మేథ मॆ tricks
పైన పేరెక్కడో చూసినట్టు ఉందా? మీరు 80 వ దశాబ్దంలో వచ్చిన బాలజ్యోతి పత్రిక చదువుతూ వుండుండాలి. అప్పట్లో చందమామ, బొమ్మరిల్లు, తదితర పిల్లల పత్రికలకన్నా బాలజ్యోతి ఎక్కువ సర్క్యులేషన్ సాధించిన పత్రిక. నండూరి రామమోహన రావు గారు, శశికాంత్ శాతకర్ణి వంటి సంపాదకుల చేతుల్లో రూపుదిద్దుకున్నది. ఆ పత్రిక గడిచినంత వరకు, అందులో వచ్చిన ముఖ్య శీర్షిక అవసరాల రామకృష్ణారావు గారు నిర్వహించిన మేథ मॆ tricks.ఇందులో పాల్గొని నెగ్గిన వారికి అప్పట్లో బాలజ్యోతి నెలనెలా చక్కని బహుమతినిచ్చేది.
మొన్నామధ్య విశాలాంధ్రలో పుస్తక ప్రదర్శన జరిగితే అందులో ఈ పుస్తకం కొని పెట్టాను. కొన్ని రోజులు చదవడానికి వీలుపడలేదు.
అలా ఉండగా ఓ రోజు – ఆఫీసులో పనెక్కువగా ఉంటే, (తప్పించుకోడానికని) కాస్త పని పక్కనపెట్టి, వేగు డబ్బా (మెయిల్ బాక్స్) తెరిచి, రిఫ్రెష్ చేసి చూసాను, కొత్త వేగులొచ్చాయా అని.
ఎవరో స్నేహితుడు వేగుతో ఓ చిన్న ఫ్లాష్ గేము జోడించి పంపాడు.
ఆ గేములో ముగ్గురు శాకాహారులు, ముగ్గురు (నర) మాంసాహారులు. వాళ్ళు ఓ నది దాటాలి. శాకాహారులందరికీ, మాంసాహారుల్లో ఒకడికీ పడవ నడపడం వచ్చు. పడవలో ఒక పర్యాయం ఇద్దరు మాత్రమే ఎక్కవచ్చు. పడవను ఆ వడ్డుకీ ఈ వడ్డుకీ కొన్ని పర్యాయాలు నడుపుతూ, మొత్తం అందరినీ ఆవల వడ్డు చేర్చాలి. ముఖ్యమైన నిబంధన, మాంసాహారుల మెజారిటీ ఎట్టి పరిస్థితుల్లో పెరగకూడదు. పెరిగితే, వాళ్ళు శాకాహారులను తినేస్తారు.
గేములో మునిగిపొయాను. (ఈ గేము బహుశా మీరు చూసి ఉంటారు)
మరుసటి రోజు మా బాసురుడు మా సంస్థలో పని చేయడం కోసం దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక అభ్యర్థులను ఓ పర్యాయం ముఖాముఖి జరుపమని ఆదేశించాడు. ఆ అభ్యర్థులు
ఇదివరకే ఓ టెస్ట్ పాస్ అయి వచ్చారు.
నేను ఆ ముఖాముఖిలో, యథాలాపంగా వారు రాసిన (ఆప్టిట్యూడ్) టెస్ట్ పేపరు చూశాను. అందులో ఓ ప్రశ్న.
ఓ ఎనిమిది సోలల పాత్రలో నిండుగా నూనె. ఆ నూనెను చెరో 4 సోలలు గా పంచాలి. అయితే, మన దగ్గర ఓ ౩ సోలల పాత్ర, మరో 5 సోలల పాత్ర మాత్రమే ఉన్నాయి. ఈ సోలలను మాత్రం ఉపయోగించి, కనిష్ట పర్యాయలు నూనెను మారుస్తూ ఎలా పంచవచ్చు?
*******************************************
తర్వాత ఈ పుస్తకం చదువుదామని ఆరంభించగానే, మొట్టమొదటి పేజీలోనే కనిపించిన క్విజ్ – పై చెప్పిన శాకాహారులది “ఏరు దాటటం ఎలా?” అన్న పేరుతో ఉన్నది. 8 వ అధ్యాయంలో 2వ ప్రశ్న.
ఇందులో గణితమే కాదు, మన తెలుగు పదాలు, చిన్న చిన్న సైన్సుకు సంబంధించిన క్విజ్ లు, సాధారణ విఙ్ఞానం (general knowledge),వృక్షశాస్త్రం, జీవ శాస్త్రం, సినిమాలు ఒక్కటేమిటి? అనేకమైనవి ఉన్నాయి.
మచ్చుకి కొన్ని అక్కడక్కడా ఏరతాను.
౧. CLEAVE అనెది గుర్తుంచుకోవలసిన ఇంగ్లీషు పదం. ’కలవడం ’అనే అర్థమే కాక, దానికి వ్యతిరేకమైన, ’విడదీయడం ’ అన్న అర్థం కూడా ఆ ఒకే ఒక పదానికి ఉన్నాయి.కోపానికీ, సంతోషానికీ సరిపడే ఒకేఒక పదం మన భాషలోనూ ఉంది.ఏమిటో అది?
