Ten Faces of a Crazy Mind – శివరామ కారంత్ ఆత్మకథ
కన్నడ సాహిత్యంతో/సాంస్కృతిక జీవితంతో పరిచయం ఉన్నవారు శివరామ కారంత్ పేరు వినే ఉంటారు. బహుశా 1970లలో జ్ఞానపీఠం వచ్చిన వారిలో ఆయనా ఒకరని కూడా తెలిసే ఉంటుంది. నేను మొదటి కారంత్ నవల, తెలుగు అనువాదంలో పద్దెనిమిదేళ్ళ వయసులోనే చదివినా (త్రివేణి గారి అనువాదం అనుకుంటాను), కొంచెం శ్రద్ధగా, ఇష్టంగా చదివింది ఒక ఐదేళ్ళ క్రిందట. అప్పుడు జర్మనీ లో నేను ఉన్న ఊళ్ళో భారతీయ (ముఖ్యంగా దక్షిణాది భాషల) పుస్తకాలకి ఆంగ్లానువాదాలు (మూలభాషవీ ఉండేవి) నాకు చాలా తేలికగా దొరికేవి. ఆ విధంగా కారంత్ గారివి ఓ మూడు నాలుగు నవలలు చదివి ఉంటాను (రెండింటికి ముందు మాటలు ఇక్కడ టైపు చేశాను.). అప్పటి నుండీ ఆయన గురించి కుతూహలం నాకు. ఆయన గురించి తెలుసుకుంటూ ఇక్కడ వ్యాసానికి జతచేసిన చిత్రాన్ని చూశాను. అది కన్నడ చిత్రకారుడు కె.కె.హెబ్బార్ కారంత్ బహుముఖ ప్రజ్ఞను సూచిస్తూ గీసిన చిత్రం. అప్పటి నుండి ఆయన ఆత్మకథ చదవాలని ఆశగా ఉండింది. అది మధ్యలో ఐదేళ్ళు, రెండు దేశాలు మారాక ఇన్నాల్టికి కుదిరింది. పుస్తకాన్ని హెచ్.వై.శారదాప్రసాద్ గారు ఆంగ్లంలోకి అనువాదం చేశారు.
“హుచ్చు మనసిన హత్తు ముఖగళు” అన్న కన్నడ శీర్షికకి ఆంగ్లానువాదం ఈ Ten Faces of a Crazy Mind. 10 ముఖాలన్నది నేను ఊహించినదే. డెబ్భై ఏళ్ళకి పైబడి సాగిన సాహితీ జీవితం ఆయనది! అందులో దాదాపు యాభై నవలలు, ముప్ఫై నాటకాలు, నాలుగు చిన్నకథల సంకలనాలు, ఆరు వ్యాస సంకలనాలు, రెండు కవితా సంకలనాలు, తొమ్మిది విజ్ఞాన భాండాగారాలు (encyclopaedia), కళలను గురించిన పదమూడు పుస్తకాలు, ఇవి కాక వందలకొద్దీ ఇతర వ్యాసాలూ ఉన్నాయి. ఆయన సృష్టించిన సాహిత్యం పరిధీ, విస్తృతీ చూశాక పది ముఖాలు అన్నది default అని నమ్మాను. ఇక Crazy mind భాగం ఏమిటా అని కుతూహలం. ఇవీ ఈ పుస్తకం మొదలుపెట్టే ముందు నా ఆలోచనలు. పుస్తకంలో కారంత్ బాల్యం మొదలుకుని దాదాపు చివరి రోజుల దాకా అనేక సందర్భాలలో ఆయన జ్ఞాపకాలను తలుచుకున్నారు. బాగా చిన్నప్పటివి ఎక్కువ లేవు. భార్యా పిల్లల గురించి అక్కడక్కడా ప్రస్తావన ఉంది, చివర్లో అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ ప్రస్తావన ఉంది కానీ ప్రధానంగా యువకుడిగా ఉన్నప్పటి నుండీ ఆయన చేసిన ప్రయోగాలు, విఫలమైన ప్రయత్నాలు, నష్టం తెచ్చిన వ్యాపారాలు, మారిన ఊర్లు – ఇవన్నీ తల్చుకున్నారు. రచనల గురించి కూడా ఈ ప్రయోగాల గురించి చెబుతున్న సందర్భాల్లో చెప్పినవే కానీ, అంత సాహిత్య సృష్టి చేసిన మనిషికి చాలా తక్కువ చెప్పినట్లే.
