The Virgin Fish of Babughat – Lokenath Bhattacharya

ఒక డిటెన్షన్ కాంప్. కొందరు బందీలు. వారికి కొందరు కాపలాదారులు.

కాంప్ అంటే చీకటి గదులు, ఎక్కడో పైన ఒక చిన్న వెంటిలేటర్ లేదా ఒక పెద్ద  గదిలో వందలకు వంద జనాలను కిక్కిరిసేట్టు ఉంచడం ఈ కాంప్ పద్ధతి కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక గది  ఉంటుంది. భోజనం కూడా మంచి రుచికరంగా, తాజాగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు. హాయిగా వీచే గాలి. ఒళ్ళు హూనమైయేట్టు ఏ పనీ చెయ్యక్కరలేదు. అసలు పనేం లేదు!

డిటెన్షన్ కాంప్ కాదు అయితే, ఎదో చక్కని రిసార్ట్ అనిపిస్తుంది కదా? అక్కడే మొదలవుతుంది కథ!

ఈ  కథను మనకి చెప్పుకొస్తున్న – కాదు రాసుకొస్తున్న – మనిషి ఈ కాంపులో బందీ! ఇక్కడికి రాక ముందూ రాసేవాడు. బహుశా ఆ రాతలు నచ్చకే తనని ఇక్కడకి తీసుకొచ్చారా అని అతనికొక  అనుమానం. తక్కిన అందరి బంధీలతో తక్కిన దినచర్య అంతా సమానంగా పంచుకునే అతడికి మాత్రమే ప్రత్యేకమైన ఒక పని చేయాలనే రూల్ ఉంది. అది రోజూ ఉదయాన్నే రెండు గంటల పాటు కూర్చొని రాయడం. తప్పనిసరిగా రాయాలి. ఇచ్చిన తెల్లకాగితాలను నింపాలి.

తన శాయాశక్తులా రాయడానికి ప్రయత్నిస్తాడు. భాష పట్టు జారిపోతున్న, భావాలను పట్టుకోలేకపోతున్నా, అసలు తన పేరే తాను మర్చిపోతున్న సమయంలో ఈ కథను మనకి  – మనం (అదే తన రాతలకి పాఠకులు) లేమని తెల్సి, వస్తామన్న నమ్మకం లేకపోయినా – చెప్తాడు. సముద్రంలో మునిగిపోతున్నవాడు, దొరికిన ఏ ఒక్క ఆసరాను వదులుకోనట్టు.

ఈ బంధీఖానా ఎవరిదో తెలీదు. అక్కడున్నవారి ఎవ్వరికీ, వారు అక్కడ ఎందుకు, ఎలా వచ్చారో తెలీదు. ప్రభుత్వాన్ని ఒక మాట అన్నట్టుగాని, ఒకరి మీద చేయి చేసుకున్నట్టు గాని దాఖలాలే లేవు. బహుశా, సమాజం ఎటు పోతున్నా కిమ్మనకుండా తమ జీవితాలను గురించి ఆలోచించినందుకే  ఈ శిక్ష ఏమో?!

శిక్ష కూడా ఎలాంటిది? వైరుధ్యాల పుట్ట. పచ్చని పరిసరాలు, కానీ ఒక పిట్ట కూడా కనిపించదు. రుచికరమైన భోజనం మధ్యాహ్నం ఉంటుంది. కానీ కాపాలాదారులు తిండిని విసిరివేస్తుంటే ఒకరిని తోసుకుంటూ ఒకరు అన్నాన్ని అందుకోవాలి. రాత్రి భోజనం మాత్రం గదికి వస్తుంది. ఆడైనా, మగైనా ఒంటి మీద నూలు పోగు ఉండకూడదు. రాత్రులు మాత్రం దుప్పటి కప్పుకోవచ్చు. ప్రతి రాత్రి ప్రతి మగవాడి గదికి ఒక ఆడది వెళ్ళాలి. తెల్లారే వరకూ తలుపులు తీయరు. ప్రతి రాత్రి గది మారుతుండాలి.

