దోసిలి లోని అల & పిట్టస్నానం
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
*****************
తన నుంచి ప్రపంచం, ప్రపంచం నుంచి తను ఆశిస్తున్నదేంటో అనే విశ్లేషణ పరోక్షంగా కనిపించేవీ, తననుంచి తను, తనకోసం తను ఆశిస్తున్నదేంటో అనే విశ్లేషణ కలిగినవీ, ఒక పరిమిత సమూహం (కుటుంబం, సమాజం)లో పొందిక ఉండాలంటే అందులోని వ్యక్తులకు ఉండే హక్కులతో పాటు ఉండవలసిన కర్తవ్య స్పృహ ఏమిటీ అన్న విశ్లేషణ కలిగినవీ ఉన్న 11 కథలు “దోసిలి లోని అల” (బొగసె యొళగిన అలె) అనే కన్నడ కథా సంపుటి లోనివి. రచయిత్రి డా. ఎం ఆర్ మందారవల్లి.
కథల్లో నాటకీయత శృతి మించకుండా, పాత్రలు తప్పులు, ఒప్పులు చేస్తూ, ఆలోచనలో పడుతూ, పాత్ర స్వభావాలకు తగినట్టుగా తప్పొప్పుల వివేచన సహజంగా ఉంటూ ఉండడం వల్ల ఇవి కొంత ప్రత్యేకమైనవే అని చెప్పవచ్చు. పాఠకులను ఆకట్టుకుందుకు వర్ణనలు, మార్మికత తెచ్చిపెట్టుకోకుండా సాదాగా సాగిపోతాయి.
పై పై రూపాలకు, ప్రదర్శించుకునే గుణాలకు ప్రాధాన్యమిచ్చే లోకం యొక్క నిర్దాక్షిణ్య ప్రవర్తన, భర్త నాకెందుకు కావాలి, భర్తకు భార్య ఎందుకు కావాలి అనే వేదన, భరించనూ లేని, బయటకు చెప్పుకోనీయని ఆంతరంగిక సమస్యలూ, ఆచరణలో చూపాల్సిన ఆదర్శాలు, పనికి రావని తెలుసుకొని విడిచిపెట్టాల్సిన ఆదర్శాలు చర్చించబడినాయి.
పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు ఛార్జీలు, చదివింపులకు కష్టమైనా వెనుకాడని మధ్యతరగతి అతిథులం ఒకరికి కష్టం ఉంది తలో వందా ఇవ్వమని పేరుపేరునా ఉత్తరాలు వ్రాసినప్పుడు వచ్చే నామమాత్రపు రెస్పాన్స్ లేదా అదీ ఉండకపోవడాన్ని ఒక కథ చెప్తే, చదువుకుంటున్న వయసులో ఏవి మూఢనమ్మకాలంటామో, వాటినే తర్వాతికాలంలో ఎలా పెద్దవాళ్ళ సంతృప్తి కోసమో, నలుగురితో నారాయణా అనో ఎలా పాటిస్తూ,, తర్వాతి తరాలకు పాసాన్ చేస్తూ వెళ్తామో ఒక కథ చెప్తుంది.
నేడు రోజువారీ జీవితాల్లో ఉండే సంఘర్షణలు, భ్రమలు, సమస్యలు వీటన్నిటికీ కథా పరిధిలో వెదుక్కున్న ప్రతిక్రియలు ముఖ్యవస్తువుగా తీసుకోబడ్డ రచనలివి. చాలా గొప్పకథలకు నిర్వచనమేమిటో నాకు తెలీదు. గొప్ప రచనలని చెప్పబోవడం లేదు. చదవదగ్గ కథలు, కొద్దిగా మన వైపు చూసుకొని ఆలోచింపజేసే కథలు అని చెప్పగలను. రెండవసారి చదువుతున్నప్పుడూ ఎక్కడా స్కిప్ చేయాలనిపించకపోవడం అనే గుణం కలిగిన రచనా శైలి.
—
ఈ రచయిత్రి వ్రాసిన వ్యంగ్య వ్యాసాల సంకలనం ‘పిచ్చుక స్నానం‘ (గుబ్బచ్చి స్నాన) . అత్యుత్సాహంతో కొందరు కోరి తెచ్చుకున్న అయోమయ గందరగోళ పరిస్థితులను వినోదభరితంగా చెప్పిన తీరు బాగుంది.. శీర్షిక పేరున్న వ్యాసం అయితే స్నానం గురించి. హడావిడి జీవితాల్లో హాయిగా తీరికగా స్నానం చేయాలనే కోరిక ఎంతకాలమైనా ఎలా తీరలేదో చెప్పే వ్యంగ్య లేఖనం. పేరును ట్రెండీగా మార్చుకోవాలనుకునే ప్రహసనం భలే నవ్విస్తాయి.
Leave a Reply