మహిళా సాధికారత నుంచీ సకల మానవాభివృద్ధి వైపు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్

‘మహిళల జీవన విధ్వంసం – సామాజిక ఆర్థిక మూలాలు’
ప్రొ. తోట జ్యోతిరాణి వ్యాస సంపుటికి ముందుమాట

**********
“మీరూ మేమూ ఆడవాళ్లమే. కానీ అందరు ఆడవాళ్ళు ఒక్కటి కాదు.”

మహిళా సాధికారత గురించి ప్రొ. తోట జ్యోతిరాణి గారి రచనలు చదివినప్పుడు గానీ ప్రసంగాలు విన్నప్పుడు గానీ బొలీవియా గని కార్మికురాలు ‘దొమితిలా చుంగారా’ (మా కథ) గొప్ప వుద్వేగంతో హేతుబద్ధతతో బొంగురు గొంతుతో చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తుంటాయి. ‘ఫెమినిజం’-‘వుమనిజం’ యీ రెండు పదాల మధ్య వున్న సామీప్య దూరాల గురించి చాలాకాలంగా జరుగుతోన్న చర్చలూ ఆలోచనలూ బుర్రలో కదుల్తూ వుంటాయి. అవి ఫెమినిజంలోని భిన్న ధోరణులకు చెందిన చర్చలే అని తేలిగ్గా తేల్చివేయ వచ్చు గానీ వాటిని ఆచరణ గీటురాయి మీద పరీక్షించి లోతుగా అర్థం చేసుకొని మన దేశ కాల పరిస్థితులకీ అవసరాలకీ అన్వయించుకొన్నప్పుడే వాస్తవం బోధపడుతుంది. జెండర్ స్వేచ్ఛా సమానత్వాల గురించి స్త్రీల మౌలిక హక్కుల గురించి స్త్రీలపై అమలయ్యే పితృస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా గొంతు విప్పే మధ్య తరగతి వున్నత వర్గాల స్త్రీలు వొకవైపు, దుర్భరమైన పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఇంటిల్లపాదికీ ఆహార భద్రత కల్పించే భారాన్ని నెత్తి మీద మోస్తూ కుటుంబ పోషణకోసం గనిలో వనిలో కార్ఖానాలో అహర్నిశలూ శ్రమిస్తూ శ్రమదోపిడికి తోడు అదనంగా లైంగిక దోపిడికి గురవుతూ తమకూ హక్కులుంటాయని మర్చిపోయి కూటికోసం గుడ్డ కోసం గూడు కోసం అనునిత్యం సంఘర్షించే శ్రామిక మహిళలు మరోవైపు – భిన్న ధ్రువాల్లో నిలబడ్డారని చెప్పలేం గానీ భిన్న తలాల్లో భిన్న పోరాట మార్గాల్లో వున్నారని తెలుస్తుంది.

మహిళలందు పేదమహిళలు వేరయా అనో దళిత మహిళలు వేరయా అనో చెప్పడానికి లక్షింపేట, పెద గొట్టిపాడు వంటి సమీప వుదాహరణలు కొల్లలుగా కనిపిస్తాయి. ఆదివాసీ వాకపల్లి ఘటనలు ప్రధాన స్రవంతికి పెద్దగా పట్టవు. పైపెచ్చు అవి దేశ సుస్థిరతకి భంగం కల్గించే వామపక్ష తీవ్రవాదంపై ప్రభుత్వాల రాజకీయ విధానంలో భాగంగా తీసుకొనే చర్యలు అని నచ్చచెప్పుకుంటాం. వాళ్ళ బతుకులు టాంక్ బండ్ మీదో రాజపథాల్లోనో కొవ్వొత్తులై మెరవవు. ఇటువంటి నేపథ్యంలోనే బయట దేశాల్లో ‘బ్లాక్ ఫెమినిజం’ సిద్ధాంతం కూడా ముందుకు వచ్చింది. మన నేల మీద దళిత స్త్రీ వాదం రూపుదిద్దుకుంది. శ్రామిక మహిళావాదం పురుడుపోసుకుంది. వర్గ సమాజంలో మెజారిటీగా ఉన్న శ్రామిక మహిళ విముక్తి వర్గ విముక్తితోనే ముడిపడి ఉంటుంది, వర్గరహిత సమాజంలో మాత్రమే ఆమెకు నిజమైన స్వేచ్ఛా, సమానత్వం, సాధికారిత వస్తాయనే స్పృహతో కొత్త పోరాట రూపాల్ని యెన్నుకుంది. ఫలితంగా రాజ్యహింసను యెదుర్కొంటుంది. భూస్వామ్య పెత్తందార్ల దౌర్జన్యానికి బలవుతుంది. అయినా నూతన మానవి ఆవిష్కరణ కోసం అడుగడుగునా పెనుగులాడుతోంది.

