ఒక సారం కోసం …

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
‘బహుళ’ – సాహిత్య విమర్శ (సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు) వ్యాస సంకలనానికి ఎ.కె.ప్రభాకర్ గారి ముందుమాట ఇది. 2018 మే 12న హైదరాబాద్ లో పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది.
*************
Realists do not fear the results of their study.
– Fyodor Dostoevsky

ప్రతి చారిత్రిక విభాత సంధ్యల్లోనూ మనలో మనం సంభాషించుకోవాల్సిన సందర్భం యేర్పడుతూ వుంటుంది. వర్తమానంలో కుదురుగా నిలబడి నడిచిన దారి గురించి మూల్యాంకనం చేసుకొని భవిష్యత్తువైపు దృష్టి సారించాల్సి వుంటుంది. గమ్యాల్నీ గమనాల్నీ బేరీజువేసుకుని ప్రస్థానం కొనసాగించాల్సి వుంటుంది. ఒక్కోసారి మనతో మనమే మాట్లాడుకోవలసి వస్తుంది. మన బలాన్నే కాదు; బలహీనతల్నీ తెలుసుకోవాలి. వాటిని అధిగమించే మార్గాలు అన్వేషించాలి. అందుకు బయటికే కాదు; లోపలికీ తరచి చూసుకోవాలి. ప్రజాక్షేత్రంలో ఆచరణ గీటురాయి మీద పరీక్షకి నిలబడాలి. సంక్షోభాల్ని తట్టుకోవాలి. సమాజంలో సంక్షోభం యేర్పడ్డ సందర్భాల్లో అనేక సంక్లిష్టతలు యెదురవుతున్నాయి. వాటిని తొలగించుకోడానికి ప్రజాస్వామికమైన వాతావరణం అవసరమవుతుంది. సమూహంలో అభిప్రాయాల వినిమయం కొత్త దారుల్ని తెరుస్తుంది. కొత్త ఆలోచనలకు పాదులు వేస్తుంది. సాహిత్య సాంస్కృతిక రంగం యివాళ సైద్ధాంతికంగా బలపడటానికి దోహదం చేసే నిర్మాణాత్మకమైన విమర్శనీ నిక్కమైన ప్రజా దృక్పథాన్నీ కోరుకుంటుంది.

ఒకప్పుడు యెంతో గతిశీలంగా వుండిన ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ స్తబ్ధతకి గురైంది అని అలవోకగా వ్యాఖ్యానిస్తున్నాం. సృజనాత్మక సాహిత్యం వచ్చినంతగా దాన్ని విశ్లేషించే విమర్శ రావడం లేదని పదే పదే బెంగ పడుతున్నాం. అది పూర్తిగా నిజం కాదు. వాస్తవానికి పోయిన శతాబ్ది చివరి దశకం నుంచే సాహిత్యంలో కొత్త చలనం మొదలైంది. పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సమాజంలో అంచుల్లోకి నెట్టివేయబడ్డ జాతులు వర్గాలు కేంద్రంలోకి రావడానికి సంఘర్షిస్తున్నాయి. ఆ క్రమంలో కొత్త స్వరాలు తమ ఉనికిని చాటి చెప్పడానికి తమదైన భాషనీ బలమైన వ్యక్తీకరణనీ ముందుకు తెచ్చాయి. కేంద్రంలో పాతుకుపోయిన శక్తుల కూసాలు కదులుతున్నాయి. కానీ తమ ఆధిపత్యాల్ని కోల్పోడానికి అవి సిద్ధంగా లేవు. అవి కూడా యథాతథ స్థితిని కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పునాది ఉపరితలాల నిర్వచనాల్లో పరికల్పనలో పునరాలోచన అనివార్యమైంది. అయితే ఈ చలనాన్ని నిశితంగా పరిశీలించడానికి అవసరమైన చూపు మసకబారింది. చూపున్నవాళ్ళు కొందరు కళ్ళకి కట్టుకొన్న గంతలు తీయడానికి సిద్ధంగాలేరు. బయట ప్రపంచంలో వెలువడుతున్న మేధాపరమైన కొత్త ఆలోచనల్నీ దృక్పథాల్ని భావనల్నీ గుడ్డిగా అనుసరిస్తున్నాం. మన సమాజానికి అవరమైన రీతిలో వాటిని అనువర్తించుకోలేక పోతున్నాం. దేశీయమైన జీవితానుభవాలనుంచి గానీ, మనలాంటి మూడో ప్రపంచ దేశాల అనుభవాలను అధ్యయనం చేయడంద్వారా గానీ సంభవిస్తున్న కొత్త మార్పుల్నీ సంఘర్షణనీ అవగాహన చేసుకోడానికి అవసరమైన పరికరాలను రూపొందించుకోలేక పోతున్నాం.

గొంతు సరాయించుకొని ప్రత్యామ్నాయ రాజకీయాలగురించి మాటలు కూడగడుతున్న వుపాంత వర్గాల్ని అణచి వేయడానికి కేంద్రం నుంచి తొలగడానికి సిద్ధంగా లేని శక్తులు పన్నని పన్నాగం లేదు. చేయని కుట్ర లేదు. సమాజ గతిని వెనక్కి తీసుకుపోడానికి చేయని ప్రయత్నం లేదు. ప్రలోభాలు బుజ్జగింపులతో పాటు నిర్బంధాలు నిషేధాలు … తమకు అందుబాటులో వున్న ఆయుధాలన్నిటినీ వుపయోగిస్తున్నాయి. ఆ క్రమం హింసాత్మకంగా సైతం తయారైంది. మతతత్వ వ్యాఘ్రం గోముఖం తొడుక్కొని రాజ్యం అండతో బలహీనుల్ని టార్గెట్ చేస్తోంది. వీటన్నిటి మధ్య భద్ర జీవితాల్ని యెంచుకొన్న రచయితలు కళాకారులు చెదిరిపోవడం మొదలైంది. కొందరు సుఖాల మత్తులో మునిగి పోయారు. మరికొందరు కాల్పనిక లోకానికి పరిమితమై పోయారు. ఇంకొందరు ప్రమాద రహితమైన కంఫర్టబుల్ జోన్ లో నిలబడి యుద్ధాలు చేస్తున్నారు. గాల్లో కత్తులు తిప్పుతున్నారు. చాలామంది సోషల్ మీడియాలో దంతసౌధాల్లో వర్చ్యుయల్ పోరాటాలు చేస్తూ తృప్తిపడుతున్నారు. సమాజంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి మందిని కూడగట్టగల యీ సెక్షన్ మేధావులు తమ బాధ్యతని మర్చిపోతున్నారు. నిబద్ధత నిజాయితీ వంటి పదాలు అపహాస్యానికి గురవుతున్నాయి. నమ్మిన విలువలు అటకెక్కాయి.

