హరికథా భిక్షువు

వ్యాసకర్త: Halley
************

“హరికథా భిక్షువు” – శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి అయ్యవారి జీవన దర్శనం అని ఎమ్మెస్ సూర్యనారాయణ గారు రాసిన పుస్తకం చదివాను ఈ రోజు. నాకు ఇటువంటి విషయాలంటే బాగా ఇష్టం కనుక ఎలాగో పుస్తకం కొనేసాను కానీ తర్వాత ఎప్పుడో వెలిగింది నాకు అరెరే ఇది ఎస్పీ బాలు ఇంటి పేరు కదా అని. పుస్తకం కవర్ పేజిలో ఎక్కడా ఇది ఎస్పీ బాల సుబ్రమణ్యం గారి నాన్నగారి జీవితం గురించిన పుస్తకం అని రాయలేదు. కేవల ధనాపేక్షతో పుస్తకం ముద్రించి ఉంటే ఖచ్చితంగా ఆ పని చేసి ఉండేవారు. పుస్తకం స్థాయి పెరిగింది అలా చేయకపోవటం వలన.

నాకు అసలేమీ తెలీదు సాంబమూర్తి గారి గురించి ఈ పుస్తకం చదివే ముందు. ఏదో సంప్రదాయ కళల మీద మక్కువతో కొన్న పుస్తకం. మొదట వెంకయ్య నాయుడు గారి సందేశం ఉంది. అందులో ఆయన సాంబమూర్తి గారు గాండ్ల కులస్తులకు పీఠాధిపతులు అని రాసారు. మనువంశ కులస్తులని పిలువబడే వీరు రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో విస్తరించి ఉన్నారు అని అన్నారు. కొత్తగా అనిపించింది నాకు చదువుతూ ఉంటే బాలు గారి పూర్వికుల వెనుక ఇటువంటిది ఒక కోణం ఉంది అని ఊహించలేదు నేను.

త్యాగరాజ స్వామి పటం పట్టుకొని జోలె పడుతూ రెండు దశాబ్దాల పైబడి త్యాగరాయ ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించిన మహనీయుడాయన అని మండలి బుద్ధ ప్రసాద్ గారి పరిచయం ఉంది పుస్తకంలో. సరే మొత్తానికి మంచి పుస్తకమే కొన్నాను ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకుంటున్నాను అని అనిపించింది.

తర్వాత “ముందుమాట (కాదు)” అని కె.విశ్వనాథ్ గారి మాటలు కొన్ని ఉన్నాయి . “ఈ పుస్తకం (గ్రంథం) చదవకముందు మా బాబాయి (సాంబమూర్తి గారు) అంటే – ఒక ఆరడుగుల మంచి గంధంతో చేసిన గణపతి అనుకున్నా గాని ఇలా ఖైరతాబాద్ వినాయకుడు అనుకోలేదు. ఆ సత్యం ముందే తెలిసుంటే, ఆయన సుశ్రూష చేసి, కొన్ని సాహిత్యపు మెళుకువులు నేర్చుకొని, ఇంకో పది ‘శంకరాభరణాలు’ తీసి ఉండేవాడిని” అని రాశారు. అయ్య బాబోయ్ మరీ ఇంత మాట అనేశారేంటి అని అనుకున్నాను. కానీ పుస్తకం మొత్తం చదివాక ఆయన రాసిన మాటలు కేవలం అతిశయోక్తులు కావు అనిపించింది.

