కవిత్వం వొక సజీవ బంధం

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్

(ఆగస్టు 15 , 2021 న విడుదలయ్యే బండ్ల మాధవరావు ‘దృశ్యరహస్యాల వెనుక’ కవిత్వ సంపుటి ముందుమాట)

******

మాధవ కవిత్వాన్ని స్పృశించినప్పుడల్లా మట్టిని చీల్చుకుంటూ మొలకెత్తే విత్తనాన్ని ముద్దాడిన తన్మయత్వం  కల్గుతుంది. అతని కవిత్వం తో కరచాలనం చేసిన క్షణాల్లో అతని గుండె చెలమలో వూరే చెమ్మ నా యెదలోకి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని కవిత్వం లోతుల్లోకి పయనించే అనేక సందర్భాల్లో నన్ను నాలోకి తరచి చూసుకుంటున్న అనుభూతి మిగిలింది. అతని కవితాభివ్యక్తితో గాఢాలింగనం చేసిన ప్రతిసారీ నేనూ అతనూ వొకే గూటి పక్షులం లేదా వొకే తల్లి బిడ్డలం అనిపిస్తుంది (we are kind of a thing – sailing in the same boat – అంటారే , అలాంటి feeling అన్నమాట). అందుకు కారణం యిదీ అని నిర్దిష్టంగా చెప్పలేనప్పటికీ  యిద్దరివీ దాదాపు వొకే సామాజిక నేపథ్యాలు కావడం వల్ల కావొచ్చు, కృష్ణమ్మకు చెరో వైపు వ్యావసాయిక కుటుంబం నుంచి వొకే విధమైన చదువులు చదివి బోధనా వృత్తిలో యెక్కువ సమయం పిల్లల మధ్య గడపడం వల్ల కావొచ్చు,  సొంత నేలకు దూరమైన వలస దుఃఖాన్ని సమంగా అనుభవించి వుండడం వల్ల కావొచ్చు, ఆధునికతని స్వచ్ఛందంగా ఆలింగనం చేసుకొని స్వీయ మూలాల నుంచి విడిపోయిన పరాయీకరణ వేదన నుంచి బయటపడటానికి పడే తండ్లాట యిద్దరికీ వొకలాంటిదే అవడం వల్ల కూడా కావొచ్చు.  రాజకీయ ఆచరణ పరిష్కారాల విషయంలో దృక్పథ పరమైన వైరుధ్యాలు అసలుకే లేవని చెప్పలేను   గానీ మాధవతో అతని  కవితోద్వేగాలతో మమేకం కావడానికి అవి అంతగా అడ్డుకాలేదు. అందుకే కాసేపు మీతో యీ నాలుగు మాటలూ …

***

బండ్ల మాధవరావు అనబడే మాధవ స్నేహం అపురూపమైనది. హైదరాబాద్ నాకు అన్నీ యిచ్చినట్టే మాధవ ప్రేమనూ యిచ్చింది. నగరం అతణ్ణి కలుపుకొంది గానీ నగరంలో యెందుకో అతను పూర్తిగా యిమడలేకపోయాడు. చాలామందిలా నాగరికాన్ని అలవరచుకోలేకపోయాడు. ఎక్కడో బలంగా గాయపడ్డాడు.  దేవీప్రియ శివారెడ్డి వాసిరెడ్డి నవీన్ కెపి అశోక్  కుమార్ లాంటి సాహితీ మిత్రుల షరతుల్లేని ప్రకటిత అప్రకటిత వాత్సల్య బాంధవ్యాలు కూడా అతణ్ణి కట్టిపడేయలేకపోయాయి. చివరికి అన్నీ వొదులుకొని వొట్టి చేతుల్తోనే పుట్టినూరికి  పయనమయ్యాడు.

హైదరాబాద్ కీ విజయవాడ అని పిల్చుకునే బెజవాడకీ సాపత్యమే లేదు. హైదరాబాదు అన్ని విధాలా మెట్రోపాలిటన్ నగరం. గట్టిగా మాట్టాడితే విశ్వనగరం. వూరి వాసన వదలని పట్టణం బెజవాడ. వూరివాసన వదలని తనమే మాధవలోనూ వుంది. అందుకే మళ్ళీ సొంత గూటికి చేరుకున్నాడు. కానీ కళ్ళముందు స్వప్నం సాకారమయ్యే లోపు గూడు చెదిరిపోయింది. ఉన్నది కోల్పోయినా పొందిన కొత్తదానితో రాజీ పడదామనుకున్నా అదీ మిగలలేదు.

