Second Chance by Robert T. Kiyosaki

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్
*****************

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ అనే పుస్తకం చదివిన వారందరికీ రాబర్ట్ కియోసాకి అనే రచయిత గురించి తెలిసే వుంటుంది. ‘సెకండ్ చాన్స్’ అనే ఈ పుస్తకం కూడా అతను వ్రాసిందే. తెలిసిన రచయిత అన్న కారణం కన్నా, ఈ పుస్తకాన్ని తిరగేస్తుంటే కలిగిన ఆసక్తి వల్ల దీన్ని కొనడం జరిగింది. మొదటి ముద్రణ 2015 జనవరి లోనే అయినా, నేను మాత్రం కొన్ని రోజుల ముందే దీన్ని పుస్తకాల షాపులో చూసాను. షాపులో తిరగేస్తుండగానే నచ్చడానికి కారణం, ఈ పుస్తకం ఎక్కువగా ‘ప్రశ్నలు – సమాధానాలు ‘ (Question & Answer) రూపం లో సాగింది. దానికి తగ్గట్టుగానే, చదువుతున్నప్పుడు శ్రమ లేకుండా తొందరగా ముగిసింది. ఈ రచయిత ఇంతకు ముందు పుస్తకాల్లాగానే, ఇది కూడా ఆర్థిక విషయాల గురించే ఎక్కువగా వుంటుంది.

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ అనే పుస్తకం మొదటి సారి చదివిన వారికి ఇతను చెప్పే విషయాలు కొత్తగా అనిపిస్తాయి. Asset and Liability లకి అతను చెప్పే అర్థాలు ఆలోచింపచేస్తాయి. కానీ ఈ పుస్తకం లో కూడా ఎక్కువగా, ఆ పాత విషయాలనే చెప్పినట్టు అనిపిస్తుంది. అదే కాకుండా, చెప్పిన విషయాన్నే, మళ్ళీ మళ్ళీ చెప్పినట్టు అనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఆర్థికంగా పాటించడానికి పనికొచ్చే విషయాలు ఏవీ ఇందులో లేవు. కానీ ప్రపంచ వ్యాప్తంగా, ఆర్థిక విషయాలు ఎలా మారుతున్నాయి అన్న విషయాల మీద అవగాహన పెంచుకోవడానికి ఈ పుస్తకం కొంతవరకు పనికొస్తుంది. అలా అని ఇది ప్రపంచ ఆర్థిక విషయాల మీద ఒక ఎక్స్పర్ట్ రిపోర్ట్ కాదు. మారుతున్న పరిస్థితుల మీద రచయిత కున్న అవగాహనతో వ్రాసిన పుస్తకం.

ఈ పుస్తకంలో ఎక్కువగా డిస్కస్ చేయబడ్డ అంశాలు:
1. 1929 లో అమెరికాలో వచ్చిన ఆర్థిక మాంద్యం, దాని తర్వాతి పరిణామాలు.
2. 1971 లో, నిక్సన్, అమెరికన్ డాలర్ కి బంగారాన్ని ప్రామాణికంగా తొలగించటం, దాని తర్వాతి పరిణామాలు.
3. ధనవంతులు, అధిక ధనవంతులుగా, పేదలు, నిరు పేదలు గా మారుతున్న పరిస్తితులకు గల కారణాలు.
4. వివిధ దేశాలు, తమ కరెన్సీ లను విపరీతంగా చలామణీ లోకి తేవడం, దానివలన ఇన్ ఫ్లేషన్ పెరగడం.
5. మధ్య తరగతి జీవన ప్రమాణాలు (అమెరికాలో) తగ్గటం.

ఈ విషయాల చుట్టూనే ఈ పుస్తకం మొత్తం తిరుగుతుంది. ఇంతకు ముందే చెప్పినట్టు, ఒక వ్యక్తిగత ఆర్థిక గైడ్ లా కాకుండా, విషయ పరిజ్ఞానం కోసం అయితే, ఈ పుస్తకాన్ని చదవొచ్చు. ఆ క్రమంలో మనకేమైనా ఉపయోగపడొచ్చు.

PS: ఈ పుస్తకం చదవకముందే, నేను నేర్చుకున్న పాఠం, ఆర్థిక విషయాల్లో నిగ్రహం. షాపులో ఈ పుస్తకం ధర Rs. 399/-. అక్కడే మొబైల్ లో చూస్తే ఫ్లిప్ కార్ట్ లో Rs. 248/- లకే దొరుకుతుంది. వెంటనే కొనకుండా మనస్సుని కంట్రోల్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే, తెల్లారే ఇంటికి వచ్చింది.

You Might Also Like

Leave a Reply