ఆ క్రమం లోనే ‘జెండర్ సమానత ఒక ఉన్నతమైన మానవీయ విలువ, ఒక ఉదాత్తమైన భావన. అంతర్జాతీయంగా గుర్తించబడిన ఒక ప్రాథమిక మానవ హక్కు. మానవీయ సమాజ నిర్మాణాల ఆవిష్కరణకు ఇదొక మౌలికమైన ప్రాతిపదిక.’ అన్న అవగాహనతో ప్రొ. జ్యోతిరాణి ఇటీవలి కాలంలో రాసిన వ్యాసాల సంపుటి ‘ మహిళల జీవన విధ్వంసం – సామాజిక ఆర్థిక మూలాలు’. జ్యోతిరాణిగారు యింతకు ముందు ప్రచురించిన ‘సమ్మిళిత వృద్ధి – మహిళలు : రాజకీయార్థిక నేపథ్యం’ (స్త్రీ విముక్తి సంఘటన : 2014) కి కొనసాగింపుగా తెస్తున్న ఈ వ్యాస సంపుటిలో ఆర్థిక సామాజిక సంక్షోభంలో ప్రపంచీకరణ విష సంస్కృతిలో చిక్కుకొన్న స్త్రీల దుస్థితికి భిన్న సామాజిక ఆర్ధిక మూలాల్ని పేర్కొంటూ స్త్రీల సాధికారతకి సంబంధించిన అనేక తీర్మానాల్నీ ఆచరణల్నీ చర్చకు పెడుతున్నారు.

సంపద కేంద్రీకరణ బలోపేతమౌతున్న కారణంగా, ఆదాయ పంపిణీలో అసమానతల కారణంగా పెరుగుతున్న పేదరికాన్ని ప్రశ్నించకుండా జెండర్ సమానత సాధించాలని, తద్వారా పేదరికపు దుష్ఫలితాలను తగ్గించవచ్చు అని ఐక్యరాజ్య సమితి ప్రకటనల్లోని డొల్లతనాన్ని ఆమె బలంగా ప్రశ్నిస్తున్నారు. పేదరిక నిర్మూల ద్వారా జెండర్ వివక్షను అంతం చేసే దిశగా ప్రయత్నించడానికి వీలుంది; కానీ జెండర్ సమానత ద్వారా పేదరిక ప్రభావాన్ని తగ్గించడం సాధ్యం అంటే సమస్యని తలకిందులుగా చూడటమే అని జ్యోతిరాణి నిర్ధారిస్తారు. దీన్ని స్త్రీవాదులకు కూడా అన్వయించుకోవచ్చు. అలా అన్వయించుకొన్నప్పుడు స్త్రీల సమస్య విషయికంగా ప్రకటించే విధానాలు, యిచ్చే నినాదాలు మారతాయి. కార్యక్షేత్రం ఆచరణా మారతాయి. ‘హేపీ టు బ్లీడ్’ కొందరికి స్త్రీత్వాన్ని ప్రకటించుకొనే గౌరవ ప్రకటన. స్త్రీ శరీరం చుట్టూ అల్లిన మైల పవిత్రత లాంటి మిత్ ని బద్దలుగొట్టే రాజకీయ చేతన. కానీ దుర్భర పేదరికంలో అశుభ్ర పరిస్థితుల్లో కనీసపు డిగ్నిటీని కాపాడుకొనేందుకు సరైన మరుగు లేక శానిటరీ సదుపాయాల్లేక వ్యవస్థ లేక రక్త స్రావాన్ని నివారించడానికి లేదా పీల్చడానికి పాతగుడ్డలు ఆకులు రాళ్ళు మట్టి వంటి వాటిని వుపయోగించే చోట ‘హేపీనెస్’ అర్థాలు మారతాయి. శరీర రాజకీయాలు మారతాయి. కట్టుకోడానికే సరైన బట్ట లేనప్పుడు – నా యిష్టమైన దుస్తులు ధరిస్తాను, నాకు నచ్చిన వాళ్ళతో కలిసి జీవించే హక్కు నాకుంది వంటి ఆలోచనల నుంచి పుట్టిన స్వేచ్ఛ లైంగికత పదాలకు నిర్వచనాలు సైతం మారతాయి. హక్కుల ప్రాథమ్యాలు మారతాయి. ‘మై చాయిస్’ హర్ చాయిస్ ‘మీ టూ’ వంటి నినాదాల పరిధి పరిమితులు తెలుస్తాయి.