‘చనుబాలధారతో కడుపు నింపే ఊరు

నన్ను అక్కున జేర్చుకొని ఊరడించే అమ్మ’ (ఊరంటే అమ్మ – 2002) అనుకున్నాడొకప్పుడు. కానీ  ఆ అమ్మ అంగడి సరుకయ్యింది. మనుషుల్ని మార్కెట్ కబళించింది. అధికారమే అందుకు రాదారి పరిచింది

హాం ఫట్ … ఇళ్ళు  మాయం. వూళ్ళు మాయం. అరచేతిలో వైకుంఠం. వాకిట్లో స్వర్గం. క్షణంలో సగంలో ఇంద్రనగరాలు. వర్చ్యుయల్ పంచరంగుల  కలల  ప్రపంచం కళ్ళ ముందు సాక్షాత్కారం. రాజ్యమే  మంత్రగాడు. బడా జాదూగర్.

కొండలు గుట్టలు చెరువులు దొరువులు నదుల కరకట్టలు ముక్కారు పంటల పొలాలు … నేలంతా అన్యాక్రాంతం.

ప్రభుత్వమే కబ్జాదారు.

ఆత్మహత్యలు మిస్సింగ్ లు ఎన్ కౌంటర్లు  … అన్నీ నిశ్శబ్ద  హత్యలే.

పాలకులే హంతకులు.

యెక్కడ తేడా కొట్టిందో తెలుసుకునే లోపే అంతా చేజారిపోయింది. సమీకరణ సేకరణ విస్థాపన పునరావాస ‘క్రీడ’ల్లో మనిషి నలిగిపోయాడు. రాజకీయ ఆబోతుల కాళ్ళమధ్య నలిగిన లేగదూడ అయ్యాడు.  నగరాల్ని ప్రజలు చీమల్లా నిర్మిస్తే అవి యే పాముల పాలవుతాయో యే స్వార్థ రాజకీయాల నెలవులవుతాయో తెలిసినా నిస్సహాయుడయ్యాడు. పాలస్తీనా పౌరుల్లా సొంత నేల మీదే పరాయి అయ్యాడు. అయినా  సొంత కాళ్ళ మీద నిలదొక్కుకోవాలనే పదే  పదే  ప్రయత్నించాడు.

“A person who has not been completely alienated, who has remained sensitive and able to feel, who has not lost the sense of dignity, who is not yet “for sale”, who can still suffer over the suffering of others, who has not acquired fully the having mode of existence – briefly, a person who has remained a person and not become a thing – cannot help feeling lonely, powerless, isolated in present-day society.

అంటాడు  Erich fromm, The Art of Being లో.

ఎవరు – ఎప్పుడు – ఎక్కడ – ఎందుకు – తమను కోల్పోతారో – తాము కాకుండా పోతారో – నిరంతర అన్వేషణ (పునర్యానం). తనను తాను కాపాడుకోడానికి యెప్పట్లానే మాధవరావు సేద తీర్చే కవిత్వాన్నే ఆశ్రయించాడు. కవిత్వాలంబనతో జీవితాన్ని గెలవాలని తపించాడు. పరిస్థితులతో సంఘర్షించాడు. దుస్సహ వేదననుంచి విముక్తం కావడానికి తానే  కవిత్వమయ్యాడు అంటే సమంజసంగా వుంటుందేమో! మనిషి కవిత్వం కావాలంటే  హృదయం వుండాల్సిన చోటే వుంటే చాలంటారు. కానీ  ఆ హృదయానికి చెమ్మగిల్లే కన్నుండాలనీ  సున్నితత్వాన్ని  కోల్పోనివాళ్ళే క్రియాశీలక కవులు  కాగలరు అనీ  మాధవ మరోసారి నిరూపించాడు.

ఈ సంఘర్షణలో యెక్కడైనా వొకానొక బలహీన క్షణంలో మాత్రమే

మట్టి నాది కాకుండా పోయాక

 రైతు పదానికి నేను రాజీనామా చేశాక

నేలతో బంధం తెగినప్పుడే

నీటితోనూ బంధం తెగిపోయింది’ (అకాల వర్షం)

అని  ప్రకృతి మీద అలక ప్రకటిస్తాడు. ఇది మాధవ స్వభావానికి వ్యతిరేకం. అన్ని విధాలా పరాయీకరణకు యిది పరాకాష్ట. భూ నిర్వసితుల గోస యిది. అనుభవిస్తే గానీ అర్థం కాని మానసిక స్థితిని అనితరంగా ఆవిష్కరించాడు మాధవరావు. అయితే యిది కేవలం  వైయక్తిక వేదన కాదు. అనేక సమూహాలది. ఎన్ని కోల్పోయనా సామూహిక చేతనను  స్పృహను కోల్పోకుండా వున్నందువల్లే –

‘నేలకూలిన చెట్టు – మట్టితో తన అనుబంధాన్ని అంటుకట్టుకోవాలని తపిస్తోంది’ (సందిగ్ధ ప్రశ్న) అని అంతిమంగా ప్రకృతికీ మనిషికీ మధ్య వుండాల్సిన సజీవ సంబంధాన్ని ఆశావహ దృష్టితో వీక్షించాడు.