౨. నల్లనిదీ, తెల్లనిదీ, ఆకుపచ్చవాటితో కలగలిసిపోయి ఎర్రగా మారేది ఎక్కడ?
౩. ఒకటి తర్వాత వంద సున్నాలు పెట్టబడే అతిపెద్ద సంఖ్యను ఇంగ్లీషులో ఏమిటంటారు?
౪. వీధి గుమ్మం నున్నగా అలుక్కుని శుభ్రం చేసుకుంటాం మనం. నోటితో ఓ విధమైన ద్రవాన్ని ఊరించి ముందుకు కదిలే ప్రతి అడుగునీ తివాచీలా చేసుకుని జర్రున జారుతున్నట్టు జరుగుతుందట? ఎవరో ఈ పరిశుభ్రశ్రీ?…
౫. ఓ పాత తెలుగు చిత్రంలో ఎప్పటికీ పాతబడని క్రైస్తవ భక్తి గీతం ఉంది. ఆ పాటపల్లవి, అది ఏ చిత్రం లో?
౬. మన దేశం మొత్తమ్మీద అత్యధిక వేగంతో నడిచే రైలు ఏదీ? ఆ వేగమెంత?
పైన చెప్పినట్టు ఇవి కొన్ని మాత్రమే. అయితే, ఇలాంటి క్విజ్ లు కాక, బుర్రకు పదును పెట్టటం దగ్గర నుంచీ, బుర్ర వేడేక్కించే ప్రశ్నల వరకూ అన్ని ఉన్నాయిందులో. అయితే మన ఇంట్లో ఓ తాతయ్య మన పక్కన కూర్చుని, చమత్కారాల చేగోడీలు, చెణుకుల జంతికలూ అందిస్తూన్నట్టు చెప్పటం ఈ పుస్తకం ప్రత్యేకత.
అన్నట్టు పైన ఆరు ప్రశ్నలకూ సమాధానాల కోసం ఓ పేరా అల్లాను.(తాతయ్య సావాస దోషం)
(గూగుల్ (googol – ౩)లో బాపు పాట “లేత పచ్చ ఆకులు, రేయి నల్ల వక్కలు…తాంబూలం(౨)” పాట వెతికాను. రాజధాని ఎక్స్ ప్రెస్ లా గంటకి 140 కి.మీ. వేగం(౬)తో వెళుతుందనుకున్నా, కానీ మరీ నత్త(౪) నడకన నడిచింది నా ఇంటర్నెట్. చాలాసేపటికి దొరికిందో చోట. చక్కటి “రాగం” (౧)ఉన్న పాట అది. నాకు నచ్చిన మరో పాత పాట మిస్సమ్మలో, ’కరుణించు మేరి మాతా’(౫)..అన్నది.)
*******************************************
పుస్తకం మున్నుడి – “క్విజ్ రాతల కేరింతలు” మొదటి పేరాయే చూద్దామో మారు.
“ఏ రచనా ప్రక్రియ అయినా పాతవిషయాలే కొత్తగా, గొప్పగా చెప్పగలిగే చాతుర్యమే కదా! ’ఏదో మేమే ఒరిజినల్ గా ఊడబొడిచేశాం ’ అనే అహంకారాన్ని విడిచిపెట్టగల గుండె నిబ్బరమే ఉంటే పూర్తీగా బట్టలు విప్పుకుని గోదావరిలో ఈత కొట్టినంత హాయిగా ఉంటుంది మనసు.”
హాయిగా లేదూ పై పేరా?
చివరి అట్టపై, రచయిత పరిచయంలో ఓ ముక్క.
వీరు అందుకున్న పురస్కారాల్లో, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం, ఢిల్లీ తెలుగు అకాడెమీ….వగైరా ముఖ్యమైనవి. ఇంకా ఈయన అనేక కథా సంకలనాలు వెలువరించారు.
మేథ मॆ tricks 3 సంపుటాలు గా వచ్చింది.
ఎమెస్కో బుక్స్, ఏలూరు రోడ్, విజయవాడ వారి ప్రచురణ.
వెల వరుసగా : 20, 25, 20 రుపాయలు. ప్రతీ పుస్తకంలో 32 ప్రశ్నలు, జవాబులతో సహితంగా ఉన్నాయి.
*******************************************
JAYA
ee roju nenu pillalni aakattukunela puzzels avee cheppi maa pillalaki maths chala easy ane feeling kaligimchanamte adamta BALA JYOTHI, AVASARALA veeri chalave. mee mulam ga varini maro sari taluchu kovatam kalusukunnamta anamdam ga umdi.
రవి
@అరుణ గారు, కాదు. ఇది అవసరాల రామకృష్ణా రావు గారి శీర్షిక. మహీధర వారి శీర్షికా ఒకటొచ్చేది అప్పటి బాలజ్యోతిలో, తర తరాల కథలు అని చెప్పి.
Aruna
ఇది మహీధర నళిని మోహన్ గారు రాసిన పుస్తకం కాదా ఐతే?
సుజాత
ఈ ట్రిక్కుల్లో కొన్నింటిని కనుక్కుని పంపి బహుమతులు కూడా కొట్టామండీ అప్పట్లో!