‘మాకు కడుపు నిండా తిండి లేదు. నీళ్ళు లేవు. స్నానాల గదులు లేవు. మా పిల్లలకు చదువులు లేవు. మీరు కార్ల లో తిరుగుతారు. ఏ పనికైనా నౌకర్లు, డ్రైవర్లు ఉంటారు. మనిద్దరం ఆడవాళ్లమే మరి మీకూ మాకూ సమానత్వం ఎక్కడుంది? మా సమస్యలు మీకు ఎక్కడున్నాయి?’ అన్న చుంగారా సంధించిన ప్రశ్నలు అప్పుడు ముందుకొస్తాయి. అందుకే ముందు పోరాడాల్సింది పేదరికం పైనే అని జ్యోతిరాణి బలంగా విశ్వసిస్తారు.

అది విద్య కావొచ్చు వైద్యం కావొచ్చు పరిశ్రమలు కావొచ్చు కార్పోరేట్ల ప్రథమ ప్రయోజనం మార్కెట్. మానవీయ విలువలకు వ్యతిరేకపదం మార్కెట్. దానికి లాభాలు మాత్రమే ప్రధానం. ‘కార్పోరేట్ పెట్టుబడుల పరం అయ్యేటటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా వుండదు; మానవీయ పరిస్థితుల్ని సృష్టించదు. లాభానికి మానవ ముఖం ఉండదు. లాభానికి మంచి చెడులు అక్కరలేదు’. సమాజానికి మంచేంటో చెడేంటో, ఆడపిల్లలకి మంచేంటో చెడేంటో కార్పోరేట్ కి అవసరం లేదు. చాలా సందర్భాల్లో స్త్రీల హక్కుల నినాదాల్ని కూడా వాడు లాభాలనార్జించే వనరుగా వుపయోగించుకుంటాడు. అందుకే పెట్టుబడిదారి సమాజం మార్కెట్ విస్తృతి కోసం స్త్రీ సాధికారత గురించి పురుష సమానత్వానికీ యిచ్చే నిర్వచనాల పట్ల అప్రమత్తంగా వుండమని జ్యోతిరాణి యీ వ్యాసాల్లో హెచ్చరిస్తారు. ఆధునిక యువతి ఆత్మ గౌరవ ప్రదమైన వ్యక్తిత్వానికీ కేవల శారీరిక సౌందర్యానికీ తేడా తెలుసుకోవాలని వొక అధ్యాపకురాల్లా ప్రబోధిస్తారు. జీరో సైజులూ పాలమీగడ రంగులూ అందానికి కొలమానాలుగా ప్రచారం చేసే సాంస్కృతిక దాడుల నుంచి ఆడపిల్లలు జాగ్రత్త పడాలని వొక తల్లిలా నచ్చచెబుతారు. అదే సందర్భంలో స్త్రీలపై పసిపిల్లలపై యింటా బయటా హింస పెరగడానికి బీజాలు సాంస్కృతిక సామ్రాజ్యవాదంలో వున్నాయని గుర్తిస్తూనే వాటిని నిర్దేశించే మార్కెట్ శక్తుల్ని జ్యోతిరాణి ఆర్థిక మూలాల్లోంచి చూస్తున్నారు.

