మేమింకా బతికే ఉన్నాం – “ఢావ్లో” కథలకి ముందుమాట

(ఈ వ్యాసం రమేశ్ కార్తీక్ నాయక్ కథల సంకలనం “ఢావ్లో – గోర్ బంజారా కథలు” కి రచయిత రాసుకున్న ముందుమాట. పుస్తకం.నెట్ లో ప్రచురణకి అనుమతించినందుకు రచయితకు ధన్యవాదాలు)

పుస్తకం పేపర్ బాక్ కాపీ అమేజాన్ ఇండియా వెబ్సైటులో లభ్యం. Anvikshiki Publishers వారి ప్రచురణ.

************

నేను పుట్టి రెండు పదులు దాటినా, ఇప్పటి దాకా మా వాళ్లు కథలు చెప్పడం నేను వినలేదు. “మీరు పూర్వం ఎలా బతికారు?” అని దాదిని, దాదాని అడిగితే ఏమి చెప్పేవారు కాదు. చెప్పే అంత గొప్ప కథలు కావని అనుకున్నారేమో. చెప్పడానికి కూడా అంత ఆసక్తి చూపేవారు కాదు. వీటికి కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు. ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం మా జీవితాలు చెప్పడానికి సిద్ధమయ్యాను. మా వాళ్ళు తమ కథలు చెప్పనందుకు ఇప్పటి తరం దాదాపుగా తమ అస్తిత్వాన్ని కోల్పోయిందనుకుంటున్నాను. ఫలానా వాళ్ల కథలు సమాజంలో వినబడట్లేదు అంటే వాళ్ళు సమాజంలో లేరని అర్థం. వినబడుతున్న వాటిని సమాజం స్వీకరించట్లేదంటే, సమాజం వారిని తనవారిగా అనుకోవట్లేదని నా అభిప్రాయం. పై పూతలను చూసి మనం ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నాం. “All that glitters is not gold” అనే మాట అందరికి తెలుసనే అనుకుంటున్నాను.

ఓ సారి ఓ వ్యక్తికి 20 మార్చ్ 2020 నాడు ఫోను చేశాను. అతను లంబాడా హక్కుల పోరాటసమితి కార్యకర్త, అతని గురించి తెలిశాక చాలా ఆనంద పడ్డాను. నేను ఓ మిత్రుడి ద్వారా ఆయన నంబర్ సంపాదించి కాల్ చేసి సార్ నమస్, నేను రమేశ్ కార్తీక్ నాయక్. ‘బల్దేర్ బండి’ అని ఓ కవితా సంపుటి వేశాను. అని పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత అతని పోరాట జీవితంలో ఎదురైన అనుభవాలు తెలుసుకుందామని ‘సార్ మీరు మన వాళ్ళ ముఖ్య సమస్యలేంటో చెప్తారా? అని అడిగాను. చెప్తాను బాబు నువ్వు ఇంతకి లంబడొడివా? తెలుగోడివా? అని అడిగాడు. దానికి నేను గోర్ (బంజారా) అని చెప్పాను. మరి ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నావు. ‘గోర్ బోలి’ లో మాట్లాడొచ్చు కదా! అని ఆయనన్నారు. సర్ నాకు మన భాష సరిగా రాదు, మాట్లాడకూడదని కాదు. అని నేనంటే, అప్పుడాయన నీకు భాషే రాదు నువ్వు లంబాడోల్ల గురించి ఏం రాస్తావు? అసలు నీకు రాసే హక్కే లేదు అన్నాడు. ఇంకా నేను ఏమి మాట్లాడకుండా thank you sir అని చెప్పి ఫోన్ పెట్టేసా. ఇదొక సంఘటన జరిగింది. మా భాష నాకు సరిగా రాదని బాధ పడలేదు. వేరే భాష నేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నేర్చుకున్న ఆ భాషే మా కథలు చెప్పుకోవడానికి ఉపయోగపడుతున్నది.

