రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు
వ్యాసకర్త: Halley
*******************
ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు” అన్న పుస్తకం గురించి (పుస్తకం లభించు చోటు). రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి వ్యాసాలు ఉపన్యాసాలు గల పుస్తకం ఇది. అసలు ఎవరు ఈయన అని అడగొచ్చు కొంతమంది. “నీవు అశ్వమును అధిరోహించగలవా” అని కోట శ్రీనివాస రావు పోలీసుని అడిగితే ఆ పోలీసు “హార్స్ రైడింగ్ తెలియదు” అని జవాబిస్తే, అప్పుడు కోట “అదియే.. అదియే మన దేశ దౌర్భాగ్యము” అని అంటాడు ఒక జంధ్యాల సినిమాలో. ఆ విధంగా రాళ్ళపల్లి వారి గురించి తెలియకపోవటం కూడా ఒక రకం దౌర్భాగ్యమే. ఆయన గురించిన సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ.
పుస్తకంలో నాకు నచ్చిన అంశాలు చాలానే ఉన్నాయి. కొన్నిటిని అడపాదడపా సామజిక మాధ్యమాలలో పంచుకున్నాను కూడా. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే నెల్లూరులో అష్టమాంధ్ర నాటక కళాపరిషత్ సమావేశం అధ్యక్షోపన్యాసం “నాటకకళ – నేటి మన నాటకములు” అన్న వ్యాసం మరొక ఎత్తు. ఇందులో సినిమాల ప్రభావమునకు లోనైన ఆ కాలపు నాటకాల గురించీ, పాశ్చాత్య వ్యామోహానికి గురైన కళల గురించీ కొన్ని చర్చలు ఉన్నాయి. చదువున్నంత సేపు అద్భుతంగా అనిపించాయి నాకు. ఈ పరిచయం ప్రధానంగా ఆ వ్యాసం గురించే. భారతి, జనవరి 1939 నుంచి సేకరించినదట ఈ వ్యాసము. రెండు మూడు సార్లు చదువుకున్నాను ఈ వ్యాసాన్ని రాళ్ళపల్లి వారి భావ వ్యక్తీకరణ నచ్చి.
ప్రాక్పశ్చిమ కళా దృష్టిలో తేడాలను గురించి ప్రస్తావిస్తూ, మనకిప్పటి అన్ని నడతలకు ఆదర్శభూతులగు పాశ్చాత్యుల సంస్కృతిలో ఉద్రేకమునకు ప్రాధాన్యమెక్కువ అని అన్నారు. అలా పాశ్చాత్య ప్రభావానికి లోనైన మన నాటకాలు ఉద్రేకించు బేరాలకు దిగాయని, ఆ ఉద్రేకానికి గురి చేసే మత్తు మోతాదు హెచ్చించు మార్గములు లేక నాటకములు వెనుకబడ్డాయి అని అన్నారు.
కళల పరమార్థం ఏమిటి అని ప్రశ్నించుకొనే వారికి ఈ విషయంలో రాళ్ళపల్లి వారు చెప్పిన మాటలు నచ్చుతాయి. కళలు కేవల వినోదం కోసమనో తాత్కాలిక ఉద్రేకపు మాయాజాలం కోసమనో అనుకోవటం నేడు మనం చూస్తూ ఉన్నాం. ఏదన్నా సినిమా గురించో లేదో కథను గురించో చర్చకు వస్తే “రిలాక్స్! వై సో సీరియస్! ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్” అని అనటం నేను చాలా సార్లు గమనించాను. ఒకసారి ఎవరన్నా ఆ మాట అన్నారా ఇంక కళ నేలబారు స్థాయికి వచ్చేసింది అంతే. కేవల వినోదం కోసం అన్నాక ఎవడికి ఏది నచ్చితే అది అన్నట్టు అయిపోతుంది ఇంక. రాళ్ళపల్లి వారు ఈ వ్యాసంలో అన్నట్టు మద్యం వాసన చూస్తే కూడా ప్రాయశ్చితం చేసుకోవాలని అనుకొనే పరమ వైదికునికి కూడా బలవంతముగానో మోసముతోనో గంటెడు కల్లు పోసి “లాహిరే గంజాహిరే“ పాడించి తైతక్కలాడించ వచ్చు. అలా నాలుగైదు మార్లు చేస్తే ఇదే బ్రహ్మానందమనుకొనే స్థాయికి వాడిని దింపచ్చు. ఉద్రేక ప్రధానమైన కళను ఆస్వాదించే వారి తీరు ఇలానే ఉంటుంది అని వారి ఉవాచ. ఈ ఉద్రేకపు బలిమి ఎలాంటిది అంటే సహృదయులైన వారు కూడా ఇటువంటి రూపకాలు చదివినపుడు లేదా చూచినపుడు సంతోషించుచున్నామను భ్రాంతికి లోనవుతారని క్రమముగా అదే ఉత్తమ నాటక కళ అనుకుంటారని అన్నారు.
