానికి చెందిన భిన్న పార్శ్వాలని లోతుగా తరిచి చూడడం ద్వారా దాదాపు నూరేళ్ళ సమాజ చలనాన్ని అంచనాకట్టొచ్చు. కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు.  ఈ పుస్తకంలో మూడు నాలుగు తరాలవారు ఆమెతో వున్న  తమ అనుబంధాన్ని  నెమరు వేసుకున్నారు. పరిపూర్ణ కుటుంబ సభ్యులు బంధు మిత్రులు తమ వ్యక్తిగత సాన్నిహిత్యాన్నీ పరిచయాల్నీ పంచుకుంటే, సాహిత్య కారులు పరిపూర్ణ సాహిత్య జీవితాన్నీ రచనల్నీ మూల్యాంకనం చేశారు. ఆ క్రమంలో ఆమె జీవిత వ్యక్తిత్వాల్ని సాహిత్యం నుంచి విడదీసి కాకుండా కలిపి వీక్షించారు. ఆమె జీవితాన్నే పాఠ్యంగా సాహిత్య విలువల్ని అంచనా కట్టారు.     

వేయికి పైగా పున్నములు చూసిన పరిపూర్ణ జీవన సాఫల్యాన్ని సెలబ్రేట్ చేయాలన్న ఆమె కుటుంబ సభ్యుల ఆలోచనలో పురుడు పోసుకున్న యీ పుస్తక ప్రయత్నం చివరికి  నూరు  మందికి పైగా రచయితల ఆత్మీయ అభిభాషణలతో,  నిశిత విశ్లేషణలతో పరిశోధనాత్మక గ్రంథంగా రూపొందింది. అందువల్ల యిది  కేవలం పరిపూర్ణ  సాహిత్య జీవిత వ్యక్తిత్వాల పరామర్శకు పరిమితం కాకుండా ఆమె జీవించిన స్థల కాలాల చారిత్రిక డాక్యుమెంటుగా తయారైంది. స్వాతంత్ర్యానికి ముందూ వెనక అయిదారు తరాలకు చెందిన కోస్తా ప్రాంత దళిత సామాజిక వాస్తవికతకు పరిపూర్ణ జీవితం దర్పణం పడుతుంది. ఆ విధంగా దళిత సాహిత్య చరిత్రలో యీ  డాక్యుమెంటేషన్  గొప్ప చేర్పు అని చెప్పడం తప్పుకాదు.

***

తెలుగులో స్త్రీల ఆత్మకథలు వేళ్ళ మీద లెక్క పెట్టేన్ని మాత్రమే. అందునా  దళిత స్త్రీల ఆత్మ కథలు మరీ  తక్కువ.   వాటిలో విశిష్టమైనది పరిపూర్ణగారి ఆత్మకథ. పరిపూర్ణ జీవితాన్ని  కొండపల్లి కోటేశ్వరమ్మ (నిర్జన వారధి),  సినీ నటి సావిత్రి  (మహానటి), బరంపురానికి చెందిన  నాగరత్నం  (కోకా సావిత్రి), మార్క్స్ సహచరి  జెన్నీ జీవితాలతో విమర్శకులు పోల్చి చూసారు. కొన్ని పోలికలు వుంటే వుండొచ్చు గానీ  వారందరి అనుభవాల కంటే భిన్నమైన జీవితానుభవం పరిపూర్ణ గారిది. సాంస్కృతికంగా వైష్ణవీకరణకు గురైన  మాల దాసరి కుటుంబంలో పుట్టిన  పరిపూర్ణ బయటి నుంచి సవర్ణుల  వివక్షని యెదుర్కొంటూనే  కులం లోపలి బ్రాహ్మణీయ పితృస్వామ్య ఆధిపత్యంపై  సైతం  పోరాడింది.  ఆ విధంగా   మరాఠీ దళిత మహిళా రచయితలు బేబీ కాంబ్లే (Jina Amucha – Our Life), శాంతా  బాయి కాంబ్లే  (Mazhya Jalmachi Chittarkatha – The Kaleidoscopic Story of My Life), ఊర్మిళా పవార్ (Aaidan – The Weave of My Life: A Dalit Woman’s Memoirs) ఆత్మకథలతో  లేదా  నామదేవ్ ధసాల్  భార్య మల్లికా (అమర్ షేక్)  (Mala Udhvasta Whaychay – I Want to Get Ruined) రచనతో కొంతవరకు ఆమె ఆత్మకథని పోల్చవచ్చు.    