మహిళా సాధికారత జెండర్ సమానత మానవాభివృద్ధి యెజండాలో ముఖ్య లక్ష్యాలుగా అంతర్జాతీయ సంస్థలన్నీ ప్రకటిస్తూనే వుంటాయి. దేశీయ చట్టాలు కూడా దానికి తందానా అంటాయి. కానీ పాలకుల విధానాలు మాత్రం అందుకు వ్యతిరేక దిశలో నడుస్తాయి. ప్రైవేటు పెట్టుబడులకు దాసోహం అంటాయి. దాంతో ప్రైవేటీకరణ కార్పోరేటీకరణ ప్రభుత్వ రంగాన్ని కుదించేశాయి. కార్పోరేట్ శక్తులు కార్మిక చట్టాల్నీ హక్కుల్నీ తుంగలో తొక్కి లాభాల వేటలో వుంటాయి. వాళ్లకి లాభాల వేట తప్ప మరే ఆలోచనా వుండదు. ఆ క్రమంలో స్త్రీలు పిల్లలు వారికి కారు చవకగా దొరికే మానవశ్రమ. స్త్రీలు ఆర్థిక లైంగిక దోపిడీకి గురవడానికి కారణమయ్యే అనేక అంశాల లోతుల్ని అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వాల రిపోర్టులు పనికిరావు. కార్యక్షేత్రంలోకి వెళ్ళి చూడగలిగినప్పుడే వాస్తవాలు బయటపడతాయి. వలసలు విస్థాపన వంటి సమస్యల తీవ్రత ప్రత్యక్షంగా చూసినప్పుడే అర్థమౌతుంది.

వలసల్ని కొందరు అభివృద్ధి వాదులు పాజిటీవ్ అంశంగా పేర్కొంటారు. వలస కారణంగా గ్రామీణ పేదలు ఫ్యూడల్ దోపిడీ నుంచి విముక్తులౌతారనీ కులం కులవృత్తులు మాయమైపోయి కులరహిత సమాజం ఏర్పడటానికి వలసలు దోహదం చేస్తాయనీ చెబుతారు. కానీ యీ వాదన పూర్తిగా నిజం కాదు. అంటరాని కులాలకు గ్రామమైనా నగరమైనా ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియానే’. నగరాలలోనే సువర్ణ భూములూ గేటెడ్ కమ్యూనిటీలూ అగ్రహారాలూ విస్తరిస్తున్నాయి. ‘వేరెవవర్ యూ గో’ కులం వెంటాతాడుతూనే వుంటుంది. వలస అంటే అమలాపురం నుంచి అట్లాంటా ప్రయాణం కాదు. లోతుగా పాతుకున్న జీవిత వృక్షాన్ని వేళ్ళతో సహా పెకలించి మరో చోట పాతిపెట్టాలని ప్రయత్నించడం. మళ్ళీ బతుకు చిగురిస్తుందని నమ్మకం లేదు. చాలా సందర్భాల్లో వలస అంటే రైతు అడ్డా మీద కూలిగా మారటం. కూలీ పూట గడవక పొట్ట నిండక వొళ్ళమ్ముకోవడం. సమ్మిశ్రిత సంతులిత అభివృద్ధికి దారితీసే వలసలు గానీ విస్థాపనలు గానీ వుండవని జ్యోతిరాణి బలంగా నిర్ధారిస్తారు. పేదరికమే వలస పోతుంది తప్ప మనుషులు కాదనీ గుణాత్మకమైన మార్పేమీ వుండదనీ తీర్మానిస్తారు. అప్ వార్డ్ మొబిలిటీ కోసం పోయే వలసల్ని పొట్ట చేత బట్టుకొని పోయే వలసల్నీ పోల్చలేం. ఉన్న వూళ్ళో బతికే తెరువుంటే వలసపోడానికి యెవరూ సిద్ధంగా వుండరు. సొంత నేలని వదిలి కొత్త చోటుల్లో పరాయి పంచల్లో బతుకులీడ్చేవాళ్ళు యెటువంటి నరకాలు అనుభవిస్తారో తెలుసుకోవాలంటే జ్యోతీరాణి గారి వ్యాసాలు చదవండి.

నిజానికి వలసలు మహిళీకరణకి గురయ్యాయి. ప్రపంచీకరణ దాన్ని మరింత వేగవంతం చేసింది. మహిళల పైనే వాటి ప్రభావం యెక్కువగా పడుతుంది. కుటుంబానికి ఆహారాన్ని అందివాల్సిన అదనపు భారం స్త్రీలపైనే వుండటంవల్ల కష్టాలనీ అవమానాల్ని హింసనీ స్త్రీలే యెక్కువ యెదుర్కోవాలి. వలసలు పిల్లల్ని చదువులకు దూరం చేస్తాయి. అనియత వుద్యోగికతని పెంచుతాయి. వుమన్ ట్రాఫికింగ్ కీ లైంగిక దోపిడీకీ దారులు వేస్తాయి. జెండర్ అసమానతకి కారణమౌతాయి. బతుకులు అస్థిరమై అభద్రతకి గురవుతాయి.

