ఆదివాసీ సాహిత్యం – నా అనుభవాలు
ఇవ్వాళ International Day of the World’s Indigenous Peoples (అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం) అంట. ఈ విషయం చదివాక కోవిడ్ లాక్డౌన్ లు మొదలయ్యాక నేను చదివిన ఆదివాసీ రచయితల పుస్తకాలని గురించి, చదవాలని లిస్టు చేసిన వాటి గురించి, ఎక్కడ వెదకాలి? అనుకుంటున్న వాటి గురించి ప్రస్తావించాలనుకుని ఈ వ్యాసం రాస్తున్నాను. ఇది నిజానికి ఒక జాబితా అంతే. దేనినీ వివరంగా పరిచయం చేయడం లేదు. అన్నట్లు – ఫోక్ టేల్స్ వంటివి కాదు. వీలైనంత వరకు సమకాలీన ఆదివాసీ రచయితల రచనల గురించే నా ప్రస్తావన.
భారతదేశపు రచనలు: గత ఏడాది మణిపూర్, నాగాలాండ్ నుండి వచ్చిన రచనలతో ఉన్న అంథాలజీలు రెండు చదివాను, వీటిలో చాలా మంది ఆదివాసీ రచయితలు ఉన్నారు. ఒక నాగా రచయిత్రి ఆత్మకథ చదివాను . ఈమధ్యనే అరుణాచల్ ప్రదేశ్ అంథాలజీ ఒకటి మొదలుపెట్టాను. ఇవన్నీ జుబాన్ బుక్స్ వారు వేసినవే! మొత్తం మొదటి నుండి చివరి దాకా అద్భుతం అనలేను కానీ అదొక కొత్త ప్రపంచం నాకు. ముఖ్యంగా నాగాలాండ్ అంథాలజీ నాకు చాలా నచ్చేసిఇంకొకరి చేత కూడా చదివించాను.
ఈ ఏడాది “The Adivasi will not Dance” అన్న కథల సంకలనం చదివాను. Hansda Sowendra Sekhar అన్న రచయిత రాసినది. కథలు చాలా మటుకు సంతాలీల జీవిత చిత్రణలే. అద్భుతమైన కథనం అనలేను కానీ, ఒక సంతాలీ తప్ప ఎవరూ రాయలేని కథలే అని నా అభిప్రాయం. ఇందులోని ఒక కథని నేను తెలుగులోకి అనువాదం చేసాను.
తెలుగుకి వస్తే: మల్లిపురం జగదీశ్ కథా సంకలనం “శిలకోల” చదివాను. ఇందులో భాష బాగుంది – కొన్ని అయితే ఆదివాసీ భాషల పాటలు కూడా మధ్యలో పెట్టి భలే ఉండింది. ఇవి కూడా అద్భుతం అనిపించలేదు కానీ ఆ నేపథ్యం వారు తప్ప బైటి వాళ్ళు రాయలేరు అనిపించినవే!
చదవాలనుకుంటున్నవి: పద్దం అనసూయ కథలు, ఈమధ్య ఒకటి బంజారా కథల సంకలనం వస్తోందని/వచ్చిందని ఫేస్బుక్ లో చూసాను – ఈ రెంటికీ ఈబుక్స్ ఉన్నట్లు లేవు. కనుక దొరికినపుడు చదవాలి.
వెదుక్కుంటున్నవి: దేశీ ఆదివాసీ రచయితలు రాసిన నాన్-ఫిక్షన్. వ్యాసాలూ, ఆత్మకథలు, ఇట్లాటివి. ఇలాంటివి నాకు కెనడా లోని ఆదివాసి రచయితలవి తేలిగ్గా దొరుకుతున్నాయి. మన వాళ్ళవి వెదుక్కోడం ఎలాగో అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి Jaipal Singh Munda రచనలు “Adivasidom: Selected Writings and Speeches of Jaipal Singh Munda” అన్నది చదువుతున్నాను. ఇదొక్కటే ఈ అంశం పై ఇప్పటికి కనబడ్డ పుస్తకం!
ఈ ఏడాది మొదట్లో ఒక ఆంగ్ల వెబ్ పత్రికలో 10 voices of Adivasi Literature అని ఒక వ్యాసం వచ్చింది. అన్నీ ఆంగ్లంలో లేవు గానీ, రెండు తెలుగు పుస్తకాలు ఉండడం గొప్పగా అనిపించింది. ఇవి చదవాలి ఎప్పుడో.
(అన్నట్లు ఇవన్నీ ఈ బుక్స్ గానే చదువుతున్నాను. కొనుగోలు కి ఉన్నవే అన్నీ!)
కెనడా రచనలు: నేను కెనడాలో నివసిస్తున్నందువల్లా, అలాగే ఇక్కడంతా మామూలు మెయిన్స్ట్రీమ్ పత్రికలలో చాలా మంది ఆదివాసీ రచయితల పుస్తక పరిచయాలు, ఇంటర్వ్యూలు
అన్నీ తరుచుగా కనబడ్డం వల్ల ఇక్కడ అన్ని రకాల రచనలు చదివాను ముఖ్యంగా గత రెండేళ్లలో. కథలు, నాటకాలు (Drew Hayden Taylor, Thomas King రచనలు ముఖ్యంగా); కవిత్వం (Marilyn Dumont); నవలలు (Thomas King), వ్యాసాలు, చరిత్ర (థామస్ కింగ్, Lee Maracle, Drew Hayden Taylor), గ్రాఫిక్ కథల సంకలనం – ఇలా రకరకాలవి చదివాను నేను వార్తల కోసం చదివే వెబ్సైట్లలో వచ్చిన రివ్యూల పుణ్యమా అని. వీటిలో కొన్నింటిని లిస్టు చేసి ఇక్కడికి ముగిస్తాను.
A really good brown girl -Marilyn Dumont (కవిత్వం). నాకు తెలుగే కవిత్వం సరిగా అర్థం కాదు. ఇంకా ఆంగ్లం. అందునా ఇలా ప్రత్యేకం ఆదివాసీ కవిత్వం! పుస్తకం నాకు నచ్చింది అనలేను కానీ, ఇది ఇక్కడ చాలామందిని ప్రభావితం చేసిన పుస్తకం. బలమైన అభివ్యక్తి ఉందనిపించింది.
My Conversations with Canadians – Lee Maracle (వ్యాసాలు). ఈమె ఇక్కడి తొలితరం ఆదివాసీ రచయితలలో ఒకరు. ఈ వ్యాసాలూ, వాటిలోని విసుర్లూ, చాలా ఆలోచింపజేశాయి నన్ను.
The Inconvenient Indian – Thomas King (చరిత్ర). గొప్ప పుస్తకం. ఏ దేశంలోనైనా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. అందరూ ఇది చదవాలి అనిపించినా పుస్తకం.
This Place: 150 Years Retold. గ్రాఫిక్ కథల సంకలనం. ఆక్రోశం, బాధ, ఆశ, గర్వం -తమ జాతి, చరిత్ర, వర్తమానం మీద ఇలా అన్ని భావాలు కలగలసిన పుస్తకం.
A Short History of Indians in Canada: Thomas King చిన్న కథలు. ఆ పదునైన వ్యంగ్యం, నవ్విస్తూనే మొహాన కొట్టే హాస్యం నాకు చాలా నచ్చాయి.
ఎవరైనా ఎందుకు ఆదివాసీ రచయితలని చదవాలి? – ఈ ప్రశ్న గురించి కొన్నాళ్లుగా ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచనలు ఓ కొలిక్కి వస్తే కొంచెం వివరంగా రాస్తానేమో.
Leave a Reply