అప్పుడు పుట్టి ఉంటే – దేవులపల్లి కృష్ణశాస్త్రి

వ్యాసకర్త: రాధ మండువ
*************

శ్రీకృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం. ఆయన ఆస్థానం భువనవిజయం. రాయల కాలం నాటి సాహితీ వైభవాన్ని పాఠకులకు పరిచయం చేయడానికి ఒక సందర్భాన్ని ఊహించుకుని భువనవిజయంలో ఉండే ప్రతిభావంతులైన ఎనిమిది మంది కవులు, విద్వాంసుల్నే కాకుండా అటు కళింగం నించి, గోదావరీ తీరం నించీ, కావేరీ నించి, మధుర నించీ రాయల ఆస్థానానికి (ఆ కాలంలో ఉండే ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్ర, తమిళ కవులు) వచ్చే కవులని, సంగీత గురువులని, సంస్కృత కవులని, ఆచార్యులని – “అడుగో అతనే, ఇడుగో ఇతనే” అంటూ ఒక్కొక్కరి పేరునూ ప్రస్తావిస్తూ వారి ఆహార్యాన్ని వర్ణించారు కృష్ణశాస్త్రి తన కథలో.

ఈ కథ చదివితే కృష్ణశాస్త్రి గారు అనేక గ్రంథాల్ని చదివి, ఆనాటి కాలం గురించిన పరిజ్ఞానాన్ని కూలంకషంగా గ్రహించి ఈ కథని రాశారని అనిపిస్తుంది. ఆ కాలాన్ని గురించీ, అప్పటి కవులని గురించి ‘తెలుసుకోవాలన్న ఆసక్తి’ తన పాఠకులకి కలిగించడమే బహుశా శాస్త్రిగారి ఉద్దేశమేమో మరి, ఈ కథలోని ఒక్కో పేరానూ/పేజీని పరిశీలిస్తే తెలుసుకోవలసిన విషయాలు లెక్కలేనన్ని ఉన్నాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి కళాప్రపూర్ణుడు. ఆయన్ని ఆంధ్రా కీట్సు, షెల్లీ అని విశ్వనాథవారు అనడంలో అతిశయోక్తి లేదు.

అప్పుడు పుట్టి ఉంటే కథకి లింక్.

ఇక కథలోకి వెళితే –

అటు కళింగం నుంచీ, గౌతమీ తీరాన్నుంచీ; ఇటు కావేరి నుంచీ, మధుర నుంచీ కవీశ్వరులేమి, గాయకులేమి, విద్వాంసులేమి – ఎక్కడెక్కడి వారూ విజయనగరంలో జరగబోతున్న మహోత్సవానికి విచ్చేసి ఉంటారు. ఆ ఉత్సవం – అల్లసాని పెద్దన కృతి – ‘మనుచరిత్ర’ని రాయలకి అంకితమిస్తున్న మహోత్సవం. ఆ మహోత్సవానికి మనల్ని కూడా తీసుకెళ్ళి వీరందరినీ పరిచయం చేశారు కృష్ణశాస్త్రి. చదువుతున్నంత సేపూ – అంటే, ఆ కథలోని వారందరి గురించి వివిధ పుస్తకాల ద్వారా తెలుసుకుంటూన్నప్పుడు – పరిసరాలను మర్చిపోయి, నిజంగానే మనం కూడా విజయనగర సామ్రాజ్యంలో తిరుగాడుతున్నట్లుంటుంది.

– ఇక ‘సాళువ తిమ్మరుసయ్య’ వంటి సామంతుల గృహాంగణాలు ఎంతో సందడిగా ఉన్నాయన్నారు కృష్ణశాస్త్రి కథలో –

సాళువ తిమ్మరుసయ్య వంటి సామంతులు – అంటే, ఇక్కడ రాయల వారి మంత్రి అయిన ‘అప్పాజీ’ సాళువ తిమ్మరుసు కాదేమో! కథలో తర్వాత కూడా (రెండు పేజీల తర్వాత) – అందరినీ పరిచయం చేస్తున్నప్పుడు అప్పాజీని – “అడుగో, ఆ వృద్ధ తేజస్వి అప్పాజీ, నిప్పుకణాలలాగా, కత్తి మొనలలాగా ధగధగలాడే రెండు కళ్ళు వేయికళ్ళుగా నాలుగువైపులా పరికిస్తూ!” అని పరిచయం చేసి, తర్వాత పేరాలో – “ఆ విశాలమైన ఛాతీ, భుజాలూ, బుగ్గమీసాలూ సాళువ తిమ్మరుసయ్య” అంటూ ఈయన్ని వర్ణించడాన్ని బట్టి చూస్తుంటే సాళువ తిమ్మరుసయ్య అనే దండనాయకుడొకడు ఉన్నాడు అని మనకి తెలియచేయాలని కృష్ణశాస్త్రి గారు అనుకుంటున్నట్లు తోస్తున్నది.

సాళువ తిమ్మరుసయ్య పేరుతో ఆ రోజుల్లో ఇద్దరు దండనాయకులు ఉండేవారని – చిలుకూరి వీరభద్రరావు పంతులు గారు రాసిన ‘తిమ్మరుసు మంత్రి‘ అనే పుస్తకం చదివితే అర్థమవుతుంది.

చూస్తుంటే ఇతను ‘అవసరం తిమ్మరసు’ అయి ఉండొచ్చనిపిస్తోంది. ఈయనే తిమ్మప్పనాయకుడు/ వాకిటికావలి తిమ్మన్న. ఈయన మామూలు వాడు కాదనీ, వేలమంది సైనికులకి అధిపతే కాక చిన్న సంస్థానానికి సామంతరాజు అని తెలుస్తోంది. రాయలకి అత్యంత సన్నిహితుడు కూడా.

కథలు గాథలు లో చూడండి.

ఇక 1. అప్పాజీ, 2. సాళువ తిమ్మరుసయ్య (సామంతుడు) కాక శాస్త్రిగారు కథలో ప్రస్తావించిన పేర్లు వరుసగా –

3. శ్రీకృష్ణదేవరాయలు – ఆముక్తమాల్యద
4. అచ్యుతదేవరాయలు – తాళమహోదధి
5. అల్లసాని పెద్దన – మనుచరిత్ర
6. నంది తిమ్మన – పారిజాతాపహరణము
7. మాదయగారి మల్లన – రాజశేఖర చరిత్రము
8. పింగళి సూరన – రాఘవపాండవీయం
9. ధూర్జటి – శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము
10. సంకుసాల నృసింహకవి – కవికర్ణరసాయనం
11. రామరాజ భూషణుడు (భట్టుమూర్తి) – వసుచరిత్ర
12. అయ్యలరాజు రామభద్రుడు – రామాభ్యుదయం
13. కందుకూరి రుద్రయ్య – సుగ్రీవవిజయం
14. తెనాలి రామలింగకవి – పాండురంగ మహాత్మ్యము
15. రాధామాధవ కవి (చింతలపూడి ఎల్లన) – రాధామాధవం
16. బండారు లక్ష్మీనారాయణ – సంగీత సూర్యోదయం
17. బయాకారపు రామయామాత్యుడు – స్వరమేళకళానిధి
18. బొడ్డుచర్ల తిమ్మన్న (చిన్నతిమ్మన) – చదరంగపు ఆటగాడు.
19. నట్టువ నాగయ్య – యక్షగాన ప్రదర్శకుడు
20. నట్టువ తిమ్మయ్య – యక్షగాన ప్రదర్శకుడు
21. లొల్ల లక్ష్మీధరుడు – దైవజ్ఞవిలాసం (ఆదిశంకరాచార్య విరచితం – సౌందర్యలహరికి ఈయన రాసిన వ్యాఖ్యానం ప్రసిద్ధమైనది)
22. వ్యాసతీర్థులు – వ్యాసత్రయం (న్యాయామృత, తాత్పర్యచంద్రిక, తర్కతాండవ)
23. రాజనాథ డిండిముడు – అచ్యుతరామాభ్యుదయం
24. హరిదాసు – తమిళకవి – ఇరు సమయ విళక్కమ్
25. కుమార సరస్వతి – రాయలవారి ఉత్కళ యాత్ర
26. చాటు విఠలనాథుడు – భాగవతాన్ని ‘భామినీ షట్పది’ ఛందస్సులో రాశాడు (కన్నడ ఛందస్సు పేరు)
27. పురందరదాసు – వాగ్గేయకారుడు
28. కనకదాసు – వాగ్గేయకారుడు
29. గుబ్బిమల్లినార్యుడు – వీరశైవామృతపురాణం
30. నంజుండయ్య – కుమారరామచరిత
31. లింగమంత్రి – కబ్బిగరకైపిడి (నిఘంటువు)
32. శఠగోపయతి – అల్లసాని పెద్దన గురువు, అహోబిల పీఠాధిపతి.

– ఇలా ఇంతమంది. వీళ్ళంతా ఎవరు? వీరే ప్రాంతం వారు? ఏమిటి వారి గురించిన విశేషం? – వీళ్ళందరి గురించీ తెలుసుకునే క్రమంలో మనకి ఎన్నో సంగతులు తెలుస్తాయి.

ఇక ఆ కవులు రాసిన ప్రబంధాలని పరిచయం చేయాలనేమో కృష్ణశాస్త్రి, వాళ్ళు రాసిన పద్యాలను వాళ్ళే – తుంగభద్రా నదీ తీరంలోనూ, పెద్దన ఇంట్లోనూ సమావేశమై చెప్పుకుని నవ్వుకుంటున్నట్లు కథలో రాయడం యుక్తంగా ఉంది.

