నేనూ, పుస్తకాలూ, రెండువేల ఇరవయ్యొకటీ …

వ్యాసకర్త: పద్మవల్లి

*********

నా చదువు 2021 మొదటి సగంలో ఎప్పుడూ లేనంత వేగంగానూ, ఉత్సాహంగానూ సాగింది. ఈ సంవత్సరం చదివిన వాటిల్లో ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ అపుడే చదివాను. దాదాపు జూలై నుండి వివిధ కారణాల వల్ల దాదాపు ఏమీ చదవలేదనే చెప్పుకోవాలి. చివరి రెండు వారాల్లో రెండు పుస్తకాలు చదవగలిగాను. ఈ సంవత్సరం నాకు ఒక కొత్త రచయిత George Saunders ని పరిచయం కలిగింది. ఈ సంవత్సరం చదివిన మంచి పుస్తకాల్లో ఒక్కదాన్ని మాత్రమే  చెప్పమంటే ఈయన వ్రాసిన A Swim in the Pond in the Rain అని చెపుతాను. మాయా ఏంజేలో పుస్తకాలు ఇంతకు ముందు రెండు మూడు మాత్రమే చదివాను. ఓ రెండేళ్ల క్రితం Mom, Me & Mom చదివిన తరువాత ఆవిడ బయోగ్రఫీ చదవాలని అనుకుని ఇప్పుడు మొత్తం ఆరు భాగాల జీవితచరిత్రతో పాటూ, రెండు వ్యాస సంకలనాలు కూడా చదివాను. అవి చదివిన తర్వాత Malcom X గురించి వివరంగా చదవాలని అనిపించింది. వీలు చూసుకుని చదవాలి.

ఎన్నో సంవత్సరాలుగా వెదుకుతున్న యాన్ మార్టెల్ కథ ఒకటి, దానితో బాటే ఇంకొక మంచి కథ అనుకోకుండా దొరికాయి. రెండింటి వివరాలూ లిస్టు లో ఇచ్చాను. దానితో పాటు చాలాకాలంగా వెదుకుతున్న యాన్ మార్టెల్ వ్రాసిన What is Stephen Harper Reading? అనే పుస్తకం కూడా దొరికింది. ఇది ఇంకొక బెస్ట్ పుస్తకం ఈసారి చదివిన వాటిల్లో. దీన్ని చాలామందికి రికమెండ్ చేసి చదివించాను. చదివిన అందరికీ అంతగానూ నచ్చింది కూడానూ. ఇంకా తెలుగులో పతంజలి శాస్త్రిగారి కథలు, దేవరశిల, మా అమ్మంటే నాకిష్టం … ఇలా చాలా మంచి పుస్తకాలు చదవగలిగాను.

ఆంగ్ల/ప్రపంచ సాహిత్యం ఎక్కువ చదవడం అలవాటయి,  చాలా ఏళ్ళుగా ఇండియన్ రచయితల ఇంగ్లీష్ చదవడం కష్టంగా ఉంటోంది నాకు. భాష చాలా కృతకం అనిపిస్తూ ఇంట్రెస్ట్ పోతుంది. సరళంగా, మంచి వ్యాకరణంతో చదివించే భాష ఉన్న పుస్తకాలు చాలా తక్కువ కనబడ్డాయి. ఉదాహరణకు ఓ రెండేళ్ల క్రితం చదివిన ‘Snake Charmer’s Dairy’ మంచి ఆంగ్ల వచనంతో ఇబ్బంది లేకుండా ఏకబిగిన చదివించింది. ఇంగ్లీష్ మాతృభాష కాని వారు వ్రాసినదని ఎక్కడా అనిపించలేదు. ఈ సంవత్సరం చదివినవి కొన్ని ఆ భాషతో ఇబ్బందులు పడలేక వదిలేసాను, 

సాధారణంగా నాకు ఆడియో పుస్తకాలు నచ్చవు. ఏకాగ్రత కుదరదు. ఈసారి కొన్ని కథల ఆడియో పుస్తకాలు వినడానికి  ప్రయత్నించాను, కానీ కాస్త పెద్ద కథ ఒక్కటీ దాటలేకపోయాను. వెనక్కి తిప్పి తిప్పి ఓ రెండు చిన్న కథల పుస్తకాలు పూర్తిగా వినగలిగాను. దీనితో మంచి పుస్తకాలు చదవడానికి నాకు వినడం అనేది ఆప్షన్ కాదని ఇంకోసారి స్పష్ఠమయిపోయింది. మొత్తం మీద చాలా నెలల పాటు ఏమీ చదవలేకపోయినా 2021 లో చదువు గురించి  నాకు కంప్లయింట్స్ లేవు.  