ఈ వైఖరి సృజనాత్మక సాహిత్యం మీదా సాహిత్య విమర్శ మీదా బలమైన ప్రభావమే వేసింది. స్థిరమైన గొంతులు లేవని కాదు. తగ్గుముఖం పడుతున్నాయి. నిక్కచ్చిగా వుండాల్సినచోట నీరుకారుతున్నాయి. పొసగని మాటలు కోటలు దాటుతున్నాయి. మేధా – జ్ఞానం – ఆచరణల మధ్య పొంతన లేకుండా పోతోంది. ద్వంద్వ ప్రవృత్తులు ఎక్కువయ్యాయి. ఇటువంటి విషాద సన్నివేశంలో సాహిత్య బుద్ధి జీవుల ఆలోచనల్ని మరోసారి నిబద్ధత గీటురాయిమీద గీసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఎక్కడ నిలబడ్డారో నిరూపించాల్సిన అవసరం వచ్చింది.

ఆ అవసరం నుంచి పుట్టుకొచ్చిందే మనలో మనం మాట్లాడుకొనే లోగిలి ‘బహుళ’. సాహిత్య విమర్శ మార్గంలో భిన్న భావజాలాల ప్రమేయాల సిద్ధాంతాల కూడలి ‘బహుళ’. ‘బహుళ’ అనేకతకీ వివిధతకీ ముంగిలి. ప్రజాస్వామిక ఆలోచనలకు తెరచి వుంచిన వాకిలి. కొంచెం కవితాత్మకంగా చెప్పినట్లనిపించినా ఆ ఆశయంతోనే బహుళ ప్రయత్నం మొదలుపెట్టాం.

అయితే ‘మనం’ యిటీవల వొకవైపు కుంచించుకు పోతోంది. మనంలో అందరం వుండటం లేదు. మరోవైపు బాధితులుగా ‘మనం’ అనేక అస్తిత్వాల్లోకి పరిమితమై శకలాలుగా విడిపోయి వున్నాం. ఎవరి పోరాటం వాళ్లదే అనుకోవడం – ‘ఈ పోరాటం నాది కాద’నే నిర్లిప్తతని పెంచుతుంది. కలిసిచేయాల్సిన పోరాటాల గురించి మర్చిపోయాం. ఎవరి గమ్యాల్ని మార్గాల్ని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. తమదాకా వచ్చినప్పుడు తప్ప పౌర సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక విధ్వంసాలపట్ల భిన్న శిబిరాల్లో ముడుచుకొని వున్న సాహిత్యకారులు స్పందించడం లేదు. జెండర్, కులం, ప్రాంతం, మతం పేరున నెత్తికెక్కి కూర్చున్న సమస్త ఆధిపత్యాలకూ వ్యతిరేకంగా – ఐక్యంగా పోరాడవలసిన పీడితుల సామూహిక స్వరం యే ముక్కకు ఆ ముక్కగా బలహీనపడుతున్నది. భిన్న అస్తిత్వాలు పరస్పరం సంఘర్షించుకొన్నప్పుడు గానీ అంతర్గతంగా వైరుధ్యానికి గురైనప్పుడు గానీ వాటి మధ్య సమన్వయం సాధించే దిశగా సైద్ధాంతిక అవగాహనని అందించగల సమ్యగ్ దృష్టి కొరవడింది. పై పెచ్చు వైరుధ్యాలు శత్రుపూరితంగా తయారయ్యే రాతలే యెక్కువ వస్తున్నాయి. పత్రికలు సంచలనం కోసమో స్వీయ వర్గ ప్రయోజనాలకోసమో వాటిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ అపసవ్యతని సరిదిద్దే బౌద్ధిక వ్యాసంగం గానీ ప్రజాస్వామికమైన చర్చ గానీ జరగడంలేదు. మాట్లాడుకోవాల్సిన సందర్భాల్లో బుద్ధిజీవులు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు – గోప్యతని పాటిస్తున్నారు. లేదా ఆకుకీ పోకకీ అందకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వారధులు కట్టాల్సిన చోట గోడలు లేస్తున్నాయి. విభజించి పాలించేవాడు కులాసాగా కులుకుతున్నాడు. వీటన్నిటి ఫలితమే సాహిత్యంలోనైనా విమర్శలోనైనా స్తబ్ధత ఏర్పడింది అన్న భావన.

***
భాష భావ వ్యక్తీకరణ సాధనమేగానీ చాలా సందర్భాల్లో అది గమ్మత్తైనది. వాగర్థాలు వింతగా ప్రవర్తిస్తాయి. పదాలు కొన్ని తమ అర్థాల్ని కోల్పోతాయి. సంకోచానికో వ్యాకోచానికో గురవుతాయి. కొన్ని విపరీతార్థాన్నిస్తాయి. అతిగా వాడటం వల్ల కొన్ని అరిగిపోతాయి. మరికొన్ని బండబారిపోతాయి. కొన్ని నిలవ వాసన కొడతాయి. వాటి అర్థచ్ఛాయల కింద నిలవలేం. పదాలూ వాటి అర్థాలూ పరస్పరం పట్టింపు లేకుండా వేటి దారిన అవి వలసపోతాయి.