పద్యాలు :
1. పెద్దన – మనుచరిత్ర పద్యం : “హితుడవు, చతురవచోనిధి”
2. భట్టుమూర్తి – వసుచరిత్ర – “జలకములార్చి, పాండు జలజచ్ఛద పాళికగప్పి”
3. రాయల – ఆముక్తమాల్యద – “ఆ నిష్ఠానిధి గేహసీమ”
4. నంది తిమ్మన – పారిజాతాపహరణం – “భోజకన్యా సరిద్రాజహంసము”
5. సంకుసాల నృసింహకవి – కవికర్ణరసాయనం – “యతి విటుడు గాక పోవునే”
6. కందుకూరి రుద్రకవి అలభ్య కావ్యం – సరసజన మనోరంజనం (ఏమో) – “ఎన్నడు నేరిచెన్ బెళుకులీ చెలి కన్నులు’
7. తెనాలి రామలింగకవి – “లింగనిషిద్ధు కల్వల చెలింగని”

– ఈ కావ్యాలలోని పద్యాలని కథలో, ఆయా కవుల చేతనే చెప్పించడం వల్ల ఆ కావ్య కథల గురించి, ఆ కవుల గురించి మరింత విస్తృతంగా చదువుకోవాలన్న కోరిక పాఠకులకు కలుగుతుంది.

ఇక ఆ కవుల కావ్యాలు, వాటి కథలు, కథల్లోని విశేషాలు, గొప్పతనం తెలుసుకోవడమే కాక వివిధ దేవాలయాల గురించి, వారి సమకాలీనుల గురించి కూడా మనం తెలుసుకుంటాం.

చదువుతున్నకొద్దీ ఊహించను కూడా ఊహించలేని ఎన్నో సత్యాలు తెలుస్తాయి. (అష్టదిగ్గజ కవుల్లో కొంతమంది అసలు రాయల కాలంలో లేనే లేరు లాంటివి)

**

వీళ్ళందరి గురించీ క్లుప్తంగా –

[1] శ్రీకృష్ణదేవరాయలు : పరిపాలించిన కాలం క్రీ.శ 1509 – 1529. తుళువ వంశానికి చెందినవాడు. ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, రాజాధిరాజ, వీరప్రతాప, రాజపరమేశ్వర, *మూరురాయరగండ అన్న బిరుదులు కలవాడు.

*(మూరురాయరగండ – ముగ్గురు తురుష్కురులను జయించిన రాజు – అహమ్మద్ నగర్, గోల్కొండ, బీజాపూర్ కోటలను జయించడంతో వచ్చిన బిరుదు. దీనిని గురించి https://archive.org/details/in.ernet.dli.2015.373066/page/n95 ఇక్కడ చదవొచ్చు

‘ముగ్గురు రాజుల అధిపతి – గజపతి, అశ్వపతి, నరపతి’ – అని ఈమాటలో బెజ్జాల కృష్ణమోహనరావుగారు అంటున్నారు – యుక్తంగా ఉంది. మరికొంతమంది మూడు భాషలలో రారాజు కనుక మూరు రాయరగండ అని అంటారు అని కూడా అంటున్నారు)

శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. అతని ఆస్థానం పేరు భువనవిజయం. ఈ ఆస్థానంలో ఉండే ఎనిమిది మంది ముఖ్యకవులను ‘అష్టదిగ్గజకవులు’ అంటారు. రాయలు స్వయంగా కవి. ‘ఆముక్తమాల్యద’ అనే ప్రబంధాన్ని, మదాలస చరిత్ర, సకలకథాసారసంగ్రహం, జ్ఞానచింతామణి, రసమంజరి అనే కావ్యాలని రచించాడు.

ఆముక్తమాల్యద తెలుగు పంచకావ్యాల్లో ఒకటి. దీన్ని శ్రీవెంకటేశ్వరస్వామికి అంకితం ఇచ్చాడు. 12 మంది * ఆళ్వారులలో ఒకడైన విల్లిపుత్తూర్ విష్ణుచిత్తుడు కథ ఇది. అతని కూతురు గోదాదేవి (ఆండాళ్ ) శ్రీరంగస్వామిని వివాహం చేసుకోవడం దీనిలోని ముఖ్య కథ. “చూడి కొడుత్తాళ్” అనే తమిళ పద సంపుటి నుంచి గ్రహించాడు.

రాయలవారు వర్ణనా ప్రియుడు. సునిశిత లోకపరిశీలన కలవాడు. రసికుడు. అందువల్లనే ఆతని ‘ఆముక్తమాల్యద’ రసవత్తరం.

ప్రబంధయుగం :

ఆంధ్రకవిత్వంలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా ప్రబంధం, విశిష్టతను సంతరించుకుంది. ప్రబంధాలలో కథకన్నా వర్ణన ఎక్కువగా ఉంటుంది. పురాణాల నుండి, ఇతిహాసాల నుండి, పెద్ద కావ్యాల నుండి కథని తీసుకుని పెక్కు వర్ణనలతో, అలంకారములతో, కొత్త రీతులతో పెంచి రాసే కావ్యాన్ని ప్రబంధం అంటారు.

రాయల కాలంలోని కవుల్లో చాలా మంది ప్రబంధకవులే. అందుకే రాయలవారి కాలాన్ని ‘ప్రబంధయుగం’ అని కూడా అంటారు.

* (12 మంది ఆళ్వారులు : వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా తమిళ సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన విష్ణుభక్తులు వీరు. వారు రచించిన పాశురాలు నాలుగు వేలు కలిపి ‘నాలాయిర దివ్యప్రబంధం’ అంటారు. నాలాయిరం అంటే తమిళంలో నాలుగు వేలు అని అర్థం. దీన్నే ‘పంచమవేదం’ అని కూడా పిలుస్తారు.

వాళ్ళల్లో కొంతమంది ముఖ్యులు – నమ్మాళ్వార్ (శూద్రుడు) ఈయన్నే శఠకోపముని అంటారు. ఈతని పేరు మీదే వైష్ణవాలయాల్లో శఠకోపం పెడతారు. ఇక విష్ణుచిత్తుడు, ఆండాళ్ (గోదాదేవి), తొండరాడిప్పొడియాళ్వార్ (విప్రనారాయణ), కులశేఖర ఆళ్వార్ (ఈయన పేరుతోనే తిరుమల బంగారువాకిలి మెట్లను కులశేఖరపడి అని పిలుస్తారు.

గోదాదేవి రచించిన 30 పాశురాలను ‘తిరుప్పావై’ అంటారు. ధనుర్మాసంలో తిరుమలలో ప్రతిరోజూ సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాడతారు.)

[2] అల్లసాని పెద్దన : అష్టదిగ్గజకవులలో అగ్రగణ్యుడు. ‘ఆంధ్రకవితాపితామహుడు’ అన్న బిరుదు కలిగినవాడు. బళ్ళారి ప్రాంతంలోని దూపాడు పరగణాలోని దోరాల గ్రామం. కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకాలోని కోకట గ్రామవాసి అని కొందరు అంటారు. అయితే రాయలవారు పెద్దనకి అగ్రహారంగా ఇచ్చిన కోకట గ్రామాన్ని మాత్రం వైష్ణవ అగ్రహారంగా చేసి తన గురువైన శఠగోపయతికి ఇచ్చి ఊరి పేరును ‘శఠగోపపురం’ అని మార్చారని శాసనం ఉంది.

ఈయన రాసిన ప్రబంధం ‘స్వారోచిష మనుసంభవము’ – ‘దీన్నే మనుచరిత్ర’ అని కూడా అంటారు. వరూధినీ ప్రవరాఖ్యుల కథ ఇది. తెలుగు పంచకావ్యాలలో ఒకటి.

(*మారన తెనిగించిన ‘మార్కండేయపురాణం’ (అష్టాదశ పురాణాల్లో ఒకటి) మనుచరిత్రకి మూలం. మారన 13 వ శతాబ్దానికి చెందిన కవి. పురాణాన్ని మొట్టమొదట తెలుగులో అనువదించిన కవి, తిక్కన శిష్యుడు)

‘అల్లసాని వాని అల్లిక జిగిబిగి’ అనే నానుడే ఉంది – పెద్దన శైలి గురించి. సన్నివేశాలకి తగినట్లుగా పదాల ఎంపిక, సమాసాల కూర్పు, అలంకార ప్రయోగం, భావనల్లో చిక్కదనం ప్రయోగించి అద్వితీయుడు అనిపించుకున్నాడు పెద్దన.

పెద్దన ఇతర రచనలు – హరికథాసారము, రామస్తవరాజము, అద్వైత సిద్ధాంతం. ఇవే కాక ఎన్నో చాటువులు రచించాడు. ఈయన తన మనుచరిత్రని శ్రీకృష్ణదేవరాయలకి అంకితం ఇచ్చాడు.

[3] నంది తిమ్మన : రాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజకవులలో ఒకరు. రాయలవారి భార్య తిరుమలదేవితో అరణపు కవిగా రాయల ఆస్థానానికి వచ్చి చేరాడని ప్రతీతి. ఇతను ఏ ప్రాంతం వాడో సరిగ్గా తెలియదు. అరణపు కవి అయితే శ్రీరంగపట్టణం అనుకోవచ్చు. ఈయనది బళ్ళారి ప్రాంతం అని కొందరూ, అనంతపురం ప్రాంతం అని కొందరూ అంటారు.

పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని రచించి రాయలవారికి అంకితం ఇచ్చాడు. హరివంశం నుండి లేదా భాగవతం నుండి ఈ కథని తీసుకుని అత్యంత రసవత్తరమైన కావ్యంగా మలిచాడు. సత్యభామ కృష్ణుల ప్రణయం, మధుర శృంగారం వర్ణిస్తూ రసస్ఫూర్తిని కలిగించిన విధం నిజంగా గమనించతగినది. పారిజాతాపహరణం తెలుగు పంచకావ్యాలలో ఒకటి.