సాంబమూర్తి గారు హరికథలలో దిట్ట అయిన విధానం గురించి చెప్పుకొస్తూ రచయిత తెలుగు రాష్ట్రాలలో హరికథల పుట్టు పూర్వోత్తరాల గురించి కొంచెం వివరంగానే చర్చించారు. ఇది వరకే అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి “నా యెఱుక” చదివినందున కొన్ని విషయాలు నాకు సులభంగానే అర్థమయ్యాయి. లేదంటే కొంత ఎకడమిక్ గా అనిపించచ్చును కొందరికి. అయితే ఈ హరికథలను గురించి ఒక మాట రాసారు రచయిత. నాకు భలే నచ్చింది! “అలా ఎగిసిన వేలాది హరికథకులు దశాబ్దాల పాటు కాదు.. శతాబ్దాల పాటు తమ అమేయ భక్తి పరవశ్యాలతో కథలు చెప్పి ఎందరినో భక్తులుగా, మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఫలంగానే – ‘సమాజం’ ఎంతో కొంతమేరైనా ‘పాపభీతితో’ నైనా.. సభ్య సంస్కారాలతో మసలుతోంది అనడంలో యెంత మాత్రం అతిశయోక్తి లేదు! అందుకు ‘జాతి’ .. హరికథకులకు తరతరాలు ఋణపడి తీరాలి! కృతజ్ఞతలు చెల్లించాలి!” అని. విశ్వనాథ సత్యనారాయణ రచనలు గుర్తొచ్చాయి ఈ వాక్యం చదివినప్పుడు. తెలుగు ప్రజల జీవితంలో అంతర్భాగంగా ఉండిన యక్షగానాలు హరికథలు వంటి కళలు సామాన్య జన జీవనాన్ని సంస్కరించటంలో పోషించిన పాత్రను గురించి ఆయన రాసిన మాటలు గుర్తొచ్చాయి.

సాంబమూర్తి గారు హరికథలు చెప్పిన విధానం గురించి చెబుతూ కొన్ని విశేషాలు తెలిపారు రచయిత. నెల్లూరు నగరంలోనూ, పరిసరాలలోని మారుమూల గ్రామాలలోనూ, ముఖ్యంగా అల్లీపురంలోని శ్రీరామాయలంలో ఏకంగా 40 రోజుల పాటు హరికథ చెప్పే వారట సాంబమూర్తి గారు. కరెంటు సక్రమంగా లేని ఆ రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి వేకువన 2 గంటల దాకా కూడా ఆయన హరికథాగానం చేసినా ‘అప్పుడే అయిపోయిందా’ అంటూ శ్రోతలు నిరాశపడేవారట.

సాంబమూర్తి గారు గాండ్ల కులస్తుల అభ్యర్థనను పురస్కరించుకుని మనువంశజుల పవిత్ర చరిత్రను అందరూ చదువుకునేటట్టుగా “శ్రీ మనువంశ పురాణము”ని వచనానువాదంగా చేశారట. ఈ విషయం చెబుతూ మనువంశ పురాణం గురించి గాండ్ల కుల చరిత్రను గురించి కొన్ని విషయాలు పేర్కొన్నారు రచయిత. శ్రీపతి పండితారాధ్యుల వంశం నుంచి ఉద్భవించే కుటుంబాలలోని పెద్ద కుమారునికి ఈ మనువంశ పీఠాధిపత్యం గురు స్థానం లభిస్తూ వస్తోంది అట. మనువంశ పురాణం గురించి చెబుతూ గాండ్ల కులవృత్తి అయిన గానుగ వృత్తిని గురించి సాంబమూర్తి గారు రాసిన వచనం నన్ను ఆకట్టుకుంది. రచయిత అన్నట్టుగా గానుగ తిప్పే వృత్తిని గురించిన ఈ కథనంలోని మహత్వపూర్ణమైన ‘భావనా పటిమ’ ‘ఊహ’ ‘సృష్టి’ నన్ను ఆకట్టుకున్నాయి. ఈ వాక్యాలు పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా:

“సాక్షాత్ పరమేశ్వరుడి జటాజూటానికి తైలం సృష్టించాలంటే ..
విశ్వకర్మ ఏం చేసాడంటే ..
మొత్తం ధారుణీ మండలాన్ని గానుగరోలుగా
మేరు పర్వతాన్ని మధ్యస్తంభమైన రోకలిగా
హిమవన్నగాన్ని కాడిగా
వృషభేశ్వరుడిని ఆ గానుగ తిప్పే ఎద్దుగా
నాలుగు వేదాలనూ పగ్గాలుగా
సకల శాస్త్రాలు ములుగోలుగా
గానుగ తిప్పేవాడు సూర్యుడుగా నిర్మించి .. నిర్ణయించాడట!
అందులో తిలలు పోసి .. తైలంబు దీసి, మనువులు
త్రిపురహరుడైన పరమశివునికి అర్పించారట“

కొందరికి ఇది ప్రిమిటివ్ గా అనిపించచ్చు. తీరికగా ఆలోచిస్తే గొప్ప తత్వాలు దాగున్నాయి ఈ కథనం లో. గానుగ తిప్పేవారి వృత్తిని దర్శించే దృక్కోణం సమూలంగా మారిపోతుంది ఆ తత్త్వం బోధ పడితే.