తెలుగులో సాహిత్య విమర్శ కూడా అలాగే తయారైంది. విమర్శ పదమే వికృతమై పోయింది. తరచుగా అది సమీక్షల స్థాయికి కుదించుకు పోయింది. అక్కడ కూడా అయితే రంధ్రాన్వేషణ , కాకుంటే చెట్టెక్కించడం. రచయితలకూ పాఠకులకు మధ్య సేతువు కావాల్సిన విమర్శ పడికట్టు పదాల తొక్కిడిలో అణగిపోయింది. అరిగిపోయిన మాటల మాటున మలినమైంది. నేలవిడిచిన సిద్ధాంతాల బరువు కింద నలిగి పోయింది. వాచక పరిశీలనకు – విశ్లేషణకు కూడా న్యాయం చేయలేకపోతుంది. చివరికి దాని అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. తెలుగులో సరైన విమర్శ లేదనిపించుకొనే స్థితికి దిగజారిపోయింది. రచయితలకు అవసరమైన చూపునివ్వడంలో వారి కర్తవ్యాల్ని గుర్తించడంలో – గుర్తు చేయడంలో మన విమర్శ విఫలమైంది.

ఎన్నో పారిభాషిక పదాలు గురి లేకుండా వాడడటం వల్ల వ్యర్థమై పోతున్నాయి. అనుభూతి ప్రధానమనేవాళ్ళు ఆర్ద్రత అంటారు. మరొకరు సాంద్రత అంటారు. అనుభవ వాదులు కాల్పనికత వాస్తవికత అంటారు. విమర్శలో మరీ దుర్వినియోగమైన అంశం సామాజికత. ఎప్పుడు ఏది ధోరణి అవుతుందో, ఏది వాదం అవుతుందో, ఏది సిద్ధాంతమౌతుందో , వుద్యమమౌతుందో తెలియదు. వాటి మధ్య గీతలు కూడా వుండవు. విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే విమర్శ అధ్యయన లోపం వల్ల , సరైన మెథడాలజీ లేక మూస పద్ధతుల్లోకి ముడుచుకుని గిడసబారిపోయి వుంది. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని విశ్లేషించడం అక్కడ కొందరికి అప్రకటిత నేరమైపోయింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా దాని రూపు రేఖల నిర్మాణం గురించి శారద (యస్ నటరాజన్) రాసిన ‘స్వాతంత్ర్య స్వరూపం’ లాగానే సాహిత్య విమర్శ స్వరూపం కూడా తయారైంది. ఎవరికివాళ్ళు తమ సిద్ధాంతమే అంతిమం అని భావిస్తున్నారు. తమ వాక్యమే చివరి వాక్యమని నిర్ధారిస్తున్నారు. తమకు నచ్చని అంగీకరించని ఒక భావజాలాన్ని అభిప్రాయాన్నీ వ్యతిరేకించడం తప్పుకాదు ; కానీ తిరస్కరించడానికి వారి మీద తీవ్రమైన దాడి చెయ్యడమే మార్గంగా కొందరు భావిస్తున్నారు. ఆ సందర్భాల్లో వ్యక్తిత్వ హననానికి సైతం వెనకాడడం లేదు. లేదా అభిప్రాయాల పట్ల మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎదుటివారి గొంతు నొక్కడానికి అదొక మార్గం. ప్రజాస్వామికంగా ఉండాల్సిన ప్రగతిశీల శిబిరాల్లో సైతం ఈ ధోరణి కనిపిస్తుంది. నిర్మాణాత్మక విమర్శ స్థానే ద్వేషపూరిత ఖండనలే తయారవుతున్నాయి. విమర్శకమ్మన్యులు ఖండన మండనాలకూ వాదోపవాదాలకూ పరిమితమై స్వీయ మానసిక రుగ్మతలో కూరుకుపొతున్నారు. అందువల్ల సమగ్ర దృష్టి కొరవడింది. సత్యాన్వేషణ అరుదైంది.

