వెతుకులాట

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్

నేను దగ్గరే ఆగిపోయిన మనం యింకా మేము దగ్గరకే చేరుకోలేదు. మనం వైపు యెప్పుడు పయనిస్తామో అని కాళోజీ తరచుగా ప్రస్తావించేవాడు. ‘నేను – మేము – మనం’ యీ క్రమంలో అందరినీ కలుపుకుపోయే వొక సామాజిక తాత్త్విక చింతన వుంది. ‘మనం – మేము – నేను’ యీ క్రమంలో స్వీయ అస్తిత్వ ధోరణితో కూడిన వ్యక్తివాదం ముందుకు వస్తుంది. భారత రాజ్యాంగం  ‘మనం’ అందరం కలిసి నిర్మించుకున్నది.  రాజ్యాంగ ప్రవేశిక (preamble)లో ‘మేము’ అందరినీ నిర్దేశిస్తుంది. అయితే మెజారిటీ ‘మనం’ లో మైనారిటీ ‘వాళ్ళు’ లేకుండాపోయే ప్రమాదం యెప్పుడూ పొంచి వుంటుంది. ‘మేమూ – మీరూ’ అని విభజన రేఖలకి అవకాశం యేర్పడుతుంది. అందుకే యెక్కువ అందరిలో తక్కువ కొందరికి ప్రత్యేక హక్కులు రాజ్యాంగమే కల్పిస్తుంది. కొందరి భద్రత కోసం అందరూ పూచీపడే వొక మానవీయమైన  కట్టుబాటు అది. కానీ యిటీవల దేశంలో మారిన మతవాద  రాజకీయాల్లో పర అసహిష్ణుత పెచ్చరిల్లింది. సమత్వ భావనకు  లౌకికత్వ  స్ఫూర్తికి విఘాతం యేర్పడింది. దాంతో దేశంలో మైనారిటీ మతస్తులు ‘అన్యులు’గా అభద్రతకి లోనవుతున్నారు. మేమూ మీలాగే యీ దేశ పౌరులమే అని గొంతు చించుకొని చెప్పాల్సిన పరిస్థితి యేర్పడింది. కాగితాల దాఖలాలతో రుజువులతో  సాక్ష్యాలతో ప్రమేయం లేని అస్తిత్వ ప్రకటన అనివార్యమైంది. తమది inclusive అస్తిత్వమే గానీ exclusive కాదని ముస్లిం సమాజం దశాబ్దాలుగా  మౌన భాషలో పదే పదే చెబుతూనే వుంది.        

తరాలుగా యుగాలుగా నిశ్శబ్దంగా వున్న స్వరాలకు సంక్షుభిత వర్తమానం కొత్త గొంతునిచ్చింది. మౌనం బద్దలైంది. గొంతులో కొట్లాడే గుండె సవ్వడి వొక విస్ఫోటనంతో బహిర్గతమైంది. అడ్డంగా కట్టిన కంచెలు కూలిపోయాయి. దుర్భేద్యమనుకున్న గోడలు బీటలువారాయి. సంకెళ్ళు తెగిపడ్డాయి. ఆచ్ఛాదనలు తొలగిపోయాయి. కొత్త అధ్యాయానికి తెరలేచింది. తమ సొంత నేల మీద పరాయిగా ముద్రవేయడానికి కుట్ర జరుగుతున్న క్రూర సందర్భంలో,  ఉనికి ప్రశ్నార్థకమైన వేళ, పౌరసత్వమే ప్రమాదంలో పడిన చోట, జీవించే హక్కు మృగ్యమౌతున్న పాడుకాలంలో  ఆత్మ గౌరవంతో జీవించే హక్కు కోసం షాహీన్ బాగ్ లో రోజుల తరబడి ముస్లిం స్త్రీలు జరిపిన పోరాటం ప్రజాస్వామిక వాదులకు కొత్త వుత్తేజాన్నిచ్చింది. తెలుగునేల మీద కూడా ఆ పోరాటపు అనునాదం వీథుల్లో ధ్వనించింది. అయితే అది సాహిత్యంలోకి యెందుచేతనో అంతగా ప్రతిధ్వనించలేదు. 

