కామ్యూ కథ: “అతిథి”. (The Guest (L’hote’) by Albert Camus)

వ్యాసకర్త: సూరపరాజు రాధాకృష్ణమూర్తి

పాత్రలు:

Daru, దారు,స్కూల్ మాస్టరు.ఫ్రెంచివాడు.ఆల్జీరియలో పుట్టిపెరిగినవాడు.

Balducci, బల్దూచీ:పోలీసు.(సాధారణ పోలీసు కాదు.సైన్యంలో పనిచేస్తూ,అత్యవసరస్థితిలో  పోలీసుశాఖతో కలిసి పనిచేస్తున్నవాడు, gendarme..)

–అరబ్బు ఖైదీ.

స్థలం:   ఫ్రెంచిపాలనలో ఉండిన ఆల్జీరియా

కాలం: ఆల్జీరియన్లు  తమదేశంలో ఫ్రెంచిపాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న సమయం.కాని ఆ తిరుగుబాటుకు కథలో ప్రాధాన్యం లేదు.

 

కథాసంగ్రహం:

      కొండపై బడి. అదే స్కూల్ మాస్టరు యిల్లు కూడా.దారు  కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నాడు.ఇద్దరు మనుషులు కొండపైకి వస్తున్నారు. గుర్రం పై పోలీసు, పక్కన నడుస్తూ మరో మనిషి, అరబ్బుఖైదీ.మూడు రోజులుగా మంచు, దారి దాదాపు మూసుకుపోయింది.

    బడిగదిలో నల్లబల్లమీద ఫ్రాన్సులోని నాలుగు నదులు ,నాలుగు రంగుల సుద్దముక్కలతో గీచినవి, మూడురోజులుగా ప్రవహిస్తూ ఉన్నాయి. మూడురోజులనుండి పిల్లలు బడికి రావడంలేదు. మంచు, చలి.ఎనిమిది నెలలనుండి వర్షం లేదు.ఇప్పుడు  ఈ మంచు. పంటలు లేవు. కరువు. బడికి వచ్చే పేదపిల్లలకు పంచమని ప్రభుత్వం ఆహారపు ధాన్యాలు  బడికి సప్లయి చేస్తున్నది. బడినిండా గోధుమపిండి బస్తాలు. ట్రక్కు రెండు రోజులకొకసారి వస్తుంది. ఈ బడికి వచ్చే పిల్లలందరూ పేదపిల్లలే. మంచు ఆగి,  దారి మెరుగైతే మళ్ళీ వస్తారు పిల్లలు. ఈ మూడు రోజులు ఏం తిన్నారో? బయట భయంకరమైన కరువు కాటకం. తనకు మాత్రం  తిండికి కొరవ లేదు.

     దారును చూసి చేయి ఊపుతూ  నవ్వాడు పోలీసు. దారు చూపు అరబ్బుమీద. ఖైదీ  అని తెలుస్తున్నది.అతని చేతులు తాళ్లతో కట్టి ఉన్నాయి.  లోపలికి రండి వెచ్చగా ఉంది, అంటూ లోపలికి తీసుకెళ్లాడు వాళ్ళను.

       ఇద్దరినీ  తరగతిగదిలో కూర్చోమని, టీ చేసి తెస్తానని దారు లోపలికెళ్ళాడు. బల్దూచీ పెద్దవాడు. కొండ ఎక్కి వచ్చాడు. అలిసిపోయాడు.ఏం ఉద్యోగమో? త్వరగా రిటైర్ అయిపోవాలని ఉంది, అంటూ లోపలికి వచ్చాడు, ఖైదీతో. దారు టీ చేసి తెచ్చి పోలీసుకు  ఇచ్చాడు. ఖైదీకి ఇవ్వబోతే, అతడి చేతులు కట్టి ఉన్నాయి. దారు, బల్దూచీతో కట్టు విప్పవచ్చనుకుంటాను?’,అన్నాడు. విప్పు  అన్నాడు పోలీసు.  దారు వంగి మోకాళ్ళమీదకూర్చుని అతడి  కట్టు విప్పి, టీ యిచ్చాడు. అరబ్బు అతని కళ్ళలోకే భయంగా చూస్తూ ఉన్నాడు.

