సినిమాలు మనవీ- వాళ్ళవీ : సత్యజిత్ రే
వ్యాసకర్త: వారాల ఆనంద్
“REVISIT ALWAYS REJUVANATES “ అన్నది నా విశ్వాసం, అనుభవం కూడా. ఏదయినా మనకు నచ్చిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ చదవడం, నచ్చిన సంగీతం మళ్ళీ మళ్ళీ వినడం, నచ్చిన సినిమాను మళ్ళీ మళ్ళీ చూడడం వల్ల ఎన్నో నూతన అర్థాలు తెలుస్తాయి, అనుభూతులు కలుగుతాయి, మనకు ఆ సృజనకారుడు మరింతగా అర్థం అవుతాడు ఫలితంగా మనం మరింత చైతన్యవంతులం అవుతాం. మనలో మరింతగా వెలుగు నిండుతుంది. ఆ క్రమంలోనే ఎప్పుడో అందుకుని చదివేసిన వి బి సౌమ్య గారి “సినిమాలు మనవీ- వాళ్ళవీ” (OUR FILMS AND THEIR FILMS by Satyajit Ray కి తెలుగు అనువాదం) మళ్ళీ చదివాను. గతంలోనే మూలం అనువాదం రెండూ చదివి ఉన్నప్పటికీ ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి రే ని చదవడం సరికొత్త దారిలో నడిచిన అనుభూతి కలిగింది. స్వచ్చమయిన చల్లని గాలి నా చుట్టూరా అలుముకునట్టయింది. సత్యజిత్ రే గొప్ప దర్శకుడే కాదు రచయిత, చిత్రకారుడూ, సంగీతకారుడు, సినీ విమర్శకుడు కూడా. సినిమాల గురించి ఆయన రాసిన వ్యాసాల సంకలనమిది. భాష ఎంతో సరళంగా వుండి చకచకా చదివిస్తుంది.
“కళకీ సత్యానికీ మధ్య నెలకొంటున్న బంధం చివరికి ఫలితాన్నిస్తుందని నా నమ్మకం, ఆశ” అన్న సత్యజిత్ రే రాసిన ఈ వ్యాసాలు భారతీయ సినిమా తో పాటు ప్రపంచ సినిమా రంగం తొలి రోజులనాటి స్థితిగతుల్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగ పడుతాయి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా సినిమా దర్శకులు అతి తక్కువ మంది మాత్రమే సినిమాల పైన రాసారు. కాని రే “ బెంగాల్లో వుండే కొన్ని ప్రత్యేక పరిస్థితుల గురించి నా అనుభవాల గురించి రాస్తే బహుశా మన దేశంలో ఈ దారిలో నడవాలనుకుంటూ, ఇందులోని ఒడి దొడుకులు తెలీని వారికి పనికి రావచ్చు” ఈ వ్యాసాలూ పుస్తకంగా తెచ్చారు.
‘సృజనాత్మక కళలన్నింటిలోకీ సినిమా తీయడం అన్నది అత్యంత శారీరక శ్రమతో కూడుకున్నది’ అన్న సత్యజిత్ రే ఈ వ్యాసాల ద్వారా సినిమా తీయడంలోని ఆనందానుభావాల్ని మీ తో పంచుకోగాలిగాననే అనుకుంటున్నాను అన్నాడు. ఈ పుస్తకం లో మొదటి భాగంలో భారతీయ సినిమాల గురించి, రెండవ భాగంలో విదేశీ సినిమాల గురించీ రే రాసారు. సినిమాకు కావలసిన ముడి సరుకు జీవితమే అన్న రే నిజమయిన దర్శకుడు తన కళ్ళూ చెవులూ తెరిచి ఉంచుకోవాలంటాడు.
అంతకు ముందు ఎన్ని సినిమాలు చూసి ఉన్నప్పటికీ, ఎన్ని సినిమా పుస్తకాలు చదివి ఉన్నప్పటికీ ‘అసలు సినిమా తీయడం మొదలు పెట్టాక మనకు మూడు విషయాలు తెలుస్తాయంటాడు. అవి
1) మనం అనుకున్న దానికంటే మనకు చాలా తక్కువ తెలుసు అని,
2) పుస్తకాల్లో అన్నింటికీ జవాబులు ఉండవని,
౩) మనం సినిమా తీసే పద్దతులు ఎక్కడినుంచో అరువు తేచ్చుకోకూడదని ఆ పద్దతులు మన మట్టిలో పుట్టి పెరిగిన సంస్కృతీ సాంప్రదాయాల నుంచి మొలకెత్తాలని.
