‘గబ్బగీమి’ నవల

రచయిత: శాంతివనం మంచికంటి, ప్రచురణ: శాంతివనం, ఒంగోలు, జనవరి 2017, వెల: రు. 150

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి చర్చా సమీక్ష
తేదీ, స్థలం: నవంబరు 4, 2018, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, నోవై, మిషిగన్
పాల్గొన్నవారు: ఆరి సీతారామయ్య, పిన్నమనేని శ్రీనివాస్, అడుసుమిల్లి శివరామకృష్ణ, బూదరాజు కృష్ణమోహన్, వీరపనేని విష్ణు, నర్రా వేంకటేశ్వరరావు, కట్టా గోపాలకృష్ణమూర్తి, కట్టా విజయ, కూచిపూడి దిలీప్, చేకూరి విజయ్, వేములపల్లి రాఘవేంద్రచౌదరి, మద్దిపాటి కృష్ణారావు
సమీక్షకులు: మద్దిపాటి కృష్ణారావు

ఒడుదుడుకుల్లేని ప్రశాంత జీవనం గడపాలనుకోవడం మానవ నైజం. తోటి వారితో పోల్చుకుని ఈ సమస్థితి నుండి ఆర్ధికంగానూ, సామాజిక గుర్తింపు పరంగానూ పైకి ఎదగాలనుకోవడం కూడా అంతే సహజం. కానీ ఈ ఎదుగుదల ప్రయత్నానికి తగిన వనరులు (ఆర్ధిక, సాంఘిక, సామాజిక, సాంకేతిక), విషయ పరిజ్ఞానం, వాటిని వినియోగించుకోగల నైపుణ్యం లేకపోతే కలిగే పరిణామాల చిత్రణే ఈ కటిక చీకటి (ఒంగోలు మాండలీకంలో గబ్బగీమి). నవలలోని ప్రధాన పాత్ర రంగమ్మ జీవిత గమనాన్ని ఆధారంగా చేసుకుని పల్లె – పట్టణ ప్రాంతాల జీవన పరిస్థితుల్లో కలుగుతున్న మార్పులు, ఉమ్మడి – ఒంటరి కుటుంబాల జీవన శైలి, వ్యవసాయ వ్యాపారాలనుండి వ్యాపార వ్యవసాయాలకు మారిన రైతు జీవితాల అనుభవాలు, పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్క చందంగా అనుకరించి చేసిన వ్యాపారాలు సమాజాన్ని ఏ దిశగా నడిపిస్తున్నాయో చూపించారు రచయిత.

రెండు తరాల కాలంలోనే తెలుగు సమాజంలో పెద్ద మార్పులొచ్చాయి. రంగమ్మ చిన్న పిల్లగా ఉన్న రోజుల్లో గ్రామాల్లో ఒకరి కొకరు తోడుగా ఉండేవారు. అవసర సమయాల్లో ఒకరికొకరు అండగా ఉండేవారు. కానీ, ఆమె ముగ్గురు బిడ్డల తల్లి అయ్యే నాటికి పరిస్థితులు మారాయి. వస్తు వ్యామోహం పెరిగింది. తిండి గింజల వ్యవసాయం ద్వారా తొందరగా ధనవంతులయ్యే అవకాశం లేదని వస్తు ఉత్పత్తికి తగిన వ్యాపార పంటల (ముఖ్యంగా ప్రత్తి) వైపు మొగ్గు చూపడం, పొలాలమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేస్తే త్వరగా డబ్బు సంపాదించ వచ్చని ఆశపడటంతో, ఉమ్మడి కుటుంబాలనుంచి వేరైన రైతుబిడ్డలు ఎవరికి వారయ్యారు. తమకు సరైన ప్రవేశంలేని వ్యాపారాలు చేశారు. విపరీతంగా నష్టపోయారు. రంగమ్మ పెద్దబావలిద్దరూ కటికపేదలుగా తేలారు. పత్తి పండించే ప్రయత్నంలో మూడో బావ ప్రాణం పోయింది.

