NTR: A Biography
లక్ష్మీ పార్వతి తన బయోగ్రఫీ రాయడానికి అనుమతి కోరినప్పుడు, ఎన్టీఆర్ అన్నాడట: “నా జీవితం సముద్రం లాంటిది. అదో అంతులేని అగాధం. అంత అగాధాన్ని అర్థం చేసుకొని రాయగలిగే క్షమత నీకుందా?” అని. ఆమె సంగతేమో గానీ, ఎన్టీఆర్ సమగ్ర(?) జీవిత చరిత్ర రాయడానికే కాదు, చదవడానికి కూడా బోలెడంత ఓర్పు ఉండాలని ఈ పుస్తకం తెలియజేసింది నాకు. ఏడొందల పేజీలు పుస్తకం ఒకేసారి చదవడం ఒక ఎత్తైతే, ఎన్టీఆర్ లాంటి ఒడిదుడుకుల జీవితాన్ని తెల్సుకుంటూ ప్రయాణించడం ఆషామాషీ విషయం కాదు. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియనిది ఏదో ఉన్నట్టే అనిపిస్తుంటుంది.
ఆయన చెప్పుకున్నట్టు ఆయన జీవితాన్ని సముద్రంతో కాక, నదితో పోల్చుకుంటే అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందేమోనని నాకనిపిస్తుంది. అవును, ఆయన మహానటుడు. అవును, ఆయన మహానాయకుడు. ఆయన తెలుగు సినిమా కళామ్మతల్లికి ముద్దుబిడ్డడు. దేశాన్నే దడదడలాడించిన ఇందిరా గాంధిని హడలుగొట్టినవాడు. వగైరా. వగైరా. ఆయన గురించి మనకి రూఢీగా తెలిసినవి ఎన్ని ఉన్నాయో, ఎప్పటికీ తెలియకుండా పోయినవి ఇంకెన్నో ఉన్నాయి. ఈ రెంటికి మధ్య, ఆయన మీద ఇష్టంతోనో, లేదా కోపంతోనో మనం అల్లుకున్న కథలూ చాలా ఉంటాయి. ఏడొందల పేజీలు కాదు కదా, ఓ ఏడు వేల పేజీలు రాసినా – ఎన్టీఆర్ ఎంత పరిచయమవుతాడో, అంతే అపరిచితుడిగా కూడా మిగిలిపోతాడన్న నమ్మకం కలిగించింది ఈ పుస్తకం. He’s an enigma. నిజంగానే, చిక్కడూ, దొరకడూ! 🙂
జీవిత చరిత్రలు మొదలయ్యే చోటే ఈ కథా మొదలవుతుంది. ఆయన పుట్టకముందు. వాళ్ళ అమ్మానాన్నలు దగ్గర. వాళ్ళ ఊరెలా పుట్టిందో అంటూ. కథ ముగియాల్సిన చోటే ముగుస్తుంది – ఆయన మరణంతో. ఈ మధ్యలో జరిగినదంతా కథగా పుస్తకంలో ఉంటుంది. ఆయన అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు, పెద్దమ్మ-పెద్దనాన్నల గురించి వివరంగా ఉంటుంది. వాళ్ళెన్ని కష్టాలకి ఓర్చుకొని విద్యాబుద్ధులు చెప్పించారని. పెళ్ళి గురించి మాట మాత్రపు ప్రస్తావన. ఆపై సినిమాల్లో ప్రవేశం, ఇక్కడా చక్కని మార్గం చూపించిన గురువుల్లాంటి ఎల్వీప్రసాదు లాంటి వాళ్ళు. ఆపై చేసిన సినిమాలు, తీసిన సినిమాలు. తోడుగా పనిచేసినవారి గురించి, సినిమా తీసిపెట్టిన వారి గురించి. మనకి తెల్సిన బోలెడు సినిమాలు. కొన్ని గమ్మత్తైన విషయాలు. కొన్ని అబ్బురపరిచేవి. ఇలా… ఇలా… సినిమాలు అయ్యాక, రాజకీయాలు. రాష్ట్ర రాజకీయాలే కాకుండా, దేశ రాజకీయాల గురించి వివరాలు. ఇందిరాగాంధి ఎలా తిప్పలు పెట్టిందో, పేరుకే ప్రజాతంత్రం కానీ, ఒకరి చేతిలో మొత్తం వ్యవస్థంతా ఎలా తోలుబొమ్మలా ఆడుతుందో… ఆయన దాన్ని ఎలా నెగ్గుకొచ్చాడో… ఎందరికి అన్నం పెట్టాడో, ఎందరి నోటి దగ్గర ముద్ద లాగేసుకున్నాడో… ఇలా… ఇలా… ఆపైన లక్ష్మీ పార్వతి ప్రవేశం, ఆమె వల్ల కుటుంబంలో కలిగిన కలహాలు. చివరికి అల్లుడే ఎదురుతిరగడం. ఆపై ఆయన పోవడం!
