The Passages of H.M

 

రచయితలు మరుపురాని పాత్రలను సృష్టిస్తారు, కథల్లో, నవలల్లో. మరి, పేరుగాంచిన రచయితనే నాయకుడిగా మలచి, అతడిని గురించి తెల్సున్న విషయాలను సేకరించి, దానికి బోలడెంత ఊహను జోడించి ఒక నవల రాయడమంటే గమ్మత్తుగా ఉంటుందిగా.  ’మాబీ డిక్’ అనే నవలకు ప్రపంచప్రఖ్యాతి గాంచిన, అమెరికన్ నవలాకారుల్లో పేరెన్నికగన్న హర్మన్మ్ మెల్విల్ ఊహాత్మక జీవితచరిత్ర ఇది.

ప్రపంచ ప్రఖ్యాతి రచయిత అంటే ఆయన గురించి ఎంతో కొంత చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన అచ్చంగా రాసి అచ్చేసిన పుస్తకాలే కాకుండా, ఆయన రాసిన ఉత్తరాలో, ఉద్యోగధర్మంగా రాసినవో, పూర్తి చేయలేకపోయినవో, చేసీ వదిలేసినవో – ఇవ్వన్నీ ఎటూ అందుబాటులో ఉండగా, ఆయన పోయిన కొన్ని దశాబ్దాల తర్వాత ఇంకెవరో వాటిని ఆధారంగా చేసుకున్న నవల చదివితే మనకేంటి?

రచయిత అంటే ఎవడు? రాయడమంటే ఎలా ఉంటుంది? మనకు తెల్సున్న ప్రపంచాన్ని, మనం చూసిన మనుషులని కథగా మలచడమంటే ఏంటి? రచనా వ్యాసంగాన్నే జీవనోపాధిగా పెట్టుకుని, అమ్ముడుపోయిన పుస్తకాల మీదే ఆధారపడినప్పుడు, కష్టపడి ఏళ్ళ తరబడి రాసిన నవల అసలు అమ్ముడుకాకపోతే? అప్పుల్లో కూరుకుపోయి, కుటుంబ భారాన్ని మోయలేకపోవడం ఎలా ఉంటుంది? ఇన్నింటి మధ్య మనసు గాఢంగా కోరుకునేదాన్ని సభ్యసమాజం ఆమోదించదని తేలిపోయినప్పుడు ఏమవుతుంది?

మెల్విల్ గురించి ఉన్న లిటరేచర్‌లో పై సమాధానాలకి జవాబులు దొరకచ్చు. అయినా, ఆయన జీవితాన్ని, వాటిలోని లోటుపాట్లని, ఒక కథలా చదువుకోవడం బావుంటుంది. ముఖ్యంగా, ఇందులో వినిపించే రెండు ప్రధానమైన గొంతుల్లో ఒకటి నరేటర్‌ది, మరోటి ఆయన భార్య, లిజిది. ఆయన భార్యతో చెప్పించిన కథంతా ఊహాజనితం! నాథనియల్  హావ్‌థార్న్ అనే అమెరికన్ రచయితతో ఉన్న సంబంధం, వాల్ట్ విట్ట్-మెన్ అనే american్ కవితో ఆయనకు ఏర్పడని స్నేహం గురించిన సన్నివేశాలు ఆసక్తికరంగా మలిచారు.

ఈ పుస్తకం చదవక ముందు హర్మన్ వి కొన్ని కథలు మాత్రమే చదివాను. వాటిలో ఒక రకమైన reticence, aloofness బాగా కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఈ ఊహాత్మక జీవిత చరిత్రలోనూ ఆ భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈయన స్వభావసిద్ధంగా హుషారైన మనిషే. పైగా అప్పట్లో నౌకాయానం చేసి, ప్రపంచాన్ని చూసొచ్చిన మనిషిగా ఒక గ్లామర్ కోషెంట్ కూడా ఉంది. వాళ్ళావిడ ఆయణ్ణి అందుకే ఇష్టపడింది కూడా. అయితే, ఆయన రాసినవాటికి అసలు పేరు రాకపోవడం, స్థిరమైన సంపాదన ఒకటి లేకపోవడం, అయినను, ఆయన కుటుంబాన్ని బాగా నలిపేసింది. ఆ లోటుపాట్లని ఈ పుస్తక రచయిత బాగా పట్టుకున్నారు. ముఖ్యంగా హర్మన్ పెద్ద కొడుకు ఆత్మహత్య ఎపిసోడ్‌ను బాగా చిత్రీకరించారు.

అప్పటి సాహిత్యలోకాన్ని, సాహితీవేత్తలను కూడా కథానుగుణంగా బాగా వాడుకున్నారు. హావ్‌థార్న్ తో మెల్విల్ సంబంధం గురించి కూలంకషంగా రాశారు. వాళ్ళెలా కలిసింది, ఎలా అనుబంధం పెంచుకున్నది, లోకం ఆ అనుబంధాన్ని ఆమోదించదు అని తెల్సినప్పుడు ఎలా తుంచేసుకున్నది అన్నీ తెలుస్తాయి. అలాగే, అప్పటి సాహితీవాతావరణం. రాసి మంచి పేరు తెచ్చుకున్న రచయితల వ్యవహారం, రాసినవి పేరు తేలేకపోతే, ప్రచురణకర్తలతో ఇబ్బంది లాంటి కోణాలన్నీ స్పృశించారు. సముద్రమంతా ఈదేసి ఒడ్డున చేరుకుంటున్నప్పుడు ఎవరో లైఫ్ జాకెట్ విసిరినట్టు, జీవితంలో చాలా కోల్పోయి, దరిద్రంతో పాటు అనేక చేదు అనుభవాలను చవిచూసి, జీవిత చరమాంకంలో ఆయన రచనలకు గుర్తింపు వచ్చింది. అప్పటికి చాలా ఆలస్యమైనట్టే!  

మార్కెట్టులో హిట్ అయ్యాక మనుషులను ప్రపంచం వేరేలా చూస్తుంది. వాళ్ళ బొమ్మలకు దండలేసి, వాళ్ళ గొప్పతనం గురించి ఉపన్యాసాలిస్తుంది. మార్కెట్టును పక్కకు నెట్టి, రచనా వ్యాసంగం తప్ప మరో ధ్యాసలేని, బతికున్నాళ్ళూ పాఠకలోకంలో ఒక పేరులేని రచయితగా బతికి, కోర్కెలను, బాధ్యతలను బలవంతాన మోసిన రచయితలోని మనిషిని తడమాలంటే ఈ పుస్తకం ఓ చక్కని అవకాశాన్నిస్తుంది.

The Passages of H.M – A novel of Herman Melville

Author: Jay Parini

Publishers: Anchor Books

You Might Also Like

Leave a Reply