కొన్నికలలు కొన్నిమెలకువలు: వాడ్రేవు చినవీరభద్రుడు

వ్యాసకర్త: శశిధర్

వాడ్రేవు చినవీరభద్రుడు గారి రచనలలో నేను మొదట చదివినది నేను తిరిగిన దారులు. ఆ పుస్తకం బాగా నచ్చి వారి వేరే పుస్తకాల గురించి వెతికాను కానీ అప్పటికి నాకు ఏమీ దొరకలేదు. VVIT వారి యూట్యూబ్ ఛానల్​లో వారు ప్రచురించిన నేతి సూర్యనారాయణశర్మగారి రచన “శంకరవిజయం” పుస్తకావిష్కరణ సభకి వాడ్రేవు చినవీరభద్రుడు గారిని ముఖ్యఅతిధిగా ఆహ్వానించిన సందర్భంలో చినవీరభద్రుడి గారిని పరిచయం చేస్తూ మోదుగుల రవికృష్ణ వారి రచనల గురించి క్లుప్తంగా చెప్పారు.

(VVIT 10th BOOK Launch నేతి సూర్యనారాయణశర్మగారి రచన “శంకరవిజయం” గ్రంథావిష్కరణ.)

అది చూసి కొన్నికలలు కొన్నిమెలకువలు కోసం వెతకటం మొదలుపెట్టాను. ఎక్కడా అందుబాటులో లేదు. మాకు దూరంగా ఉన్న ఒక గ్రంధాలయంలో ఉంది కానీ కరోనా పరిస్థితుల వల్ల పంపలేమన్నారు. యింక దొరకదు అనుకున్న సమయంలో నవోదయలో కనపడింది. వెంటనే కొన్నాను. ఆసక్తి ఉంటే వెంటనే కొనుక్కోండి. యింత మంచి పుస్తకం మరో ముద్రణకు 15 సంవత్సరాలు పట్టటం ఆశ్చర్యం.

మహాత్మాగాంధీ గారు విద్య గురించి చెప్పిన మాటలతో పుస్తకం మొదలు అవుతుంది.

అన్నిటి కన్నా పెద్ద చిక్కేమిటంటే ప్రజలకి నిజంగా విద్య అంటే ఏమిటో తెలియకపోవటం. భూముల్ని విలువగట్టినట్టు, మార్కెట్‌లో షేర్లని విలువగట్టినట్లు విద్యని కూడా మనం విలువకట్టడానికి ప్రయత్నిస్తుంటాం. మన పిల్లలు బాగా సంపాదించడానికి ఏది పనికొస్తుందో అటువంటి చదువునే వాళ్లకివ్వాలని కోరుకుంటాం. చదువంటే విద్యార్థుల శీలాన్నీ, సత్ప్రవర్తననీ పెంపొందించడమనే భావన మనకేమాత్రం కలుగనే కలగదు.

“ముందుగా కొన్ని మాటలు” లో రచయిత విద్యకు సంబంధించి తనకున్న కలల్ని, తన ప్రయాణంలో కలిగిన మెలకువల్ని ప్రస్తావించారు. అసలు విద్య అంటే ఏమిటి కేవలం నైపుణ్యమా అంతకు మించి ఏమన్నానా. యాంత్రిక నైపుణ్యమా, సృజనశీల నైపుణ్యమా లేక మార్కెట్​కు కావలసినదే విద్యా అని చర్చించి తన నమ్మకాలు, ఆకాంక్షలు వివరించారు. నా వరకు అసలు పుస్తకం కన్నా ఈ ప్రశ్నలూ, ఆలోచనలు నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి. తమ పిల్లలకు ఎలాంటి విద్య అందించాలని ఆలోచించే ప్రతి తల్లీ తండ్రీ తప్పకుండా చదివి ఏ మార్గం ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి.

నేటి విద్య సమగ్ర విద్య కాదు.

