ఈ పుస్తకాన్ని రికమెండ్ చెయ్యను. కానీ…

వ్యాసకర్త: వివిన మూర్తి

1990 దశకం మధ్యలో ఆరంభమైన ఆలోచనలతో రాసిన వ్యాసం 2006లో జగన్నాటకం అనే కథాసంపుటం ప్రచురించేనాటికి ఏదోలా ముగించాను. నా గురించి నాలుగు మాటలు అనే పేరుతో ఆ సంపుటంలో చేర్చాను. నిజానికి ఆవ్యాసం పూర్తికాలేదు. ఒక ప్రశ్న వద్ద ఆగిపోయింది. 

చైతన్యవంతుడైన వ్యక్తికి సమాజంలోగల పాత్ర ఏమిటి? అదీ ఆ ప్రశ్న. 

ఆవ్యాసం ముగించటానికి ఏదో రకమైన సమాధానం ఇచ్చుకున్నాను. కాని అది తృప్తి కలిగించలేదు. ఆ సమాధానం తప్పని కూడా నేను అనుకోలేదు. అనుకోలేను. 

‘చైతన్యం’, ‘వ్యక్తి’, ‘సమాజం’ అనే మూడూ స్పష్టంగా నిర్వచించుకున్నాకనే జవాబు సాధ్యమని నేను అందులో రాసుకున్నాను. ఆ మూడింటిలో చైతన్యం అనేదానికి నా నిర్వచన ప్రయత్నాలను తిరిగి గట్టిగా కెలికిన పుస్తకం ‘జరుగుతున్నది జగన్నాటకం’. ఇది అరిపిరాల సత్యప్రసాద్ రచన.

విశ్వాసం కరిగితే ఆలోచన అవుతుంది. ఆలోచన గడ్డకడితే విశ్వాసం అవుతుంది. ప్రపంచ గమనంలో రెంటికీ పాత్ర ఉంది. సమూహం విశ్వాసాల మీదనే కదుల్తుంది. వ్యక్తి ఆలోచనలమీదనే కదులుతాడు.  ఒక సమూహం చర్య ఒక వ్యక్తి తత్క్షణ ఆలోచనకి ఆజ్ఞానువర్తి కావటం అనే సందర్భం ఈ రచనలో మనకి తారసపడుతుంది. ఆ క్షణంలో వ్యక్తిని అర్ధం చేసుకోవాలంటే ‘అధికారం స్వభావాన్ని’ అవగతం చేసుకోవాలి. దానికి వెబర్ శ్రద్ధగా చదవాలి. 

2

నా ఆలోచనా జీవితంలో ముగ్గురు వ్యక్తుల పాత్ర ఉంది. వారిలో కాళీపట్నం రామారావు గారు ఒకరు. నేను ఆయనని కలిసేనాటికి సాహిత్యంలో ఒక ప్రధాన స్రవంతి ఉండేది. ‘సాహిత్యం సమాజహితాన్ని కోరాలి. అది దాని బాధ్యత.’ అనేది ఆ ప్రధాన స్రవంతి. ఆనాటి నా మనస్థితి ఒక పద్యం చెపుతుంది.

సాహిత్యం అక్షరాల 

మాహాత్మ్యం  కార్యహీన మాన్యతముల పౌ

రోహిత్యం సత్య ధైర్య

రాహిత్యం కీర్తికి సుఖరాజ పధంబే

ఇది నా 20వ ఏట 68లో రాసినది. ఆ ఆలోచనకి ఆనాటి చోదకశక్తి వేరు. తదనంతర కాలాల స్థితి వేరు. కాకపోతే ఆ ఆలోచన నన్నెంతగా నడిపిందో నడుపుతున్నదో నాకుమాత్రమే తెలుసు. ఆ ఎరుకకి కారణమైనది ఆనాటి సాహిత్యపు ప్రధానస్రవంతి. ఆ ఎరుకని ఏనాడూ ఒక గొప్ప విలువగా కూడా నేను భావించలేదు. ఊపిరి తీసుకోటం మలం వదలటం ప్రాణికి ఎంత అవసరమో నాకు రాత అంత అవసరం. కనక రాసాను. రాసినదాంట్లో ముగించినవీ తక్కువే. ముగించిన వాటిలో ప్రచురణా ప్రయత్నాలు చేసినవీ తక్కువే.

