విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”
వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
*************
ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే ముఖ్యమైన మరో ప్రక్రియ దీర్ఘకవిత. మామూలు కవిత్వంతో పోలిస్తే దీర్ఘ కవిత కొద్దిగా క్లిష్టతరమైనది. టెంపోని కొనసాగిస్తూ చదువరుల ఆసక్తి ఏమాత్రం పోగొట్టకుండా వ్రాయాలి. అప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుంది. పైగా, సమాజంలో హేళనకి గురయ్యేవారి గురించీ, ఏవగింపుకి లోనయ్యేవారి గురించీ దీర్ఘకవిత వ్రాయడానికి చాలా ధైర్యం కావాలి. కొజ్జాలనీ, పాయింట్ ఫైవ్‌లనీ, అటూ ఇటూ కానోళ్ళనీ, నంపుసకులనీ… ఇలా రకరకాల పేర్లతో అవమానాలకు గురయ్యేవారి గురించి రేణుక అయోల “మూడవ మనిషి” పేరుతో దీర్ఘ కవిత వెలువరించారు. అక్టోబరు 2014లో వచ్చిన “ఒక హిజ్రా ఆత్మకథ” చదివి ప్రేరణ పొంది ఆ బాధిత వర్గ దుఃఖాన్ని, ఆవేదననీ, ఆక్రోశాన్నీ తనదిగా భావించి ఈ దీర్ఘ కవిత వ్రాశారు. భౌతికంగా మన అందరిలానే ఈ ప్రపంచంలోకొచ్చినప్పటికీ, బలమైన అంతశ్శోధనతో స్వీయ అస్తిత్వాన్ని నిర్థారించుకునే “థర్డ్ జెండర్” గురించి ఆర్తితో రాసిన కవిత ఇది.
పదిహేను భాగాలుగా సాగిన కవిత మొత్తాన్ని “నేను” అంటూ ఓ స్వరం చెబుతున్నట్టుగా ఆత్మకథలా నడిపించారు రేణుక.
తన గురించి తాను చెప్పుకోవాలంటే ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి లాంటి ఎన్నో సందేహాలు తలెత్తుతాయి. “ఆత్మకథని చెప్పుకునే/ఒక స్వరం సందేహంతో/అనుమానంతో నలిగిపోయింది/ఈ కథలో నేనెవరు?/ఎలాటి గుర్తులతో మొదలుపెట్టాలి?” అని తనని తాను ప్రశ్నించుకుంటూ, “బతుకు గోడు చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు/ఒక నిశ్శబ్దపు నీలివర్ణం/నా చుట్టూ పేరుకుంది.” అంటుదా స్వరం. ఘనీభవించిన వేదనని చాటే పంక్తులివి.
“పగటి వెలుగు పురిటిగదిలో/నన్ను ఆనందంగా తడిమిన చేతులు ఆగిపోయాయి.” అంటూ ఆ తల్లిలో కలిగిన అనుమానం, కొడుకు పుట్టాడన్న ఆనందాన్ని ఆవిరి చేసిందని అంటుందా స్వరం.
అనేక పసితనపు యుద్ధాలు చేసి, పర్వతాల బరువుని మనసు నిండా నింపుకుని పెరిగి పెద్దయినప్పుడు “ఒక సందేహం ఒణికించేది/ఎందుకిలా పుట్టాను?/రెండు శరీరాలలో/లోకం రహదారుల వెంట నడవగలనా?” అని మథనపడుతుంది. కాలేజీకి వెళ్ళినా అక్కడంతా ఇరుకేననీ తెలుసుని బాధపడుతుంది. చదువు నేర్చి జ్ఞానం సంపాదించాలనుకున్నా సాధ్యం కాదు. “చదువు మనసుకి గొప్ప ఊరట అని తపనపడినా/అయినా ఎక్కడా ఇమడలేని శరీరం/ముక్కలవుతున్న వ్యక్తిత్వంతో/ఎప్పటికప్పుడు పేకమేడలా/ కూలిపోతూ ఉంటే నిలబడడం ఎలా?” అని వాపోతుంది. “వికసిస్తున్న వయసు/అబ్బాయిల కోసం ఆత్రపడేది/అమ్మాయిల స్నేహం అల్లరిపాలు అయ్యేది/కాలేజీ రహదారిలో వెలగని వీధిదీపంలా నేను“ అంటూ ఆత్మీయ స్నేహానికి నోచుకోకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేస్తుంది.
