తెలుగు కథ: ఏప్రిల్-జూన్ 2017

వ్యాసకర్త: రమణమూర్తి
(ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. కొద్ది మార్పులతో పుస్తకం.నెట్ లో ప్రచురించడానికి అనుమతించినందుకు రమణమూర్తి గారికి ధన్యవాదాలు. గతంలో జనవరి-మార్చి 2017 మధ్య వచ్చిన కథల గురించి రమణమూర్తి గారు రాసిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.)
*******
ఈ సమీక్షలని సరైన సమయంలోనే ప్రారంభించానన్న అభిప్రాయం నిన్న కలిగింది. గత సమీక్షలో వి. చంద్రశేఖరరావుగారు రాసిన ‘పూర్ణమాణిక్యం ప్రేమకథలు‘ కథని (బహుశా ఆయనది అచ్చైన చివరి కథ అదేనేమో!) ఆయన ఉన్నప్పుడే బాగుందని మెచ్చుకోవడం జరిగింది. అలాంటి అవకాశం దొరికినందుకు చంద్రశేఖరరావుగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి…
**

ఈ మూడు నెలల్లో వచ్చిన 481 కథలని చదివాను. గత త్రైమాసికంతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువ. ప్రత్యేక సంచికలు ఈ సమీక్షాకాలంలో ఒక్కటే (విశాలాంధ్ర ఉగాది సంచిక) ఉండటం వల్ల ఆ తేడా. ఇన్ని కథలను చదవడం అంత కష్టమైన విషయమేమీ కాదు కానీ, అసలు శ్రమంతా పత్రికలని సేకరించడం, ఏవి వచ్చాయో ఏవి రాలేదో నోట్ చేసుకోవడం, కొన్ని నెలలుగా రాని పత్రికలగురించి వాకబు చేయడం … ఇలా!

మంచికథ అంటే ఏమిటి అనేది ఎప్పుడూ నలుగుతూ ఉండే ప్రశ్నే. “అదేదో తెలిస్తే, ఇన్ని కథలు చదివే శ్రమ తప్పుతుంది కదా!” అని బెస్ట్ అమెరికన్ షార్ట్ స్టోరీస్ సీరీస్‌లో ఒక సంపాదకుడు అన్నారు. మంచికథని గురించిన నిర్వచనాలు ఎన్ని చెప్పినా, చెప్పనిదేదో ఇంకా ఉన్నట్టుంటుంది. నిజానికి ఒక మంచికథలో కూడా – చెప్పినదానికంటే, చెప్పనిదే ఏదో ఇంకా చాలా ఉందనిపిస్తుంది. 1980లలో షార్ట్ స్టోరీస్ మీద ప్రచురింపబడిన మూడు పుస్తకాలను సమీక్షిస్తూ Valerie Shaw ఒక గొప్పమాట అన్నారు: “The feeling one is left with is that tidy definitions of the short story apply only to stories which rather lazily conform to formulaic rules. First-rate, inventive short stories, […] leave the theoretician stranded, his categories collapsed around him.” మంచికథలని మనం అనుకునేవి కూడా ఏదో ఓ సూత్రాన్ని సున్నితంగానైనా సరే విస్మరించి, నిర్వచనాల సరిహద్దుల్ని కొంచెం అవతలకి జరుపుతూ ఉంటాయేమో అనిపిస్తుంది.

ఈ మూడు నెలల కథల్లో ఎన్నదగ్గ మంచికథలు ఉన్నాయి. ఆ కథల వివరాలు చూద్దాం.