ఇంగ్లీష్ నవలలు, కథలు, అనువాదాలు :

Girls at War and Other Stories – Chinua Achebe: నైజీరియాలోని సామాజిక రాజకీయ పరిణామాల నేపధ్యంలో స్త్రీల జీవితపు సంఘర్షణని తెలియచేసే 12 కథల సంకలనం. ఇది ఈ రచయిత మొదట్లో వ్రాసిన కథలు అని విన్నట్టు గుర్తు. నేను ఈయన వ్రాసినవి దాదాపు అన్నీ చదివాను, చాలా బావుండే నవలలు African Triology చదివిన తర్వాత చదవడం వల్లేమో, ఒకటి రెండు కథలు తప్ప మిగిలినవి గొప్పగా అనిపించలేదు. ఒకసారి చదవొచ్చు.

Jiya Jale: The Stories of Songs – Gulzar and Nasreen Munni Kabir: ఇది గుల్జార్ వ్రాసిన కొన్ని ఫేమస్ పాటల పుట్టుకకు ప్రేరణ, రికార్డింగ్/చిత్రీకరణ సమయం లోని విశేషాలతో కూడిన ముచ్చట్లు. గుల్జార్ తో ఫిలిం/టెలివిజన్ జర్నలిస్ట్/రచయిత్రి నస్రీన్ సంభాషణలు దీనికి ఆధారం. ఈవిడ బాలీవుడ్ ఫిలిమ్స్/మ్యూజిక్ మీద చాలా మంచి పుస్తకాలు వ్రాసారు. ఎప్పుడన్నా వీలు చూసుకొని చదవాలి. పాటలు, సినిమాలు సాహిత్యం ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది ఇది.  

A Thousand Years of Good Prayers – Yiyun Li: కొన్నేళ్ళ క్రిందట ఈవిడ నవల Kinder than Solitude చదివిన తరువాత ఇంకేం వ్రాసారా అని వెదికితే ఈ కథల పుస్తకానికి మంచి రికమండేషన్స్ కనిపించాయి. ఇప్పటికి చదవటం కుదిరింది. మెలోడ్రామా లేని చక్కని గుర్తుండిపోయే కథలు. చక్కటి వైవిధ్యమయిన కథాంశాలు. ఈ పుస్తకానికి శారద మురళి గారు వ్రాసిన ఒక పరిచయం “వెయ్యేళ్ళ ప్రార్థన” ఇక్కడ.

Men Without Women – Ernest Hemingway : కొన్నేళ్ళ క్రితం ఇదే పేరుతో హరుకి మురకామీ వ్రాసిన కథల పుస్తకం చదివినపుడు, అదే పేరుతొ హెమింగ్వే కూడా కథల సంకలనం (1927) వ్రాసారనీ, ఆ పేరే ఈ మురకామీ కథలకి ప్రేరణ అనీ తెలిసింది. (హేమింగ్వే పుస్తకంలో టైటిల్ పేరుతో కథ లేదు.) ఈ కథలు ఎక్కువగా ఫిషింగ్/బాక్సింగ్ వేదికగా ఉన్నాయి. కొంచెం ఓపికగా చదవాలి. రెండు మూడు కథలు బాగా నచ్చాయి నాకు.

Good Bones and Simple Murders – Margaret Atwood : This is a collection of shorts along with ilustrations. Simply witty and thoughtful.

First Person Singular – Haruki Murakami: ఇది మురకామి వ్రాసిన ఎనిమిది కథల సంపుటి. ఈ కథల్లో కూడా అతని ఇతర రచనల్లోలా మానవ సంబంధాలు, జ్ఞాపకాలు, అంతర్లీనమైన తాత్వికత ముఖ్యాంశాలు. దాదాపు అన్ని కథలూ బావున్నాయి. వీటికి ఒక పరిచయం ఇక్కడ పుస్తకం.నెట్ లో.

Amora: Stories – Natalia Borges Polesso: ఈ బ్రెజీలియన్ రచయిత్రి వ్రాసిన దాదాపు ముప్పై కథలు. స్త్రీల మధ్య రిలేషన్స్ వివిధ పార్శ్వాలలో చిత్రించిన కథలు. దాదాపు అన్నీ లెస్బియన్ కథలు. అన్ని కథలూ బావున్నాయి, కానీ ‘Grand Ma, Are you Lesbian?’, ‘Aunt Betty’ కథలు ఎక్కువగా నచ్చాయి నాకు. ఈ కథల సంకలనానికి చాలా బహుమతులొచ్చాయిట. వీటి గురించి ఒక చిన్న నోట్ నా బ్లాగు లో.