విశ్వమంతా రంగభూమి, మనమందరం నటులు అని షేక్స్పియర్ అంటే అన్నాడు కానీ, అందరికి రెండు విభిన్న రంగాల్లో కథను నడిపించే నాయకుడయ్యే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. ఒకటి అప్పుడప్పుడే అలవాటు అవుతున్న సినిమాని జనాల జీవితంలో ఒక భాగమయ్యే విధంగా తీసుకెళ్ళడం. రెండోది, ప్రజాస్వామ్యం అనే నాటకంలో మాటిమాటికి వెన్నుపోట్లు, పరాభవాలు కలుగుతున్నా వెనక్కి తగ్గని పోరాటం.
ముప్పై శాతం వరకూ పుస్తకంలో ఆయన సినిమా ప్రయాణం ఉంటుంది. ఎన్నెన్నో సినిమాల గురించి పడ్డ కష్టం, చూపించిన ఓర్పు, నేర్పు, కలుపుకుపోయిన స్నేహితులు, సన్నిహితుల గురించి బోలెడు విషయాలు తెలుస్తాయి. కొన్ని చాప్టర్లు ఎంత ఆసక్తికరంగా అనిపించాయంటే (ముఖ్యంగా భూకైలాస్, సీతారామ కళ్యాణం లాంటి సినిమాల గురించి), వెంటనే పుస్తకం పక్కకు పెట్టేసి ఆ సినిమాలు అన్ని చూడాలనిపించేంతగా! ఎంత ఎన్టీఆర్ గురించిన కబుర్లే ఉన్నా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ పైకొచ్చిన విధానమంతా తెలుస్తుంది. అప్పట్లో టెక్నాలజీలు, మార్కెటింగులు తక్కువే అయినా కూడా గొప్ప సినిమాలు చాలా నిబద్ధతతో తీశారనిపించింది. పనినే దైవంగా భావించి, వచ్చిన పేరును, డబ్బును కాళ్ళదన్నుకోకుండా పైకొచ్చి, తోటివారిని పైకి తీసుకొచ్చినవారు. ఇప్పుడు ఆ సినిమాల్లో మనకి కొన్ని మెలోడ్రామాలగానూ, ఓవర్ ఆక్టింగులగానూ అనిపించొచ్చునేమో గానీ, వాటిల్లో ఒక నిజాయితీ ఉంది, ప్రేక్షకుల పట్ల ఒక గౌరవం ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమాలో లేనివవి!
మిగితా డబ్భై శాతం మాత్రం ఆయన రాజకీయ ప్రస్థానం గురించే! నేను దక్షిణ భారత దేశం రాజకీయాల గురించి చదివిన పుస్తకాలు తక్కువే గానీ, ఎన్టీఆర్ బయోగ్రఫీ చదివితే 1970-1996 వరకూ భారత దేశ రాజకీయాలు ఇంత కూలంకషంగా తెలుస్తాయని నేను అనుకోలేదు. ఒక సినిమా నటుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కావడమనేది మామూలు విషయం అనుకునేదాన్ని. కేంద్రంలో ఏర్పడిన అనిశ్చితిలో కాస్త రాజకీయం చేసి ప్రధాన మంత్రి అవ్వాలని ఎవరు ఆశపడరులే అని అనుకున్నాను. కానీ, పుస్తకం చదివాకే అర్థమయ్యింది, భారత రాజకీయాల్లో ఎన్టీఆర్ పాత్ర. మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడమే కాక, కాంగ్రెసుకు ఒక ప్రత్యర్థిని తయారుచేయడంలో కూడా ఎంత కృషి చేశాడోనని. అసలు ఈ భాగాన్ని మాత్రమే “ఎన్టీఆర్ – ఎ పొలిటికల్ బయోగ్రఫీ” అని వేరుగా రాసినా చాలా బాగుండేది.