జెండర్ సమానత గురించే గాక సామాన్య ప్రజల జీవితాలను మనుగడను ప్రశ్నార్థకం చేసి అంతర్జాతీయ మార్కెట్ కి రెడ్ కార్పెట్ వేయడానికి వుద్దేశించిన పెద్దనోట్ల రద్దు గురించి, రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరల్ స్ఫూర్తిని నాశనం చేసి అధికారాన్ని కేంద్రీకృతం చేయడం ద్వారా వైవిధ్య రహితమైన యేకశిలా సదృశమైన ఆర్ధిక విధానాన్ని రుద్దడానికి వుపయోగపడే జి ఎస్టీ గురించి , భూసంస్కరణ చట్టాలని నిర్వీర్యం చేసే కొత్త సాగు భూమి విధానాల గురించి, ఉన్నత – సాంకేతిక విద్యారంగాలు కార్పోరేటీకరణకి గురవ్వడం వల్ల కలిగే అనర్థాల గురించి జ్యోతిరాణి గారు రాసిన వ్యాసాలు కూడా యీ సంపుటిలో వున్నాయి.

ఉన్నత విద్య సాంకేతిక విద్యల వుదాత్త లక్ష్యాలు ప్రైవేటీకరణ కారణంగా యెలా భ్రష్టుపట్టి పోతున్నాయో సోపపత్తికంగా నిరూపించిన వ్యాసాలు యీ సంపుటికి అమూల్యమైన విలువను జతచేశాయి. వీటిని చదువుతుంటే ఉన్నత విద్య భవిష్యత్తు గురించి దిగులు పుడుతుంది. ‘కార్పొరేటు పెట్టుబడులతో, కార్పోరేట్ లాభాల కోసం, కార్పోరేట్ ఆధిపత్యం కోసం కావలసిన జ్ఞానం, నైపుణ్యాలతో యువతని తయారుచేసే’ దిశగా దళారీ పాలక వర్గాలు రూపొందించిన కుట్రని రచయిత యీ వ్యాసాల్లో బహిర్గతం చేసారు. దేశం మొత్తంలో అమవుతున్న విద్యా విధానం సామ్రాజ్యవాద అనుకూలం – ప్రజా వ్యతిరేకం అనీ ఖరాఖండిగా తేల్చిచెప్పారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించి, కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల్ని కేటాయించి, వాళ్లకి ఫీజు రీయమ్బరెన్స్ కల్పించి, మేనేజ్ మెంట్ / ఎన్నారై కోటా కింద లక్షలాది రూపాయలు క్యాపిటేషాన్ ఫీజు దండుకోనిచ్చి, అరా కోరా జీతాలతో నిబంధనలకు వ్యతిరేకంగా అర్హతలేని బోధనా సిబ్బందిని నియమించుకోనిచ్చి స్థలాలు కరెంటు నీళ్ళు మొ. సదుపాయాలు రాయితీల్లో యిచ్చి… యిన్నీ యిచ్చి ప్రైవేటు విద్యా వ్యాపారుల్ని భూ బకాసురుల్ని పోషించే బదులు ఆ ఖర్చులతో ప్రభుత్వమే స్వయంగా సాంకేతిక విద్యాలయాల్ని నిర్వహించవచ్చుగా అని యెవరికైనా అనిపిస్తుంది. JNU, HCU సంఘటనల్ని పేర్కొంటూ వున్నతమైన విలువలతో మానవీయ స్పర్శతో కూడిన విద్యా వ్యవస్థే సామాజిక న్యాయానికి దోహదపడుతుందనీ అదే దేశానికి అవసరమనీ నిరూపిస్తున్న విద్యావేత్తని రచయితలో చూడగలం.