Greenlights – Matthew McConaughey : ఇది ఈయన వ్రాసిన మెమొవార్ coupled with life lessons learned. ఆసక్తిగా చదివిస్తుంది కానీ మరీ మరీ తలుచుకునేంతగా నాకు గుర్తులేదు. నాకు ఆయన ఎక్స్చేంజ్ స్టూడెంట్ గా వేరే దేశంలో (ఆస్ట్రేలియా? మర్చిపోయాను) ఉన్నప్పటి భాగం అయితే మాత్రం నాకు ఎక్కువగా నచ్చింది.

I Know Why the Caged Bird Sings (Autobiography, #1) – Maya Angelou

Gather Together in My Name (Autobiography, #2) – Maya Angelou

Singin’ and Swingin’ and Gettin’ Merry Like Christmas (Autobiography, #3) – Maya Angelou

The Heart of a Woman  (Autobiography, #4) – Maya Angelou

All God’s Children Need Traveling Shoes   (Autobiography, #5) – Maya Angelou

A Song Flung Up To Heaven (Autobiography, #6) – Maya Angelou

Letters to My Daughter – Maya Angelou: ఈవిడ జీవితపు అనుభవాల నుంచి ఆడపిల్లలందరి కోసం వ్రాసిన వ్యాసాల కలెక్షన్. Letters to the daughter she never had.

Wouldn’t Take Nothing for My Journey Now -Maya Angelou : ఈవిడ వ్రాసిన ఇంకొక వ్యాసాల కలెక్షన్. Mostly spirituality based.

What is Stephen Harper Reading? Yann Martel’s Recommended Reading for a Prime Minister and Book Lovers of All Stripes: ఇది పుస్తకాల గురించిన పుస్తకం. కెనెడియన్ రచయిత యాన్ మార్టేల్ ప్రధాన మంత్రికి పుస్తకాలు రికమెండ్ చేస్తూ రాసిన 52 ఉత్తరాలు. పుస్తకాలు అంటే ఇష్టపడే వాళ్ళందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం అనిపిస్తుంది. చాలామంది చేత చదివించాను ఇష్టంగా దీన్ని.  ఒక చిన్న పరిచయం ఇక్కడ పుస్తకం.నెట్ లో.

101 Letters to a Prime Minister: The Complete Letters to Stephen Harper – Yann Martel: ఇది పై పుస్తకానికి పూర్తి వెర్షన్. రెండేళ్లపాటూ వ్రాసిన మొత్తం 101 ఉత్తరాలు కూడినవి.

Notes from Underground – Fyodor Dostoevsky: ఫేస్బుక్ లో కొందరు ఫ్రెండ్స్ క్లాసికల్స్ మళ్ళీ స్లో పేస్ లో ఎంజాయ్ చేస్తూ చదువుతుంటే, వాళ్లతో తర్వాతి పుస్తకానికి నేనూ కలిసాను.  నాకెందుకో మరీ పాత రచనలు చదివే ఓపిక తగ్గిపోయిందనిపిస్తుంది. ఈ మధ్య అవి ఏవీ పూర్తిగా చదవలేకపోతున్నాను. దీన్ని ఎలాగో పూర్తి చేసాను.

A Swim in a Pond in the Rain: In Which Four Russians Give a Master Class on Writing, Reading, and Life – George Saunders: ఇది రచయిత కొన్ని క్లాసికల్ కథలను తీసుకుని, వాటిని ఎలా అర్ధం చేసుకోవాలి, మంచి కథ లక్షణాలూ, కథ ఎలా రాయకూడదూ, కథలో పైకి కనిపించే పొరల వెనక దాగున్నవీ లాంటి ఎన్నో వివరాలతో విశ్లేషిస్తూ, మనల్ని కథతో పాటు నడిపిస్తూ వ్రాసిన వ్యాసాలు. ఈ సంవత్సరం చదివిన బెస్ట్ పుస్తకం ఇది. దీనితో నేను సాండర్స్ తో మోహంలో పడిపోయాను. తన వ్యాసం ‘కథ కొలనులో విహారం’ ద్వారా రమణమూర్తి గారు ఈ పుస్తకాన్ని పరిచయం చేసారు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నా స్పందన ఇక్కడ మరియు ఇక్కడ.    

