The Mothers of Manipur – Teresa Rehman

1999లో కార్గిల్ యుద్ధం జరిగేంత వరకూ భారత్-పాక్ మధ్య యుద్ధం అంటే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్. లేదా, అరవైల్లో వచ్చిన హిందీ సినిమాల్లో పేరు చెప్పని “దుష్మన్”. మణిరత్నం తీసిన రోజా సినిమాతో కొంచెం అర్థమయ్యింది. కాశ్మీరిలో సామాన్య ప్రజానీకం ఉంటారని, వాళ్ళ అభిప్రాయాలు భారత్ కు అనుగుణంగా ఉండక్కరలేదని. అయినా, మన దేశం అంటే అదేదో ఎడతెగని గౌరవం. అంచంచల విశ్వాసం. మాకేదో సోషల్ స్టడీస్ పాఠం ఉండేది, ఎనిమిదో తరగతిలో అనుకుంట.  అందులో, “భూటాన్, శ్రీలంక లాంటి దేశాలు భారత దేశమంత గొప్ప దేశం, పెద్ద దేశం తమ పొరుగు దేశంగా ఉండడం వల్ల ఎప్పుడూ భయాందోళనకు గురవుతూ ఉంటారు” లాంటి వాక్యమేదో చదివి, మేమంతా వాపోయాం – వాళ్లకి ఎవరన్నా చెప్పాలబ్బా, ఇండియా ఎంత మంచిదో! అని.

కార్గిల్ నాటికి దేశభక్తి జ్వరం తారాస్థాయికి చేరుకుంది. యుద్ధ సమయంలో ఒక ఫోటో అన్ని వార్తాపత్రికల ముందు పేజీల్లో ప్రచురితమయింది. పాతికేళ్ల లోపు ఉండే జవాన్లు ముగ్గురు నలుగురు, ట్రంకు పెట్టి మీదా రోటీలు ఒత్తుకుంటూ, పుల్లలతో వేసిన మంటలో వాటిని  కాల్చుకొని తింటున్న దృశ్యం. అది చూసిన ఒక రెండు మూడు రోజులు, తినాలన్నా, నిద్రపోవాలన్నా ఎదో తెలీని అపరాధభావం. మనం కోసం వాళ్లంత కష్టపడుతుంటే, మనకేం పట్టనట్టు ఎలా ఉండడం అని. మహా అయితే పాకెట్ మనీ మొత్తం ఆర్మీ ఫండ్ కి వేయడం తప్ప పెద్దగా చేసేది లేదని తెల్సింది. (ఇదంతా  సోషల్ మీడియా “జవాన్లు మన కోసం త్యాగాలు చేస్తుంటే… ” అన్న బ్రెయిన్వాషింగ్ లేని కాలంలో.)

ఆ తర్వాత కొన్నాళ్ళకి, ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా ఒక వార్త వచ్చింది. మణిపూర్లో ఒక అమ్మాయిని ఆర్మీ వాళ్ళు దారుణంగా మానభంగం చేసి చంపేశారని. నమ్మబుద్ధి వేయలేదు. అసలు అలా జరగడం సాధ్యమే అనిపించలేదు. ఆ అమ్మాయి రేప్ విషయమై చాలా గొడవలు జరుగుతున్నాయి, నిరసనలు చేస్తున్నారు అన్న వార్తలు చూసాక, “ఏ ఒక్కడో చేస్తే మొత్తం ఆర్మీ అనడమేంటని?” గింజుకున్నాను.

ఆ తర్వాత మర్చిపోయాను. గుర్తు పెట్టుకొని తెలుసుకోడానికి అదేం కాశ్మీర్ వివాదం కాదుగా. (అంటే, కాశ్మీర్ గురించి అంతా తెలుసునని కాదు.) వార్తల్లోనో, సినిమాల్లోనూ, కాఫీల్లోనూ, సోషల్ మీడియాలోనూ వింటున్నదేగా అని. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఏం తెలుస్తుంది – ఏ సివిల్స్ కో ప్రిపేర్ అవుతుంటే తప్ప.

ఇన్నాళ్ళకి జుబాన్ పబ్లిషింగ్ వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల సాహిత్యం గురించి, అక్కడి సామాజిక పరిస్థితుల గురించి ప్రత్యేకంగా పుస్తకాలు వేస్తున్నారు. కథలు, నవలలు కాకుండా, ముఖ్యమైన చారిత్రిక ఘట్టాల గురించి తెలియజేసేలా ఉంటున్నాయి ఆ పుస్తకాలు. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది – ది మదర్స్ ఆఫ్ మణిపూర్.

