విపరీత వ్యక్తులు: చంద్రశేఖర్ ఆజాద్

(ఇది చంద్రశేఖర్ ఆజాద్ పి రచించిన “విపరీత వ్యక్తులు” నవలకి అనిల్ అట్లూరి రాసిన ముందుమాట. మరో మందుమాటను వచ్చే వారం ప్రచురించబోతున్నాం. – పుస్తకం.నెట్)

My two cents…

సాహిత్యం సమకాలీన చరిత్రని కూడా నమోదు చేస్తుంది.  ఈ నవల సమకాలీన సమాజపు పోకడ మీద ఒక సుదీర్ఘమైన వ్యాఖ్య.  

ఈ రచయిత ‘విపరీత వ్యక్తులు’ అని పేరు పెట్టాడు కానీ ఇందులో ప్రధాన పాత్ర ‘గౌతమ్’ ది.  

రెండవ అధ్యాయం అంతా ప్రధమ పురుష లో ఉంటుంది.  గౌతమ్ మాటల్లో.  

గౌతముడు సకల కళా వల్లభుడు కాడు.  అతనికి సంగీతం వచ్చు, సాహిత్యంలో మునిగి తేలాడు.  ప్రాపంచిక విషయాల మీద కుతూహలం కొద్ది తిరిగాడు.  స్వామిజీలతో కలిసి జీవించాడు.  వాళ్ళతో కలిసి గంజాయిని ఊపిరిగా తీసుకున్నాడు.

తన చుట్టూ ఉన్న వాతావరణం, ప్రజలు, వారి ఆవేశ కావేశాలు, వారి అభిప్రాయాలు, వారి జీవన శైలి, భుక్తి కోసం, గుర్తింపు కోసం, పడుతున్న పాట్లు,  వాటిల్లో తన జీవిత కాలంలో చూసిన మార్పులు, చేర్పులు గురించి, తన మీద వాటి ప్రభావం గురించి ఈ నవల నడుస్తుంది.  అలా చదువుకున్నప్పుడు ఈ నవలలోని పాత్రలన్నీ కూడా ఈ సమాజం లోని ‘విపరీత వ్యక్తులు’ అనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుంది?

ముఖ్యంగా తెలుగు సాహితీ రంగంలో ఉన్నవారికి. ఆ క్షేత్రంలో ఎదగాలనుకుంటున్న, ఎదిగిన, ఎదుగుతున్న గడ్డి పరకలు, చెట్లు, చేమలు, వృక్షాలు, మహా వృక్షాలు తెలిసినవారికి, వాటి గురించి విన్నవారికి, చూసిన వారికి, ఫెటిల్లున విరిగి కిందపడి మట్టిలో కలిసిపోయిన వాటిని కూడా గుర్తు పట్టగలరు.  రేఖామాత్రంగానైనా. అంతా మాత్రం చేత ఇది తెలుగు వారికి మాత్రమే చెందినది కాదు.  కళ్ళున్నవారందరికి, చెవిటితనం లేనివారందరికి కూడా ఇది ఈ ప్రపంచానికి చెందినదిగా కనపడుతుంది, వినపడుతుంది.  

మరొకటి కూడా.  

Thomas Friedman 21 శతాబ్దం లో వచ్చిన సాంకేతిక విప్లవం గురించి ఒక పుస్తకం రాశాడు, ‘The world is flat.’  ఇంటెర్నెట్ వచ్చిన తరువాత అది గుండ్రంగా ఉన్న ఈ భూగోళాన్ని చదును చేసి బల్లపరుపుగా చేసేసిందని.  ఒకప్పుడు విద్య, విజ్ఞానం, తద్వారా వచ్చే విత్తం మరికొన్ని అవకాశాలు కొంత మందికే అందుబాటులో ఉండేవి.  కానీ ఈ అంతర్జాలం వచ్చిన తరువాత అమెరికా నుండి ఆక్లాండ్ దాకా మట్టుకే కాకుండా దానికి అటూ ఇటూ ఉన్న వారందరికీ కూడా అవన్నీ మరికొన్ని అందరికీ అందుబాటులోకి వచ్చినవి.  ముఖ్యంగా సాంఘిక మాధ్యమాలు. వీటి ద్వారా మరుసటి రోజు ఉదయం వరకో రాత్రివరకో వార్తల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని వేల మైళ్ళ దూరం లో ఉన్నవారిని కూడా కొన్ని క్షణాలలోని ఇవి కలిపేయగలవు. అంతే కాదు విడదీయగలవు కూడా.  

