త్యాగరత్న – విద్యాసుందరి, బెంగుళూరు నాగరత్నమ్మ (1872-1952) జీవితాధారిత నవల
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ఏప్రిల్ 7, 2019 న జరిపిన చర్చలో పాల్గొన్న వారు: మద్దిపాటి కృష్ణారావు, పిన్నమనేని శ్రీనివాస్, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, నర్రా వెంకటేశ్వర రావు, వడ్లమూడి నరేంద్ర ప్రసాద్, శంకగిరి నారాయణస్వామి, ఆరి సీతారామయ్య, కోటంరాజు సుజాత
చర్చ లో ముఖ్యాంశాలు సమీక్షించిన సభ్యులు: వడ్లమూడి నరేంద్ర ప్రసాద్, పిన్నమనేని శ్రీనివాస్
త్యాగరత్న – విద్యాసుందరి, బెంగుళూరు నాగరత్నమ్మ జీవితాధారిత నవల
కన్నడ మూలం – ‘కపిల హరిదళు కడలిగె’ (కపిలా నది ప్రవిహించెను కడలికి)
రచన: ఆచార్య మాలెయూరు గురుస్వామి
తెలుగు అనువాదం: రంగనాథ రామచంద్రరావు
సంగీతం ద్వారా త్యాగయ్య (మే 4, 1767 – జనవరి 6, 1847)కు, తద్వారా తెలుగు భాషకి సేవచేసిన మహిళా సంగీత విద్వాంసులలో మొదటి వారు – “త్యాగ రత్న” బెంగుళూరు నాగరత్నం. కన్నడ సీమలో జన్మించి, సంగీత నాట్యాలతో దక్షిణ భారతాన్ని ఏలి తెలుగు పాటైన కర్ణాటక సంగీతాన్ని నిలిపిన మహిళా రత్నం. ఇప్పటికీ కొనసాగుతున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలకి తన సర్వము ధారపోసి మళ్ళీ జీవం తీసుకొచ్చిన వారు బెంగుళూరు నాగరత్నం. మహిళలు అప్పటి త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాడకూడదన్న అనైతిక సంప్రదాయాన్ని ప్రశ్నించి, కుల వ్యవస్థని ఎదిరించి, లింగ వివక్ష ని తట్టుకొని, వేరొక నిజమైన ఆరాధనోత్సవాన్ని మొదలు పెట్టించి, నిలబెట్టి ఎందరో తనలాటి దేవదాసీలకి, మహిళా సంగీత కారులకుక (సుబ్బలక్ష్మి), పక్క వాద్యకారుల (నాదస్వరం)కి అవకాశాలు కల్పించిన ధీర వనిత. కర్ణాటక సంగీత వ్యాప్తికి జీవితాన్ని అంకితం చేసిన సంగీత కళానిధి. ఒకప్పటి సమాజ అవసరాలకు సృష్టించుకున్న కులాలు ఎక్కువగా పురుషులు చేసే వృత్తుల ద్వారా నిర్ణయించబడినవే. కళలలను నమ్ముకుని, దేవాలయ సేవకి స్త్రీలు ప్రదానము గా సృష్టించిన కులము ‘దేవదాసి’. సమాజాములో జరిగే మార్పుల వల్ల అన్ని కులాలు ఎంతో మార్పులు లేక ఒడిదుడుకులు చెందడం సహజం. ఈ ‘దేవదాసి’ కులము మాత్రం వారి కుదురు ఐన దేవాలయాల నుండి గెంటి వేయబడి వారి భృతికి ఎటువంటి దారి చూపకుండా ఒకప్పుడు ఎంతోకొంత బాగున్న ఆ కుల నిర్మూలనకి (ఎవరో కొందరు దారి తప్పారని దేవదాసి కి పర్యాయపదం వేశ్య అని ముద్ర వేసి) అన్ని పురుష కులాల వారు ప్రయత్నించడం విచారకరం.
