ప్రశ్నలు కథలుగా… – “మూడు బీర్ల తర్వాత” కథలకు ముందుమాట

(“మూడు బీర్ల తర్వాత” కథల సంపుటి జనవరి 12 న విడుదల కానుంది)
****************
ఎప్పుడో మూడేళ్ళ క్రితమో, ఇంకా అంతకన్నా ముందో మీ ముందుకు రావలసిన పుస్తకం ఇంత ఆలస్యమవటానికి వేరే కారణాలు కూడా ఏమైనా ఉన్నాయేమో నాకు తెలీదు కానీ, ఆ నెపాన్ని నామీదే వేస్తాడు అక్కి అని మేమంతా పిలుచుకునే మిత్రుడు అక్కిరాజు భట్టిప్రోలు. నా ఆలశ్యానికి (అలసత్వం కాదు సుమండీ) ముందుగానే క్షమాపణలు చెప్తున్నాను; కాకపోతే నా ఆలస్యం వల్లే ఇంకొన్ని మంచి కథలు కూడా ఈ సంకలనంలో చేరాయి అని సమర్థించుకుంటున్నాను.

నాకు అక్కిరాజు పరిచయమయ్యే నాటికి అతను రచయిత కాదు. తెలుగు సమాజం పట్ల, సాహిత్యం పట్ల, అభిమానం, ప్రేమ ఉన్న ఒక సిలికాన్ వాలీ సాఫ్ట్‌వేర్ నిపుణుడు. తెలుగు జీవితంలోకి ఇంటర్నెట్ అంతగా చొరబడని రోజుల్లో, soc.culture.indian.telugu (SCIT) అని దాదాపు నలభైవేలమంది సభ్యులున్న పెద్ద యూజ్నెట్ గ్రూపు ఉండేది; ఇంటర్నెట్‌లో మొదటి తెలుగు సమాజం అదే. ఈ గ్రూపు లోని కొందరు సాహిత్య అభిమానులతో తెలుసా (అంటే తెలుగు సాహిత్యమన్నమాట) అని మరొక మెయిల్‌గ్రూప్ ప్రారంభమై, ఇంకొన్నాళ్ళకి రచ్చబండగా మారింది. ప్రపంచం అన్నిమూలల నుంచి తెలుగు సాహిత్య అభిమానులు, తమ ఇష్టాలు, అయిష్టాలు, అభిప్రాయాలూ కలబోసుకుంటూ, కలహించుకుంటూ, కలివిడిగా ఈ రచ్చబండలో హడావుడి పడుతుండేవారు. ఈ గ్రూపులో 1996-97 ప్రాంతాల్లో అక్కిరాజు కనిపించటం మొదలెట్టాడు. మిగతావారి పట్ల మర్యాదగా ఉంటూనే తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పేవాడు. మొదట్లో అక్కిరాజు అతని పేరో, ఇంటిపేరో అని కొద్దిగా తికమక ఉండేది. ఆ రోజుల్లో ఇంటర్నెట్ మిత్రులకి మనుషుల పేర్లు, ఈమెయిల్ అడ్రెసులూ మాత్రమే తెలిసేవి కాని, ప్రత్యక్షంగా కలుసుకునేదాకా మనుషుల రూపరేఖలు తెలిసేవి కావు. లాస్ఏంజెల్స్‌లో 1997 తానా మహాసభల్లో కలుస్తానని ముందుగా హడావుడి చేసిన అక్కిరాజు, తీరా సమావేశానికి ఎందుకనో గైరుహాజరయ్యాడు. 1999 సిన్సినాటి తానా సభల్లో, సన్నగా, పొడుగ్గా, నవ్వు మొహంతో ఒక యువకుడు మొహమోటంగా నేను అక్కిరాజుని అని పరిచయం చేసుకున్నాడు. ఒక మినిరికార్డరు చేతపట్టుకుని అక్కడి సాహిత్య సమావేశాలన్నిటినీ రికార్డు చేసి, ఆ తర్వాత ముఖ్య ప్రసంగాలని టైపుచేసి, వెంటనే తెలుసా గ్రూపుకి అందించాడు; అతను అందించిన జయప్రభ గారి ఉపన్యాసంపై గ్రూపు సభ్యుల్లో వాడిగా, వేడిగా మంచి చర్చలు జరిగాయి. ఈ కుర్రాడికి ఉత్సాహంతో పాటు ఓపిక కూడా బాగానే ఉంది అని నేను ముచ్చట పడ్డాను.

ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకూ అంటే, 1994-2004 దశకం అమెరికా తెలుగు సాహిత్యంలో ఒక కీలకమైన కాలం. 1994కు ముందు అమెరికా తెలుగు రచయితలకు తమ రచనలు ప్రచురించుకోవటానికి అవకాశాలు పరిమితంగా ఉండేవి. 70ల్లో ప్రారంభమైన తెలుగు అమెరికా మాసపత్రిక అప్పటికి దాదాపు మూతపడిపోయింది. రెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే తానా మహాసభల సావనీర్లు, అప్పుడప్పుడూ వస్తుండే స్థానిక తెలుగు సంఘాల లిఖిత పత్రికలు మాత్రమే ఈ రచనలకు వేదికలు. తెలుగుదేశపు పత్రికలలో కొంతమంది రచయితలు ప్రచురించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నా, ఆ రచనలు అమెరికాలో పాఠకులకు చేరేవి కాదు. 1990లలో మూడు పెను మార్పులు వచ్చాయి. అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యకు స్టూడెంట్ వీసాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు తాత్కాలిక వీసాలు తేలికగా దొరకటం మొదలయ్యింది. ఒక్కసారిగా అమెరికాలో తెలుగు యువతరం సంఖ్య పెరిగిపోయింది. అదే సమయంలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావటం మొదలయ్యింది. మొదట్లో విద్యార్థులు, కంప్యూటర్లతో పనిచేస్తున్నవారే ఇంటర్నెట్‌ని వాడినా, అమెరికా ఆన్లైన్, నెట్‌స్కేప్ బ్రౌజర్ల ప్రాచుర్యంతో 1997 నాటికి ఇతరులు కూడా ఇంటర్నెట్ వాడటం మొదలు పెట్టారు. తానాపత్రిక మాసపత్రికగా, అమెరికా భారతి త్రైమాసిక పత్రికగా రావటంతో రచయితలకు బహుళప్రాచుర్యం ఉన్న వేదికలు దొరికాయి. ఇంకొన్నేళ్ళకు తెలుగుదేశపు పత్రికలు కూడా ఇంటర్నెట్‌లో తమ దిన, వారపత్రికలను పంచుకోవటం మొదలుపెట్టటంతో, చదువరులకూ, రచయితలకూ కూడా విస్తృతంగా సమకాలీన తెలుగు సాహిత్య ప్రపంచాన్ని పరిశీలించటానికి అవకాశం కలిగింది. ఇంటర్నెట్ వల్ల వచ్చిన ఒక ముఖ్య సౌలభ్యమేమిటంటే ఒక విషయంపై ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఒక్కచోట తమ అభిప్రాయాలను విద్యుద్వేగంతో క్షణాలలో పంచుకోవచ్చు. అమెరికా తెలుగుసాహితీలోకం ఈ అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకొంది. SCIT, తెలుసా, రచ్చబండలతో పాటు, ఈమాట ఇంటర్నెట్ తెలుగు పత్రిక కూడా అప్పుడే ప్రారంభమయ్యింది. ఈ మార్పుల వల్ల జరిగిన మేలు ఏమిటంటే సాహిత్యం పట్ల మంచి చర్చలు జరిగేవి. రచయితలకు వేదిక దొరకటంతో పాటు, తమ రచనలకు పాఠకుల, ఇతర రచయితల స్పందన వెంటనే దొరికే అవకాశం వచ్చింది. పాఠకులకు తమ అభిప్రాయాలు చెప్పే వీలుతో పాటు, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవటానికీ, సంభాషణల్లోనూ, సంవాదాల్లోనూ పాల్గొని తమ జ్ఞానాన్ని మరింత మెరుగుపరచుకోవటానికీ అవకాశం వచ్చింది. ఈ క్రమంలో అమెరికా తెలుగు రచన రాసిపరంగా, వాసిపరంగా వికసించింది. ముఖ్యంగా కథకులు ఈ అవకాశాన్ని బాగా అందిపుచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో అక్కిరాజు భట్టిప్రోలు అనే సాఫ్ట్‌వేర్ నిపుణుడు ఉన్నట్లుండి ఒక రోజున నేనో కథ రాశాను అంటూ ప్రకటించాడు. ప్రపంచంలో అందరూ పురుగులే అని అంతరాంతరాల్లో నిర్ధారించుకున్న ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడు ఒకానొక ఆఫీసు పార్టీలో మూడు బీర్లు ముగించి నాలుగో సీసా తెరిచాక అతని బాహ్య ప్రవర్తనకూ, అంతశ్చేతనకూ మధ్య వైరుధ్యాలు కరిగిపోయిన వృత్తాంతం, మూడు బీర్ల తరువాత అనే ఆ కథ. అతని కథానాయకుడి మీద నాకు పెద్ద సానుభూతి లేకపోయినా, అక్కిరాజు మొదటి కథ, మొదటి కథలా అనిపించలేదు. కథ చదివించింది; సంభాషణలు, నిర్మాణం, శైలి బాగున్నాయి. ఇతను రాయగలడు, మంచి ఇతివృత్తాలను ఎన్నుకుంటే ఇతని వద్ద నుంచి మంచి కథలను ఆశించవచ్చు అనిపించింది. ఆ తరువాత 9/11 సంఘటన ఇతివృత్తంగా అక్కిరాజు రాసిన నాక్కొంచెం నమ్మకమివ్వు కథ ఆ అభిప్రాయాన్ని మరింత బలపరచింది.