ఆనాటి ప్రధానస్రవంతికీ నాకూ ఉన్న ఘర్షణని సమన్వయపరచటానికి కారా మాస్టారు చాలా ప్రయత్నించారు. వారా ప్రయత్నంలో చేసిన వాదనలలో నన్ను కొంత మార్చినదొకటుంది. ఒక ప్రమిద మరో ప్రమిదని వెలిగిస్తుంది. నేను వెలిగించిన ప్రమిద ఏమైనా ఉందో లేదో నాకు తెలీదు కాని నన్ను కొన్ని ప్రమిదలు వెలిగించాయి. వాటిలో మొదటిది దొస్తోవిస్కీ నేరమూ శిక్ష. అది నన్ను కుట్టిన క్రిమి. ఒక జబ్బు. ‘సుఖమివ్వదు. దుఃఖం తప్పదు. అయినా నేను ఆలోచననే ఎంచుకుంటాను.’ అంటాడు వోల్టేర్ గుడ్ బ్రాహ్మిన్. నా వశంలో ఉంటే ఆ కథలో ముసిలమ్మలా సాధారణమైన బ్రతుకు నేను ఎంచుకుంటాను. నేను అన్నీ మరిచిపోయి ఆలోచననీ, రాతనీ వదిలేసి జీవించాలని ఎంతగానో కాంక్షించాను. కాని నన్ను ఏదో క్రిమి కుడుతూనే ఉంది. ఇప్పుడు నన్ను కుట్టిన క్రిమి ఈ ‘జరుగుతున్నది జగన్నాటకం’. నేను మధ్యలో వదిలిన అనేక రచనలు కొనసాగించాలన్న వెర్రి ఆవేశం కలిగించిందీ రచన.

3

ఇంతకీ ఏముందా పుస్తకంలో?

కళా వ్యాకరణ దృష్టితో నేను చెప్పదలుచుకోలేదు. 28-10-2012న ఐర్లాండ్ దేశంలో కవిత హలప్పనవర్ అనే ఐదు నెలల గర్భిణీ స్త్రీ మరణించింది. వైద్యులు అబార్షన్ చేయగలిగితే ఆమె బ్రతికే అవకాశం ఉంది. అది చట్ట విరుద్ధం. ఈ ఘటన కలిగించిన ఆలోచనల ఫలమే ఈ రచన అంటారు సత్యప్రసాద్.

ఈ ఘటనని అనేకమంది చదివి ఉంటారు. వారిలో కొంతమంది దుఃఖంతో ఆవేశపడి ఉండొచ్చు. వారిలో అధికశాతం ‘సభ్య సమాజం తలదించుకుంది. ఇరవయ్యొకటో  శతాబ్దంలో అనాగరిక శాసనాలు. మతం మనిషికి మత్తుమందు.’ వంటి జర్నలిస్టిక్ రాతలతో ఏకీభవించిఉంటారు. కొందరు కవిత్వాలు కథలు రాసి ఇదంతా అనాగరికమనే తీర్పు ఇచ్చి తమ వేదన వ్యక్తం చేసుకునే అవకాశమూ ఉంది. కాని చాలా కొద్దిమంది ‘చట్టాలు ఎందుకు వచ్చాయి. మతాలకి మనుషులని ఆపే శక్తి ఉందా? చట్టానికి ఉందా? ఏది న్యాయం పదిమంది శిశువుల హత్య జరగకుండా చూడటమా ఒక ప్రాణం రక్షించటమా చట్టం ఏం చేయాలి. ఏం చేస్తే అది మెచ్చదగ్గ చట్టం అవుతుంది వంటి ప్రశ్నలు వేసుకుని మధన పడతారు. అలా పడి కొందరు దానిని కథీకరించబోతారు. వారిలో ఒకరు సత్యప్రసాద్.

