టీకాల చరిత్ర, కొన్ని పుస్తకాలు

గత రెండు నెలలుగా నేను ప్రపంచమంతా వ్యాపించిన కోవిడ్-19 ప్రభావం లో  వరుసబెట్టి మహమ్మారుల చరిత్ర, టీకాల చరిత్ర/పనితీరు వంటి అంశాల మీద విస్తృతంగా చదువుతూ ఉన్నాను. వీటిలో పరిశోధనా పత్రాలే ఎక్కువ – అందువల్ల నేను కొంత శ్రమపడ్డాను కొంతైనా అర్థం చేసుకోడానికి. అయితే, నా అదృష్టం కొద్దీ కొన్ని మంచి accessible పుస్తకాలు కూడా దొరికాయి. వీటివల్ల ఈ విషయాల గురించి అవగాహన పెరిగి, ఆందోళన తగ్గిందని భావిస్తున్నాను. విశేషం ఏమిటంటే, ప్రత్యేకించి కోవిడ్ తో సంబంధం లేకపోయినా, ఈ పుస్తకాలన్నీ గత ఏడాది కాలంలో విడుదలైనవే! ప్రధానంగా రెండు అంశాలమీద ఎక్కువగా చదివాను. అవి:‌ టీకాల చరిత్ర, టీకా వ్యతిరేకత చరిత్ర.  వీటి గురించిన పుస్తకాలని పరిచయం చేస్తూ ఈ వ్యాసం రాస్తున్నాను.  

టీకాల చరిత్ర

Shitala: How India Enabled Vaccination – Mitra Desai: మనం మామూలుగా స్కూల్లో మొట్టమొదటి టీకా కనిపెట్టింది ఎడ్వర్డ్ జెన్నర్ అని చదువుకున్నాము. అయితే, అంతకు ముందు కూడా ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఇతర సంప్రదాయ వైద్య పద్ధతులు చెలామణీలో ఉండేవి టీకాలకి. ఈ పుస్తకం భారతదేశంలోని పద్ధతుల మీద ఫోకస్ చేస్తుంది. ఆయుర్వేదంలో నిష్ణాతుడైన తాత – ఆధునికురాలైన మనవరాలు మధ్య సంభాషణలా సాగుతుంది పుస్తకం. తాత సాయంతో భారతదేశంలో టీకాలన్నవి జెన్నర్ కంటే ముందు నుండి ఉండేవని తెలుసుకుంటూ, ఆ వైద్య విధానాల గొప్పతనం తెలుసుకోడం ఈ పుస్తకం కథ. అయితే, ఇలా కథలా చెప్పినా, ఆద్యంతమూ ఇదివరకు ప్రచురితమైన చారిత్రక పరిశోధనలపైనే ఆధారపడ్డారు. నాకీ పుస్తకం సూచిస్తూ “అజెండా” ఉండొచ్చని జాగ్రత చెప్పారు ఒకరు … కానీ, పుస్తకం చాలావరకు నాకు మామూలుగానే అనిపించింది. నన్ను బాగా ఆకట్టుకున్న విషయం టీకా వేసే పద్ధతి వివరణ, దాని చుట్టూ ఉన్న విధి విధానాల వర్ణన.  అయితే, కొంత ఏకపక్షంగా అనిపించింది – ఎందుకంటే ఇలాంటివే చైనా వంటి దేశాల్లో కూడా జరిగాయన్న విషయం కూడా వాళ్ళ రిఫరెంస్ లలో ఉంది కానీ వీళ్ళు అసలు ప్రస్తావించలేదు. అలాగే, చివరికొచ్చేసరికి కొంచెం ఊహలు (speculations) ఎక్కువ అయినట్లు అనిపించింది. ఈ రెండు విషయాలు వదిలేస్తే పుస్తకం ఉపయోగకరమైనది. పైగా వంద పేజీల్లోపే. బోరు కొట్టించకుండా చదివిస్తుంది. తప్పక చదవమని నా సలహా. 