రచయితలు ముఖ్య రాజకీయ ఘట్టాలను ఏదో మాటవరసకి చెప్పేసి ఊరుకోకుండా, నేపధ్యం మొత్తం వివరించారు – అందుకే పుస్తకం నిడివి కూడా పెరిగింది. దేశ రాష్ట్ర రాజకీయాలను ఒక కోణం నుండే చెప్పుకుంటూ రాకుండా, ఎక్కడికక్కడ మీడియాలో వచ్చిన కథనాలు, ఆయా రాజకీయ నాయకులు / ఆఫీసర్లు తర్వాతి కాలంలో నెమరువేసుకున్న ఆలోచనలు, సామాన్య ప్రజలు అనుకుంటున్న మాటలు అన్ని కలిపి ఒక 3D పిక్చరు కనిపించేలా చేశారు. విజయవాడకు చెందిన వంగవీటి రంగ హత్య ఉదంతం చెప్తున్నప్పుడు ఎన్టీఆర్ కి కులపిచ్చి లేదని రచయితలు వాదించినట్టు అనిపించింది. అలానే ఇంకో కొన్ని సందర్భాల్లో కూడా ఎన్టీఆర్‌ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే తపన కనిపిస్తుంది. కానీ, చాలా మేరకు, ఒక ఘటన గురించి తెలిసిన అన్ని విషయాలు పాఠకుల ముందు పెట్టి, వారినే ఆ విషయం గురించి ఆలోచించుకోమన్నట్టు నడుస్తుంది ఈ పుస్తకం శైలి.
పుస్తకం చదివాక నాకనిపించింది ఏటంటే – అసలు కథ చెప్పనిదాంట్లో ఉందని.
అసలెప్పుడూ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినా – ఆయన చాలా impulsive మనిషి, తోచింది చేసేస్తాడుగానీ పెద్దగా ఆలోచించడు అని. His impulses were backed by thorough strategy అని నాకనిపించింది. విజయావారితో కాంట్రాక్టు చేసుకునేటప్పుడు హీరోగానే నటిస్తానని నిబంధన పెట్టినప్పుడు, వెతికి వెతికి చంద్రబాబుని అల్లుడిగా చేసుకోవడం లాంటివి కొన్ని ఉదాహరణలు. అవకాశం ఉన్నప్పుడల్లా రచయితలూ ఈ మాట నొక్కి వక్కాణించారు.
ఆయనను పెంచి పెద్దచేసిన రోజుల్లో కీలకంగా కనిపించిన కుటుంబం, తర్వాత అతడి తమ్ముడి ప్రస్తావన (అదీ సినిమారంగంలో ఉన్నందుకే) తప్పించి మొత్తంగా కనుమరుగైపోతుంది. ఏడొందల పేజీల జీవిత చరిత్రలో భార్య బసవరామతారకానికి పట్టుమని ఏడు పేజీల విషయం కూడా లేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు, పధ్నాలుగు మంది సంతానం! అందులో ఒకరి మరణం గురించే రెండు ముక్కలు. చంద్రబాబుతో కూతురి పెళ్ళి గురించి ఒక మాట. చంద్రబాబుతో పాటు అడపాదడపా ప్రస్తావన వచ్చే మరో అల్లుడు దగ్గుబాటి. స్టార్ హీరో అనిపించుకున్న బాలకృష్ణ గురించి రెండే మాటలు – డిగ్రీ అయ్యేవరకూ బయట సినిమాలు లేవని చెప్పడం, “మా నాన్నను నేను ఎప్పుడో గానీ చూసేవాణ్ణి కాదు.” అని మరో మాట. మొత్తానికి ఆయన కథలో, ఆయన కుటుంబ సభ్యులే డైలాగులు లేకుండా వెనక్కి నుంచొని ఉండే జూనియర్ ఆర్టిస్టులా అన్నట్టు అనిపిస్తారు, మొత్తం పుస్తకంలో. (ఆయనకి తోటి హీరోయిన్ తో ఉన్న అఫైర్ గురించి, లక్ష్మీ పార్వతితో సహచర్యం గురించి మాత్రం గట్టిగానే చెప్పినట్టు అనిపించింది.)