‘ఇంజనీరింగ్ చేసి పెసరట్టుప్మా చేసే ఐశ్వర్యారాయి’ వంటి పెళ్ళికూతుళ్ళకోసం చూస్తున్న మగ పిల్లల మధ్య, పెళ్ళి కన్నా తన వ్యక్తిత్వమే ముఖ్యం అనుకున్న ఒక తెలుగు అమ్మాయి కథ, నందిని, 2003 తానా కథల పోటీలో మొదటి బహుమతిని పంచుకొని, అక్కిరాజుని అమెరికా బయట పాఠకులకు పరిచయం చేసింది. అక్కిరాజు అమెరికా వదలి హైదరాబాదులో స్థిరపడ్డ కొత్తలో రాసిన అంటుకొమ్మ, గేటెడ్ కమ్యూనిటీ కథలు అతనికి కథకుడిగా గుర్తింపు తెచ్చాయి. కథకుడిగా అక్కిరాజు ప్రపంచం ఐటీ ఉద్యోగుల ప్రపంచాన్ని దాటి విస్తరించింది. రమాదేవి ఎందుకు రమ్మంది, వస్త్రాపహరణం, జంధ్యం కథలు అక్కిరాజులోని ఈ పరిణతికి నిదర్శనాలు.

నిజానికి అక్కిరాజు ప్రపంచం చాలామంది కన్నా విస్తృతమైంది. ఖమ్మం జిల్లాలో, ఆదివాసీ పల్లెటూళ్ళలో పెరిగిన అక్కిరాజు సిలికాన్ వాలీలో మంచి ఉద్యోగం మానేసి హైదరాబాదులో స్థిరపడ్డాడు. పుట్టి పెరిగింది వామపక్ష నేపథ్యంలో. మసిలేది ఇండియాలో అమెరికాలో ఐటీ కార్పొరేట్ నేపథ్యంలో. చదువుకునే రోజుల్లో చిక్కులెక్కలు పరిష్కరించటం తన అభిమాన వ్యాసంగం అని చెప్పుకునే అక్కిరాజు ఈ వైరుధ్యాలను తాను అర్థం చేసుకుంటూ మనకు ఈ కథల్లో పరిచయం చేస్తున్నాడు.

సాఫ్ట్‌వేర్ రంగంలో నిపుణుడిగా రాణించాలంటే రాస్తున్న సాఫ్ట్‌వేర్ లక్ష్యమేమిటో స్పష్టంగా తెలిసి ఉండాలి. కంప్యూటర్ మెమరీ చవగ్గా దొరుకుతుంది కదా అని ఊరికే దస్తాలకొద్దీ కోడ్ రాయకుండా వీలైనంత తక్కువ లైన్లలో కోడ్ రాసి లక్ష్యాన్ని సమస్యలు లేకుండా చేరగలిగిన వాడే మొనగాడు. అక్కిరాజు తన కథలను సాఫ్ట్‌వేర్ రాసినంత జాగ్రత్తగా రాస్తాడు. విషయం ఎన్నుకోవటంలో ఉన్న ధ్యాస కథ చెప్పే పద్ధతి మీద కూడా చూపిస్తాడు. అతని కథానిర్మాణ విధానం, పాత్రల ప్రవర్తన, మాటలు, కథావేదిక చిత్రణల పట్ల అతను చూపించే శ్రద్ధ వల్ల అతని కథలు బలమైన ముద్ర వేస్తాయి.