సత్యం యేక శిల వంటిది కాదు. కానీ ‘విప్రులు’ సత్యం వొకటే అంటారు. అఖండ సత్యం అంతిమ సత్యం వుండదు. భిన్న స్థల కాలాల్లో అది అనేక రూపాల్లో భాసిస్తుంది. మార్పులకు గురవుతూ వుంటుంది. సత్యాన్వేషణ అంటే ఆ మార్పుల్నితెలుసుకొనే ప్రయత్నమే. అఖండత – సమగ్రత వేరు. రెండూ అర్థసత్యాలే; చేరువ కాని క్షితిజ రేఖలే. అయినప్పటికీ సమగ్రత యేదో వొక మేరకు భిన్నత్వాన్నీ బహుళత్వాన్నీ గుర్తించి తనలో కలుపుకుంటుంది. వికేంద్రీకరణకు అనుకూలంగా వుంటుంది. వైవిధ్యాన్ని కాపాడుకుంటూనే పూర్ణతని సాధించడానికి దోహదం చేస్తుంది. అఖండత అనేకతనీ వివిధతనీ విభిన్నతనీ గుర్తించదు – గౌరవించదు. కేంద్రీకరణని ప్రోత్సహిస్తుంది. ఒకే జాతి వొకే సంస్కృతీ వొకే భాషా వొకే దేశం వొకే మతం అని వూదరగొడుతుంది. ఒకే పన్ను వొకే మార్కెట్ దానికి కొనసాగింపే. మత ఫాసిజం , మార్కెట్ విస్తరణ మంత్రమే మూలధాతువుగా పనిచేసే నయా సామ్రాజ్యవాదం అక్కడే వొకటవుతాయి. దేశంలో పెట్టుబడిదారులూ మతవాదులూ అందుకే కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ తరహా ఫాసిజం జాతీయత పేరున వివిధతని విచ్ఛిన్నం చేసుంది. దేశభక్తి పేరున భిన్నస్వరాల పట్ల అసహనం ప్రదర్శిస్తుంది. అల్పసంఖ్యాకుల్ని అణగదొక్కి ఐక్యత సాధిస్తానంటుంది. సంపద , అధికారాల కేంద్రీకరణ లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రజాస్వామిక విలువల్ని ధ్వంసం చేస్తుంది. ఈ జాడ్యం ప్రగతిశీల రాజకీయాలకు పాకకుండా జాగరూకత వహించాలి. ప్రత్యామ్నాయ భావనలు పెంపొందించుకోవాలి. మనుషుల మధ్య సంబంధాల్ని పెంచుకోవాలి. సమత్వ దృష్టి అలవర్చుకోవాలి. సాహిత్యం అందుకు దోహదం చేయాలి. సాహిత్య విమర్శ అస్తిత్వంలో వున్న బహుళ సత్యాల్ని సాపేక్షంగా చూడగలగాలి, చూపగలగాలి. భిన్న అస్తిత్వ ఆకాంక్షల్ని ప్రతిఫలించే సాహిత్యానికి లైట్ హౌస్ కావాలి. ఆధిపత్యాల్ని ప్రతిఘటించే రచయితల స్వరాలకు బలాన్నివ్వాలి. మానవీయ విలువలు పెంచే సంస్కృతిని వున్నతీకరించే దారిదీపం కావాలి. అందుకు యీ సంకలనం దోహదం చేస్తుందని 25 మంది వ్యాస రచయితల ఆలోచనల్ని వొకచోట చూసినప్పుడు బలంగా అనిపించింది.

‘బహుళ’ లోని వ్యాస రచయితలు కేవలం సాహిత్య రంగానికి మాత్రమే పరిమితమైనవారు కారు. దాదాపు అందరూ వివిధ సామాజిక సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తున్నవాళ్ళే. ప్రజా సంఘాలతోనూ సాహిత్య వుద్యమాలతోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం వున్నవాళ్ళే. భిన్నసైద్ధాంతిక దృక్పథాల నుంచీ వచ్చిన వాళ్లైన కారణంగా ఆచరణలో తమ తమ సామాజిక రాజకీయ క్షేత్రాలలో పొందిన అనుభవాల నుంచి చేసిన సూత్రీకరణలున్నాయి. ప్రజానుకూలమైన/వ్యతిరేకమైన పోకడలను తమ దృక్పథాలనుంచి విశ్లేషించారు. ప్రతి సాహిత్య సందర్భాన్నీ సంక్షోభాన్నీ విమర్శనాత్మకంగా చూసారు. వ్యాసాల్లో వొకరి సిద్ధాంతం మీద మరొకరి ఖండనలున్నాయి. నడిచొచ్చిన దారి మీద సమీక్షలున్నాయి. విమర్శలూ ఆత్మ విమర్శలు వున్నాయి. ఎన్నో ఆరోపణలున్నాయి. వాటికి సమాధానాలున్నాయి. ఆ యా సందర్భాల్లో సమాజానికి అవసరమైన ఆలోచనల్లో సైద్ధాంతిక భూమికల్లో వచ్చిన మార్పుల్ని ప్రస్తావిస్తూ యింతకుముందు యితరత్రా చెప్పినవాటిని దిద్దుకోవడం వుంది. లోతుగా చూస్తే కొన్ని కన్ఫెషన్లు, మరికొన్ని పునర్నిర్ధారణలు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా మార్క్సిస్టు విమర్శలో పునాది వుపరితలాలకు సంబంధించిన అవగాహనలో చోటుచేసుకొన్న మార్పుల్ని రచయితలు ప్రస్తావించారు. వర్గం కులం మతం జెండర్ ప్రాంతం … వంటి అస్తిత్వాలన్నిటినీ వాటి వెనక వున్న భిన్న తాత్త్విక కోణాల్నీ యివాళ్టి నిర్దిష్ట దేశీయ సామాజిక అవసరాలకు అనుగుణంగా మలచుకోవాల్సిన దృగంశాలుగా రచయితలు సోదాహరణంగా వివరించారు.

* * *
తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ తీరుతెన్నులగురించి, విమర్శలోని ఖాళీల గురించి, విమర్శకుల బలాబలాల గురించి యెటువంటి మోమాటాలకీ తావులేకుండా దీనిలో భిన్న సందర్భాల్లో రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా విలువైనవి. వాటన్నిటినీ యిక్కడ ప్రస్తావించలేను కానీ స్థూలంగా చూద్దాం.

సమాజంలోనూ సాహిత్యంలోనూ పక్కలకు నెట్టివేయబడ్డ ప్రజా సమూహాల నుంచి (marginalized groups) వస్తున్న రచయితల గొంతులు వినిపించడం మొదలైనాకా సాహిత్య వ్యవస్థలో ప్రజాస్వామిక భావనలు బలపడే గుణాత్మకమైన ధోరణి రూపొందింది. అయితే ఆ గొంతులన్నిటినీ సమ్మిళితం చేసుకొని ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్య భావజాల రంగాన్ని పటిష్టపరచుకొని విశాలమైన ఐక్య వేదికని నిర్మించుకోవడంలో చొరవ చూపించలేకపోతున్నాం. ఆ లోటు సాహిత్య విమర్శలో సైతం ప్రతిఫలించింది (నారాయణస్వామి వెంకటయోగి).