రాయలవారి భార్య తిరుమల దేవి ఒకరోజు రాత్రి భర్త కోసం ఎదురుచూస్తూ నిద్రవల్ల తూగి కాళ్ళకట్టవైపు తలవాల్చి పడుకుంది. నిద్రలో కాళ్ళు దిండు వైపుకి చేరిపోయాయి. రాచకార్యాలు ముగించుకుని వచ్చిన రాయలు పడుకోగానే ఆ సందడికి ఆమె దిగ్గున లేచి కూర్చుంది. ఆ లేచే సమయంలో ఆమె కాలు రాయల తలకి తగలడంతో ఆయన కినుక వహించి ఆమె మందిరం నుండి వెళ్ళిపోయాడుట. ఎన్ని నెలలైనా ఆమె దగ్గరకి రావడం లేదుట. అప్పుడు తన పుట్టింటి నుండి వచ్చిన తండ్రిలాంటి కవి ముక్కుతిమ్మనకి (ఈయనని ముక్కుతిమ్మన అని కూడా అంటారు) విషయం చెప్పకుని వగచిందిట. వాళ్ళిద్దర్నీ కలపడం కోసమే పారిజాతాపహరణం కావ్యాన్ని రచించాడని అంటారు.

సాక్షాత్తూ ఆ కృష్ణుడినే – భార్య సత్యభామ అలిగి కోపంలో తన్నిందనీ, అయినా ఆమెని కృష్ణుడు గారాబం చేశాడని కావ్యంలో చెప్పడం వల్ల, భార్యాభర్తల మధ్య అలాంటి అలకలు సహజమే అని రాయలవారికి చెప్పకనే చెప్పినట్లైంది కదా!? రాయలు అది చదివి నవ్వుకుని తిరుమలదేవిని క్షమించాడని కథ.

కథాశిల్పంతో పాటు వర్ణనలోను, శైలిలోను, పాత్రపోషణలోను చతుర వచో ప్రౌఢి కలవాడు. అందుకేనేమో ఆయన శైలి వల్ల ‘ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు’ అనే నానుడి ఏర్పడింది. ఈతని మరో కావ్యం వాణీవిలాసం (అలభ్యం).

[4] ధూర్జటి : రాయల ఆస్థానంలో అష్టదిగ్గజకవిగా ఉన్న ధూర్జటి శ్రీకాళహస్తి ప్రాంతం వాడు. వేంకటగిరి సంస్థానంలోని ఓ గ్రామంలో జన్మించి కాళహస్తిలో స్థిరపడ్డారని అంటారు.

రచనలు : శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అనే ప్రబంధం. తన ప్రబంధాన్ని ఆ దేవుడికే అంకితం ఇచ్చాడు. శ్రీకాళహస్తి క్షేత్ర మహిమను తెలిపే ఈ కావ్యంలో సాలీడు, ఏనుగు, పాముల కథ ప్రసిద్ధి పొందిన కథ.

దీన్ని ఈయన స్కాందపురాణాన్నించి గ్రహించి వర్ణనా చాతుర్యంతో, అలంకారాలు, పదబంధం, రసం ఔచిత్యంగా ప్రదర్శించి నాలుగు ఆశ్వాసాల ప్రబంధంగా రచించాడు.

యాదవభూపాలుడు అనే రాజుకి శివుడికి జరిగిన సంభాషణ ఇతివృత్తం. 755 గద్యపద్యాలతో హృద్యంగా రచింపబడిన మధుర ప్రబంధం అట ఈ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం.

[5] తెనాలి రామకృష్ణుడు : వికటకవి, హాస్యకవిగా సుప్రసిద్ధుడు. రాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజకవి. తెనాలి వాడు కాబట్టి అతన్ని తెనాలి రామలింగకవి అంటారు కాని అతని ఇంటిపేరు గార్లపాటి.

రచనలు : పాండురంగమహాత్మ్యము, ఘటికాచలమహాత్మ్యము, ఉద్భటారాధ్యచరిత్ర. తెలుగు పంచకావ్యాలలో ‘పాండురంగమహాత్మ్యము’ ఒకటి. విజయనగరంలో విఠోబా ఆలయం లోని స్వామి విఠలనాథుని మహిమని తెలిపే ప్రబంధం ఇది. ఈ కావ్యాన్ని ఆ స్వామికే అంకితం ఇచ్చాడు.

చాటువులు, తిట్టుపద్యాలు రాయడంలో తెనాలి రామలింగకవి దిట్ట. ఇతను హాస్యకవి, చమత్కారి అని చెప్తూ అనేక కథలు ప్రసిద్ధిలోకి వచ్చాయి. తెనుగునాట తెనాలి రామలింగడుగా తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు.

[6] కందుకూరి రుద్రకవి : ఈయన భువనవిజయంలో ఈశాన్యదిశలో ఉండే సింహాసనంపై కూర్చునేవాడుట. 1518 లో రాయల ఆస్థానంలో చేరి ఉంటాడని భావిస్తున్నారు. కొండోజీ అనే రాయలవారి మంగలి ద్వారా రాయలవారి దర్శన భాగ్యం కలిగించుకుని కొలువులో చేరాడని కథ.

అనేకమైన చాటుపద్యాలు, తిట్టుపద్యాలు రచించిన కవి. ఇతని నివాసం నెల్లూరు దగ్గర కందుకూరు అని ఈతను రచించిన నిరంకుశోపాఖ్యానం అనే శృంగార కావ్యం లోని పద్యం వల్ల తెలుస్తుంది. కందుకూరులోని సోమేశ్వరస్వామికి ఈ కావ్యాన్ని అంకితం ఇచ్చాడు.

జనార్దనాష్టకం – ‘కందుకూరి జనార్దనా!’ అనే మకుటంతో కూడిన పద్యాలతో రాసిన మరో కావ్యం.

కందుకూరు వంశంలో నలుగురు రుద్రకవులు ఉన్నారు. ఈయన బహుశా రెండవ రుద్రకవి. ఈయన రచించిన సుగ్రీవ విజయాన్ని ప్రాచీనమైన యక్షగానం అంటారు. ఈయన అష్టదిగ్గజకవి కాకపోయినా తెలుగువారి హృదయాలలో గొప్పకవిగా ముఖ్యంగా ధీటైన చాటుకవిగా పేరుగాంచాడు.

[7] రామరాజభూషణుడు (భట్టుమూర్తి) : ఈతనికి భట్టుమూర్తి అనే పేరు కూడా ఉంది. బళ్ళారి వాసి. ‘సంగీతరహస్యకళానిధి’ అన్న బిరుదు కలవాడు. అష్టదిగ్గజకవులలో ఒకరు.

రచనలు : వసుచరిత్ర అనే ప్రబంధం, నరసభూపాలీయం అనే లక్షణ గ్రంథం, హరిశ్చంద్రనలోపాఖ్యానం అనే ద్వ్యర్థి కావ్యం. వసుచరిత్ర తెలుగు పంచకావ్యాలలో ఒకటి.

మహాభారతంలో నన్నయ కేవలం 12 గద్యపద్యాలలో చెప్పిన వసురాజు వృత్తాంతాన్ని భట్టుమూర్తి 800 గద్యపద్యాల ప్రబంధంగా రచించాడు. శుక్తిమతి అనే నదికి, కోలాహలుడు అనే పర్వతానికి జన్మించిన గిరికను వసురాజు ప్రేమించి వివాహమాడటం ఇందులోని కథ.

వసుచరిత్రలోని పద్యాలు సంగీతానికి అనుగుణమైనటువంటివి. సంగీత సాహిత్య విషయాలు రెండూ తెలిసిన ఈ కవి తన కావ్యాలలో ప్రయోగించే శబ్ద చాతుర్యం అనితరసాధ్యం.

[8] పింగళి సూరన : అష్టదిగ్గజకవులలో ఒకరు. ప్రముఖకవి. గొప్పకవి. నిజామాబాద్ జిల్లాలోని పింగళి అను గ్రామవాసి.

రచనలు : రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, గిరిజాకల్యాణం. గరుడపురాణాన్ని తెనిగించాడు.

రాఘవపాండవీయం ద్వ్యర్థి కావ్యం. ఒకే పద్యంలో భారత రామాయణ కథలు వచ్చేలా రచించడం ఈ కావ్య విశేషం. అద్భుతమైన ఈ కావ్యాన్ని విరూపాక్షేశ్వరునికి అంకితం ఇచ్చాడు.

ఇక కళాపూర్ణోదయం ప్రబంధ యుగంలో అపూర్వసృష్టి. ఆ యుగాన్నంతటినీ ఉర్రూతలూగించిన ప్రబంధం. అనేక మలుపులతో, వివిధ కథలతో (ఉపాఖ్యానాలు) ఉండే ఈ కావ్యాన్ని ఇప్పటి నవల లాంటిది అనొచ్చు. *అరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకి కళాపూర్ణోదయాన్ని అంకితం ఇచ్చాడు.

కథ కోసం https://eemaata.com/em/library/kalaa/298.html

*(అరవీటి వంశం అరవీటి తిమ్మరాజు కుమారుడు అళియరామరాయలే కృష్ణదేవరాయల అల్లుడు. తిమ్మరాజు కందనవోలు (కర్నూలు) ప్రాంతాన్ని పరిపాలిస్తూ విజయనగరాధీశుడు వీరనరసింహరాయలుకి సామంతునిగా ఉండేవాడు. బహమనీ సుల్తాన్ మహమ్మద్ షా సామంతుడు యూసఫ్ ఆదిల్ఖాన్, ఆదోని పాలకుడు కాసెప్ప ఒడయారు సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్ధమందు ఓడించి తరిమేశాడు ఈ తిమ్మరాజు. ఈ విజయానికి ఆనందించి వీర నరసింహరాయలు అదవాని (అదోని) సీమను తిమ్మరాజు విజయానికి కానుకగా ఇచ్చాడు. ఈ సంఘటన వల్ల అరవీటి వంశం వారూ, తుళువ వంశం వారూ స్నేహితులయ్యారు)

పింగళి సూరన ప్రభావతీప్రద్యుమ్నం అనే ప్రబంధాన్ని నాటకీయ పద్ధతిలో రచించి తన తండ్రికే అంకితం ఇచ్చాడు. హరివంశంలోని కథ దీనికి ఆధారం. కథ కోసం https://eemaata.com/em/library/prabhaavatee/729.html

ఆరు రకాలైన శ్లేషలతో రాఘవపాండవీయాన్ని చిత్రవిచిత్రంగా రచించాడు. ఈయన అనన్యకల్పనాధురీణుడు.