ఆ కారణంగానే శ్రమ పరాయీకరణ చెందే సూక్ష్మ మూలాల్ని సైతం అతను కవిత్వీకరించగలిగాడు.  ‘నోట్ల కళ’ లో  మాధవరావు వ్యక్తం చేసిన సామాజిక రాజకీయ ఆర్ధిక దృష్టి కోణం మార్క్స్ చెప్పిన అదనపు విలువ సిద్ధాంతానికి సంక్షిప్త సూత్రీకరణలా కనిస్తుంది. శ్రమ పరాయీకరణ దోపిడీలపై నిర్మితమయ్యే పెట్టుబడిదారి సమాజం పట్ల అతని సైద్ధాంతిక అవగాహనకి శాస్త్రీయ దృక్పథానికి దృష్టాంతంగా కనిపించే యీ మాటలు చూడండి:  

‘శ్రమలోంచి కారిన చెమట

నోట్లు నోట్లుగా మారాల్సిన చోట

రక్తం బొట్లుగా మారుతుంది

నోట్లు నోట్లను సంపాదించిన చోట

శరీరకష్టం చెమటనో ఆకలినో ప్రసాదిస్తోంది’.

వర్గ స్పృహతో యిలా సూటిగా చెప్పిన అంశాన్నే ‘మట్టికీ ముద్దకీ మధ్య నిలిచిన రక్తపుటేరులు ఎప్పటికి ఇంకిపోతాయో’  అని పరోక్షంగా ప్రశ్నించాడు. శ్రమజీవి కష్టం ఫలించాలని, ఆకలి పోవాలని ఆశించాడు. 

అదే సమయంలో అత్యాధునిక సమాజంలో మనిషిని పరాయీకరించే ‘సాలెగూళ్ళు’ బలపడుతున్న కొద్దీ కార్పొరేట్ శక్తులు విస్తరిస్తున్న మేరా మానవ సంబంధాలు అదృశ్యమౌతున్నాయన్న ఆవేదన నిరంతరం అతణ్ణి విడవకుండా వెంటాడుతూనే వుంది. ఆ అశాంతి నుంచి బయటపడే తపనే  అతని  కవిత్వంలో ప్రతిఫలించింది.  విస్పష్టమైన  రాజకీయ అవగాహన దాని  బలం.  అది అన్ని విధాలా నిర్మాణాత్మకం.

***

కవిత్వ రూపంలో గానీ సారంలో గానీ  వినిర్మాణానికి మాధవరావు వ్యతిరేకి. ఆధునికోత్తరవాదుల వినిర్మాణం భావ వినిమయానికి అడ్డంకి అని అతను భావించి ఉండవచ్చు. గూఢత అతని కవిత్వ నిఘంటువులో లేదు. తనదైన ప్రాపంచిక దృక్పథాన్ని ప్రకటించడానికి అస్పష్టతకీ సంక్లిష్టతకీ సందిగ్ధతకీ తావులేని సూటైన వచనాన్నే  అతను యిష్టపడ్డాడు. దేన్నైనా నేరుగా చెప్పడమే అతనికి అలవాటు. తాగుబోతు వ్యక్తావ్యక్త ప్రేలాపన లాంటి పరస్పర అసంబద్ధ పదాల కూర్పే కవిత్వం తక్కినదంతా అకవిత్వమనీ దబాయించే సాహిత్య అరాచక వాదులకు  మాధవరావు కవిత్వం సరైన జవాబు. దృక్పథ రాహిత్యాన్ని వున్నతీకరించే శుద్ధ కవితాభిలాషులకు అతని అభివ్యక్తి నచ్చకపోవచ్చు. అందువల్ల వచ్చే లోటేం లేదు. కవిత్వం – లోపలికీ బయటికీ చేసే ప్రయాణాల     పౌనఃపున్య పరంపర. అది కేవలం ఆత్మిక అనుభవమో మనో వ్యాపారమో కాదు. అదొక సామాజిక ఆచరణ. సరైన దృక్పథం దాని జీవ ధాతువు. మాధవరావు దాన్ని బలంగా నమ్ముతున్నాడనడానికి మరో రుజువు యీ ‘దృశ్యరహస్యాల వెనుక’.

దృక్పథ ప్రధానమైన  కవిత్వంలో  సిద్ధాంత ప్రమేయాలు యెక్కువై కవిత్వం కుదించుకు పోతుందనీ అలాంటి కవిత్వం నినాదప్రాయమైపోతుందనీ ఆరోపణలు వింటుంటాం. అది తప్పని చెప్పడానికి యెన్నో వుదాహరణలు కళ్ళ ముందు వున్నా చూడడానికి నిరాకరిస్తాం. మాధవరావు కవిత్వాన్ని రాజకీయ అభిప్రాయ ప్రకటనకు సాధనంగా యెన్నుకోడానికి సంకోచించలేదు.  చుట్టూ జరుగుతున్న దుర్నయాన్ని చూసి మౌనంగా వుండలేనితనమే అందుకు ప్రేరణగా నిలిచిందని ఆ యా సందర్భాల్లో  స్పష్టంగా గమనిస్తాం. అయితే అతని భావజాలం యిదీ అని పద్యంలో యే వొక్క పంక్తిలోనో యెత్తిచూపడాని వీలులేకుండా కవిత అంతటా  పరుచుకొని వుంటుంది.

