దేశభక్తి కథలు
వ్యాసకర్త: అల్లూరి గౌరీలక్ష్మి
************
దేశభక్తి కథలు
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్
ఈ దేశభక్తి అనే కాన్సెప్ట్ కొత్తగా బావుంది. అసలు దేశ భక్తి అంటే సరిహద్దులో సైనికుడిగా లేదా నేవీలేదా ఎయిర్‌ఫోర్సులో పనిచేయడమేనా! దేశభక్తికి మరో మార్గం లేదా? అనే ప్రశ్నలకి సమాధానమే ఈ కథల సంకలనం. దేశభక్తి భావనను విపులంగా పాఠకుల మదిలో ముద్ర పడేట్టు చేస్తుందీ పుస్తకం.
ఈ సంపుటిలో అనేక అంశాలపై రచయితలు విభిన్న కోణాలను స్పృశించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి “చామర గ్రాహిణి” కథలో ఒక ఆంధ్ర చక్రవర్తి యొక్క ధర్మబద్ధత మనల్ని చకితుల్ని చేస్తుంది. ఆ భారతీయ రాజు గారి గొప్పతనానికి ముచ్చటేస్తుంది.
“దేశమంటే మతాలోయ్” అనే గంటి భానుమతి గారి కథలో ఒకామె ఇద్దరి కొడుకుల్లో ఒకరు ఆర్మీలో పనిచేస్తూ టెర్రరిస్ట్ కాల్పుల్లోనూ, మరొకరు మతఘర్షణలోనూ మరణిస్తారు. ఆధునిక భారతంలో రోజూ జరుగుతున్నదే ఇది. హృదయాల్ని పిండేసే కథ.
వేంపల్లి గంగాధర్ కథ “వానరాయుడు” ధర్మం అనే పదాన్నే ఏనాడో మరిచిపోయిన నేటి సమాజానికి అద్దం పట్టింది. భార్య చెప్పినట్లుగా ఆమె చనిపోయాక, స్వధర్మం కోసం పాటు పడతాను అని నిర్ణయించుకుని అమెరికా తిరిగి వెళ్లకుండా స్వదేశంలోనే ఉండడానికి సిద్ధపడి ఆమె కోరిక నెరవేర్చిన కథ కస్తూరి మురళీకృష్ణ గారి “స్వధర్మే నిధనం శ్రేయః.”
సైన్యంలో చేరి యుద్ధంలో చనిపోయి తల్లి తండ్రులకు ఇల్లు కట్టించి, సంసారాన్ని పోషించిన కొడుకు కథ పవని నిర్మల ప్రభావతిగారి “జననీ జన్మ భూమిశ్చ” కంట నీరు పెట్టిస్తుంది.
బలభద్రపాత్రుని రమణి గారి “చీకటి నుండి వెలుగు వైపు” కథలో నక్సలైట్ నాయకుడిగా తాను లొంగిపోయి తనను చదివించిన పెద్దాయనకి గురుదక్షిణగా ఆ సొమ్ము అందాలని ఆశిస్తాడు. ఈ కథ చాలా బావుంది.
భర్త సైన్యంలో చనిపోయినా కడుపులో ఉన్న బిడ్డను సైన్యంలోకి పంపడానికి చాలా సహజంగా సిద్ద పడడమే “జీవనహేల”గా భాసించడం అంటారు చివుకుల శ్రీలక్ష్మి, గొప్పతనం అనేది అలవోకగా ఉంటుంది అనిపించేట్టు.
సొంత ఖర్చుతో జెండా గుడ్డ కొని కుట్టి, గాంధీ గారి మీటింగుతో సహా అనేక మీటింగ్ లలో తన జెండాలు కట్టి ఎగరేసే జెండా కిష్టయ్య గురించిన కథ “జెండా ” ఎంతో హృద్యంగా రాసారు ఎం.వెంకటేశ్వరరావు. స్వేచ్ఛకి ప్రతీకగా ఎగరాల్సిన జెండాని అగౌరవిస్తున్న ఈ రోజుల్లో రాతగిన కథ ఇది.
కాటూరి రవీంద్ర త్రివిక్రంగారు “మహా వీర్ మేజర్ వాంగ్ ఛుక్” కథలో నిజంగా మంచు కొండల్లో జవానులు మనో భావాలెలా త్యాగనిరతితో ఉంటాయో చక్కగా చెప్పారు.
మన ప్రియతమ, స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీ పీ.వీ.నరసింహరావు గారి “గొల్ల రామవ్వ” కథ అద్భుతంగా ఉంది . పోలీసులు తరుముకొచ్చిన ఒక యువకుడిని అతను తన మనవరాలి భర్త అని చెప్పి అతని ప్రాణాలు కాపాడుతుంది ఒక పెద్దామె. కథనం మనల్ని సమ్మోహితుల్ని చేస్తుంది.
స్వార్ధం లేకుండా తాను బ్రతుకుతూ మరొకరిని బ్రతకని నివ్వడం, దేశ గౌరవాన్ని కాపాడడం, సహనం, తోటివారిపై సహానుభూతి దేశభక్తే. రక రకాల ఉద్యోగాల్లో, విధి నిర్వహణలో నిస్వార్ధంగా పని చేయడం, తన దేశం యొక్క జీవన విధానంపై గౌరవం, కట్టుబాట్లపై గౌరవం, సౌభ్రాతృత్వం – ఒక్క మాటలో చెప్పాలంటే ఒక బాధ్యత గల పౌరునిగా తన కర్తవ్యం తాను నిర్వర్తించడమే దేశభక్తి అన్న సందేశం ఇచ్చిందీ కథల సంపుటి. మంచి ప్రయత్నం చేసిన సంపాదకులకు అభినందనలు.
shiva shankera prasad
సమీక్షా బాగుంది . బుక్ ఎక్కడ దొరుకుతుందో తెలుపలేదు ?
కోడీహళ్లి మురళీమోహన్
ఈ పుస్తకం ఎమెస్కో, నవోదయ షాపుల్లో దొరుకుతుందండీ. లేదా సాహితి ప్రచురణలు, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టగుంట, విజయవాడ 04, ఫోన్:0866-2436642 అనే చిరునామాలో సంప్రదించవచ్చు.