“ఉద్రేక కోలాహలంలో రసప్రధానమైన రచనకు ప్రయత్నించు కవులు గాని అంతకన్న దాని నభినయింప సాహసించు నటులు గాని చూచు నుత్సాహము గల సభ్యులు గాని సామాన్యముగా కానరాక పోవుచున్నారనుట మనమిప్పుడు చింతింప వలసిన విషయము” అని అన్నారు.
ఆయన 1939లోనే ఆలా అన్నారు అంటే ఇప్పుడు మన పరిస్థితి ఇంకా ఘోరం. రస ప్రధానం అంటే ఎదో చూచాయగా అర్థమయ్యే స్థాయిలో ఐన ఉన్నాము ఇప్పుడు. మన సంస్కృతి మూలాలు ఇంకా పూర్తిగా నశించ నందుకు కాబోలు. పోను పోను రసము అంటే ప్రధానంగా తమిళులు తినెడి ఒక ద్రవ పదార్థము అని నిఘంటు అర్థము రాసే స్థాయికి వస్తామో ఏమో.
నాటకముల దృష్టి సినిమాల దృష్టికన్నా భిన్నమయ్యేవరకు రెండిటికి స్పర్ధ తప్పదు అని అన్నారు. మంచి నాటకానికి ఉద్రేకములను చౌక వినోదములను వదిలి రసము మీద దృష్టి పెట్టటమే ప్రధానం అని అన్నారు.
ఇక సామాజికములు అని పిలువబడే నాటకాల గురించి మాట్లాడుతూ “ఈ మాత్రము వినోదము అరగంట చీట్లాడినను కలుగును” అని అన్నారు. “వినోదమునకు జీవితమున గల విలువ నెరుగకపోలేదు కానీ నాటకముల వంటి మహాసంస్థలకు ఈ అల్ప ఉద్దేశము చాలదు” అని తన అభిప్రాయము అని స్పష్టం చేశారు. సినిమా అనగానే దాని తాలూకా వినోదమే పరమార్థం అని అనుకొనే దర్శకులు, రచయితలు కూడా తాము కళ పరమావధిగా భావించే వినోదం యొక్క అల్పత్వాన్ని గుర్తించి, ఆ వినోదాన్ని మించి ఉన్న ఉద్దేశాల గురించి ఆలోచిస్తే బాగుండును. ప్రేక్షకులు కూడా ఆలోచించాలనుకోండి, కానీ వారి సంఖ్య పెద్దది. వారిలో మార్పు తెచ్చే భాద్యత ప్రభువులది కళాకారులది మరి. కాబట్టి కళ యొక్క పరమావధిని గురించి ఆలోచించాల్సింది కళాకారులే. తర్వాత ప్రేక్షకులని మార్చటం గొప్ప కళాకారుడికి అతని సృజనకి పెద్ద విషయం ఏమీ కాదు.
నాటకాలను సినిమాలను పోలుస్తూ ఇంకొన్ని మాటలన్నారు. తపస్వుల శాంతరసము స్ఫురించుటకు అడవిలోని పర్ణశాల ఒకటి చాలని, ప్రక్కలోని పల్లేరుగాయలు, పాములు తేళ్లు అక్కర్లేదని ఇటువంటి అవాంతర విషయములను పెంచటంలోనే ఇప్పటి సినిమాలకు ముఖ్యమైన తాత్పర్యం ఉందని అన్నారు. వినోదమునకు కావలసిన స్థూలాభినయమును ఫోటో తీయటం సాధ్యమేమో కానీ రస స్ఫూర్తికి కావలసిన సూక్ష్మాభినయాన్ని ఫోటో తీయటం సాధ్యం కాదని అన్నారు. నాటకములలో నిన్నటి అభినయానికి నేటి అభినయానికి మార్పులు చేర్పులు చేసుకొనే అవకాశం ఉంటుందని, సినిమాలది శాశ్వత ముద్ర కాబట్టి మార్పుకు ఆస్కారం లేదని అన్నారు. ప్రేక్షకులని బట్టి customisation చేసే అవకాశం కూడా సినిమాలలో లేదు. అందరికి ఒకటే స్థాయి, ఒకటే శైలి అయిన నటన మరి. అంతే కాక సినిమాలో మనం చూసేది అభినేత యొక్క నీడ మాత్రమే కాబట్టి మనము అనుభవించేది కూడా రసచ్ఛాయయే కానీ రసం కాదు అని అన్నారు. అయితే వ్యాప్తి యందు ద్రవ్యార్జన యందు సినిమాలతో నాటకములు పోటీ పడలేవు అని అన్నారు. సినిమాలు ద్రవ్యార్జన కోసము అయితే అవవచ్చునేమో కానీ నాటకములు రసప్రధానములవ్వాలని అన్నారు.
