తరలి వచ్చిన కథలు.. చదవాల్సిన కథలు!

వ్యాసకర్త; విశీ

కొన్నాళ్ల క్రితం తెలుగు సినీ రచయితల గురించి ఫేస్‌బుక్‌లో రాద్దామని కూర్చుని, తెలుగు సినిమాల్లో ముస్లిం రచయితలు ఎవరున్నారా అని ఆలోచిస్తే ఒక్క పేరూ తట్టలేదు. వెతగ్గా వెతగ్గా ‘ఓనమాలు’ సినిమాకు మాటలు రాసిన ఖదీర్‌బాబు గారి పేరు మాత్రం గుర్తొచ్చింది. అంతే! పాటల్లో లేరు. స్క్రీన్‌ప్లే‌లో లేరు. ఉన్నారా అంటే ఉండే ఉంటారేమో అనుకోవడం తప్పించి, ఉన్నారని గట్టిగా అనుకోలేని పరిస్థితి.

సరే! కథలు చదువుతూ ఉంటాను కదా! అందులో ఎందురున్నారా అని లెక్క తీస్తే పది పేర్ల దగ్గర జాబితా నిలబడిపోయింది. పదకొండో పేరు చేతికి రాలేదు. లేరా అంటే లేరని కాదు. నాకు తెలియకుండా ఉండిపోయారు. నాలా చాలా మందికి తెలియకుండా ఉండిపోయారు. కారణం ఇదీ అని చెప్పలేను. కానీ దూరం దూరమే! మతమో, ప్రాంతమో ప్రాతిపదిక చేసి రచయితలను ఎంచడం సరైనదా, కాదా అనే విషయంలో నా‌ దగ్గర ఉన్నది ఒకే సమాధానం.. ఆ సమూహం నుంచి కథలు వచ్చినప్పుడే, అక్కడున్న సంగతులు జల్లెడలోంచి జారకుండా, నికార్సుగా బయటికొస్తాయి. వాళ్ల గురించి ఇతరులూ కథలు రాయొచ్చు గాక! అవి సహానుభూతిగా మారగలవు తప్ప, వారి స్వీయానుభవాల సారాన్ని ఎంతో కొంత మిస్సవుతాయేమో అనిపిస్తుంది. 

మరి పాఠకులు ఏమనుకుంటున్నారు? చెప్తా! ఖదీర్ ‘దావత్’ కథ ఒక్కసారి చదివిన మా నాన్న ఇప్పటికీ ఆ కథను గుర్తు చేస్తూ ‘ఎంత బాగా రాశారో చూడు’ అంటుంటారు. స్కైబాబా ‘బేచారె’ చదివి ‘ముస్లింల ఇళ్లలో ఇన్ని కథలున్నాయా? ఎవరూ‌ చెప్పరేంటి?’ అన్నారు. ‘కథా మినార్’ పుస్తకాన్ని ఓ స్నేహితుడికి ఇస్తే, ‘ఇన్నాళ్లూ ఇంత మంది రచయితల్ని ఎలా మిస్సయ్యాను?’ అని అన్నాడు. ఇదంతా నా అనుభవమే! పాఠక వర్గం ముస్లింల గురించి చదవాలని ఎప్పుడూ ఆరాటంతోనే ఉంది. ‘మీరు మీ కథ చెప్పండి. మేం వింటాం’ అని చెవి ఒగ్గి నిలబడింది. కళ్ల కింద సుర్మా అద్ది, షేర్వానీ వేసుకుని, పాయసం గిన్నెతో ప్రేమగా ఎదురొచ్చే వారి అంతఃచలనాలు, సామాజిక ఇబ్బందులు, సరదాలు, సంబరాలు.. అన్నీ తెలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉంది. 

సమూహాల మధ్య ఎక్కడికక్కడ తెలియని గోడలు కట్టబడుతున్న వేళ అటు గానాలు ఇటు, ఇటు గీతాలు అటు వినబడని ఈ పరిస్థితుల్లో ఒకరి కథలు మరొకరికి చేరడం అవసరం. ఉన్మాదం ఆనవాళ్లు తుడివేయగలిగే తీరైన అమృతం. సాహిత్యం ఏం చేస్తుంది అని అడిగితే, ఇదిగో ఇలా ఒక సామూహిక జీవితాలను అందరికీ చేరువ చేస్తుంది అని చెప్పగలను. మన ఊహల్లో, ఆలోచనల్లో ఇతరుల పట్ల నిండిన కల్మషాన్ని దూరం చేస్తుందని ఎలుగెత్తి చాటగలను. అటుఇటూగా ఒకే సమయంలో వచ్చిన ఈ రెండు పుస్తకాలు ఆ పనిని సమర్థంగా చేశాయనే అంటాను. చదివాక మరిన్ని సంగతులు చెప్పాలి. ఇలాంటివి మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. సంపాదకులు వేంపల్లె షరీఫ్, షాజహానా గార్లకు ధన్యవాదాలు.

You Might Also Like

Leave a Reply