కోమలి గాంధారం – మృణాలిని

వ్యాసకర్త: సంధ్య యల్లాప్రగడ
***************

నేను హైద్రాబాదు వెళ్ళిన వెంటనే క్రమం తప్పక ప్రతీసారి చేసే పని ఒకటి వుంది. అదే పుస్తకాల దుకాణంకు వెళ్ళటం. నచ్చిన, అత్యంత అధికంగా అమ్మకం అవుతున్న పుస్తకాలను కొని తెచ్చుకోవటం అలవాటు. చదవనివి, చదివిన వాటిలలో నచ్చినవి, పచ్చళ్ళ పార్సిలుతో కలిపి అట్లాంటా పంపించటం. చదివిన కథల పుస్తకాలు నేను హైద్రాబాదులో వదిలేసి వస్తూ వుంటాను, రివాజుగా. ఈ సారి చదివేసినా మన వ్యక్తిగత లైబ్రరీలో వుంచుకోతగ్గ ఉత్తమమైనదిగా తలచి తెచ్చుకున్నాను ఒక పుస్తకాన్ని. అది మృణాళిని గారి ‘కోమలి గాంధారం’.

మృణాళిని గారి అనువాద సాహిత్యం నేను ముందే చదివి వున్నాను. వారు నేటి సమాకాలీన సాహిత్యం లో పలువురు మెచ్చిన సాహిత్య మేధావి. వారి గురించి, వారి సాహిత్య సేవ గురించి చినవీరభధ్రుడు గారి ఒక వ్యాసములో చదివే వున్నాను. మృణాళిని గారు చేసిన కొన్ని ఇంటర్వ్యూ లను కూడా చూశాను ‘యూట్యూబు’లో. వారిని కలుసుకునే అవకాశము రాలేదు కానీ, మా అమ్మమ్మగారి తరపు బంధువులని కూడా నాకు తెలుసు. ఆ రకంగా కూడా వారు మాకు ఆప్తులు. వారి ప్రత్యక్ష రచనలు వున్నాయని నాకు ‘కోమలి గాంధారం’ చూసే వరకూ తెలుయలేదు. కేవలం వారి పేరు చూసి ఆ పుస్తకం తెచ్చుకున్నా, పూర్తి చేసే వరకూ వదలలేదు. దాదాపు 54 చిన్న కథలతో వున్న ఈ సంపుటిలో కోమలి ప్రధాన పాత్ర. కథలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతాయి. కోమలి సహజమైన తెలివితో మెరిసిపోయే ఆధునిక మహిళ. చదువుకొని, వివాహము తరువాత అత్త, మామలతో పాటు వుంటూ భర్త తో అన్యోన్యమైన సంసారము. సంసారమన్న తరువాత వివిధములైన విషయాలు, మాటలు ఆటుపోట్లు సాధారణము. ఇవ్వనీ ఒక ఎత్తైతే, ఎల్లాంటి పరిస్థితులైనా తన వీలుగా మలచుకోవటం…. ఆ విధానములో వ్యక్తిత్వానికి దెబ్బ తగలకుండా ఆత్మసైర్యంతో నిలబడటం మరో ఎత్తు. వీటితో పాటు చదువు తున్నంత సేపు చక్కటి హాస్యంతో నిండి, మన పెదవుల మీద చిరునవ్వు చెదరనివ్వవు. ప్రతి కథ ఒక పంచదార గుళిక….

నేటి వరకూ మన సాహిత్యం లో స్త్రీ వాద సాహిత్యమంటే హక్కులు బాధ్యతలు… ఎర్ర జండా టైపులో వుండే సంభాషణలు. స్త్రీ వాద రచయిత గురించి ప్రజలలో వున్న అపోహలు సైతం చక్కగా విశదీకరిస్తారు మృణాళిని గారు ఇందులో (స్త్రీవాద విమర్శకుడు). కానీ కోమలి గాంధారములో చూపిన స్టాంగు విమన్ విషయం వేరు. మనకు సాధారణంగా ఇళ్ళలో వుండే పరిస్థితులైనా, వాటిని తన బలమైన వ్యక్తిత్వంతో, ధైర్యం కనపరుస్తూ కోమలి పాత్ర ఎదురుకొన్న విధానము సహజంగా వుండి మనలను ఆకర్షిస్తుంది. మన జీవితములో లానే వివిధ సంఘటనలు కోమలికి తగులుతాయి. అందులో కోమలి చూపిన తెగువ, ఆ ప్రాసెసులో హస్యం అత్యంత సహజముగా అతికి దండలో దారం లా కలసిపోయి హాయినిస్తుంది.

స్వర్ణోత్సవ సంసారం, మగని జ్వరం, డైటాయణం ,ప్రేమయాత్ర, పరిపూర్ణమ్మ కథ… ఒకటేమిటి అన్నీ కథలు తేనె మధురిమలు పంచుతూ, హస్యపు జల్లులు చల్లుతూ ఆర విచ్చిన మందారాలు. అది ఇల్లైనా, ఆఫీసైనా కోమలి తెగువ, పరిస్థితులను అంచనా వెయ్యటం, స్త్రీ శక్తిని చూపుటం లో ఆమె చూపే తెలివి చదవరులను కట్టిపడేస్తూ చిరునవ్వులు పుట్టిస్తూ సాగుతాయి. పురుష్యాధికత్యను ఎత్తిచూపటానికి పెద్ద నినాదాలు అవసరం లేదనీ, సమానత్వం కావాలంటే ఇల్లెక్కి వీదుల వెంట పరుగెత్తనక్కర్లేదనీ, మన సహజ జీవిత విధానములో, మనం జీవించటంలోనే మన వ్యక్తిత్వాన్ని చూపవచ్చని కోమలి కథలు నిరూపిస్తాయి.

ఇంత చక్కటి హస్య కథలు, అందునా స్త్రీ వాద కథలను నేను ఈ మధ్య కాలం లో చదవలేదు. మన సాహిత్యంలో, సాహిత్య చరిత్ర లో నిలబడిపోయే పాత్ర ‘కోమలి’ ది. పేరు కోమలి అయినా ఆమె చూపిన వ్యక్తిత్వం మాత్రం బలమైనది. స్త్రీ ల మీద సహజ ప్రేమ, స్నేహం కనబరుస్తూ, సదా స్త్రీ వైపు నుంచి పరిస్థితులలో తీర్పు చెబుతూ వుండే కోమలి మనలను ఆకర్షించి మనసుకు హత్తుకుపోతుంది. అది కొలిగ్ అయినా, తమ్ముడైనా కోమలి సదా స్త్రీ వైపుగానే మాట్లాడుతూ, కధను మనకు చూపుతుంది.

మనకు చరిత్రలో హస్య కథలైన “అత్తగారి కథలు, బారిష్టురు పార్వతీశం, బుడుగు” కథలతో పాటూ కలకాలం చరిత్రలో నిలబడిపోయే పాత్ర కోమలి. కోమలి కథలు అందరూ తప్పక చదవ వలసినవి. ఇలాంటి కథలు మృణాళిని గారు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

You Might Also Like

Leave a Reply