నాకు నచ్చిన కథలు

కరుణా టీచర్ (కె ఎన్ మల్లీశ్వరి – ఆంధ్రజ్యోతి ఆదివారం, ఏప్రిల్ 2)
భర్త చేసే అవహేళనా, దానివల్ల కలిగిన న్యూనతా, తద్వారా విచ్ఛిన్నమైన వ్యక్తిత్వమూ – ఇదీ కరుణా టీచర్ వర్తమాన జీవితం. ఎద లోతుల్తో పనిలేని సమాజంలోని మహిళా బాధితులకి ఒక నమూనా. కథలో కనిపించని భర్త, అలా అదృశ్యంగా ఉంటూ న్యూనతలని నిర్దేశించే శక్తులకి ప్రతీక. కథలోని చివరి సన్నివేశంలో కరుణా టీచర్ – తన బాహ్యప్రవృత్తికి భిన్నంగా, అదుపు కాని ఉద్వేగాలతో రోదించే చిత్రం మనసుకు అతుక్కుని పోతుంది. ప్రస్ఫుటంగా ప్రదర్శించని బలమైన శిల్పాంగాలు కథకి అదనపు గాంభీర్యాన్ని సమకూర్చగా; సున్నితమైన కథాంశం, ఆ ముగింపు – పాఠకులని ఏ మేరకు సెన్సిటైజ్ చేయాలని ప్రయత్నించాయో అంతమేరకూ చేయగలిగాయి. కథనం బిగువుగాా ఉన్న కథ, గుర్తుండిపోయే కథ, మంచికథ!

అమర్ కథ (మధురాంతకం నరేంద్ర – విశాలాంధ్ర ఆదివారం, ఏప్రిల్ 9)
ప్రస్తుత తెలుగు కథల పరిమాణాలతో పోలిస్తే, చాలా పెద్దకథ. నిడివి కొంచెం ఎక్కువైనా, కథకి అనవసరమైనదేదీ కథలో చోటుచేసుకోలేదు కనక, క్లుప్తత లోపించిన కథ అని ఆరోపించలేం! ఇక కథలోకి వస్తే- భార్యతో అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న అమర్ అనే వ్యక్తి యాత్రానుభవాలు ఈ కథ. కేవలం యాత్రానుభవాలే అయితే ఇది యాత్రాసాహిత్యంగా మిగిలిపోయేది. ఈ యాత్ర ముగిసే సమయానికి భార్యకి విప్పిచెప్పాలనుకున్న రహస్యమేదో అమర్ దగ్గర ఇంకా మిగిలిపోయే ఉంది. కథ ముగిసే లోపల దానిని చెప్పలేడు సరికదా చెప్పగలిగిన సమయానికి ఆ అవసరం ఉన్నట్టుగా అనిపించదు. ఈ యాత్రలో అతను జీవితం గురించి తెలుసుకున్న రహస్యాలు చాలా ఉన్నాయి. జీవితంలోని విషయాలు ప్రాధాన్యత, అప్రాధాన్యతల మధ్య ప్రవహిస్తూ ఉండటం కూడా అతని అనుభవంలోకి వస్తుంది. గంభీరమైన కథనానికి తోడుగా, అమర్‌కి కలిగిన తాత్వికమైన ఎపిఫనీలు కథకి చక్కటి నిండుదనాన్ని తెచ్చిపెట్టాయి.

సచ్చి సాధించడం (ఎండపల్లి భారతి – మాతృక, మే)
కథాసూత్రాలన్నింటినీ చక్కగా పాటిస్తూ రాయబడ్డ కథ. కానీ, ఈ కథ అందువల్ల మంచికథ కాలేదు. సంప్రదాయాలు నడిపించే జీవితాల్లో ఉండే వైచిత్రి ఇందులో చిత్రింపబడింది కాబట్టీ, అది కథలోని పాత్రలని ఒక ఇబ్బందికరమైన పరిస్థితులలోకి నెట్టింది కాబట్టీ, మొత్తం ఇదంతా హృద్యంగా, చాలా క్లుప్తంగా చెప్పబడింది కాబట్టీ ఇది మంచికథ అయ్యింది. కథ ఏమిటనేది ఒక్క వాక్యం చెప్పినా, ఈ చిన్నకథకి అన్యాయం చేసినట్టే! చిత్తూరు మాండలీకంలో సాగిన ఈ కథనంలో కథంతా ఒక ఎత్తైతే, ఆ చివరి ముగింపువాక్యం ఒక్కటే అంత ఎత్తూనూ!