పుస్తకం కలిగించిన ఒక అనుమానం మాత్రం ఉంది: ఇది తెలుగువాళ్ళు తెలుగువాళ్ళకి రాసిన పుస్తకమైతే అంతా బానే ఉందిగానీ, తెలుగేతరులకి ఇది చదువుకోవడం ఎంత తేలికా అని నా సందేహం. ఇంగ్లీషులో రాశారు కాబట్టి కొన్ని నోట్సో, లేదా వివరణ ఇచ్చి ఉండాల్సిందేమో కొందరి మనుషలకి, ఊర్లకి, ఆచారాలకి. అక్కడక్కడా ఎడిటింగ్ అవసరం కూడా అనిపించింది. టైపోలు కూడా అక్కడక్కడా కనిపించాయి.
శ్రీనాథుని మీద సినిమా తీయడానికి కథ రాసుకొని రమ్మని బాపూరమణలకు చెప్తే, వాళ్ళేమో: “శ్రీనాథుడు బాగా బతికిచెడ్డవాడు. A fallen hero! మీకొద్దు అలాంటి సబ్జెక్టులు” అని అన్నారట. మరి ఎన్టీఆర్ కూడా ఒక fallen heroనా?
పుస్తకం ముగిసేసరికి అలానే అనిపిస్తుంది. మనసంతా భారంగా! అంతటి మనిషికా ఈ దుఃస్థితి అనిపించేంతగా! ఎందుకొచ్చిన పాడు రాజకీయాలు అని తిట్టుకునేంతగా!
కానీ, నాకు మట్టుకు ఈ పుస్తకం చదివాక ఎన్టీఆర్ ఒక విశ్వవిఖ్యాత నటసార్వభౌముడో, ఒక రాజకీయ అద్భుతమో, యుగ పురుషుడో, ఒక వ్యవస్థో మరోటో కాదు. ఈ నిర్వచనాలు, విశ్లేషణలు వెనుకున్న ఒక మనిషి. మొహానికి రంగేసుకొని కెమారా ముందు నుంచున్నంత కాలం ఆ మనిషి సరిగ్గా కనిపించడు గానీ, నియమాలు, నైతికతలులేని రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం ఆ వ్యక్తిత్వం తెలుసుకునే అవకాశం వస్తుంది. అమాంతంగా అందరిని ఎన్టీఆర్ అభిమానులని చేసే పుస్తకం కాదిది. అందుకే చదవాలి – నాణానికి ఉన్న వైపులన్ని తెల్సుకోవడంలో ఉన్న మజా వేరే కదా!
గమనిక: నేను కిండిల్‌లో చదివాను. పరమ చెత్త ఫార్మాటింగ్. చాప్టర్ ముగింపు వాక్యాలు కొన్ని చోట్ల తారుమారు అయ్యాయి. ఒకట్రెండు చోట్ల వాక్యాలు పూర్తి కాలేదు. ఫోటోల కోసమైనా ఇది హార్డ్ కాపీ కొనుక్కోవడం నయం. కిండిల్ అన్‌లిమిటెడ్ పుస్తకం ఉచితంగా లభిస్తుంది. కానీ, పైరేటెడ్ కాపీ కన్నా దారుణంగా ఉంటుంది.
Details:
NTR: A Biography
Authors: K Chandrahas, Dr. K. LakshmiNarayana
Publishers: CLP Publishers LLP
Pages: 662
Official website: http://ntrbiography.com/
Book review of K.Chandrahas’s “The People’s Scientist: Dr. Y. Nayudamma” in pustakam.net
leol
పుస్తకం తెప్పించుకున్నాను. హార్డ్ కాపీ లో కూడా ఫొటోలు అంత గొప్పగా ఏమీ లేవు.
leol
థన్యవాదాలు! ఎన్నికల సమయంలో వచ్చే సినిమాలలా పుస్తకాలు కూడా నాణానికి ఒక వైపే చూస్తాయేమోనని ఈ పుస్తకం కొనే సాహసం చేయలేదు. ఎన్టీఆర్ జీవితం గురించి వచ్చిన పుస్తకాలు యింకా ఏమన్నా వున్నాయా యిది ఒక్కటేనా?
పూర్ణిమ
ఇంగ్లీషులో ఇదే మొదటి బయోగ్రఫీ. తెలుగులో వినాయకరావు రాసిన “యుగానికొక్కడు” అనే పుస్తకం వచ్చింది.