వేమన విశ్వరూపం

vemanas_live_tradition1

కేరళలో తామ్రపర్ణీనది ఒడ్డున కాణియార్‌లనే తెగ ఒకటుంది. వారు పొదిగ కొండల్లో నివసిస్తారు. వారి మాతృభాష మలయాళం. కాని వారు ఒక భాషని దేవతల భాషగా పిలుచుకుంటారు. ఆ భాషలోనే తమ పెళ్ళిళ్ళూ, పేరంటాలూ జరుపుకుంటారు. ఆపద వస్తే ఆ భాషలోనే శాంతులు కూడా చేయిస్తారు. ఆ భాష మఱింకేదో కాదు, మన తెలుగే. అసలు విషయం – కాణియార్లు అడుగడుగునా వేమన పద్యపాదాల్ని సుభాషితాలుగా గుర్తుచేసుకుంటారట కూడా ! వింటూంటే ఆశ్చర్యంగా ఉంది కదూ ? ఆయా రాష్ట్రాల్లో వ్యయప్రయాసలకోర్చి విస్తృతంగా పర్యటించి, తేనెటీగలా ఇలాంటి విశేషాలన్నీ సేకరించి, గుదిగుచ్చి స.వెం.రమేష్‌గారు పరిశోధనాత్మకంగా రచించిన అద్భుత గ్రంథం “సజీవ సంప్రదాయంగా వేమన”. ఈ గ్రంథాన్ని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం వారు ప్రచురించారు.

ఈ మొత్తం గ్రంథం ౨౦ అధ్యాయాలుగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ సామాజిక వర్గాల సాంస్కృతిక జీవనంలో వేమన ఎలా ఒక భాగమైపోయాడో ఒక్కొక్క అధ్యాయంలో రచయిత వివరిస్తూ వెళ్ళారు. ముఖ్యంగా తమిళనాడులో వేమనకున్న ప్రాశస్త్యం తిరువళ్ళువర్‌కి కూడా ఉందో లేదో అనిపిస్తుంది. తమిళనాడులో తెలుగు జనాభా ఎక్కువ కావడం ఒక కారణం కావచ్చు. (అప్పటి ముఖ్యమంత్రి జె.జయలలిత శాసనసభలో వెల్లడించినదాని ప్రకారం “తెలుగు మా మాతృభాష” అని జనాభా లెక్కల్లో పేర్కొన్నవారి సంఖ్య అక్షరాలా రెండు కోట్ల మంది)

తమిళనాడులో కడలూర్ జిల్లాకి చెందిన అంబలత్తాడియార్‌లు అనే దళితశాఖవారు వీథుల వెంట తిరుగుతూ “వేమనానంద ప్పదిగం” పేరుతో వేమన పద్యాలు చదువుతారట. వారు వేమనని వేమనానందస్వామి అని పిలుస్తూ ఆయన తమ కులగురువని చెప్పుకుంటారట.

అలాగే పెరంబలూర్ జిల్లాకి చెందిన తమిళ మాదిగలు శవయాత్రలో తమిళ పాటలు పాడతారట. ఆ పాటలతో పాటు వారు వేమన చెప్పిన తెలుగు పద్యాలు కూడా పాడడమే విశేషం. అది ఇలా సాగిపోతుంది :

“ఓ దరుమా నందనే ! దరుమానందనే !

సిత్తసుద్దీ లేని సివపూజలేలరా ?
బాండ్లిసుద్దీ లేని పాకమేలా ?
ఆతుమసుద్దీ లేని ఆసారమేలరా ?
ఇస్పదాబిరామ ! ఇన్రా యేమా !

ఓ దరుమానందనే ! పూడిస్తివా ? స్వామీ ! పూడిస్తివా ?”

