పుస్తక పఠనం- 2022

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

*******

వివిధ కారణాల వల్ల 2022 లో అనుకున్నన్ని పుస్తకాలు చదవలేకపోయాను. కాకపోతే చదివిన పుస్తకాల గురించి ఓ నాలుగు ముక్కలు ఒక దగ్గర వ్రాసుకొని వుండటం వల్ల, ఇప్పుడు ఈ వ్యాసం పంపగలుగుతున్నాను. 2022 లో నేను చదివిన ఆ కొన్ని పుస్తకాలు ఇవి,

  1. Critical – Robin Cook

స్పెషాలిటీ హాస్పిటల్స్ బాక్ గ్రౌండ్ తో వచ్చిన ఒక ఫిక్షన్ నవల ఇది. లాభాలు పెంచుకోవటానికి పని చేసే ఒక స్పెషాలిటీ హాస్పిటల్ లో, ఒక మాఫియా బాస్ పెట్టుబడి పెడతాడు. అదే సమయంలో స్పెషాలిటీ హాస్పిటల్స్ కి వ్యతిరేకంగా పనిచేసే ఒక సంస్థ ఈ హాస్పిటల్ ప్రతిష్టని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఇంతకు ముందు రాబిన్ కుక్ వ్రాసిన ‘ఫీవర్ ‘, ‘కోమా’, అనే నవలలు చదివి వుండడం వలన ఈ నవల కొన్నాను, కానీ ఇది కొంచం నిరుత్సాహపరిచింది అనే చెప్పాలి. కథ, కథనం అంత గొప్పవేం కాదు. ఒకసారికి చదివచ్చు లే అనుకున్నా, శైలి చాలా చోట్ల ఇబ్బంది పెట్టింది. ఎందుకో ఇంతకు ముందు చదివిన నవలల అంత గొప్పగా అయితే అనిపించలేదు.

2. How to mind map – Tony Buzan

టైటిల్ చదివి కొన్న పుస్తకం ఇది. వంద పేజీల చిన్న పుస్తకం.  మైండ్ మాప్స్ ఎలా చేయాలి, వాటి వల్ల ఉన్న ఉపయోగాల గురించి వివరించారు.  చదవదగ్గ పుస్తకమే. ఇంతకు ముందే ఎక్కడో విని, లేక చదివి వుండడం వల్ల, కొన్ని మైండ్ మాప్స్ సాఫ్ట్ వేర్ లు ఇన్స్టాల్చేసుకొని వాడడానికి  ప్రయత్నించాను. ఈ పుస్తకం చదివాక మైండ్ మాప్స్ ఉపయోగాలు ఇంకొన్ని తెలిసాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మైండ్ మాప్స్ కి ట్రేడ్ మార్క్ వీరి పేరు మీద వుందట.

3. Deep Work – Cal Newport

డీప్ వర్క్ అంటే ఏదైనా ఒక పనిని తీవ్రంగా లేక గాఢంగా నిమగ్నమై చేయటం. దీని వల్ల చేసే పని యొక్క విలువ పెరుగుతుంది.  షాలోవర్క్ లేదా పైపైన చేసే పనులు అంటే మన పనికి అంతగా విలువ ఇవ్వని పనులు. ఇలాంటి షాలో పనులని గుర్తించి, వాటిని మన పనిలో తగ్గిస్తూ, డీప్ వర్క్ ని ఎక్కువ చేయటం ద్వారా మన పనుల విలువ పెంచుకోవచ్చు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇంతే. విషయం మంచిదే అయినా, చెప్పాల్సింది కొంచమే అయ్యేసరికి, మళ్ళీ మళ్ళీ అదే చెప్పినట్టు అనిపించింది. పైగా శైలి కూడా అంత సరళంగా లేదు. ఏదో టెక్స్ట్ బుక్ చదివినట్టు అనిపించింది. కొంచం ఓపిక చేసుకొని చదవాల్సిన పుస్తకం ఇది.