[9] అయ్యలరాజు రామభద్రుడు : అష్టదిగ్గజకవులలో ఒకరు. క్రీ.శ 1550 ప్రాంతాల్లో ఉండేవాడు. (ఒంటిమిట్ట రఘువీర శతకాన్ని వ్రాసిన అయ్యలరాజు తిప్పయ్యకు మనుమడు)

రచనలు : రామాభ్యుదయం. రామాయణాన్ని ప్రబంధరూపంలో రాసిన ఘనత ఈయనకి దక్కింది. తన ప్రబంధాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకి అంకితమిచ్చాడు. ఎనిమిది ఆశ్వాసాల కావ్యంగా రచించిన రామభద్రుడి రామాభ్యుదయం తెలుగు పంచకావ్యాలలో ఒకటి అనేంతగా పేర్కొనదగినది.

[10] మాదయగారి మల్లన : అష్టదిగ్గజకవులలో ఒకరు. రాయలవారు దండయాత్రలు చేస్తున్నా, తీర్థయాత్రలు చేస్తున్నా వెంటవెళ్ళే కవులలో మల్లన ఒకరు. రాయలవారి భువనవిజయంలో మొదటనించీ ఉన్నా రాయలవారికి ఏ కావ్యాన్నీ అంకితం ఇవ్వలేదు.

ఈయన కృష్ణాజిల్లాలోని అయ్యంకిపురం గ్రామస్థుడు అయినా కడప జిల్లాలో పెరిగినట్లు తెలుస్తోంది.

ఇతని కావ్యం రాజశేఖర చరిత్ర. దీన్ని నాదెండ్ల అప్పమంత్రికి (మహామంత్రి తిమ్మరుసు చెల్లెలి కొడుకు) అంకితం ఇచ్చాడు. తెలుగు ఇల్లాలి మెడలో నల్లపూసలు కట్టించింది ఈయనే. (తన ఈ కావ్యంలో పెండ్లిలో నల్లపూసలు కట్టించాడు)

తనే స్వయంగా రాసిన కావ్యం రాజశేఖర చరిత్ర – అంటే ఏ పురాణం నించీ గ్రహించినది కాదు. కథానాయకుడు నాయకిని చూసి ప్రేమించి పెద్దలను అంగీకరింపజేసి వివాహం చేసుకోవడం ఇందులోని కథ. లగ్నం పెట్టింది మొదలు గృహప్రవేశం దాకా మాత్రమే 75 పద్యాలు. ఇక మొత్తం కావ్యంలో 516 పద్యాలున్నాయి.

నిరాడంబరమైన కావ్యాన్ని సూటిగా చెప్పుకొని పోవడమే దీనిలోని విశేషమనీ, అందువల్లనే అందరి మన్ననలనూ పొంది అతనికి కీర్తిని సంపాదించి పెట్టిందనీ అంటారు.

[11] చింతలపూడి ఎల్లన (రాధామాధవ కవి) : తూర్పు గోదావరి జిల్లాలోని చింతలపూడి గ్రామ నివాసి. ఇతని కావ్యం పేరు – రాధామాధవం. రాసీ రాయగానే ఈ ప్రబంధం ఎంత సుప్రసిద్ధమైందంటే ఈయన్ని ఇక అప్పటినించీ రాధామాధవ కవి అనడం ప్రారంభించారు. రాయలవారు కూడా ఈ కావ్యం విన్నాక ప్రజలు అనుకుంటున్న పేరునే – రాధామాధవ కవి అనే బిరుదుని ప్రసాదించి సన్మానించారు. సన్మానం జరిగాక ఇక రాయల వద్దకు చేరుకున్నాడు ఈయన.

మరో కావ్యం – తారకబ్రహ్మరాజీయం. రాయలవారు మరణించడంతో, కృష్ణదేవరాయల సవతి తమ్ముడు (రాయల తర్వాత విజయనగరాన్ని పాలించిన రాజు) అచ్యుతదేవరాయల ఆజ్ఞానుసారం తన ఈ తారకబ్రహ్మరాజీయాన్ని తిరుమల వేంకటేశ్వరస్వామికి అంకితం ఇచ్చాడు. విష్ణుమాయానాటకం అతని మరో కావ్యం.

[12] సంకుసాల నృసింహకవి : ఇతని ఊరు కడపజిల్లా, పులివెందుల తాలూకాలోని సుంకేసుల అని అభిప్రాయపడుతున్నారు. ఈయన కావ్యం కవికర్ణరసాయనం. తన గురువు భట్టుపరాశరులవారు అని చెప్పుకున్నాడు. కాబట్టి ఇతను మొదట *స్మార్తుడై తర్వాత రామానుజుని తత్త్వాన్ని అనుసరించాడని తెలుస్తున్నది.

*(స్మార్తులు – ఆదిశంకరుడు ప్రవచించిన అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించేవారు)

రాయలవారి దర్శనం పెద్దన పడనివ్వలేదట. విసిగిపోయిన సంకుసాల డబ్బు కోసం కవికర్ణరసాయనంలోని కొన్ని పద్యాలను బజార్లో అమ్ముకుంటుంటే, నాలుగు వేల వరహాలు పెట్టి రాయలవారి కుమార్తె ఒక పద్యం కొనుక్కున్నదట. ఆ అమ్మాయి రాయలవారితో చదరంగం ఆడుతూ “ఉద్ధతుల మధ్య పేదలకుండ తరమె” అని కూనిరాగం తీస్తూ ఎత్తు వేసిందట. విన్న రాయలవారు వెంటనే పూర్తి పద్యం పాడించుకుని అది ఎవరిదో వివరాలు కనుక్కున్నారట. కానీ అప్పటికే సంకుసాల నరసయ్య / నరసింహయ్య వెళ్ళిపోయి కవికర్ణరసాయనాన్ని దేవుడికి అంకితమిచ్చాడని తెలుసుకుని తాను కవిభర్తని కాలేకపోయానే అని విచారించాడుట.

ఈ కవి ఆ కాలంలో కవులు రాసిన విచ్చలవిడి శృంగారాన్ని విమర్శించాడని అంటారు. ఆ రోజుల్లో జారవీధులు ఎంత విచ్చలవిడితనంగా, అసహ్యంగా ఉండేవో తన కావ్యం ద్వారా చెప్పాడు. అంతేకాకుండా తను కవిత్వం రాస్తే ‘విటులు యతులు అవుతారనీ, యతులు విటులు అవుతారనీ’ – అంటే అంత ప్రభావవంతంగా రాస్తానని సగర్వంగా ప్రకటించుకున్నాడు.

[13] బండారు లక్ష్మీనారాయణ : ఒరిస్సా రాష్ట్రం నించి వచ్చిన లక్ష్మీనారాయణ అనే పండితుడు రాయలవారి ఆస్థానంలో సంగీత విద్వాంసుడు. ఈయన ‘సంగీత సూర్యోదయం’ అనే గ్రంథాన్ని రచించాడు.

ఈయనే రాజాంతఃపురంలో సంగీత శాస్త్ర అధ్యాపకులుగా ఉన్నాడు.

[14] బయాకారపు రామయామాత్యుడు : ఈయన అళియ రామరాజు మంత్రి. అంతే కాకుండా అళియ రామరాజు తన కుమార్తెకి సంగీతం నేర్పించడానికి రామయ్యమంత్రిని వినియోగించాడు. సంస్కృత కవి అయిన ఈయన ‘స్వరమేళకళానిధి’ అనే – ఒక ప్రామాణిక గ్రంథాన్ని – సంగీత గ్రంథం సంస్కృతంలో రచించాడు.

ఈ గ్రంథాన్ని అనుసరించి కర్ణాటక సంగీత సంప్రదాయాలు ఏర్పడి వినుతికెక్కాయి.

[15] బొడ్డుచర్ల తిమ్మన : రాయలవారితో చదరంగం ఆడుతుంటాడు ఈ చిన్నతిమ్మన. ఈతని అన్న పెద్ద తిమ్మన. ఇటువంటి చదరంగపుటాటగాడు ఆ దినాల్లో లేడుట. కృష్ణరాయలవారి దగ్గరకు పోయి రకరకాల వ్యూహాలు పన్నుతూ చదరంగం ఆడి గెలుస్తుండేవాడు. రాయలవారు కొప్పోలు గ్రామాన్ని (ప్రకాశం జిల్లా) సర్వాగ్రహారంగా ఈయనకి ధారపోసి ఇచ్చాడు.

ప్రసన్నరాఘవీయం అనే కావ్యాన్ని ఇతనే రాశాడని కొందరు, కాదు ఈతని మనుమడు లోకనాథుడు రాశాడని కొందరూ అంటారు.

[16] నట్టువ నాగయ్య ఇంకా నట్టువ తిమ్మయ్య : వీరిద్దరూ నృత్య నాటికలు, యక్షగానాలు ప్రదర్శించేవారు. వీరు కర్నూలు జిల్లా వాసులు. రాయలవారి జాంబవతీ కల్యాణాన్ని ప్రదర్శించారు. నట్టువ తిమ్మయ్య కుమార్తె కూడా యక్షగానాలు ప్రదర్శించి ఎన్నో కానుకలు పొందేదట.