ఆయన పిల్లల బడని, యక్ష గానాలనీ, పత్రికని, ప్రెస్సని, ఇలా ఏవేవో ఒక్కొక్కటీ చెబుతూ ఉంటే.. అవన్నీ చదువుతూంటే ఒక్కొక్కటి దాటుతూ ఉండగా ఆశ్చర్యం నాకు – ఇలాంటి మనిషి అన్నాళ్ళూ గృహస్థుగా జీవితం ఎలా గడిపాడు? ఇన్ని వైఫల్యాల మధ్య, అస్థిరత్వం మధ్య కూడా అంత సాహిత్య కృషి, కన్నడ జాతి సాంస్కృతిక జీవనానికి చిరకాలం నిలిచిపోయే సేవా ఎలా చేశాడు? అని. చదివేకొద్దీ ఈ మనిషి కన్నడ ప్రజలమధ్య తిరిగి, వాళ్ళకోసం ఏవో కొత్తకొత్త ప్రయోగాలు చేయడాన్నే తన జీవితాశయంలా గడిపాడు అనిపించింది. కానీ, అక్కడక్కడా – ఎదిగిన కొడుకు చనిపోవడం, కుటుంబానికి తెల్సిన వారు ఒకరు చనిపోవడం, భార్య మానసిక వ్యాధి, ఆ తరువాత వాళ్ళ దాంపత్యంలో వచ్చిన కొన్ని మార్పులు – ఇవన్నీ కదిలించేలా రాశారు. అంటే ఏదో నాటకీయంగా చెప్పారనుకునేరు. మన కోటేశ్వరమ్మగారి తరహాలో – “ఇదీ జరిగింది” అని చెప్పుకు పోయారు. మానసిక వ్యాధి గురించి, చికిత్స సమయంలో ప్రవర్తన గురించీ – ఇదంతా అలా రాయడం గొప్పగా అనిపించింది. ఇప్పటికీ ఇంకా అలాంటి వాటి గురించి బయటికి చెప్పుకోడానికి ఇష్టపడని వారు ఎందరో. ఆయన ఎప్పుడో పుస్తకంలోనే రాసేసారు!
రచనాశైలి ఆయన రచనల లాగానే తేలిగ్గా అర్థమయ్యేలా ఉంది. ఎక్కడా బోరు కొట్టలేదు. ఏకధాటిగా కాకపోయినా, రోజూ కొంతకొంత చదివాను, తర్వాత ఏమైందని అనుకుంటూ. శారదాప్రసాద్ గారి అనువాదం కారంత్ రచన, ఆలోచనాసరళిని బాగా పట్టుకుందనిపించింది. మొత్తానికి, కారంత్ సాహిత్యంతో మాత్రమే పరిచయం ఉన్న నాలాంటి వాళ్ళకి ఈ ఆత్మకథ కొత్త ప్రపంచమే. కారంత్ గారి ప్రపంచంలోకి తొంగి చూడాలంటే తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఎక్కడ దొరుకుతుందని నన్ను అడక్కండి. ఇక్కడ మా ఊరి లైబ్రరీలో ఇంటర్-లైబ్రరీ లోను ద్వారా ఎక్కడో బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలోని మరో లైబ్రరీ నుంచి తెప్పించుకున్నాను. అది కెనడాలో ఉండేవాళ్ళకి దొరికే మార్గం.
Chowdary Jampala
>>(త్రివేణి గారి అనువాదం అనుకుంటాను),
త్రివేణి గారు కన్నడంలో చేసిన రచనలను శర్వాణిగారు తెలుగు చేస్తూ ఉండేవారు. అంచేత త్రివేణిగారు అయిఉండరు.
సౌమ్య
నిజమే – శర్వాణి గారు అయి ఉంటారు. నాకు త్రివేణి గారి పేరు అలా శర్వాణి గారి పేరుతో మ్యాప్ ఐపోయింది.