 వాస్తవానికి తెలంగాణాకు చెందిన టి యన్  సదాలక్ష్మి బతుకు కథ ‘నేనే బలాన్ని’ (గోగు శ్యామల) –  పరిపూర్ణ ఆత్మ కథ ‘వెలుగు దారుల్లో’ – యీ రెండింటినీ తులనాత్మకంగా పరిశీలించాలి.  అప్పుడు బ్రిటిష్ – నైజాం పాలనల్లోని   రెండు ప్రాంతాల సామాజిక చరిత్రలో కనిపించే వైవిధ్యం,  కొత్త కోణాలు వెలికి వస్తాయి. ఇద్దరూ సమకాలీకులే  అయినప్పటికీ వొకరు కాంగ్రెసు రాజకీయాల్లోకి మరొకరు కమ్యూనిస్టు వుద్యమంలోకి పయనించడానికి కారణమైన స్థానిక రాజకీయ సామాజిక నేపథ్యాల్ని అర్థంచేసుకోవచ్చు.  ఇటువంటి అధ్యయనాలకు యీ ‘ఒక దీపం – వేయి వెలుగులు’ ఆకర   గ్రంథంగా వుపయోగపడుతుందని మా  నమ్మకం. 

సృజనాత్మక రచనా రంగంలోకి పరిపూర్ణ చాలా ఆలస్యంగా ప్రవేశించారు. ‘వెలుగు దారుల్లో …’ వెలువడకుంటే నంబూరి పరిపూర్ణ జీవితం కూడా ఆమె ఇతర కుటుంబ సభ్యుల అస్తిత్వంలా చరిత్రలో అనామకంగానో అజ్ఞాతంగానో మిగిలిపోయేదేమో! వాస్తవానికి పరిపూర్ణ తోడబుట్టిన సహోదరులు ముగ్గురూ సామాజిక రాజకీయ రంగాల్లో ప్రముఖులే.  ఒక అన్న నంబూరి శ్రీనివాస రావు చిన్న వయస్సులోనే స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకొని జైలు జీవితం అనుభవించినవాడు. పూర్తికాలం కమ్యూనిష్టు కార్యకర్త. ఆయనకి గదర్  విప్లవ వీరుడు దర్శి చెంచెయ్య దగ్గర్నుంచీ రాజ్యాంగ నిర్మాత  బాబా సాహెబ్ అంబెడ్కర్ వరకు ప్రముఖ నేతలెందరితోనో ప్రత్యక్ష  అనుబంధం వుంది. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. మరో అన్న దూర్వాస మహర్షి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ – గౌరవ డాక్టరేట్ పొంది అక్కినేని నాగేశ్వరరావుతో కాలికి గండపెండేరం తొడిగించుకున్న మహాకవి (ఇదే వొక సవర్ణుడైతే అతని చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించేవారు). తమ్ముడు జనార్దన్ కూడా వామపక్ష రాజకీయాల్లో తలమునకలైనవాడే.  ఎందుకో మన పరిశోధకులు భాగ్యరెడ్డి వర్మ కుసుమ ధర్మన్న గుర్రం జాషువా బోయి భీమన్నల దగ్గరే ఆగిపోయారు.  దళిత సాహిత్య చరిత్రలో  పూరించాల్సిన యిటువంటి ఖాళీలని  పూరించడానికి  పరిపూర్ణ జీవితం గురించిన  యీ  పుస్తకం ద్వారాలు తెరుస్తుందని కూడా అనిపిస్తోంది.    

***

 స్త్రీపురుష సంబంధాలకు  సంబంధించిన అనేకమైన సున్నితమైన పరిశీలనలు పరిపూర్ణ గారి రచనల్లో కనపడతాయి. ‘స్త్రీల స్వయం నిర్ణయాధికారం, ఆత్మాభిమానం అనే విలువల్ని ఆమె రచనలు యెత్తిపట్టాయ’ని  రచయితలు  వొక ప్రధానాంశంగా పేర్కొన్నప్పటికీ సాహిత్య సృజనలో ఆమె కేవలం తన జీవితానుభవాల వరకే పరిమితమయ్యారని మరి కొందరు విమర్శనాత్మకంగా విశ్లేషించారు. ఆమె  బలాన్నీ బలహీనతల్నీ సమంగా గుర్తించారు. ఏది యేమైనా స్త్రీ స్వావలంబన సాధికారతలనే ఆమె తన రచనల ద్వారా ఆశించారు. ఆ దిశగా జరిగే ఆచరణలోనే యిప్పటికీ వున్నారు. కౌమార దశలో అలవర్చుకున్న ఆదర్శాలనే అంటిపెట్టుకుని వున్నారు. కమ్యూనిస్టు జెండా నీడలో నేర్చుకున్న మౌలిక  విలువల్ని పాటిస్తున్నారు. వాటి పట్ల ఆమె విశ్వాసం సడలలేదు. ఆమె సామాజిక దృక్పథంలో మార్పు రాలేదు.  సమాజంలో బాధితుల  పట్ల  అంకిత భావం చెదరలేదు. ఒంటరి స్త్రీగా తల్లిగా సామాజిక బాధ్యత కల్గిన వుద్యోగినిగా వ్యక్తిగత జీవితంలో తాను  పాటించిన విలువలనే,  ఆదర్శాలనే ఆమె తన పాత్రలకి ఆపాదించారు. కుటుంబంలో పాతుకుపోయిన పితృస్వామ్య – పురుషాధిపత్య భావజాలాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. తాము స్వయంగా నిర్మించుకున్న స్వేచ్ఛామయ జీవితంలో   స్త్రీలు పలికే  ఆత్మగౌరవ స్వరాన్ని  ఆమె సర్వదా తన రచనల్లోనూ, నిజజీవితంలోనూ కంచుకంఠంతో విపిస్తూనే వున్నారు.