అది కేవలం నేటి మార్కెట్​కి అనువైన రీతిలో వస్తుసేవల ఉత్పత్తిని శీఘ్ర తరం చెయ్యడానికీ, అధికతరం చెయ్యడానికీ, లాభదాయకం చెయ్యడానికీ అనువైన రీతిలో కొన్ని నైపుణ్యాల్ని ఇవ్వడం, ఉన్న నైపుణ్యాల్ని ఉన్నతీకరించడం, కొత్త నైపుణ్యాల్ని అన్వేషించడం మాత్రమే.

దీనికి, విద్యానుభవ ప్రధాన లక్ష్యాలైన ఆత్మిక జాగృతికీ, శీలనిర్మాణానికీ, సహజీవనసంస్కృతికీ ఏమీ సంబంధం లేదు.

ఎక్కడన్నా సంబంధం ఉన్నట్టు కనిపించినా అది యాదృచ్ఛికమో లేదా ఇంకా నశించడానికి ఇచ్చగించని సంప్రదాయిక సంస్థల అవశేషమో తప్ప మరేమీ కాదు.

ఈ నైపుణ్యాల్ని అందించడమే నేటి విద్యావిధాన ప్రధాన లక్ష్యమని మనం అంగీకరించినా కూడా, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో పైకి సార్వత్రికత ఉన్నట్టు కనిపిస్తున్నా, నిజానికి అది లోపల్లోపల మానవసమాజాన్ని సుపీరియర్, ఇన్ఫీరియర్ సమూహాలుగా విడగొట్టడం తప్ప మరేమీ కాదు.

“ఆదర్శపాఠశాల ఒడిలో” అనే శీర్షిక క్రింద రచయిత తాడికొండ గురుకుల పాఠశాలలో తన విద్యాభ్యాసం అనుభవాలను పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కొత్తగా ప్రారంభించిన ఆ గురుకుల పాఠశాల ఒక ఆదర్శ పాఠశాలగా ఎలా ఎదిగిందో, అందుకు కారణమైన గురువులు వారు అవలంబించిన పద్ధతులు చాలా ఆసక్తికరంగా వివరించారు రచయిత. అన్ని పాఠశాలలు ఇలా ఉంటే ఎంత బాగుండునో కదా అనిపించింది. కేవలం మార్కులు, రాంకులు కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే వ్యవస్థ మాత్రమే పిల్లలకు న్యాయం చేయగలదు.

కాని సృజనశీల పాఠశాలల్లో కూడా వ్యక్తి కౌశల్యం పెరగడం మీదనే దృష్టి ఉంటుంది గాని, అతడికి తన తోటిమనిషితో జీవించడమెలా అన్నది తెలియపర్చడం మీద దృష్టి ఉండదు. సృజనశీల పాఠశాలలు గొప్ప వ్యక్తుల్నీ, ప్రతిభావంతులైన కళాకారుల్నీ తయారుచెయ్యగలవు తప్ప ఉత్తమ సమాజాన్ని సృష్టించలేవు.

ఆ పని చేయాలంటే విద్య తన మూడవస్థాయికి ఎదగాలి. అదొక ఆదర్శ పాఠశాలను నిర్మించగలగాలి. ఆ ఆదర్శ పాఠశాల మనిషి ఇంద్రియాలకూ, మనసుకీ మాత్రమే కాక అతని ఆత్మకి కూడా శిక్షణ ఇస్తుంది. తద్వారా అది అతనిలోని పశువునిగాక ఆత్మగుణాన్ని బయటకు తెస్తుంది. అందువల్ల ఆదర్శపాఠశాలల్ని దర్శనశీల పాఠశాలలని (విజనరీ స్కూల్స్) కూడా పిలవాలనుకొంటున్నాను.