4. రాముడికి సీత ఏమవుతుంది? – ఆరుద్ర

ఎప్పుడో కొన్న పుస్తకం ఇప్పటికి చదవగలిగాను. హేతువాద దృక్పథం తో, వివిధ దేశాల్లో వున్న రామాయాణాలను పరిశీలించి, అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా వుండేవో అన్న కోణంలో సాగిన మంచి రచన ఇది. సనాతనమైనవన్నీ పవిత్రమే అన్న భావం ఇప్పుడు విపరీతంగా ప్రభలుతోంది. ముఖ్యంగా సనాతన ధర్మం పేరిట, అప్పటి పరిస్థితులని, పద్ధతులని, వాటి నిజ రూపంలో ఊహించే ధైర్యం ఇప్పుడు తగ్గుతున్నట్టనిపిస్తుంది. పద్ధతులు, ఆచారాలే కాకుండా, దేవుళ్ళు, దేవతలు కూడా ఆయా దేశ కాల మాన పరిస్థితులకి అనుగుణంగా ఎలా మారవచ్చో ఇందులో వివరించారు. సనాతన ధర్మం అంటూ గుడ్డిగా ఊగే ప్రతి ఒక్కరూ, ఇలాంటి పుస్తకాలు చదవటం ద్వారా కొన్నైనా నిజాలు తెలుసుకుంటారు.

5. The pyschology of money – Morgan Housel

ఫైనాన్స్ మానేజ్మెంట్ మీద నేను చదివిన అతి తక్కువ పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం ఇది. స్టాక్ మార్కెట్ లో ఎలా సంపాదించాలి, తక్కువ సమయలో ఎక్కువ డబ్బులు ఎలా? లాంటి విషయాలు కాకుండా, చిన్నప్పటినుంచి అమ్మమ్మ, తాతయ్యలు, లేదా అమ్మా, నాన్నలు పాటించిన విషయాలనే, ప్రస్తుత పరిస్థితులకి సరిపోయే ఉదాహరణలతో చెప్పారు. క్రెడిట్ కార్డ్ లు, ఈఎం ఐ లు వచ్చిన తర్వాత, వినిమయోగ సంస్కృతి చాలా పెరిగింది. అవసరాలకంటే, అవసరంలేని వాటి మీద ఖర్చు పెరిగింది. సంపద పెరగడానికి పొదుపు ఎలా తోడ్పడుతుందో, దీర్ఘ కాలిక పొదుపులో ‘కాంపౌడింగ్’ అనే ప్రిన్సిపల్ ఎంత ప్రభావం చూపుతుందో, స్థాయికి తగ్గట్టు బ్రతకడం వలన కలిగే ప్రయోజనాలు వంటివి ఈ పుస్తకం వివరిస్తుంది. అందరూ తప్పక చదవవలసిన పుస్తకం ఇది.

6. Ikigai – Hector Garcia & Francesc Miralles

జపాన్ లోని మనుష్యులు ప్రపంచ సగటు కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. వారిలో కూడా, 100 సంవత్సరాలకు పైబైడి జీవించే వారు ఎక్కువగా వున్న ఒకినవా అనే ఒక ద్వీపంలోని ప్రజల అలవాట్లు, వారు అంత దీర్ఘకాలం బ్రతకడానికి దోహదపడే విషయాల్ని ఈ ఇద్దరు రచయితలు, అక్క్డే కొంతకాలం వుండి పరిశీలించి వ్రాసిన పుస్తకం ఇది. ప్రతీ మనిషికి నచ్చిన ఒక వ్యాపకం, నిరంతర పరిశ్రమ, అవసరానికంటే కొంచం తక్కువగ తినడం, స్నేహితులతో సరదాగా గడపడం వంటి అతి సామాన్య అలవాట్లు ఎలా మనకు ఉపయోగపడతాయో ఇందులో చెప్పారు.