  వారిలో కలిగిన మధనని చాలా బలంగా చెప్పారు. ఒక ఘటన నుంచి ఒక సార్వకాలిక సార్వజనీన చర్చకి రచయిత ప్రయాణమే ఈ రచన. ఇద్దరు మిత్రులు మూడో వ్యక్తి విడాకులపై గొడవతో ఈ రచన ఆరంభం. అది ఒక అల్పమైన (trivial) కారణం అని ఒకరంటారు. అలా  జడ్డ్ చేయటం సరేనా అని మరొకరు. ఇలామొదలైన చర్చ తిరుగుబాటు పైకి చేరుతుంది. అహింసతో తిరగబడతాడు గాంధీ. ఆయుధంతో తిరగబడతాడు బోసు. స్థల, కాల, సందర్భాల ప్రమేయం లేకుండా ఏదో ఒకటి సరైనదని తేల్చదగునా అని ప్రశ్నిస్తాడు రచయిత. చర్చ సాగుతుంది. విశ్వాసానికీ ఆలోచనకీ మధ్య ఊగుతూ కథా ఘట్టాలు నడుస్తాయి. ‘ఒకేఒక క్షణం. ఒకేఒక వ్యక్తి. ఒకేఒక నిర్ణయం.’ వద్ద ముడితో చర్చ ఒక తాత్విక ప్రశ్నని మన ముందుంచుతుంది. నేనైతే అక్కడ వదిలేసేవాడిని. 

పేంటసీకి వాస్తవానికీ మధ్య నడిపిన కథ వాస్తవమనిపించాలనే ఫీలింగుతో రచయిత ముగించాడు.

నా అవగాహన మేరకు దానికి కారణం ఇది.

తెలుగు సాహిత్య చదువరి రచయితకి ఒక భరోసా ఇవ్వలేకపోయాడు.  ‘నువ్వు రాయి. నన్ను అలరించటమే కాదు. ఆవేశం కలిగించటమే కాదు. ఆలోచింపజెయ్యి. నేను ఆలోచిస్తాను మిత్రమా ’ అనే భరోసా. చదువరి విశ్వాసాలకి అనుగుణంగా కన్నీరు పెట్టించవచ్చు. పిడికిళ్లు బిగింపజేయవచ్చు. శాపనార్ధాలు పెట్టించవచ్చు. కుటుంబ వ్యవస్థ పట్ల ప్రేమనో అసహ్యాన్నో కలిగించవచ్చు. వివాహవ్యవస్థ పట్ల కామం పట్ల ఉన్న స్థితిలోని లోపాలను చూపించవచ్చు. దానికి బాధ్యత ఏదో ఒక సమూహంపై నెట్టెయ్యవచ్చు. రొడ్డకొట్టుడు పదాల విచ్చలవిడి వాడికతో ఎలాంటి ఆవేశాన్నైనా కలిగించవచ్చు. పదాల అమరికతో వాక్య నిర్మాణ వైచిత్రితో రచయిత చదువరికి దైవం కూడా అయిపోవచ్చు. కాని మౌలిక తాత్విక చర్చలకి వాడిని పురికొల్పలేడు. ఒకచోట కారా మాస్టారు అంటారు. ‘రచన సాఫల్యతకి సంబంధించిన బాధ్యత రచయితల పైనే కాదు పాఠకులపైనా ఉంటుంది.’

అటువంటి స్థితి తెలుగు సాహిత్యంలో ఉంటే అరిపిరాల సత్యప్రసాద్ ఈ రచనని ఇంకా లోతుగా రాయగలిగి ఉండేవాడని నేను భావిస్తున్నాను. 

4

ఈ పుస్తకాన్ని చదవమని నేను రికమెండ్ చెయ్యను. రికమెండ్ చేసేంత సెలబ్రిటీ స్టేటస్ నాకు లేదు. కాని ఆలోచనాపరులు దీనిని చదివి ఆలోచనకి దిగకపోతే ఎంతో కొంత నష్టపోతారని మాత్రం చెప్పగలను.

ఇవి సృజించాడు కనక ఇంకెన్నో సృజించగలవన్న భరోసానీ, సృజించవలసిన బాధ్యత ఉందన్న సందేశాన్నీ సత్యప్రసాద్ కి నేను ఇవ్వదలుచుకోలేదు. ఇది చదివే పాఠకులు ఉంటే వారు దీనిని సద్వినియోగం చేసుకోగలిగితే వారికి నేను చెప్పేదొకటే. ‘ఎదిగే మొక్కని ఫలానీలా ఎదగాలనీ ఆదేశించలేం కదా. అలాగే సృజనని కూడా నియంత్రించలేం. నిర్మాణమైతే దాన్ని నియంత్రించవచ్చు. మొక్క కూడా తన కాలపు వనరులనే స్వీకరించి పుడుతుంది. కాస్తుంది. ముగుస్తుంది. మరో మెక్కకి విత్తనం వదిలి వెళుతుంది.’ 

కనక సత్యప్రసాద్ సృజన సర్వతోముఖ వికాశం కోసం ఎదురుచూద్దాం.

You Might Also Like

Leave a Reply