అక్కిరాజు కథల్లో ప్రకృతి వర్ణనలు, ఉపమానాలూ, ఉత్ప్రేక్షలూ కనిపించవు కానీ, రెండు మూడు చిన్న వాక్యాలు కథకు అవసరమైన వాతావరణాన్ని, పాత్రల స్వభావాలనీ పాఠకుల కళ్ళముందు స్పష్టంగా ఉంచుతాయి. ఈ పొదుపరితనం నాకు చాలా ఇష్టం. అతని కథల్లో పాత్రలు ఎక్కణ్ణుంచో ఊడిపడ్డ అసహజ వ్యక్తులు కాదు. మనకు తెలిసినవాళ్ళలాగే ఉంటారు. మనకు తెలిసినట్లే మాట్లాడతారు. ప్రత్యేకంగా హీరోలూ విలన్లూ ఉండరు. మామూలుగా మనుషుల్లో ఉండే మంచితనం, బలాలూ బలహీనతలూ ఉన్నవాళ్ళు వాళ్ళు.

దాదాపు రెండు దశాబ్దాలుగా కథలు రాస్తున్న అక్కిరాజు రాసింది డజను కథలే. ఇంత తక్కువగా కథలు రాయటానికి మంచి కథలు రాయాలన్న తపన, కథ ఆలోచింపచేయాలన్న విశ్వాసం బహుశా కారణాలు కావచ్చు. అక్కిరాజు కథలు కాలక్షేపానికి మాత్రమే రాయటం లేదని, తనను గాఢంగా ఆలోచింపచేసిన ప్రశ్నలను పాఠకులతో పంచుకోవాలన్న తపన వల్ల రాస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఆ ప్రశ్నలపట్ల అతనికి ఒక అవగాహన వచ్చేవరకు ఆగటం వల్లే అతని కథలు తక్కువగా వస్తున్నాయి.

అక్కిరాజు కొత్త కథలు చదివేసి పక్కన పెట్టేయటానికి వీలునివ్వటం లేదు. కథ చదువుతున్నప్పుడు రచయిత కొన్ని వాస్తవాలను పని కట్టుకుని మన ముందు పెడుతున్నాడని, ఆ విషయాలు మనకు తెలిసినట్లు, అర్థమైనట్లు అనిపిస్తున్నా, అతను మనకు అర్థమయిన దాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడని, మనం చూడని కోణాలను చూడమంటున్నాడని అనిపిస్తుంది. అక్కిరాజు తొలికథల్లో తను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా పాఠకులకు విప్పిచెప్పాలన్న ప్రయత్నం కనిపించేది. కథకుడిగా అతను పరిణతి చెందుతున్నకొద్దీ ఆ ధోరణి తగ్గిపోయింది. అక్కిరాజు మొదటి కథలో నాయకుడికి అసలు ప్రశ్నలేమీ లేవు; అతను ప్రపంచం గురించి ఒక నిర్ధారణకు ఎప్పుడో వచ్చేశాడు. ఇప్పటి అక్కిరాజు కథల్లో ముఖ్యంగా కనిపించేది ప్రశ్నలే. అక్కిరాజు మొదటి కథల్లో తాను చెప్పకపోతే పాఠకులకు సరిగ్గా అర్థం కాదేమోనన్న ఆదుర్దా కనిపిస్తుంది. రచయిత వేయ తల్చుకున్న ప్రశ్నలూ, సమాధానాలూ రెండూ విశదంగానే కనిపిస్తాయి. కథకుడిగా అతని మీద అతనికి నమ్మకం పెరుగుతున్న కొద్దీ అతనికి పాఠకుల తెలివితేటల పైన కూడా నమ్మకం పెరిగింది. అతని కథల్లో గుప్తత, సాంద్రత కూడా పెరిగాయి. ఇప్పుడు అతని కథలు ఇంకా క్లిష్టమైన ప్రశ్నలు వేస్తున్నాయి. గమ్మత్తేమిటంటే ఇప్పుడు ఆ ప్రశ్న ఏమిటో కూడా ఒకోసారి రచయిత చెప్పటం లేదు. ప్రశ్న(ల)ను గుర్తుపట్టే పని, సమాధానం ఆలోచించుకునే పని రెండూ పాఠకులకే అప్పజెప్పే కిటుకు నేర్చుకున్నాడు. ఇప్పటి అక్కిరాజు కథల్లో ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పరు. పాఠకుల ఆలోచనా శక్తి మీద ఇంత నమ్మకం చూపిస్తున్న రచయితలు మనకు తక్కువే.