రసోపాసకులగు కవులకు నటులకు జీవితంలో ఉపవాసం ఉండవలసిన అవసరం ఎపుడు ఉండదని తన నమ్మిక అని అంటూ ఇలా అన్నారు. “ఏ వృత్తియందైనను చేతనైనంత లోతుకుదిగి సాధింపవలయునని గొప్ప పరాయణము నుంచుకొన్నవారికి శ్రధ్ధావంతులకు ద్రవ్యాశ ప్రధానముగా నుండకూడదు. ఆ లోతు రుచిగన్న వారికి ధనాశ క్రమముగా మందగించును గూడ. లౌకిక వృత్తులందు విజ్ఞాన భాగములందు కళల యందు గొప్ప సిద్ధులను సాధించిన మహా పురుషులందరు నాటికి రేపటికిని ఇట్లు ద్రవ్య ఫలమును గౌణముగా జూచిన వారే”
సాధారణంగా మనం ఇవన్నీ చదవగానే ఆ మన ప్రజలు వట్టి గొర్రెలోయి ఈ స్థాయి ఆలోచనలు వాళ్ళకి అర్థమౌతాయా ఏంటి అని అనుకోవటం సహజం. ఈ విషయం పైన రాళ్ళపల్లి వారు సుదీర్ఘంగా చర్చించారు. చాలా సహేతుకంగా వాదించారు. నాకు చాలా నచ్చింది వారి వాదన-
“కాని సామాన్య జనులకింత గొప్ప త్యాగము పరాయణము త్యాగ బుద్ధియు గలుగునా? వారికి ధనము మీద ఆశ సహజము గాదా? అను ప్రశ్న వచ్చును. కాని ఎవరు సామాన్య జనులు? ఎవరు విశేష జనులు? చదువు కొన్నవారు విశేష జనులు, తక్కిన వారు సామాన్యులని కదా భావము? అప్పటికి చదువరులందరు ద్రవ్యాశ లేని వారనియు ఇతరులందరు పిసినారిలనియు జెప్పవలసి వచ్చును. అది అనుభవ విరుద్ధమని చెప్పనక్కర్లేదు. అట్లు గాక ఉదాత్త విషయముల విలువ నెఱిగిన వారు విశిష్ఠులు; తక్కిన వారు సామాన్యులు అని చెప్పినచో అట్టి సామాన్య జనులకు ఉదాత్త విషయములను తెలియజెప్పినను తెలియదని యూహింపవలెనా? అట్లూహించుటకు ఎవరికి మాత్రం ఏమి అధికారము? అట్లు గాక సామాన్యులను సామాన్యులనుగానే యుండజూచుట విశిష్ట జనులకు విశేషమునకు లక్షణమా? అవకాశ మిచ్చి చూడవలెను గానీ మనము సామాన్యులను కొను వారిలో ఎందరి యందు ఎన్ని విశేష ధర్మముల బీజములణగి ఉన్నవో ఊరకయే మనకెట్ల తెలియును? విశిష్ట జనులకును వారికి మాత్ర మీ తెలివి పుట్టుకతో వచ్చినదా? నేర్చింది నేర్పబడినది కాదా? ఐనప్పుడు మన విశేషమందు మనకు నిజముగానే నమ్మక ముండిన యెడల సామాన్యజనులకు దాని రుచి చూపి మన దారికి దెచ్చుకోలేమా? తెచ్చుకోవలదా? నిజము జూడబోయిన ఈ సామాన్య విశేష విభాగము సుఖప్రియులగు సోమరులు చేసికొన్నది, వారి స్వార్థపరత్వమునకిది యూతకోల “