చందమామ రావే… (జి ఉమామహేశ్వర్ – ఆంధ్రజ్యోతి ఆదివారం, మే 14)
కథంతా చెప్పిన ఉమామహేశ్వర్, కథ చివర్లో చెప్పనిది ఒకే ఒక్క వాక్యం ఉంది. అదే అసలు కథ. మనం రాసుకోవాల్సిన కథ, పూరించాల్సిన ఖాళీ. ఈ ఖాళీని పూరించలేని పాఠకులకి కూడా ఇది మంచికథే అని అనిపించడానికి కారణం, ఇది అమ్మలని నిర్లక్ష్యం చేసే కొడుకుల కథ కాబట్టి. వివిధ మానసిక స్థితుల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు, అమ్మని నిర్లక్ష్యం చేసిన సంగతి గ్రహించుకొని, ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఎలా తాపత్రయపడ్డారూ అన్నది కథ. ఏ స్థితుల్లో ఉన్న వ్యక్తులూ అన్నది విశ్లేషిస్తే అసలు కథ బోధపడుతుంది. కథ ఎక్కువమందికి చేరవలసిన పద్ధతిలో చేరదేమో అన్న అనుమానం పెట్టుకోకుండా రాసిన కథ అనిపిస్తుంది.

మరికొన్ని మంచి తెలుగుకథలు

బెనిఫిట్ ఆఫ్ డౌట్ (పి విక్టర్ విజయ్‌కుమార్ – ఈమాట, ఏప్రిల్): ఒక విధవను ప్రేమించి, కొన్నాళ్లు ఆమెతో తిరిగి, వదిలించుకోవడానికి కుంటిసాకులు చెప్పే ‘వెధవ’ని గురించిన కథ ఇది. వస్తువు పాతదే కానీ, చెప్పిన పద్ధతి కొత్తది. రచయిత తప్పుచేస్తున్నాడు అని పాఠకుడు అనుకుని, అది గమనించినందుకు తృప్తిపడేలోగా దానికి పైసంగతి రచయిత వేస్తాడు. ఇదే సమయంలో దాదాపు ఇలాంటి ఇతివృత్తంతోనే (ఈ కథలో అమ్మాయి రేప్ కి గురవుతుంది) వచ్చిన ‘తిరుగుబాటు’ (వలివేటి నాగచంద్రావతి – ఈనాడు ఆదివారం, ఏప్రిల్ 16) అనే కథతో దీనిని పోలిస్తే, పైన చెప్పిన ప్రతిభ మీకూ తెలిసివస్తుంది. అమ్మాయిల ఆత్మాభిమానమే రెండు కథల్లోనూ సామాన్యాంశం.

చిరిగిన గాలిపటాలు (కృష్ణవేణి – కౌముది, జూన్): దారితప్పిన జీవితాల కథని నగర సంస్కృతి నేపథ్యంతో, విలక్షణమైన కథనస్వరంతోో రచయిత్రి రాసారు. మొదటి భర్త మరణం తర్వాత తార జీవితం మారిపోయింది. దాదాపు గాలివాటంగా కొట్టుకుపోతూ, చివరికి అరవింద్‌తో స్థిరపడింది. ఏవగింపు కలిగించే అరవింద్‌ని సమర్థిస్తూ తిరుగుతూ ఉండే తార ప్రవర్తన వెనక ఒక విషాదకరమైన కారణం ఉంది. అది కథ ముగింపులోనే తెలుస్తుంది. కథ ముగింపు వాక్యం వాస్తవికంగా ఉంది.

ఒలీవియా (ఎస్ శ్రీదేవి – ఆంధ్రభూమి మాసం, జూన్): తన చిన్నప్పటి స్నేహితురాలు ఒలీవియా, నాన్న స్నేహితుడైన సుబ్బారావుకి అక్రమసంతానం. కొంత కాకతాళీయత ఉన్న ఈ కథ మామూలుగా అయితే సాధారణంగా ముగిసిపోవలసిందే కానీ, కథకురాలి నిశితమైన పరిశీలనవల్ల కథ ముగింపులో ఒక కొత్త డైమెన్షన్ తీసుకుంటుంది. మంచి కథనం ఈ కథకి అదనం!