 ఒక రాజకీయ దృక్పథంతో మాధవరావు కూర్చిన కవితలు  నడుస్తున్న రాజకీయ చరిత్రలో కవిగా అతను యెక్కడ యెవరి వైపు నిలబడ్డాడో తెలియజేస్తాయి. దృశ్య రహస్యాల వెనుక, కుంకుమ పూల విధ్వంసం వంటి కవితల్లో దీన్ని స్పష్టంగా చూడవచ్చు.

సామాజికంగా రాజకీయంగా కల్లోల కాలంలో పుట్టిన కవిత్వమిది. అనేక సంక్షోభ సందర్భాల మధ్య, విషాద సమయాల మధ్య, కుదించుకుపోతున్న ప్రజాస్వామిక స్థలాల మధ్య, వివిధతనీ భిన్నత్వాన్నీ  హరించే వొకే జాతి వొకే సంస్కృతి  వొకే  భాష వంటి యేకధ్రువవాదాల మధ్య,  అల్పసంఖ్యాకులపై majoritarianism ఆధిపత్యం హింసాత్మకంగా అమలవుతున్నప్పడు, ప్రశ్నించే ప్రతి  స్వరాన్నీ  దేశద్రోహంగా నిర్ధారిస్తున్నప్పుడు మాధవరావులోని కవి యెటువంటి తడబాటు లేని  నిక్కమైన లౌకిక ప్రజాస్వాస్వామ్యవాదిగా ముందుకువస్తాడు. పాలితుల దుఃఖాన్ని అందుకుంటాడు. గుండె లోపలి అలజడిని వినిపిస్తాడు.

‘దీపాల కింద చీకట్ల గురించి ఎవరో ప్రశ్నిస్తారు.

ప్రశ్నల అణచివేత నిరాటంకంగా

విస్తరించుకుంటూ పోతుంది’ (అబ్రకదబ్ర)

యిది మాధవరావు 2004లో అన్నమాట. ఈ రోజు అణచివేత మరింత క్రూరంగానూ కపటంగానూ  విస్తరించింది. అప్రకటిత నియంతృత్వం వూడలు దిగింది. భిన్నాభిప్రాయాలకు తావు లేదు. అసహనం పెచ్చు పెరిగింది.  దేశభక్తి పేరుతో ఫాసిజం విజృంభిస్తుంది. రాజ్యాంగ బద్ధమైన హక్కుల్ని రాజ్యమే హరిస్తుంది.

‘గొంతులోంచి మాట బయటకు రాకముందే

గొంతు చుట్టూ బిగుస్తున్న ఉరితాళ్లు

అనేక అణచివేతల మధ్య

ప్రశ్నపై వాడు ఆధిపత్యం చలాయిస్తున్నాడు

భక్తికీ కొన్ని తూకాలుంటాయి

గోవులో కొన్ని తులసిదళాలో

నాలోని  దేశభక్తిని

ఎప్పటికప్పుడూ కొలుస్తూవుంటాయి’ (దృశ్య రహస్యాల వెనుక)

వ్యవస్థీకృతమైన హింస ప్రైవేటు వ్యక్తుల ద్వారా అమలై ఆమోదముద్ర వేయించుకుంటుంది. చట్ట సభలే మూకస్వామ్యాన్ని పెంచి పోషిస్తున్నాయి. దృశ్య రహస్యాల వెనుక వున్న (అంతా  దృశ్యమే అన్నట్టున్నా కనపడని ‘పెగాసస్’ లాంటి   రహస్యమేదో దాగివుంటుంది) దుర్మార్గ ప్రణాళికల్ని మాధవరావు బహిర్గతం చేస్తున్నాడు.

అనేక పోరాటాల తర్వాత 370, 35 ఎ ద్వారా కశ్మీర్ ప్రజలు సాధించుకున్న స్వయం ప్రతిపత్తిని హరిస్తూ  చట్టాలు తయారయ్యాయి. అక్కడ సైన్యం పహరా లోపల యే  నిమిషం యేమౌతుందో బయటి ప్రపంచానికి తెలీదు. ఎన్ని కుంకుమ పూలు మిలటరీ బూట్ల కింద నలిగి నెత్తురు ప్రవహిస్తుందో చెప్పడానికి భద్ర – బుద్ధిజీవులు సంకోచిస్తున్నప్పుడు మానవ హక్కుల విధ్వంసాన్ని కవిత్వ మాధ్యమంగా నిర్భయంగా నిరసిస్తున్న సాహసి మాధవరావు. కశ్మీరం  క్షతగాత్ర యుద్ధక్షేత్రమనీ మానవ హక్కులకు అక్కడ చోటులేదనీ ఆవేదన చెందుతున్నాడు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలకులు చేపట్టే చర్యలు నిష్ఫలమని తీర్మానిస్తున్నాడు.

