‘నీల’ నవలపై చర్చా సమీక్ష

డిట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి

రచయిత: కె. యన్‌. మల్లీశ్వరి

ప్రచురణ: 2017, తానా ప్రచురణలు.  పేజీలు: 547.  ధర: ₹250, $20

సమావేశ సమయం: నవంబరు 1, 2020, ఆదివారం మధ్యాహ్నం 2:30 నుండి 5:30

పాల్గొన్నవారు: అడుసుమిల్లి శివరామకృష్ణప్రసాద్‌, వడ్లమూడి నరేంద్రప్రసాద్‌, పిన్నమనేని శ్రీనివాస్‌, వేములపల్లి రాఘవేంద్రచౌదరి, చేకూరి విజయసారధి, నర్రా వేంకటేశ్వరరావు, బూదరాజు కృష్ణమోహన్‌, మెట్టుపల్లి జయదేవ్‌, తిమ్మాపురం ప్రకాష్‌, మద్దిపాటి కృష్ణారావు. పరోక్షంగా పాల్గొన్నవారు: ఆరి సీతారామయ్య, అడుసుమిల్లి లావణ్య.

సమీక్షకులు: వడ్లమూడి నరేంద్రప్రసాద్‌, మద్దిపాటి కృష్ణారావు

‘నీల’ నవల స్త్రీ స్వేచ్ఛావాద సైద్ధాంతికతని ఆధారంగా చేసుకుని చెప్పిన కథ. ఈ నవల నీలవేణి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 20 వ శతాబ్దపు చివరి రెండు మూడు దశాబ్దాలు, 21 వ శతాబ్దపు మొదటి దశకం వరకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గోదావరి, విశాఖపట్టణం, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక, కార్మిక ఉద్యమాలు, మహిళల ఆలోచన విధానం లోని మార్పులను వివరించడానికి ప్రయత్నం చేస్తుంది.

కథా సంగ్రహం:

కథా ప్రారంభానికి ప్రధాన పాత్రధారి నీలవేణి ఏలూరు సమీపంలోని చోళదిబ్బ గ్రామంలో 10 -12 సంవత్సరాల వయసున్న అమ్మాయి. తండ్రి పరిశి జ్యూట్ మిల్లులో కార్మికుడు, తల్లి చంద్రకళ కుట్టుపని కూలీ. తండ్రి మద్యానికి బానిస, పురుషాహంకారి, భాధ్యత లేని వ్యక్తి. డబ్బు కోసం భార్య పిల్లలని శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ఉంటాడు. చంద్రకళ బాధల్ని భరిస్తూ కుటుంబ బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉంటుంది. అదే ఊళ్ళో ఆరంజోతి జ్యూట్ మిల్లులో మహిళా కార్మికురాలు. ఆమె తమ్ముడు స్టాలిన్ సూర్యం, ఖానాపురం నుండి వచ్చిన యువకుడు, ఆవేశపరుడు. అభ్యుదయ భావాలతో చిన్న పిల్లలికి చదువు చెపుతూ, శుభ్రత, ఆరోగ్య విషయాలు వివరిస్తుంటాడు. సామాజిక పరమైన సమకాలిక రాజకీయాలు మాట్లాడుతూ మురికివాడ లోని వారికీ రాజకీయ పరిజ్ఞానాన్ని పంచుతూ, రాజకీయ నాయకుల్ని విమర్శిస్తూ, వివాదాలు పడుతుంటాడు. చోళదిబ్బ మహిళల్ని అభిమానంగా చూస్తూ వారి బాధల్ని వింటూ ఓదారుస్తూ ఉంటాడు. సూర్యం గత జీవితపు వివరాలు ఎవరికీ చెప్పేవాడు కాదు. ఆరంజోతి తమ్ముడు సహాయంతో మహిళా కార్మిక నాయకురాలు గా ఎదుగుతుంది.

