My Father Baliah – Y.B.Satyanarayana
ఈ పుస్తకం ఒక దళిత కుటుంబం తమ కులవృత్తిని, పూర్వీకుల గ్రామాన్ని వదిలిపెట్టి, ఉద్యోగాలు, చదువుల బాట పట్టి క్రమంగా జీవన విధానాన్ని మార్చుకున్న వైనాన్ని గ్రంథస్తం చేసింది. రచయిత మూడు-నాలుగు తరాల తమ కుటుంబ కథని తన తండ్రి ప్రధాన పాత్రగా చెప్పారు. ఆయన వృత్తి రిత్యా కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలో పెరుగుతున్న తన మనవరాళ్ళకు తమ కథ తెలియడానికి ఆంగ్లంలో రాసానని ముందుమాటలో రాశారు.
కథాకాలం స్వాతంత్రానికి ముందు ఎపుడో మొదలవుతుంది. రచయిత తాత నర్సయ్య తల్లిదండ్రుల్ని, భార్యని పోగొట్టుకుని, ఉన్న ఒక్క కొడుకుతో ఇంక ఆ ఊరు వదిలేసి వేరే ఏదన్నా చూసుకుందామని బయలుదేరటం మొదటి ఘట్టం. అదే ఆ కుటుంబం తాలూకా భవిష్యత్తుని పూర్తిగా మార్చివేసిన విషయం. అలా వెళ్ళి రైల్వే లో చిన్న ఉద్యోగంలో చేరడం, పిల్లలకి కొంచెం కొంచెం చదువులు మొదలవడం, అలా కొనసాగి, మూడు తరాలు రైల్వే వారి సౌజన్యంతో చదువులు, ఉద్యోగాలు సాగాక, రచయిత తరానికి కుటుంబంలో నలుగురు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అందులో కొందరు పీ.హెచ్.డీ కూడా చేసి, అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డం దాకా కథ సాగుతుంది. తరువాతి తరం అసలు ఈ గతంతో సంబంధం లేకుండా పెరగడం, కాన్వెంట్లలో చదువుకుని, అమెరికా వెళ్ళి స్థిరపడ్డం – కొసమెరుపు.
సత్యనారాయణ గారు చేయితిరిగిన రచయిత కాకపోయినా, కదిలించేలా రాశారు. పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఒక అంశం – రచయిత రాసిన విధానం. సాధారణంగా నేను చదివిన కాసిని దళిత రచనల్లో ఆగ్రహం, ద్వేషాల పాలు ఎక్కువ, సంయమనం తక్కువగా అనిపిస్తుంది. ఫలానా ఎవడో కులం వాడిని తిట్టడానికి వాడినన్ని మాటలు అసలు నిజంగా జరిగింది చెప్పడానికి, అది తమని ఎలా ప్రభావితం చేసిందో చెప్పడానికి, వాడరనిపిస్తుంది. అది నాకు ధర్మాగ్రహంగా అనిపిస్తుంది – తప్పుగా తోచదు కానీ, ఒక్కోసారి అసలు చెప్పాలనుకున్న విషయం ద్వేషం మాటున పడి చేరాల్సిన అందరికీ చేరదని అనిపిస్తుంది. అవి వెదజల్లే విద్వేషానికి చదవలేక పక్కకి పడేసిన రచనలు ఉన్నాయి. ఈ పుస్తకంలో రచయిత తన ఆగ్రహాన్ని చాలా స్పష్టంగా చెప్పినా, ద్వేషాన్ని చిమ్మలేదనిపించింది. అలాగని వాళ్ళేం అంటరానితనాన్ని, అస్పృశ్యతని చూడలేదని కాదు! స్కూలు రోజుల్లో పలకపైన నీళ్ళు చల్లుకుని తాకిన మాస్టార్ల గురించి, రైల్వే లో అగ్రకుల అధికారులు తమ కుటుంబీకులతో ప్రవర్తించిన విధానం గురించి, ఇళ్ళు అద్దెకు దొరకడం కోసం కులాన్ని దాచాల్సిన పరిస్థితుల గురించి వివరంగానే రాశారు. అవి చదువుతూంటే ఓ పక్క ఆగ్రహం, ఓ పక్క అదేదో నాకే జరిగినట్లు అవమానం, కొన్ని చోట్ల చాలా కదిలించాయి ఆయన అనుభవాలు. కానీ, ఇవి చెబుతూనే, ఆయన గురించి శ్రద్ధ చూపిన ఉపాధ్యాయులు (వాళ్ళే కులం వారైనా!), ఆయనకి వివిధ కులాల్లో ఉన్న స్నేహితులు – ఇలాంటివన్నీ కూడా రాశారు. ఆ విధంగా చూస్తే, ఈ పుస్తకం నాకు చాలా విషయాలని నేర్పింది.