కవి నట సభ్యుల ధర్మం గురించి చెబుతూ ఇలా అన్నారు-
“కనుక జనులను రసికులనుగా చేయుట, చేయు ప్రయత్నించుట రసోపాసకులగు కవినట సభ్యుల ధర్మము. ఈ పని ఇట్లొకమారు ఉపన్యాసము చేసిన జాలదు. పదే పదే ఒత్తి చెప్పి జనుల చిత్తమును రుచిని సంస్కరింపవలెను. అవకాశము గలిగినపుడు కళానుభవము నందలి భేదములును వాని గుణ దోషములును నాటునట్లు బోధింపవలెను. అంతకంటె ముఖ్యముగా మంచి సరస రూపకముల రాసి రాయించి ఆడి యాడించి ప్రచురింపవలెను. శిక్షా స్మృతి, ధర్మ శాస్త్రము, నీతి శాస్త్రము, సదాచారం మొదలగు మార్గములలో దినదినమును జనుల చిత్తమును నయభయములచే దిద్ది తీర్చుచునే యున్న గదా వారికి అహింస, సత్యము, అస్తేయము మొదలగు ఉదాత్త గుణముల యందు నమ్మిక, వాని నాచరణలో బెట్టు నుత్సాహమును సమయక యుండును. జనులను నీతిమంతుల జేయుట కెంతకష్టమో వారిని రసికులనుగా జేయుటకును అంతే కష్టము పడవలయును. దానియంతే ఇదియునావశ్యకము.”
ఇక ఈ విషయంలో ప్రభుత్వాల బాధ్యతలను గుర్తు చేస్తూ ఇలా అన్నారు-
“ఇది విద్యాశాఖాధికారులును సంఘమందలి పెద్దలును చేయవలసిన ధర్మము. కాని విద్యాశాఖవారు ఈ విషయమున ఎక్కువ శ్రద్ధ పుచ్చుకొను సూచనలు లేవు. విశ్వవిద్యాలయములవారు ఇన్నాళ్లును మనుష్య నిర్మాణమున బుద్ధి యొక్కటి తప్ప తక్కిన దేదియు లేదని తలచిన వారివలె, దానిని వట్టి శుష్క విషయములతో కూఱి నించుచుండిరి. ఈవల మనకు పొట్టగూడ గలదని కనుగొన్నట్లున్నది. వృత్తి విద్యలకు ఇప్పుడిప్పుడు వారెక్కువగా అవకాశము గల్పించుచున్నారు. కాని ఈ బుద్ధిని పొట్టను మీరినది, మన సుఖదుఃఖములకు మూలస్థానమయినది “భావాంబర వీథి” యొకటి మనకు సృష్టి కర్త ఇచ్చి యున్నాడనియు, అది శిక్ష లేక చెడ దిరుగుచున్నదనియు వారి మనసుకు చాలినంత తట్ట లేదని వలసియున్నది“
అసలు మన విద్యా శాఖల వారికి భావాంబర వీథి అన్న పదం అర్థమవుతుందో లేదో మరి. ఇంత ఉన్నత లక్ష్యంతో శాఖ ఏర్పాటు అవ్వాలి అంటే అసలు ఆ ప్రభుత్వాలకి ప్రభువులకి ఎంత దూరదృష్టి కావాలో! అసలు వారి వేర్లు ఈ సంస్కృతిలో నాటుకొని ఉంటే కదా ఇటువంటి ఆలోచనలు రావటానికి!