మనోరమ అనే ముప్ఫయి ఏళ్ల  మహిళను ఇంటరాగేషన్ అని పట్టుకెళ్లిన ఆర్మీ వాళ్ళు (అక్కడ AFSPA  ఉండడం వల్ల, అలా ఎవరినైనా, ఎప్పుడైనా, ఏ కారణం చేతనైనా — అంటే, లా అండ్ ఆర్డర్ కోసమే అని చెప్పి —  అరెస్ట్ చెయ్యొచ్చు.) ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దగ్గరలో ఉన్న పొలాల్లో ఛిద్రమైన ఆమె శవం దొరికింది. ఆమె  చావు దారుణాతి దారుణమని అందరికి తెలిసేలా ఉంది. కానీ ఆర్మీ వాళ్ళు ఆమె తప్పించుకొని పారిపోతుంటే కాల్చాల్సి వచ్చిందని సంజాయిషీ ఇచ్చారు.

భారత దేశంలో ప్రాణాలకి పెద్ద విలువ ఉన్నట్టు నాకు ఎప్పుడూ అనిపించదు. రాజకీయ స్వార్థాలకి తప్పిస్తే సామాన్యుని మరణం ఎవరికీ పట్టదు. అదే రాత్రి, అదే స్నేహితునితో కల్సి, అదే బస్ లో వెళ్తుంటే తనని రేప్ చేశారని నిర్భయే  వచ్చి గొంతు చించుకొని అరిచివుంటే మనకి ఎక్కేది కాదు. అది ఆమె సమస్య, ఆమె కుటుంబం సమస్య మాత్రమే అయ్యుండేది – కోర్టులకి ఎక్కినా, న్యాయం కోసం ఎదురు చూసినా. కానీ ఆమెను హింసించిన విధానంలో చూపిన అమానుషత్వం, కౄరత్వం మన మందపు తోలుని సైతం కదిలించింది.

మనోరమ మానభంగం, హత్య  హేయనీయమైనవి. ఆ కబురు విన్నవాళ్ళకి రక్తం మరిగిపోయింది. జరిగిన అమానుష చర్యకు నిరసనగా ప్రతి ఒక్కరూ ఏదోకటి చేయాలని నిర్ణయించుకున్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. సమావేశంలో నిరసన ఎలా ఉండాలో వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ఒకరు నగ్నంగా నిరసన చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. ఆ ఆలోచన కొందరికి నచ్చింది. స్త్రీ దేహం (మగవాని) కోరికకు ప్రతీక. మగవాడు ప్రతీకారం తీర్చుకోడానికి మరో మగవాడిని చంపుతాడు. ఆడదాన్ని చెర్చుతాడు. ఇది ఇప్పటి అలవాటు కాదు. యుగయుగాలుగా వస్తుందే! అందుకే ఆ స్త్రీ దేహాలతోనే నిరసన చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వయసు మీద పది, చర్మం ముడుతలు పడ్డ స్త్రీలు మాత్రమే ఈ నిరసన చేయాలని నియమం.

పన్నెండు మంది తల్లులు నగరం మధ్యలో బట్టలు ఊడదీసి నుంచున్నారు. “ఇండియన్ ఆర్మీ! కమ్  రేప్ అస్!” అని అరిచారు. “మా బిడ్డలు మీకు ఆట వస్తువులు అయితే, మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టడం?” అని నిలదీశారు. తమాషా ఏంటంటే, ఆర్మీ లో ఉన్నా, అండర్గ్రౌండ్ కి పనిచేస్తున్నా, ఇరు పక్షాల్లో ఉన్నది మణిపూర్ వాళ్ళే! వాళ్ళ తల్లులే నగ్నంగా నిలబడి మానభంగం చేయమంటే వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఆర్మీ పెద్దాయన వచ్చి, వాళ్ళకో నమస్కారం చేసి, తల దించుకొని వెళ్ళాడు. ప్రపంచం మొత్తం ఈ వార్తను భుజాన మోసింది. భారత ప్రభుత్వం మాత్రం అతి కష్టం మీద కొన్ని జిల్లాల్లో మాత్రమే AFSPA ను తొలగించింది. మనోరమకి ఇప్పటికి న్యాయం జరగలేదు.

తమ కడుపున పుట్టిన బిడ్డ కాకపోయినా, సాటి తల్లికి జరిగిన అన్యాయానికి, పరిస్థితులు ఇలానే కొనసాగితే అసలు మణిపూర్ లో ఏ బిడ్డా బతికి బట్ట కట్టలేరని భావించి, ఇంట్లో వాళ్లకి మాటైనా  చెప్పకుండా, ఆపైన సమాజం ఎలా అర్థం చేసుకుంటుందోనని ఆలోచించకుండా, అంతటి సాహసానికి ఒడిగట్టిన ఆ పన్నెండు మంది తల్లుల ఇంటర్వ్యూ ఈ పుస్తకంలో పొందుపరిచారు. వారి నేపథ్యం, వారి ధైర్యం, వారి ఆలోచనలే కాకుండా, మణిపూర్ అంటే ఏమిటో, అక్కడి మనుషులు ఎలాంటి వారో, ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నారో, ఎదురుకుంటున్నారో బాగా అర్థమయ్యేట్టు, ముఖ్యంగా ఆ ప్రాంతం ఒకటుందని కూడా గుర్తించని వాళ్లకి సైతం అర్థమయ్యేట్టు ఆ విషయాలన్నీ ఒక్కో తల్లి గూర్చి చెప్తూనే, ఇవీ చెప్పుకొచ్చారు. పుస్తకం చదివాక వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళు చేసుకునే పండుగలు, వాళ్ళు వేసుకునే దుస్తులు మాత్రమే కాక స్వేచ్ఛ అంటే తెలియనివారి జీవితాలు, అనుక్షణం భయంతో బతికే బతుకులు, అయినా కూడా జీవితాన్ని ప్రేమించే తీరు అన్ని తెలుస్తాయి.