పరిపూర్ణ జీవితం దాసరి నాగభూషణరావుతోనే   కొనసాగి ఉంటే…? అన్న  ఆసక్తికరమైన పరిశీలన  వొకటి  స్త్రీవాద దృక్కోణం నుంచి వెలికి వచ్చింది. అప్పుడు ఆమెకు  యింటికి వచ్చిన పార్టీ నాయకులకీ కార్యకర్తలకీ  వండి  వార్చడంతోనే సరిపోయేదేమో అన్న వూహ ఆ పరిశీలనలో ముందుకొచ్చింది. ఏమో; పరిపూర్ణ కున్న రాజకీయ పరిజ్ఞానంతో,  సాంస్కృతిక ఛైతన్యంతో,  చొరవతో తన కుటుంబం వరకే  పరిమితం కాకుండా వొక వైపు సాహిత్యంలోనూ మరోవైపు రాజకీయాల్లోనూ మరో కె ఆర్ గౌరీ అమ్మ, లాగానో బృందా కారాత్ లాగానో యెదిగేవారేమో! ఇవన్నీ ఊహాపోహలే. చరిత్ర మరో విధంగా జరిగింది. ఆమె జీవితం యిదిగో యిలా మన ముందుంది. విశ్లేషణలు మన యిష్టం.  పంచుకుందాం.  పరిపూర్ణ  సాహిత్యం మరీ ముఖ్యంగా ఆమె  ఆత్మకథ ఇతర భాషల్లోకి అనువాదం కావాలని కొందరు భావించారు (దానికి అనుకూలమైన భూమికని యెర్పరుస్తూ మచ్చుకు వొక కథనీ, త్వరలో యింగ్లీషులో వెలువడనున్న వెలుగుదారుల్లో  నుంచి ముఖ్యమైన ఘటనల్ని అనువదించి అనుబంధంలో  అందజేస్తున్నాం).

‘ఒక దీపం – వేయి వెలుగులు’ కేవలం  నంబూరి పరిపూర్ణ అభినందన సంచిక కాదు; పరిపూర్ణ జీవిత సాహిత్య వ్యక్తిత్వాల పై సమగ్ర పరామర్శ. కథ ఆత్మకథ నవల వ్యాసం వంటి భిన్న సాహితీ ప్రక్రియల ద్వారా పరిపూర్ణ చిత్రించిన తవ్వి పోసిన వివరించిన వ్యాఖ్యానించిన జీవితాల గురించి సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితుల గురించి చలనం గురించి భిన్న నేపథ్యాలు చెందిన రచయితలు స్వీయ దృక్పథాల నుంచి చేసిన విశ్లేషణాత్మక పరిశీలన (సహజంగానే యెక్కువ మంది ఆమె ఆత్మకథ మీద; పునరుక్తి అనిపించేలా; రాసినప్పటికీ). ఈ కాలానికి అవసరమైన మూల్యాంకనం యిది. ఆమె జీవించిన జీవితాన్ని ఆమె దోసిలిలోకి వొంపి చూపిస్తున్నందుకు మాకెంతో గర్వంగా వుంది.  ఈ గ్రంథం యింత సమగ్రంగా సుందరంగా  యిలా రూపొందడానికి తెర  మీద మేం కనపడుతున్నప్పటికీ తెర వెనక యెందరో  వున్నారు. వారిలో ముఖ్యంగా పేర్కొన వలసినవారు వేమూరి సత్యం భానోతు బాలాజీ నంబూరి శైలజ నంబూరి మనోజ కొల్లూరి సోమశంకర్ అక్షర సీత. ఇక మాకు ప్రతి అడుగులోనూ అడుగు వేసి నడిచిన నడిపించిన దాసరి అమరేంద్ర శైలేంద్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘శిరీష కోమలం’కు  యిది వొక విధంగా  బై ప్రోడక్ట్. అందువల్ల శిరీష గారి కనపడని చేయి కూడా యిందులో వుంది.  ఈ సంచిక కోసం రచనలు అడిగిన వాళ్ళందరూ అందించిన సహకారం వెల లేనిది. వీరందరికీ మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. 

నంబూరి పరిపూర్ణ జీవిత – వ్యక్తిత్వ – సాహిత్యాలపై వెలుతురు ప్రసరింప జేయడానికి  మా వంతు ప్రయత్నంగా వెలిగించిన యీ  చిరు దీపం టార్చ్ లైటా  ఫ్లడ్ లైటా అన్నది నిర్ణయించాల్సింది మీరే.

సెలవ్. 

  ప్రేమాభిమానాలతో …

ఏప్రిల్ 26, 2022                                                                                          ఎ. కె. ప్రభాకర్  

You Might Also Like

Leave a Reply