తప్పనిసరిగా… (ఎస్ శ్రీదేవి – ఆంధ్రభూమి వారం, జూన్ 22): అతనికి ఉద్యోగం పోయింది. తన ఇంటి స్థలాన్ని పక్కింటి చలపతిరావు కొడుకు ఆక్రమించి అపార్ట్‌మెంట్స్ కట్టించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. చనిపోయిన తన తండ్రి కట్టించిన ఆ యింటిని వదులుకోవడానికి తల్లి సిద్ధంగా లేదు. పరిస్థితుల ప్రాబల్యం వల్లా, చలపతిరావు చొరవ వల్లా చివరికి అతను, అతని తల్లీ అందరూ లొంగవలసివచ్చి, కొత్తగా కట్టిన ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ లో ఓ ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారు. చలపతిరావుది కూడా ఆ పక్క ఫ్లాటే. అయినా, ఇప్పుడు అందరిమధ్యా నిర్వచించడానికి వీల్లేని ఏదో ఇబ్బంది, దూరం పై కథలాగానే, మంచి కథనం.

అవశేషం (రాచపూటి రమేష్ – పాలపిట్ట, మార్చ్): చరిత్రలోని శిథిలాలను పరిరక్షించడంలో చూపించే జాగ్రత్త, ఇప్పుడు శిథిలమైపోతున్న బతుకుల పట్ల చూపించడం లేదన్న ఇతివృత్తంతో రాసిన కథ. బాగుంది. [‘పాలపిట్ట’ మార్చ్ సంచిక ఆలస్యంగా అందడం వల్ల, గత సమీక్షలోనే వచ్చివుండవలసిన కథ ఇదీ, ఈ క్రిందిదీ.]

మా’రణు’హోమం (గన్నవరపు నరసింహమూర్తి – పాలపిట్ట, మార్చ్): ఒక అణువిద్యుత్కేంద్రం ఏర్పాటు విషయంలో – రాజకీయాలు, బ్యూరోక్రసీ, ప్రజాచైతన్యం, జాతి ప్రయోజనాలు- ఎలా విరుద్ధ దిశల్లో సంఘర్షిస్తూ ఉన్నాయో చక్కగా వివరించిన కథ. ఇలాంటి విషయాలలో ఎలాంటి ఊహించగలిగిన మార్పులు వస్తాయో, అదే ఈ కథ ముగింపులో వుండటం వల్ల వాస్తవికంగా ఉంది.

చదవదగ్గ మరికొన్ని తెలుగు కథలు

మగవాడు ఎక్కడైనా మగవాడే అని చివర్లో కొసమెరుపులాగా అతడు…ఆమె…ఓ క్రూరమృగం (ఎమ్ వి రామిరెడ్డి – విశాలాంధ్ర ఆదివారం, ఏప్రిల్ 30) అనే కథ చెబుతుంది. ఫిలసాఫికల్, ఫెంటాస్టిక్ అంశాలతో రాయబడ్డ ప్రవాస భారతీయ కథ ఆవలి తీరం (వేమూరి వేంకటేశ్వరరావు – ఈమాట, మే). బాల్యం నాటి ప్రేమల్లో ఒకటి ఫలించి జీవితం, రెండోది ఫలించక జ్ఞాపకం అయిన నీలా టీచరూ, ఇంకో పెద్దకళ్ల అమ్మాయీ (మెహెర్ – వాకిలి, మే) కథ మంచి కథనంతో సాగుతుంది. నల్లగా ఉండే అన్నయ్య, తెల్లగా ఉండే తమ్ముళ్ల మధ్య స్పర్థలు పెరిగి పెద్దవై, చివరికి చిన్నపిల్లలదాకా ఎలా కొనసాగుతున్నాయో విశ్లేషణాత్మకమైన కథనం నేను విసిరిన బంతి (ఎస్ శ్రీదేవి – ఆంధ్రభూమి వారం, మే 25) లో ఉంది. ఎదిగిన పిల్లలమధ్యన ఉండే గొడవలు తల్లిదండ్రులకి ఎంత బాధాకరంగా ఉంటాయో గమనించుకొని, ఆ స్పర్థలని తొలగించుకునే ప్రయత్నంలో తమ్ముడికి ఉత్తరం రాయడం ద్వారా మొదటి అడుగు అక్క వేస్తుంది భాస్కర్‌కి ఒక ఉత్తరం (పొత్తూరి విజయలక్ష్మి – కౌముది, జూన్) కథలో. ఈ కథలన్నీ ఒకసారి చదివి చూడవచ్చు!

హాస్యకథలు

ఎప్పటిలానే, ఈసారికూడా కొన్ని కథలు చక్కటి హాాస్యం పండించాయి. ముఖ్యంగా మూడు కథలు.