సరిగ్గా ఆ రాజకీయ సందర్భంలోనే మా వెతుకులాట మొదలైంది. మతం – కులం – జెండర్ ఆధిపత్యాల కింద అణచివేతకి గురయ్యే  ముస్లిం స్త్రీల బహుముఖీనమైన అస్తిత్వ వేదనని సాహిత్యంగా మలచిన రచయిత్రుల ఆలోచనల్ని తెలుసుకోవాలన్న వూహ కలిగింది. కానీ తెలుగులో ముస్లిం రచయిత్రుల సంఖ్య వేళ్ళమీద లెక్కించేంత మాత్రమే కనిపించింది. మతపరంగా బయటి  సమాజం నుంచి, సంప్రదాయం పేర్న లోపలి సముదాయం నుంచి ముస్లిం స్త్రీలు యెదుర్కొనే యెన్నో సమస్యలూ వాటికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలూ సాహిత్యంలో నమోదు కావాల్సినంతగా కాలేదని మా యెరుకలోకి వచ్చింది.  ఈ  ఖాళీని పూరించాల్సిన అవసరం వుందనీ  ముస్లిం స్త్రీల ఆలోచనల్ని ఆవేదనల్ని ఆకాంక్షల్ని  యెటువంటి వడపోతలు లేకుండా లేకుండా సాహిత్య మాధ్యమంగా అందించాలని బలంగా అనిపించింది. తద్వారా ఉనికి కోసం పెనుగులాడుతున్న సమూహాలకు మద్దతుగా నిలబడి భరోసానివ్వాలనీ తీర్మానించాం. ఆ సంకల్పం నుంచి పుట్టిందే  తెలుగులో ముస్లిం స్త్రీల కథల సంకలనం ‘మొహర్’.

***

‘మొహర్’ ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రకటన. కథల్లో రచయిత్రులు  వ్యక్తం చేసిన ఆలోచనలు వారి జీవితానుభవాల నుంచి పిండుకున్నవి. ఈ కథల్లో నడయాడే  పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన ఆధునిక ముస్లిం స్త్రీలు ముందుగా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నారు. స్వయం నిర్ణయాధికారం కోరుకుంటున్నారు. తమ కాళ్ళపై తాము స్థిరంగా నిలవాలని ఆశిస్తున్నారు. అది చదువు ద్వారా సాధ్యమని నమ్ముతున్నారు.  స్త్రీ పురుష సంబంధాల్లో సమానత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబంలో గౌరవ ప్రదమైన స్థానాన్ని అడుగుతున్నారు. సమాజంలో మానవీయ సుగంధం పరిమళించాలని ఆకాంక్షిస్తున్నారు.

సంకెళ్ళు తెంచుకొని స్వేచ్ఛగా ప్రగతి దారుల వెంట నడవాలనీ, కట్టుబాట్లు వదిలించుకొని అభివృద్ధి శిఖరాలకు చేరుకోవాలనీ, పంజరాలు దాటి పక్షిలా పైకెగసి  నీలాకాశపు అంచులు  తాకిరావాలనీ … ముస్లిం స్త్రీ బలంగా అభిలషిస్తోంది.   అందుకు అవసరమైన  ఆత్మ విశ్వాసాన్ని సమకూర్చుకోడానికి  పడుతున్న తపన యీ కథల్లో ప్రత్యక్షరంలోనూ దృశ్యమానమౌతోంది. జీవితాల్ని గెలవాలన్న  పట్టుదల ప్రతి పాత్రలోనూ బలంగా ఆవిష్కారమౌతోంది. ముస్లిం స్త్రీకి యిల్లూ సమాజం రెండూ యుద్ధక్షేత్రాలే. 

అయితే యే గొంతులోనూ కటుత్వం గానీ కాఠిన్యం గానీ పారుష్యం గానీ యెక్కడా వినిపించలేదు. సామరస్య స్వరం సౌమనస్య సౌరభమే అంతటా. ముందే చెప్పుకున్నట్టు మనదేశంలో హక్కుల కోసం నినదించే ముస్లిం సమాజం inclusive voice నే యెన్నుకొంది. ముస్లిం వాదం మిలీషియా స్వభావానికి దూరం. దాని కార్యాచరణ చట్టబద్ధం. కానీ యిక్కడ రాత్రికి రాత్రి ముస్లిం పిల్లలు మాయమై పోతారు. ఆచూకీ లేకుండా పోతారు. స్త్రీలు పసిపిల్లలు అత్యాచారాలకు గురౌతారు. అందుకే ముస్లిం స్త్రీ అతి జాగరూకతతో గద్ద నుండి పిల్లల్ని కాపాడుకొనే తల్లికోడిలా కనిపిస్తుంది.  భద్ర జీవితాల్ని కోరుకుంటూనే జెండర్ సెన్సిటివిటీ గురించి ఆలోచింపజేసే కథలు, సాంస్కృతిక పరాయీకరణని వివరించే కథలు, హక్కుల కోసం పెనుగులాటే జీవన్మరణ సమస్యగా మారిన వైనాన్ని తెలియజేసే కథలు  యీ  సంకలనంలో చోటు చేసుకున్నాయి. 

ఆంధ్రా రాయలసీమ తెలంగాణ మూడు ప్రాంతాల రచయిత్రుల కథలు యీ సంకలనంలో వున్నాయి. ప్రాంతాల వారీగా జీవితానుభవాలు వేరుగా వున్నాయి. భౌతిక సామాజిక నేపథ్యాలు ప్రత్యేకమైనవి.  భాషా వ్యక్తీకరణ రీతుల్లో ప్రాంతీయ వైవిధ్యం గోచరిస్తుంది.