[17] లొల్ల లక్ష్మీధరుడు : గొప్ప సంస్కృత కవి. ఇతడు మొదట గజపతుల దగ్గర ఉండి తర్వాత విజయనగరానికి వచ్చినట్లుగా చెబుతారు. ఇతను విజయవాడ దగ్గరున్న లొల్ల గ్రామ నివాసి. లక్ష్మీధరుడు శివానందలహరికి వ్రాసిన వ్యాఖ్యానం జగత్ప్రసిద్ధినొందింది.

ఈయన రాసిన దైవజ్ఞవిలాసం గొప్ప గ్రంథం, విజ్ఞాన గని అని అంటున్నారు. సరస్వతీ విలాసం అనే గ్రంథాన్ని ప్రతాపరుద్ర గజపతి రచించాడని పేరున్నా అది లక్ష్మీధరుడే వ్రాసి ఉంటాడని భావిస్తున్నారు.

వీరి పూర్వీకులంతా గొప్ప పండితులు. లక్ష్మీధరుడి పూర్వీకులలోని వాడే ‘భరార్ణవపోత’ అనే నాట్యగ్రంథాన్ని రాసిన విరించి మిశ్రుడు ( 5 తరాలకు ముందున్నవాడు).

ఆదిశంకరుడి శివానందలహరి లేదా సౌందర్యలహరి కి 36 వ్యాఖ్యానాలున్నాయి. వాటిల్లో లొల్ల లక్ష్మీధర వ్యాఖ్య సుప్రసిద్ధమైనదీ, అత్యాధునికమైనది.

[18] వ్యాసతీర్థులు : శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన గురువు. ద్వైత సంప్రదాయాన్ని అనుసరించి ఉద్ఘటించిన ముగ్గురు ఆచార్యులు – 1. ద్వైత మత స్థాపకుడైన ఆనందతీర్థులు 2. ఆనందతీర్థులు రచించిన అనేక కృతులకు టీకాలు రాసిన జయతీర్థులు (టీకాచార్యులు అని కూడా అంటారు) 3. వ్యాసతీర్థులు. వీరు మాధ్వ గురువులు.

వ్యాసతీర్థులు రచించిన మూడు గ్రంథాలు – 1. న్యాయామృత 2. తాత్పర్యచంద్రిక 3. తర్కతాండవ. వీటిని ‘వ్యాసత్రయం’ అంటారు.

ఈయన ప్రోద్బలం తోనే రాయలవారు ‘సకలకథాసార సంగ్రహము’ అన్న కావ్యాన్ని రచించారుట. వ్యాసతీర్థులవారు గొప్ప వాగ్గేయకారులు కూడా. ఈతను రాసిన ‘కృష్ణా నీ బేహనే బారో’ అనేది మధురమైన పాట. https://www.youtube.com/watch?v=CWrfp50uonA

వ్యాసతీర్థులవారు దాసకూటమును ఏర్పాటు చేసి పామరులకు కూడా వారి భాషలోనే పాటలను అందించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పురందరదాసు, కనకదాసు ఆ కూటమిలోని వారే. వారిద్దరూ ఈయనకి శిష్యులు.

[19] పురందరదాసు (శ్రీనివాస నాయక్) : పురందరదాసు గొప్ప వాగ్గేయకారుడు. కన్నడ పదకవితాపితామహుడు. వేలాది దేవుని కీర్తనలను రాసి పండిత పామరులను అలరింపజేసిన కవి. ‘మాయామాళవగౌళ’ రాగము పురందరదాసు ప్రతిపాదించినదే.

శ్రీగణనాథ, భాగ్యద లక్ష్మీబారమ్మా, రాగీ తందీరో, తారక్య బిందీగే, రంగబారో పాండురంగబారో మొదలైన ఎన్నో పాటలు – 4,75,000 కీర్తనలు రచించారు. 1000 మాత్రమే లభ్యం. అతని మకుటం ‘పురందర విఠలా!’ 1484 లో పూనాలో జన్మించాడు. సన్యాసం స్వీకరించి కట్టుబట్టలతో సహా దానం చేసి విజయనగరం చేరాడు.

‘కర్ణాటక సంగీత పితామహ’ అనే బిరుదు కలిగినవాడు. క్రీ.శ 1564 లో హంపీలో కాలధర్మం చెందారు. ఆయన విగ్రహం అలిపిరి లో ఉంది.

[20] కనకదాసు : కర్ణాటక రాష్ట్రం, హవేరీ జిల్లాలోని బాద గ్రామవాసి. 1509 లో జన్మించాడు. సైనికుడు. గాయపడ్ద తర్వాత ప్రాణాలు దక్కించుకుని తత్త్వవేత్త అయి పాటలు రాయడం ప్రారంభించాడు. శూద్రుడు అని ఉడిపి ఆలయప్రవేశానికి అనుమతి ఇవ్వలేదుట. వ్యాసతీర్థులవారు వచ్చి అక్కడి పూజారులకి చెప్పినా కనకదాసుకి అనుమతినివ్వలేదు. ఇక గుడి బయటే కూర్చుని కొన్ని వారాల పాటు పాటలు పాడుతూ ఆరుబయటే వండుకుని తింటూ అక్కడే పడుకుంటూ ఉండిపోయాడుట.

గుడి గోడ పడిపోయి విగ్రహం కనకదాసు కూర్చుని ఉన్న వైపుకు తిరిగింది. గర్భగుడి పగులుగా విచ్చింది. ఆ పగులు గుండా కనకదాసుకి శ్రీకృష్ణుడు దర్శనాన్ని ఇచ్చాడుట. ఈ కారణంగానే ఉడిపి దేవాలయం తూర్పు ముఖంగా ద్వారం ఉన్నప్పటికీ విగ్రహం పడమర ముఖంగా ఉంటుంది. ఇప్పుడు కూడా భక్తులు ‘కనకదాసు కిండే’ (కనకదాసు కిటికీ) గుండా స్వామిని దర్శించుకుంటారు.

రచనలు : నలచరిత్ర, హరి భక్తిసార, నృసింహస్తవ, రామధ్యానచరిత్ర, మోహన తరంగిణి రచించారు. అన్నీ కన్నడంలో రచించినవే.

గొప్ప భక్తుడు, తత్త్వవేత్త, వాగ్గేయకారుడు. 6, నవంబర్ 1509 లో జన్మించిన కనకదాసు 100 సంవత్సరాలు జీవించి 1609 లో తిరుపతిలో మరణించాడు. ఆయనకి నివాళిగా కనకదాస జయంతిని సెలవుదినంగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించి గౌరవించింది.

“కాగేనెలె ఆదికేశవ’ – అనేది ఇతని కీర్తనల్లోని ముద్ర. ‘బాగిలను తెగెదు సెవెయను’ పాట ప్రసిద్ధి పొందినది.

**

[21] రాజనాథ డిండిముడు : గొప్ప సంస్కృత కవి. పండిత కుటుంబానికి చెందినవాడు. అచ్యుతదేవరాయల కొలువులోని కవి.

రచనలు : అచ్యుతరామాభ్యుదయం, సంస్కృతంలో భాగవతాన్ని *చంపూలో రాసి అచ్యుతదేవరాయలకి అంకితం ఇచ్చాడు.

*(చంపూ : పద్యగద్యసహితంగా రాస్తే చంపూ అంటారు. ప్రబంధాలన్నీ చంపూ పద్ధతిలో రాయబడినవే)

(ఈతని వంశంలోని అరుణగిరినాథ డిండిమభట్టునే – సార్వభౌమ డిండిమభట్టు అని కూడా అంటారు – శ్రీనాథుడు ఓడించి ఆతని దగ్గరున్న కంచు ఢక్కాని పగలగొట్టించాడు (?). ఈయన రెండవ దేవరాయల ఆస్థానంలో ఉండేవాడు. తిరుప్పుగళ్ రచించాడు.

అరుణగిరినాథ డిండిమభట్టు యొక్క కుమారుడు (మరో) రాజనాథ డిండిమభట్టు – సాళువ నరసింహ ఆస్థానంలోని కవి, సాళువాభ్యుదయం రచించినవాడు.

అరుణగిరినాథ డిండిమభట్టు తాత అరుణగిరినాథుడు (తాత పేరు కూడా అరుణగిరినాథుడే)- సోమవల్లీ యోగానంద ప్రహసనం రచించాడు.

https://archive.org/details/in.ernet.dli.2015.97710/page/n217 )

[22] గుబ్బిమల్లినార్యుడు : శివకవి. భావచింతారత్న (సత్యేంద్ర చోళుని కథ అని దీనికి మరో పేరు), వీరశైవామృతపురాణం రచించాడు.

[23] చాటు విఠలనాథుడు : అచ్యుతదేవరాయల ఆస్థానంలోని కన్నడకవి. భాగవతాన్ని భామినీ షట్పది ఛందస్సు (కన్నడంలో ఒక రకమైన ఛందస్సు – మన మత్తకోకిలని పోలి ఉంటుందట) లో రచించారు. ఇది ఎంతో పెద్ద గ్రంథం అట. 280 భాగాలు – పన్నెండువేలకి పైగా పద్యాలు ఉండే ఈ గ్రంథం ఇప్పుడు అలభ్యం.

[24] హరిదాసర్ : తమిళ కవి. ‘ఇరు సమయ విళక్కం’ అనే కావ్యాన్ని రచించాడు. రెండు మతాలు – వైష్ణవ, శైవ వివరణ కావ్యం ఇది అయినా వైష్ణవమతానికే దీనిలో ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాడు.