The Great Inoculator: The Untold Story of Daniel Sutton and his Medical Revolution – Gavin Weightman: ఇందాక ప్రస్తావించిన సంప్రదాయ వైద్య పద్ధతులలో ఒకటి టర్కీ నుండి ఇంగ్లండులోకి ప్రవేశించింది పద్దెనిమిదో శతాబ్దంలో. దీనికి కొన్ని మార్పులూ చేర్పులూ చేసి సట్టన్ అనే స్థానిక వైద్యుడు “సట్టన్ మెదడ్” పేరిట మశూచి టీకాలు ఇచ్చేవాడు. అదలా కుటుంబ వృత్తిలాగ అయిపోయి, తరువాత వీళ్ళ శిష్య బృందం ఫ్రాంచైసీ తరహాలో ఇంగ్లండులో మొత్తం వ్యాపింపజేసి, కొంత యూరోపు, అమెరికా దాకా పాకింది. ఈ పుస్తకం ఈ సట్టన్ కుటుంబంలో అందరికంటే ఎక్కువ పేరొందిన డేనియల్ సటన్ జీవిత చరిత్ర. పుస్తకం కొంత నేపథ్య చరిత్రతో మొదలై (అయినా ఎక్కడా ఇండియా/చైనా ప్రస్తావన లేదు) నెమ్మదిగా సటన్ పద్ధతులు, పేరు ప్రఖ్యాతులు పెరిగిపోవడం, విపరీతంగా ధనం సంపాదించడం… క్రమంగా అదీ పోవడం, ఆధునిక పద్ధతులు వచ్చాక ఈయనకి డిమాండు పడిపోడం దాకా సాగుతుంది. అక్కడక్కడా కథనం బోరు కొట్టినా  ఇది నాకసలు తెలియని కథ కనుక చాలా ఆసక్తికరంగా ఉండింది. ఈయన ఓ వెలుగు వెలిగాక కుటుంబం ఏమైంది? అన్న కుతూహలం సహజం – చివరి అధ్యాయం చదివాక మాత్రం “పాపం” అనుకోకుండా ఉండలేకపోయాను. తప్పక చదవమని అనను కానీ, ఈ టీకా చరిత్రపై ఆసక్తి ఉంటే మాత్రం మంచి పుస్తకం. 

టీకా వ్యతిరేకత చరిత్ర:

Vaccine Hesitancy: Public Trust, Expertise, and the War on Science –  Maya J. Goldenberg: ఈ పుస్తకం కెనడాలోని ఒక ప్రొఫెసర్ రాసినది. వృత్తిరిత్యా Philosophy of science అధ్యయనం చేస్తారంట ఆవిడ. ఆ వివరం చూడగానే “వామ్మో, ఇది మనకర్థం కాదులే” అనుకున్నా, సాహసం చేసి చదివాను. టీకాల గురించి జనంలో ఉండే అనుమానం ఎందుకు? దాన్ని ఎదుర్కోడం ఎలా? అన్న ప్రశ్న వేసుకుని మొదలుపెట్టారు. ప్రధానంగా నాకు అర్థమైంది ఏమిటంటే – వ్యవస్థ పట్ల/సైంస్ పట్ల అపనమ్మకాన్ని ఎదుర్కోడానికి అదేదో యుద్ధం లా చూడకూడదనీ, టీకాల గురించిన అనుమానానికి అన్నివేళలా అజ్ఞానం ఒక్కటే కారణం కాదనీ, శాస్త్రవేత్తలు/ఇతర ప్రజారోగ్య నిపుణులూ వాళ్ళ వైపునుండి ఈ విషయాన్ని చూసే పరిస్థితిలో కూడా మార్పు రావాలనీ రచయిత్రి ప్రతిపాదన. నిజానికి ఈ ప్రతిపాదన, దీని చుట్టూ రచయిత్రి వాదన, అన్నీ బాగున్నాయి. అయితే, చెప్పిందే పదిసార్లు తిప్పి తిప్పి రకరకాలుగా చెప్పినట్లు అనిపించింది నాకు. ఇతర పరిశోధకులకోసం రాసింది ఇలా నా కంటబడ్డదేమో అని నా సందేహం. 

