నేను పుస్తకాలు ఎందుకు చదువుతాను?

వ్యాసకర్త: దేవినేని మధుసూదనరావు
****************
చాలా కష్టమైన ప్రశ్న. నిజంగానా అంటే కానే కాదు, ఆలోచన చేస్తే ఆలోచించవలసిన ప్రశ్న.

మాది కృష్ణాజిల్లా, కంకిపాడు మండలం, తెన్నేరు గ్రామం. అక్కడ ఒక చిన్న గ్రంథాలయం ఉండేది. అప్పుడు దాన్ని గ్రామస్తులే నడిపేవారు. కొన్ని సంవత్సరాలు నడిపిన తరువాత దాన్ని ప్రభుత్వ జిల్లా గ్రంథాలయ సంస్థవారు తీసుకొన్నారు. కొన్ని సంవత్సరాలు బాగానే నడిచిన తరువాత నిధులు కూర్చక, కొత్త పుస్తకాలు రాక చదివేవారు తక్కువ అవటంతో గ్రంథాలయమును ఉపయోగించుకునే వారు తక్కువ అయినారు. ఇప్పుడు పుస్తకాలు తీసుకునే వారు చాలా తగ్గిపోయారనే చెప్పుకోవాలి.

నాకు పదేళ్ళ వయస్సులో మా నాయనమ్మ నన్ను భాండాగారానికి వెళ్ళి పుస్తకాలు చదవమని ప్రోత్సహించేది. నిదానంగా నేను పుస్తకాలు తెచ్చుకుని ఇంటి దగ్గరనే చదివేవాడిని. అప్పుడు, ఇన్ని రోజువారి, వార, నెలవారి పత్రికలు ఉండేవి కావు. చదవాలనే ఉత్సాహం కూడా తక్కువ. ఇప్పుడు చాలామంది వార్తాపత్రికలు చదవడానికే గ్రంథాలయాలకు వెళుతున్నారు. చందమామ, బాలమిత్ర, డిటెక్టివ్ విశ్వనాధ్ పుస్తకాలను ఎక్కువగా చదివాను. అలానే కాశీమజిలీ కథలను చదివేవాడిని. అవి కూడా చాలా నచ్చాయి. యుగంధర్ విశ్వభగవాన్ నాకు పెద్దహీరో. చాలా మెలకువలతో నేను ఆలోచించ లేనంతగా కథనాలు, సందర్భాలు ఉండేవి. నాకు చాలా ఉత్సాహంగా ఉండేవి. తరువాత అపరాధ పరిశోధన అని ఒక మాసపత్రిక కూడా నచ్చింది. ఇప్పుడు వస్తున్నట్లు లేదు. ఆ రోజులలో కూడా ప్రేమ తరహాలో కథలుండేవి కాని, కామోద్రేకం కలిగించే తరహాలో కథలుండేవి కావు. వాటికి అభిసారిక అనే మాసపత్రికుండేది. అది పెళ్ళి కాని పిల్లలకు నిషిద్ధం. గ్రంథాలయాలలో ఉండేవి కావు. స్తోమత కలిగిన వారు కొనుక్కొని చాటుగా చదివేవారనుకుంటాను.

ఈ రోజుల్లో వస్తున్న వారపత్రికలు, సినిమాలు చూస్తుంటే ఇంత బరితెగించిన కామోద్రేక ప్రేరిత కథలు అవసరమా అనిపిస్తుంది. ఇటువంటి కథల సంఘటనలతో చాలామందిలో మార్పువచ్చి, స్త్రీల మీద అఘాయిత్యాలు జరుగుచున్నాయి అని నా అభిప్రాయం. యువతను రెచ్చగొడుతున్నాయి. చెడు మార్గాలను సూచిస్తున్నాయి. టి.వి.లు వచ్చిన తరువాత డైలీ సీరియల్స్ ప్రసారాలకు అంతులేకుండా పోయినది. మన బాహ్య, అంతర ప్రవర్తన మారటానికి ఈ రోజున ఉన్న ప్రసార మాధ్యమాలే కారణం. దీని వలన ఆడపిల్లలు ప్రేమ ఉన్మాదంతో హత్యలకు గురి అవుతున్నారనేది నిర్వివాదాంశం. పుస్తకం చదివితే మనసు ఉల్లాసంగా ఉంటుంది. దానిలో నించి కొంత నేర్చుకోవడం ముఖ్య ఉద్దేశం. చాలా పుస్తకాలు చక్కటి జీవిత నాణ్యతా ప్రమాణాలు, విలువలు నేర్పించి చక్కటి పౌరులుగా తీర్చుదిద్దుతాయి.
నేను 16 లేక 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ (అమెరికా అధ్యక్షుడు) జీవిత చరిత్ర చదివాను. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. దానివలన అంతంతమాత్రంగానే చదువుతున్న నాకు బాగా చదువుకోవాలనే కోరిక కలిగింది. డిగ్రీలోను, సి.ఎ.లోను బాగా చదవగలిగాను. మంచి మార్కులతో మొదటిసారే ఉత్తీర్ణుడను అయాను.