‘బతకడమే యుద్ధమవుతున్న చోట

ఎవడెందుకు ఆయుధమవుతున్నాడో

ఎవడెందుకు మందుపాతరవుతున్నాడో

కారణాలు సమాధువులవుతుంటాయి

వాడి కళ్లూ చెవులూ మూసేసి

నువ్వెవడినో ఒప్పించాడానికి మాట్లాడుతుంటావు

దేశమంతా ప్రశాంత దృశ్యాలు జాలువారుతుంటాయి

పై పై పూతలు

లోపలి గాయాల్ని

మరింత మరింత స్రవింప  చేస్తుంటాయి

…                    …                    …

ఎప్పటికీ ఏ దారప్పోగూ

ముక్కలైన  యీ నేలను కలిపి కుట్టలేదు

గాయం

నేలకైనా

దేహానికైనా

నిత్యం రక్తం ఓడుతూనే ఉంటుంది.’ (కుంకుమ పూల విధ్వంసం)

మతతత్త్వవాదులు యెప్పుడు  అధికారంలోకి వచ్చినా యీ  విధ్వంసం వాళ్లకు ప్రధానమైన ఎజండాగా వుంటుందని మాధవరావు రెండు దశాబ్దాల కిందే హెచ్చరించాడు.  

నా దేహం మీద కప్పాల్సిన

కఫన్ రంగు కాషాయంగానే ఉండాలంటాడు. (సంధ్యార్ణవాలు 2000 )

వివర్ణమైన వర్తమానం గురించే యీ  సంపుటి ఎక్కువగా మాట్లాడటం వల్ల ప్రతి కవితా చాలా ఫ్రెష్ గా గోచరిస్తుంది. వర్తమానంతో సంధానం లేని యే సాహిత్యమైనా ప్రయోజనం లేనిదే అని నా గట్టి నమ్మకం.

దృశ్యరహస్యాల వెనుక present time poetry. అనుపమ జ్ఞాపకాల చెట్టు. ఎక్కువ భాగం అది గతం మీద కేంద్రీకృతం. కరోనా సృష్టించిన సామాజిక కల్లోలంలో ‘పని కోసం పట్టెడన్నం కోసం’ రోడ్డున పడ్డ వలస కార్మికుల వేదన, మానవ సంబంధాల విచ్ఛేదన, కార్పోరేట్ కి అనుకూలంగా రూపొందిన  వ్యవసాయ చట్టాల కింద నలిగే రైతుల రోదన,   సాంస్కృతిక జాతీయవాదం పేరుతో  నిర్బంధంగా అమలయ్యే ఫాసిజం, గర్భయాతనపై నడిచే శవ రాజకీయాలు, ఉబుసుపోని  సామాజిక మాధ్యమ వుద్యమాలు … యిలా ఎన్నో సంఘటనలు కవిత్వానికి వస్తువులయ్యాయి. వస్తు వైవిధ్యం యీ  సంపుటిలో  ప్రధానంగా కనిపించే ప్రత్యేకత.

***

పత్రికల్లోనో టీవీ తెరమీదో సోషల్ మాధ్యమం లోనో కనిపించే ప్రతి వార్తనీ సంచలనం కోసం కవిత్వంగా మలిచే వుబలాటపు కవులు వొక చివర, సంఘటనల్ని  సాహిత్యీకరించడాన్ని తిరస్కరించే విమర్శకులు మరో చివర నిలబడి వున్నప్పుడు తనను కదిలించిన సందర్భాన్ని మాధవరావు గొప్ప నేర్పుతో సంయమనంతో కవిత్వంగా మలిచాడు. సాహిత్య విలువలతో రాజీ పడకుండానే యే పార్టీ పాలనలో వున్నా ప్రజల పక్షంలో  స్థిరంగా నిల్చి తన రాజకీయాభిప్రాయాల్ని బలంగా వ్యక్తీకరించాడు. 

అలా రాసిన వాటిలో ‘నగరాన్ని ముట్టడించిన నాగళ్ళు’ ప్రత్యేకంగా  పేర్కోదగింది. రైతుల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం దూకుడుగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా స్పందిస్తూ చెప్పిన మాటలు చూడండి.

‘నేను నీ కోసం విత్తనాన్ని

మట్టి చీల్చుకొని తలెత్తి నిలబడుతుంటా

నువ్వు నా కోసం

రహదారుల్లో మేకుల్ని మొలిపిస్తున్నావు’

అన్నప్పుడు యేకకాలంలో దేశానికి తిండి పెట్టే కర్షక వీరుల శ్రమని వున్నతీకరించడం వారి నిరసించే హక్కుని సైతం కాలరాసే పాలకుల క్రూరత్వాన్ని తెగనాడడం కనిపిస్తుంది.