7. వేప మండలు – ఎ. సంగీతా రెడ్డి

ఆన్లైన్లో దొరికిన పుస్తకం ఇది. పుస్తకం అనడం కంటే కూడా సీరియల్ సంకలనం అనడం కరెక్ట్. 1981 లో ఆంధ్ర ప్రభ వార పత్రిక లో పబ్లిష్ అయిన సీరియల్ సంకలనం ఇది. తులసి దళం నవల కి ఇది పేరడీ అని చూసాక ఆసక్తి కలిగి చదివాను. అక్కడక్కడా కొన్ని చమక్కులతో మొత్తమ్మీద సరదాగా చదివించిన రచన.

8. రసాయన మూలకాల రహస్యాలు – యెల్. వ్లాసొవ్, డి. త్రీఫనొవ్, అనువాదం – చట్టి శ్రీనివాస రావు

రసాయన శాస్త్రం మీద వచ్చిన ఒక రష్యన్ పుస్తకానికి తెలుగు అనువాదం ఇది. పీరియాడిక్ టేబుల్ లో వున్న ఒక్కొక్క రసాయన మూలకం కనిపెట్టడం వెనుక ఒక్కో కథ వుంది. వాటికి పెట్టిన పేర్ల వెనుక కూడా ఆసక్తికరమైన విశేషాలు వున్నాయి. అప్పుడప్పుడూ వికిపీడియా లో ఒక్కో మూలకం గురించి చదవడం ఒక ఆసక్తి. అలాంటి నాకు ఈ పుస్తకం టైటిల్ చూడగానే నచ్చింది. నేను ఊహించిన విధంగా లేకపోయినా, చాలా కొత్త విషయాలు నేర్పింది. మంచి పుస్తకమే, కానీ చదవడానికి కొంచం ఓపిక అవసరం.

9. The Compound Effect – Darren Hardy

2010 లో విడుదలయిన ఈ పుస్తకం పదవ వార్షిక ఎడిషన్ చదివాను. మనం చేసే చిన్న చిన్న పనులైనా సరే, పద్దతిగా, క్రమంగా, కన్సిస్టెంట్ గా చేస్తుంటే, దీర్ఘకాలంలో ఎంతటి పెద్ద ఫలితాలు వస్తాయో వివరించే పుస్తకం ఇది. దాన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. మంచి ఉదాహరణలతో ఈ విషయాన్ని వివరించారు. అయితే, ప్రతీ దానికి ప్లానింగ్ వుండాలి, డైలీ ప్లానింగ్, వీక్లి ప్లానింగ్, మంత్లీ ప్లానింగ్, క్వార్టర్లీ ప్లానింగ్… ఇలా ప్రతీ పనికి ప్లానింగ్ అంటే కొంచం కష్టమే.

రచయిత ప్రతీ వారం తన మిత్రుడితో కలిసి, ఆ వారం ఎలా గడిచిందో మాట్లాడుకొని, తన బలాలూ, బలహీనతలని అర్థం చేసుకుంటారు. అదే విధంగా ఇంట్లో కూడా ప్రతీ వారం, తన భార్య తో కలిసి ఆ వారం తమ రిలేషన్షిప్ కి ఎంత రేటింగ్ ఇస్తుందో కూడా తెలుసుకుంటారట. ఇది చాలా అతి అనిపించింది. భార్య భర్తల మధ్య ఇలాంటి సంభాషణ అవసరం లేదని కాదు, కానీ ప్రతీ వారం, ఇలాంటి పర్ఫార్మెన్స్ రివ్యూ అంటే… ఏమో…

ఇలా నాకు అంగీకారం అనిపించని కొన్ని విషయాలు వదిలేస్తే, ఇందులో చెప్పిన ముఖ్య సూత్రం మాత్రం చాల నిజం అనిపించింది.