మహాత్మాగాంధీ జీవిత చరిత్ర చిన్న వయస్సులో చదవకపోవడం నాదురదృష్టమే. మహాత్మాగాంధీ జీవితచరిత్ర ఇప్పటికీ చదవదగ్గదే. విద్యార్థులను చాలా ప్రభావితం చేయగలగిన ఆత్మకథ. ఈరోజు ప్రతి విద్యార్ధి తప్పక చదవాలని నా కోరిక.

నేను చాలా పుస్తకాలను కొంటాను. చదవాలనే ఉన్న చదవలేం కదా. ప్రతి పుస్తకం మీద ఖర్చు పెట్టే సొమ్ము విలువ వరకు దానిలోని విషయాన్ని సంగ్రహిస్తాను. నా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే వాటిని, కొత్త విషయాలను నేర్చుకునే పుస్తకాలన్ని తప్పకుండా చదువుతాను. నా స్నేహితులకు, తెలిసిన వారికి వాటిని కొని చదవమని ప్రోత్సహిస్తాను, ఇబ్బంది పెడతాను. చాలా పుస్తకాలను ఇతరులతో చదివించాలని వాటిని కొని ఇస్తాను. నా కోరిక ఏమిటంటే ఒకే విధమైన అభిప్రాయాలుకలవారు కలసి పుస్తకాలను చదివి వాటిని చర్చించితే బాగుంటుంది. దానివలన మనం ఇంకా తెలుసుకోవడానికి, జ్ఞానసముపార్జన పెంచుకోవటానికి దాని వలన ఆనందం పొందటానికి అవకాశం ఉంటుంది.

పుస్తకాలు ఏవి నచ్చుతాయంటే వయస్సుతోపాటు ప్రతివారి అభిరుచులు మారతాయి. నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణి, అరికపూడి కౌసల్యదేవి గారి పుస్తకాలు కాలేజిలో చదివేటప్పుడు, సి.ఎ. చదివేటప్పుడు, చదివి చాలా ఆనందించాను. చలంగారి స్త్రీ పుస్తకం చదివాను. ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం. సి.ఎ. ప్రాక్టీస్ చేస్తుండగా, వృత్తిపరమైన, యాజమాన్య సంబంధ పుస్తకాలు చదివాను. తరువాత ముద్రణారంగంలో ఉండగా దానికి సంబంధించిన పుస్తకాలు, యాజమాన్య నైపుణ్యాలు పెంచుకునే పుస్తకాలను చదివాను. కొత్త టెక్నాలజీస్ గురించి కూడా చాలా పుస్తకాలు చదివాను. ఇవి నన్ను ఏవిధంగా భవిష్యత్తు మారుతుందో, ఏవిధంగా ప్రపంచం మారుతుందో తెలియచెప్పాయి. ఇప్పుడు 60 ఏళ్ళ తరువాత సామాజిక విషయాలు, జీవిత కథలు ఎక్కువగా చదవటానికి ప్రయత్నం చేస్తాను. ఆధ్యాత్మికం మీద పెద్ద ఉత్సాహం లేదు. దీనికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక చిన్న పుస్తకం “విరాట్” చదవడం జరిగింది. ఇది మాత్రం నన్ను చాలా ప్రభావితం చేసింది. నాకు నచ్చిన పుస్తకాలను నేను సొంతంగా, ఇతర సంస్థలతో కలిసి 20 కి పైగా ముద్రించి పంచిపెట్టడం జరిగింది. బాలగేయాలు, పద్యపారిజాతాలు, కథాచిత్రాలు – బ్రతుకు పాఠాలు, నేర్చుకోవటానికి మొదటి పుస్తకం కొన్ని వేల కాపీలను చాలామంది పాఠశాల విద్యార్థులకు ఇవ్వటం జరిగింది.