ఎప్పటికైనా ‘నగరాన్ని ముట్టడించిన నాగళ్ళ’దే అంతిమ విజయం

అన్న హెచ్చరికతో కవిత ముగుస్తుంది.

పార్లమెంట్ లో అధికార పీఠంపై కూర్చున్న రాజకీయ పార్టీలతో అతనికి  ప్రమేయం లేదు. కార్పోరేట్ కి దళారులుగా వ్యవహరించేవాళ్ళెవవరైనా అతని దృష్టిలో ప్రజా శత్రువులే. దేశాన్ని  ప్రపంచీకరణకి ప్రయోగశాల చేసిన నాటి  ‘స్పర్శ’ సంపుటిలోని కవితలు కూడా యిటువంటి పంక్తుల్ని చూస్తాం.

మొన్సాంటోల విస్తరణ ఊబిలోకి

మట్టికాళ్ళు దిగబడతాయి

 (దృశ్యం విరిగిన  చప్పుడు 1998)

వేల వేల దుక్కుల్ని దున్నిన చేతులు

విత్తనాల మొదళ్ళని స్పర్శించిన పాదాలు

పనికిరాని పనికిమాలినన నాగళ్లవుతాయి

(అర్రు కడిగిన జీవితం 1999)

మొదటి కరోనా సందర్భంగా అకస్మాత్తుగా అనాలోచితంగా లాక్ డౌన్ ప్రకటించినప్పుడు   కోట్లాది మంది వలసకార్మికులు వందలాది మైళ్ళు సొంత యిళ్ళకు నడిచి వెళ్తున్నప్పుడు రాసిన కవిత అమ్మ కడిగిన పాదం. సంఘటనల పట్ల యే కవైనా స్పందించకుండా యెలా వుండగలరో నాకైతే అర్థం కాదు.

పగిలి ఎర్రముద్దలైన

నీ పాదాలను నా శిరస్సునుంచి ఊరేగిస్తాను

వంటి సహానుభూతి కవి హృదయం మాత్రమే ప్రకటించగలదు. నేలతల్లి కడిగిన పాదం దేశం సింహాసనాన్ని నిలదీస్తోంది అని చివర్లో అన్న వొక్క వాక్యం ten commandments తో సమానం.

***

స్వీకరించిన వస్తువే రూపాన్ని నిర్దేశిస్తుంది అన్న సూత్రీకరణ నిజమే అని యీ సంపుటిలోని కొన్ని కవితల్ని చూసినప్పుడు తప్పక వొప్పుకుంటాం. కథని కవిత్వంగా కన్సీవ్ చేసే విద్యని మాధవరావు సానబడుతున్నాడని   ఇల్లు, ఊరు రాజధానయ్యింది, విరిగిన కల, జ్ఞాన వృక్షం, ఓ సంజాయిషీ స్వరం, చిట్టి తల్లి, మాయమైన చేతులు, నేను కాని నా చిత్రం, తానూ నేనూ వంటి కవితల్లో గమనిస్తాం. ఆ కథలకు వస్తువులు వొక్కోసారి ఘటనలైతే కొన్నిసార్లు ఆ ఘటనలు కల్గించిన ప్రకంపనలు కావొచ్చు. మరో సారి వాటికి కారణమయ్యే సామాజిక చలనాలు వాటి నుంచి పుట్టే అంతరంగ కల్లోలాలు కవితలోకి చొచ్చుకొని వస్తాయి. చివరికి పరిపూర్ణమైన కథ వొకటి రూపొందుతుంది. అవసరం కొద్దీ అందులో జీవితానికి సంబంధించిన అనేక పొరలు నిర్మితమౌతాయి.

వొక ఉదాహరణ చూద్దాం :  ‘ఇల్లు’ కవిత గతం వర్తమానం భవిష్యత్తు – త్రికాలాల్లో నడుస్తుంది.

‘అక్కడో ఇల్లుండేది’

అనగనగా లాంటి  యెత్తుగడతో మొదలు పెట్టిన యీ కథా కవితలో రచయిత గత స్మృతుల నోస్టాల్జియా నుంచి యింట్లో యింటి చుట్టూ వున్న సజీవ నిర్జీవ ప్రపంచంతో సంభాషణ నెరపుతూ  భిన్న సామాజిక సాంస్కృతిక అంశాల్ని నెమరువేస్తూ అకస్మాతుగా  వొక్క కుదుపుతో పఠితల్ని  వర్తమానంలోకి తీసుకువస్తాడు.

‘రాజధాని మా వూర్లోకి చొరబడింది. ఊరు నగరపు దేహాన్ని కప్పుకుంటూ పురాస్మతుల కుబుసాన్ని విడుస్తోంది’ అని చెప్పి –

‘ఇప్పుడక్కడ ఇల్లు లేదు’ 

అని  వొక విధ్వంస దృశ్యాన్నిముందుకు తెస్తాడు. అది ప్రధ్వంసాభావం. అది యెంతో బాధిస్తుంది. దాన్నుంచీ బయటపడేసే

‘ఓ కొత్త నిర్మాణాన్ని కలగంటూ …’

భవిష్యత్తు వైపు దృష్టి సారించడంతో కవిత ముగిస్తాడు. స్థూలంగా యీ కవితలోని కథ యిది.