Lincoln in the Bardo – George Saunders: ప్రెసిడెంట్ లింకన్ అతని పదేళ్ల వయసున్న కొడుకు చనిపోయినపుడు, బరియల్ జరిగే లోగా, ఫ్యునరల్ హోమ్ లో ఉంచిన శవాన్ని చూడడానికి రహస్యంగా రాత్రుళ్లు రావడం, అక్కడ ఇంకా విముక్తి పొందని ఆత్మలు/ఘోస్త్స్ మధ్య సంభాషణలూ పోట్లాటలూ గాసిప్స్ లాంటి విషయాలతో వ్రాసిన కల్పితం. పైన చెప్పిన పుస్తకం చదివిన మోహంలో ఉండగా అతను వ్రాసిన నవల అనీ, నెట్ లో దీనికున్న ప్రశంస చూసి పొరపాటు పడ్డాను. పూర్తి చెయ్యడానికి చాలా సహనం పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. మధ్యలో వదిలెయ్యాలని చాల సార్లు అనుకున్నా రచయిత మీదున్న నమ్మకంతో ఆశ చావక కొనసాగించాను. ఇతని కథలు బావుంటాయి అని విన్నాను ఈసారి అవి చదవాలి.

Notes on Grief – Chimamanda Ngozi Adichie: ఇది రచయిత్రి తన తండ్రి పోయిన దుఃఖం నుండి సంబాళించుకోడానికీ, తండ్రి ఇక లేరన్న వాస్తవాన్ని అంగీకరించి రాజీ పడే ప్రాసెస్లో వ్రాసుకున్న నోట్స్. ఎవరి దుఃఖం వారికి మాత్రమే స్వంతం. వాటినుండి బయటపడే విధాలూ వేరు గానే ఉంటాయి. ఆవిడ బాధ, ఉదాసీనత, జ్ఞాపకాలూ, భయాలూ అన్నిటినీ నిజాయితీగా వ్రాసుకున్నవి. 

Out of the Silence: After the Crash – Eduardo Strauch Urioste – 1972 లో Andes మంచు పర్వతాల్లో విమానం కూలిపోయిన ప్రమాదం నుండి కొంతమంది ప్రాణాలతో బయటపడి, అతి దారుణమయిన పరిస్థితుల్లో గడిపి, 72 రోజుల తరువాత అక్కడి నుండి రక్షించబడ్డారు.  వారిలో ఒకరు ఆ సంఘటన జరిగిన దాదాపు ముప్పై ఏళ్ళ తరువాత రాసుకున్న అనుభవాలు. ఇది ఇంకొక బెస్ట్ పుస్తకం ఈ సంవత్సరం లో చదివినది. ఆపకుండా చదివించడమే కాకుండా, ఆ తర్వాత చాలాకాలం ఆ అనుభవం మనల్ని వదలదు. ఒక చిన్న పరిచయం ఇక్కడ. ఇది చదివిన తరువాత ఇదే సబ్జెక్ట్ మీద ఇంకో రెండు పుస్తకాలు చదివాను. అన్నీ నచ్చాయి.

Miracle in the Andes – Nando Parrado: పైన చెప్పిన Andes ప్రమాదం పై ఇంకొక సర్వైవర్ వ్రాసిన అనుభవాలు.

Alive: The Story of the Andes Survivors – Piers Paul Read – Andes ప్రమాదం పై ఇంకొక పుస్తకం.

Selected Shorts: New American Stories – Chimamanda Ngozi Adichie, Aleksandar Hemon, Jhumpa Lahiri & Sherman Alexie వ్రాసిన నాలుగు కథల ఆడియో బుక్. కథలు బావున్నాయి.

Old man and the sea – Hemingway: క్రొత్తగా వచ్చిన తెలుగు అనువాదం ‘అతడే ఒక సముద్రం’ చదివినపుడు, ఈ ఒరిజినల్ పుస్తకం మళ్ళీ చదివాను. 

China Room – Sunjeev Sahota: ఇది 2021 బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్టు కోసం ఎంపిక కాబడిన పుస్తకం. పంజాబ్ లోని ఒక కుటుంబంలోని మెహర్ అనే స్త్రీ, ఆమె మనుమడి కథ. అక్కడక్కడా భాష కాస్త ఇబ్బంది పెట్టింది, కానీ పూర్తిగా చదవగలిగాను.

We Ate The Children Last – Yann Martel: దాదాపు పదేళ్ళ క్రిందట Life of Pi చదివిన తర్వాత యాన్ మార్టెల్ వ్రాసిన ప్రతీది దొరికినంత వరకూ చదివేసాను. ఆ వెదుకులాటలో ఆయన ‘We Ate The Children Last ‘ అనే కథ వ్రాసారని తెలిసి వెదకగా ఈమధ్య దొరికింది. అన్నేళ్ల వెదుకులాటకు తగిన కథ. ఈ కథ గార్డియన్ సైట్లో చదవండి. షార్ట్ ఫిలిం ఇక్కడ చూడొచ్చు.