విస్తృతమైన అధ్యయనం దశాబ్దాల బోధనానుభవం పరిశోధనా పటిమ సమస్యలపట్ల సునిశితదృష్టి సామాజిక రాజకీయ ఆర్ధిక శాస్త్ర విశ్లేషకురాలిగా ప్రొ. జ్యోతిరాణి గారిని రెండు మూడుతరాల్లో తక్కిన రచయితల కంటే ప్రత్యేకంగా విశిష్టంగా యెత్తున నిలబెట్టాయి. వ్యాస నిర్మాణంలో రచనా ప్రణాళికలో ఆమె తీసుకునే శ్రద్ధ అద్వితీయం. కొత్తగా రాసే యీ నాటి సామాజిక శాస్త్ర విమర్శకులకూ విశ్లేషకులకూ ఆమె రచనా పధ్ధతి ఆదర్శప్రాయం. విషయం లోతుల్లోకి వెళ్ళే ముందు ఆమె ప్రతిపాదించదల్చుకున్న అంశానికి సబంధించిన స్థూల నిర్వచనాల్ని సూక్ష్మ వివరణల్ని పొందుపరుస్తారు. తన విశ్లేషణకి అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. అది ఆధికారిక అనధికారిక వర్గాలు ప్రకటించిన డాటా కావచ్చు స్వచ్చంద సంస్థలు నిర్వహించే సర్వేల ద్వారా సంపాదించినది కావొచ్చు స్వయంగా ఫీల్డ్ వర్క్ కి వెళ్లి సేకరించినది కావొచ్చు కానీ యిచ్చే సమాచారం అన్నివిధాలా ప్రామాణికమై వుంటుంది. నిజానిజాల్ని నిర్ధారించడానికి దాన్ని మంచి పరికరంగా వుపయోగించుకుంటారు. అందువల్ల యెదుటి వారికి ఆమె ప్రతిపాదనల్ని తప్పుబట్టడానికి గానీ ఖండించడానికి గానీ ఆస్కారం వుండదు.

వలసల మహిళీకరణవల్ల, ఉద్యోగ అనియతీకరణవల్ల ప్రమాదంలో పడ్డ మహిళా సాధికారిత వంటి విషయాల్ని విశ్లేషించినపుడు ప్రామాణికమైన ఉపపత్తులు చూపకుంటే మానవాభివృద్ధి విషయంలో పాలకులూ, వారికి వత్తాసు పలికే అభివృద్ధి మాంత్రికులూ మాటల గారడీతో దేశం వెలిగిపోతుందని బుకాయించవచ్చు. జియస్ టి, పెద్దనోట్ల రద్దు, భూ సంస్కరణలు, కేంద్ర బడ్జెట్ లాంటి విషయాల్ని ఆర్ధిక శాస్త్రంతోనూ దాని పరిభాషతోనూ పరిచయంలేని నాబోటి వాళ్ళకి సైతం సుబోధకమయ్యే విధంగా తన వచనాన్ని సరళం చేస్తారు. గొట్టు సైద్ధాంతిక విషయాల్ని కూడా సూటిగా స్పష్టంగా చెప్పడం వల్ల సాధారణ పాఠకులకు తేలికగా అర్థమౌతాయి. అదీగాక ఆమె విశ్లేషణలకు , ప్రతిపాదనలకు ప్రాతిపదిక కేవల సిద్ధాంతాలు కావు. క్షేత్ర స్థాయిలో వాస్తవ జీవితాలనుంచి గ్రహించిన పాఠాలు కావడం వల్ల సారం సాంద్రంగానూ ఆర్ద్రంగానూ వుండి పాఠకుల మనస్సులను నేరుగా తాకుతుంది.

ఆమె పాఠకులు ఆమెకు తెలుసు. ఆమె శ్రోతలు ఆమెకు తెలుసు. వాళ్ళని వుద్దేశించడానికి అనుగుణమైన టెక్నిక్ ని యెన్నుకుంటారు – భాషని వుపయోగిస్తారు. కొన్ని చోట్ల ఆమె వచనం ఉద్వేగ భరితంగా వుంటుంది. కానీ తార్కికతని మాత్రం వదిలిపెట్టరు. అవసరమనుకుంటే అదే విషయాన్ని పదే పదే బోధిస్తారు. పిడియస్ఓ విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆమె వుపయోగించిన భాషా, పేర్కొన్న వుదాహరణలు చూడండి … మౌఖిక శైలితో యెంతో హృదయంగమంగా యువతని ఆకట్టుకుంటాయి. అధీనత విధేయత వంటి క్లిష్టమైన సైద్ధాంతిక అంశాన్ని బాహుబలిలోని కట్టప్ప ద్వారా, కార్పోరేట్ పీడనకీ ఆధిపత్యానికీ అత్తాత్తరింటికి దారేదిలో హీరో పాత్ర ద్వారా సులభ శైలిలో వివరించి తేటతెల్లం చేస్తారు.