కపిలా నది కేరళలో పుట్టి, మైసూరు నుండి ప్రవహించి కావేరితో సంగమించి, కావేరి ద్వారా కడలిలో లీనమైంది. రచయిత ఆచార్య మాలెయూరు గురుస్వామి ఆవిడ పూర్తి సంగీత జీవితాన్ని కపిలా నది తో పోల్చి సామాన్య నేపథ్యం లో కళనే నమ్ముకొని దేవదాసి పుట్టలక్ష్మి కూతరు రత్నగా, నాగరత్నగా, నాగరత్నమ్మ, నాగరత్నమ్మాళ్ నుండి చివరికి త్యాగరత్నగా మారి సంగీత సాగరం లో ఎలా లీనమైనది 5 విభాగాలు నవలగా సరళంగా వివరించారు. రంగనాథ రామచంద్రరావు గారి తెలుగు అనువాదం చాలా చక్కగా ఉంది. రంగనాథ రామచంద్రరావు గారు ఈ నవల ద్వారా శత సంవత్సర దేవదాసి చరిత్రని సరళ గ్రాంథికం లో రచించటం లో కృతకృత్యులు అయ్యారని భావించవచ్చు. కథాంశం ధృడత్వం దృష్ట్యా పాఠకుడి దృష్ఠి రచనా, భాషా పరమైన అంశాల కంటే విషయం మీదకు మళ్ళించబడినది. రచయత నూతన తెలుగు పదాలను పరిచయం చెయ్యటం లో దిట్ట. సాహిత్య సంగీత విషయాలని సులభతరమైన పదాలతో పాఠకులకు వివరించటం జరిగినది. సామాజిక స్పృహ, అభ్యుదయ భావాలు కలిగిన పాఠకులు చదువదగిన నవల అని చెప్పవచ్చు.
సమాజాములో జరిగే మార్పుల వల్ల దేవదాసీ వ్యవస్థ ఉచ్చ స్థితి నుండి ఎలా పతనమైంది, ఆ పతనా వ్యవస్థ చివరి తరాలలో ఎలా బాధలు అనుభవించింది, నాగరత్నం తల్లి పుట్టలక్ష్మి ద్వారా నుండి కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. అప్పటి సమాజంలోని రెండు ప్రధాన వివక్షలను (కులం, లింగ) అర్థం చేసుకుని చారిత్రకంగా ఆ వ్యవస్థల్లో వచ్చిన మార్పులనూ, ఆ మార్పులు సంభవిస్తున్న కాలంలో వ్యక్తుల జీవితాలలో చోటుచేసుకున్న సంక్షుభిత సందర్భాలనూ పాఠకులకు పరిచయం చేయటం బాగుంది. ఆనాటి సంగీత వైభవం, ఆ కచేరీలు, నాటి కళాకారుల ఆహార్యం, ఆ వైభవం చదువుతున్నంత సేపు ఆరోజులలో విహరించిన అనుభూతి, వాటిని చాలా అందంగా పొందుపరిచారు.
నాగరత్నమ్మ ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా కళ మీద నిబద్దత, చివరివరకూ విద్య నేర్పిన గురువుల మీద చూపించే భక్తి, గౌరవం మెన్న దగిన లక్షణం. ఆవిడ జీవిత చరిత్రను నవలగా వ్రాయడంలో సహజత్వం కంటే ఉత్ప్రేక్షలకు అవకాశం ఎక్కువయ్యింది కదా అనిపించింది. అందువల్ల వాస్తవాలను అనవసరంగా మరుగు పరచారేమోననిపించింది. మనలో ఎవరికీ అసలు చరిత్ర మీద అవగాహన లేకపోయినా రచయిత కప్పదాట్లను సూచించవచ్చు. ఉదాహరణకు, త్యాగయ్య సినిమా టైటిల్స్ లో నాగరత్నమ్మ గారి పేరు లేక పోవడం. ఒక ఇల్లే కట్టించి ఇచ్చిన నాగయ్య, సినిమాలో ఆవిడ పేరు లేకుండా చేస్తాడా? అనిపించింది. ఇంకొక చోట నాగరత్నమ్మ తండ్రి సుబ్బారావు ఆమె పుట్టిన సంవత్సరము లోనే పుట్టలక్ష్మి ని పట్టించు కోలేదని రాశారు.