చదువు ఆగిపోతుంది. బతుకు శూన్యమైపోతుంది. ఆ సమయంలో వాళ్ళొస్తారు. “వాళ్ళూ నా వాళ్ళే నాలాంటి వాళ్ళే“ అని గ్రహిస్తుంది. “కలుసుకున్న చూపులు/విచ్చుకున్న పలకరింత/నువ్వు మాకు తెలుసు“ అంటూ దగ్గరి తీసుకున్న కౌగిలి. ధైర్యం చెబుతారు. “నడక రెక్కల మీద ఆశల ఆకాశం చూపించారు“, “కొన్ని మహానగరాల పేర్లు చెప్పారు/చీకటిలోకి జారిపోయారు“ అంటూ తనలో వారు కల్గించిన కొత్త ఆశల్ని చెబుతుంది.
“లోపలి స్త్రీతో/బయట ప్రపంచంలో బతకాలి“ అనుకుని, ధైర్యంగా ముందడుగు వేసిన ప్రతీసారీ “నువ్వు ‘హిజ్రావి‘/నువ్వు ‘కొజ్జావి‘” అంటూ మాటల తూటాలు నిప్పురవ్వల్లా ఎగిరేవి.
మనసు చిల్లులు పడుతున్న నడక ఆపకుండా కొత్త నగరం చేరుతుంది. “ఉద్యోగం కోసం బతుకు కోసం/రూపం లేని భవిష్యత్తులోకి/వలసకూలీలా జీవితాన్ని/మూటకట్టి నగరంలోకి వచ్చి పడ్డాను గోనెబస్తాలా.” అంటూ తన కొత్త ప్రయత్నాలలో విఫలమైన తీరుని బాధగా వివరిస్తుందా స్వరం.
స్త్రీగా తయారై కొత్తనగరంలో తిరుగుతుంటే – నిజమైన స్త్రీవి కాదనీ నువ్వు కొజ్జావి అని అక్కడా అవమానాలు ఎదురైతే, “ప్రతీ ఉదయాన్ని ఆశగా చూడడం/ఈ జీవితంలో నేర్చుకున్న మొదటి పాఠం“ అంటుదా స్వరం. చివరికి పురుషత్వానికి చిహ్నమైన అంగాన్ని కోయించేసుకుంటుంది. ఇప్పుడు తాను స్త్రీనని అనుకుంటుంది. “రేపటి వెలుగులోకి తొంగి చూస్తున్న/ ఒంటరి నక్షత్రాన్ని“ అనుకుంటుంది. అయినప్పటికీ ఇంకా సందేహం. “మళ్ళీ మరోసారి కొత్తగా/ జీవితం మొదలవుతుందా?/ కొత్త శరీరం అక్కడ నిలబడుతుందా?” అనే ప్రశ్నలు తలెత్తుతాయి.
నగర జీవితంలో అలసిసొలసి సొంతూరి జ్ఞాపకాలు మనసు నిండా ముసిరినప్పుడు – “తల్లి ఒడీ అక్కల ప్రేమ/అక్కడి స్పర్శ నన్నో ఎగిరే విత్తనం చేసి“ తన ఊరి పొలిమేరల్లో తెచ్చి పడేస్తాయి.
ఇంటికొచ్చాక ప్రేమా ఆప్యాయతలకి బదులుగా, అవమానాలకే గురవుతుందా స్వరం. “రెండు శరీరాలను/ మోస్తున్నందుకు ఏవగింపు“ ఎదురైతే, “వెలుపల లోపల నలిగిపోతున్న/మామూలు మనిషి – ఒక మనిషి“ అంటూ దుఃఖపడుతుంది. తనకి తాను నచ్చజెప్పుకుంటూ ఊరు వదులుతుంది. “ఆ ఊరు ఆ మట్టి వాసన/నాలోంచి కొనప్రాణంలా వెళ్ళిపోయాయి.” అంటుంది.