   తను వచ్చిన పని చెప్పాడు బల్దూచీ.‘రేపు సాయంత్రంలోపల యితన్ని నీవు టింగ్విత్  పోలీసు హెడ్ క్వార్టర్స్  లో అప్ప చెప్పాలి’,అన్నాడు, చనవుతో చిన్నగా నవ్వుతూ. (దారులో  తన పోయిన కొడుకును చూసుకుంటాడు బల్దూచీ.దారును “ నాన్నా” అంటాడు.)

‘ఏం చేశాడు ఇతడు?’ అని అడిగాడు దారు.

‘అతని బంధువును ఒకణ్ణి చంపాడు. ఏదో కుటుంబకలహం.ఒకడు ఇంకొకడికి  ధాన్యం బాకీ ఉన్నట్టున్నాడు.సరిగా తెలీదు ఏం జరిగిందో.’

   దారు ‘అది నా  పని కాదు.నేను చేయను’, అంటాడు. ‘ఉత్తర్వులైతే ఉన్నాయి. తరువాత నీ యిష్టం’ అని కాగితంమీద దారు సంతకం తీసుకొని, కాగితం భద్రంగా మడిచి జేబులో పెట్టుకుని వెళ్ళి పోయాడు,‘ఇది ఉంచు’ అంటూ తన స్పేర్ రివాల్వర్ టేబుల్ మీద ఉంచి.  

   ఒక హంతకుణ్ణి రాత్రికి తన దగ్గర ఉంచుకోడం దారుకు యిష్టం లేదు. కాని దారు అసహనం అయిష్టత క్రమంగా కరిగిపోతాయి.( ఖైదీకి టీ యిస్తున్నపుడు అతడి చేతుల కట్టు విప్పినప్పుడే తనకు తెలియకుండానే కరగడం మొదలయింది. )

    బల్దూచీ వెళ్ళిపోగానే, దారు తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు, ఆలోచిస్తూ. అరబ్బు ఎందుకో బయటికి వెళ్ళాడు. పారిపోతాడేమో అనుకున్నాడు దారు. లేదు. మళ్ళీ లోపలికి వచ్చికూర్చున్నాడు అరబ్బు.పారిపోతే బాగుండు, అనుకున్నాడు దారు.తన బాధ్యత వదిలిపోయేది.

   ఆకలిగా ఉందా అని అడిగాడు దారు.అవునన్నాడు ఖైదీ.దారు  స్టవ్ వెలిగించి ఆమ్లెట్  చేశాడు.ఇద్దరికి  టేబుల్  సిద్ధం చేసి, వచ్చి కూర్చోమన్నాడు. అరబ్బుకు డిన్నర్  వడ్డించాడు.

        ‘ఎందుకు హత్య చేశావు?’  అని అడిగాడు దారు. ప్రశ్నకు అరబ్బు  చెప్పిన  సమాధానం, ఆసాంతము బరువైన కథలో,  నవ్వు ఆపుకోలేని ఒకే ఒక సందర్భం: వాడు పారిపోయాడు.వాడి వెనక నేను పరుగెత్తాను.'(“He ran away. I ran after him.”)

     రాత్రి అయింది.ఖైదీ  పడుకోడానికి తనకున్న రెండో పక్క యిచ్చాడు దారుతెల్లవారింది. దారు ఖైదీని బయటకు తీసుకువచ్చి, కొండమీదినుండి కిందికి రెండు దారులు చూపించి: ‘ దారి పోలీసు స్టేషనుకు వెళుతుంది. దారి మీ తెగ వాళ్ళుండే వూరికి వెళుతుంది‘, అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కొంతసేపు అయిన తరువాత  దారు బయటకువచ్చి చూచాడు. ఖైదీ  పోలీస్ స్టేషన్ వైపు నడిచిపోతున్నాడు.

     దారు బరువెక్కిన హృదయంతో   తరగతి గదిలోకి వెళ్లాడు.గోడమీద  రాత:’మా మనిషిని పోలీసులకు అప్పగించావు.నిన్ను వదలం.’ కిటికీ లోనుండి వెలుపలికి చూశాడు.అనంతమైన ఆకాశం.అంతులేని  పల్లపుప్రాంతము.ఇంత విశాలమైన ప్రపంచంలో తాను ఒంటరి.