ఉన్నత ధనిక వర్గాల భావజాలమే ప్రధాన స్రవంతిగా చెలామణి అవడం వల్ల అకాడమిక్ పండితులు నిర్మించిన సాహిత్య చరిత్ర పాక్షికమే. మూలవాసుల సాహిత్యం – కళలు – సంస్కృతి చరిత్ర రచనకి ప్రధాన మూలాకరాలు. ఈ పునాదిని విస్మరించి ఉపరితలాన్ని నిర్మించడానికే పాలక వర్గం – రాజ్య యంత్రాంగం యావత్తూ ప్రయత్నిస్తుంది. అందువల్ల చాలా నష్టపోయాం (జయధీర్ తిరుమలరావు).

మన సంప్రదాయ విమర్శకులే కాదు ఆధునిక విమర్శకులు సైతం మనుధర్మ భావజాలం నుంచి బయట పడలేదు. మనువాద కులాధిపత్య ధోరణిని నిర్మూలించకుండా ‘ఆధునిక విమర్శ శాస్త్రా’న్ని అభివృద్ధి చేసుకోలేం (ఎం ఎం వినోదిని).

ప్రాచీన అలంకార శాస్త్రం ఆధునిక సాహిత్య విమర్శ – యీ రెండిటికీ దళిత జీవితం సాహిత్యం అంటరానివే అయ్యాయి. ఆత్మగౌరవ పోరాటాల నుంచి వెల్లువెత్తిన దళిత స్వరం సాహిత్యానికి కొత్త డిక్షన్ అందించింది. సాహిత్య సౌందర్య శాస్త్రానికి చెందిన అంతకు ముందున్న పరిభాషని ధ్వంసం చేసింది. దళిత జీవన వాస్తవికత నుంచీ కొత్త కళాతాత్వికతను నిర్మించుకొంది. అది అప్పటివరకూ వూడలుతన్నుకొని వున్న మొత్తం సాహిత్య వ్యవస్థకీ ఎదురొడ్డి నిలిచింది(కోయి కోటేశ్వరరావు).

దళిత సాహిత్యోద్యమంలో కూడా దళిత స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులుగానే యింకా వుండిపోయారు. దళిత స్త్రీల సాహిత్య విమర్శ విరివిగా వచ్చినప్పుడే ఆ వివక్ష తొలగే అవకాశం వుంది (చల్లపల్లి స్వరూపరాణి).

దళిత కులాలనుంచి వచ్చిన కారణంగానే పాట కవులు వివక్షనే ఎదుర్కుంటున్నారు. వచన కవితకి దక్కే గౌరవం పాటకి దక్కటం లేదు. ఉద్యమావసరాలకు వుపయోగపడే పాట విస్మరణకి గురైంది. పాట విశ్లేషణకి అవసరమైన పరికరాలు మనం యింకా సమకూర్చోవాల్సి వుంది (సి కాశీం).  

పాఠకుడైనా విమర్శకుడైనా వొక వాచకాన్ని లోతుగా అర్థం చేసుకొని సారాన్ని గ్రహించాలంటే నిశ్చిత నిశ్చయాల్ని పక్కనపెట్టి దాన్ని లోపలికి సాదరంగా ఆహ్వానించి పరిపూర్ణంగా స్వీకరించి దానికి ఊడిగం చేయాలి (అడ్లూరు రఘురామరాజు).

అమెరికాలో తెలుగు ‘డయాస్పోరా సాహిత్యం’ పట్ల అది యెదుర్కొనే కొత్త సవాళ్ళ గురించి ప్రధాన స్రవంతి తెలుగు సాహిత్యకారులకు చిన్నచూపే (వేలూరి వెంకటేశ్వరరావు).

నాలుగైదు దశాబ్దాల విప్లవోద్యమ సాహిత్య గమనంలోని యెన్నో యెత్తు పల్లాలున్నాయి. నేటి ప్రజా పోరాటాల్లో ప్రజాపక్షంగా వుండాల్సిన రచయితల గొంతులు బలహీనపడుతున్నాయి. ప్రజా రాజకీయాల్లో రచయితలు నిర్వహించాల్సిన సాహిత్య కార్యాచరణ అమూల్యమైనది(అల్లం రాజయ్య).

ఎన్ని వుద్యమాలు జరిగినా తెలుగు సాహిత్య ప్రధాన స్రవంతిలో ఆదివాసీ సాహిత్యానికి సరైన స్థానం గుర్తింపు యెప్పుడూ లభించలేదు., ప్రధాన భాషల ఆధిపత్యంకింద ఆదివాసి భాషలు నలిగి పోవడంవల్ల గిరిజన గూడేల నుంచి రచయితలు పుట్టుకురాలేదు. విద్యా వ్యవస్థలో ఆదివాసీ భాషలు నేర్చుకునే అవకాశం లేకపోవడం కూడా అందుకు వొక కారణం (మల్లిపురం జగదీశ్).

చారిత్రిక భౌతికవాదం మానవ సమాజాభివృద్ధికి సంబంధించిన సాధారణ నియమాలను తెలియజేసే శాస్త్రం. ఉత్పత్తి సంబంధాల ఆర్ధిక నిర్మాణమైన పునాదిలో మార్పులు సంభవించినప్పుడల్లా ఉపరితలమైన సాహిత్యం కళలు మొదలైన వాటిలో సైతం మార్పులు అనివార్యంగా చోటు చేసుకుంటాయి (వి శ్రీనివాస్).

చారిత్రిక భౌతిక వాదం వెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ సామాజికతను ప్రధాన లక్ష్యం చేసుకొని వస్తువు చుట్టూ మాత్రమే పరిభ్రమిస్తుందనే వాదన దుష్ప్రచారమే. శిల్ప సమీక్ష చేయడానికి సైతం అది గొప్ప పనిముట్టుగా వుపయోగపడుతుంది. అయితే అదే సమయంలో పునాది – ఉపరితలం భావనని మార్క్సిస్టు విమర్శకులు కూడా లోతుల్లోకి పోకుండా బండగా వాడి అరగదీశారు. అందువల్ల నిర్దుష్టమైన సాహిత్య సిద్ధాంతం యెదగలేదు. ఆ లోటుని పూరించుకుంటూ మార్క్సిస్టు విమర్శ తనను తాను సవరించుకొని విస్తరించుకోవాల్సిన అవసరముంది. నిత్య ప్రయోగశీలి – చలనశీలి అయిన చారిత్రిక భౌతికవాదం మాత్రమే వాచకం, వస్తువు, శిల్పం, దృక్పథం, ప్రభావం, ప్రయోజనం … వీటికి గల అంతస్సంబంధాన్నీ పరస్పరపూరకత్వాన్నీ విశ్లేషించగలదు (పాణి).