10. Terra – 205 – Madhubabu

చాలా సంవత్సరాల తర్వాత నేను చదివిన మధుబాబు నవల ఇది. షాడో కి పెళ్ళయ్యి, ఒక బాబు కూడా (మాస్టర్ షాడో) వున్నాడని తెలిసి సంతోషంగా అనిపించింది. గంగారాం స్థానం లోకి  శ్రీకర్ వచ్చాడు. కులకర్ణి గారు కులాసాగానే వున్నారు. ఇంకో అద్బుతమైన విషయం, షాడో, శ్రీకర్ లు అనుకోకుండా అంతరిక్షంలోకి, అందులోనూ మనలాంటి జీవం కలిగిన ఒక గ్రహం ‘టెర్రా 205’ అనే గ్రహానికి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత చదువుతున్న షాడో నవల నాకు ఇన్ని సర్ప్రైసెస్ ఇస్తుందని ఉత్సాహంగా చదువుతూ వెళ్తుంటే, ఈ అంతరిక్షం లో ప్రయాణం అనేది వాళ్ళు అనుభవించిన ఒకలాంటి భ్రాంతి అని మధుబాబు గారు నా ఉత్సాహాన్ని నీరుగార్చారు.  అయినా, మొత్తమ్మీద షాడో నవల ఎలా వుండాలో అలానే వుంది ఈ నవల కూడా.

11. Outliers – Malcolm Gladwell

ప్రపంచం లో కొందరు బాగా ఉన్నతిని సాధిస్తారు, కొందరు అలా వుండిపోతారు. గొప్పవాళ్ళు అలా అవ్వడానికి కేవలం వారి తెలివి, శ్రమ, పట్టుదలలే కారణమా? లేక వేరే ఇతర అంశాలు ఏవైనా వారికి తోడ్పడ్డాయా అన్న ప్రశ్నని ఆధారం చేసుకొని ఈ పుస్తకం వ్రాయబడింది. సక్సెస్ ఐన చాలా మంది దేశ కాల మాన పరిస్తితులని విశ్లేషించి చూస్తే, వారి ఉన్నతికి కేవలం వారి తెలివి, శ్రమలే కాకుండా చాలా ఇతర కారణాలు కూడా తోడ్పడ్డాయి అని అంటాడు రచయిత. అలా అని వ్యక్తుల తెలివినీ, శ్రమని తక్కువ చేసి చెప్పడు. సక్సెస్ అయిన వ్యక్తుల మీద దురభిమానం పెంచుకోకుండా, వారితో పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకోకుండా వుండడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. నేను మంచి పుస్తకం.

12. Blink – Malcolm Gladwell

Outliers పుస్తకం చదవగానే, ఈ రచయితదే మరో పుస్తకం నా దగ్గర వున్న సంగతి గుర్తుకొచ్చి, పుస్తకాలు తిరగేస్తే ఎప్పుడో 2007 లో బెంగుళూరు లో కొని ఇప్పటివరకూ చదవకుండా వున్న ‘Blink’ దొరికింది. పూర్తిగా చదవడానికి కొంచం కష్టపడాల్సొచ్చింది. మొదటి చూపులోనే మనం ఒక వ్యక్తి మీదో, వస్తువు మీదో, మరో విషయం మీదో ఒక అభిప్రాయం ఏర్పరుచుకుంటాం. అది ఎంతవరకు సమంజసం? First impression is the best impression అన్న నానుడి వుండనే వుంది. అది సైంటిఫిక్ గా నిలుస్తుందా అన్న విషయం మీద వ్రాయబడిన పుస్తకం ఇది. మొత్తమ్మీద తేలిందేమిటంటే, కనురెప్పపాటులో మనకి కలిగే అభిప్రాయం చాలా సార్లు సరి అయిందే అవుతుందని, కానీ కొన్ని ప్రత్యేక విషయాల్లో, ఒక సంఘటనని మనం, రెప్పపాటు లో నిర్ణయించాలంటే, మనం ఆ విషయం లో నిష్ణాతులమై వుండాలి. లేకపోతే ఒక్కోసారి మన నిర్ణయం చాలా తప్పయ్యే అవకాశం వుంది. క్షణకాలం లో తీసుకున్న నిర్ణయాల వలన జరిగిన మంచి ఇంక చెడుల గురించి వివిధ సంఘటనలతో ఉదాహరణాలు  చూపెట్టారు.