రస్తుత కాలంలో సాహిత్యంలో ఎక్కువగా కొన్ని సమూహాల అస్తిత్వవాదాలు మనకు తారసపడుతునే ఉన్నాయి. కానీ వాటి అట్టడుగు లోనైనా మనం ఇప్పటి దాకా ముట్టుకోని లేదా మాటలకే పరిమితం చేసిన జీవితాల ఛాయలు కనిపించలేదు. ప్రతి ఒక్కరూ ఒక క్లారిటీతో ఉన్నారు. కానీ వారి క్లారిటీలో సంపూర్ణత, ఈ అనాగరికుల జీవనం నేర్పిన పాఠాల నుండే వచ్చాయని నేను అనుకుంటున్నాను. నాగరికుల మధ్యకు అనాగరికులు వస్తేవింతే అయ్యుండొచ్చు. కానీ ఇంకా వారిలో ఈ కాలపు లౌక్యం రాలేదు. ఈ లౌక్యమే వారి ఒంటికి పడితే నాగరికంగా ఉన్నట్లు నటిస్తున్న మన తరంలో ఎవరు ఊహించని మార్పులు వస్తాయని నా అభిప్రాయం. ఆదివాసి సమాజానికి సంబంధించి తెంసులా ఓ, మఘంగ్ దాయి, ఎస్టరీన్ కిరే, హంస్డా సోవెంద్ర శేఖర్, మూడ్ ధనంజయ్ నాయక్, రూబీ హెబ్రోం (ఆదివాణి ప్రచురణ సంస్థ అధినేత) ఆంగ్లంలో కృషి చేస్తున్నారు.

తెలుగులో ఆచార్య సూర్యా ధనంజయ్, మల్లిపురం జగదీశ్, పీ. అనసూయ, మూడ్ కృష్ణ చౌహాన్, కృష్ణా ఘుగ్లోత్, సమ్మెట ఉమాదేవి కృషి చేస్తున్నారు. మహా శ్వేతాదేవి, రమణికా గుప్తా, శాంతా నాయక్, బీ.టి. లలితా నాయక్ తదితరులు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఉన్నారు. అయినప్పటికీ గిరిజన ఆదివాసి సాహిత్యం ఇంకా రాలేదనే భావన నాలో దృఢంగా ఉండిపోయింది. నాకు తెలిసినవి, నేను చూసినవి, నేను అర్థంచేసుకున్నవి కథలు కవితలుగా రాస్తున్నాను. కానీ నిజాయితీగా చెప్పాలంటే మా వాళ్ళని అర్థం చేసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నానని చెప్పొచ్చు. నేను ఎంత ప్రయత్నించినా సంపూర్ణంగా అర్థం కావట్లేరు, Mainstream కి దూరంగా బ్రతికేవాళ్లను అర్థంచేసుకోవడం అంటే మనకు తెలియని జీవితంలో మనం పరోక్షంగా జీవిస్తున్నట్లు.

Waiting for the Barbarians, July’s people. The mysterious ailment of Rupy Baskey, Adivasi will not dance, This hills called home, La- burnum for my head, Black hill, Men of maize, segu, paraja మొదలైన ఈ పుస్తకాలు వివిధ తెగల జీవితాలను వివిధ రాష్ట్రాల, దేశాల సరిహద్దులను దాటి మనకు పరిచయం చేస్తాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఆయా సందర్భాలలో జరిగిన, జరుగుతున్న జరగబోతాయి అనుకున్న విషయాలను గురించి రాసినవే. కథలు అసలు రాస్తానని అనుకోలేదు. కానీ రాశాను. అంతకు ముందు ప్రచురించిన ‘బల్దేర్ బండి’ పుస్తకాన్ని మా వాళ్ళు అడిగి మరీ తీసుకొని తమ ఇంట్లో దాచుకున్నారు. వారు ఇప్పటిదాకా దానిని చదివింది లేదు కానీ ఆ పుస్తకం టైటిల్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఒక్క పుస్తకం ద్వారా మా వాళ్ళలో చదువు పట్ల కొంత ఆశక్తిని రేకెత్తించాను అన్న సంతృప్తి నాలో ఉంది.