ఇలా ఒక రోజు కాదు. ఒక నెల కాదు. కొన్ని సంవత్సరాల పాటు. ఎవరికి ఎవరు పుట్టారో తేల్చుకోలేని పిల్లలు పుట్టేవరకూ. పుట్టి, తల్లిదండ్రుల పెంపకం లేక, మర్యామర్యాదలు తేలిక విచ్చలవిడిగా ప్రవర్తించే పిల్లలు తమ కళ్ళ ముందే పెరిగి పెద్దవుతూ తమకే హాని కలిగించేంతవరకూ. తేదీలు, సంవత్సరాలు మర్చిపోయినవాళ్ళు ఆ పిల్లల ఎదుగుదలలో మన బానిస బతుకుల నిడివి గ్రహించేంత వరకూ!

ఇలాంటి రచనలు చదివి ఎలా అర్థం చేసుకోవాలి? ఉండడానికి నూట నలభై పేజీలే ఉన్నా ఒక్కో వాక్యం నెట్టుకురావడానికి ఎంత సమయం పట్టిందో! చదువుతున్నంత సేపూ ఒకటే తల బరువుగా అనిపిస్తుంది. ఎన్ని నేర్చుకున్నా, ఎంత అలవర్చుకున్న మనిషిని పశువు చేయడం ఇంత తేలికా అనిపిస్తుంది.

ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కన్నా నాలుగైదు నెలల ముందు వచ్చిన “బాబూఘాటెర్ కుమారి మాచ్” అనే బెంగాలీ నవల ఇది. తర్వాత ఎన్నో దశాబ్దాలకి  గాని ఇంగ్లీష్ అనువాదం రాలేదు. అప్పటి పరిస్థితులనే exaggerate చేసి రాసుండచ్చు అనుకోవచ్చు. అధికారంలో ఉన్నవారికి జవాబులు ఇచ్చే బాధ్యత, అవసరం లేకపోతే కలిగే పర్యవసానాలు ఈ కథలోలా ఉంటాయని అనుకోవచ్చు.

కానీ,ఇది కేవలం ఒక political abuse మాత్రమే అయితే, ఆ బంధీలను అంత జాగ్రత్తగా చూసుకోనవసరం లేదు. ఆ  జాగ్రత్తలోనూ ఒక తిరకాసు ఉంది. ఒక మనిషిని పశువుగా మార్చడానికి తీసుకునే జాగ్రత్తలివి. అందుకే తిండికి లోటు లేదు. శుభ్రతకి లోటు లేదు. కోరికలు తీర్చుకోడానికి అవసరానికి మించిన అవకాశాలు. వీటికి ఎలాంటి లోటూ రానివ్వరు ఫుల్ యూనిఫార్మ్ లో ఉండే  కాపలాదారులు. తన ప్రాథమిక అవసరాల గురించి తప్పించి ఇంక దేని గురించి మనిషి ఆలోచించకుండా చేయాలనే వ్యవస్థ ఉంటే, అదెలా ఉంటుందో చూపించే ప్రయత్నం కావచ్చు.

అందుకే ఇందులో స్త్రీ పురుషుల శారీరిక సంబంధాల చర్చే ఎక్కువ ఉంటుంది. ఈ నవల పేరులో కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది.