ఒక స్నేహితురాలి సలహా మేరకు రంగమ్మ కూడా ఒంగోలు చేరుతుంది. అక్కడ పాలమ్ముకుంటూ కొంచెం స్థిరపడగలుగుతుంది. కానీ ఇంకా ఎక్కువ సంపాదించాలానే ఆశతో చీటీలు వెయ్యడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అప్పులు తీసుకోవడం, ఇవ్వడం – ఈ వలయంలో చిక్కుకుని బయటపడలేక పోతుంది. ఏదో ఒక వ్యాపారం చెయ్యడానికి పెట్టుబడి కావాలి. రంగమ్మ చిన్న పి‌ల్లగా ఉన్న రోజుల్లో ఆ పెట్టుబళ్ళు అంత సులభంగా దొరికేవి కాదు. ఆమె తన ఇంటికి పెద్ద అయ్యేనాటికి అప్పులిచ్చి డబ్బు చేసుకోవడం పెద్ద వ్యాపారం అయ్యింది. పెట్టుబడిడారీ వ్యవస్థలో పెట్టుబడి ఇచ్చే వారికున్నంత రక్షణ తీసుకునేవారికి ఉండదు. తీసుకునేవారికి కావాల్సిన తెలివి తేటలు అందరికీ ఉండవు. ఉన్నదంతా పోగొట్టుకుంటుంది. ఐనా, రంగమ్మ ఆశాజీవి. ఏ సమస్యకైనా సమాధానం కోసం వెతుకుతుందేగానీ, నిర్లిప్తతతోనో, నిరాశతోనో చతికిలపడదు. పెళ్ళీడు వయసులో ఉన్న పెద్ద కూతురు ఉద్యోగానికి వెళ్ళి అర్థరాత్రి వరకు బయట ఉండాల్సొచ్చినా, చిన్న కూతురు లైంగిక వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చినా, కొడుకు జీవన్మరణ స్థితిలో కొట్టుకుంటున్నా, మంచం దిగలేని అత్తగారికి ఊడిగం చెయ్యాల్సి వచ్చినా, అప్పు తీసుకున్నవాళ్ళు ఎగ్గొట్టబోయినా, అప్పిచ్చినవాళ్ళు బెదిరించినా, కాలు విరిగి జీవనోపాధికి అంతరాయం కలిగినా, భర్త తనను విడిచి పెట్టినా తరవాత జరగాల్సిందేమిటో ఆలోచిస్తుంది గానీ తిట్టుకుంటూ కూర్చోదు.