తాడికొండ పాఠశాల అటువంటి దర్శనశీల పాఠశాలగా ఎలా ఎదిగిందో కొన్ని ఉదాహరణల ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

“సంతోష చంద్రశాలల బాటలో” అనే శీర్షిక క్రింద రచయిత జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా ఉద్యోగం మొదలుపెట్టిన అనుభవాలను పంచుకున్నారు. ఎనిమిది నెలల ట్రైనింగ్​లో తనకు ఎదురైన అనుభవాలు, శిక్షణ పూర్తయి పార్వతీపురంలోనే నియమింపబడటం, జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల సమస్యలు పరిష్కరించి మంచి ఫలితాలు ఎలా సాధించిందీ వివరించారు. అడవి దారుల్లో, కొండల మీద, కొండల మధ్య, కొండల క్రింద, నదిని దాటితే కానీ చేరలేని ఆ పాఠశాలలు, అక్కడి పిల్లలు, ఆ పరిస్థితుల్లో పని చేసే ఉపాధ్యాయులు, వారి కష్టాలు, విద్యాబోధన వంటి విషయాలతో చాలా ఆసక్తిగా ఉంది.

ఇలా కొన్ని రోజులకే, సంస్థ గిరిజన ప్రాంతాల్లో వాతావరణాన్ని మార్చేసింది. నేనేమనుకుంటానంటే, పాఠశాలలు పనిచేస్తున్నాయి అని గాని, పనిచేయడం లేదని గాని అంటున్నప్పుడు మనం సత్యాన్ని చెప్పడం కన్నా ఎక్కువగా వార్తని మాత్రమే వ్యాప్తి చేస్తుంటాం. పనిచేయకపోవడం అనేదొక అంటువ్యాధిలాంటిదనుకుంటే, పనిచేయడమనేది పండగ సందడి లాంటిది. రెండింటికీ కూడా త్వరత్వరగా వ్యాపించే గుణం ఉంది.

మనం చెయ్యవలసిందల్లా ఎవరో ఒక పనిచేయని ఉద్యోగిని పనిచేసేటట్టు చెయ్యడం. లేదా, పనిచేస్తున్న ఉద్యోగి గురించో, పాఠశాల గురించో ప్రపంచమంతా వినేటట్టుగా మాట్లాడటం. అది చాలు తక్కిన వాతావరణంలోని స్తబ్ధతనంతా తుడిచిపెట్టడానికి. అప్పుడు నువ్వు చూస్తూ ఉండగానే, వింటూ ఉండగానే నీ చుట్టూ ప్రపంచం మాట్లాడే మాటలు ఒక్కసారిగా మారిపోయి వినిపిస్తాయి.

“ఒక సంకల్పానికి బాసటగా” అనే శీర్షిక క్రింద రచయిత 1990లో కర్నూలు జిల్లా కలెక్టరు టి.ఎస్.అప్పారావుగారు తలపెట్టిన సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం, అందులో ఎదుర్కొన్న సవాళ్ళు, చివరికి ఏమయింది వంటి అనుభవాలను పంచుకున్నారు. ఇది ఒక అద్భుతమైన కల. సంవత్సర కాలంలో జిల్లాలోని ఆరులక్షలమంది వయోజనులు అభ్యసనం పూర్తిచేసి అక్షరాస్యులనిపించుకోవాలి. తనంతతానుగా పుస్తకాలు చదువుకోగలగాలి అనేది ఆశయం. ఆ ప్రయాణం ఎంత ఆసక్తికరంగా ఉందో, ప్రయాణం ముగిసాక చేసిన విశ్లేషణ, కలిగిన మెలకువలు ఆచరించే వారు ఉంటే గొప్ప కరదీపికలు.

ప్రజల్లో కొన్ని ఆకాంక్షలు సాధారణంగా నిద్రాణంగా ఉంటాయి. కాని అవి మేల్కొన్నప్పుడు మామూలుగా మేల్కొనవు. అటువంటి సమయాల్లో మామూలు మనుషులే చరిత్రనిర్మాతలుగా మారతారు. మామూలు దైనందిన జీవితమే చరిత్రగా మారిపోతుంది.

అపూర్వమైన ఉత్సాహం, అనదంపూర్వమైన కలకలంతో జిల్లా అటు మంత్రాలయం నుంచి ఇటు అహౌబిలందాకా, ఇటు శ్రీశైలం నుంచి అటు కస్సాపురం దాకా ఆనందోద్రేకాలతో ప్రకంపించింది.