మళ్ళీ నగరానికి వచ్చి జీవితం మొదలుపెడుతుంది. “స్వప్నాల రెక్కలతో రహదారుల ఆకాశాన్ని కొలిచిన“ ఆమె మాత్రం కనబడదు. శరీరాన్ని అమ్ముకోవడమే జీవితసూత్రంగా మిగిలింది. “దేహాన్ని అమ్మకానికి పరిచిన/ ప్రతీసారి/ఒక నొప్పి పేగులు తెంచుకొని రక్తాన్ని బయటకి తెస్తునే ఉంది.” అంటుంది. ఆ నొప్పి ఏంటంటే – “ఆకలి నొప్పి/అసహ్యాల నొప్పి/వెలివేసిన జీవితాల మీద నొప్పి“!
పోరాటమే జీవితమైన సందర్భంలో “పోరాటానికి నమ్మకానికి మధ్య/చిన్న వంతెన/ఉబ్బిపోయిన చెక్కమెట్ల వంతెన/ఒడుపుగా దాటడం నేర్చుకున్నాను.” అంటుంది.
తమలాంటి వారిపై పడిన హిజ్రా అనే ముద్ర పోవాలని కోరుతుంది. “ఎవరో ఒకరుగా బతకనివ్వాలి/స్త్రీగానో పురుషుడిగానో ఉండనివ్వాలి“ అంటుంది.
స్త్రీగా భావించి ఆదర్శ వివాహం చేసుకున్న వ్యక్తి కూడా “నీతో ఎలా గడపడం?” అంటూ పదేపదే మాటలతో/శారీరకంగా హింసించి వెళ్ళిపోయినప్పుడు మరోసారి గాయపడిన గుండెకి ఓదార్పుగా “అమ్మా, అమ్మా” అని పిలిచే ఇద్దరు అనాథ పిల్లల్ని చేరదీస్తుంది. సమాజం ఆ పిల్లలని ప్రశ్నించినా, “నిలబడి జీవించడానికి/అంతులేని అంతర్యుద్ధం చేయడానికి/వాళ్ళలో శక్తి ఉంది/శక్తి ఉంటుంది కూడా“ అని ధైర్యంగా పలుకుతుందా స్వరం. ఆ ధైర్యం అందించిన ప్రోత్సాహంతోనే ఆత్మకథ వినిపిస్తుందీ స్వరం.
“ఓ స్వరం తన గాథని చెప్పుకుంటూ ఆత్మకథని రాసుకుని, అక్షరాల భుజం మీద తల ఆన్చి నిలబడినప్పుడు ఎన్ని కళ్ళు ఆ తలని ఓదారుస్తాయో చూడాలనుకున్న ఒక సుదీర్ఘ స్వప్నమే ఈ ఆత్మకథ” అంటారు రేణుక అయోల.
సరళమైన పదాలతో ఎంతో భావసాంద్రత నింపి కూర్చిన ఈ “మూడవ మనిషి” పాఠకులకు నచ్చుతుంది. 53 పేజీల ఈ పుస్తకం వెల రూ.50. ప్రచురణ జె.వి.పబ్లికేషన్స్, హైదరాబాద్. ప్రతులకు ఈక్రింది చిరునామాలో సంప్రదించవచ్చు.
రేణుక అయోల, 8-3-677/ఇ/2, యూకో ఆర్కేడ్, ఫ్లాట్ నం.2, నవోదయ కాలని, యెల్లారెడ్డిగూడ, హైదరబాద్-500037.
Gopalam
అంతర్ శోధన అని ఉండదు. అక్కడ ర ఉండకూడదు.విసర్గ వస్తుంది. అది పోయి శ వత్తు
మిగులుతుంది. ఏమి తెలియకుండానే ఎందుకు పెద్ద మాటలు.
మనసు వెదకడం అంటే పోయే !
కొల్లూరి సోమ శంకర్
గోపాలం గారూ,
తప్పుని తెలియజెప్పినందుకు ధన్యవాదాలు.
నిజానికి నేను అంతశ్శోధన అనే వ్రాయలనుకున్నాను. కానీ ఇంటర్నెట్‌లో చాలా వెబ్ పేజీలలో అంతర్శోధన అనే పదం ఇదే అర్థంలో వాడడం కనిపించింది. అందువల్ల అది ఆమోదనీయమై ఉంటుందని భావించి అలా వ్రాశాను. తప్పుగా వ్రాసినందుకు క్షమాపణలు.
సంపాదకులకు:
దయచేసి ఆ పదాన్ని అంతశ్శోధనగా మార్చవలసిందిగా మనవి.
కొల్లూరి సోమ శంకర్