ఇదే విషయము పైన మరికొంత విశ్లేషిస్తూ ఇలా అన్నారు –
“యూనివర్సిటీల వారు ప్రాచీన మహా నాటకముల నింకను పాఠము చెప్పుచున్నారు. ఐనను వారి దృష్టి యంతయు నాటకలక్షణముల చరిత్రము, కవి కథ ఒండొంటి పోలికలు, విభేదములు మొదలగు బహిరంగముల మీద నుండునే కాని, విద్యార్థులచే వాని నాడించుట, తమ చేతకానున్న నితరుల చేతనైనను వాని నాడించి చూపుట మొదలగు స్వానుభవ మార్గముల పోకున్నది. చాలనందుకు ప్రాచీన నాటకములకు ఆడి చూచి అనుభవింపకయే అవి నాటక రూపములైన కావ్యములనియు ఆటకు పనికిరావనియు రంగము మీద రక్తి నియ్యవనియు ధైర్యముతో నుపదేశించు చున్నారు. గురువుల వాక్యములను శిష్యులు భక్తి కలిగియో లేకయో అనువాదం చేయనలవాటు పడి యున్నారు. సమర్థులైన నటులు శ్రద్ధతో నేర్చి అభినయించినపుడు తప్ప, ఏ నాటకమున ఏది ఎంతవరకు అభినయింపనగునో కాదో నిర్ణయించుట యంత సులభమైన పని కాదు. వివేచించు బుధ్ధికిని అనుభవించు అంతరంగమునకు పొత్తు కుదిరింపవలెనని, అంతరంగమును బుద్ధి లోబఱుపవలెనని మనుష్యులు జేయు ప్రయత్నములన్నియు, బుద్ధి కందని యనుభవములు లెక్క లేనన్ని కలవని చూపి బుద్ధికి బుద్ధి చెప్పటంలో పర్యవసానమగుచున్నవి.“
“రసిక పారిషదులు చేయు ప్రయత్నము చేత రసిక జీవనము పునరుద్దారము కావలసియున్నది. సంఘము సహృదయము కావలసి యున్నది. రుచులును అభిప్రాయములును శోధన కావలసియున్నవి.”
ఇది ఈ వ్యాసం కథా కమామీషు. తనది అని చెప్పుకోటానికి ఒక సంస్కృతి ఉండి ఆ సంస్కృతి మూలాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొన్న ఒక వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ వ్యాసం చదివితే స్పష్టం అయ్యింది నాకు. అటూ ఇటూ కానీ సంకర చదువులు చదివిన నా బోటి వాళ్ళకి ఆహా భారతీయ కళల పరమార్థం ఇదా అని అనిపించేలా ఉంది ఈ ఉపన్యాసం.
ఈ పుస్తకంలో మరిన్ని ఆసక్తి గొలిపే నా బోటి వాళ్ళకి చదువు చెప్పే వాక్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని:
ఆంగ్లేయుల పాలనానంతర తెలుగు సాహిత్యాన్ని గురించి రాళ్ళపల్లి వారు ఇలా అన్నారు. ఆయన ఇది 1931లో కన్నడ వారిని ఉద్దేశించి చెప్పినట్టు గా ఉన్నారు. నేను చదివినది 1990లో వచ్చిన అనువాదము. ఏదైతే నేమి భావం ముఖ్యము మనకు.
“మొత్తము మీద చూచిన, ఇప్పటి ఆంధ్ర సాహిత్యమున స్వతంత్ర రచన చాల స్వల్పము. స్వాతంత్య్ర బుద్ధి దిన దిన ప్రవర్ధమాన మగుచున్నను, స్వతంత్ర కార్యమింకను నడవలేదు. మన స్వతంత్ర బుద్ధి పాశ్చాత్య సంప్రదాయములకు పరతంత్ర మగుటలో ప్రబలమగుచున్నదే కానీ, ప్రపంచ నాగరికతకు మనదే అయిన ఒక నూతనపు కానుకను సమర్పించవలయునను ఆశ కానీ; ప్రజ్ఞలో ప్రతిభతో మనమితరులకన్న తక్కువ కాదన్న భరోసా కానీ, ఇంకను మనలో తలయెత్తలేదు. ఇది ప్రసుత భరతఖండ వాసుల సామాన్యధర్మమై ఉన్నది. ఇప్పటి తెలుగు సాహిత్యమును స్పష్టముగా ఈ లక్షణములు కనవచ్చును. ఇక సమర్థులైన సర్వులును ప్రాయికముగా రాజకీయ రణరంగమున పోరాడుచున్నందువల్ల, ఉత్తమాంధ్ర ప్రతిభాశక్తి యొక్క ప్రచారమున కవకాశము లేక సాహిత్యము కూడా వెనుకబడినది. కాని, వారిలో వన్నెలు లేక వట్టి వాతలు పెట్టుకొని, ఇతరులను తృప్తి పరిచి, ఆ మూలమున తాము కృతకృత్యులైతిమని నమ్ము లక్షణము దినదినము క్షీణమగుచుండుట శుభసూచన. ఆంధ్ర భాషలో ఉత్తమ స్వతంత్ర సాహిత్యము ముందున్నదనుటలో సందేహము లేదు. కాని, ఎంత ముందు?”