      ఇదీ కథ స్థూలంగా.ఇందులో ప్రధానంగా కనిపించేది,నేరస్థుడు తన నేరాన్ని అంగీకరించి, పోలీసులకు లొంగిపోవలెనని తీసుకున్న నిర్ణయం.  పారిపోవడానికి అవకాశం కల్పించినా పారిపోలేదు. బరువైన  కథలో నవ్వదగిన సందర్భమని చెప్పుకున్న మాటను ఇప్పుడు ఒక్కసారి,వెనుకకు తిరిగి చూద్దాం. ఎందుకు హత్య చేశావు అంటే, ఏమన్నాడు? ‘ వాడు పారిపోయాడు. వాడి వెనక నేను పరిగెత్తాను.’ ‘వాడుపారిపోయాడు.కాని,  ‘వీడుపారి పోడు. దేనినుండి ఎటువంటి పరిస్థితినుండి కూడా పారిపోవడం ఈ ఖైదీ స్వభావం కాదు. పారిపోవడాన్ని సహించలేడు కూడా.కనుకనే పారిపోతున్నవాణ్ణి చంపేశాడు.  ఇప్పుడు  కూడా అతని సమాధానం విని నవ్వగలమా? అందులో హాస్యం కనిపిస్తోందా? అతడి అసాధారణమైన నైతికత,నిశ్చయం, ధృతి కనిపిస్తున్నాయి. మరి యింత గంభీరమైన వస్తువు కదా కథకు పేరుగా ఉంచవలె? కనుకనేఅతిథి“.

        ఫ్రెంచి మూలంలో కథ పేరు, L’hote. Hote  అన్న పదానికి ఫ్రెంచిలో host (ఆతిథ్యం యిచ్చినవాడు) అని, guest ( అతిథి) అని కూడా అర్థాలు.ఆంగ్లంలో, తెలుగులో రెండు అర్థాలు యిచ్చే పదం లేదు కనుక “The Guest” , “అతిథిఅని పేర్లు. కాని  మూలకథకు రచయిత పెట్టిన పేరు కథలో  ప్రధాన పాత్రలు ఇద్దరు అని చెబుతున్నది;   దారు, అరబ్బు .

         కథలో అనేక కోణాలున్నాయి.

ఒకటి: దారు ఒంటరితనం. భౌతికమైన ఒంటరితనం,మానసికమైన ఒంటరితనం. కొండపై బడి. పిల్లలు రాగలిగినప్పుడు వస్తారు బడికి. వాళ్ళు రానప్పుడు, తను పెంచుకుంటున్న కోళ్ళు తన సహవాసులు.ఇటువంటి చోట ఉద్యోగమంటే మరొకడెవడైనా అది శిక్షగా భావించేవాడు.కాని  దారుకు ఈ ఉద్యోగము ఈ ఒంటరితనము, అతడు కోరుకున్నవే. ఈ భౌతికదూరం అతడికి కష్టమనిపించడం లేదు.  నగరానికి నాగరికతకు  దూరంగా, అడవుల్లో ఆశ్రమాలలో సర్వసంగపరిత్యాగిలా సంతృప్తితో ఉంటున్నాడు.

   మానసికంగా కూడా దారు ఒంటరివాడే. అతడు ఫ్రెంచివాడు. కాని ఆల్జీరియాలో పుట్టి పెరిగాడు. కాని యిక్కడ తప్ప మరోచోట ఉండలేడు.  ఫ్రాన్సు లో తను ఆల్జీరియన్.ఆల్జీరియాలో తను ఫ్రెంచివాడు, పాలకపక్షంవాడు.  ఇక్కడా అక్కడా కూడా పరాయివాడే,  ఒంటరివాడే. లోకంలో మనిషి ఎప్పుడూ ఎక్కడా ఒంటరివాడే, భౌతికంగాను మానసికంగాను కూడా. ఈ ఒంటరితనం మనిషి బతుకులో భాగం. అది దాని లక్షణం. కనుక, లోకాన్ని నిందించకు. ఒంటరితనంలో సంతృప్తి పొందు అని సూచిస్తుంది దారు ఒంటరిబతుకు.లోకానికి తను పరాయివాడు.కాని తనకు లోకులు పరాయివారు కారు. మనుషులకు దూరం,మానవతకు దగ్గర.