సమాజంలో అల్పసంఖ్యాకులపై అధికసంఖ్యాకుల ఆధిపత్యాలు అనేకరూపాల్లో వ్యవస్థీకృతమై వున్నాయి. అవే సాహిత్యంలోకి సైతం పరివ్యాప్తమౌతాయి. అవి తొలగినప్పుడే మానవీయ సమాజాన్ని సాధించుకోగలం సమాజాన్ని ప్రజాస్వామీకరించుకోవడం ద్వారా మాత్రమే మౌలికమైన మార్పు వస్తుంది (ఖాదర్ మొహియుద్దీన్).

సామాజిక అస్తిత్వాలు అనేకం – ఒకే వ్యక్తిలో ఏకకాలంలో బహుళ అస్తిత్వాలు వుండవచ్చు. అస్తిత్వానికి ప్రయాణం పరిణామం వుంటాయి. అస్తిత్వాలు అస్వతంత్రమైనవీ సాపేక్షమైనవీ. వాటి పరిమితుల్లో వొక్కోసారి అవి సంఘర్షించుకుంటాయి; వాటిని ప్రజాస్వామికంగా పరిష్కరించుకోవాలి( బండి నారాయణ స్వామి).

పురుషులదైన   సామాజిక ప్రపంచంలో సాహిత్య ప్రపంచం కూడా పురుషులదే అవుతుంది. స్త్రీలు దానికి కూడా పరాయి వాళ్ళే. స్త్రీల రచనలలో సాహిత్యపు విలువలు లేవని పక్కకు పెట్టటం ,సాహిత్య చరిత్రలో చోటు లేకుండా చేయటం జరుగుతున్నది. జెండర్ రాజకీయాల మాయలో భాగంగా ఇది అర్థమైనప్పుడు సాహిత్య సమాజపు అంచులకు నెట్టివేయబడిన మహిళా రచయితలను గుర్తించి వారి సృజన శక్తుల గురించి ,జీవిత సంఘర్షణల గురించి , వాళ్లు చిత్రించిన వాళ్ళదైన ప్రపంచం గురించి, ఆశల గురించి,ఆకాంక్షల గురించి, వ్యూహాల గురించి తెలుసుకొనటం, తెలియ చెప్పటం అవసరమవుతుంది(కాత్యాయనీ విద్మహే).

గ్లోబలీకరణనీ వలసవాదాన్నీ సామ్రాజ్యవాదాన్నీ వాటి కారణంగా సంభవించే అసమానతల్నీ ఆధిపత్యాల్నీ తిరస్కరించే ప్రతిఘటన స్థానికత. అదొక రాజకీయ తాత్వికత (అఫ్సర్).

దళిత బహుజన వాదం పోస్ట్ మాడర్నిజం ప్రభావం నుంచి పుట్టింది కాదు. అది అస్తిత్వ వాదంలో భాగం కూడా కాదు. అది పీడిత కులాల విముక్తికోసం ఈ నేలపై పురుడుపోసుకొన్న మూలవాసుల సామాజిక విప్లవోద్యమం (జి లక్ష్మీనరసయ్య).

బహుజన అనే భావనలో దళిత, గిరిజన, బిసి, ముస్లిం, క్రైస్తవ, అణగారిన కుల స్త్రీల సాహిత్యమంతా వ్యక్తమవుతుంది. ఈ అన్ని వర్గాలకు ఉమ్మడి ప్రతినిధి ‘బహుజన’ భావన. కానీ బహుజన రాజకీయాలను అర్థం చేసుకొనే శక్తి లేకపోవటం, ప్రతి వర్గంలో సెక్టేరియనిజం బలంగా అభివృద్ధి చెందటం వల్ల బహుజన భావన అపహాస్యం పాలైంది. బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా సాగాలసిన బహుజన సాహిత్య ఉద్యమం చీలికలు పేలికలైంది(జిలుకర శ్రీనివాస్).

మౌఖిక జానపద కళాసాహిత్యాలకు పుట్టినిళ్ళయిన గ్రామాల్లో ఉత్పత్తి సంబంధాల్లో వచ్చిన మార్పులు గ్రామాల స్వరూపాన్ని మార్చివేశాయి. వినియోగ సంస్కృతిని అందిపుచ్చుకొన్న గ్రామం గ్లోబల్ అంగడిగా తయారైంది. మారిన గ్రామాన్ని సాహిత్యకారులు అర్థం చేసుకొని మార్కెట్ పాదాలకింద మసి అవుతున్న మానవ సంబంధాలను కాపాడుకోవాలి(నందిని సిధారెడ్డి).

పెట్టుబడుల విస్తరణ అమానవీయంగా వుంటుంది. అది రాజ్యం దన్నుతో భూమిని నమ్ముకున్న రైతుల్ని తమ నేలకు దూరం చేస్తుంది. అడవి బిడ్డల్ని అడవి నుంచి తరిమివేస్తుంది. గంగ పుత్రులని సాగర తీరం నుంచి వేరుచేస్తుంది. అంతిమంగా మనిషి జీవించే హక్కుని హరిస్తుంది. ప్రశ్నించిన వాళ్ళని క్రూరంగా అణచివేస్తుంది. వ్యవస్థీకృతమైన యీ హింసని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ మార్గంలో నడిచే ప్రజా శ్రేణులు ఒకే తాటిపై ఏకోన్ముఖంగా కదలాలి (అట్టాడ అప్పల్నాయుడు).