[25] అచ్యుతదేవరాయలు : శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు. రాయల తర్వాత రాజు అయ్యాడు. క్రీ.శ 1529 నుండి క్రీ.శ 1542 వరకూ పరిపాలించాడు. అచ్యుతదేవరాయలని పదవీచ్యుతుడిని చేసి అళియ రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించాలని అనేక సార్లు ప్రయత్నించాడు కాని ప్రజలు ఇతనికే పట్టం కట్టారు.

అచ్యుతదేవరాయలు కూడా రాయలవలె సాహిత్యపోషకుడు. స్వయంగా కవి. తాళమహోదధి అనే సంస్కృత గ్రంథాన్ని రాశాడు. ఈయన వీణావిద్వాంసుడు కూడా. ఈయన భార్య తిరుమలాంబ. వరదాంబికా పరిణయం రాసినది ఈవిడేనని అంటారు. ఈయన ఆస్థానంలోని ముఖ్య కవులు రాజనాథ డిండిమభట్టు, రాధామాధవకవి, చాటు విఠలనాథుడు మొదలైనవారు.

తిరుపతి వేంకటేశ్వరస్వామి భక్తుడు. తన పట్టాభిషేకాన్ని తిరుమల స్వామి సమక్షంలో చేయించుకున్నాడనీ. ప్రతి సంవత్సరం ఒక గ్రంథాన్ని స్వామివారికి సమర్పించుకున్నాడనీ శాసనాలు ఉన్నాయి. అచ్యుత రాయలు తన పరిపాలనలో సంగీత సాహిత్యాలే కాకుండా నృత్యకళని బాగా అభివృద్ధి చేశాడు. ఆయన ఆస్థానం నుండి నర్తకీమణులని తిరుపతి దేవస్థానానికి పంపిన శాసనం కూడా ఉంది.

చివరి రోజుల్లో రాజ్యపాలన పట్ల ఆసక్తి నశించి ఎక్కువ కాలం అంతఃపురంలోనే గడిపేశాడుట.

ఇతని పరిపాలనా కాలంలో హంపిలోని తిరువేంగళనాథుని ఆలయము నిర్మించాడు. ఈ ఆలయం ‘అచ్యుతరాయ ఆలయము’ అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. లేపాక్షి ఆలయం కూడా ఇతని కాలంలోనే నిర్మింపబడింది.

[26] శఠగోపయతి : అహోబిలమఠం పీఠాధిపతి, అల్లసాని పెద్దనకి గురువు. రాయలవారు పెద్దనకు కోకట గ్రామాన్ని తరతరాలు అనుభవించమని ఇవ్వగా ఆయన దాన్ని తన గురువైన శఠగోపయతి జ్ఞాపకార్థం – ‘శఠగోపపురమని’ మార్చి ఆ గ్రామ్నాన్ని వైష్ణవమయం చేశాడు.

శఠగోపయతి పెద్దనకి ‘అజప’ మంత్రదీక్షని ఇచ్చాడు – అంటే మంత్రం లేకుండానే ధ్యానం చేయడం (సోహమ్) సోహమ్ = అది నేను.

ఈ అహోబిల పీఠాధిపతులైన శఠగోపయతులనే జీయర్ స్వాములు అంటారు. అహోబిల మొదటి పీఠాధిపతియైన ‘అడవన్ శఠగోపయతి’ అన్నమయ్య గురువు. ఆయన వద్ద అన్నమయ్య ఆధ్యాత్మిక, వేదాంత రహస్యాలు నేర్చుకున్నాడు.

[27] కుమార సరస్వతి : రాయలవారి ఉత్కళ యాత్ర (ఒరిస్సా) ను వర్ణించిన కవి. గజపతులని రాయలు ఓడించడం, ప్రతాపరుద్రుని కుమార్తెని రాయలు పెండ్లాడటం మొదలైన విషయాలు ఇందులో ఉన్నాయి. తమిళ పుస్తకం ‘నవలార్ చరితై’ (Life sketches of some Tamil Poets mostly drawn from their works only) లో ఈయన రాసిన కొన్ని పద్యాలు, శ్లోకాలు చేర్చారు.

[28] లింగమంత్రి : కన్నడ కవి. నుగ్గిహళ్ళి రాజ్యాన్ని పరిపాలించిన రాయణరాజు ఆస్థానంలోని కవి. అచ్యుతదేవరాయలకి సామంతరాజు ఈ నుగ్గిహళ్ళి రాయణరాజు.

లింగమంత్రి ‘కబ్బిగరకైపిడి’ అన్న నిఘంటువుని తయారుచేశాడు.

[29] నంజుండయ్య : కన్నడకవి. క్రీ.శ 1525 ప్రాంతంలో నివసించినవాడు. ఈయన ‘కుమారరామచరిత’ అనే కావ్యాన్ని రచించాడు. 13 వ శతాబ్దంలో కంపిలిని పరిపాలించిన *యువరాజు కుమారరాముడి యొక్క చరిత్ర ఇది. దీనిని సాహిత్యపు విలువల కన్నా చారిత్రక సమాచారం కోసం చదవవలసిన గ్రంథం అని అంటారు.

*(కుమారరామ ఆదర్శవంతుడైన రాజు. అతని తండ్రి కంపిలిరాయ. తండ్రి అడగుజాడల్లో నడుస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతను ఒక ఆదివాసీ స్త్రీ తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే అనుకోని పరిస్థితులలో కుమారరామ తండ్రియైన కంపిలి రాయ ఈమెని చూడటం, వివాహమాడటం జరిగిపోతుంది.

ప్రియురాలు సవతి తల్లి స్థానంలోకి వచ్చాక కుమారరామ ఆమెకి దూరంగా ఉంటాడు. కాని ఆమె అతనిపై ప్రేమని పెంచుకుని అతనితో గడపాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ సంగతి తెలిసిన కంపిలిరాయ కోపోద్రిక్తుడై కుమారుడిని వథించమని ఆజ్ఞాపిస్తాడు. అయితే అతని కవల సోదరుడు చెన్నిగరాము (సమర్థుడైన అన్న బ్రతికి ఉండాలనుకున్నాడేమో మరి) తన జీవితాన్ని అన్న కోసం త్యాగం చేసి తనే కుమారరాముడిని అని చెప్పి మరణశిక్ష వేయించుకుంటాడు.

దయార్ద్రహృదయుడైన ప్రిన్స్ అంటే అందరికీ అంత ఇష్టం గౌరవం ఉండేదట. కొన్ని తెగలవారు యువరాజు కుమారరామ పేరు మీద అనేక ఆలయాలు కట్టించుకున్నారు. ఇప్పటికీ ఉత్తరకర్ణాటక లోని సిద్ధాపూర్ లో ఓ దేవాలయంలో ఆయన పేరు మీద గొప్ప జాతర జరుపుతారు. కన్నడంలో ఈయన కథని సినిమాగా కూడా తీశారు. ఆ సినిమా పేరు ‘గండుగలి కుమార రామ’)

**

కృష్ణశాస్త్రి గారు తన కథలో పరిచయం చేసిని కవులందరి గురించీ తెలుసుకున్నాం. ఇక కథ గురించి, కథలో ఆయన పరిచయం చేసిన పద్యాల గురించి చూద్దాం –

కృష్ణశాస్త్రి తన కథలో – మనుచరిత్ర అంకిత మహోత్సవాన్ని గొప్పగా వర్ణించారు. శ్రీకృష్ణదేవరాయల చేత పల్లకీ మోయించాలన్న ఆలోచన నిజంగా మహత్తరమైనది. రాయలు పెద్దన ఇంటికి వస్తుంటేనటా, ప్రజలు చేసే జయజయధ్వానాలతో వీథులు మారుమ్రోగుతున్నాయిట.

పెద్దన గృహాంగణంలోకి రాయలవారు రాగానే పెద్దన ఇంట్లోనుంచి అప్పాజీ, అచ్యుతరాయలు, నంది తిమ్మన, మాదయ్యగారి మల్లన – పెద్దనని నడిపిస్తూ బయటకి తీసుకురావడం, పింగళి సూరన తాతగారి (పెద్దన) చెయ్యి పట్టుకుని బంగారపుటడ్డల పల్లకీలో కూర్చోపెట్టడం, ఎవరూ ఊహించని విధంగా సాక్షాత్తూ రాజాధిరాజ, వీరప్రతాప, మూరురాయరగండ ముందుకు వచ్చి పల్లకీని స్వయంగా తన చేత్తో పైకెత్తడం! –

ఆహా! అది చూసిన ప్రజల హృదయాలు ముఖ్యంగా అక్కడున్న సాటి కవుల ఆంతర్యం నిండా ఆనందం నిండిపోయి ఉంటుంది.

– ఏమి మహాప్రభువు? విద్వజ్జనుల యొక్క విద్వత్తు విద్వాంసులకే తెలుస్తుంది మరి! రాయలు అంత గొప్ప కళాహృదయుడు, కవిరాజరాజు కనుకనే అంతటి మన్నన చూపగలిగాడు. ఆ అల్లసాని పెద్దన ఎంత పుణ్యం చేసుకున్నాడో! కవులంతా ఆ గౌరవం తమకే జరుగుతన్నట్లు ఉప్పొంగిపోయి చూస్తున్నారు. వీక్షిస్తున్నవారి పరిస్థితే అలా ఉంటే పెద్దనామాత్యులు ఎంత ఉద్వేగపడి ఉంటాడో కదా!? ఇంటి ఇల్లాలు గవాక్షం నించి చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకునే ఉంటుంది ఖచ్చితంగా!

ఇక ఆ ఊరేగింపు! – ముందు వందలకొద్దీ రౌతులు, మంగళవాద్యాలు, భట్టుకవుల స్తుతులు. ఆ తర్వాత కంచినించి వచ్చిన మేళం, ఆ వెనక వేదమంత్రాలు పఠిస్తూ వైదిక బృందం! పల్లకీ వెనుకే మంత్రులు, సామంతులు, దండనాయకులు, కవులు, పండితులు, గాయకులతో ఠీవిగా నడుస్తూ శ్రీకృష్ణదేవరాయలు.