** రత్న **
చరిత్రలో దేవదాసి సమూహము ఎలా మొదలైనది, పుట్టలక్ష్మి పూర్వీకులు నంజుడేశ్వరుని ఆలయానికి రంగభోగపు వృత్తికి వచ్చిన పరిస్థితి చెప్పారు. ఆలయం లో వారి వృత్తిని పురజనులు ఎలా నీచానికి దిగజార్చిన విధము ఊహించి చెప్పారు. తరువాత కాలం లో ఆలయ పురోహితులు దేవదాసిలని ఉపపత్నులుగా మార్చిన సంప్రదాయాన్ని దాని వల్ల వచ్చిన ఇబ్బందులని “మాస్తి వెంకటేశ్వర అయ్యంగారు” రాసిన కథ “జడ నంజుడేశ్వర” ద్వారా ఉదహరించారు.
ప్రభుత్వ అధికారుల వల్ల పుట్ట లక్ష్మి చిన్న తనంలో తల్లి వెంకట లక్ష్మి ఆలయ ప్రాగణం నుండి అగ్రహారానికి మారవలసిన పరిస్థితి వచ్చింది. పుట్ట లక్ష్మి యుక్త వయస్సు వచ్చాక మైసూరు మహారాజు నంజుడేశ్వర దర్శనానికి వచ్చినపుడు జరిగిన నృత్య సంగీత కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో ఆ ప్రాంతం లో వకీలు వృత్తిలో ఉన్న సుబ్బారావు ఆశ్రయం లోకి (రాజుగారి సూచనతో) చేరారు. వారికి 1878లో నవంబరు మూడవ తేది మైసూరికి సమీపములోనున్న కపిలా నదీతీరములో ఉండే నంజన్‌గూడులో “రత్న” గా పుట్టింది. రత్న మొదటి విద్యా గురువు చిక్కలింగయ్య కన్నడ, సంస్కృతాలు నేర్పగా, సంగీత, సాహిత్యాల తో పాటు గమకం లో ప్రసిద్దమైన గిరిభట్ట తమ్మయ్య వద్ద శిష్యరీకం మొదలైనది.
పుట్ట లక్ష్మి ఎంత మంచి వారి ఆశ్రయంలో ఉన్నా, తమ విలువ తమ ఇంటికి ఒక పాలు పోసుకొనే దొడ్డమ్మ కూతురు పెళ్ళికి కూడా వెళ్లలేని పరిస్థితి. అక్కడి నది వొడ్డున వెలిసిన చాముండేశ్వరి దేవి (శివునికి ప్రియురాలు, బార్య పార్వతీ దేవి వున్నా) దేవాలయం వెలిసిన కథలో అక్కడి హరిదాసు చెప్పిన మాట “కట్టుకున్నది కడదాకా, ఉంచుకున్నది ఉండేదాకా” అన్న మాట పుట్టలక్ష్మి కి స్వానుభవం మీద తెలిసింది. రత్న శిష్యరీకం ఇంకా మంచి వారి దగ్గర జరగాలి అని (సుబ్బారావు కుటుంబ వ్యవహార రీత్యా కూడా) మైసూరుకి మార్చడమైనది .