అభివృద్ధిని గుడ్డిగా నిరాకరించే సాహిత్యకారుల దృష్టి పాక్షికమైనది. అభివృద్ధి క్రమాన్నీ స్వరూప స్వభావాలనూ, అభివృద్ధి ఫలితాల తీరు తెన్నుల్నీ వెలుగు నీడల్నీ అర్థం చేసుకోవడంలో మన రచయితలు తడబాటుకి గురౌతున్నారు. పాలకుల సంక్షేమ కార్యక్రమాలు అసమానతను తొలగించడానికి గాక కార్పోరేట్ శక్తులకు వారి మార్కెట్ ని విస్తరించుకోడానికి తోడ్పడుతున్నాయి. వేగంగా మారుతోన్న ఆధునిక సమాజాన్ని అధ్యయనం చేయడానికి కొత్త పరికరాలను సమకూర్చుకోవాలి (జి యస్ రామ్మోహన్).

కల్పన ఎక్కడైనా ఎప్పుడైనా వాస్తవాలపై ఆధారపడక తప్పదు. అయితే వాస్తవంతో దూరీకృత సంబంధం ఆ కల్పన అందంగా రూపొందడానికి దారిస్తుంది. కల్పన వాస్తవానికి ఎంత దగ్గరగా/దూరంగా ఉంది, ఎంత తార్కికంగా/హేతుబద్ధంగా ఉంది అనే ప్రమాణాలపైన ఆయా రచనల విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. అటువంటి తరుణంలో నమ్మించగలగటం అనేది రచయిత సామర్థ్యానికి ఒక పరీక్ష. ఒక్కోసారి సమర్థుడైన రచయిత వాస్తవానికి మిక్కిలి దూరం జరిగి కూడా నమ్మించగలడు (పాపినేని శివశంకర్).

శాస్త్రీయత కళాత్మకత అనే రెండు గుణాల మేళవింపే శిల్పం. భాషకూ భావవ్యక్తీకరణ విధానానికి సంబంధించినది శైలి. స్వీకరించిన వస్తువు పాఠకులకు చేరడానికి అవసరమైన శైలీ శిల్పాలను రచయిత అవసరానుగుణంగా నిర్మించుకుంటాడు. ప్రతిభగల రచయిత వస్తు – శిల్పాలను పడుగు పేకల్లా కలనేస్తాడు. వాటి అంతర్గత కళాత్మక సంబంధాన్ని పట్టుకొనే విమర్శ వొక ఇంటలెక్చువల్ ఆక్ట్ (ఆడెపు లక్ష్మీపతి).

‘రచయితలారా మీరెటువైపు?’ దాదాపు అయిదు దశాబ్దాలుగా ప్రశ్న నలుగుతూనే వుంది. ప్రతిపక్షంలో వొక రోజు ప్రజాపక్షంలో మరొకరోజు పాలకపక్షంలో యింకొకరోజు యథేచ్ఛగా రచయితలూ కవులూ కళాకారులూ అటూ యిటూ స్వైర విహారం చేస్తూనే వున్నారు. తమ నిలకడలేనితనాన్ని సైద్ధాంతికంగా సమర్థించుకుంటూనే ఉన్నారు. ప్రగతిశీల శిబిరాల్లో ఈ వైఖరిని తాత్త్విక గందరగోళం అనలేం. అన్నీ అందరూ తెలిసే చేస్తున్నారు. మంచి సాహిత్యం, నిజాయితీతో కూడిన బలమైన సాహిత్య విమర్శ కొరవడటానికి / తగ్గుముఖం పట్టడానికి రచయితల యీ ద్వంద్వప్రవృత్తి కూడా కారణమౌతుంది (కాత్యాయని).

అసలు విమర్శే వ్యర్థ కార్యకలాపం. రచయితకీ పాఠకులకీ మధ్య విమర్శకుల ప్రమేయం అనవసరం. అంతిమంగా చదువరే తీర్పరి (అంబటి సురేంద్ర రాజు).

రచయితలు వ్యక్తం చేసిన యీ అభిప్రాయాల్లో కొన్ని విమర్శకి చెందిన మౌలిక భావనలు (Basic Concepts). మరికొన్ని తెలుగు సాహిత్యాన్నీ సమాజాన్నీ నిర్దిష్టంగా లక్ష్యీకరించి చెప్పినవి. ఇంకొన్ని వారి పరిశీలనలో అనుభవాల్లో తెలుసుకొన్న సామాజిక దృగ్విషయాలు. కొన్నైతే శుద్ధ రాజకీయ ప్రకటనలు. వాటి మంచి చెడ్డలని విశ్లేషించడం ముందుమాట పరిధిలోకి రాదు. అది పాఠకులు తేల్చాలి.

అయితే వ్యాసరచయితలు భిన్న సిద్ధాంతాల భావజాలాల నేపథ్యం నుంచీ వచ్చినప్పటికీ అనేక విషయాల్లో వారిలో యేకీభావం కనిపిస్తుంది. సాహిత్య విమర్శలో ఖాళీలని పూరించుకోవడానికి ప్రజాస్వామికీకరణ అవసరాన్ని రచయితలందరూ గుర్తించారు. అబిప్రాయ ప్రకటన స్వేచ్ఛని గౌరవించే సాహిత్య వ్యవస్థని కోరుతున్నారు. అందుకు విఘాతంగా పరిణమించే ప్రతి అంశాన్నీ ఖండించారు. రాజకీయాలు మానవ కేంద్రంగా కొనసాగాలనీ ఆధిపత్యాలు యే రూపంలో వున్నా ప్రతిఘటించాలనీ ప్రకటించారు. అంతిమంగా ప్రజల కోసమే నిలబడాల్సిన సాహిత్యానికి సాహిత్య విమర్శ దిశానిర్దేశం చేయాలనే నమ్ముతున్నారు. కేవలం భావనలుగా విడి విడిగా వున్న ఆలోచనల్ని తాత్త్విక స్థాయికి తీసుకెళ్ళి శాస్త్రీయమైన ఆధునిక సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించడంలో తెలుగు సాహితి విమర్శ విఫలమైందని భావిస్తున్నారు. ఆధునిక సమాజంలో మనిషిని మానవీయంగా తయారుచేయడానికి సాహిత్యం , సాహిత్య విమర్శ తోడ్పడాలని తోటి రచయితలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడని సాహిత్యాన్నీ విమర్శనూ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. మరో ముఖ్య విషయం యేమంటే యెవరికి వారు తమ తమ భావజాలాల పరిధిలోనే అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రతి వొక్కరికీ చెప్పిన విషయాలపట్ల సడలని విశ్వాసం వుంది. తడబాటు లేని నిజాయితీ యీ రచయితల్లో రచనల్లో కనిపించే విశిష్ట గుణం.