The Moon Above His Head – Yann Martel: ఈ రచయిత రాసిన ఇంకో కథ కోసం వెదుకుతుండగా ఈ కథ కనిపించింది. గుండెల్లో దేవేసే కథ. కథ ఇక్కడ చదవండి. కథ గురించి మిగిలిన విశేషాలు ఇక్కడ చూడొచ్చు.

Anne – Anil Royal: ఇద్దరు చిన్న అమ్మాయిలూ, వాళ్ళ ఇమాజినరీ ఫ్రెండ్స్ గురించిన అందమయిన కథ. కథలోనో క్లూస్ గ్రహిస్తూ చదివితే చివరికి అద్భుతమయిన బంధం వెల్లడవుతుంది. ఎంతో చక్కగా, ఒక్క వాక్యమూ పొల్లు లేకుండా వ్రాసిన కథ. కథ ఇంగ్లీష్ లో రచయిత బ్లాగు లోనూ, తెలుగులో సారంగ పత్రికలోనూ చదవొచ్చు. నాకు ఇంగ్లీష్  వర్షన్ (ఒరిజినల్) బాగా నచ్చింది.

తెలుగు పుస్తకాలు

యారాడ కొండ – ఉణుదుర్తి సుధాకర్: ఆటా నవలల పోటీలో బహుమతి పొందిన నవల. విశాఖపట్నం కథ. మా వూరి కథ. మా ఊరు ఊరించి నాకు తెలీని విశేషాలు చెప్పిన కథ.  నన్ను చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి నెట్టి ఆ వీధుల్లో మళ్ళీ తిప్పిన కథ. నా జ్ఞాపకాల మెమొరీత ఇక్కడ. 

మనోధర్మపరాగం – మధురాంతకం నరేంద్ర: ఆటా నవలల పోటీలో బహుమతి పొందిన నవల. M.S. సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా దేవదాసి వ్యవస్థలోని పరిణామాల గురించి చెప్పాలనుకున్న నవల. నాకు పెద్దగా నచ్చలేదు. చాలావరకు చర్విత చరణమే. చాలా చోట్ల విసుగొచ్చి పేజీలు  తిప్పేస్తూ చదివాను.

అతడే ఒక సముద్రం – రవి వీరెల్లి & స్వాతి కుమారి: హెమింగ్వే ‘ఓల్డ్ మేన్ అండ్ సీ’ కి అనువాదం. అనువాదం సాఫీగా సాగింది కానీ కొన్ని చోట్ల కొంచెం మక్కికి మక్కీ అనువాదం అనిపించింది. కేశవరెడ్డి గారి ‘అతను అడవిని జయించాడు’ చదివాక అది కలిగించినంత ఉత్కంఠత కలిగించలేదు.

నేహల – గొర్తి సాయిబ్రహ్మానందం : హంపీ విజయనగర సామ్రాజ్య నేపధ్యంలో ఒక చారిత్రక నవల. ఆసక్తిగా చదివించిన పుస్తకం.   

జీనా హై తో మర్నా సీఖో – కాత్యాయని : జార్గ్ రెడ్డి సినిమా వచ్చిన రోజుల్లో దాని మీద చర్చలు చూసి సినిమా చూసాను. సినిమాలో చేసిన మార్పులు కాకుండా, ఆయన అసలు జీవితం గురించి తెలుసుకోవాలని ఆసక్తితో చదివాను.  

ఒక్క వాన చాలు – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి : వానలు కురవక వలస కూలీలుగా మారి, ఒక్క వాన కురిస్తే చాలు వెనక్కి ఊరికి పోయి పంటలు పండించుకోవచ్చని ఆశగా ఎదురుచూసే రాయలసీమ రైతుల కథ. ఈ రచయిత ఇతర రచనల్లానే ఆసక్తి చదివిస్తుంది.

కొండపొలం – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి: ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆత్మవిశ్వాసలోపంతో విఫలమవుతున్న ఓ గొల్ల యువకుడు, తనవాళ్ళతో కలిసి నెలరోజులు గోర్లు కాయడానికి కొండపోలం వెళ్ళడం, తిరిగి వచ్చే సమయానికి పెద్దపులిని ఒంటరిగా ఎదురించే స్థితికి చేరడం కధ. ఆ నెలరోజుల్లో మనకు చూపించిన జీవితాలెన్నో, నేర్పించిన పాఠాలెన్నో, మనసు కరిగించిన సంఘటనలెన్నో. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కో స్ఫూర్తి. మనల్ని కథతో పాటు కొండపోలం లాక్కుపోయి పుల్లయ్య తాత చెప్పే పాఠాలు ఇష్టంగా వినేలా చేస్తారు రచయిత.  ఇది తానా బహుమతి పొందిన నవల. 

