నెక్లెస్ – మపాసా
వ్యాసకర్త: లోకేష్ వి.
(image source)
**************
మపాసా కథలన్నీ అద్భుతంగా వుంటాయి. ఇంచుమించు నూటముప్ఫై ఏళ్ల క్రితం రాసిన ‘నెక్లెస్’ కథని ఇప్పుడు చదివినా అదే తడి. బహుశా ఈ వందేళ్లలో ఇవే ప్లాట్ తో ఎన్నో కథలు వచ్చివుంటాయి. అయినా సరే. కథలోకి వస్తే..
ఆమె అందంగా వుంటుంది. సంపద,సౌకర్యాలతో కూడిన ధనవంతుల జీవితం గడపాలని ఆమె కోరిక. ఆమెని ఒక గుమస్తాకిచ్చి పెళ్లిచేస్తారు. అతను మంచివాడే కాని ఒకేఒక్క జీవితం ఇలా అయిపోవడం ఆమెని నిస్పృహకి గురిచేస్తుంది. ఒకసారి అతను తన బాస్ పార్టీకి కష్టపడి ఇన్విటేషన్ సంపాదిస్తాడు. ఇది చూసి తన భార్య చాలా సంతోషిస్తుందని భావిస్తాడు. ఇంటికొచ్చి ఆమెకి చూపించాక ఆమె దుఃఖించడం మొదలుపెడుతుంది. అదేంటి,నీ కోసం ఎంతో కష్టపడి సంపాదిస్తేనూ, నీకు పార్టీకి వెళ్లడం ఇష్టమే కదాని అంటాడు. పార్టీకి వెళ్లడానికి నా దగ్గర పనికొచ్చే డ్రెస్ ఒకటైనా వుందా? అంటుందామె. చివరికి ఆమెని సంతోషపెట్టడానికి తను వేటకోసం గన్ కొనుక్కోవాలని దాచుకున్న డబ్బులన్ని త్యాగం చేస్తాడు. ఆమె ఒక అందమైన ఫ్రాక్ కుట్టించుకుంటుంది. డ్రెస్ వేసుకుని చూసుకున్నాక ‘నేను పార్టీకి రాను’ అని మళ్లీ మొదలుపెడుతుంది. ఇప్పుడేమైందని భర్త అడుగుతాడు. మెడలో ఒక నగ అయినా లేకుండా బికారిదానిలా అంతమంది సంపన్నులమధ్యకి ఎలావస్తానని ఆమె విషణ్ణవదనం పెడుతుంది. చాలాసేపు ఆలోచించాక అతడో సలహా ఇస్తాడు. “నీ ఫ్రెండు ధనవంతురాలే కదా. ఫంక్షన్ కోసం ఒక నగ ఏదైనా అడుగు. అయిపోయాక తిరిగి ఇచ్చేద్దువు కాని”. ఈ సలహా ఆమెకి నచ్చింది. ఆమెకి ఒక సంపన్నురాలైన స్నేహితురాలు నిజంగానే వుంది. ఆమెని అడిగితే కాదనకపోదు.
తన స్నేహితురాలు ఇంటికి వెళ్లి విషయం చెప్తుంది. “దానికేం భాగ్యం. నీక్కావలిసింది తీసుకో’ అని ఆమె చెప్తుంది. ఒక డైమండ్ నెక్లెస్ బాగా నచ్చి తీసుకుంటుంది. ఇక పార్టీకి వెళ్లాక అందరిలోనూ ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. చాలామంది ఆమెతో డాన్స్ చేయాలని ఉత్సాహపడతారు. అవి ఆమె జీవితంలో నిజంగా జీవించిన క్షణాలు. ఆమె ఏం కోరుకుందో అదప్పుడు జరిగింది. తెల్లవారుఝాముదాకా పార్టీ కొనసాగుతుంది. అప్పటివరకు ఆమె భర్త వెయిట్ చేస్తుంటాడు. ఇక వెళ్దామా అని బయల్దేరుతారు. ఇంటికి చేరుకున్నాక, ఆమె తన సౌందర్యాన్ని అద్దంముందు కూర్చుని గర్వంగా చూసుకుంటుంది. సరిగ్గా అప్పుడు మెళ్లో డైమండ్ నెక్లెస్ లేకపోవడాన్ని చూసి అదిరిపడుతుంది. భర్తకి చెప్తే,పాపం అతను మళ్లీ వెతకడానికి వెళ్తాడు. తిరిగొచ్చి దొరకలేదని చెప్పాక ఇద్దరూ నిస్సత్తువతో కూలబడిపోతారు.
ఇక ఇప్పుడు ఏంచేయాలి? మొదట అలాంటి నెక్లెస్ కోసం కొన్ని బంగారంషాపులు తిరుగుతారు. ఒకదగ్గర సరిగ్గా అలాంటిదే కనిపిస్తుంది. చాలా ఖరీదు వుంటుంది. దుకాణదారుడ్ని చాలాసేపు బ్రతిమిలాడితే కొంత తగ్గిస్తాడు. ఒక మూడురోజులపాటు ఎవరికీ అమ్మొద్దని రిక్వస్ట్ చేస్తారు. అతను ఒప్పుకుంటాడు. ఇక ఇప్పుడా నగని కొనడానికి తన దగ్గర తండ్రినుండి వచ్చిన ఆస్తిని పెడతాడు.అ యినా సరిపోదు. చాలామంది దగ్గర అప్పులు తీసుకుంటాడు.ఆ డబ్బులతో ఆ నెక్లెస్ కొని ఆమె స్నేహితురాలికి ఇచ్చేస్తుంది.
ఇక ఇప్పుడు వాళ్ల జీవితం మారిపోయింది. చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న ఇల్లు ఖాళీచేసి ఒక మురికివాడకి షిఫ్ట్ అవుతారు. అతను సాయంత్రాలు కూడా వేరే పని వెతుక్కుంటాడు. ఆమె కూడా గొడ్డులా కష్టపడుతుంది. జీవితంలో సరదాలు సంతోషాలు ఇక మర్చిపోతారు. ఆమెలో సౌందర్యరాహిత్యం చోటు చేసుకుంటుంది. గులాబీరేకుల్లాంటి ఆమె అరచేతులు పనివల్ల మొరటుగా మారిపోతాయి. ఆమె ఇప్పుడు ఇంకా ఎక్కువ వయస్సు దానిలా అయిపోయింది. చేసిన అప్పులు తీర్చడానికి వాళ్లకు పదేళ్లు పడుతుంది.
ముగింపు: ఒకసారి అనుకోకుండా తన ధనవంతురాలైన స్నేహితురాల్ని చూసి పలకరిస్తుంది. మొదట ఆమె ఫ్రెండ్ గుర్తుపట్టదు. అంతందంగా వుండే నువ్వు ఇలా అయిపోయావా అని ఆశ్చర్యపోతుంది .’నీ వల్లే’ అని బదులిచ్చేసరికి ఇంకా ఆశ్చర్యపోతుంది. అవును నువ్విచ్చిన నెక్లెస్ పోవడంవల్ల- వాళ్లెన్ని కష్టాలు పడిందీ చెప్తుంది ఫ్రెండ్ తో. “అంటే నా నగ పోయిందని మళ్లీ డైమండ్ నెక్లెస్ కొని నాకిచ్చావా? అయ్యో! నేను నీకిచ్చింది ఇమిటేషన్ జ్యుయలరీనే. దాని ఖరీదు నాలుగువందలుంటుందేమో…” అని స్నేహితురాలు నిజంగా బాధపడుతుంది.
Varaprasad
Well said.