విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

వ్యాసకర్త: సంధ్య యల్లాప్రగడ
***************
విశ్వనాథ సత్యనారాయణ మన తెలుగు వారవటము మనము చేసుకున్న ఒక అదృష్టం. వారి శైలి నారికేళ పాకం. అర్థమై కానట్లుగా వుంటుంది. లోతుగా శ్రద్ధగా చదివితే మాధుర్యం తెలుస్తుంది. తెలుగులో ఆయన రచించని ప్రక్రియ లేదు. మనము కొంత శ్రమతో వారి రచనలు చదవటం అలవాటు చేసుకుంటే కనుక, వారి రచనలు పండుగ భోజనంలా ఉండి చదువరులకు విందు చేస్తాయి.

వారు గొప్ప మానవతావాది. ఆయన రచనలలో ఆనాటి సమాజం ఉంటుంది. వారి రచనలు చదివిన వారికి తప్పక ఆ విషయం అర్థమౌతుంది. ఆయన ఆ నాటి సమాజ పరిస్థితులను వర్ణస్తూ వుంటే పాఠకులకు అది ఒక చిత్రంలా కనపడుతుంది. విశ్వనాథ వారికి రావలసినంత కీర్తి రాలేదంటారు వారి అభిమానులు. కారణం కేవలం వారు తెలుగు వారవటమే అని అంటారు. వారి రచనలు కనుక ఇంగ్లీష్ లో తర్జుమా జరిగి ఉంటే, వారికి రబీంద్రనాథ్ అంత కీర్తి వచ్చి ఉండేదని అంటూవుంటారు. ఆ భావన మరి వారికి కూడా ఉండేదేమో నాకు తెలియదు. కాని వారు ఒక నవలలో “నీవు నిజంగా ఇంకో దేశంలో పుడితే నిన్ను నెత్తిమీద పెట్టుకునే వాళ్ళు. నా యంతటి రచయిత లేదనేవాళ్ళు….” అని ఒక పాత్రతో అనిపిస్తారు. దాన్ని బట్టి వారూ అలానే అనుకునేవారెమో అనిపిస్తుంది. తెలుగు భాషభిమానము ఆయన ఎంతగా ప్రదర్శించినా పరభాష అసహనము లేదు వారికి. ఆయనకి ఇంగ్లీష్ అంటే కోపం లేదు. వారు ఇంగ్లీష్ నవలలు బాగా చదివేవారట. సినిమాలు కూడా ఇంగ్లీష్‌వి బాగా చూసేవారట. అందుకనే వారి రచనలలో ఎక్కడైనా, లండను గురించి, షికాగో గురించి రాయవలసి వస్తే, ఎంతో సహజంగా ఉండి, అక్కడ నివసించిన వారు రాసిన రచనలలా ఉంటాయి.

మన తెలుగు వాళ్లకు సెల్ఫ్ ప్రైడ్ లేదు కదండి. అందుకే మన తెలుగు భాష ఇలా అష్టవంకరలు పోయింది. నేడు అది మరీ అధ్వానమైపోయింది. ఇక ఈ ఇంగ్లీష్ భాషంటే తెలుగు వారికీ ఈ వెఱ్ఱి ఈనాటిది కాదు కదా! పూర్వం నుంచి ఉన్నదే ఇది. 1892 లో రాసిన ‘కన్యాశుల్కం’లోనే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎక్కడైనా ఉద్యోగాలు వస్తాయని అనిపిస్తారు గురజాడ – వెంకమ్మ నోట. మరి 1960 లో ఆ ధోరణి ఎన్ని వెర్రి తలలు వేసిందో మనం ఉహించుకోవచ్చును. ఆ నాటికే తెలుగు భాష మీద ప్రజలకు మరీ చులకన ఏర్పడి, పరభాష అయిన ఇంగ్లీషు మీద ప్రేమ పెరిగిందేమో. అందుకనే ఇంగ్లీష్ భాషలో ఉన్న విషయాలు, లొసుగులు వివరిస్తూ విశ్వనాథ వారు రచించిన హాస్య గుళిక “విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు”. ఈ నవల వారు 1960 లో రాసారుట.