గేదె మీది పిట్ట – తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి: అనుకోకుండా ప్రొఫెషనల్ వ్యభిచారిగా మారిన ఒక యువకుడి కథ. ఇప్పటి వరకూ తెలుగులో నేను చదవని వస్తువు ఇది. ఆడవాళ్ళు వివాహబంధానికి ఆవలి సంబంధాన్ని, అదీ ఏ అటాచ్మెంట్ రిస్కూ లేకుండా వాళ్ళ ఓన్ టర్మ్స్ లో ఏర్పరచుకోడం, మగవాళ్లు తమ ప్రమేయం లేకుండానో లేదా ఈజీ మనీ అనో దాన్నే ప్రోఫెషన్ గా మార్చుకోవడం, చదువుతుంటే బలే వింతగా అనిపించింది. ఎక్కడా అసభ్యత కనిపించకుండా, విముఖత కలగకుండా ఉన్న కథనం. 

ఒక వైపు సముద్రం – వివేక్ శానభాగ (అనువాదం: రంగనాథ రామచంద్రరావు): చిన్నవయసులోనే భర్తలను కోల్పోయిన అత్తా కోడళ్ళు సమాజం నుంచి తమని రక్షించుకోడానికి గయ్యాళుల అవతారం ఎత్తుతారు. పక్కింట్లో ఉండే కుటుంబమూ, వారి బంధువు తండ్రి లేని ఒక యువకుడు పండరి. వీరితో పాటు మిగిలిన కుటుంబ సభులు. జీవితంలో వీళ్ళకు ఎదురయిన ఆటుపోట్లు, వాటినుండి వీళ్ళు ఎలా సంభాళించుకున్నారన్నది కథ.  ఘాచర్ ఘోచర్ నవల చదివి నేను వివేక్ శానభాగ అభిమానిని అయిపోయాను. రంగనాథరావు గారి అనువాదం గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు.

ఏకాంతంలో నువ్వూ నేనూ – కుప్పిలి పద్మ: వివాహబంధం మీది గౌరవంతో, గయ్యాళి భార్యతో సర్దుకుపోయే సున్నితమనస్కుడు, సంస్కారీ అయిన ఓ భర్త. అతన్ని ఇష్టపడి, తనకి అతనితో ప్రేమ తప్ప పెళ్లి అక్కర్లేదు అని ప్రేమబంధంలోకి కోరుకున్న ఓ అమ్మాయి.  వాళ్లిద్దరూ ప్రేమ దగ్గిరే ఆగిపోయారా? అనుకున్నట్టుగా వాళ్లిద్దరూ తమ మధ్య ఇంకే బంధం లేకుండా ఉండగలిగారా? ఒక అతి సాధారణమయిన కథ. కాలక్షేపానికి ఒకసారి చదవొచ్చు. శైలి చూస్తే బహుశా ఇది ఎప్పుడో తన రచనాకాలం మొదట్లో వ్రాసారనుకుంటాను.

కామోత్సవ్ – గుంటూరు శేషేంద్ర శర్మ : ఫేస్ బుక్ లో ఈ పుస్తకం గురించిన పోస్ట్స్ చూసి, ఆసక్తి ఆపుకోలేక కొని చదివాను. శృంగారం పొంగిపొర్లుతుందని ఏమీ ఊహించలేదు కానీ, చాలా చిరాకు మాత్రం కలిగింది. ఒక రకమైన వెగటు కూడా. చాలా పాత్రలు బాలీవుడ్ లో పరిచయం ఉన్న వ్యక్తుల్లా అనిపించాయి. నాకు మొదటినించీ శేషేంద్ర గానీ ఆయన రచనలపై గానీ పెద్దగా ఆసక్తి లేదు. ఇందులో ప్రధాన పాత్ర ఆయన జీవితం ఆధారంగా అని విన్నాను. అదే నిజమైతే నాకున్న అయిష్టత సరైనదే అనిపిస్తుంది నాకు.

ప్రియురాలు పిలిచే – యండమూరి వీరేంద్రనాథ్ : సీరియస్ చదువు నుండి ఆటవిడుపు కోసం చదివిన నవల. ఒకప్పటిలా ఇతని రచనలు ఆహా అనిపించడం లేదు.