ఈ పుస్తకంలోని కథలు కొన్ని ఎలా రూపుదిద్దుకున్నాయంటే నేను చిన్నప్పుడు అమ్మతో తోటకు వెళ్ళేవాడిని. ఆమె ఓ సంచిలో తన చీరలను పోగు చేసి తర్వాత వాటిని చింపి, తెంపిన కూరగాయలను కట్టడానికి ఉపయోగించేది. ఆ చీరలను కంచెలుగా పొలం చుట్టూ పంటను కుందేళ్ళు, అడవిపందులు, జింకలు, నెమళ్లు పాడు చేయకుండా ఉండడానికి కట్టేది. అలా ‘లతకడా’ కథ రాశాను. తర్వాత కథ మా అమ్మ కథ. మా అమ్మకి ఎప్పుడు ఒకే ఒక కోరిక ఉండేది. మా అమ్మమ్మ ఇచ్చిన బర్రె పెయ్య దూడను ఇవ్వాలని ఆమె కోరిక, కానీ ఆ బర్రె ప్రతిసారీ దూడనే కనేది. అందుకని ఆ బర్రెను అమ్మ అమ్మేసింది. ఇలా ప్రతీ కథకు వెనకాలా ఒక కథ ఉంది. ఇంట్లో ఎన్నోసార్లు పుస్తకాలకు సంబంధించి మా అమ్మకు నాకు ఎప్పుడూ గొడవలు అయ్యేవి. వారు పంపే డబ్బులన్నీ సాహిత్య పుస్తకాలకే తగిలేస్తున్నానని ఆమె అభిప్రాయం. ఎన్నో సార్లు ఈ పుస్తకాల వల్ల ఇల్లు వదిలెయ్యవలసి వచ్చింది. దానితో Depression, తల్లిదండ్రుల బలవంతంపై జాయిన్ అయిన డిప్లొమా ఎన్ని సార్లు రాసినా ఫెయిల్ అవ్వడం. నాన్న తిట్టడం. ఇలా ఏవో కారణాలతో చాలా సార్లు సూసైడ్ అటెంప్ట్చేశాను. ఏది సక్సెస్ కాలేదు. చివరి అటెంప్ట్ 24 అక్టోబర్ 2017 పొద్దున్న నాలుగు గంటల ప్రాంతంలో నిజామాబాద్ railway station లో ట్రైన్ ట్రాక్ మీదికి వస్తుండగా పట్టాలపై దుకాను. ఏదో గుర్తొచ్చి ట్రైన్ దగ్గరికి వచ్చేసరికి పక్క ట్రాక్ మీదికి జరిగిపోయాను. అప్పుడే నిర్ణయించుకున్నాను. నా లాంటి కథలెన్నో ఇంకా మిగిలే ఉన్నాయి. వాటన్నింటినీ రాయాలని. అలాగని సాహిత్యం కోసం ఆత్మహత్యాప్రయత్నాన్ని అపుకున్నానని కాదు, తర్వాత ఎప్పుడు సూసైడ్ ఆలోచన రాలేదు. కొంత కాలం తల్లిదండ్రులతో మాట్లాడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు. కాని పోయిన ఏడాది మళ్ళీ ఇంట్లోనుండి వచ్చెయ్యాల్సి వచ్చింది.

అలా అత్తమ్మ, రోజా బాయి, అనిల్, శైలు బాయి, రవీంద్ర రాథోడ్ నాకు కొంత కాలం ఆశ్రయం కల్పించారు. మేడ్చల్ జిల్లాకు అక్కడ నా బాగోగులు చూసుకున్న కొందరికి నా కృతజ్ఞతలు. B.A., M.A. చెయ్యాలని నాకు ఆశగా వుండేది. కానీ నాన్నకు మాత్రం నేను డిప్లొమా ఇన్ త్రిబుల్ ఈ పూర్తిచేసి జాబ్ సంపాదించాలని ఉండింది. నేను అది పూర్తి చెయ్యలేక పోయాను. వారికి చెప్పుకుండానే నా వరకు నేను ఇంటర్మీడియట్, డి.ఈ.డి, B.A. Art (Dr.B.R. Ambedkar Open University) పూర్తిచేసుకుని ప్రస్తుతం COP- Spanish (EFLU) నుండి చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీటి వల్లే నేను సాహిత్యం బాట పట్టాను. స్కూల్ డేస్ (SVSHS) బోధన్‍లో శిరిషా జంపాని (తెలుగు) టీచర్, శంకరమంచి విజయలక్ష్మి గారి వల్ల కథలకు అలవాటు పడ్డాను. నా ఈ అనుభవం నా కథలను అర్థం చేసుకోవడానికి ఉపయోగడుతుందని అనుకుంటున్నాను. 

ఈ పుస్తకంలోని కథలు విహంగ, సారంగ, నెచ్చెలి అంతర్జాల పత్రికల్లో మరియు మస్టర్ పుస్తకంలో ప్రచురితమయ్యాయి. చివరిగా ఆన్వీక్షికి పబ్లిషర్స్, పుస్తక ప్రచురణకర్త వెంకట్ శిద్దారెడ్డి, మహి బెజవాడ, పుస్తకాన్ని అందంగా లే-అవుట్ చేసిన ఝాన్సీ నల్లమెల్లి గారకు ధన్యవాదాలు.       ఇన్ని రోజులు ఎలా బతికామో తెలీదు, కానీ ఇకముందు మాత్రం ప్రతీకాగితంపై నిల్చుని ‘మేము బతికే ఉన్నాం’ అంటూ కనిపించిన వారికల్లా నా పాత్రలు తమ గురించి నిజాయితీగా నిర్మొహమాటంగా చెప్తాయని భావిస్తూ

– రమేశ్ కార్తీక్ నాయక్ 11.02.2021

You Might Also Like

Leave a Reply