** నాగరత్న (నాగిని – పాము తలపైన రత్నం) **
1892 లో సాంస్కృతిక నగరమైన మైసూర్ ప్రయాణం. అక్కడ నవరాత్రి కి మొదటి రంగప్రవేశం. ఇంటిదగ్గర గురువు వాయులీన విద్వాంసుడు – మునిసామప్ప (అతని గురువు కృష్ణస్వామి భాగవతర్, ఇతడు త్యాగరాజు ఆప్త శిష్యుడైన వాలాజాపేట్ వెంకటరమణ భాగవతర్ కొడుకు) శిక్షణ. ఆంగ్లము, తెలుగు, తమిళ భాషలలో విద్వాంసులలో ఒకరైన బిడారం కృష్ణప్ప వద్ద శిష్యరీకం. నాట్యాచార్యులైన కిట్టణ్ణచే నృత్యాభ్యాసము, తిరువేంగడాచారిచే అభినయకౌశల్యము పొందజేశాడు. కోలారు కిట్టప్ప గారి వద్ద నుండి నృత్య శిక్షణ. విద్వాంసుడు, ప్రముఖ కవి గిరి భట్ట తమ్మయ్య ద్వారా గమకంలోనూ, సంసృతం లో మంచి పట్టు సంపాదించారు. తద్వారా తన కచేరీలలో సంస్కతం లో గమకి గా (ప్రాచీనకావ్యాలలో పద్యాలనూ, శ్లోకాలను రాగయుక్తం గా చదివి, విశేషాలను వివరించడం) చేయగలిగి, కన్నడ సాహిత్యము లో విశేష కృషి చేసి జైమిని భారతం, రాజశేఖర విలాసం మరియు కుమార వ్యాస భారతం అవపోసన పట్టి మంచి వివరణ తో కచేరీలు చేసి “విద్యా సుందరి” అని పేరు సంపాదించారు. రాజ ఆస్థానం లో కచేరి చేయగలిగి “కోటగుంపు” నుండి గుర్తింపు పొంది, సాహిత్యం లో కచేరీలు చేసి “అగ్రహారపు గుంపు” నుండి కూడా మెప్పు పొందగలిగినది. రాజభవనం మంటలలో కాలి పోయి చూడడానికి వచ్చిన ఫిడేలు విద్వాంసుడు నాగరత్నకు మేనమామ వెంకటసామి సలహా మీద 1894 వ సంవత్సరం మైసూరు నుండి బెంగళూరు ప్రయాణం అయ్యారు.
** నాగరత్నమ్మ (భోగిని) **
బెంగుళూరు లో మేనమామ మాట ప్రకారం సంగీతం తో పాటు తమిళం,తెలుగు, ఆంగ్ల బాషల మీద దృషి పెట్టి శిక్షణ తీసుకున్నారు. తిరువేంకటాచారుల నుండి నాట్య శిక్షణ కూడా పొందారు. సూర్యోదయం నుండి సూర్యాస్త మయ్యేవరకు నిరంతర శిక్షణ వల్ల గానంవల్ల కంఠఐశ్వర్యం సిద్ధించి, నృత్యం వల్ల దేహపు ఐశ్వర్యం పొంది గొప్ప కచేరీలు ఇవ్వగలిగే స్థాయికి చేరారు. ఆ కాలంలో సాంస్కృతిక నగరమైన మైసూరు తో పోలిస్తే బెంగుళూరు లో గొప్ప కళా కారులు లేరు. నాగరత్నమ్మ లాటి కళాకారిణి కి అక్కడ పోటీ లేదు. నగరం నిండా ప్రతి విశేషం లోనూ తన సంగీత నృత్య కచేరీలతో విరామం లేకుండా కార్యక్రమాలు జరిపారు. చిక్కపేటలో శాహుజీ గారి మేడ మీద జరిగిన కచేరీలో జస్టిస్ నరసింహారావు గారి తో పరిచయము జరిగింది. తల్లి మరణం తరువాత జస్టిస్ నరహరిరావు గారి ఆశ్రయము లో అత్యంత ఖరీదు ఐన సంగీత కచేరీలు ఇవ్వడం మొదలు పెట్టారు. సమాజము లో ఉన్నత పదవి లో ఉన్న జస్టిస్ నరసింహారావు నాగరత్నమ్మ ఇంటి చుట్టూ తిరుగుతున్నది విని వారిని దివాన్ శేషాద్రి అయ్యర్ సున్నితంగా మందలించారు. ఆ తరుణం లో ఏర్పడ్డదే ఆనంద శిఖరం (‘మౌంట్ జాయ్’) వేదిక, ఇప్పుటికీ ఉన్న ‘నరహరిరావు గుట్ట’ మీద నాగరత్నమ్మ సంగీత నృత్య ప్రదర్శనలు శాశ్వత వేదిక అయినది. తెలుగు నాట కూడా తన ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు. నరహరిరావు మాట లక్ష్య పెట్టకుండా తిరుపతి కచేరీకి వెళ్లడం ఆవిడ స్వాభిమానము తెలుస్తుంది. 1902 ప్రాంతము లో నరహరిరావు సలహా మీద కళాకారుల పుట్టిల్లు ఐన మద్రాసు నగరానికి వెళ్ళడానికి నిశ్చయించారు.