అందువలన నాకు నచ్చిన పుస్తకాన్ని ఎక్కువ కాపీలను కొని స్నేహితులకు, తెలిసిన వారికి ఇచ్చి చదవమని ప్రోత్సహిస్తాను. వారిని రచయితతో సంభాషించమని వారికి ఆ పుస్తకంపై అభిప్రాయాలను తెలియచెప్పమని తెలియజేస్తాను. పుస్తకాలను చదవటం వలన నాకు ఉన్న సమయాన్ని గడపటం కష్టం కాదు. చాలామంది వృత్తిపరమైన పనులు విరమించిన తరువాత సమయాన్ని గడపలేక చాలా ఇబ్బంది పడతారు. పుస్తకాలను చదవటం ముందు నుంచి అలవాటు చేసుకుంటే జీవితచరమాంకంలో సమయాన్ని చక్కగా గడపటానికి దోహదపడుతుంది.
మంచి పుస్తకాలు మనల్ని ఉత్సాహవంతులుగా చేస్తాయి, విలువలు నేర్పిస్తాయి, స్నేహితుల్ని పరిచయం చేస్తాయి. ఎవరికైనా జీవితంలో చక్కగా బ్రతకటానికి సరిపడే వనరులున్నప్పుడు, పుస్తకాలు చదవటం కన్నా ఆనందం ఏముంటుంది?

నేను, నా 70 సం.ల వయస్సులో విద్యారంగం మీద కృషిచేస్తున్నాను. దీని వలన ఎక్కువగా విద్యారంగం మీద పుస్తకాలను చదువుచున్నాను. నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఈ పుస్తకాలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ పనిని ఇంకా 20 సం.రాల క్రిందట మొదలు పెట్టినచో, నేను సమాజానికి ఎంతో కొంత ఉ పయోగపడేవాడిననుకుంటాను. నేను ఈ విధంగా చదవటానికి ఎంతో మంది మిత్రులు సహాయం చేసారు, నన్ను చక్కటి బాటలో నడిపించారు, వారందరికి నా ధన్యవాదాలు.
కొన్ని పుస్తకాలు జీవితానికి అర్ధాన్ని, పరమార్థాన్ని బోధిస్తాయి, మనసుకు సంతోషాన్ని కలగజేస్తాయి. కొన్ని పుస్తకాలు మన జీవితాన్ని ఏవిధంగా మలుచుకోవాలో తెలియజేస్తాయి. మన జీవితం సక్రమంగా ఉండాలంటే ఇవి అన్ని ముఖ్యమైనవేగదా ! మా స్నేహితుడు ఒకరు చెప్పినట్లు “పుస్తకం నోరు విప్పని ఉపాధ్యాయుడు”, స్నేహితుడు కూడా.

చాలా సందర్భాలలో నలుగురు కలసినప్పుడు మాట్లాడే చాలా అనవసర విషయాలు మనసుకు కష్టం కలిగిస్తాయి. మనం స్నేహితులతో ఎక్కువసేపు గడపలేం, పుస్తకాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. దుఃఖాన్ని, ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాయి. మంచి పుస్తకం చదువుతుంటే మనకు సమయం కూడా తెలియదు.

దేవినేని మధుసూదనరావు, తెన్నేరు 521 260, కృష్ణాజిల్లా, మొబైల్ : 99890 51200, Email : mdevineni@gmail.com

You Might Also Like

4 Comments

  1. RP Bommareddy

    Excellent సర్.
    మీ అలవాటు ని మాతో పంచు కొన్నందుకు ధన్యవాదములు .
    అలాగే, మీరు ప్రతి ఊరులో గ్రంధాలయములు ఎలా మొదలు పెట్టొచో , ఎలా నడిపించవాచో వివరంగా వ్రాయండి సర్
    RP Bommareddy

  2. విజయభాను కొటే

    పుస్తక పఠనం యొక్క విలువను మీ జీవిత అనుభవాలతో జోడించి చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు.
    ఈ రోజుల్లో పుస్తకాలు చదవడం తక్కువ అయిపోతూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్లినా పుస్తకాలు పంచడం, పుస్తకాలు ముద్రించే పనికి పూనుకుని, అందరికీ ఉచితంగా పంచడం అందరికీ తెలిసిన విషయమే…మీరు పంపిన పుస్తకాల వల్ల నాలోనూ, నా స్కూల్ పిల్లలలోనూ చాలా మార్పు వచ్చింది. మా postman కి కూడా పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరిగింది.
    మీరు చేస్తున్న ఈ పుస్తక సేవ అమూల్యమైనది.

  3. Vijaya Bhanu Kote

    భలే భలే

  4. చంద్రబాల

    చాల బాగుంది. చక్కగ సూటిగ సుత్తి లేకుండ మీ పుస్తక నేస్తాలను పరిచయం చేసారు.ధన్యవాదాలు..

Leave a Reply