అదే విధంగా మహిళా సాధికారత విషయంలో ఐరాస లక్ష్యాలకూ ఆచరణకూ మధ్య వున్న వైరుధ్యాల్ని యెత్తిచూపినప్పుడు , చెప్పే మాటలకూ చేసే పనులకూ పొంతన లేకుండా సామాజిక సంపదని దేశ విదేశాల పెట్టుబడి దారులకు ధారాదత్తం చేస్తున్న కల్లబొల్లి పాలకుల ద్వంద్వనీతిని యెండగట్టినప్పుడు, అసమానతలకు పాదు అయిన ప్రపంచబ్యాంకు పేదరిక నిర్మూలన నినాదాన్ని ముఖంమీద అంటించుకుందని విస్తుపోయినప్పుడు, లాభార్జనే యేకైక ధ్యేయంగా పనిచేసే కార్పొరేట్ల సామాజిక బాధ్యత (సి యస్ ఆర్) గురించి ప్రస్తావించినపుడు ఆమె స్వరంలోని వ్యంగ్యాన్నీ సర్కాజంనీ గమనిచండి. అందులో కాఠిన్యం వుండదుగానీ చురుకుదనం వుంటుంది. శత్రువుని సైతం నిలబెట్టి ఆలోచింపజేస్తుంది.

జ్యోతిరాణిగారి ప్రాపంచిక దృక్పథమే ఆమె రచనలకు అసలైన బలం. అది సదా ప్రజల పక్షం. ప్రజా వ్యతిరేకమైనదాన్ని ఆమె యెన్నడూ యెక్కడా స్పేర్ చేయలేదు. ప్రతి సమస్యనీ ఆర్థిక మూలాల్లోకి వెళ్లి చూస్తారు. రాజకీయ కోణాల్ని పట్టుకుంటారు. సామాజిక శాస్త్రాలమధ్య అంతస్సంబంధాన్ని (Intersectionality) దృష్టిలో వుంచుకొని సమస్యని అధ్యయనం చేస్తారు. గతి తార్కికంగా ఆలోచిస్తారు. కాల్పనికమైన – వూహాత్మకమైన పరిష్కారాల జోలికి పోరు. సదాశయాల వాస్తవీకరణ దిశగా అడుగులు వేస్తారు. ఆటంకాలని అనేక కోణాల నుంచి విశ్లేషిస్తారు. వాటిని తొలగించుకొనే మార్గాలు సూచిస్తారు. రచయితగా ఆమె కేవలం సమస్య వరకే పరిమితం కారు. వ్యాసానికి సమగ్రతని సాధించడానికి దాని చుట్టూ అల్లుకొన్న భావజాలాన్ని అన్ని పొరల్లోంచి చర్చకు పెడతారు. సమాజానికి కీడు చేసే తప్పుడు ఆలోచనల్ని పూర్వపక్షం చేసి నికార్సైన సిద్ధాంతాన్ని అందిస్తారు. సమస్యని కేంద్రం చేసుకొని దానికి మూలమైన రాజకీయాలు, సంస్కృతి, ఇతరేతర సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అంశాల వెలుగులో భిన్న పార్శ్వాల్ని కోణాల్ని విశ్లేషించి పఠితలకు సమాచారంతో పాటు సరైన చైతన్యాన్ని అందిస్తారు. ఆలోచనల్లో కొత్త ద్వారాలు తెరచి ఆచరణవైపు పురికొల్పుతారు. ఆ ఆచరణ వైయక్తికంగా గాక సామూహికంగా వుండాలని నమ్ముతారు.