మరో కథావస్తువు, చట్టము స్వేచ్ఛ:

చట్టానికి మనిషి స్వేచ్ఛకు మధ్య అనివార్యంగా కలిగే ఘర్షణ  బల్దూచీ దారుల మధ్య జరిగిన సంభాషణలో వ్యక్తమవుతుంది.

బల్దూచీ  ఖైదీని దగ్గరి పోలీసుస్టేషన్ లో అప్పగించమంటాడు.దారు,స్కూల్ మాస్టరు, ముందు అది నా పని కాదంటాడు. బల్దూచీ అంటాడు యుద్ధసమయంలో అందరూ అన్ని పనులు చేయవలసే వస్తుంది అంటాడు. దారు అది నా పని కాదు అన్నది పని తప్పించుకోడానికి చెప్పిన సాకు కాదు. ఆ పని చేయడం అతనికి యిష్టంలేదు. ఒక మనిషిని జైలుకు పంపడం అన్న ఆలోచన అతడు సహించలేడు. ఖైదీ చేసిన నేరం ఏమిటి అని అడుగుతాడు. బంధువును ఎవరినో చంపాడట, వీడు వాడికో వాడు వీడికో గోధుమలు బాకీ ఉన్నాడట, సరిగా తెలీదు, అంటాడు. (అనావృష్టి, కరువు వర్ణనతో కథ  మొదలయింది యిందుకేనేమో!గోధుమలకోసం హత్య!కిలోలా  బస్తాలా? బల్దూచీకి హత్యకారణం స్పష్టంగా తెలియదు.పోలీసుకు అది  తెలుసుకోవలసిన అవసరంలేదు పోలీసుకు ఖైదీ బాధ్యత ముఖ్యం. దారుకు ఖైదీలోని మనిషి ముఖ్యం. దారుకు ఆ పని యిష్టం లేదని తెలిసి, బల్దూచీ చనవుతో నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.ఒక మనిషిని జైలుకు పంపడం నీకే కాదు నాకూ యిష్టంకాదు. ఉరితీసేవాడు కూడా తన పని యిష్టంగా చేయడు. ఎన్నేళ్ళుగా ఎంతమంది మెడలకు ఉచ్చు తగిలించినా, ఎప్పటికీ యిష్టంగా చేయలేడు.అలాగని హత్యలు చేసినవాడిని వదిలేస్తావా, అంటాడు.నిజమే కదా!కాని, దారు నిశ్చయంలో మార్పు లేదు. అతడికి మనిషి స్వేచ్ఛ ముఖ్యం.కాని బల్దూచీ ప్రశ్నకు దారు వద్ద సమాధానం ఉందా? దారు సంకోచానికి బల్దూచీ దగ్గర సమాధానం ఉందా?  కథలో ప్రధానవిషయం సమాధానాలు లేని ఈ సంఘర్షణ.జీవితంలో ప్రతినిమిషము ఏదో ఒక విషయంలో నిర్ణయం తీసుకోవలసివస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సమస్య పరిష్కారం కాదు.ఏదో నిర్ణయం తీసుకోక తప్పదు. అది మనిషి పరిస్థితి.ఆ స్థితిలో నిరాశ నిస్పృహ కాక మరేముంటుంది?ఏమి ఉండవలె? ప్రేమ ఉండవలె అంటాడు కామ్యూ.అంతే కాదు.అత్యంతనిస్పృహలో మాత్రమే ప్రేమ సాధ్యం అంటాడు.  ‘…there’s no love of life without despair of life. ‘Lyrica and Critical Essays’:Camus.