ఆరంజోతి చక్కని జన సంబంధాలతో ప్రజల బాధల్ని అర్ధం చేసుకుంటూ పరిష్కారం కోసం పోరాటాలు, సహాయాలు చేస్తూ ఉంటుంది. చంద్రకళకు మంచి స్నేహితురాలు. ఒకరోజు చంద్రకళ భర్త పరిశి మద్యం త్రాగి వచ్చి చంద్రకళని దారుణంగా కొట్టడం చూసి చలించి పోయి మద్యపానానికి వ్యతిరేకంగా మంచి ఎత్తుగడలతో పోరాటం చేసింది. దీనివల్ల ఆరంజోతి మద్యం విక్రయ దారులుకి, వారి గూండాలకి, మద్యం బానిసలకు, రాజకీయ నాయకులకి, పోలీసులకు శతృవుగా మారి, వారి నుండి అనేక బాధల్ని ఎదుర్కొంటుంది. ఈ విషయాల్లో తమ్ముడు సూర్యం, అతని మిత్రుడు ఆటోరాజు సహాయం చేస్తారు. ఈ ఉద్యమం నేపధ్యంలో ఆటోరాజు చంద్రకళతో దగ్గరవుతారు. ఈ విషయం ఆరంజోతి గమనించి చంద్రకళకి బాధ్యతల్ని గుర్తుచేస్తూ హెచ్చరిస్తుంది. తల్లితో ఆటోరాజు సాన్నిహిత్యం నీలకి నచ్చకపోయినా, ఎదిరించే వయసు కాదు. తల్లి కష్టాల్ని కూడా గుర్తిస్తూ ఉంటుంది.

సారా ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే జ్యూట్ మిల్లు యాజమాన్యం అకస్మాత్తుగా లాకౌట్‌ ప్రకటిస్తుంది. అతి చాకచక్యంతో, ఆటోరాజు, సూర్యం ఇచ్చిన మద్దతుతో ఆరంజోతితో సహా కార్మికులందరూ యాజమాన్యంతో చర్చలు జరిపి లాకౌట్‌ని ఎత్తి వేయిస్తారు. లాకౌట్ విరమణ తరువాత ఒకరోజు సాయంత్రం నుండి ఆటోరాజు, సూర్యం కనపడకుండా మాయమై పోతారు. ఆటోరాజు మాత్రం రెండు రోజుల తర్వాత తీవ్ర గాయాలతో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి వదిలేశారని చెబుతాడు. సూర్యం కనపడక పోవడంతో, పోలీసుల తీవ్రమైన వేధింపులతో ఆరంజోతి ఉద్యమాలు తగ్గుమొహం పడతాయి. ఆరంజోతి అత్యంత సాధారణ కార్మికురాలైనా మంచి నాయకత్వ లక్షణాలని ప్రదర్శిస్తుంది. చంద్రకళ తన స్నేహితుడైన ఆటోరాజుతో కలిసి భర్త కి పట్టుబడి, ఇద్దరూ పరిశి అతని బావ చేతిలో హత్యకు గురౌతారు. పరిశి, అతని అక్క, బావ జైలు కి వెళ్ళటంతో నీల, నీల తమ్ముడు అనాధలుగా మిగిలి, తమ్ముడు పిన్ని దగ్గర, నీల క్రైస్తవ పాస్టర్ దంపతుల వద్ద ఆశ్రయాన్ని పొందు తారు. ఆరంజోతికి సూర్యాన్ని, చంద్రకళను కోల్పోయిన బాధలో మతి స్థిమితం తప్పుతుంది.

నీల వినయం, పనితనం తో పాస్టర్ దంపతులని మెప్పిస్తూ వారి దగ్గరే వుంటూ చదువుకుంటుంది. ఇంటర్మీడియట్ చదువుతుండగా చిన్న కాంట్రాక్టు పనులు చేసుకునే ప్రసాద్‌బాబు తో వివాహం జరుగుతుంది. పాస్టర్ దంపతులు బదిలీ పై కర్ణాటకలోని గంగావతి వెళ్ళిపోతారు. వివాహానంతరం రాజమండ్రిలో కాపురం ప్రారంభించిన నీల, ప్రసాద్‌బాబుకి ముందునుంచీ సరళ అనే వితంతు ఉపాధ్యాయురాలితో సంబంధం ఉందని తెలిసీ, అయిష్టంగా సర్దుబాటుకి ప్రయత్నిస్తూ ఉండగానే ఒక పాపకి తల్లి అవుతుంది. పాప పుట్టిన తర్వాత స్థానిక మహిళా సంఘంలో వసుంధర అనే లాయరుతో పరిచయమై, చిన్న చిన్న సామజిక కార్యక్రమాలలో పాల్గొని పాటలు పాడుతూ కాలక్షేపం చేస్తుంటుంది. ఒక రోజు సారా విక్రయదారులకి చెందిన హిజ్రాల దాడికి గురై, సరళ ప్రోద్బలంతో భర్త చేతిలో తీవ్రమైన శారీరక, మానసిక హింసలకు గురై, తట్టుకోలేక రాత్రికి రాత్రే ఇల్లు విడిచి లాయరమ్మ ఆశ్రయం తీసుకుని, లాయరమ్మ సహకారంతో విడాకులు పొందుతుంది. లాయరమ్మ మిత్రుడైన సదాశివ అనే లాయరు సహకారంతో నీల తన పాపను తెచ్చుకో గలుగుతుంది.  పాప పుట్టిన తర్వాతే ప్రైవేట్‌గా డిగ్రీ ని సంపాదించిన నీల, విడాకుల తర్వాత కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంది.