నవల కొన్ని సంఘటనల సమాహారంగా (ఆ మాట రచయితే చెప్పుకున్నారు) చూస్తే జరిగిందంతా ఆయా వ్యక్తుల స్వయంకృతాపరాధాలుగానే కనిపిస్తాయి. పండించే అనుభవం లేని పంటల జోలికెందుకెళ్ళాలి?, అనుభవం లేని వ్యాపారాలెందుకు చెయ్యాలి?, వీటి వల్ల తమ జీవితాలను చీకటిమయం చేసుకున్న వారిపై సానుభూతి ఎందుకు కలగాలి?, మొదలైన ప్రశ్నలుద్భవించక మానవు. కానీ ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వాతావరణాల్ని, పల్లెటూరి జీవితాల్ని గతకాలపు మధుర స్మృతులుగా రచయిత తన ఉపోద్ఘాతంలో చెప్పుకున్నా, తద్వారా మనకు నవలలోని పాత్రల పైనా సంఘటనల పైనా సానుభూతి కోరుతున్నట్లనిపించినా, నవలలో ఎక్కడా రచయిత తన వ్యాఖ్యానాలతో కోరుకోలేదు. కేవలం సమస్యలను ఎత్తి చూపడం వరకే గానీ, పాఠకుల అభిప్రాయాలను మెలిపెట్టి ఏదో ఒక దృక్పథంలోకి నడిపించాలని ప్రయత్నించినట్లనిపించదు. ఇది రచయితలో మెచ్చుకోదగ్గ గుణమే కానీ, సమస్యల సమాహారం సమకాలీన వార్తలు గుది గుచ్చినట్లనిపించే ప్రమాదం కూడా ఉంది. ఆ పనికి వార్తాపత్రికలున్నాయి. సమస్యతో ప్రత్యక్ష సంబంధం లేని పాఠకులకు సైతం సమస్యను ఆవిష్కరించి దానితో మమేకం చేయించ గలగడం సృజనాత్మక రచనకు ఆయువుపట్టు. రచయిత ప్రతిభకు తార్కాణం. ‘మిత్తవ’ లాంటి కథలతో పాఠకుల హృదయాలను కదిలించిన రచయితకు అంతటి ప్రతిభ లేదనుకోవడానికి ఆస్కారం లేదు. కానీ సమకాలీన సమాజపు కటిక చీకటి జీవితాలను ఈ నవల ద్వారా పాఠకులకు చూపించే ప్రయత్నంలో విషయాన్ని ఆవిష్కరించి అందులోకి పాఠకులను తీసుకు వెళ్ళలేకపోయారనిపిస్తుంది. ఉదాహరణకు, ఉమ్మడి కుటుంబాలు ప్రస్తుతం ఇంచుమించుగా మృగ్యమే. గతకాలపు ఉమ్మడి కుటుంబ జీవితాలను నెమరు వేసుకుంటే గుర్తుకు వచ్చేది తీపి జ్ఞాపకాలే గానీ పడిన ఇబ్బందులు కావు. ఉన్న వనరుల వినియోగానికి, అభివృద్ధికి వేరు పడిన కుటుంబాలకంటే సమిష్ఠి కృషి లాభదాయకమే. కానీ, వాస్తవానికి ఉమ్మడి కుటుంబ నిర్వహణ రాజ్యపరిపాలన లాంటిదైనా, అంతకంటే క్లిష్టమైంది (ఇక్కడ పాలితులు ముక్కూ మొహం తెలియని ప్రజలు కాదు, వారి మనోభీష్టాలను లెక్క చేయకపోవడానికి). సహజంగా సంక్రమించిన ఉమ్మడి కుటుంబ నిర్వహణ బాధ్యతలను అమలు పరచేవారి సామర్ధ్యాలనుబట్టి ఉమ్మడి కుటుంబం బాగోగులు ఆధారపడి ఉంటాయి. ఏమాత్రం అనుభమూ, శిక్షణా లేకుండా ఉమ్మడి కుటుంబ నిర్వహణ చేయాల్సిరావడం గుర్తిస్తే, విఫలమైనవారిపై సానుభూతి కలుగుతుందిగానీ, అది వారి అసమర్ధతనిపించదు. అనుభవం లేకుండా చేసిన వ్యాపారమైనా, వ్యవసాయమైనా జీవితంలో పై మెట్టుకు ఎదగాలనే సహజ పవృత్తితో చేసే ప్రయత్నాలే గానీ, కేవలం అత్యాశలు కావు. ఇది గుర్తించిన రచయిత ఆ జీవితాలపై ఉన్న సానుభూతిని పాఠకుల్లో కలిగించలేకపోయారనిపిస్తుంది. రచనలోని పాత్రల జీవిత చిత్రణ సామాజిక వాస్తవికతను విజయవంతంగా ప్రతిఫలించినప్పుడు మాత్రమే పాఠకులు కథనంతో సహానుభూతి చెందగలరు. అలా జరగలేదంటే వాస్తవికత లోపించినట్లే. నవల విస్త్రుతి పెరిగినా కథా సంవిధానంలో కలిసే విధంగా సమస్యల మూలాల్లోకి వెళ్ళకపోతే సానుభూతికన్నా అపార్ధాలకే అవకాశం ఎక్కువ!