పునాదిలో మార్పు తేకుండా ఉపరితలంలో చేపట్టే సంస్కరణలు ఫలితాలివ్వవని జ్యోతిరాణి చాల సందర్భాల్లో నొక్కి చెబుతారు. సామ్రాజ్యవాద సంస్కృతిని యెదుర్కొని దానికి ప్రత్యామ్నాయంగా ‘ఉన్నతమైన సంస్కృతిని ఆవిష్కరించుకోవాలన్నా, సంస్కృతిని వున్నతీకరించుకోవాలన్నా పునాదులని కదిలించాలె. పునాదుల్ని పెకలించాలె …’ అని నిర్ద్వంద్వంగా పేర్కొన్నారు. అనారోగ్యం అవిద్య వంటి సామాజిక సమస్యలన్నిటికీ మూలాలు పేదరికంలోనే ఉన్నాయనీ అదేవిధంగా స్త్రీలపై అమలయ్యే క్రూరమైన హింసకూ అత్యాచారాలకూ అసలు జెండర్ అసమానతకూ మూలాలు ఆర్థిక నిర్మాణాల్లోనే వున్నాయని గ్రహించినప్పుడే పరిష్కారాలు సజావుగా వుంటాయని భావిస్తారు. బాధిత సమాజం పట్ల ఆర్తి , ఆర్తిని మించిన నిబద్ధత, నమ్మిన విలువల పట్ల నిజాయితీతో పాటు నిక్కచ్చితనం జ్యోతిరాణి గారి ప్రత్యక్షరంలోనూ దర్శనమిస్తుంది. ఒక ప్రజాస్వామిక లక్షణం యీ వ్యాసాలకు గీటురాయి. అందుకే ఆధిపత్యాలు అధీనతలు అసమానతలు లేని, మానవీయ విలువలతో కూడిన సామాజిక సంబంధాలు యేర్పడి అవి బలపడాలని ప్రతి సందర్భంలోనూ బహుధా ఉద్బోధిస్తారు. పౌర సమాజం పరస్పరం గౌరవించుకొనే సామూహికతనీ సమష్టి తత్వాన్నీ పెంచుకోవాలని ఆరాటం వ్యక్తం చేస్తారు.

చివరగా వొక్క మాట – మహిళా సాధికారత అంటే స్త్రీలు ఆత్మగౌరవంతో బతకడం. స్వావలంబనతో సొంత కాళ్ళమీద నిలబడటం. స్వేచ్చగా ఆలోచించగలగడం. సమస్త ఆధిపత్యాలనుంచి దోపిడీ పీడనలనుంచి తరాల హింస నుంచి బయటపడటం. పితృస్వామ్య భావజాలం గోడలు ఛేదించి సమానత్వాన్ని సాధించడం. విధాన నిర్ణయాల్లో ఆచరణలో భాగం వహించడం. సంపదని ఉత్పత్తి చేయడంలో , ఆదాయ పంపిణిలో నిర్మాణాత్మకంగా వ్యవహరించి తమ వాటా దక్కించుకోవడం. సొంత వ్యక్తిత్వంతో మానవిగా యెదగడం. స్వీయ అస్తిత్వ స్పృహతో చైతన్యవంతం కావడం. మానవాభివృద్ధిలో తనదైన పాత్రని నిర్వహించడం … అని యీ వ్యాసాలు చదివాకా స్పష్టమౌతుంది.

అంతేకాదు; వ్యక్తిగతమంతా రాజకీయమే అన్న ‘ఫెమినిజం’ స్త్రీ వైయక్తిక స్వేచ్ఛకి ప్రాధాన్యతనిసస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలు దాని యెజెండా కాదు. అందుకు భిన్నంగా ‘వుమనిజం’ పీడిత స్త్రీ విముక్తి కోసం సంఘటిత సామూహిక పోరాటాలు తప్పవు అని నిరూపిస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు పెద్దపీట వేస్తుంది. పెట్టుబదీదారి రాజ్య వ్యవస్థని తొలగించినపుడే మహిళా సాధికారిత సాధ్యమనీ అప్పుడే సకల మానవాభివృద్ధికి దారులు తెరుచుకుంటాయనీ నమ్మి దానికి అనుగుణమైన ఆచరణలో పయనిస్తుంది …. అని కూడా అర్థమౌతుంది.

అపురూపమైన యీ యెరుకను మనకు అందిస్తున్నందుకు ప్రొ. జ్యోతిరాణిగారికీ స్త్రీ విముక్తి సంఘటనకీ కృతజ్ఞతలు. నిజమైన మానవాభివృద్ధి నిర్వచనం తెలుసుకోవాలంటే పుస్తకం లోతుల్లోకి వెళ్ళక తప్పదు.

హైదరాబాదు, – ఎ కె ప్రభాకర్
1 మార్చి, 2018.

You Might Also Like

2 Comments

  1. Mukundaramarao

    బాగుందండి ..చాలా మంచి వ్యాసం ..

    ముకుంద రామారావు

  2. k.p.ashok kumar

    బాగుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చదవాల్సిన వ్యాసం ఇది.

Leave a Reply