మామూలుగా చదువుకోవడానికి ఇష్టపడరనీ, తమ పిల్లల్ని బడికి పంపకుండా పనికి తోడుతోసుకుపోతారనీ అనుకునే ఆదివాసులు, దళితులు, శ్రామిక స్త్రీలు పెద్ద ఎత్తున అక్షరప్రతిజ్ఞకు ముందుకురావడం ప్రతి ఒక్కరినీ చకితుల్ని చేసింది. అది వారిలో నిద్రాణంగా ఉంటూ, ఇంతకాలం జనాదరణకు గురయిన జ్ఞాన తృష్ణను మేల్కొలిపింది.

“తలచుకుంటే సాధ్యం కానిది లేదు” అనే శీర్షిక క్రింద రచయిత ఆదిలాబాద్ జిల్లాలో తన ఉద్యోగానుభవాలను పంచుకున్నారు. కృత్యాధార పాఠ్యప్రణాళికలు తయారుచేయడం, బాలికల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు కేటాయించడం, స్కూలు కాంప్లెక్స్​ల ఏర్పాటు వంటి విజయాల వెనుక ఉన్న ఆలోచనాధారను వివరించారు. ఆశ్రమ పాఠశాలల కరికులంని సంస్కరించడానికి పూనుకున్నప్పుడు ఎదురైన వ్యతిరేకత, ఉద్యోగ సంఘాల ధర్నాలో రచయిత ఎదుర్కొన్న నిరసన, దూషణలు వాటికి రచయిత స్పందించిన తీరు, చివరకు వారిని ప్రభుత్వం అక్కడ నుండీ బదిలీ చేయడం వివరించారు.

ఆ సమయంలో నా ఆలోచనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎంత పని చేయని ఉపాధ్యాయుడైనా స్వభావరీత్యా ఉపాధ్యాయుడే. అతడిలో స్వధర్మం మీద సమాజపు ధూళి ఎంత ఆక్రమించినా అది లోపల్లోపల ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. నిరంతరం చిన్నారి పిల్లలతో సహజీవనం అతనిలో మానవత్వాన్ని మరుగున పడనీయదు.

కాని సాంఘికంగా ఉపాధ్యాయుడు నిరంతరం అభద్రతా భావానికి లోనవుతూనే ఉంటాడు. అతని ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాశాన్ని నిలబెట్టి అతని వెన్నుతట్టి ప్రోత్సహించే స్థితికి మన సమాజంలో అధికభాగం సిద్ధంగా లేదు. అతడిని అదుపు చేయాలని చూసే అధికార శక్తులకు కొదవలేదు. ఆ నిర్మాణాల ముందు, ఆ అణచి వేతల ముందు అతడు దుర్బలుడిగా నిలబడవలసి వస్తున్నది. అందుకు అతడు తనను తాను క్షమించుకోలేకపోతున్నాడు.

తన ఆత్మబలంకన్నా సంఘబలం అవసరమని ఉపాధ్యాయుడు భావిస్తున్నాడంటే దానికి కారణం అతణ్ణి ఆ పరిస్థితికి నెట్టిన సమాజమే. అలాగని ఉపాధ్యాయుడు ఉత్తమ భావాల్నీ, సామాజిక పరివర్తననీ వ్యతిరేకిస్తున్నాడని తీర్మానించలేం. ఆ మార్పు అతని ఆత్మగౌరవానికి భంగం కలిగించేదికాదనీ హామీ అతనికి లభిస్తే ఆ మార్పుని ముందుకు తీసుకుపోయేవాళ్లల్లో అతడే ముందుంటాడు.

“సమాజం ఎదకు హత్తుకున్న వేళ” అనే శీర్షిక క్రింద రచయిత పాడేరు గిరిజన ప్రాంతంలో తన ఉద్యోగానుభవాలను పంచుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కలిగిన మెలకువుల వల్ల సమగ్ర అకడమిక్ ప్రణాళికను సమిష్ఠిగా రూపొందించడానికి చేసిన ప్రయత్నం, గిరిజన విద్యార్థులకు చదువును సన్నిహితంగా, దైనందిన జీవితానికి పనికొచ్చేరీతిలో ఇవ్వటానికి, కరికులం వికేంద్రీకరణకు చేసిన ప్రయత్నాలు వివరించారు.