On Immunity: An Inoculation –  Eula Bliss: ఇది ఒక రచయిత్రి తను తల్లి అయ్యాక పిల్లాడికి టీకాలు వేయించే క్రమంలో కలిగిన ప్రశ్నలు, వాటికి సమాధానాలు వెదుక్కుంటూ రాసినది. నేను ఇవన్నీ చదవడం మొదలుపెట్టడానికి కారణాలు ఇలాంటివే కనుక ఈ premise కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు బాగున్నాయి. రచయిత్రి వాదనకి అనువుగా చూపిన ఆధారాలు కూడా బాగున్నాయి.  ఆత్మకథాత్మక శాస్త్రపరిశోధన అంటూ ఏదైనా కొత్త ప్రక్రియ ఉందంటే అది ఈ పుస్తకానికి బాగా సరిపోతుంది. కవిత్వ నేపథ్యం కూడా ఉంది కనుక ఒక్కోచోట ఇలాంటివి ఇలా కూడా వర్ణించొచ్చా అనిపిస్తుంది. నాకు మాట్లాడితే వాంపైర్, డ్రాకులా కథలని లాగి వాటితో టీకాలకి పోలిక తెప్పించడం కొంచెం బోరు కొట్టింది. అలాగే, పూర్తిగా పాశ్చాత్య సాహిత్యం, రిఫరెన్సెస్ వల్ల కొన్ని చోట్ల నాకు అర్థం కాలేదు ఆవిడ పోలికలు. మొత్తానికి ఒక ప్రయోగంగా నాకు నచ్చింది కానీ, చివరికి రచయిత్రి తోటి రచయితలు/కవుల కోసం రాసుకున్న శాస్త్ర పరిశీలన గ్రంథంలా అనిపించింది నాకు. ఏంటో ఈ రైటర్లు, వాళ్ళు రాసింది తోటి రైటర్లకి తప్ప మామూలోళ్ళకి అర్థం కాదు అని నిట్టూర్చవలసి వచ్చింది చివరికి వచ్చేసరికి!

Anti-vaxxers: How to Challenge a Misinformed Movement – Jonathan M. Berman: టీకాలు ఉన్నప్పట్నుంచి టీకాల పట్ల వ్యతిరేకత కూడా ఉంది. ఎలాంటి వ్యతిరేకత? ఎందుకు? అందులో నిజానిజాలెంత? దాన్ని ఎదుర్కోడం ఎలా? – ఇలాంటి ప్రశ్నలని తీసుకుని చర్చిస్తూ సాగుతుంది ఈ పుస్తకం. ఇదొక ప్రొఫెసర్ రాసిన పుస్తకమైనా అకడమిక్ పుస్తకం కాదు. సామాన్య జనానికోసం రాసినది. అసలు నాకు పుస్తకం రాసిన తీరు మొదలుకుని, చర్చించిన అంశాలు, సూచించిన పరిష్కారాల దాకా మొత్తం నచ్చింది. ఈ టీకా వ్యతిరేకత గురించి సందేహాలుంటే ఆ పై రెండు పుస్తకాలు వదిలేసి ఇది మాత్రం తప్పనిసరిగా కొనమని చెబుతాను. ఈ పుస్తకం చదివాక చాలా విషయాల గురించి అవగాహన పెరిగినట్లు అనిపించింది నాకు. ఇంకా నాకు అర్థం కానివి చాలా ఉన్నాయి కానీ, ఈ పుస్తకం వరకు స్పష్టంగా రాశారని చెప్పగలను. 

ఈ పుస్తకాలలో శీతల ఒక్కటే నేను కొన్నది. తక్కినవన్నీ మా పబ్లిక్ లైబ్రరీ వారి పుణ్యం. కనుక వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తప్పులేదు. ఈ పుస్తకాలలో తప్పనిసరిగా ఇప్పటి కోవిడ్ కాలానికి అందరం చదివి తీరాలి అనిపించిన పుస్తకం చివర ప్రస్తావించిన Anti-vaxxers. ఇక భారతదేశం గురించి కనుక శీతల కూడా నా దృష్టిలో ఈ ఏడాదిలో నేను చదివిన మంచి పుస్తకాల్లో ఒకటి. మిగితావి ఏదో ఫ్లో లో చదివేశానని అనుకోవాలి అంతే.  

You Might Also Like

One Comment

  1. 2021 – నా పుస్తక పఠనం – పుస్తకం.నెట్

    […] టీకాలు, వాటిపై వ్యతిరేకత – వీటి గురించిన చరిత్ర ని చెప్పే పుస్తకాలు. వీటి గురించి పుస్తకం.నెట్ లో పరిచయం చేశాను. […]

Leave a Reply to 2021 – నా పుస్తక పఠనం – పుస్తకం.నెట్ Cancel