ఘటనల ప్రకంపనల చుట్టూ  అల్లిన కథా కవిత యిది. కుటుంబసంబంధాలు, భౌతిక/వస్తు సంస్కృతి, వుత్పత్తి విధానాలు అన్నీ మాయమై పోయిన  జీవన విధ్వంసం, దానిమీద పునర్నిర్మాణం, వునికికీ  వినాశానికీ మధ్య యేర్పడే వైరుధ్యాలు, అందుండీ పుట్టిన సంఘర్షణ … యిదంతా అనేక పాత్రలతో సన్నివేశాలతో  పెద్ద కాన్వాస్ మీద కథగానో నవలగానో రాయదగిన యితివృత్తం. దాన్ని వొక చిన్న కవితలోకి వొంపడం కవికి పరీక్షే. కవిత్వ నిర్మాణ రహస్యం తెలిసిన మాధవరావులాంటి యే కొందరో దాన్ని నిర్వహించగలరు. కవిత ఓపెన్ ఎండింగ్  కథగా మారిన క్రమంలో  వొక నిర్దిష్టమైన అంతర్గతమైన సంవిధానం వుంది. సూక్ష్మ ప్రణాళిక వుంది. మంచి అల్లిక వుంది. శైలి వుంది. బిగువైన నిర్మాణం వుంది.

ఇల్లు కథ అక్కడ ముగియక పోవడమే అసలు విషాదం. యెక్కడ చూసినా శిధిల జీవన దృశ్యాలే.  పచ్చదనం మీద మొలిసే కాంక్రీటు వనాలతో ఊరు రాజధానవడం విషాదానందాల సమ్మిశ్రణం. కానీ ఊరించిన రాజధాని సౌధం హఠాత్తుగా కళ్లముందే కుప్పకూలిపోయిన తర్వాతి ఎపిసోడ్  ‘విరిగిన కల’. అన్నీ కలిపి చూస్తే పెద్ద కాన్వాస్ మీద మరింత పెద్ద కథ రూపుకడుతుంది.

కరోనాని నెపంగా చేసుకుకుని రాసిన కాలిక కవితల్లో కూడా యిటువంటి కథా లక్షణాలు గోచరిస్తాయి. తరతరాలుగా మనుషులమధ్య సామాజిక దూరాన్ని పాటించిన జాతుల తరుపున క్షమాపణ అభ్యర్థించే అసింటా , బయటి కరోనా పురుగు కంటే చేయడానికి వుపాధి లేక రాబడి లేక పొట్టలోపలి ఆకలి పురుగే  నిర్వీర్యం చేస్తుందేమో అని భయపెట్టించే  లోపలి పురుగు, పెళుసుబారుతున్న  స్త్రీ పురుష సంబంధాల పట్ల ఆర్తిని ప్రకటించే  తానూ నేనూ కవితలు చూడండి. కరోనా చుట్టూ నిర్మించిన అనేక కథాంశాలు కనిపిస్తాయి. అసింటా కవిత కాస్త సిగ్గుపడదాం లాంటి కన్ఫెషన్. అంటరానితనాన్ని కుహనా శాస్త్ర తర్కంతో  మరోసారి సమర్థించుకుంటున్న బ్రాహ్మణీయ సంస్కృతిపై అది బలమైన చెంపపెట్టు.

అలాగే, ‘కలవడం కదా ముఖ్యం – నలుగురు కలిసి నవ్వుకోవడం కదా ముఖ్యం – కలిసుండటం కదా జీవితం’ అని తీర్మానించిన తానూ నేనూ కవితలో వర్తమాన జీవిత చిత్రణ ద్వారా గతాన్ని పాఠకుల వూహకు వదిలిన టెక్నిక్ దాన్ని ఓపెన్ స్టోరీగా మలిచింది. 

నిన్నటి అనుపమలో యివాళ్టి దృశ్య రహస్యాల్లో యిటువంటి కవితలు యెక్కువగా కనిపిస్తాయి. వాటిలోని ‘కథాకావ్య’ లక్షణాల్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయొచ్చు.

***

ఒక బిగువైన కరచాలనం లేక వొక గాఢ  పరష్వంగం లేక వొక ఆత్మీయ స్పర్శ లేక వొక మరువని కలయిక లేక వొక తీయని పిలుపు లేక నాలుగ్గోడల మధ్య సామూహిక స్పందనా రాహిత్యంతో మగ్గిపోతున్న కరాళ కరోనా కాలంలో మాధవ  కవిత్వం  నులి వెచ్చగా పలకరించింది. మనిషితనం మోసులెత్తేలా చేసింది. అనేక విస్మృత సున్నితత్వాల్ని తట్టి లేపింది. వొంటరితనాన్ని తరిమి కొట్టింది. భుజం నిమిరింది. వొక సంభాషణకు వుపక్రమించింది.