సాహిత్యంలో స్వత్వము కనపడాలి అంటే ముందు అసలు ఈ దేశ సాహిత్యానికి ఒక సంప్రదాయం ఉండేదని దాని స్వరూప స్వభావాలు పరమోన్నత లక్ష్యాలు ఫలానా అని తెలియాలి కదా. అది తెలుసుకొని కొత్త తరపు సాహిత్యకారులు పునః సాహితి సృష్టి మొదలెడితే కదా మనకు సాహితీ స్వాతంత్య్రము వచ్చేది! ఇష్టమొచ్చింది రాసేసి నాకు నచ్చినట్టు నేను రాసాను మీకు నచ్చితే చదవండి లేదంటే పక్కకు తప్పుకోండి అన్న నవ సాహితీ సిద్ధాంతం అలవర్చుకుని కొని రాస్తే ఆ సాహిత్యం గొప్పతనం నిర్ణయించటానికి కొలబద్దలు ప్రమాణాలు ఎందుకు ఇక ఇష్టమే ప్రమాణం అయినప్పుడు!
ఈ వ్యాసాలన్నీ చదివిన ఆనందంలో రాళ్ళపల్లి వారి “వేమన“ పుస్తకం కూడా తిరగేసా నేను. అందులో చరిత్రకారుల గురించి రాసిన వాక్యాలు భలే నచ్చాయి నాకు:
“ఇంగ్లీషు వారి సహవాసముచే మనము నేర్చుకున్న విచిత్ర విద్యలలో చరిత్ర రచన ఒకటి”
“సాక్ష్యము ఉన్నను లేకున్నను అన్నిటిని నమ్ముట ఎంత అన్యాయమో, సాక్ష్యము లేనివాని నన్నిటిని నమ్మకపోవుటయు నంతే యన్యాయము”..
“ఇక చరిత్రకారుని తీరు వేరు. అతనికి పరమ ప్రమాణము ప్రత్యక్షము. అనుభవ బలము లేని అనుమాన ప్రమాణము అతనికి పనికి రాదు. మఱియు తన కాలపు టనేక జనుల ప్రత్యక్షానుభవమే తప్ప తన యొక్కని యనుభవమునకు వచ్చి యుండినను తన్ను తానే యతడు నమ్మడు. ఇతరులు నమ్మరని భయమతనికి మెండు”
ఇదే విషయము పై ఈ పుస్తకంలో ప్రచురితమైన “రాయల నాటి తెలుగు సాహిత్యము” (భారతి, 1937) అన్న వ్యాసం నుంచి:
“రాయల ఆముక్త మాల్యద, పెద్దన్న మను చరిత్ర, తిమ్మన్న పారిజాతాపహరణము, సూరన కళా పూర్ణోదయము, తిరువేంగళ నాథుని పరమయోగి విలాసము, తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యము మొదలగు గ్రంథములన్నియు సాక్షాత్తుగనో, పరంపరగనో ఆనాటి జన జీవనము యొక్క స్థూల సూక్ష్మ రూపములను చిర స్థాయిగ జేసినవి. వీనిని చదువకపోయిన, చరిత్ర గ్రంథములనెంత జదివినను ఆ నాటి సమాజ స్వరూపమును ఇంచుకైనను గ్రహింప సాధ్యము లేదని ధారాళముగ చెప్పవచ్చును” అని అన్నారు.
మరి నేటి విశ్వవిద్యాలయాలలో ఒకటి లిటరేచర్ విభాగము మరొకటి చరిత్ర విభాగము కదా! చరిత్రకారుడు కూడా సాంప్రదాయ సాహిత్యము చదివి అర్థం చేసుకోవాలంటే ఇంగిలీషులో ఈ దేశ చరిత్ర రాసే ప్రతి చరిత్రకారుడు ఏదైనా ఒక దేశీ భాషలోని సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే బాగుండు. నేటి పేరున్న చరిత్రకారులు చాలా మందికి అసలు ఇతర దేశ భాషల్లో ఓనమాలు కూడా సరిగ్గా రావని అన్నా అతిశయోక్తి కాదేమో!