ఉలవచారు రత్నం సారు (రాధిక – వాకిలి, ఏప్రిల్): ఇంజినీరింగ్ కాలేజీల్లో జరిగే రాగింగ్, కులంతో సమస్యలూ, సింహస్వప్నంలాంటి రత్నం సారూ – వీటన్నిటి మీదుగా సరదాగా సాగిన కథనం. నెల్లూరు/చిత్తూరు మాండలీకం వల్ల ఆ హాస్యం చక్కగా పండింది.

ఉగాది లవ్‌స్టోరీ (వాహెబ్ – తెలుగుతల్లి కెనడా, ఏప్రిల్): ఓ ముస్లిం పిల్లవాడి దృష్టికోణంలోనుండి చెప్పిన ఓ పిల్లప్రేమగాథ. సరదా కథ!

సచ్చేదిన్@దిబ్బరాజ్యం (ఎస్ వి ప్రసాద్ – ఆంధ్రజ్యోతి ఆదివారం, మే 28): తాజా సంస్కరణల వల్ల సామాన్యప్రజలు పడ్డ కష్టాల గురించి సీరియస్ కథలు వచ్చాయి కానీ, ఇలాంటి హాస్య, వ్యంగ్య కథ రావడం అరుదైన విషయం. పెద్దనోట్ల రద్దు తర్వాత, బాంకులని చూస్తేనే ప్రజలకి భయం వేస్తున్న ఈ పరిస్థితుల్లో, బాంకు వాళ్లని ‘బాంకోయిస్టులు’గా చిత్రిస్తూ రాసిన ఈ కథ మంచి హాస్యాన్ని పండించింది.

సైన్స్ ఫిక్షన్

మందుల తయారీల్లో కార్పొరేట్ కంపెనీలు చేసే అవకతవకలు, అవినీతి గురించీ, వాళ్ల ప్రయత్నాలు వికటించి జాంబీలు తయారుకావడం, సమస్యని పరిష్కరించబోయినవారు కూడా ఆ సమస్యకి ఆహుతి కావడం గురించి రాసిన ఆసక్తికరమైన కథ – ‘Z’ (మధు చిత్తర్వు – మధురవాణి, ఏప్రిల్ 01) – లో చదవండి!

ఇంగ్లీష్ కథలు

ఇంతకుముందే చెప్పినట్టు, ప్రపంచ కథాసాహిత్యంతో మన పరిచయం – సాధారణంగా – ఇంగ్లీష్‌లో వచ్చే కథలకి మాత్రం పరిమితమైపోతుంది. అందులోనూ, మనకి దొరికే పత్రికల సంఖ్యకి అది ఇంకా కుదించుకు పోతుంది. సమకాలీన సాహిత్యం కొద్దిగానైనా పరిచయం చేయాలన్న ఆకాంక్షతో చేస్తున్నదే తప్ప, ఈ కథల విషయంలో సమీక్ష ఎంతమాత్రమూ సమగ్రమైనది కాదు.

ఈ మూడునెలల్లో చదివిన మంచికథలు:

What’s Wrong with You? What’s Wrong with Me? (J M Holmes – The Paris Review, Summer 2017)
: వివక్షకి గురికావడం, దానికి బాధ్యులైన వారిమీద ఆగ్రహంతో నైతికంగానో, భౌతికంగానో పైచేయి సాధించాలనుకోవడం మనం చూసిన పార్శ్వం. కానీ, అలా పైచేయి సాధించినప్పుడు, దానికి మెప్పుదల సాక్షాత్తూ అవతలి వర్గం వారినుంచే వస్తే? కనీసం, వచ్చినట్టు అనిపిస్తే? విభిన్నమైన ఈ కోణం గురించి రాయబడ్డ ఈకథ నిడివిలో కొంచెం పెద్దది కావడం వల్ల, అసలు పాయింట్ దాదాపుగా మరుగున పడిపోతుంది! కొంచెం ఓపిగ్గా చదవాల్సిన మంచికథ.