అలాగే స్త్రీల అస్తిత్వ సమస్యలన్నీ వొకటి కావు. కులం మతం ప్రాంతం కారణంగా వాటి మధ్య వైరుధ్యాలు అనేకం. పరిష్కార మార్గాలు కూడా విభిన్నం. (పిడుక్కీ బిచ్చానికీ వొకే మంత్రం జపించేవాళ్ళతో పేచీ యెప్పుడూ వుండేదే.)  మెజారిటీ స్త్రీవాదుల ఆలోచనలతో ముస్లిం స్త్రీల ఆలోచనలు యెక్కడ సంవదిస్తున్నాయి యెక్కడ వివదిస్తున్నాయి అని అధ్యయనం చేయడానికి కూడా యీ సంకలనం వొక వనరుగా వుపయోగపడుతుంది. బతుకు కోసం పెనుగులాడుతూ గొంతు సరాయించుకొనే  బాధిత సముదాయానికి వేదికై ఆసరాగా భుజం కాసే ప్రయత్నం తప్ప యిది వొకరి భుజమ్మీద తుపాకి పెట్టి  మరొకర్ని కాల్చే వ్యూహం కానే కాదు. ఇంకా అనుమానమున్న వారికి యీ సంకలనమే సమాధానం.  

***

తెలుగు నేల మీద వుమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ముస్లిం రచయితల కథల్ని ప్రప్రథమంగా  వొక చోట చేర్చిన ‘వతన్’ లో గానీ, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముస్లిం రచయితల కథల్ని సంకలనం చేసిన ‘కథామినార్’ లో గానీ, నాల్గు రోజుల కిందే వెలువడ్డ రాయలసీమ ముస్లిం కథకుల ‘చోంగా రోటీ’ సంకలంలో గానీ స్త్రీ రచయితల సంఖ్య చాలా తక్కువ. అంతా కలిపి అరడజనుకి మించి లేరు. ఈ ఖాళీని పూరించే ప్రయత్నంలో భాగంగా ‘మొహర్’ రూపొందింది. కథలు సేకరిస్తూ పోగా వేళ్ళమీద లెక్కించడం దగ్గర మొదలైన మా ప్రయాణంలో లెక్కకు మా వేళ్ళు సరిపోలేదు. నాణ్యత విషయంలో కొన్ని కథలు మీ/మా  అంచనాలను అందుకోలేకపోవచ్చు (చాలామంది రచయితలకి కథ రాయడం తొలి అనుభవం కూడా). ఇంత మందిని వొకచోట చేర్చడమే మా విజయం. తెలుగులో ముస్లిం రచయిత్రులు రాసిన కథల తొలి సంకలనం యిది. దీని ముద్ర చిన్నదైనా బలమైనది. దీన్ని యింత నిండుగా తేగలుగుతున్నందుకు గర్వంగా వుంది. కొందరు రచయితల కథలు  యీ సంకలనం గుమ్మం వరకు వచ్చి ఆగిపోయాయి. అందువల్ల కశ్మీర్ నేపథ్యం నుంచి వచ్చిన కథలు యిందులోకి యెక్కలేదు. అది యీ సంకలనానికి లోటే. తొలి అడుగుల్లో తడబాటు సహజం. వేయాల్సిన అడుగులు యింకెన్నో వుంటాయి. అందుకు యీ సంకలనం స్ఫూర్తినిస్తుందని మా నమ్మకం.  సంపాదకత్వ బాధ్యతలు తీసుకొని యెంతో శ్రమకోర్చి దాదాపు సంవత్సరకాలం రచయితలతో సంప్రదించి యీ సంకలనాన్ని రూపొందించిన షాజహానాకి కేవలం కృతజ్ఞతలు చెప్పడం తప్పు. ముస్లిం రచయిత్రుల కలాల నుంచి   కథల మంచి గంధం తీసి  తెలుగు కథా సాహిత్యానికి సందల్ పరిమళాన్ని పంచుతున్న  షాజహానాకి మనందరం రుణపడి వుంటామనే చెప్పగలం.

ఈ సంకలనం యిలా రూపొందడంలో సహకరించిన రచయిత్రులకూ, ఆరోగ్యం అంతగా సహకరించకున్నా ప్రోత్సాహక వాక్యాలు అందజేసిన ప్రముఖ రచయిత్రి జిలానీ బానో గారికీ,  స్నేహ  హస్తం అందించిన స్కై కీ యితర మిత్రులకూ మప్పిదాలు. 

వైవిధ్య భరితమైన యీ ‘మొహర్’ ని చెరిగిపోకుండా కాపాడమని అభ్యర్థిస్తూ …

ఎ. కె. ప్రభాకర్

టీం పర్స్పెక్టివ్స్ 

You Might Also Like

One Comment

  1. Mukundaramarao

    చాలా మంచి ముందు మాట ..మంచి ప్రయత్నం ఇది ..ఇందులో పాల్గొన్న అందరికీ అభినందనలు .

    ముకుంద రామారావు
    హైదరాబాద్

Leave a Reply