వాటి ప్రస్తావన కూడా ఉంది.  

వాటిల్లో జరుగుతున్న అస్తిత్వ వాదాలు. వాటి బయట కూడా వాటిని వాడుకుంటూ నిచ్చెన మెట్లు ఎక్కుతున్న (ఎక్కుతున్నారా, పాతాళలోకానికి జారిపోతున్నారా అన్నది పఠితను బట్టి ఉంటుంది) వారి మీద ఎక్కుపెట్టిన అస్త్రాలు.  నవలలో పాత్రలు కొన్ని మతాలకు, కులాలకు, కొన్ని రంగాలకు మాత్రమే చెందినవిగా కనపడినా అవి వాటికి మాత్రమే పరిమితం కావు.  నవలలో ఎక్కడా కూడా ఒక ప్రాంతాన్నో, నగరాన్నో  ఫలానా అని చెప్పకపోయిన  ఇది సాయంత్రాలు ఒక ట్వెంటీ , ఫార్టీ అంతకు మించి వేసుకునే మనుషులు నివసించే ప్రదేశం అనిపిస్తుంది.  

అలాగే కొన్ని నమ్మికలోనో, సిద్దాంతాలలో వచ్చిన, వస్తున్న మార్పులను కూడా చర్చకు పెడుతుంది. జీవితంలోను, జీవికలోనూ ఇమడలేకపోతున్న జీవుల వెతలను కూడా పరామర్శిస్తుంది.  

చురకలు వేస్తుంది.  

మచ్చుకి కొన్ని చురకలు:

“తెలుగు సాహిత్యంలో.. ఇప్పుడు మద్యం, మాంసం లేకుండా సాహిత్యం లేదు.”  ఇటీవల వస్తున్న సాహిత్యం లో సుమారుగా పాతిక శాతం ఈ కధలే!    

“పెళ్ళాం వెళ్ళిపోవడం – లేచిపోవడం కాదు.,”  

 “అన్నీ ప్రశ్నలే.  సమాజాన్ని సమూలంగా మార్చేస్తామంటారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారు. మరి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు ఎందుకు?”

“నల్లగా ఉన్నవాళ్ళందరూ దళితులా?”

“మద్యానికి నో చెప్పను.  పద్యం అంటే ఎలర్జీ అంటాడు.”  

“బ్రాహ్మణులని మాత్రమే కాదు అప్పుడప్పుడు అగ్ర కులాలవారిని కూడా తగాలబెట్టా,” లంటాడి గౌతముడు.

“కవులు, రచయితలు పైకి ప్రజాస్వామికంగా కనిపిస్తారు.  వారిని ఒక మాట ఎవరన్నా అంటే మాత్రం భరించలేరు.”

“అతనులోనూ పురుషుడున్నాడన్నమాట!” అని నయన అంటుంది. నయన స్త్రీవాది.

“ఇప్పుడు సాహిత్యంలో విమర్శ లేదు. పరస్పరం ఒకరి భుజాలు ఇంకొకరు తడుముకుంటున్నారు.  ఒకరని ఇంకొకరు ప్రైవేట్ సమావేశాల్లో తిట్టుకుంటున్నారు.”

“విడాకులివ్వకుండా కూడా సహజీవనం చేయవచ్చు.”

“ఆడవాళ్ళు కూడా తగలెట్టండి పైటల్ని అంటూ మొదలు పెట్టారు.  తగాల బెట్టాల్సింది చున్నీలను. పైటలనీ, బ్రాలనూ కాదు.  “

“అతను దళితుడు అని తెలిసాక కొందరు అతని అభిమానులయ్యారు.”

“ఇతను మనవాడు, ఇంత నోరున్న మనిషి మనకు అవసరం.  అతని మీద ఎలాంటి దాడి జరిగినా మనం మద్దుతు నివ్వాలి అనుకున్నారు.”