13. యాత్ర – వంశీ

ఒక ఆన్లైన్ వారపత్రికలో దొరికిన చిన్న నవలిక ఇది. యూరోప్ లో షూటింగ్ కి వెళ్ళిన ఒక సినీమా ట్రూప్ లో జరిగిన విశేషాలు ఈ కథలో ముఖ్యం. నిజ జీవితం లో జరిగిన విషయాలకి కొంత ఫిక్షన్ జోడించారేమో అనిపించింది. పాశ్చాత్య సంగీత విద్వాంసుడు అయిన మొజార్ట్ కి సంబంధించిన విశేషాలు ఎక్కువగా తెలిసాయి. వంశీ గారి రచనలలో వుండే భావుకత పాలు కొంచం తగ్గినా, ఆయన శైలి కనిపిస్తుంది. రెండు గంటల్లో చదవగలిగే చిన్న పుస్తకం ఇది.

14. తెగింపు – అగ్ని శ్రీధర్

ఈ పుస్తకం కూడా ఆన్లైన్లోనే దొరికింది.  ఇంతకు ముందే Bhais of Bengaluru అనే పుస్తకం చదవడం వల్ల ఈ అగ్ని శ్రీధర్ అనే వ్యక్తి గురించి కొంచం తెలుసు. స్వయంగా ఆయనే వ్రాసిన పుస్తకం అనేసరికి దొరికిన వెంటనే చదివేసాను. తను underworld లో పని చేస్తున్నప్పుడు జరిగిన ఒక నిజమైన సంఘటనే ఈ నవలికకి ఆధారం. చదివాక చాలా ఆశ్చర్యమనిపించింది. ఇద్దరు క్రిమినల్స్, జీవితం మీద ఎంత అవగాహనతో వున్నారో అన్న విషయం మొదటిదైతే, ఇంత మంచి రచయిత పూర్వ జీవితం అలా ఎందుకు గడిచిందో అన్న విషయం రెండోది. 

ఒక మనిషి, తనని చంపబోతున్నారు అన్న విషయం తెలిసిన తర్వాత తనని చంపబోయేవారితో రెండు రోజులు గడపడమే ఈ నవలలో ప్లాటు. చాలా బాగా వ్రాసారు. 62 పేజీల చిన్న నవలిక. దొరికితే తప్పకుండా చదవండి. ఈ పుస్తకంలోని శైలి ఎంత నచ్చిందంటే, వెంటనే ఈ రచయిత పుస్తకాలు అన్నీ కొనేద్దామని వెతికితే,  ఈయన కన్నడలో వ్రాసిన ఏడెనిమిది పుస్తకాల్లో  కేవలం రెండింటికి మాత్రమే తెలుగు అనువాదాలు కనిపించాయి. ఒకటి ఇందాకే చదివాను. మరో పుస్తకం ‘Gangs Of Bangalore నా దాదాగిరి రోజులు ‘ అనే పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేసాను. ఆ పుస్తకం ఎలా వుంటుందో చూడాలి.