అనేక చిన్న చిన్న పనులు చేస్తూ ఎందులోనూ ఇమడలేక మళ్ళీ ఆశ్రయం కోసం పాపతో సహా పాస్టర్ దంపతుల వద్దకు గంగావతి వెళ్లగా, వారు అక్కడ నుండి మకాం మరొక ప్రాంతానికి వెళ్లారని తెలుసుకుని, అక్కడికి వెళుతుంది. అక్కడకు వెళ్లే సరికి పాస్టరమ్మ దానిమ్మ తోటలలో ఒంటరిగా ( భర్తను కోల్పోయి ) మిగిలిన కూలీలతో కలిసి పనిచేసుకుంటూ కష్టం మీద కడుపు నింపుకుంటూ ఉంటుంది. అది చెప్పటం ఇష్టంలేక, ప్రసాద్‌బాబు కు విడాకులు ఇచ్చిందనే నెపంతో నీల, పాప లను వెనక్కి పంపేస్తుంది. పాస్టర్ మరణం, పాస్టరమ్మ కష్టాలను చూసిన నీల ఎంతో బాధతో తిరిగి చోళదిబ్బకు చేరుతుంది.

చోళదిబ్బలో ఆరంజోతి కూతురైన పూర్ణ ఇంటిలో ఆశ్రయం పొంది, పిల్లలకు పాఠాలు చెప్తూ కాలం గడుపుతుంది. పూర్ణ డ్వాక్రా సంఘం, పొదుపు సంఘాలలో పనిచేస్తూ రాజకీయనాయకుల పరిచయాలు కలిగి రాజకీయ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందుతుంది. నీల కూడ అప్పుడపుడు పూర్ణ పనుల్లో పాల్గొంటూ అవగాహన పెంచుకుంటుంది. పూర్ణ రాజకీయ ఎత్తుగడలతో అధికార పార్టీలో గుర్తింపు పొంది, MLA వద్ద మంచి పరపతి గడించి జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా ఎదుగుతుంది. ఆంధ్రా యూనివర్సిటీ రీసెర్చ్ పనిమీద పూర్ణ వద్దకు వచ్చిన విద్యార్థి పరదేశితో నీలకి పరిచయమౌతుంది. ఆ పరిచయంలో పరదేశి, నీల అభిప్రాయాలు కలుస్తాయి. పరదేశి ఆహ్వానం, పూర్ణ ప్రోత్సాహం మీద నీల విశాఖపట్నం వెళ్లి కొన్ని రోజులు పరదేశికి  రీసెర్చ్ పనిలో సహాయం చేస్తుంది. నీల విశాఖలో ఉన్నపుడు ఒక జాలరి గ్రామంలో పైడమ్మ అనే వితంతు మహిళ పరిచయమై, తమ గ్రామాన్ని పోర్టు నిర్మాణానికి ఖాళీ చేయిస్తున్నారని, జాలరికి సముద్రానికి మధ్య గోడ కడుతున్నారని, జాలర్ల బతుకు కష్టమై పోతున్నదని వాపోతుంది. విశాఖ పర్యటనలో భాగంగా ఒరిస్సా లోని సున్నారెడ్డి అనే తెలుగు గ్రామానికి వెళ్లి ధార పండుగరోజు నీళ్ళధార లో ‘మిత్తరికపు’ స్నేహ ఒప్పందం చేసుకుంటారు నీల, పరదేశి. కలిసి సహజీవనం చెయ్యటానికి నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయానికి ఐదు సంవత్సరాల ముందు నుండే వేరే మహిళతో ప్రేమలో ఉన్నట్లు నీలకి చెప్పి, ఆ అమ్మాయితో ఇబ్బంది లేదని, ఆమెని ఒప్పిస్తానని చెప్తాడు పరదేశి. నీల తిరిగి చోళదిబ్బకి వచ్చి తన గత అనుభవాలని, తల్లి అనుభవాలని దృష్టిలో పెట్టుకుని పరదేశితో సంబంధం తనకు ఇష్టం లేదని ఉత్తరం రాస్తుంది. పరదేశి చోళదిబ్బకు రాగా, మళ్ళీ కలవటానికి ప్రయత్నం చేయవద్దని సున్నితంగా పూర్ణ ద్వారా చెప్పిస్తుంది.