రచయిత శ్రీ రమేష్‌గారే ఒకచోట నిష్కర్షగా ఇలా చెప్పారు : “ఈ ముగ్గురికీ (వేమన, తిరువళ్ళువర్, సర్వజ్ఞులకి) గట్టి పోలికే ఉంది, కాదనలేము. కాని కాదనలేనిదే మరొక సత్యం కూడా ఉంది. తిరువళ్ళువర్‌ను తమిళప్రభుత్వాలు పనిగట్టుకొని ప్రచారం చెయ్యడం ద్వారా ఆయన రాసిన కురళ్ళు కొంత వాడుకలోకి వచ్చాయి. అది కూడా చదువుకొన్న ప్రజల నాలుకల పైకే. సర్వజ్ఞుడు కొంత సామాన్యజనంలోకి పోయినాడే కాని ఆయన పరిధి చాలా పరిమితం. ఈ నడుమ కాలంలో అనువాదాల రూపంలో పోవడాన్ని పక్కన పెడితే తిరువళ్ళువరు గానీ, సర్వజ్ఞుడు గానీ వారి వారి భాషా సమాజాలను దాటి బయటకు పోలేదు. ముందే చెప్పినట్లు వేమన – కులాలను, మతాలను, ప్రాంతాలను, బాసలను దాటి దూసుకుపోయినాడు.”

దీనికి రాసిన ముందుమాటలో సంపాదకులు ఆచార్య జయధీర్ తిరుమలరావుగారు కూడా “తిరువళ్ళువర్, సర్వజ్ఞుల కన్నా గొప్పవాడు మన వేమన” అని తేల్చారు. గ్రంథాన్ని చివరికంటా చదివాక మనక్కలిగే అభిప్రాయమూ అదే.

(సజీవ సంప్రదాయంగా వేమన – రచయిత – స.వెం.రమేష్ ) (Sajeeva Sampradayamgaa vemana – Sa.vem.ramesh); సంపాదకులు – ఆచార్య జయధీర్ తిరుమలరావు ; ప్రచురణ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం ; క్రౌన్‌సైజు ; పుటలు – ౮౦ ; వెల – రు. .౨౦ ; ప్రతులకు – Director, A.P. Govt O.M.L. & R.I., Behind O.U. Police Station, O.U. Campus, Hyderabad -500007. ఫోను : 040 – 27097709)

—-తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

You Might Also Like

17 Comments

  1. Samala Venkata Ramesh – crusader for Telugu | Simhapuri : Nellore

    […] Ramesh stays in Hosur (Tamilnadu). His grandfather’s village is Pralayakaveri (now Pulikat) His other books are Porugu Telugu and Vemana Viswarupam. […]

  2. sudhakar

    ఈ పుస్తకం ప్రస్తుతం మీరు ఇచ్చిన అడ్రస్ లో దొరకటం లేదు. ఇంకా ఎక్కడ దొరుకుతుందో కొంచం చెప్పగలరా.
    నాకు రమేష్ గారు వివరాలు తెలుసుకోవాలని వుంది . అతని బ్లాగ్ వుంటే చెప్పండి

  3. శిరీష (విరజాజి)

    తెలుగు జాతి మూలాలకై తపిస్తూ తెలుగు వ్యాప్తికై కృషి చేస్తున్న సామల వెంకట రమేష్ గారి వ్యాసాలు తెలుగుపీపుల్.కాం లో ఉన్నాయి. మనకి తెలీని ఎన్నో విషయాల్ని ఆయన ఈ వ్యాసాల్లో రాశారు. కింది లంకెని చూడండి.

    http://www.telugupeople.com/discussion/userArticles.asp?userId=CV_RAMESH

    అదే విషయంపై వ్యాసాలు అందిస్తూన్న సుందరం గారి వ్యాసాలు కింది లంకెలో చూడగలరు.

    http://www.telugupeople.com/discussion/userArticles.asp?userId=T౦౦౩౩

    శిరీష (విరజాజి)

  4. ckris

    Telugu lo type cheyadam yalago cheppandi

  5. ckris

    chala bagundhi chadavakane cheppesanu

  6. రానారె

    మంచి సంగతి తెలియజేశారు. స.వెం.రమేశ్‌గారి గురించి మీరిక్కడ చెప్పకముందు నాకు తెలీదు. కృతజ్ఞతలు.