15. Who will cry when you die? – Robin Sharma

The monk who sold his ferrari వ్రాసిన రచయిత పుస్తకం ఇది. మనల్ని మనం మెరుగుపరుచుకునే ప్రయత్నంలో మనకి తొడ్పడగలిగే ఒక 101 విషయాల మీద వ్రాసిన చిన్న చిన్న వ్యాసాల సంకలనం. The monk who sold his ferrari చదివిన వెంటనే ఒక ఉత్సాహం, ఉద్రేకం లాంటివి కలిగి, కొంత కాలం పాటు కొన్ని విషయాలు ఆచరించాను. కానీ కొంతకాలానికి ఆ ఉద్రేకం తగ్గిపోయి, మళ్ళీ అంతా పూర్వం లాగే అయ్యింది. మరో ఫ్రెండ్ కి ఆ పుస్తకాన్ని ఇస్తే, కొంత చదివి, ‘ఇంత ఫోర్సిబుల్ గా వుందేంటీ ‘ అని వెనక్కిచ్చేసారు. అప్పుడర్థమయ్యింది, ఈయన శైలి ఇంతే అని. చదివినంత సేపూ  ఒక ఉద్రేకం వచ్చేలా వుంటుంది. ఇంక మనం ఆ పని చేయక తప్పదేమో అనిపించేలా వ్రాస్తారు. కానీ ఆలోచిస్తే, ఆయన చెప్పేవాటిలోనే పరస్పర విరుద్ద విషయాలు వుంటాయి. ఒక చోట ఒకలా వుంటుంది, మరో చోట ఇంకోలా చేయమని వుంటుంది.  ఈ పుస్తకం లో కూడా కొన్ని విషయాలు అలాగే అనిపించాయి.  The monk who sold his ferrari చదివిన వారికి ఈ పుస్తకం ఏమంత కొత్తగా అనిపించకపోవచ్చు. నా వరకు మాత్రం ఒక కొత్త కాన్సెప్ట్ పరిచయం అయ్యింది. అదే Six degrees of separation. అంటే నేను, ఈ ప్రపంచం లోని మరే వ్యక్తి తోనైనా కేవలం, మరో ఆరుగురి ద్వారా కనెక్ట్ అవ్వగలను. అంటే, జో బిడెన్ తో అయినా, వ్లాదిమర్ పుతిన్ అయినా నాకు కేవలం మరో ఐదు పరిచయాల దూరంలో వున్నారు.వీళ్ళే కాదు ప్రపంచంలో ఎవ్వరైనా సరే. ఆలోచిస్తే ఇది నిజమేనేమో అనిపించింది. ఈ పుస్తకం మొత్తంలో నేను కొంచం ఎగ్జైట్ అయ్యింది ఇక్కడే.

16. Gangs of Bangalore (నా దాదాగిరి రోజులు 1974 – 86) – అగ్ని శ్రీధర్ (అనువాదం – సృజన్)

బెంగుళూరు అంటే ముందునుంచీ నాకు ఒక ప్రత్యేక అభిమానం. నా ఉద్యోగ జీవితంలో భాగంగా కొన్నేళ్ళు నేను అక్కడ వుండడం వల్ల కావచ్చు, ఆ నగరం లో నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలు వుండడం వల్ల కావచ్చు. నా వరకూ నాకు బెంగళూరు సెకండ్ హోం లాంటిది. 

పగలు చూసే బెంగుళూరు కి రాత్రి చూసే బెంగుళూరు కి చాలా తేడా వుంటుందన్న విషయం నాకు అక్కడికెళ్ళిన  కొంతకాలానికే అర్థం అయ్యింది. ఒకసారి రాత్రి ఒంటరిగా నడుస్తున్న నన్ను కొట్టి నా మొబైల్ ఎత్తుకుపోయారు. మరో రెండుసార్లు ఆటోవాళ్ళతో   అర్థరాత్రి దెబ్బలాడే పరిస్తితి తృటిలో తప్పింది.  ఇలాంటి చెడు సంఘటనలు కూడా నాకు కొన్ని మంచి విషయాలు నేర్పించాయి. అక్కడి లోకల్ ఫ్రెండ్ తో ఒకసారి బ్రిగేడ్ రోడ్ లోని ఒక పబ్ కి వెళ్ళినప్పుడు ఒక లావుపాటి వ్యక్తి ని చూపించి అతనే అక్కడి లోకల్ రౌడీ అన్నాడు. నాకు నమ్మకం కలగలేదు. హైదరాబాద్ లో పుట్టి బుద్దెరిగాక ఎన్నడూ ఒక్క రౌడీని కూడా చూడని నాకు బెంగళూరు లో ఒకతన్ని చూపించి ఇతనే రౌడీ అంటే ఆశ్చర్యంగానే వుంటుంది. కానీ తర్వాత అర్థమయ్యిందేమిటంటే అతను నిజమే చెప్పాడని. ఇప్పటికీ కొద్దో గొప్పో అక్కడ ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు.

