సీమ గడపకు హాస్య తోరణం

వ్యాసకర్త: విశీ

రాయలసీమ రచయితల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన రచయిత కీ.శే. చిలుకూరి దేవపుత్ర. ఆయన పేరు చెప్పగానే ‘మన్ను తిన్న మనిషి’ కథ గుర్తొస్తుంది. ‘పంచమం’ నవల గుర్తొస్తుంది. దళిత జీవనాన్ని, రాయలసీమ బతుకు చిత్రాన్ని అక్షరీకరించిన క్రమం మనసులో మెదులుతుంది. ఆయన రాసిన హాస్య కథల సంపుటి ‘వంకరటింకర ఓ!’. అనంతపురం కథలు అనగానే కష్టాలు, కరువును చూపే కథలకు భిన్నంగా సీమ గడపకు హాస్య తోరణం కట్టిన కథలివి.

ఈ కథలన్నీ కేవలం హాస్యానికే పరిమితం కాకుండా, వివిధ సామాజిక అంశాలను తడుతూ సాగడం విశేషం. ఇందులోని మొత్తం 18 కథలూ అనంతపురం మాండలికంలో ఉన్నాయి. మొదటి కథ ‘వంకరటింకర ఓ!’ ఆరోగ్యం మీద అతిశ్రద్ధ ఉన్న ఓ ఇంటి పెద్ద కథ. ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి, నేచురోపతి.. ఇలా అన్ని రకాల వైద్య విధానాలను మార్చి మార్చి ఇంటివారిపై ప్రయోగించే ఓ మనిషి కథ. అతని అతి శ్రద్ధ వల్ల భార్యాపిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ఆసక్తికరంగా ఉంది. రెండో కథ ‘అడినోవా’ కూడా వైద్యం కోసం పడే తిప్పలు చుట్టూ సాగుతుంది.

మూడో కథ ‘ప్రేమలేఖ’ ప్రభుత్వ కార్యాలయాల్లో గుమాస్తాల ఆలస్య పనితీరుపై హాయైన వ్యంగ్య బాణం. భార్య ఏనాడో రాసిన ఉత్తరానికి ఆ తర్వాత 

ఎప్పటికో జవాబు పంపి, బెంబేలెత్తించిన భర్తను ఇందులో చూడవచ్చు. నాలుగో కథ ‘పిడుగులు’లో చిన్నపిల్లల పెంపకంలో సాగే సరదాలు ఇతివృత్తం. చదువుల మాయలో పిల్లల్ని కాన్వెంట్లకు అంకితం చేస్తున్న తల్లిదండ్రులపై చురక వేసే తీరు ఆకట్టుకుంటుంది. ఐదో కథ ‘దొంగయితే బాగుణ్ణు’ పోలీసు వ్యవస్థ మీద సెటైర్. పోలీసుల కన్నా దొంగలే నయం అనిపించే స్థితి రామలింగానికి ఎందుకు వచ్చిందో చదివి తెలుసుకోవాల్సిందే! 

‘పులికి పిలక లేదు’ కథ విద్యుత్తు శాఖాధికారుల ఉదాసీన వైఖరితో తిప్పలు పడే నిజాయతీపరుడైన సింహాచలం కథ. చివరికి అతని మంకుపట్టును అతని ఇంట్లోవారే విడిపించిన తీరు ఆసక్తిగా ఉంటుంది. ‘మీసాలు’ కథ పోలీసు వ్యవస్థలో వస్తున్న మార్పులు, పోలీస్ బాస్‌ల మధ్య తేడాలను చూపుతుంది. ‘మంత్రి వెడలె’ కథంతా మంత్రిగారి రాక కోసం ఎదురు చూసే ప్రభుత్వ అధికారుల తీరుపై సాగుతుంది. మంత్రి కోసం వంటలు వండించి అన్నీ సిద్ధం చేస్తే ఆయన రాకపోవడం, అవన్నీ ఖాళీ చేశాక చివరి నిమిషంలో ఆయన వస్తున్నారని తెలియడం వంటి అంశాలు చదివిస్తాయి. ‘కాలిముల్లు’ కథ పొరిగింటి వ్యక్తి ముందు ప్రతిసారీ చులకనయ్యే వెంకటేశులు అనుభవాల దొంతర.

మిగిలిన కథలన్నీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ మేలైన హాస్యాన్ని పంచుతాయి. ప్రతి పాత్రా మన చూట్టూ ఉండే మనుషులే అనిపించేలా రాయడం దేవపుత్ర గారి పద్ధతి. ఏమాత్రం విరామం తీసుకోనివ్వకుండా చివరి వరకూ చదివించేలా సాగే రచనాశైలి ఈ కథల్లో గమనించవచ్చు.

వెల: రూ.50

ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 4-1-435, విజ్ఞాన్ భవన్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్.

You Might Also Like

Leave a Reply