  7. e.bhaskaranaidu

    స.వె.రమేశ్ గారికి నమస్సులు…… ఆంద్ర ప్రదెశ్ వెలుపల ఉన్న తెలుగు వారికి మీరు చేస్తున్న భాషా సేవకు నా కెంతో ఆనందంగా వుంది.మీలాంటి వారి సేవ తో పర దేశంలోని తెలుగు వారికి ఇంకెంత ఆనందంగా వుంటుందో……మీ జన్మ ఎంత దన్యమైనదో…….. తమిశనాట వేమన పద్యాలు” గురించి ఇప్పుడే చదివాను. ఆ పుస్తకం కొని చదవతాను. ఇటువంటివె ఇంకా చాల మీరు రాయాలని కోరుకుంటున్నాను.

  8. చైతన్య కృష్ణ పాటూరు

    స.వెం.రమేష్ గారు తెలుగుపీపుల్.కామ్ లో పొరుగు రాష్ట్రాలలో మిగిలిపోయిన తెలుగువారి గురించి వ్రాస్తుంటారు. వేమన గురించి ఆయన వ్యాసం ఒకటి ఆ వెబ్ సైట్లో చదివాను గానీ ఒక పుస్తకమే ప్రచురించారని తెలీదు. తెలియజేసినందుకు నెనెర్లు.

  9. admin

    @kiran: Courtesy – Wiki. Original statue might be the tankbund one. 🙂

  10. zilebi

    Incidentally I wrote a small postings on Vemana recently. This is the link for that:

    http://varudhini.blogspot.com/2008/12/blog-post_30.html

    http://www.varudhini.tk
    zilebi.

  11. చిలమకూరు విజయమోహన్

    చాలా మంచి విషయాన్ని తెలియచేశారు.

  12. కామేశ్వర రావు

    నాకు తెలియని చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేసారండీ! నెనరులు.
    స.వెం.రమేష్ గారు తెలుగు భాష గురించి చేస్తున్న కృషి (నాకు గుర్తున్నంత వరకు పెళ్ళి కూడా చేసుకోకుండా) నిజంగా అనన్యమైనది. ఇంతకీ ఇతను నివసించేది తమిళనాడులో! అతని కృషికి తగిన గుర్తింపుగా తానా సంఘంవారు ఈ సంవత్సరం గిడుగు స్మారక పురస్కారాన్ని ఇతనికి ప్రకటించారు.
    స.వెం.రమేష్ గారు రాసిన కథల పుస్తకం “ప్రళయ కావేరి కథలు” కూడా చాలా మంచి పుస్తకం. దాని గురించి వీలుచూసుకుని ఈ సైటులో పరిచయం చేస్తాను.

  13. కొత్తపాళీ

    మంచి మాట చెప్పారు. ఈ పుస్తక రచయిత స.వెంరమేశ గారికి 2009 సంవత్సరాంకి గాను తానా సంస్థ తాము రెండేళ్ళకోసారి ఇచ్చే గిడుగు రామ్మూర్తి స్మారక పురస్కారం ఇస్తోందని నిన్ననే తెలిసింది. ఆ వివరాలు త్వరలో నా బ్లాగులో.

  14. chavakiran

    Image courtesy please:)

  15. యోగి

    వేమన ది ఏ కులం.. ఏకాలం లాంటి విషయాల్లో అనవసరం గా కాలయాపన చేయకుండా ఇలాంటీ పరిశోధన చేసినందుకు స.వెం.రమేష్‌ గారు అభినందనీయులు.

    దీనిని పరిచయం చేసినందుకు తాడేపల్లి గారి కి నెనరులు.

  16. krishna

    మంచి కొత్త విషయం తెలియజేశారు.తప్పకుండా పుస్తకం కొనుక్కుని చదవాలి.
    నెనెరులు తాడేపల్లి వారు.

Leave a Reply