ఇంతకుముందే Bhais of Bengaluru అనే పుస్తకం, మొన్ననే అగ్ని శ్రీధర్ గారి మరో చిన్న పుస్తకం ‘తెగింపు ‘ చదవడం వల్ల,  ఈ పుస్తకం గురించి తెలిసింది. ఆర్డర్ చేసి, పుస్తకం చేతిలోకి రాగానే ఏక బిగిన చదివాను.

1974 నుంచి 1986 వరకూ, అండర్ వరల్డ్ తో ఈ రచయిత కున్న పరిచయాలు, అతని అనుభవాలే ఈ పుస్తకం. ఇంత మంచి శైలి, సాహిత్యం మీద మొదటి నుంచి ఆసక్తి వున్న అతను  ఒక క్రిమినల్ గా మారి, అలాంటి పనులు ఎలా చేసాడో అనిపించింది.

ఈ పుస్తకం గురించి ఒక కథ లాగా విశ్లేషించడం కష్టం. ఇది ఒక్క కథ కాదు, ఎంతోమంది వ్యక్తులు, వారి గురించిన ఎన్నో కథలు ఇందులో వున్నాయి. Dongri to Dubai, Mafia queens of Mumbai లాంటి క్రైం పుస్తకాలు చదివేవాళ్ళకి ఈ పుస్తకం తప్పకుండా నచ్చుతుంది. మొదట కన్నడ లో విడుదలై, తర్వాత ఆంగ్లం లోకి అనువదింపబడి, తర్వాత తెలుగులోకి వచ్చింది. ఇది మొదటి భాగం మాత్రమే, దీని తర్వాత Dadagiriya Dinagalu – Vol 2 1986 To 1991 , ఇంకా Dadagiriya Dinagalu – Vol 3 1991 To 2000 అని ఇంకో రెండు పుస్తకాలు కూడా కన్నడలో వచ్చాయి. తెలుగులోకి ఇంకా అనువాదం అయినట్టు లేవు.  ఇతను రచయితే కాకుండా, నటుడు, దర్శకుడు కూడా. ఇతని పుస్తకాలు ఆధారంగా చేసుకొని కొన్ని సినీమాలు కూడా వచ్చాయి.  ఇతని మిగతా పుస్తకాలు కూడా త్వరగా తెలుగులోకి అనువదింపబడాలని కోరుకుంటున్నాను.

17. My days in the underworld – Rise of the Bangalore Mafia – Agni Sreedhar

Gangs of Bangalore (నా దాదాగిరి రోజులు 1974 – 86) అన్న పుస్తకం చదివినిన తర్వాత, ఏదో వెలితిగా అనిపించింది. అది కేవలం మొదటి భాగమే. ఆసక్తిగా వింటున్న కథని సగంలో ఆపి, పార్ట్ 2 లో మిగతాది చదవండి అంటే ఎలా? అసలు మిగతా భాగాలు తెలుగులోకి అనువదింపబడతాయో లేదో తెలీదు. అప్పుడు మరికొంత పరిశోధన చేస్తే తెలిసింది, ఇంగ్లీషు పుస్తకం లో మొత్తం కథ వుందని. వెంటనే కొని చదివాను. ఇంగ్లీషు వెర్షన్ చాలా సంక్షిప్తంగా వుంది.  తెలుగు పుస్తకం 440 పేజీలు అయితే ఇంగ్లీషు పుస్తకం 429 పేజీలే. తెలుగు పుస్తకం కొత్వాల్ రామచంద్ర హత్య తో ముగుస్తుంది. అదే సంఘటన ఇంగ్లీషు వెర్షన్ లో 107 వ  పేజీలో వస్తుంది. అంటే తెలుగులో 440 పేజీలలో చెప్పిన విషయాన్ని ఇంగ్లీషులో 107 పేజీలకు కుదించారు. విషయ వివరణలో వున్న తేడా రెండు పుస్తకాలు వెంట వెంటనే చదివిన నాకు తేలిగ్గానే అర్థమయ్యింది. కొత్వాల్ రామచంద్ర హత్య తర్వాత, జయరాజ్ కి దగ్గరవ్వటం , తర్వాత కొంతకాలానికి విభేదించి విడిపోవటం, తర్వాత జయరాజ్ హత్యతో ముత్తప్ప రాయ్ వెలుగులోకి రావటం.  అతనితో కలిసి కొంత కాలం పనిచేయడం, తర్వాత అతనితో కూడా విభేదించి బయటకి రావడం. బెంగుళూరు రౌడీలు శ్రీధర్ ని తమ బాస్ గా ఒప్పుకోవడం, కొంతకాలానికి తన మీద హత్యా ప్రయత్నం, తర్వాత, జర్నలిజం లోకి వచ్చి పత్రిక పెట్టడం ఇవన్నీ ఇంగ్లీషు పుస్తకంలో వున్నాయి.