        దారుది ఖైదీకంటే తక్కువ సంక్లిష్టమైన స్థితి కాదు.నేరస్థుణ్ణి పోలీసులకు అప్పగించకపోతే చట్టాన్ని విరోధించినవాడవుతాడు.అప్పగిస్తే  అరబ్బులు తనను వదలరు.అది మాత్రమే కాదు. పోలీసులకు అప్పగించడం అతని స్వభావానికి యిష్టంలేని పని.చట్టానికో స్వభావానికో అనుగుణంగా నిర్ణయం తీసుకోవలె. రెంటిలో దేనిని మన్నించినా, సమస్య మిగిలిపోతుంది.రెంటిలోను సుఖం లేదు కూడా. ఖైదీకి రెండు దారులు చూపించి బడిలోపలికి వచ్చి గోడమీద రాసిన మాటలు చూస్తాడు.మా మనిషిని పోలీసులకు అప్పగించావు.నిన్ను వదలం.’ బడి గోడమీద ఈ రాత ఎవరు రాశారో కథలో చెప్పలేదు. రాత్రి ఎవడైనా వచ్చి దారు నిద్రపోతున్నపుడు రాసి వెళ్లాడా అనుకోవడానికి లేదు. ఎవడైనా లోపలికి వస్తే ఖైదీని విడిపించి తీసుకుపోయే  ప్రయత్నం చేస్తాడుకాని, గోడమీద రాతలు రాసిపోడు. ఒక దృష్టిలో, ఈ గోడమీద రాత కథాశిల్పంలో లోపమే. కాని కామ్యూ చెప్పదలచుకొన్నది, ఈ రాత ఎవడో  రాసింది కాదు.మనిషి తనకు తాను రాసుకుని వచ్చిందే, అని.ఒక కష్టం తప్పించుకుంటే మరొకటి తప్పదు. అది మనిషి పరిస్థితి. Human condition.

   దారు నిర్ణయం తీసుకోక పోవడం కూడా ఒక విధమైన నైతికవైఫల్యమే.తనకు తెలియకుండా   అరబ్బు పారిపోవచ్చు కదా, తను నిర్ణయము తీసుకోవలసిన అవసరంలేకుండా పోతుంది కదా, అన్న ఆలోచన కూడా అతనికి కలిగింది. నిర్ణయాన్ని ఖైదీకి వదిలేయడం  కూడా  నైతికవైఫల్యమే.

     నిజమే.దారు నిర్ణయం తీసుకోలేదు. మరి కథ పేరులో, (L’hote ) దారు, అతని దారుణమైన వైఫల్యము ఉన్నట్టా లేనట్టా? కథ పేరులో దారు తప్పక ఉన్నాడు. దారుది వైఫల్యం కాదు. అతడు నిర్ణయం తీసుకోకపోవడం తీసుకోడంకంటే గొప్ప  నిర్ణయం.అందులో అతడి అరుదైన మానవత్వం ఉంది.చట్టవిరోధభయానికీ విజాతీయులు పగతో ప్రాణాలు తీస్తారన్నభయానికి , రెంటికీ అతీతమైన మానవత్వం ఉంది. అతడు నిర్ణయం తీసుకోనిది , భయపడి కాదు; భయాన్ని జయించాడు కనుక. అరబ్బు తీసుకున్న నిర్ణయం ప్రధానమైన కథావస్తువే. కాని  నిర్ణయానికి కారణం దారు అతడికిచ్చిన అభయం. ఎటువంటిదా అభయం? ‘ నీకేం భయం లేదు, నేనున్నాను. నిన్ను పోలీసులకు అప్పగించను‘, అన్న అభయం కాదు. భయాన్ని జయించగలము అన్న సందేశం యివ్వడం. సందేశం ఎట్లా అందజేశాడు? తన ఆదరపూర్వక ఆతిథ్యంతో. ఏమిటా ఆతిథ్యం?హ్యూగో నవలలో( Les Miserable)  బిషప్పులాగా వెండి దీపపుసెమ్మెలిచ్చాడా? లేదు టీ యిచ్చాడు. ఆమ్లెట్ చేసిచ్చాడు.నేలమీద కూర్చున్నవాణ్ణి టేబుల్ దగ్గరకు పిలిచి డిన్నర్ వడ్డించాడు.యిద్దరూ కలిసి తిన్నారు. రాత్రి పడుకోడానికి ఆ హంతకుడికి తన పక్కనే  పక్క చూపించాడు .అన్నిటినీ మించి, పారిపోవడానికి అవకాశమిచ్చాడు. యివ్వడంలో దారు భయాన్ని  జయించిన మనిషి అన్న  అభయసందేశం అరబ్బుకు అందింది. మనిషి యిలా ఉండాలి అనుకున్నాడు.

     కనుక దారు ఏం చేశాడు? మనిషిని మనిషిగా చూచాడు. హంతకుడిలోని మనిషిని మనిషిగా చూడగలిగితే హంతకుడు పోయి, మనిషి మిగులుతాడు. దారు ఒక మనిషిని హంతకుడినుండి కాపాడగలిగాడు. అందుకే కథ పేరు L’hote.