అక్కడి కళాకారుల విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. నాటకరంగానికి సంబంధించిన వారు – మహాశ్వేతా దేవి రాసిన “ద్రౌపది” ఆధారంగా చేసుకున్న నాటకంలోనూ ఓ పెద్ద ఆవిడ నాటకంలో భాగంగా నగ్నంగా నిరసన ప్రకటిస్తుంది. అదే ఆ తర్వాత నిజ జీవితంలోనూ జరగడం, జరగాల్సి రావడం ఆశ్చర్య పరుస్తుంది. అలానే అక్కడి కవులు, సంగీత కారులు, నటులు, వార్ మ్యూసియం  పెట్టినవారు, ఇలాంటివి అన్నీ ప్రస్తావించారు. (మణిపురి సంగీతంలో ఉన్న ఆనందం తెలియాలంటే ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఏ. ఆర్. రెహ్మాన్ నిర్వహించిన “హార్మోని” చూడాల్సిందే!) ఐరన్ లేడి గా పేరుపొందిన ఇరోమ్ షర్మిల గురించి కూడా తెల్సుకునే వీలు కనిపిస్తుంది.

మేరీ కామ్ పతకాలు తెస్తే మన మనిషి అన్నాం. అవార్డులు ఇచ్చాము. ఆమె జీవితం ఆధారంగా సినిమా కూడా తీసుకున్నాం.

అదే నేల బిడ్డ మనోరమకు జరిగినదానికి ఆమె కుటుంబానికి న్యాయం జరగలేదు. ఆమెను చంపినవాళ్లకి ఏ శిక్షా పడలేదు. కడుపుకోత భరించలేక ఆ తల్లులు అంత తెగించినా ఇప్పటికి అక్కడి పరిస్థితుల్లో మార్పు లేదు. ఎప్పటికి వస్తుందో, అసలు మార్పు వస్తుందో లేదో తెలీదు.

ఇప్పుడు ఆమెకు న్యాయం జరిగేలా పోరాడాలి, మనం కాండిల్ లైట్ మార్చులు చేయాలి, ఫేసుబుక్కుల్లో అప్డేట్ చేయాలి, వగైరా వగైరా అని నేను అనను.

కానీ కనీసం అక్కడేం జరుగుతుందో తెల్సుకోవాలి. మనకి ఎప్పుడో ఒకసారి జరిగితేనే మనం గోల చేస్తామే, అలాంటిది వాళ్లకి రోజూ జరుగుతుంది, దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అలా బతకటం ఎలా ఉంటుందో ఈ కింది కవితలో చూడొచ్చు.

 

… This is my town

I am the one who should be asking you

About your identity!

Don’t stop me, I am late to find freedom.

This is my town

The streets carry my footmarks

Since I could walk

No matter how dusty they are…

 

The Mothers of Manipur: Twelve women who made history

Teresa Rehman

Zubaan Publishers

Available online at amazon.in & zubaan’s website.

You Might Also Like

2 Comments

  1. varaprasad.k

    అద్భుతమైన కధనం,మీ సమీక్ష అక్టోబర్ లో చదివాను,ఆతరువాత వాడ్రేవు చైనా వీర భద్రుడు గారి ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఇదే నవల గురించి టచ్ చేశారు. బావుంది మంచిసబ్జెక్టు.

  2. ఉరుపుటూరి శ్రీనివాస్

    చాలా కాలం క్రితం శిల్పారామంలో ఈశాన్యరాష్ట్రాల హస్తకళామేళా అవుతున్నప్పుడు అక్కడ జరిగిన ఒక సాంస్కృతికకార్యక్రమంలో మణిపూర్ నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన ఒక నాటకంలో మొదటి ఒకటి రెండు నిమిషాలలోనే – ప్రేక్షకుల భద్రలోకాన్ని బద్దలు కొడుతూ ఇండియన్ ఆర్మీ జవాన్ పాత్ర రంగప్రవేశం చేస్తుంది.
    వేదిక మీద మోకాళ్ళ మీద కూర్చుండి పోయిన మణిపురీ అమ్మాయి, పక్కన్నే కర్కశంగా జవాను. అంత సులభంగా మరిచిపోలేని దృశ్యం.

    అంతకుముందే, ఈ అమ్మల ఫోటో పత్రికల్లో చూసినందున – “అదంతా ఉత్తి నాటకం, నిజజీవితం అంత భయంకరంగా ఉండదు.” అని అనుకోలేకపోయాను. మనకు తెలియని పీడన, దోపిడీ ఎంత ఉన్నదో మన దేశంలో.

Leave a Reply