‘తెగింపు ‘ అన్న నవలిక లో జరిగన సంఘటన ఈ పుస్తకం లో కనీసంగా కూడా వివరించలేదు. కన్నడ లో మూడు భాగాలుగా వ్రాసిన పుస్తకాన్ని ఇంగ్లీషులో కేవలం ఒక్క పుస్తకం గా వ్రాయడం వలన చాలా విషయాలు లేకపోయి వుండొచ్చు.

ఇంత వివరంగా అప్పటి విషయాలని గ్రంథస్తం చేయడం ఒక గొప్ప విషయమైతే, అన్నీ తానే అన్నట్టు చెప్పిన విషయాలు ఎంత వరకూ వాస్తవమో తెలియకపోవడం ఒక లోపం. క్రైం పుస్తకాలని ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చే పుస్తకాలు ఇవి. 

18. రాబిన్ సన్ క్రూసో- Daniel Dephoe

చిన్నప్పుడు చదవలేదని ఇప్పుడు చదివాను. నాకు నచ్చింది. చిన్నవారికైనా, పెద్దవారికైనా నచ్చేట్టుగా వుంది. అందుకే క్లాసిక్ గానిలబడిపోయింది.

19. Dead Men Tell Tales – Dr B. Umadathan

ఎక్కడో పేపర్లో ఈ పుస్తకం గురించి చదివాక తెప్పించాను. క్రైం థ్రిల్లర్స్ చదివేవారికి ఇది బాగా నచ్చుతుంది. ఒక మలయాళి ఫోరెన్సిక్ డాక్టర్ తన కెరియర్ మొత్తం లో చూసిన కొన్ని ఆసక్తికరమైన కేసుల గురించి వివరిస్తాడు. ఇది చదివాకే, నెట్ ఫ్లిక్స్ లో ‘కురుప్’ అనే మలయాళం సినీమా చూసాను. కురుప్ పోస్ట్ మార్టం చేసింది ఈ డాక్టరే. ఆపకుండా చదివించే ఒక మంచి పుస్తకం.

20. మల్లాది గారి క్రైమ్ కథలు – మల్లాది వెంకట కృష్ణమూర్తి

అమెరికన్ క్రైం కథలంత కాకపోయినా, కొన్ని కథలు బావున్నాయి.

21. The body- Bill Bryson

ఈ పుస్తకం గురించి ఒక వ్యాసమే వ్రాయొచ్చు. చాలా మంచి పుస్తకం.  మధ్యలో మరీ టెక్నికల్ గా అనిపించినా, తప్పకుండా చదవాల్సినపుస్తకం.

ఇవి కాక ఈ సంవత్సరం నేను చదివిన మరి కొన్ని పుస్తకాలు,

  • ట్రావెలగ్ మెక్సికో – మల్లాది వెంకట కృష్ణమూర్తి
  • అతీంద్రియ కథలు – మల్లాది వెంకట కృష్ణమూర్తి
  • A short history of nearly everything – Bill Bryson
  • అద్భుత జెన్ కథలు – సౌభాగ్య
  • మృత్యు కెరటం – మంజరి

You Might Also Like

Leave a Reply