పూర్ణ నిర్వహించే అవకాశవాద రాజకీయాలు నచ్చక, పూర్ణను నొప్పించలేక హైదరాబాదు వెళ్ళి బాల్య వివాహపు గుదిలోంచి తప్పుకున్న అజిత నడిపే ఒక NGO లో పనికి చేరుతుంది నీల. అక్కడ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఒక సమావేశంలో అనుకోకుండా సదాశివ (విడాకుల తర్వాత తన పాపను స్వాధీన పరుచుకోవడంలో సహాయపడిన లాయరు) ను కలుస్తుంది. సదాశివతో పరిచయం పెరిగి అతని తల్లి నీతాబాయి దగ్గర రిసెర్చి సహాయకారిగా చేరుతుంది. సదాశివ తల్లిదండ్రులది వర్ణాంతర వివాహం. నీతాబాయి తండ్రి బ్రాహ్మణ కులానికి చెందిన మిలిటరీ కల్నల్, ప్రకాష్ (సదాశివ తండ్రి) దళిత కులానికి చెందిన సాధారణ సిపాయి కొడుకు. వివాహానంతరం ప్రకాష్‌ తల్లిదండ్రులతో నివశిస్తున్న నీతాబాయి పేదరికాన్ని తట్టుకోలేక సదాశివ కడుపులో ఉండగానే తండ్రి వద్దకు వెళ్లి పోతుంది. మళ్ళీ సదాశివ పుట్టినాక ప్రకాష్ వద్దకు వస్తుంది. ప్రకాష్‌ని నీతాబాయి తండ్రి చివరి వరకు కూడా ఆమోదించ లేక పోతాడు. ప్రకాష్ ఆ బాధతో ఇంట్లోనే ఏకాకిగా మిగిలి పోతాడు. సదాశివతో నీల సహా జీవనానికి ఒప్పుకుని నీతా బాయి ఆశీస్సులతో తన పాప ‘మినొ’తో కలిసి సదాశివ ఇంటికి మకాం మార్చుకుంటుంది. పాస్టరమ్మని కూడా తన దగ్గరికి రప్పించుకొంటుంది. నీల, మినొ, పాస్టరమ్మ లను ప్రకాష్ తన సొంత వాళ్లుగానే చూసుకుంటాడు. సదాశివకు గతంలో ఎందరో స్త్రీలతో ఉన్న సంబంధాలని వదులుకుని నీల తో స్థిరపడతాడు. సదాశివ స్త్రీ స్వేచ్ఛకు పదహారణాల మద్దతు దారుడు. నీల కిచ్చిన మాట కోసం తన గత అలవాట్లని పూర్తిగా మానుకుంటాడు. మహబూబ్ నగర్ లోని ఆకలి పోరాటాలకు మద్దతునిస్తూ, నీలను కూడా స్థానిక సమస్యల పరిష్కారానికి కార్యకర్తగా పని చేయటాన్ని ప్రోత్సహిస్తాడు. మినొ కూడా సంపూర్ణ స్వేచ్ఛతో పెరిగి దళిత ఉద్యమాలలో పని చేస్తూ సదాశివని కుల పరంగా ప్రశ్నిస్తూ అతని వృత్తి విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటుంది. సదాశివ కులం కంటే న్యాయం ముఖ్యమని, బాధితులు ఏ కులమైనా న్యాయానికి మద్దతునిస్తూ పని చేస్తాడు. మినో అపరిపక్వ ఆలోచనలతో సాంప్రదాయిక వృత్తులు నేర్చుకోవాలని సదాశివ, నీల ల ప్రమేయం లేకుండా బతకాలని ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.