విశాలమైన, క్లిష్టమైన ప్రపంచంలో ఎప్పుడూ సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువ. సరైన ప్రశ్నలు లేవదీయటం, ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు వెదకడం మాత్రమే సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. అతి త్వరగా మారిపోతున్న మన సమాజంలో ఉన్న వైరుధ్యాలను అర్థం చేసుకొని సరైన దారిలో ముందుకు వెళ్ళాలంటే అక్కిరాజులా ప్రశ్నలు లేవనెత్తే రచయితల అవసరం మనకు ఎంతైనా ఉంది. అందుకే అక్కిరాజు మరిన్ని ప్రశ్నలూ, చర్చలూ లేవదీస్తూ మరెన్నో మంచి కథలు రాయాలని, మిత్రుడిగా, పాఠకుడిగా, సమాజంలో ఒకడిగా నా కోరిక.

You Might Also Like

3 Comments

  1. సురేశ్ కొలిచాల

    నాకిష్టమైన కథల రచయిత, తెలుసా రోజుల్నించి నాకత్యంత ఆప్తమిత్రుడైన అక్కిరాజు ఇన్నాళ్ళకు తన కథల్ని పుస్తకంగా వేస్తున్నాదంటే పట్టలేనంత ఆనందంగా ఉంది. అభినందనలు, అక్కీ!

    చిన్న సవరణ: 1999 తానాలో జయప్రభ చేసిన ప్రసంగం అక్కిరాజు మినిరికార్డరు టేపుల్లోంచి విని రాసింది కాదు. ఆవిడ ప్రసంగపాఠం మొత్తం కాగితాలను వేలూరి వేంకటేశ్వర రావు గారు సంపాదించి నాకు ఫాక్స్ చేస్తే, దాన్ని నేనూ, అక్కిరాజు కలిసి టైపు చేసి తెలుసాలో పోస్టు చేసాము. జయప్రభ గారి ప్రసంగ పాఠాన్ని, అనుమతిని సంపాదించి; ఆపై కష్టపడి ఫాక్స్ చేసినందుకు వేలూరి గారికి కృతజ్ఞతలు అప్పుడు తెలుసా పోస్టులోనే చెప్పినట్టుగా గుర్తు.

    సురేశ్ కొలిచాల.

  2. ముత్తేవి రవీంద్రనాథ్.

    అక్కిరాజు గారి కథల గురించి చక్కటి పరిచయం. ముఖ్యంగా ఈ కింది పరిచయ వాక్యాలు మనసును తాకాయి
    “కథకుడిగా అతని మీద అతనికి నమ్మకం పెరుగుతున్న కొద్దీ అతనికి పాఠకుల తెలివితేటల పైన కూడా నమ్మకం పెరిగింది. అతని కథల్లో గుప్తత, సాంద్రత కూడా పెరిగాయి. ఇప్పుడు అతని కథలు ఇంకా క్లిష్టమైన ప్రశ్నలు వేస్తున్నాయి. గమ్మత్తేమిటంటే ఇప్పుడు ఆ ప్రశ్న ఏమిటో కూడా ఒకోసారి రచయిత చెప్పటం లేదు. ప్రశ్న(ల)ను గుర్తుపట్టే పని, సమాధానం ఆలోచించుకునే పని రెండూ పాఠకులకే అప్పజెప్పే కిటుకు నేర్చుకున్నాడు. ఇప్పటి అక్కిరాజు కథల్లో ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పరు. పాఠకుల ఆలోచనా శక్తి మీద ఇంత నమ్మకం చూపిస్తున్న రచయితలు మనకు తక్కువే.”

  3. Anil అట్లూరి

    చక్కని పరిచయం. విషాదం ఏమిటంటే, దేశంలోనే ఉండి, మీకు నచ్చిన, మీరు మెచ్చిన కధలు, మిమ్మల్ని అభిమానించే రచయిత ఒక సంపుటిగా వెలువరించుకుంటున్న సందర్భంలో, ముందు మాట రాసినమీరే ఈ పుస్తకం ఆవిష్కరణకి ఉండకపోవటం!

    అక్కి, ఇప్పటికైనా దీన్నీ మీరన్నట్టు పాఠకులకు, “ఇంకొన్ని మంచి కథలు కూడా” అందింస్తున్నందుకు, మీకూ, అక్కికి శుభాకాంక్షలు.

Leave a Reply