** నాగరత్నమ్మాళ్ (రాగిణి) **
1903 – ఇరవైయైదు ఏళ్ళ వయస్సులో నాగరత్నమ్మ మద్రాసుకు చేప సముద్రానికి వచ్చినట్టు వచ్చారు. రాజారత్నం మొదలియార్ ఆశ్రయం లో మద్రాసు లో ఉండే కళాకారుల వివరాలు పరిచయాలు జరిగాయి. తన మొదటి కచేరీ ఇచ్చేలోగా మద్రాసు లో జరిగే అన్ని మంచి కచేరీలకు వెళ్లి సంగీత రసికుల అభిరుచి, సూక్ష్మాలను గమనించడం, గాయకుల వ్యక్తిగత విశిష్టాలు అర్థం చేసుకోవడం మీద నేర్చుకో గలిగారు. బొబ్బిలి రాజా వారి సమక్షము లో మొదటి కచేరీ చేసి అందరి మన్ననలు అందుకున్నారు. గురుభక్తి తో తాను కట్టిన కొత్త ఇల్లు గృహప్రవేశ సందర్భములో తన గురువులైన బిడారం కృష్ణప్పగారిని ఆహ్వానించి పురందరదాసాది వాగ్గేయకారులచే రచించబడిన కన్నడ గీతములను మాత్రమే పాడించినది. గురువు చేతనే నాగరత్నమ్మాళ్ అని ప్రశంస పొందిన గొప్ప శిష్యురాలు. తెలుగు ప్రాంతమైన రాజమండ్రిలో గండపెండేరానికి ఆహ్వానించ బడిన మొదటి మహిళ. అన్ని సౌందర్యాల కన్నా విద్యా సౌదర్యమే గొప్పదన్న అవగాహన కలిగి పలు భాషలలో ప్రావీణ్యం గణించి “విద్యావతి” గా పేరు గాంచిన ప్రదేశం. ఆ సంస్కృత సభలో ప్రముఖ తెలుగు కవి శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి ప్రసంగం లో జరిగిన పొరపాటుని దిద్ది అప్పటి సమాజంలో దేవదాసీ వ్యవస్థని రూపు మాపాలని ప్రయత్నించిన పెద్దలు, అప్పటి దేవదాసీలకు (వేశ్యకు పరియాయ పదం గా మార్చి) ఎటువంటి జీవన ఆధారాలు చూపకుండా వారిని ఎన్ని కష్టాలు పెట్టినది మొదలు పెట్టి సమాజంలో తక్కువ కులాల కంటే కూడా తక్కువగా చిత్రీకరించిన విధానం మీద పోరాడి క్రాంతి కారి మహిళ అనే పేరు తెచ్చిపెట్టుకున్నారు. సంగీత పరిశోధకురాలు గా తన వలే ముందు తరపు ముద్దు పళని (దేవదాసి) రాసిన ‘రాధికా సాంత్వనము’ మూల ప్రతిని వెతికి సంపాదించి తానే పరిష్కృత, సమగ్ర కృతిని వెలువరించి మద్రాసు లోని మేధావి వర్గపు కోపాలని చవిచూశారు. అప్పటి సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు వర్గంతో వైరం తెచ్చుకొని పోరాడి నిలబడగలిగిన ధీర వనిత. వీరేశలింగం పంతులు అనే శిఖరాన్ని ఎదురై నిలచి ‘శీలం’ మరియు ‘అస్లీలత’ అనే విషయాలకు పెద్ద చర్చకు కేంద్ర బిందువు అయ్యి ‘అమ్మాళ్’ అయ్యారు. అప్పటికే మద్రాసు నగరం లో ఇన్కమ్ టాక్స్ కట్టిన మొదటి ఏకైక సంగీత విదుషీ మణి నాగరత్నమ్మాళ్. ప్రతి పండుగ సమయంలో పూజ తరువాత తన స్వంత ఇంటిలో మహిళల కోసమే ‘నాదనైవేద్యం’ లాంటి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉమయాళపురం కేశవభాగవతార్ కటిక పేదరికం లో తన గురువు (త్యాగరాజు ప్రశిష్యులు) తనకు ఇచ్చిన త్యాగరాజు చిత్ర పటం ఇచ్చి ఆమె జీవిత గమనాన్ని మార్చారు అనిపించింది. తన గురువైన బిడారం కృష్ణప్పగారి ఉత్తరములో త్యాగరాజ సమాధి జీర్ణోధారణ విన్నపం తో ఆవిడ తన జీవిత ఆశయాన్ని గమనించ గలిగారు. దానితో కుటుంబ జీవనానికి విసిగి బిడారం కృష్ణప్ప గారి సూచనతో త్యాగరాజ సమాధి జీర్ణోధారణ కార్యానికి నడుం బిగించారు.