పైడమ్మకు నీలను చూడాలని ఉందని పరదేశి ద్వారా తెలుసుకుని, సదాశివ ప్రోత్సాహంతో పరదేశిని, పైడమ్మని కలవడం కోసం విశాఖ వెళ్తుంది నీల. తనకోసం పరదేశి బ్రహ్మచారిగానే మిగిలిపోయాడని తెలిసినా, తిరిగి సదాశివనే చేరుకుంటుంది.

చర్చా సమీక్ష:

రచయిత సంఘటనల ద్వారా ఒక్కొక్క పాత్రను చిత్రించడం గమనించదగింది. ఆరంజోతిని నాయకత్వ లక్షణాలతోనూ, పరిశి పాత్రను భాధ్యతారహితమైన భర్తగాను, పాస్టర్ దంపతులను సేవాభావం, ప్రేమలతోనూ, ప్రసాద్‌బాబు అవకాశవాది గాను, పరదేశి చంచల మనస్కుడిగాను, సదాశివ స్వేచ్ఛాభావాలూ కలిగిన, మానవీయ విలువల తోనూ, పూర్ణను పేదరికంలో నుండి రాజకీయ మాద్యమం ద్వారా దళిత మహిళా బూర్జువాగా మారిన వ్యక్తిగాను, సూర్యం పాత్రను అభ్యుదయవాది గాను, నీల పాత్రను సున్నితమైన ప్రేమను కోరుకునే, విద్యావంతురాలి గాను, ప్రకాష్‌ను ఇంట్లోనే ఏకాకిగా జీవిస్తూ తన మూలాలను వెతుక్కునే దుఃఖితుడు గాను చక్కగా మలిచారు.   స్త్రీ పురుష సంబంధాలు, వివాహ వ్యవస్థ, వివాహరహిత సహజీవనం, వివాహ వ్యవస్థలో భర్తని ఎన్నుకొనే స్వేచ్ఛా విధానాలు, స్త్రీ పురుష సంబంధాల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశంతో కలిగే పరిణామాలు, గృహహింస, బాధ్యత లేని సంబంధాలు, బాల్య వివాహాలు, ఇలా ఏ సమస్యనూ వదలకుండా పరిశీలించడానికి పూనుకున్నారు రచయిత. అలాగని సాంప్రదాయవాదుల అభిప్రాయాలనూ తడమకుండా వదల్లేదు. ఉదాహరణకు, నీల ప్రసాద్‌బాబుతో విడాకులు తీసుకునే సమయంలో, “విడాకులు అనేక విధాలైన హింసల నుండి విముక్తి కలిగించినా, ఎంతో బాధాకరమైన చర్య, అభిలషనీయమైనది కాదు” అని లాయరమ్మతో చెప్పిస్తూ వివాహబంధం ప్రాముఖ్యతని అన్యాపదేశంగా వినిపిస్తారు. నవలలో ఎక్కడా సామ్యవాదానికి కొమ్ము కాస్తున్నట్టు ప్రత్యక్షంగా వివరించకపోయినా, సామ్యవాద ఉద్యమాలకు ఆయువుపట్టులైన కార్మిక సంఘాలు, కార్మిక ఐక్యత, కార్మిక సంఘ పోరాటాలు, ఉద్యమాలు, ఉద్యమ ఎత్తుగడలు, మహిళా కార్మికుల సమస్యలు, సమాన పనికి సమాన వేతనం కోసం- సమాన పని వేళలు కోసం పోరాటాలు, యాజమాన్యపు నిరంకుశ వైఖరులు, ఉద్యమాల, కార్మిక సంఘాల విచ్ఛిన్న ప్రయత్నాలు, బాలల పై హింస, ఒకే తప్పుకు వేసే శిక్షలలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు మొదలైనవన్నీ వివరంగా చర్చించారు.