దీన్నే మనం రాజ్యం అంటాం. నిజానికి, రాజ్యం ఏ సమాజంలోనైనా భాగమే కాని ఇక్కడేం జరుగుతుందంటే, ఎప్పటికీ, సమాజం పేరిట విస్తృత ప్రయోజనాల్ని రాజ్యం పేరిట కొద్ది మంది మాత్రమే అనుభవిస్తూ ఉంటారు. రాజ్యం నిర్దేశించేవిధానాల్ని వారే రాజ్యం పేరిట ప్రభావితం చేస్తుంటారు. ఒకవేళ ఆ ప్రభావం నుండి బయటపడి విధానరూపకర్తలు అందరికీ ప్రయోజనాన్ని అందించే విధంగా విధాన పత్రాల్ని రూపకల్పన చేసినా, వాటి అమలును ఆ కొద్దిమందీ హైజాక్ చేసేస్తారు.

ఇటువంటి విషమ పరిస్థితి భూమి, అడవి, పశుపోషణ, నదీజలాలు, సేద్యపు నీటి పారుదల వంటి ప్రాకృతిక వనరుల విషయంలో స్పష్టంగాకనిపిస్తుంది. ఆధునిక భారతదేశం జాతీయతను సంతరించుకునే క్రమంలో పట్టణాలు పల్లెల ప్రయోజనాలకూ, సాంఘికంగా బలవంతులు దుర్బలులైన పేదవారి ప్రయోజనాలకూ విఘాతం కలిగిస్తారని మహాత్ముడు మొదటినుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాడు.

అందుకనే ఆయన గ్రామ పునర్నిర్మాణం గురించీ, సాంఘిక సంస్కరణ గురించీ, ఉత్పాదక స్వభావం కలిగిన సమాజకేంద్రిత విద్య గురించీ మాట్లాడుతూ వచ్చాడు. పైగా తాను విద్యాసంస్కరణని చాలా ఆలస్యంగా చేబూనానని వాపోయాడు కూడా. అందువల్ల ఆయన మట్లాడుతూ వచ్చిన సంస్కరణల్ని విస్తృత జాతీయోద్యమంలో భాగంగా అమలు చేయలేకపోయాడు. 

“సంగీతం ఒక్కటే, రాగాలెన్నో” అనే శీర్షిక క్రింద రచయిత గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రకార్యాలయంలో ప్రత్యేకాధికారిగా పని చేసిన ఉద్యోగానుభవాలను పంచుకున్నారు. యునిసెఫ్​తో కలిసి జాయ్​ఫుల్ లెర్నింగ్ కార్యక్రమం ఆదిలాబాద్, విశాఖపట్టణం జిల్లాల్లో నిర్వహించడం, ఐఫాడ్ మిగులు నిధులు గిరిజన ప్రాధమిక విద్య కోసం వినియాగానికి ప్రణాళికను తయారు చేయడం వివరించారు.

దాని మొదటి ఆశయం అన్ని గిరిజన జనావాసాలకూ పాఠశాలని అందుబాటులోకి తేవడం. పాఠశాలలు లేని జనావాసాల్లో మాబడులు తెరవడం. ప్రస్తుతం నడుస్తున్న పాఠశాలలకు, కొత్తగా తెరవబోయేవాటికి కూడా తరగతి గదుల నిర్మాణాన్ని స్థానికసహకారంతో చేపట్టడం. ప్రతి పాఠశాలకూ కనీస బోధనాభ్యసన సామాగ్రిని సమకూర్చడం, పిల్లలు బడిలో క్రియాశీలకంగా పాల్గొనేటందుకు వీలుగా తరగతి గదిని, బోధనాభ్యసన ప్రక్రియను ఆకర్షవంతం చేయడం.