నాలుగు వైపులా తీక్షణంగా చూస్తూ అప్పాజీ, ఆయన పక్కనే రాయలని అనుక్షణమూ కాపాడుకునే ‘కావటి’ తిమ్మరుసయ్య – విశాలమైన ఛాతీ, భుజాలు, బుగ్గమీసాలతో బహుశా రాయలనే చూస్తూ నడుస్తున్నాడేమో!

రాయలకి కొంచెం వెనక, పక్కల నడుస్తున్న కవులలో – రాయలవారితో మాట్లాడుతున్నవాడు నంది తిమ్మన, ప్రశాంతమైన ముఖంతో నిశ్చలంగా నడుస్తున్నవాడు ధూర్జటి, బంగారు పొడుంకాయ చేతిలో పట్టుకుని అప్పుడప్పుడు నస్యం పీలుస్తూ మాదయగారి మల్లన, ముచ్చటగా తయారై నడుస్తున్నవాడు రామభద్రుడు, తీర్చినట్లున్న కురులను చక్కగా దువ్వుకుని అలవోకగా నడుస్తున్నవాడు రామరాజభూషణుడు (భట్టుమూర్తి).

ఇక కబుర్లు చెప్పుకుంటూ కందుకూరి రుద్రయ్య, తెనాలి రామలింగకవి, రాధామాధవ కవి. త్వరత్వరగా భట్టుమూర్తి పక్కకి వచ్చి నవ్వుతూ పలకరిస్తున్నాయన – ఒరిస్సా ఆయన – బండారు లక్ష్మీనారాయణ. చేతిలో అంత పెద్ద పుస్తకం ఎందుకో!? వదలడు దాన్ని – అదేనయ్యా ‘సంగీత సూర్యోదయం’. ఆ పక్కాయనా అంతే బయాకారపు రామయామాత్యుడు – తను రాసిన ‘స్వరమేళకళానిధి’ ని అవకాశం వస్తే వినిపించడానికేమో! ఆ గ్రంథాన్ని భద్రంగా పట్టుకోని నడుస్తున్నాడు.

ఇడుగో ఈయనొకడు, ఎప్పుడు చూసినా ఎప్పడెప్పుడు రాయలని చదరంగంలోకి దింపి కొత్త కొత్త వ్యూహాలు పన్నుదామా అనుకుంటూ, చేతివేళ్ళు గాల్లో తిప్పుకుంటూ నడుస్తున్నవాడు – బొడ్డుచర్ల తిమ్మన. పక్కనే పొడుగాటి జుట్లూ, రంగురంగుల దుస్తులతో నడుస్తున్నారు నట్టువ తిమ్మయ్య, నట్టువ నాగయ్య – ఇప్పటికిప్పుడు అడిగినా ఏ నాటకమో, యక్షగానమో ప్రదర్శించేట్లున్నారు!

ఇక గీర్వాణ పండితులబ్బో!! – లొల్ల వారు, రాజనాథ డిండముడు, తమిళకవి హరిదాసు. వాళ్ళ పక్కనే నడుస్తున్నవారు రాయల ఆస్థాన గురువు వ్యాసతీర్ధులు – వ్యాసత్రయకర్త. రాయలవారికి ఏ అపాయమూ కలగకూడదని మంత్రాలు జపిస్తూ, మనసులోనే దీవిస్తున్నాడు.

ఇక వారి వెనుక ఈ ఊరేగింపు యాత్రని ఎలా వర్ణించాలా అని తలుస్తూ అప్పుడెప్పుడో రాయలవారి ఉత్కళయాత్రని వర్ణించిన కుమారసరస్వతి, పక్కనే కర్ణాటక కవులు – చాటు విఠలనాథుడు, గుబ్బిమల్లినార్యుడు, నంజుండయ్య, లింగమంత్రి.

నంజుండయ్య ఖచ్చితంగా రాయలవారి కథని కర్ణాటకంలో రసవత్తరంగా రచించాలని అనుకుంటూ ఉండి ఉంటాడు – కుమారరామచరితంలా!

చూశారా ఆ తేజస్వులిద్దరు – వారు నడుస్తుంటేనే పాటలు వినపడుతున్నాయయ్యా, సంగీత సరస్వతి వాళ్ళ గళంలో నివాసం ఏర్పరచుకున్నట్లు – వాళ్ళే పురందరదాసు, కనకదాసులు.

ఆహా! ఏమి వైభవం!! – చదువుతూ ఊహల్లోకి వెళ్ళిన మనకే ఇలా ఉంటే అక్కడ చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమిటో!

**

ఇంత మహోత్సవంగా జరుగుతున్న ఆ ఊరేగింపు పెద్దన గురువుగారైన శఠగోపయతి మఠం దగ్గర ఆగింది. పెద్దన గారు పల్లకీ దిగారు. రాజుగారితో కలిసి తన గురుదేవులకి నమస్కరించుకున్నారు. మళ్ళీ బయలుదేరిన ఆ ఊరేగింపు భువనవిజయం దగ్గర ఆగింది.

పెద్దన మనుచరిత్రని రాయలవారికి అంకితం ఇచ్చారు – పట్టువస్త్రంలో చుట్టి ఇచ్చి ఉంటారు కదా!

ఇస్తూ ఆ నిండోలగంలో రాయలవారి వీరత్వాన్ని తెలియచేస్తూ తను రచించిన పద్యం చదివాడుటండీ ఆ ఆంధ్రకవితాపితామహుడు – ‘ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమారతకు క్రౌంచాచల రాజమయ్యె’ అంటూ. ఆ సార్వభౌముడికి ఒడలు ఉప్పొంగిపోయి ఉంటాయి. అందుకే అని ఉంటాడు –

“హితుడవు, చతురవచోనిధి
వతుల పురాణాగమేతిహాస కథార్థ
స్మృతియుతుడవాంధ్ర కవితా
పితామహుడ వెవ్వరీడు పేర్కొన నీకున్” –

“మాకు మంచి మాటలు చెప్పేవాడివి, నేర్పు గల పలుకులకు నిధి వంటి వాడవు. గొప్పవైన పురాణాలు, ఆగమశాస్త్రము (పాంచరాత్రము), ఇతిహాసాలైన భారతరామాయణాలును వాటి కథా సందర్భములను జ్ఞప్తియందుంచుకున్నవాడవు. తెలుగు కవిత్వమునకు బ్రహ్మవంటివాడవు. నీకు సాటి ఎవరూ లేరు” అని.

కృతిభర్తనైన ఆనందం రాయల్ని నిలువనివ్వలేదేమో, పెద్దనని తన మందిరానికి పిలిపించుకుని ఉద్వేగంతో కౌగలించుకున్నాడుట. ఇద్దరి కళ్ళల్లో ఒక్క చినుకు చేరింది – తెలియకుండానే!

సాయంత్రం ఇంటికి చేరిన కవి భార్యకి, సూరన్నకి రాయల మందిరంలో జరిగిన ఈ విశేషాన్ని వర్ణిస్తున్నప్పుడు ఆ చినుకులు కరిగి బుగ్గల మీదకి చేరే ఉంటాయి. ఆ మహా ఇల్లాలు ఆయన వైదుష్యానికి ఎంతగా పొంగిపోయిందో కదా!? – “వండనలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి”

తెనాలి రామలింగడు పెద్దనని ఆటపట్టిస్తూ – ‘మా అక్క మాత్రం ప్రవరుని గృహిణి వంటిదే, మా బావగారే ‘మాయాప్రవరుడు’ అంటుంటే, ముసిముసి నవ్వులు ఆ ఇంట్లో.

ఆ రోజులు గొప్ప రోజులు. పొగడ్తలకి, తెగడ్తలకి, ఎగతాళికి, సుఖదుఃఖాలకీ ఆఖరికి మామూలు సంభాషణకీ కవిత్వమే! అలాంటప్పుడు ఇక ఆ సాహితీ సమరాంగణ సార్వభౌముడే కవుల్ని ఆహ్వానించి తన కావ్యం ఆముక్తమాల్యదని వినిపిస్తుంటే – ఆయన ప్రతిభకీ, నవ్యతకీ, లోకజ్ఞతకీ ముగ్ధులవకుండా ఎవరుంటారు? ‘ఆయన దర్శనం కాకపోతేనేం ఆ రాచనగరంలోనైనా పద్యాలు అమ్ముకుంటే చాలు’ అని ఎందుకనుకోరు?

అలానే కదూ, సంకుసాల నృసింహకవి తన కవికర్ణరసాయన కావ్యపద్యాలని విక్రయిస్తుంటే రాయల కూతురు వేల వరహాలు ఇచ్చి “ఉద్ధతుల మధ్య పేదలకుండ తరమే” అన్న పద్యం కొనుక్కున్నదీ!?

ఆ సంకుసాలే అంటాడూ…
“యతి విటుడు గాక పోవునే అస్మదీయ
కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమున !
విటుడు యతి కాకపోవునే వెస మదీయ
కావ్య శృంగార వర్ణనా కర్ణనమున!” అని.

– అంటే వైరాగ్యం గురించి రాసినా, శృంగారం గురించి రాసినా ఆ స్థాయిలో ఉంటుంది నా కవిత్వం అనడం – ఆహా! ఏమి ఆత్మవిశ్వాసం! ఎంతటి నిష్ణాతృత్వము!!