నవలకు ‘నీల’ అని పేరు పెట్టడం, నీలవేణి పాత్ర చుట్టూనే ఎక్కువ భాగం కథ నడవటం వల్ల, ఈ నవల తెలుగునాట స్త్రీల స్వేచ్ఛను, శక్తిని దృష్టిలో పెట్టుకుని చెప్పిన కథ అనిపిస్తుంది. నీలవేణి జీవితగమనం ఆధారంగా మాత్రమే రచయిత ఆలోచనలు బయట పెట్టదలుచుకున్నారనుకుంటే పొరపాటే. ఈ నవలలో రచయిత తాకని ఉద్యమం లేదు. అందుకోసం ప్రవేశపెట్టిన పాత్రలకు అంతులేదు. స్పృశించని సమస్యలేదు. ఏ సమస్యను వదిలేస్తే ఎవరేమనుకుంటారోనన్నట్టు సాగిన నవలలో అసలు చెప్పదలుచుకున్నదేదో చాలసార్లు దారి తప్పి, కొన్ని సంఘటనలు ఎందుకు చదువుతున్నారో అర్ధంకాకపోతే అది చదివేవారి తప్పు కాదు (పైన కథను అంత విశదంగా వివరించడలో మా ఉద్దేశం ఈ విస్తృతిని చూపడానికే!). ఇది నీల జీవితమా? మరైతే జూట్‌ మిల్లు లాకౌట్‌ ఉదంతం వివరణ దేనికి? పూర్ణ రాజకీయ వ్యాపార వర్ణనకు పదులకొద్దీ పేజీలు సాధించిందేమిటి? నీతాబాయి, ప్రకాష్‌ల ప్రేమాయణం, అజిత బాల్య వివాహం, వివాహేతర సంబంధాలు, పైడమ్మ కథ, గైరమ్మ జాతర, మందస రైతుల పోరాటం కథ, గంగానమ్మ కథ, ఇలా వందలకొద్దీ పేజీలు నీల జీవితానికి సంబంధంలేని వివరాలు తీసేసి నవలను మూడొంతులు తగ్గిస్తే నవలకు ఒక దిశ ఉండేది. చదువుతున్నదేమిటో తెలిసేది. కాదూ, ఇదొక ముప్పైయ్యేళ్ళ ఉద్యమ చరిత్రగా రాయదలుచుకుంటే, పేరు మారిస్తే పాఠకుల సహనానికి కొంతైనా ఊరట కలిగించేవారు. అదీ కాదు, స్త్రీ పురుష సంబంధాలను రకరకాల కోణాల్లోంచి, వివిధ వ్యక్తుల అనుభవాల (సామాజిక ఉద్యమాలు నడిపిన ఆరంజోతి, అవకాశవాద రాజకీయాలతో ఎదిగిన పూర్ణ, బాల్య వివాహపు ఉచ్చులోంచి బయట పడడానికి కష్టపడవలసిన అజిత, వర్ణాంతర వివాహ సమస్యలను అధిగమించాల్సిన నీతాబాయి, సహజ వనరులను జీవనాధారంగా నిలుపుకోలేని పైడమ్మ, ఇలా ఎన్నో) ఆధారంగా ఉటంకించదలుచుకుంటే అది వివిధ కథల సమాహారమే అవుతుందిగానీ, ‘నీల’ నవలగా నిలబడలేదు. నీల ఎదుగుదలను స్వేచ్ఛా కాంక్షిగా, వ్యక్తిగత సంబంధాల్లో సమానత్వం కోసం పరితపిస్తూ, ముక్కుసూటిగా పోయే వ్యక్తిగా రచయిత చిత్రించదలుచుకున్నట్టుగా ఆ పాత్ర సమాధానపడని సందర్భాలు మనకు చెప్తూ ఉంటాయి. ప్రసాద్‌బాబుకు సరళతో ఉన్న సంబంధం, ఆదరువులేని తన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా సరిగా గుర్తించలేని నీలను ఆ పరిస్థితి నుండి విముక్తి కలగడానికి జరిగిన కథనంలో రచయిత ప్రతిభ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నీలకున్న ఆ అనుభవమే, వేరే అమ్మాయితో సంబంధం ఉన్న పరదేశిని దూరంగా ఉంచగలిగింది. చిన్నప్పటి తన తల్లి వివాహేతర సంబంధంతో కలిగిన విచ్ఛిన్నమే, ఎంతో సహాయం చేసిన పూర్ణ ప్రవర్తనను ఒప్పుకోలేక హైదరాబాదుకు ప్రయాణం కట్టించింది. మరి ఎన్నో వివాహేతర సంబంధాలు ఉన్న సదాశివతో కలిసి ఉండడానికి తన గత అనుభవాలు నీలకు అడ్డు రాకపోవడం విచిత్రమే కాదు, ఆ చర్యతో నీల కూడా అవకాశవాదిగానే కనిపిస్తుంది! ఒకవేళ సదాశివ అందర్నీ వొదులుకుని నీలకే అంకితమౌతానన్నాడు కాబట్టి సమాధాన పరుచుకోవాలనుకున్నా, పరదేశి కూడా అందుకు సిద్ధమైన వ్యక్తే మరి! సమాజంలో పలుకుబడి, గుర్తింపు, మంచి ఆర్థిక స్థితి ఉంటే ఫరవాలేదనా? నవలలోని చాలా పాత్రల్లో సహజత్వాన్ని ప్రతిబింబించిన రచయిత, నీల పాత్రకు ఎంతో ఔన్నత్యాన్ని ఆపాదించడం కోసం నేల విడిచి సాము చేసినట్టనిపిస్తుంది!