నిజానికి కవిత్వ రహస్యం తెలిసిన మాధవ లాంటి సీనియర్ కవులకు నాబోటి సంపాదకుల అవసరం లేదు. తెలుగులో యీ సంప్రదాయం కూడా అంతగా లేదు. ఎక్కడైనా వొకట్రెండు మాటల్ని అటూ యిటూ సర్దడమో అర్థచ్ఛాయల్లో విశ్రాంతి తీసుకునే పదాల్ని తడిమి లేపడమో తప్ప చేసింది గానీ చేయగలిగింది గానీ లేదు. సత్కవుల స్వేచ్ఛ నిరంకుశమైంది. దాన్ని గౌరవించి వొదిగి వుండటమే తొలి పఠితగా నేను చేసింది. తక్కిందంతా మాధవకు నా మీద వున్న అభిమానమే.

తొలినాటి చెమట చిత్తడి నేల (1998) నుంచి స్పర్శ (2005) అనుపమ (2014) ఊరి కల (2017)ల మీదుగా యివాళ్టి దృశ్యరహస్యం వరకూ మాధవ కవిత్వం అంతటినీ వొక చోట చూస్తే అతనొక విరామమెరుగని దీర్ఘ కవితని అల్లుతున్నట్టనిపిస్తుంది. ముగింపు లేని యీ కవితకు యాంకరింగ్ పాయింట్ మనిషే. మనిషి చుట్టూ అలుముకొని వున్న సామాజిక సంబంధాలే అతని కావ్య వస్తువు. అయితే మాధవ మనిషి అమూర్త మానవుడు కాదు. నిర్దిష్ట స్థలకాలాల్లో అనుక్షణం వునికి కోసం సంఘర్షించే మనిషి. రక్తమాంసాలతో నిత్య చలనం లో వున్న మనిషి. సమస్త వుద్వేగాలను గొంతులో నింపుకొని తోటి మనిషితో సంభాషణ కోసం సజీవ సంబంధం కోసం ఆరాటపడే నికార్సైన నిలువెత్తు మనిషి.

మనిషి తనను తాను కోల్పోతున్నందుకు దు:ఖం, అందుకు కారణమౌతున్న వ్యవస్థల పట్ల ఆగ్రహం –  రెండూ కలిసిన మా విషాద గీతం బండ్ల మాధవరావు కవిత. అయితే అతని గొంతులో దుఃఖం వ్యక్తమైనంత తీవ్రంగా ఆగ్రహం పలకదు. అతని వ్యక్తిత్వంలోనే ఆ స్వభావం వుంది.  మనుషుల్లోనూ కవిత్వంలోనూ  ‘శబ్ద – అర్థ సందర్భాల మధ్య లేచే నిలువెత్తు గోడల్ని’ బద్దలు కొట్టాలని అతని ప్రయత్నం. ‘మనుషుల్ని కలిపి కుట్టే’ వొజ్జబంతి లాంటి నిక్కమైన వాక్యాన్ని నిర్మిస్తున్నాడు.  వెలిసిపోయిన వంకర మాటల్ని చిలుము పట్టిన చొట్ట పడిన మకిలి పట్టిన మాటల్ని శుభ్రం చేసి మాటకి ప్రాణం పోస్తేనే మనం మనుషులుగా మిగులుతాం అని విశ్వసిస్తున్నాడు. కవి యెప్పుడూ పీడితుల పక్షమే అని మాధవ  యీ కొత్త సంపుటి ద్వారా  మరో మారు నిర్ధారిస్తున్నాడు. అనేక ప్రలోభాల మధ్య అణచివేతల మధ్య ద్రోహాల మధ్య యీ నిర్ధారణ యివాళ్టి అవసరం.

***

నిన్నటి తోట

ఇవ్వాళ వల్లకాడు

ఇప్పుడది వసంతం కోసం నిరీక్షిస్తుంది.

నిన్నటి వూరు

ఇవ్వాళ ఎడారి

వొక తొలకరి కోసం దాహంతో ఎదురు చూస్తోంది.

పొడారి పెలుసుబారిన గుండె 

వొక తడి పద్యం కోసం

పలవరిస్తోంది.

ఆహ్వానిద్దాం. 

హైదరాబాద్,                                                      ఎ. కె. ప్రభాకర్

జూలై 31, 2021.                                                 సంపాదకుడు

You Might Also Like

One Comment

  1. Mukundaramarao

    ఆద్యంతం చదివించే కవిత్వం అనిపించింది ..మీ సమీక్ష కవితాత్మకంగా అద్భుతంగా ఉంది ..మీకు మాధవ్ కు హార్దిక అభినందనలు.

    Mukumda Ramarao
    Hyderabad

Leave a Reply