విశ్వనాథ సనాతనవాది అని పేరు పొందారు. అలాంటి వారు ఇంగ్లీష్ గురించి ఏమి రాసి ఉంటారు? అదీ హాస్యం జోడించి, సమాజమును దర్పణంలా ప్రతిబింబింపచేసి? విష్ణుశర్మ ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఆ విష్ణు శర్మ ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవలసి వచ్చింది? ఆయన నేర్చుకున్నడా? నేర్చుకొని ఏమి సాధించాడు? అది తెలియాలంటే ఈ నవల చదవాలి.

విశ్వనాథ వారికి ఒకానొక రోజున, (కథ చెబుతున్న వారు విశ్వనాథ కాబట్టి) కల వచ్చింది. అందులో నీతి చంద్రిక రాసిన విష్ణు శర్మ మరియు కవిబ్రహ్మ తిక్కన్న గారు కల్లోకి వచ్చి, వాళ్లకి ఇంగ్లీష్ నేర్పించమని అడుగుతారు. వారికి స్వర్గంలో ఉన్నప్పుడు కలిగిన ఇబ్బంది వాళ్ళ ఇంగ్లీష్ వచ్చి ఉంటే కానీ సరి చేసుకోలేనిది. ఆ పరిస్థితి కలిగింది. (ఆఖరికి స్వర్గం లో కూడా ఇంగ్లీష్ కావాల్సి వచ్చింది అన్నమాట). ఇక్కడ వంగ్యంగా ఇంగ్లీష్ గురించి మనవారిలో కూరుకుపోయిన భ్రమలను ఆవిష్కరించారు విశ్వనాథవారు. అది మొదలు వారి మధ్య సంభాషణలు. ఇంగ్లీష్ భాషలో ఉన్న విషయాలను కూలంకుషంగా చర్చిస్తారు కథకులు. ముందు ఇంగ్లీష్ అంటే పరిష్కృతమైన భాష (fully developed) కాదని అర్థం అని చెబుతారు. అలా వారు ఆ భాషలో ఉన్న లొసుగులు వివరిస్తారు. ఒక మాట మాట్లాడి, ఒక స్పెల్లింగ్ రాయటం, అక్షరాలు లోతట్టుగా పలకటం, నిశ్శబ్ద అక్షరాలనటం గురించిన వివరణ ఇలా విష్ణు శర్మకు వచ్చే సందేహలకు అంతు వుండదు. అసలు ఒకలా పలకటం, మరోలా స్పెల్సింగు వుండటము అర్థం కావు. ఆ వివరాలు వివరించే కొద్ది మరింత కన్‌ఫ్యూజ్ అవుతాడు విష్ణుశర్మ.

ఇలా కాదని, కనీసం తిక్కన చేత వారి పాఠశాలలో ఒక ఉపన్యాసం ఏర్పాటు చేస్తే, డబ్బు వస్తుందన్న ఆలోచన చేస్తారు రచయిత. విష్ణుశర్మ తాను కూడా వచ్చి మాట్లాడుతానని అడుగుతాడు. ‘దేని గురించి?’ అని అడుగుతారు కథకులు. “ఇంగ్లీష్ భాష అంత అపబ్రంశపు వర్ణమాల ఈ సృష్టిలో లేదని చెబుతా” నని అంటాడు విష్ణు శర్మ. సంస్కృతం భాషకు ఆకారం ఏర్పడకముందే పరిష్కృతమైన భాష. అంటే అది పుడుతూనే సంస్కరించబడింది. మిగిలినవి ఆటవిక భాషాలుట. అవి కొన్ని యుగాలుగా మారుతూ నేటి రూపు సంతరించుకున్నాయని అని అంటారు. ఇంకో చోట అసలు అక్షరాలు ఎందుకు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పలుకుతారని సందేహం వ్యక్తం చేస్తారు. “ఏ ఇంగ్లీష్ అక్షరమైనా సరే దాని ఇష్టం వచ్చిన చోట దాని ఇష్టం వచ్చినట్లు పలుకుతుంది” అని ఆయనే సమాధానము చెబుతారు.