రచన విషయానికొస్తే, పాత్రల సంభాషణల్లో భాష సహజంగానే ఉన్నా మిగిలిన రచనలో ఇంగ్లీషు పదాల వాడుక అవసరమేమిటో అర్ధం కాదు (ఇది ఈ రచయితకే కాదు, చాలా మంది తెలుగు రచయితలకు ఆచారమైపోయింది!). చాల చోట్ల ఆ సందర్భంలోని పాత్రకు తెలిసే అవకాశం లేని అంశాలు వివరించడం (ఉదాహరణకు, పేజి 313: పైడమ్మ ‘అయిదడుగుల ఏడంగుళాల ఎత్తు’; పేజి 368: నీతాబాయి ‘కన్నాట్‌ ప్లేస్లో ఎంచి ఎంచి కొనుక్కున్న ఎత్నిక్‌ జువెల్లరీ’); వర్తమానకాలంలో చెప్తున్న కథలో భవిష్యద్దర్శనం (ఉదాహరణకు, పేజి 144: ‘తర్వాతి కాలంలో వాపోతుండేది నీల’); అసలు ఏకాలంలో కథను వివరిస్తున్నారో తెలియకుండా రాసిన అస్తవ్యస్థ కథనం (పేజి 343 లో నాలుగవ పేరా) నవల నిండా అనేకం. తెల్లవారుతూనే పోస్టుమాన్‌ సైకిలు బెల్‌ వీధి చివర ఇంటి ముందు మ్రోగడం (పేజి 289), కుక్కర్‌ మూతకి విజిల్‌ పెట్టి పొయ్యి మీద పెట్టడం (పేజి 396) వంటి అనాలోచిత వాక్యాలు కూడా నవల నిండా చాలా ఉన్నాయి (‘బాయిలర్‌’ బదులు ‘బ్రాయిలర్‌’ లాంటి పదాలు అచ్చు తప్పులనుకున్నా). వయసుకు మించిన ఆలోచనలు పాత్రలకు అంటగట్టడం (పేజి 70: పదిహేనేళ్ళైనా నిండని నీల మనసులో ‘మంచి’ ని గురించిన మేధోమధనం, పేజి: 213-214 పాస్టరమ్మకు నీల కూతురుకు మధ్య సంభాషణ), అకస్మాత్తుగా అవసరం కోసం సంఘటనలు సృష్టించడం (పేజి  213: పాస్టరమ్మ నీలను, పాపను కర్ణాటక నుండి తిరిగి సాగనంపే సమయంలో రెక్కలు లేని పక్షి రాజుని దారి ప్రక్కన సృష్టించేసి ధైర్యం చెప్పేయడం) నిర్దిష్టమైన రచన చేయదలుచుకున్న రచయిత నిబద్ధతకు నిదర్శనాలు కానేరవు.

ఈ నవల 2017 లో తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) నిర్వహించిన నవలల పోటీలో బండి నారాయణస్వామి నవల ‘శప్తభూమి’ తో సమంగా మొదటి బహుమతిని పంచుకుంది. శప్తభూమి నవలను కూడా మా సాహితీ సమితి చర్చించింది. వందల ఏళ్ళుగా పాలెగాళ్ళ దౌర్జన్యాలకు బలైన రాయలసీమ చరిత్రను తన ఊహాశక్తితో కళ్ళకు కట్టినట్టు వర్ణించిన గొప్ప నవల శప్తభూమి. ఈ నవల చదివిన తర్వాత రెంటినీ ఒకే స్థాయిలో నిలబెట్టడం సమంజసంగా తోచలేదు.

You Might Also Like

One Comment

  1. vahini

    neela writen by k.n Malleswari garu aa novel kavali ivvagalaraa

Leave a Reply