Deaf and Blind (Lara Vapnyar – The New Yorker, Apr 24): రేమండ్ కార్వర్ “Cathedral” అనే ఒక హృద్యమైన కథని 1981లో రాసారు. ఆ కథ సృష్టించిన అలాంటి ఇక్‌స్టాటిక్ ఫీలింగ్ ని (“My eyes were still closed. I was in my house. I knew that. But I didn’t feel like I was inside anything.”) అలాంటి స్థాయిలో పునఃప్రతిష్టించాలని ప్రయత్నించి, తనదైన పద్ధతిలో విజయం సాధించిన కథ ఇది. తన అమ్మ స్నేహితురాలు ఓల్గా ప్రేమకథని ఓ చిన్నపిల్ల తన దృష్టికోణంలోనుంచి చెప్పటం ఈ కథ సారాంశం. అప్పటికే పెళ్లైన ఓల్గా ప్రేమించిది ఒక అంధుడైన బధిరుడిని. తన ఇంట్లోని విషయాలూ, ఓల్గా ప్రేమకి సంబంధించిన విషయాలతో చక్కటి హాస్యంతో సాగిపోతూ ఉండే కథ, హఠాత్తుగా ఒక ఉద్వేగభరితమైన క్షణాన్ని చేరుకుంటుంది. పాఠకుడిని కూడా దాన్ని అనుభవించేలా చేస్తుంది. అంత సరళమైన భాషతో (బహుశా, ఈ రచయిత్రికి రేమండ్ కార్వరే భాష విషయంలో కూడా స్ఫూర్తి అయుండాలి) కథని అంత గొప్ప శిఖరానికి చేర్చడం రచయిత్రి ప్రతిభ. కథని చెప్పే చిన్నపిల్ల మాటల్లో చెప్పాలంటే, “What I felt was pure awe, unburdened by understanding.” లాంటి అనుభవైకవేద్యమైన visceral భావన. ఈ కథని చదివే అవకాశం ఏమాత్రం ఉన్నా చదివిచూడండి.

The Size of Things (Samanta Schweblin – The New Yorker, May 29): The Curious Case of Benjamin Button లో ఉండే ఫాంటసీ ఈ కథలో కూడా ఉన్నట్టుగా మొదటిసారి చదివినప్పుడు అనిపించినా, ఆ విషయాన్ని రచయిత్రి నేరుగా ఎక్కడా చెప్పకపోవడం వల్ల – ఈ కథ వాస్తవికత పరిధిలోనే ఉంది అనుకోవాలి. కథ చివర్లో ఎన్‌రిక్ అలా చిన్నపిల్లవాడిలా కథకుడికి కనిపించడం ఫాంటసీ ఎలిమెంట్ కాకపోవచ్చు, కథకుడి ఊహకూడా అయివుండవచ్చు. కథని క్రమంగా ఓపెన్ చేస్తూ, ముగింపులో ఒక ఊహించని (కథలో ఆ విషయాన్ని పరోక్షంగా చెప్పుకుంటూ రావడం మనం పెద్దగా గమనించం!) ఆశ్చర్యాన్ని సృష్టిస్తుంది ఈ కథ. [ఈ రచయిత్రి రాసిన Fever Dreams అనే నవల (ఫేస్‌బుక్‌లో ఇంతకుముందు పరిచయం చేసాను) – Man Booker International Prize, 2017కి షార్ట్‌లిస్ట్ అయింది.]