సంకలనంలో రచయితలు ప్రతిపాదించిన క్రోడీకరించిన సూత్రాల్లోకో చట్రాల్లోకో సిద్ధాంతాల్లోకో విమర్శని కుదించడం ‘బహుళ’ఉద్దేశం కాదు. ఒక రచననీ / రచయితనీ కేవలం యేదో వొక దృక్పథం నుంచి గానీ సిద్ధాంతం నుంచి గానీ విశ్లేషించి అంచనా వేయడానికి అవసరమైన పరికరాలు అందించడం కూడా కాదు. సామాజిక శాస్త్రాల వెలుగులో కొత్త ప్రతిపాదనలకూ సూత్రీకరణలకీ అవకాశం కల్పిస్తూ విమర్శ అభివృద్ధి చెందాలనీ , సామాజిక చలనాన్ని రచయిత సమ్యగ్రీతిలో ఆకళింపు చేసుకొని మంచి సాహిత్యాన్నిసృజించడానికి దోహదం చేయాలనీ చిన్న ఆశతో చేసిన చిన్న ప్రయత్నం యిది. విమర్శలో భిన్న తాత్త్విక ధోరణులు వున్నప్పటికీ అభిప్రాయాల్ని వ్యక్తీకరించడానికి సామాన్యంగా అనుసరించాల్సిన మెథడాలజీని రూపొందించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడం కోసం ‘బహుళ’ ఉపయోగపడాలని కోరిక.

సాహిత్య విమర్శ ప్రస్థానంలో భిన్న స్వరాలకు ‘బహుళ’ వొక వేదికగా నిలవాలని కోరుకున్నాం. నిలిచిందనీ భావిస్తున్నాం. అయినా యిది సర్వ సమగ్రమని అనుకోవడం లేదు. సమగ్రత ఎప్పుడూ సాపేక్షమే. ఈ సంకలనానికి వున్న పరిమితులు మాకు తెలుసు. మేం అడిగిన కొందరు వ్యాసాలు అందించలేకపోయారు. కొందర్ని మేము ప్రస్తుతానికి యీ ప్రణాళికలో చేర్చుకోలేకపోయాం. నిజానికి మేం అనుకొన్న అంచనాల్నీ ఆశించిన లక్ష్యాల్నీ పూర్తిగా చేరుకోలేకపోయాం. వనరుల లేమి కారణంగా కొన్ని లోపాల్ని దిద్దుకోలేకపోయాం.

మూడు దశాబ్దాలుగా ప్రజాస్వామిక దృక్పథమే వూపిరిగా సమాజం పట్ల సాహిత్యం పట్ల గొప్ప నిబద్ధతతో పనిచేస్తున్న ప ర్ స్పె క్టి వ్స్ తో నా యీ ప్రయాణం నా మటుకు నాకు గొప్ప అనుభవం. ప్రచురణకర్త ఆర్ కె తో , వ్యాస రచయితలతో వందలాది పర్యాయాలు వేళాపాళా లేకుండా వేలాది గంటలు సంభాషించడం వల్ల, విషయాల్ని చర్చించడం వల్ల చాలా-చాలా అంటే చాలా – నేర్చుకోగలిగాను. ఒక సారం రాబట్టుకోడానికే కాదు; మానవ సంబంధాల్ని మెరుగుపరచుకోడానికి సైతం ప్రజాస్వామిక సంభాషణ ఎంతగా అవసరమో గ్రహించాను. అందుకు తోడ్పడిన సంకలనంలోని రచయితలందరికీ సంస్థగా పర్స్పెక్టివ్స్, వ్యక్తిగా నేనూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ సంకలనం కోసం స్పృశించని అంశాల్నీ రచయితల్నీ మరింత విస్తృత వేదిక మీద మరోసారి కలుసుకోవాలని ఆశిస్తున్నాం.

ఒక సారాంశం కోసం మొదలుపెట్టిన యీ సంభాషణ ముందు ముందు కొనసాగాలనీ అది మంచి సాహిత్యానికి దారి తీస్తుందనీ ఆశిస్తూ … ప్రవాహ శీలమైన సమాజంలో యెప్పటికప్పుడు చైతన్య వంతమయ్యే ప్రజా సమూహాలు నిర్మించే విముక్తి ఉద్యమాలు తీసుకొచ్చే మార్పులకు సాహిత్య విమర్శ పరావర్తకంగా పని చేయాలనీ భావిస్తూ …

హైదరాబాద్ ఎ కె ప్రభాకర్
ఏప్రిల్ 18 , 2018 సంపాదకుడు

[బహుళ పుస్తకం కోసం నవోదయ బుక్ హౌస్ కాచిగూడ X రోడ్స్ సుల్తాన్ బజార్ హైదరాబాద్ (ఫో. 040 24652387)ని సంప్రదించండి. ఈ పుస్తకం కినిగె లో కూడా దొరుకుతుంది.]

You Might Also Like

Leave a Reply