అనగా అనగా ఒక చిత్రకారుడు – అన్వర్: మనుషులూ, జ్ఞాపకాలూ, మమతలూ, పంతాలూ, పుస్తకాలూ, సినిమాలూ, పాటలూ, చిత్రకారులూ, ఇంకా ముఖ్యంగా కొంచెం ఎక్కువగా బాపూ … అన్నీ కలగలిసిన కలపోతలు. పుస్తకం కవర్, ప్రింట్ మాత్రం చాలా బావున్నాయి.

మా అమ్మంటే నాకిష్టం – వసుధేంద్ర  (అనువాదం రంగనాథ రామచంద్రరావు): కన్నడ రచయిత వసుధేంద్ర వ్రాసిన కథలు. టైటిల్ కథ ఒక్కటి చాలు, మనసు కరిగించడానికి. అన్నీ కథలూ నాకు నచ్చాయి. రంగనాథరావు గారి అనువాదం ఇవి తెలుగులో నేరుగా వ్రాసిన కథలేమో అన్నంత సహజంగా ఉంటుంది. వసుధేంద్ర గారి పుస్తకాలన్నీ తెలుగు లోనూ, ఇంగ్లీష్ లోనూ దొరికితే బావుండును అనిపిస్తుంది.

రామేశ్వరం కాకులు – తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి: ఇది పన్నెండు కథల సంకలనం. ఇందులోని గా.రా అనే రాజకీయ వ్యంగ్య కథ నాకు చాలా బాగా నచ్చిన హాస్య/వంగ్య కథ. నేను ఆ కేటగిరీలో అతి తక్కువ కథలు చదువుతాను. చదువుతూ చాలాసార్లు పగలబడి నవ్వుకున్నాను. ఉర్వి కథ నన్ను ఆకట్టుకోలేదు.  కచ్చప సీత కథలో కొన్ని వాక్యాలు చాలా బావున్నాయి. కథ కన్నా కూడా ఆ థీమ్ నచ్చింది నాకు. ఇవి తప్ప మిగిలిన కథలన్నీ బాగా నచ్చాయి.

సమాంతరాలు – తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి : ఇది ఐదు కథల సంకలనం. అన్నిటి లోనూ సమాంతరాలు కథ అతి పెద్దది, దాదాపు 40 పేజీలు. కానీ ఎక్కడా విసుగు కలిగించకుండా పట్టు సడలకుండా చదివిస్తుంది. పీటర్, దాసుగారు ఇద్దరి మీదా మనకి సానుభూతి, ఇష్టం కలుగుతాయి. ఈ సంకలనంలో నాకు బాగా నచ్చిన కథ కూడా ఇదే. మిగిలిన కథలు కూడా బావున్నాయి.

ఆ నీరు ఆ నేల ఆ గాలి – వేలూరి వెంకటేశ్వరరావు :  అమెరికాలోని తెలుగువాళ్ల మనస్తత్వం పై చురకలు ఈ కథలు. ఓ వైపు నవ్విస్తూనే ఆలోచన కలిగిస్తాయి. మంచి వచనం, శైలి కూడిన కథలు. 

సత్యవతి కథలు – పి.సత్యవతి: ఈ రచయిత్రి వ్రాసిన ఏదో కథ మీద చర్చ చూసి, దాని కోసం పుస్తకం తీసి మల్లె మొత్తం అన్ని కథలూ మళ్ళీ చదివాను. మొదటిసారి చదివించినంత ఆసక్తిగానూ చదివించాయి. 

కథ 2016 – కథా సాహితి: 2016 లో ప్రచురించబడ్డ కథల నుంచి ఏరి కూర్చిన సంకలనం.

దేవరశిల – వేంపల్లి గంగాధర్: దేవరశిల, అంజన సిద్ధుడు, తూరుపు కొమ్మలు మొదలైన పన్నెండు కథల సంకలనం. రచయిత పేరు పరిచయమే కానీ అప్పుడప్పుడూ పత్రికల్లో కథలు చదవడం వల్ల. ఇందులో కథలన్నీ బాగా నచ్చాయి నాకు.

ఐదో గోడ – కల్పన రెంటాల: ముఖ్యంగా ఎవరూ గుర్తించడానికీ, బయటకి మాట్లాడటానికీ ఇష్టపడని స్త్రీల సమస్యల గురించీ, మరికొన్ని కుటుంబ సామాజిక సమస్యల మీదా మంచి అవగాహనతో వ్రాసిన కథలు. ఇందులో 15 కథలు ఉన్నాయి. సరళంగా సాగే వాక్యనిర్మాణం కల్పన గారి సొంతం. కథలన్నీ చదివిస్తాయి, ఒకసారి ఆగి ఆలోచింపచేస్తాయి. ఉపన్యాసాలూ, సొల్యూషన్లూ, ఫెమినిస్టు వీరావేశాలు లేకుండా సమస్యలని ఎత్తి చూపిన కథలు.