సాంబమూర్తి గారి తదనంతరం వారి తనయులైన బాల సుబ్రహ్మణ్యం గారిని తమ పీఠాధ్యక్షులుగా భావిస్తున్నారట ఈ మనువంశీకుల వారు. అయితే ఈ విషయం గురించి ఎస్పీ బాలు ఇలా అన్నారట:

“మా తాత తండ్రులు ఆచరించిన నియమ నిష్టలు కానీ, వారు అనుసరించిన మహోన్నత ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి నా దగ్గర లేవు! కేవలం వారికి వారసుడినైనంత మాత్రాన మహోన్నత మనువంశ గురుపీఠానికి నేను మార్గం చూపే గురువును కాలేను! అయినా, మనువంశీకులంతా నన్ను తమ గురుపరంపర లోని మహా గురువుగా భావించి, మా పెద్దలకు ఇచ్చిన గౌరవ ప్రపత్తులనే నాకు కూడా ఆపాదించి, పాద నమస్కారాలు చేస్తూ ఉంటారు! ఆ నమస్కారాలన్నింటిని నేను మా పెద్దలకే అంకితం చేస్తుంటాను… మనువంశ గురుపీఠానికి నేను అనర్హుడిని.. ఈ మహత్తర మహిమాన్విత గురుపీఠం భవిష్యత్తును సైతం.. నేను నిర్వచించలేను” అని.

ఈ విషయం పేర్కొన్నాక మనువంశీకులను ఇకపై నడిపించే గురువు ఎవరు అని రచయిత కొన్ని ప్రశ్నలు వేసి కొన్ని సమాధానాలు చెప్పారు. మరికొన్ని సూచనలు చేశారు. వంశానుగత పరంపరలు విచ్ఛిన్నమవుతున్న యుగంలో ఇటువంటి ప్రశ్నలు సహజం. ఏవో ప్రత్యామ్నయాలు వెతుక్కోక తప్పదు అందరూనూ. ఐతే ఈ పుస్తకం చదివినందున ఎస్పీ బాలు గారిని టీవీలో మళ్ళీ చూస్తే నాకు సాంబమూర్తిగారు గుర్తుకురాక మానరు ఇకమీదట. వారితో పాటే ఈ పీఠాధ్యక్షత గురించి బాలు గారి ఈ మాటలు కూడా మర్చిపోలేనేమో నేను.

అటు తర్వాత భిక్షాటనా పూర్వక త్యాగరాజ స్మరణోత్సవముల గురించి విపులంగా వివరించారు. తాను జోలె పట్టి భిక్షాటన చేసి త్యాగరాజోత్సవాలు చేద్దాం అని అనుకున్న విషయం సాంబమూర్తి గారు తన భార్యకు చెబితే ‘ఇంటి నుండే భిక్షాటన ప్రారంభించండి. మొదటి భిక్ష నేనే పెట్టగలను’ అని అన్నారట ఆవిడ. ఇలా గుండెకు హత్తుకు పోయే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. ముఖ్యంగా బాలుగారు తన తండ్రిగారి గురించి చెప్పిన విషయాలెన్నో పుస్తకం చదివాక కూడా గుర్తుండి పోతాయి. ఈ సారెప్పుడన్నా నెల్లూరుకి వెళ్తే అక్కడ సాంబమూర్తి గారి విగ్రహం తప్పక చూడాలి. ఈ విగ్రహావిష్కరణ తాలూకా ఫోటో ఒకటి పొందు పరిచారు పుస్తకం లో. ఈ విగ్రహావిష్కరణకు గురించి ఇక్కడ. నెల్లూరులో జరిగే ఈ భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవాల గురించి ఇక్కడ. తెలుగులో కొత్తగా వచ్చిన మంచి పుస్తకాలను గురించి చెప్పమని ఎవరన్నా అడిగితే ఈ పుస్తకం గురించి చెబుతాను తప్పకుండా.

You Might Also Like

Leave a Reply