అలానే ఉత్త ఉన్మాద ప్రవాహమైన నేటి సాహిత్యాన్ని గురించి ఇలా అన్నారు
“కాని ఆంధ్రులలో ఒక విశేషము కలదు. వారిలో సహజముగ ఉద్రేక మెక్కువ. దాని వలెనె భావానుభవము కూడా తీవ్రముగా నుండును. త్రోసికొని ముందుకు పోవుట వారి ప్రథమ చిత్తవృత్తి. ఆంగ్ల సాహిత్యము దీనిని ఊరక రెచ్చగొట్టినదే కాని దిగ్దర్శకము కాలేదు. హేతువాద బుద్ధి ఇందువలన పెరిగినది. కాని దానిని అదుపులో పెట్టుకొనగల శ్రద్ధాభక్తులు నష్టమైనవి. ‘శ్రద్ధ భక్తులు’ అన్న ‘గుడ్డి నమ్మకములు’ అని నిరసించువారు కలరు. కాని కన్ను చేయు పనులలో చూపును, గుడ్డి తనమును రెండును ముఖ్యమైనవే. తెరచి చూచు కన్ను కొంతసేపు మూసికొని నిద్రపోకున్న జీవయాత్రయే నడవదు. అట్లే, హేతువాదమును, శ్రద్ధాభక్తులును పరస్పర విశ్రాంతికి, సహాయమునకు పనికి రాకున్న, సమాజమున శాంతి స్థాపన జరుగ నేరదు; దాని సాహిత్యమును ఉత్త ఉన్మాద ప్రవాహమగును”
సాంప్రదాయ కుటుంబాలలో లేదా పాతకాలపు కుటుంబ వ్యవస్థలో మహిళలని తొక్కేశారని వారి ఎదుగుదలని అడ్డుకున్నారని వారికి చదువు లేకుండా చేసారని వారిని వంటింటి కుందేళ్ళని చేసారని కూపస్థ మండూకాలని చేసారని అనే వారి ఆలోచనలలోనే ఎంతో సంకుచిత్వం ఉందేమో అని అనిపించేలా “నా గురువులు” అన్న వ్యాసం నుంచి.
“మా అవ్వ – పితామహి – లక్ష్మమ్మ గారికి మా తండ్రి గారొక్కరే సంతానం. ఒకనాడు ఆమె కుమారుని పిలచి – ‘కిట్టా! రామాయణం వినవలెనని ఆశగా ఉందిరా’ అన్నది. ‘సరేనమ్మా! దానికేమి!’ అన్నారు వారు. ఆ నాటి నుండియే పురాణాముపక్రమించిరి. దినమును రాత్రి వంటవార్పులు ముగించి ఆమె వచ్చి కూర్చున్న తర్వాత ఇంటి యంగణ మందలి యెనిమిది కంబాల చావడి యరుగు మీద, సుమారొక గంటసేపు శ్రీమద్రామాయణము మూలమును చదివి తెనుగును తాత్పర్యము చెప్పుచు కాలక్షేపము జరిపిరి. మా మాతామహి లక్ష్మమ్మ గారు, మా తల్లి అలమేలు మంగమ్మ గారు, ఇరుగు పొరుగు వారొకరిద్దరు – ఇందరే మా పితామహికి సహశ్రోతలు; ఆమెయే ప్రధాన శ్రోతి. ఈ కారణమైనను ఆమె లేదేని ఆనాడు పురాణము లేదు. ఇట్లు సుమారు రెండేండ్లు జరిగినట్టు నా జ్ఞప్తి. శ్రీ రామపట్టాభిషేకం జరిగిన కడపటి దినము ఇంటిలో చిన్న సమారాధన. ఆడంబరంగా ఏమియు లేదు. జీవితమందలి గొప్ప మనోరథము పూర్తిగా నెరవేరినట్లు మా పితామహికి పరమానందమైనది”
ఈ కథ విన్నాక ఆ లక్ష్మమ్మ గారంటే ఎంతో గౌరవం ఏర్పడాలి కానీ చూసారా ఇందులో కూడా ఒక మగవాడు చెబితే ఆడది వినాల్సి వచ్చింది. అదిగో వివక్ష అంటే ఏమి చేయలేము!