‘In a world whose absurdity appears to be so impenetrable, we simply must reach a greater degree of understanding among men, a greater sincerity. We must achieve this or perish. To do so, certain conditions must be fulfilled: men must be frank (falsehood confuses things), free (communication is impossible with slaves). Finally, they must feel a certain justice around them.’Albert Camus.’Camus.

జీవితాన్ని అనేకులు అనేకంగా దర్శించారు, ప్రాచ్యులు పాశ్చాత్యులు.

జీవితానికి అర్థం లేదు.అర్థంలేని జీవితానికి అర్థం కల్పించడంలోనే జీవితంసార్థకమవుతుంది.లోకం నిన్ను కాదంటుంది,కాని ఆ నిస్పృహలో  నీవు లోకాన్ని కాదనకు.నిన్ను కాదన్న లోకాన్ని ప్రేమించడమే మనిషి జీవితాన్ని వ్యర్థంకాకుండా సార్థకం చేయగలిగే మార్గం, అంటారు ఎక్సిస్టెన్షలిస్టులు అబ్సర్డిస్టులు. ‘…there’s no love of life without despair of life. ‘Lyrical and Critical Essays’:Camus.

      జీవితానికి అర్థంలేదు అన్నది ఒక దర్శనం.జీవితం అర్థం కాదు అన్నది మరో దర్శనం.అంతే తేడా.తక్కినదంతా సమానమే,  ధర్మము ప్రేమ మానవత సర్వభూతహితము ఆత్మీయత.దర్శనం ప్రాచ్యమైనా పాశ్చాత్యమైనా ఆత్మవత్ సర్వభూతాని అన్న దర్శనంలో చేరిపోవలసిందే. మరో సామాన్యసత్యం, జీవితంలో సుఖం  కాదు మనిషి వెదకవలసింది, స్వధర్మనిర్వహణ. అంటే ‘acting in  good faith’.

అవసరమైతే యుద్ధమైనా చేస్తాను, కాని ఈ అరబ్బుఖైదీని పోలీసులకు అప్పగించను, అంటాడు దారు. స్వధర్మే నిధనం శ్రేయ:’.తాను నమ్మిన ధర్మంకోసం ప్రాణాలైనా యివ్వడానికి సిద్ధమైనాడు దారు.


అరబ్బు నిర్ణయం: దారు ఆతిథ్యం:

    అతిథి,  ఆతిథ్యమిచ్చినవాడు (host, guest) , ఇద్దరిలో ఎవరినిర్ణయం ప్రధానం అన్న ప్రశ్న యింకా మిగిలి ఉందా? బేరీజు వేసుకోవాలా? అయితే, ఇంచుమించు యిలాటి సన్నివేశం మరొక కథలో చూద్దాం. Dostoevsky నవల The Brothers Karamazov లో  . డిమిట్రికి తాను చేయని హత్యకు యావజ్జీవకారాగార శిక్ష విధించింది న్యాయస్థానం.

అతని ఆత్మీయులు అతనితోనీవు చేయని నేరానికి ఎందుకు శిక్ష అనుభవించవలె, దేశం వదిలి పారిపో,  పారిపోవడం సాధ్యమే, నీవు పారిపోవడానికి మేము సహాయపడతాము’, అంటారు.అతడుపారిపోను.నేను దేశాన్ని ప్రేమిస్తాను.ఇక్కడే నేలమీద తిరుగుతూ యావజ్జీవం శిక్ష అనుభవిస్తాను. నేను మట్టిలో పుట్టాను మట్టిలో కలిసిపోతాను‘, అంటాడు. అటువంటి నిర్ణయంలో మరొకరికి భాగస్వామ్యం లేదు . ప్రస్తుత కథలో అరబ్ తీసుకున్నది సామాన్యమైన నిర్ణయం కాదు. కాని ఆ  నిర్ణయంలో దారు భాగం  స్పష్టంగా ఉంది.  కనుక కథ పేరులో అతిథి,  ఆతిథ్యం యిచ్చినవాడు యిద్దరూ ఉన్నారు. అందుకే మూలంలో కథ పేరు L’hote

 

You Might Also Like

One Comment

  1. Varaprasad

    చాలా కాలం తర్వాత మంచి రచన చదివిన సంతృప్తి కలిగింది.

Leave a Reply