నాకు ఈ నవల చదువుతున్నంత సేపూ జొస్ సరమగో రాసిన బ్లైండ్నెస్ నవల గుర్తు వస్తూనే ఉంది. సరమగో ఆ నవలను భారతీయ నేపథ్యంలో రాసుంటే అది ఇలానే ఉండేదా అని అనిపిస్తూనే ఉంది. రెండు నవలల్లోనూ కొందరిని డిటెన్షన్ కాంపులో ఉంచటం, వారిని నానా రకాలుగా వేధించటం లాంటివే కథా అంశం అయినా, సరమగో ఎన్నుకున్న కాన్వాసులో కొంత స్పష్టత ఉంటుంది. ఆ దేశంలో “తెల్ల అంధత్వం” అనే అంటు వ్యాధి ప్రబలుతుంది. దాన్ని ఎలా అరికట్టాలో తెలియక, ఆ వ్యాధి సోకిన అందరిని కాంపుల్లో వేయటం మొదలెడుతుంది ప్రభుత్వం. ఈ నవల్లో ఇది ప్రభుత్వం పనే అని తెలిసే అవకాశమే లేదు. రోజూ వారి జీవితం గడుపుతున్న కొందరిని వాళ్ళ ఇళ్ల నుండి వాన్ ఎక్కించుకొని తీసుకొస్తారు. కాపలాదారులుగా పనిచేసేవారు ఎవరికి పనిచేస్తున్నది ఎవరికి తెలీదు. నవల ట్రీట్మెంట్ లో మాత్రం రెండు నవలలూ , నన్ను అడిగితే, సరిసమానం.

నవల ఇతివృత్తం absurd అయినా, కథలో కూర్చిన వివరాలు జరుగుతుందా నిజమే అని అనిపించేట్టు చేస్తాయి. ముఖ్యంగా బెంగాల్ లోని ఆచారవ్యవహారాలు, కథలూ, కవితలూ సందర్భోచితంగా వస్తూ ఉంటాయి. అనువాదం కాబట్టి చాలా వరకూ భాషాపరమైన తేడాలు (తూర్పు – ఉత్తర బెంగాల్లోని యాసలు) పోయినా, ఇది అక్కడి కథ అని స్పష్టంగా తెలిపే అనేక అంశాలు ఉంటాయి. అంతే ఇదిగా భారతీయతా ఉంటుంది. ఇందులో నన్ను బా ఆకట్టుకున్న సన్నివేశం ఒకటి ఉంది – మన కథకుడి గదికి ఒక రాత్రి కొంచం వయసు మీద పడిన ఆవిడ వస్తుంది. మాటమాటల్లో వాళ్ళిద్దరి మధ్యా ఆట మొదలవుతుంది. అందులో ఆమె కాళిగా, అతడు శివుడుగా మారిపోతారు కొన్ని క్షణాల పాటు. అప్పటికే వీళ్ళు అక్కడి విధివిధానాలకి అలవాటు పడి, సిగ్గు బిడియాలు వదిలేసిన రోజుల్లో కూడా, ఒక రకంగా పశువులా బతుకుతున్నప్పుడు కూడా వాళ్ళల్లో జీర్ణించుకుపోయినా కథలు బయటకు వస్తాయి. మనిషిని తక్కిన పశువుల నుండి వేరు చేసేది – భాషలు, కథలు, ఇవే కదా?

ఇది చాలా అరుదైన, అపురూపమైన రచన. అప్పటి బెంగాలీ సాహిత్య సర్కిల్లో పెద్దగా చర్చల్లో రాని పుస్తకం. ఈ రచయితా కొన్ని పదుల నవలలు బెంగాలీలో రాసి, ఫ్రెంచ్ లోకి అనువదించినా, అనేకానేకమైన ఫ్రెంచ్ సాహిత్య దిగ్గజాలను బెంగాలీలోకి అనువదించినా పెద్ద పేరు ప్రఖ్యాతలు రాని  రచయిత అని పరిచయంలో రాశారు. కానీ, నా మట్టుకు నాకు, ఓ నోబెల్ విన్నర్ రచనను చదివినంత తృప్తి కలిగింది. తనకు తానుగా పూనుకొని ఈ నవలను అనువదించిన మీనాక్షి ముఖర్జీకి వేలవేల ధన్యవాదాలు!

Details:

The Virgin Fish of Babughat (Babughater Kumari Maach)

Lokenath Bhattacharya

Translation: Meenakshi Mukherjee

Oxford Translations

Pages: 140

You Might Also Like

One Comment

  1. సుజాత

    Wah. అయ్యో! చివరికి ఏమవుతుందో అనిపించేలా రాసారు. చాలా బావుంది.

Leave a Reply