The Piano Teacher’s Pupil (William Trevor – The New Yorker, Jun 26): కథారచయితగా విలియమ్ ట్రెవర్‌కి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆయన గత సంవత్సరం నవంబర్‌లో మరణించాక దొరికిన కథల్లో ఇదొకటి. ఎలిజబెత్ అనే ఒక యాభై ఏళ్ల మ్యూజిక్ టీచర్ జీవితం ఇది. తన ఎదురుగా కూచుని తనదగ్గర సంగీతం నేర్చుకుంటున్న కుర్రవాడు ఒక మహాజ్ఞాని అన్న విషయం మొదటిరోజునే తెలుసుకుంటుంది ఆ టీచర్. అయితే, ఆ కుర్రవాడికి ఇంట్లో ఉన్న వస్తువుల్ని మాయం చేసే దురలవాటు ఉంది. తన జీవితం చూసుకుంటే – పదహారేళ్లపాటు ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకుని అది ఎటూ తేలక వదిలేయాల్సి వచ్చింది. తల్లి ముందే మరణించగా, తను అవివాహితగా ఉండటమే కన్వీనియెంట్‌గా ఉన్న తండ్రి తనకి చిన్నచిన్న తాయిలాలు ఇచ్చి, అలా ఒంటరిగానే ఉంచేసాడు. తన జీవితాన్ని దూరంనుంచి చూసుకుంటే ఆవిడకి తెలిసిన విషయం – ప్రతి లావాదేవీలోనూ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. పిల్లవాడి సంగీతజ్ఞానాన్ని అనుభవించడం కోసం అతని చిరుదొంగతనాలని ఉపేక్షించింది; తన భౌతికమైన అవసరాలకోసం పదహారేళ్లపాటు ప్రియుణ్నీ, అతడి వంచననీ భరించింది. తన తండ్రి చేసిందీ ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడమే! ఎలిజబెత్‌కి ఆ వివేచన కలిగిన రోజున రచయిత/కథకుడు చెప్పే విషయం: “She had sought too much in trying to understand human frailty connected with love or with the beauty that the gifted brought. There was a balance struck: it was enough.” అద్భుతమైన ఈ ముగింపు వాక్యాలు Richard Bach రాసిన “There is no such thing as a problem without a gift for you in its hands. You seek problems because you need their gifts.” అన్నదాన్ని గుర్తుకుతెస్తుంది! మిగిలిన కథల్లో, ఈ క్రింది కథలు కూడా ఏదో ఒక అంశంలో విభిన్నమైనవే!

Shouldn’t sympathy be more practical?‘ అన్న ప్రశ్నతో ముగిసే చిన్నకథ Sympathy: A Dream Dialogue (Robert R Clewis – Philosophy Now, Apr). యుక్తవయసులో ఉన్న ఒక అమ్మాయి దృష్టికోణంలోంచి ప్రేమ, జీవితం, మరణాలమీదగా సాగిన ఆసక్తికరమైన కథనం Botalaote Hill (Gothataone Moeng – The Oxford American, Summer 2017). జర్మనీ ఆక్రమణల నేపథ్యంలో ఒక సినిమానటికి సంబంధించిన కథ The Hat (Patrick Modiano – The Paris Review, Summer 2017). చిన్న సందేశంతో, ఆధునిక గాడ్జెట్స్ మీద మంచి హాస్యంతో రాసిన కథ Signal (John Lanchester – The New Yorker, Apr 03). రచయితలమీదా, అమెరికాలోని MFA కోర్సుల నేపథ్యంగా రెండు కథలు – గొప్పకథలని కాదుగానీ – వచ్చాయి: Show Don’t Tell (Curtis Sittenfeld – The New Yorker, Jun 05), It’s a Summer Day (Andrew Sean Greer – The New Yorker, Jun 19). ఈ కథలన్నీ ఒకసారి చదివిచూడవచ్చు.

ఇవీ ఇప్పటికి విశేషాలు. మరిన్ని కథలతో మళ్లీ కలుద్దాం – అక్టోబర్ మొదటివారంలో!

You Might Also Like

3 Comments

  1. సూరపరాజు రాధాకృష్ణమూర్తి

    కథాసరిత్సాగరంలో ఈదడమే కథలు పట్టుకొనే ఈ కృషి, ఈ సాహిత్యసేవ. అభినందనలు, ధన్యవాదాలు.

    1. Ramana Murthy

      కృతజ్ఞతలు, రాధాకృష్ణమూర్తిగారూ!

  2. సుధీర్

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు … ధన్యవాదాలు … మన తెలుగువారికోసం ఇలాంటి మంచి వెబ్సైటు నడుపుతున్నందుకు ధన్యవాదాలు .

    ప్రపంచలో తెలుగు వారందరికోసం ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్క్ కూడా వచ్చేసింది . ఈ మంచి సమాచారాన్ని మన తెలుగు ప్రజలందరికి చేరవేయండి …
    http://www.telugos.com ( ప్రపంచంలోని తెలుగు వారి సోషల్ నెట్వర్క్ )
    తెలుగోస్ ఆండ్రాయిడ్ app playstore నుండి ఇన్స్టాల్ చేసుకోండి – https://goo.gl/3gy6Db

Leave a Reply