తన జీవితాన్ని ప్రభావితం చేసిన తల్లిగారిని గురించి రాళ్ళపల్లి వారు రాసినది:
“నా సాహితికి తండ్రిగారైన, నా సంగీత శ్రద్ధకు ఉగ్గుపాలు పోసినది నా మాతృశ్రీ అలమేలు మంగమ్మగారు…… శాస్త్రీయమైన సంగీత మామె యేమియు నెఱుగదు. కాని ఆమెకు కంఠ పాఠముగా వచ్చినన్ని పాటలు హరికథలు సామాన్యముగా ఏ సుమంగళికిని వచ్చియుండ వేమో! సంస్కృతము, కన్నడము, తమిళము, తెలుగు – నాలుగుభాషలందును భజన కీర్తనలు, పెండ్లి పాటలు, జోలలు, పూజ పాటలు కథా గేయములను వందల కొలది ఆమె కెప్పుడును సిద్ధముగా నోట నుండెడివి. మా అన్నదమ్ములలో నా శరీరము చాలా మంచిది. దానికన్న మా అక్కగారగు యడుగిరమ్మది ఇంకను ఘనమైనది. మమ్మీదరిని చేర్చి మా తల్లి నా ఐదారేండ్ల ప్రాయమందే మాకు దినమును ఒక అరగంట కాలమైనను పాటలు నేర్పి పాడించు చుండెడిది. అందుచే మా రాళ్లపల్లిలో దినమును జరుగుచున్న రామభజన సంఘమందు చిన్నవారిలో నాదే పై చేయిగా నుండెను”
ఆ అన్ని పాటలు వచ్చి ఆమె ఏమి చేసిందని పనైతే హౌస్ వైఫే కదా. అన్ని భాషలు అంత సంగీతం వస్తే ఆమె క్వాలిఫికేషన్ ఏమిటి ఏ యూనివర్సిటీ లో చదువుకుంది. అసలు GDP కి ఈ మహిళ ఎలా తోడ్పడింది. ఆమె జీతం ఎంత. ఇంత తెలివి ఉండి ఏ మాత్రం సంపాదించి ఏమిటి. ఇటువంటి ఆలోచనలతో కూడిన విశ్లేషణ మొదలు పెట్టకండి మొదటికే మోసం!
ఇక “ఆధునికాంధ్ర సాహిత్యపు వేగము” అన్న వ్యాసంలో ఒక మాట రాసారు. ఈ మధ్య కాలంలో ఒక కొత్త రకం కవులు పుట్టుకొచ్చారనీ వారిది వినాశవాదం అని అన్నారు. “ఇప్పుడు నేల చెడింది; ముండ్లు రాళ్లు నిండినవి; మొదట వీని నన్నిటిని నరికి, త్రవ్వి, ఎండబెట్టవలెను. తరువాత తోట. “మీ తోట స్వరూపమెటువంటిద”ని అడిగిన, “దీని తరువాత నా యోచన ఇపుడెందుకు” అందురు అని అన్నారు.
మన సంస్కర్తలు కూడా అంతే అనుకుంటాను బ్రిటీషు దోపిడీ వల్ల ఆర్థికంగా కృంగి పోయిన సమాజాన్ని సంస్కరించాలని అనుకొని ముందైతే తోటని పూర్తిగా నాశనం చేసేద్దాం తర్వాత కొత్త తోట గురించి ఆలోచిద్దాం అని అనుకున్నారు. ఈ తోటను నాశనం చేసే ప్రణాళికలోనే సాంప్రదాయ విద్యా వ్యవస్థ సాహిత్యం కళలు కూడా నాశనం అయ్యాయి. ఈ నాశనం ప్రెసెంట్ కంటిన్యువస్ టెన్స్ లో ఉండగా పుట్టిన తరం నాది. ఇటువంటి రచనలు చదివి ఆహా భారత దేశం అన్న తోట ఇలా ఉండేదా అని అనుకోవాల్సిందే. అద్భుతమైన పుస్తకం. గొప్ప వ్యక్తిత్వం గల మనిషి! అసామాన్యమైన ప్రజ్ఞ! రాళ్ళపల్లి వారి మేధస్సుకు నమో నమః!
ఉరుపుటూరి శ్రీనివాస్
అద్భుతమైన పరిచయం. తరచుగా వ్రాస్తుండండి.
V SRINIVASA RAO
రచన పత్రిక , మల్లాది కృష్ణానంద్ గార్లు తెచ్చిన పుస్తకం లో వారి ఫోటోలు, వ్యక్తిత్వం తెలుసుకునే అదృష్టం , టీటీడీ ప్రసాద్ గారి ద్వారా నాహం కర్తా లో వారి అంతిమక్షణాలు తెలుసుకొనే భాగ్యం కలిగింది, మరల ఇన్నాళ్టికి ఈ ప్రసాదం , కృతజ్ఞతలు . శ్రీనివాస రావు వి , ఖమ్మం .