భాష విషయానికొస్తే, ఒంగోలు మాండలికాన్ని సందర్భానుసారంగా వాడారు. భాష స్వయంసిద్ధతను, సహజత్వాన్ని ప్రతిఫలించేది మాండలికాలే. వివిధ భాషల ఒత్తిడికి గురౌతున్న తెలుగును తమ రచనల్లో మాండలిక పదాల వాడుకతో నిలబెడుతున్న రచయితలందరూ అభినందనీయులు. మారుతున్న కాలానికి ఇతర భాషా పదాల వాడుక అనివార్యమనే వితండ వాదులు, భాషే లేకపోతే తెలుగు వారమని చెప్పుకునే అర్హత ఎక్కడుంటుందో గమనిస్తే చాలు!

నవలలో కథనం మొత్తం గతాన్ని వర్తమానంతో పోల్చుకుంటూ నడుస్తుంది. ఐతే ‘అప్పుడు – ఇప్పుడు’ అంటూ నడిచిన కథనం గత స్మృతుల నెమరు తీరుకు పంటి కింద రాయిలాగా ఇబ్బంది కలిగించింది. వర్తమానం నుండి పాఠకుల్ని గతానికి తీసుకువెళ్ళి తిరిగి కథలోకి తీసుకు వచ్చే ప్రయత్నం సజావుగా జరగకపోతే కథతో మమేకం చెందబోతున్న పాఠకుల్ని అనవసరంగా తట్టి లేపి మరీ అనుభూతిని చెరిపేసినట్టవుతుంది.

ఈ నవల ‘గబ్బగీమి’ పేరుతో 2005 లో తానా నవలల పోటీకి పంపగా ఎన్నిక కాక తిరిగి వచ్చిందని రచయిత, ముందుమాట రాసిన ఎ. కె. ప్రభాకర్ రాశారు. తరవాత ‘చీకటి వలయాలు’ గా చతుర మాస పత్రికలో వచ్చినా పుస్తక రూపంలో మొదటి పేరుతో ప్రచురితమైంది 2017 లోనే. అంటే సుమారు పదిపన్నెండేళ్ళ నాటి సామాజిక చరిత్ర ఈ నవల. ఇప్పటికీ ఈ నవల వర్తమాన చరిత్రలా అనిపిస్తుందంటే, ఆర్ధికంగా ఎంతో ఎదిగిందనుకుంటున్న తెలుగు సమాజంలో మధ్యతరగతి జీవన పరిణామాలు ఏ దిశగా పయనిస్తున్నాయో ఊహించుకోవచ్చు. దీనికి కారణం ప్రపంచీకరణమా? ప్రపంచీకరణను తమజీవితాలకు అన్వయించుకోలేక అనుకూలంగా మలుచుకోలేని ప్రజల అజ్ఞానమా? మారుతున్న ఆర్ధిక విధానాలకు అనుగుణంగా ప్రజలను తయారు చేయలేని ప్రభుత్వ విధానమా? స్వలాభాపేక్షే గమ్యంగా నడిచే పెట్టుబడిదారీ తత్త్వమా? లేక, కేవలం ప్రజల స్వార్ధపరత్వమా? తరచి చూడాగా అన్నీ కారణాలుగానే కనిపించినా, సమస్యను అధ్యయనం చేస్తేనే కదా నిగ్గు తేలేది. భగ్నమౌతున్న మానవ సంబంధాలకూ, అసమానతలకూ, ఆత్మహత్యలకూ, ఆర్థిక దోపిడీలకూ, అణచివేతకూ, అన్నిటికీ పాపాలభైరవుడు ప్రపంచీకరణే కారణమనుకుంటే, అది పలాయనవాదమే. ముందుమాట రాసిన ఎ.కె. ప్రభాకర్ గారు ఆశించినట్లు రచయితలు మార్పుల సునామీ నుంచి రక్షించి, “సమాజ చలన సూత్రాల్ని” రచనలో ఆవిష్కరించి, మార్గదర్శనం చేయించాలనుకోవడం పేరాశే. అది రచయిత బాధ్యత కారాదు.

You Might Also Like

Leave a Reply