ఈ నవలతో బెంగుళూరు నాగరత్నమ్మ గారి గురించి ఇంటర్నెట్ లో వెతికితే మంచి పరిశోధనా వ్యాసం ఈ పుస్తకం తో పాటు జెజ్జాల కృష్ణ మోహన రావు గారి “ఈ మాట” వ్యాసం కూడా చదివాము.
ఆవిడ కచేరీలకు వెళ్లి ఆవిడతో పరిచయం ఉన్న దేవనహళ్లి వెంకటరామయ్య గుండప్ప (1887-1975) గారి “జ్ఞాపకచిత్రశాల” నుండి మంచి వ్యాసాన్ని కూడా చదివాము. ఈ పుస్తకం లో ఆవిడ సంతానాన్ని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసము లో ఒక సంతానము పుట్టి పోయారని, దేవనహళ్లి వెంకటరామయ్య గుండప్ప (డి.వి జి ) గారి వ్యాసము లో ఇద్దరు పుట్టి పోయారని చెప్పారు. పెంచు కున్న వారు కూడా ఎవరూ చివర వరకూ ఉండలేదు. ఒక బాలికను (శారద) పెంచుకొని, ఆ బాలిక తల్లిదండ్రుల విష ప్రయోగానికి లోను అయ్యారు.
** త్యాగరత్న(విరాగిణి) **
తంజావూరు నుండి తిరువైయారుకు మూడు కోసుల దూరం. ముగ్గురు సంగీత త్రిమూర్తుల సాధన భూమి, తన గురువైన రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ గారి గురువులైన పట్నం సుబ్రమణ్య అయ్యర్ గారి నివాసమున్న పట్నము ఐన తిరువైయారు మట్టిలో లో గుర్రపు బండి ప్రయాణం చేయడం ఇష్టం లేక ఆ గ్రామ ముఖ ద్వారం నుండి నడిచే బయలుదేరి త్యాగరాజ సమాధిని దర్శించిన భక్తురాలు. కావేరి వొడ్డున త్యాగరాజ గురువు ఐన శొంఠి వెంకటరామయ్య గారి సమాధి, త్యాగరాజ సమాధి ని దర్శించి వాటి దయనీయ పరిస్థితి చూసి కన్నీటి పర్యంతము అయ్యి వాటిని జీర్ణోధారణ కార్యానికి నడుం బిగించారు. అప్పటికే నరసింహ భాగవతార్ గారి పెరియకచ్చి (పెద్దపక్షం) అని, ఆయన తమ్ముడు పంజు భాగవతార్ గారిది చిన్నకచ్చి (చిన్నపక్షం) గా ఏర్పడి త్యాగరాజ సమాధిని పట్టించుకోకుండా పోటీపడి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండేవి. ఆ రెండు గుంపులు త్యాగరాజు ఇల్లు మీద హక్కు మీద వ్యాజ్యము జరుగుతూ కోర్టు తాళాలు వేయించారు. నాగరత్నమ్మ సొంత ధనం తో కష్టపడి త్యాగరాజ సమాధి స్థలం సొంతం చేసుకొని బాగుచేయించినపుడు లేని ఆక్షేపణ ఆవిడ ఆరాధనోత్సవాల లో కచేరీ చేస్తాను అంటే రెండు పక్షాలు ఏకమై ఆవిడ మొదటి కచేరీ భంగం చేసారు. తరువాతి సంవత్సరం తాను కొనుక్కొని కట్టించుకున్న దేవస్థానం ఆవరణలో సొంత ఖర్చుల తో దేవదాసీలతో, మహిళలతో తంజావూరు జమీందారు రామచంద్రరావు సమక్షం