“తెలుగు సాహిత్యం, రాజకీయాలు, ఆస్తిత్వాలు వీటి చుట్టూ తిరుగుతుంటాయి.  ఈ రచనలలో నిరసన వుంటుంది తప్ప, అద్భుతమయిన కళాత్మక వుండదు.”  

“లక్జరీ సాహిత్యం ఒక పక్కన వుంటుంది.  నిరుపేద సాహిత్యం ఇంకో పక్కన వుంటుంది,”  

“నేను పది సంవత్సరాలు పాటు పిల్లలకోసం నా కెరీర్ ని ఫణం గా పెట్టలేను”

“కొంత మంది కర్రలు మాత్రం తీసుకువస్తారు ప్రదర్శనకి.  దానికి జెండా వుండదు. ఎప్పుడు ఏ జెండా కావాలంటే ఆ జెండాను బయటికి తీస్తారు.  “

“నిజం చెప్పాలంటే చిన్న కులాలలో నిజమైన  ప్రేమ వుంటుంది.”

“శీలం అనే విషయంలో ఇటు శ్రామిక వర్గ కులాలలో, అటు ఉన్నత వర్గాలలో పెద్ద పట్టింపు వుండదు.  శీలం ఎప్పుడూ మధ్య తరగతి చుట్టూనే తిరుగుతుంది,  ..”  

ఇవన్నీ దాటుకుని గౌతమ్ ఎక్కడకు చేరుకున్నాడో, అసలు చేరుకున్నాడో లేడో, చేరుకుని తెలుసుకున్నాడో లేదో, తెలుసుకుంటే ఏం తెలుసుకున్నాడో, తెలుసుకోవాలనుకుంటే ఈ నవల చదవండి.  

మరోమాట

సాహిత్యం సమకాలీన చరిత్రని నమోదు చేస్తుందని మొదటే చెప్పుకున్నాం.  మార్క్సిజం దృష్టి వున్నప్పుడు, ఆ రచయితకి జటిలంగా ఉన్న సమస్యలు తప్పక కనపడతాయి.  వెంటాడుతాయి, వేటాడుతాయి.  కదిలించినప్పుడు కవితని వెంటనే అక్షరీకరించవచ్చు.  కానీ నవల అటువంటి ప్రక్రియ కాదు.  నవల రాయడానికి కొంత వ్యవధి అవసరం.  పైగా కఠోరమైన వాస్తవాలని చర్చకు పెడుతూ ఇటువంటి నవలరాయడం సాహసమే! ఇటువంటి నవలని చంద్రశేఖర అజాద్ వెలవరించకపోతే ఆశ్చర్యపడాలి కాని వెలువరిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఇక నవల చదవడానికి ఉపక్రమింఛండి.  

ఇది ఒక అరాచకపు నవల. 

అనిల్ అట్లూరి

23-12-2020

****

ప్రతి ధరః  రూః120.00

ప్రతులకు

నవోదయ బూక్ హౌస్,
Navodaya Book House
3-3-865,Opp Arya Samaj mandir,
Kachiguda,Hyderabad,
Pin Code: 500027,
Telangana,India.
Mob:+91-9000413413
Office:040-24652387
Web: www.TeluguBooks.in

*

Nava Telangana Book House and all its branches
NavaTelangana Book House,
M.H.Bhavan Plot No 21/1, Azamabad,
Near R.T.C. Kalyana Mandapam,
Hyderabad-500020.
Ph.No:040 27660013,
Mobile.No:040 27660013,

http://www.navatelanganabooks.com/

*

Visalandhra Publishing House and all its branches

Chandram Buildings, Chuttugunta, Vijayawada, Andhra Pradesh 520004

Mob+91 905-210-1320 | 0866-243-0302

https://visalaandhra.in/

P Chandrasekhara Azad
Janaki  Azad Prachuranalu
Flat No- 909, Saphire Block
My Home Jewel, Madinaguda, 
Miyapur, Hyderabad – 500049
Mob: 92465 73575

You Might Also Like

Leave a Reply