ఇవి రే సినిమాల గురించి చెప్పాడు కానీ కవిత్వంతో సహా అన్ని సృజనాతక రంగాలకూ వర్తిస్తాయని నేననుకుంటాను.
‘కళను నిర్వచించేది కళాకారుడి వ్యక్తిత్వమే’ తప్ప వేరేదీ కాదని అన్న రే మన చిత్రాలతో సమస్యలు అన్న అంశం గురించి మొదలు పెట్టి అనేక భారతీయ సినిమా అంశాల్ని తన కోణం లోంచి అనుభవంలోంచి వివరిస్తాడు. నిజాయితీగా ఒక సినిమా తీయడానికి ఒక కళాత్మక దృష్టి గల దర్శకుడి కష్టాలూ, ఆనందాలూ అన్నీ వివరిస్తాడాయన. ఇక న్యువేవ్ దర్శకుల సినిమాల గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి మొహమాటాలు లేకుండా కుండబద్దలు కొడతాడు రే. కేవలం విలక్షణ మయిన ధోరణి వల్ల కాకుండా తనదయిన శైలి, స్ఫూర్తి, ధృక్కోణాల వల్లనే నిజమయిన కళాకారుడు గుర్తించ బడతాడని అంటాడు. శ్యాం బెనెగల్, మృ ణాల్ సేన్, కుమార్ సహానీ, మని కౌల్ ల సినిమాల్ పై సునిశిత పరిశీలానాత్మక వ్యాఖ్యలు చేసాడు రే. ఇక విదేశీ సినిమాల గురించి రాసినప్పుడు తాను చూసిన ఇటాలియన్ సినిమాలూ, హాలీవుడ్ సినిమాలు, బ్రిటిష్ సినిమా, జపనీస్ సినిమాల పై విశ్లేషనాత్మకంగా రాస్తాడు. ముఖ్యంగా చార్లీ చాప్లిన్ గోల్డ్ రష్ గురించి, కురుసోవా రషోమాన్ గురించి గొప్ప గా రాసాడు. ఇక బైసికిల్ థీవ్స్ సినిమాను సినిమా ప్రక్రియలోని ప్రాథమిక అంశాలను మరోసారి ఆవిష్కరించుకునే సినిమాగా వర్ణిస్తాడు రే.
ఇట్లా సినిమాకు సంబంధించిన అనేక మౌలిక విషయాల గురించి ఈ OUR FILMS AND THEIR FILMS లో చర్చిస్తాడు. ప్రత్యేక అంశాల్ని మన ముందుంచుతాడు. ప్రపంచ వీక్షణం చేస్తూనే భారతీయ దర్శకుడు జీవితం వైపు వాస్తవికత వైపు నడవాలంటాడు. “నా అభిప్రాయంలో ఏ కళాత్మక రంగం నుండయినా ఇంకో కళాత్మక రంగంలోకి మరలడం అంత కష్టమయిన పనేం కాదు” అన్న సత్యజిత్ రే అనేక సృజనాత్మక రంగాల్లో కృషి చేసి తనదయిన ముద్రను మిగిల్చాడు. కానీ మన తెలుగులో కవిత్వం,సినిమా, సంగీతం, చిత్రలేఖనం వేర్వేరు అన్నట్టు కనిపించే ధోరణి నాకయితే ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
—————
ఈ OUR FILMS AND THEIR FILMS ని వి బి సౌమ్య తెలుగులోకి అత్యంత సరళంగా సూటిగానూ అనువదించారు. ఇవ్వాళ సినిమా రంగంలోకి వెళ్ళాలనుకుంటున్న యువతీ యువకులంతా చదవాల్సిన పుస్తకమిది. రే వివరించిన అనేక అంశాలు కళాత్మక రంగానికి సంబదించి అనేక కోణాలని ఆవిష్కరిస్తాయి. సౌమ్య గారికి మనసారా నా అభినదనలు. ఇక ఈ పుస్తకాన్ని దశాబ్దం క్రితమే నవతరంగం ఫిలిం సిరీస్-1 గా ప్రచురించిన వెంకట సిద్దారెడ్డి, అరిపిరాల సత్య ప్రసాద్, కత్తి మహేష్ కుమార్ గార్లకు అనేక కృతజ్ఞతలు.
Leave a Reply