రచయిత తండ్రి బాలయ్య ఎన్ని అనుభవించినా పిల్లలు చదువుకోవాలని దృఢంగా అనుకోవడం, అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్యకూడా ఆ నిర్ణయాన్ని మార్చుకోకుండా అన్నీ తట్టుకుని నిలబడి అనుకున్నది సాధించడం చాలా స్ఫూర్తిదాయకం. అసలా రోజుల్లో అంతంత పెద్ద కుటుంబాలు ఆ కాస్త సంపాదనతో ఎలా బ్రతికేవో – ఎలా నిబ్బరంగా ఉండేవారో – ఈరోజుల్లో అప్పటితో పోలిస్తే సంపాదన ఎన్నోరెట్లు పెరిగి, కుటుంబం సైజు ఎంతో తగ్గినా కూడా ఇంత టెన్షన్ ఏమిటో అని ఆశ్చర్యం!
బాగా ఆలోచింపజేసిన విషయం – రచయిత తమ జీవితాలు క్రమంగా sanskritize అయాయని రాసి, తమ కుటుంబ సంప్రదాయాల్లో వచ్చిన మార్పులు (దేవుళ్ళూ-దేవతలు క్రమంగా మారడం వంటివి) చెప్పినపుడు. ఇది మంచా? చెడా? అన్నది నిర్ణయించడం కష్టం. ఈ విధంగా ఒక భాష పోతే, ఒక కులపు సంప్రదాయాలు పోతే – మనం short-term/long-term లలో పొందేది/కోల్పోయేది ఏమిటి? అన్న ప్రశ్నకి నాకు జవాబు తెలియదు. survival of the fittest అన్నది తేలిగ్గా దొరికే వివరణ అనుకోండి, అది వేరే విషయం.
ఈ పుస్తకం లో వివరించిన పరిస్థితులు, వాళ్ళ ఇంట్లోని పద్ధతులు, అన్నీ నాకు కొత్త. పైగా, అసలు కుటుంబంలో మొట్టమొదటి అక్షరాస్యుడు కావడం గాని, పిల్లలకి చదువు చెప్పడానికి పదే కష్టం గాని, ఇవన్నీ అసలు ప్రత్యక్షానుభవం లేని అంశాలు. ఇదివరలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఇలాంటి నేపథ్యాల నుండి వచ్చిన వారున్నా, నాకంత వ్యక్తిగత పరిచయం లేదు వాళ్ళతో. అమెరికా వచ్చాక ఇక్కడ ఒకరిద్దరు తాము తమ కుటుంబంలో మొదటి కాలేజి గ్రాడ్యుయేట్ కావడం గురించి, దాని వెనుక ఉన్న కష్టం గురించీ చెబుతూండగా విన్నాను. కానీ, ఇంత వివరంగా చదవడం ఇదే మొదటిసారి. కదిలించే కథ, స్ఫూర్తివంతమైన కథ.
మీకు పుస్తకాల మీద ఇష్టం ఉందా లేదా అన్నది వేరే విషయం. ఈ నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ ఇది. ఇక ఏదన్నా దళిత నేపథ్యం నుండి వచ్చి, ఇప్పుడు ఈ రకం బాధలేవీ లేకుండా, ఇలాంటి సమస్యలకి దూరంగా ఉన్నవారైతే – వాళ్ళ తాతలు, ముత్తాతలు ఏం దాటుకుని వాళ్ళకి ఈ జీవితాన్నిచ్చారో తెలుసుకోడానికి తప్పకుండా చదవాలి. మనకి ప్రముఖంగా తెలిసిన ఆత్మకథలు చెప్పేది కొన్ని వర్గాల కథలే. ఇలాంటి పుస్తకాలు వాళ్ళకి సమాంతరంగా నడిచిన మరో రకం జీవన శైలిని చూపిస్తాయని నా అభిప్రాయం.
రచయితతో ఈ పుస్తకం గురించి కినిగె పత్రికలో వచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇక్కడ. అలాగే, పుస్తకం గురించి మెహెర్ పరిచయ వ్యాసం ఇక్కడ.
ఈ పుస్తకం 2011లో విడుదలైనప్పుడు, దీనికి పి.సత్యవతి గారి తెలుగు అనువాదం తరువాత కొన్నేళ్ళకి వచ్చినపుడు, చివరగా రెండేళ్ళ క్రితం కబాలి సినిమాలో హీరో ఇంట్రో ఈ పుస్తకం చదువుతూ చూపించినపుడు – ఈ పుస్తకం చదవాలని అనుకున్నా. ఇలా ఇన్నిసార్లు అనుకున్నాక, ఇప్పటికి అయింది చదవడం. యూనివర్సిటీ ఆఫ్ అయోవా వారి గ్రంథాలయానికి ధన్యవాదాలు. అలాగే అందరం చదివేందుకు ఈ పుస్తకం ఆంగ్లంలో, తెలుగులో రావడానికి వెనుక చేయూతనందించిన గీతారామస్వామి గారికి కూడా!
కొనుగోలు లంకెలు:
* Amazon.com – English
* పి.సత్యవతి గారి తెలుగు అనువాదం – కినిగెలో.
Leave a Reply