మొరసునాడు కథలు – వివిధ రచయితలు (సంపాదకత్వం – స.వెం. రమేశ్): మొరసునాడు ప్రాంత రచయితలూ వ్రాసిన ముప్పై కథల సంకలనం. ఒకసారి చదవొచ్చు. రచయితలూ మొరసునాడు వారవడం తప్ప అత్యధిక కథల్లో మొరసునాడుకి సంబంధం లేనివే. కొన్ని కథలు ఏ ప్రాంతమయినా తేడా ఉండదు అన్పించేలానూ, అతి సాధారణంగానూ ఉన్నాయి. అతి కొన్ని కథలు మాత్రమే నాకు బాగా నచ్చాయి.

నేనున్నాగా – రంగనాథ రామచంద్రరావు: ఇవి రామచంద్రరావు గారు స్వయంగా వ్రాసిన కథలు. ఇందులోని చాలా కథలకు బహుమతులు వచ్చాయట. చదివినపుడు బాగానే నచ్చాయి. 

దింపుడు కళ్ళెం – రంగనాథ రామచంద్రరావు: ఇప్పటివరకూ నేను ఈయన కన్నడం నుండి తెలుగు లోకి చేసిన అనువాదాలు మాత్రమే చదివాను. ఆయన స్వంత కథలు చదవడం ఇదే మొదలు.

ప్రసిద్ధ సమకాలీన కన్నడ కథలు – వివిధ కన్నడ రచయితలు వ్రాసిన పన్నెండు కథలకు తెలుగు అనువాదం.

అరుణతార కథలు సంకలనం 5 – అడవిలోని వెన్నెల : ఈ క్రిందవన్నీ 1984 -88 మధ్యలో అరుణతార పత్రికలో ప్రచురించిన కథల నుండి కూర్చిన సంకలనాలు. (కినిగేలో ఈబుక్స్ గా దొరికాయి.)

అరుణతార కథలు సంకలనం 6 – నెలవు

అరుణతార కథలు సంకలనం 7 – ఒక వీరుడు మరణిస్తే 

అరుణతార కథలు సంకలనం 8 – బద్ లీ  

అరుణతార కథలు సంకలనం 9 – అరణ్య పర్వం

అసంపూర్తిగా ఉండిపోయినవి:

Sticky Ends and Unexpected Twists – వివిధ రచయితలు వ్రాసిన పన్నెండు కథలు. చదివినది వేరే వాళ్ళు. రచయితలలో Chekov, Julian Barnes తప్ప నాకెవరూ తెలీదు. ఆడియో పుస్తకాలు వింటూ తరచుగా నేను సైడ్ ట్రాక్ అయిపోతాను. ఏకాగ్రత కుదరదు. పదే పదే వెనక్కి తిప్పి వింటుంటాను కానీ మళ్ళీ మామూలే. పూర్తిగా విన్న పుస్తకాలు బహుశా లేవేమో.  ఇదీ చాలాసార్లు ప్రయత్నించి వదిలేసాను. ప్రస్తుతం ప్రింట్ పుస్తకం లేదనుకుంటాను. వస్తే చదవాలి.

The Brothers Karamazov – Fyodor Dostoevsky: ఎప్పుడో చదివిన పుస్తకం. క్లాసికల్స్ రీవిజిటెడ్ లో భాగంగా ఈ పుస్తకం ఆడియో విందామని మొదలెట్టి మధ్యలో వదిలేసాను. వీలు చూసుకుని పుస్తకం చదవాలి.

The Hating Game – Sally Thorne: ఇది ఏదో వర్క్ ప్లేస్ కామెడీ అన్నారని, మార్పు కోసం సరదాగా చదువుదాం అనుకున్నాను. రెండు చాప్టర్స్ కూడా చదవలేక వదిలేసాను.

Clear Light of Day – Anita Desai: బుకర్ ప్రైజ్ కి షార్ట్ లిస్టు అయిందనీ, మానవ సంబంధాలు గొప్పగా చిత్రించిన పుస్తకమనీ చదివి పుస్తకం మొదలుపెట్టాను. ఏమీ ఆసక్తిగా చదివించలేదు. మధ్యలోనే వదిలేసాను.

You Might Also Like

One Comment

  1. లియో

    ఏమీ చదవలేదని చాలా పుస్తకాలు చదివారే!

Leave a Reply