“మీరు ఏదైనా కొత్త భాష నేర్చుకొని ఎన్ని రోజులు అయ్యింది?” అని మనను అడుగుతారు. అసలు మనకు తెలుగు భాష మాతృ భాష కనుక మాట్టాడేస్తాం…. ఇంగ్లీష్ చిన్నప్పట్నుంచి మన మీద రుద్ద బడింది కాబట్టి కొత్తగా ఇప్పుడు నేర్చుకోబడినది ఏమి లేదుగా..
విశ్వనాథ గారి మాటలలో చెప్పాలంటే అసలు మనకు ఏ భాష రాదు . “కనీసం నూటికి తొంబై తొమ్మండుగురికి” ఇంగ్లీష్ రాదు, తెలుగూ రాదు. ఎందుకు రాదంటే మాతృభాష అయితే మాట్టడేస్తూ ఉండటము వల్ల నోటికి వస్తుంది. అంతే కానీ ప్రయత్న పూర్వకంగా వారు నేర్చుకున్నది లేదు. అసలు ఒక భాష నేర్చుకోవాలంటే అందులో క్రియా వాచకములు, వ్యాకరణం నేర్చుకుంటే చాలు అని సులువు చెబుతారు.

వ్యాకరణం లేకుండా ఏదైనా మాట చెప్పమని ఛాలెంజ్ కూడా చేస్తారు. ఆంగ్ల భాషా నిష్ణాతుల గురించి ” పాపం వాళ్ళు వ్యాకరణం అనేది వేరే ఉంటున్నదని అనుకుంటున్నారు. “ఏది, వ్యాకరణం లేకుండా నువొక్కమాట అను? “ అని సవాలు చేస్తారు.
భాషను నేర్చుకోవటానికి ముందు వ్యాకరణం యొక్క ఆవస్యకతను మనకు వివరించటానికి విష్ణుశర్మకు ఇంగ్లీషు కావలసి వచ్చి వుంటుంది.

ఆనాటి సభలు, అయ్యే అనవసరపు హంగామా, శాలువా కప్పటం, దుస్తులు చూసి గౌరవించే పద్దతి, భార్య భర్తల షికారుకు, సరదాకు వున్న ఒకే ఒక్క అవకాశం సినిమాయని, మధ్య తరగతి కుటుంబికుని ఖర్చులు జాబితా, ఇలాంటివన్నీ కూడా మనకర్థమవుతాయి. ఈ విధంగా నవలలో ఆనాటి పరిస్థితులను మన కళ్ళ ముందు ఉంచుతారు వివరంగా. విష్ణుశర్మ ను ఇంగ్లీష్ చదువుకు తేవటం వెనక, ఇంగ్లీష్ లో ఉన్న వ్యాకరణ దోషాలను ఇంగ్లీషు మీద మోజుతో తెలుగును నిర్లక్ష్యం చెయ్యటము, సంస్కృతమును వదిలెయ్యటం వలన ఆయనకు కలిగిన బాధతో ఇది రాశారెమో అని నా అభిప్రాయము.

మనము కొత్త భాషను నేర్చుకోవాలి. కానీ మన భాషకు ఇవ్వ వలసిన సముచితమైన గౌరవము ఇవ్వవలసినదేనని సూచించటానికి నవల చివర్లో వారికి మెలుకువ రావటం, ప్రమోషన్‌ రావటం జరుగుతుంది. పదునైన వారి రచనకు హాస్యం అన్న తీపి తోడుగు వేసి, తెలుగు భాష గొప్పతనం, ప్రతి వారు సొంత భాషకు చూపించవలసిన గౌరవం గురించి చెబుతారు. ఆయన శైలి, ముందుగా అనుకున్నట్లుగా కొంత ఇబ్బంది పెట్టినా, చదువుతూ ఉంటే అలవాటు పడి, మనం నవలలో మునిగి పోతాము. విశ్వనాథ రచనలు చదవాలనే నా కోరికకు నేను ఇలా శ్రీకారం చుట్టాను.

You Might Also Like

Leave a Reply