లో త్యాగరాజ ఆరాధన మొదలు పెట్టారు. మొదటి సారి నాదస్వర, డోలువాద్య కళాకారులకి అవకాశం కల్పించి త్యాగరాజ ఆరాధన దిగ్విజయంగా జరిపించారు. చివరికి కష్ట పడి కట్టించిన ఆరాధనా మంటపం మంటలలో కాలిపోయినా దైర్యం కోలుపోలేదు. మద్రాసు లో వీరేశలింగం, ఆయన వర్గానికి చెందిన దేవదాసి ముత్తు లక్ష్మి రెడ్డి లేవదీసిన దేవదాసి వ్యతిరేక ఉద్యమాన్ని దైర్యం తో ఎదురించి ప్రతిరోజూ నగరంలో ఒక దేవాలయం లో నృత్య, గాన కచేరీలతో విశిష్ట ప్రతిఘటన మొదలు పెట్టించారు. ఈ లోగా వైరి వర్గం దేవస్థానములో దేవదాసీలు నృత్యం మొదలైనవి జరపరాదని, బహిరంగ ప్రదేశాలలో కూడా నృత్యం చేయరాదని ప్రభుత్వ చట్టం తెప్పించారు. అటువంటి సందిగ్ద పరిస్థితులలో బెబ్బులి రాజా వారి సహాయం తో వారి అనేక మిత్రుల రాజ భవనాలలో నృత్య గాన ప్రదర్శనలు మొదలు పెట్టించ గలిగారు. చివరికి ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి మద్రాసు మ్యూజిక్ అకాడమీ బహిరంగ వేదికపై దేవదాసీల భరత నాట్య ప్రదర్శనకు అవకాశం కల్పించడం అనివార్యం చేయించ గలిగారు. గురు భక్తి తో తన కంఠ సేవతో నాల్వాడి కృష్ణరాజు ఒడియార్, మహారాణి ప్రతాపకుమారి సమక్షం లో గొప్ప కచేరీ చేసి వారు గౌరవించి ఇచ్చిన సమస్త ధన కనకాలను గురువైన బిడారం కృష్ణప్ప గారి రామ మందిర నిర్మాణ సహాయానికి ఇచ్చి వేశారు. తన సర్వం ధారపోసి త్యాగరాజ సమాధి చుట్టు పక్కల ఇంకొంచెం స్థలం కొని మరలా పునర్నిర్మాణం చేసి, తనను వ్యతిరేకించిన జనం తో సంధి చేసుకొని త్యాగరాజ ఉత్సవాలు జరిగే లాగా చేయగలిగి, వారి తోనే ‘త్యాగరత్న’ అనిపించు కోగలిగినది. డెబ్భై మూడు సంవత్సరాల వయసులో 1952 మే 19 నిర్యాణం. త్యాగరాజస్వామికి భక్త్యంజలులు అర్పించే సంగీత ప్రియులు ఐన వారందరూ ఆమెకు కూడ శ్రద్ధాంజలులు తప్పక అర్పిస్తారు.
ఇంటర్నెట్ లో ఇంకొన్ని వివరాలకు –
1. విద్యాసుందరి – ఈమాట వ్యాసం
2. Bangalore Nagarathnamma
3. Bangalore Nagarathnamma – Wikipedia
4. The Appeasement of Radhika – Radhika Santawanam – Muddupalani
5. Muddupalani – Wikipedia
6. Tyagaraja – Wikipedia
Ashok Kumar para
1914 లో గుంటూరు లో గోవిందరాజు గారింట
జరిగిన పెళ్లి లో సంగీత కచేరీ చేశారు …పారితోషికం ఎన్నో వందలని పత్రికలలో వచ్చింది .