బడికి పిల్లలు రావడం కోసం, నూటికి నూరు శాతం నమోదు కోసం కళాజాతలు నిర్వహించడం, చదువుకొత్తలు పండగ చెయ్యడం, అంతర పాఠశాలల పోటీలు నిర్వహించడం, బడిలో చురుగ్గా పాల్గొంటున్న విద్యార్థుల కోసం సహాయకంగా కొంత అభ్యసన సామగ్రిని రూపొందించడం మొదలైన అంశాలందులో ఉన్నాయి.

ఈ పుస్తకం కేవలం రచయిత అనుభవాలు మాత్రమే కాదు. విద్య గురించి ఆలోచనల తేనెతుట్ట. ఈ పుస్తకాన్ని పరిచయం చేయడానికి నా భాష సరపోవడం లేదని తెలుస్తున్నా ఈ ప్రయత్నం చేయడానికి కారణం ఈ పుస్తకం గురించి నాకు ఇంటర్నెట్​లో ఎక్కడా వివరాలు కనపడకపోవటం. ఈ పరిచయం చదివి ఎవరన్నా మంచి సమీక్ష రాస్తారని ఆశిస్తాను.

నేను చేసింది గిరిజనులకు ఆధునికవిద్య అందే క్రమాన్ని సరిదిద్దడం, ఆ ప్రక్రియలో గిరిజన సమాజాలూ, బాలబాలికలూ మనఃపూర్వకంగా పాల్గొనేలా చేయడం, అటువంటి ఆధునిక విద్య ఇప్పుడున్నదానికన్నా మరింత ప్రయోజనకరంగా ఉండగలదేమో చూడటం. అలా చూసినట్టయితే, నా కార్యక్షేత్రం గిరిజన ప్రాంతమయినప్పటికీ, నేను పనిచేసింది సార్వత్రిక విద్యకోసమే అని చెప్పవలసి ఉంటుంది.

రెండవది, అందరూ విద్యావంతులు కావాలంటే అది కేవలం పట్టణ ప్రాంతాల్లోని అధికాదాయవర్గాల పిల్లలూ, అగ్రవర్గాల, అగ్రవర్ణాల పిల్లలూ మాత్రమే విద్యావంతులయితే చాలదు. ఆధునిక విద్య పిలుపు అందుతున్నప్పటికీ, విద్యావంతులు కాలేకపోతున్న అనేక బలహీనవర్గాలూ, ఇంతదాకా అప్రధానీకరణకు గురవుతూ వస్తున్న వివిధ ప్రజాశ్రేణులూ, ప్రజాసమూహాలూ ఎందువల్ల ఆధునికవిద్యతో పూర్తికాలం కలిసినడవలేకపోతున్నారో నిశితంగా చూసుకోకపోతే, ఆ మార్గంలో మనం చేస్తూ వచ్చిన తప్పుల్ని సరిదిద్దుకోకపోతే, ‘అందరికీ విద్య’ కలగానే మిగిలిపోతుంది తప్ప, వాస్తవంగా ఎన్నటికీ మారదు. 

ఈ పుస్తకం కొనాలనుకుంటే నవోదయలో, ఎమెస్కోలో, సాహితిలో దొరుకుతుంది.

కొన్నికలలు కొన్నిమెలకువలు: సార్వత్రిక విద్యతో నా అనుభవాలు

వాడ్రేవు చినవీరభద్రుడు

మొదటి ప్రచురణ: 2005

పునఃముద్రణ: సెప్టెంబర్, 2020

ISBN : 978-93-88492-72-0

ఎమెస్కో బుక్స్

1-2-7, బానూకాలనీ,

గగన్​మహల్ రోడ్, దోమల్​గూడ,

హైదరాబాద్‌-500029, తెలంగాణ.

e-mail : emescobooks@yahoo.com

www.emescobooks.com

You Might Also Like

One Comment

  1. prpendikatla

    చక్కటి విశ్లేషణ విద్యావ్యవస్థ మార్పులు అమలు తీరుతెన్నులు సమాజ ప్రతిస్పందనలు రచయితగా వారి పరిణతిని సమాజం పట్ల వారి బాధ్యతను నిబద్ధతను తెలియపరుస్తున్నాయి.
    వ్యాస కర్త శశిధర్ గారకి ధన్యవాదాలు

Leave a Reply