**

ఆ తర్వాత విజయనగరానికి వచ్చిన పారశీక రాయబారులని శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానానికి పిలిపించి, కానుకలు సమర్పించి తన ఆముక్తమాల్యదని వినిపిస్తుంటే –

ఆ నిష్ఠానిధి గేహసీమ నడురే యాలించిన న్ర్మోయు నెం
తే నాగేంద్రశయానుపుణ్యకథలుం దివ్యప్రబంధానుసం
ధానధ్వానము ‘నాస్తి శాకబహుతా, నా స్త్యుష్ణతా, నాస్త్యపూ
పో, నాస్త్యోదనసౌష్ఠవంచ, కృపయాభోక్తవ్య’ మన్పల్కులున్ –

ఆ విష్ణుచిత్తుని యొక్క గృహమునందు అర్థరాత్రి యందు కూడా – విన్నారంటే విష్ణువును గురించిన పుణ్యకథలో, నాలాయిర దివ్యప్రబంధములోని పాశురాల పారాయణము వినపడుతుంటుంది. అంతే కాకుండా మధ్యమధ్యలో ‘అయ్యో ఎక్కువ కూరలు లేవు, వేడి కూదా లేనట్లుంది. పిండివంటలూ లేవు. అన్నము సరిపోయినంత ఉందో లేదో, దయతో (ఏమీ అనుకోకుండా) ఆరగించండి’ అన్న మాటలు వినపడుతుంటాయి” –

విని ‘అన్నీ ఉన్నా – వచ్చినవారిని లేదనకుండా ఆదరిస్తూనే, వండి వడ్డిస్తూనే – ‘ఏమీ లేవనుకుంటారేమో, ఏమీ అనుకోండి’ అని చెప్పడం ఎంత వినయం! ఈ సీమవారికి అతిధుల పట్ల ఎంత ఆదరణ!’ అనుకుని ఆ విదేశీయులు ఆశ్చర్యపోయి ఉండరూ!?

**

పంపా సరోవరం నించి లేతగాలులు విజయనగరంలో చొరబడుతున్నాయి. వైభవంగా జరిగిన ‘మనుచరిత్ర అంకిత మహోత్సవం’ కళ్ళముందు మెదులుతోంది కాబోలు, మరిన్ని కబుర్లు కలబోసుకోవడానికి కవులందరూ తుంగభద్రానదీ తీరానికి చేరుకున్నారు.

ఆ సాయంసమయంలో తుంగభద్రలో దిగి తామ్రపాత్రతో నీళ్ళు ముంచుకుంటున్న పడుచుపిల్లని చూసి ఆమె అందాన్ని వర్ణించిన కందుకూరి రుద్రయ్య, రుద్రయ్యని ఈసడించుకుంటూ సంకుసాల. ఈ సంకుసాల తెంపరితనాన్ని హేళన చేస్తూ రామలింగయ్య – “ఏమిటయ్యా నీ అహంకారం నా కీర్తి చంద్రిక చూడు ఎలా పరిహసిస్తుందో –

లింగనిషిద్ధు గల్వలచెలింగని, మేచకకంధరుం ద్రిశూ
లింగని సంగతాళి లవలింగని, కర్దమదూషిత న్మృణా
లింగని, కృష్ణచేలుని హలింగని నీలకచన్ విధాతృనా
లింగని, రామలింగకవిలింగనికీర్తి హసించుదిక్కులన్

కలువలకు స్నేహితుడైన తెల్లని చందమామకి లోపల నల్లని మచ్చ, నీలకంఠుడైన శివుడుకి కంఠంలో నలుపు, లవలీతీగని చూద్దామంటే తీగనిండా నల్లని తుమ్మెదలు, తామరపువ్వుకి బురద, బలరాముడుకి నల్లని వస్త్రాలు, సాక్షాత్తూ ఆ సరస్వతీ దేవికి నల్లని కురులు. ఒక్క రామలింగకవి యొక్క కీర్తి మాత్రమే ఏ మచ్చా లేకుండా నలుదిక్కులకూ చూసి నవ్వుతోంది” –

అంటూ “చెప్తే ఇలా చెప్పాలి ఏవో నాలుగు మాటలు తీసుకుని “యతి విటుడు కాకపోవునే? విటుడు యతి కాకపోవునే” అంటూ అటూ ఇటూ మార్చి ఇతరులను కించపరుస్తావా? అంటాడు.

ఆనాటి కవులు – రుద్రయ్య, రామలింగయ్యలు తమకంటే వయసులో చిన్నవారైనా, వీరు తమ పాండిత్యాన్ని మెచ్చుకుంటే సంతోషపడతారు, ఆఖరికి పెద్దనతో సహా. ఈ ఇద్దరు యువకువుల అభిరుచి అంత గొప్పదైనది మరి.

వెంటనే, వాతావరణాన్ని తేలిక పరచాలనేమో లాలిత్యమూర్తి భట్టుమూర్తి తన వసుచరిత్రలోని ఈ పద్యాన్ని –

“జలకము లార్చి, పాండు జలజచ్ఛద పాళికగప్పి తమ్మి సం-
కుల తెలిదేనె లుగ్గులిడి, క్రొందరగల్గదలించు గల్వ తొ-
ట్టెలల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామ, కో
మల కుముదా గతాళికుల మంజురవంబున జోలపాడుచున్

స్నానము చేయించి తెల్లని తామర ఆకులనెడి వస్త్రమును కప్పి పద్మముల యొక్క శంఖపాత్రతో తేనెను ఉగ్గు పోసి, క్రొత్త అలలతో కదిలిస్తున్నటువంటి కలువ పువ్వుల ఉయ్యాలలో కొడుకుని కూతురుని పరుండబెట్టింది నదీస్త్రీ (శుక్తిమతి). కోమలమైన తామరలను ఆశ్రయించిన తుమ్మెదల గుంపు (సఖులు) మంజులమైనటువంటి గొంతుతో జోలపాట పాడుతూ సేవిస్తున్నారు”

అని పాటలాగా పాడతాడు. వెంటనే రామలింగకవి “ఏదీ పాటలా కాకుండా పద్యంలా చదువు” అంటాడు. భట్టుమూర్తి పద్యాన్ని చదవగానే అందరూ ‘భేష్’ అంటారు.

ఎంతటి విద్వత్తు! ప్రకృతే లాలిపాట పాడుతున్నంత లలితంగా లేదూ!!?

పాటలాగా ఉంటేనే బావుందని అనుకుందేమో తుంగభద్ర, కాస్త ఒళ్ళు విరుచుకుంటూ కూనిరాగం తీస్తోంది.

సంధ్య రాత్రి అయింది. అయినా ఆ రసజ్ఞులకు అక్కడనించి కదలడానికి మనసొప్పడం లేదు.

ఇంతలో ఎవరో “ఇప్పుడు రాయలవారు ఏం చేస్తుంటారో?” అంటారు. నంది తిమ్మన నవ్వుతూ “ఏం చేస్తుంటారని చెప్పను? ఎక్కడున్నారో ఎలా చెప్పగలను? –

“భోజకన్యా సరిద్రాజహంసము, సత్య – భామా శుకీకేళ పంజరంబు,
జాంబవతీ నిశా చంద్రోదయంబు, కా – ళిందీ సరోజి నీందిందిరంబు,
భద్రా కలాపినీ ప్రావృడంబుదము, సు – దంతా రసాల లతా పికంబు,
మిత్రవిందా వనీ చైత్రాగమము, లక్ష – ణా హారయష్టిక నాయకంబు,

షోడశసహస్రకామినీస్తోమ ధేను
కా రిరంసా మదోత్కట వారణేంద్ర
మనఁగ సౌఖ్యాంబునిధి నోలలాడుచుండెఁ
గృష్ణుఁ డఖిలావనైక వర్తిష్ణుఁ డగుచు”

శ్రీకృష్ణుడు – రుక్మిణి అనే నదిలో ఈదే రాజహంస, సత్యభామ అనే ఆడచిలుకను తన ప్రేమ సల్లాపాలతో బంధించే పంజరం, జాంబవతి అను నల్లని కన్యకు చంద్రుని వంటి వాడు, కాళింది అనే పద్మముపై వాలే భ్రమరం, భద్ర అను నెమలికి వర్షాకాల మేఘం. సుదంతి అనే మామిడి లతకు/చిగురుకు కోయిల, మిత్రవింద అను వనానికి వసంత ఋతువుని తెచ్చే చైత్రమాసం, లక్షణ అను హారముల పేట వంటి స్త్రీకి హారం మధ్యలో ఉండే శ్రేష్ఠమైన రత్నం. ఆ అష్టభార్యలకే కాక పదహారు వేల మంది వలపు గల ఆడ ఏనుగుల వంటి స్త్రీలకు దర్పం కల, ప్రేమభావాన్ని కలిగిన గజరాజు వంటి వాడు” –

అంటూ తన పారిజాతాపహరణం లోని పద్యాన్ని చదివి “ఆ కృష్ణుడు ఏ మందిరంలో ఉన్నాడో చెప్పగలమా? అలాగే ఈ కృష్ణుడూనూ” అనగానే కొంచెం దూరంగా, చీకట్లో నుండి ఫక్కున నవ్వు వినపడుతుంది. ఆ నవ్వులో ఠీవి…

అందరిలో ఒక్కసారిగా సన్నని ఉలికిపాటు – సంతోషభరితమైనదే. ‘రాయలవారేనా ఏమిటీ చెప్మా! ఏమో!! అయి ఉండవచ్చు!!’

తన ప్రియతములైన వారి కోసం రాత్రుళ్ళు మారువేషంలో సంచరిస్తుంటాడుగా! – ఈ కవిరాజుల కంటే ఆ కవిరాజ చక్రవర్తికి ప్రియులెవ్వరు!?

**

నేను “అప్పుడు పుట్టి ఉంటే!?” ….

***

పాఠకులకు,
ఈ వ్యాసాన్ని వివిధ పుస్తకాలు, పత్రికలు, వ్యాసాలు చదివి రాశాను. ఈ వ్యాసంలో ఏవైనా మార్పులు/చేర్పులు ఉంటే తెలుపగలరు.

You Might Also Like

Leave a Reply